[శ్రీ చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ (సిహెచ్. సియస్. శర్మ) రచించిన ‘అద్వైత్ ఇండియా’ అనే నవలని ధారావాహికంగా అందిస్తున్నాము.]
[మర్నాడు సాయంత్రం డాన్స్ క్లాస్‍కి వచ్చిన ఇండియాతో పాటు ఆండ్రియ, ఆమె తల్లి మేరీ వస్తారు. క్లాసు పూర్తయ్యాకా, మేరీ శాస్త్రి గారి వద్దకి వచ్చి తన మనవరాలికి నాట్యంలో చక్కగా శిక్షణ ఇచ్చినందుకు ధన్యవాదాలు చెబుతుంది. నాట్యంలో ఇండియా కృషిని, పట్టుదలని మెచ్చుకుంటారు శాస్త్రి గారు. అమ్మమ్మ మీతో మాట్లాడడానికి వచ్చిందని తెలుగులో చెప్తుంది ఇండియా. విషయం ఏమిటని అడిగితే, కొన్ని క్షణాలు సంశయిస్తుంది మేరీ. ఈలోపు సావిత్రి వారందరికీ కాఫీలు తెస్తుంది. భార్యని మేరీకి పరిచయం చేస్తారు శాస్త్రిగారు. కాఫీలు తాగడం అయ్యాకా, అద్వైత్‍ను తనతో పాటు లండన్‍కు పంపమని, అక్కడ తమ పాఠశాలలో నాట్యం నేర్పుతాడనీ, చక్కని జీతభత్యాలు ఇస్తామని, గౌరవంగా చూసుకుంటామని చెప్తుంది మేరీ. ఆ కోరిక విన్న సావిత్రి విస్తుపోతుంది. ఆంగ్లం రాని వసుంధరికి మేరీ ఏం అడిగిందో అర్థం కాదు. ఇండియా సావిత్రి వెంటే లోపలికి వస్తుంది. తాను ఆమెను అత్తయ్యా అని పిలవవచ్చా అని అడుగుతుంది. సావిత్రి సరేనంటుంది. తమ నిర్ణయం రేపు చెబుతానని అంటారు శాస్త్రి. ఇండియా, ఆండ్రియా, మేరీ సెలవు తీసుకుంటారు. వారు వెళ్తుంటే, అద్వైత్, సీత వారికి ఎదురుపడతారు. ఇండియా అమ్మమ్మకు వారిని పరిచయం చేస్తుంది. ఆ తర్వాత వారు వెళ్ళిపోతారు. అదే సమయానికి రెడ్డిరామిరెడ్డిగారూ, వారి బావమరది శేషారెడ్డిగారు వస్తారు. కాశీ ప్రయాణానికి అంతా సిద్ధమయిందని శాస్త్రి గారికి చెప్తారు. వాళ్లు వెళ్ళబోతుంటే, రాఘవ, అతని వెంట సుమతీ తల్లి శాంతి.. తండ్రి శంకరశాస్త్రి అక్కడికి వస్తారు. ఒక ముఖ్యమైన విషయం చెప్పాలంటూ రెడ్డిరామిరెడ్డిగారిని ఆగమంటాడు రాఘవ. అందరిని పిలిచి వారి సమక్షంలో – పాండురంగ సుమతిల ప్రేమ వ్యవహారాన్ని ప్రస్తావించి, వారి వివాహం జరిపించాల్సిందిగా కోరుతాడు. అద్వైత్ కూడా అదే కోరుతాడు. పెద్దలు సమ్మతిస్తారు. కాశీయాత్ర ముగించుకు రాగానే ఆ వివాహాన్ని తమ ఖర్చుతో జరిపిస్తామని రెడ్డిరామిరెడ్డి గారు చెప్తారు. అయితే ఊహించని విధంగా అంధ్ర ప్రాంతంలోను, ఉత్తరాన కాశీ ప్రాంతంలోనూ విపరీతమైన వర్షాలు కురిసి, రైలు మార్గాలు పాడయి – వీరి కాశీయాత్ర వాయిదా పడుతుంది. రాఘవ భద్రాచలం వెళ్ళిపోతాడు. కాశీ యాత్ర వాయిదా పడింది కాబట్టి పాండురంగ – సుమతిల వివాహానికి ముహూర్తం నిర్ణయిస్తారు. ఓ రాత్రి పూట వసుంధర శాస్త్రి గారి గదిలోకి వెళ్ళి – పాండురంగడి కన్నా పెద్దవాళ్ళయిన అద్వైత్, సీతల పెళ్ళి జరిపించకుండా, పాండురంగ సుమతిల పెళ్ళి ఎందుకు జరిపిస్తున్నావని అడుగుతుంది. శాస్త్రి ఆమెకు సహేతుకమైన జవాబునివ్వగా, సంతృప్తిగా తన గదికి వెళ్ళిపోతుంది. ఎవరూ చూడకుండా సీత – అద్వైత్ గదిలోకి వెళ్ళి అతని మంచం మీద పడుకుని కాసేపు ఏడిపించి తన గదిలి వెళ్ళిపోతుంది. – ఇక చదవండి.]
అధ్యాయం 27:
[dropcap]చె[/dropcap]ప్పిన మాట ప్రకారం.. రెడ్డి రామిరెడ్డిగారు పాండురంగ సుమతీల వివాహానికి తన ఖర్చుతో అన్ని ఏర్పాట్లూ చేశారు.
రాఘవ ఆ వివాహానికి వచ్చాడు. తన బావ అద్వైత్‌తో కలసి వెళ్ళి వివాహ పత్రికను యిచ్చి ఇండియాను ఆండ్రియాను రావలసిందిగా చెప్పాడు.
సుమతి.. పాండురంగల వివాహం ఘనంగా జరిగింది. మేరీ, ఇండియా, ఆండ్రియాలు వివాహానికి వచ్చారు. ఖరీదైన ఆభరణాలను దుస్తులను దంపతులకు చదివించారు.
ఆ పెండ్లిలో అందరి చూపులు సీత.. ఇండియాల పైనే.. ఒకరిని మించిన అందం మరొకరిది. సీత ఇండియా కన్నా కొంచెం తెలుపు తక్కువ తప్ప.. మిగతా అన్ని విషయాల్లో ఇరువురూ సరిసమానులే. అందరరూ ఆ దంపతులను మనసారా దీవించారు. ఆ వివాహానంతరం రాఘవ మరుసటిరోజున వెళ్ళిపోయాడు.
ఇండియా.. ఆ వివాహ సన్నివేశాలనన్నింటినీ ఫోటోలు తీసింది. మూడవరోజు ఆల్బంగా తయారు చేసి తీసికొని వచ్చి గురువుగారికి అందించింది.
ఆ ఇంటి వారంతా ఆ ఫోటోలను చూచి ఎంతగానో సంతోషించారు. పుట్టినింట (సుమతి పుట్టిల్లు) మెట్టినింట (నరసింహశాస్త్రిగారి యిల్లు) ఆరు నిద్రలు ముగించాక.. రెడ్డి రామిరెడ్డిగారు పదివేల రూపాయలను నరసింహశాస్త్రిగారికి అందించి ఆ దంపతులను దక్షిణదేశ విహారయాత్రకు పంపవలసిందిగా కోరారు.
వారి ఔదార్యానికి.. అభిమానానికి నరసింహశాస్త్రి కుటుంబీకులు ఎంతగానో సంతోషించారు. సుమతినీ పాండురంగలను విహారయాత్రకు సాగనంపారు.
రైలు మార్గాలు సరి చేయబడ్డాయి. రెడ్డిరామిరెడ్డిగారు కాశీ ప్రయాణానికి ఏర్పాటు చేశారు. విషయాన్ని నరసింహశాస్త్రిగారికి వివరించారు.
సుమతీ పాండురంగలు యాత్రను ముగించుకొని తిరిగి వచ్చారు. ఆరవరోజు నరసింహశాస్త్రి, రెడ్డిరామిరెడ్డి కుటుంబాలు కాశీ ప్రయాణం.
పెండ్లికి వచ్చిన రాఘవ భద్రాచలం వెళ్ళకుండా విశాఖపట్నం వెళ్ళాడు. కారణం ఆ ప్రాంతాల్లో వున్న అల్లూరి సీతారామరాజును ఒకసారి చూడాలని.. మాట్లాడాలనేది అతని ఆశయం.
తన స్నేహితులను కలిసికొని రాజుగారిని గురించి విచారించాడు. ‘అల్లూరి సీతారామరాజుగారు ఆంగ్లేయులకు సింహస్వప్నం అయినారు. మన్యం ప్రజలు వారిని నాయకునిగా భావించి వారికోసం ప్రాణాలిచ్చే దానికి కూడా సంసిద్ధంగా వున్నారని విన్నాము. కానీ.. వారిని మేము చూడలేదు’ రాఘవ మిత్రులు అతనికి చెప్పిన మాటలవి.
రంగా, రాజా అనే ఇద్దరు మిత్రులతో రాఘవ శ్రీ సీతారామరాజుగారిని చూడాలని చింతలపల్లి అడవిలోకి వెళ్ళారు. వారు అక్కడికి వెళ్ళేసరికి సమయం సాయంత్రం.. ఆరున్నర.. కోయదొరలు వారిని అడ్డగించారు. ముగ్గురినీ అనుమానించారు. వారు తెల్లవారి గూఢచారులని సందేహించారు. శ్రీ సీతారామరాజుగారి ఉనికిని తెలుసుకోవాలని వచ్చారని భ్రమపడ్డారు.. కానీ, రాఘవ స్నేహపూర్వపు పలకరింపు.. మృదుమధురమైన మాటలు.. అతని మాటల్లో శ్రీ రాజుగారి పట్ల వున్న గౌరవాభిమానాలను చూచి వారు మనస్సు మార్చుకొని.. ఆ ముగ్గురినీ శ్రీ అల్లూరి సీతారామరాజుగారి వద్దకు తీసికొని వెళ్ళారు.
గడ్డం.. మీసాలతో.. కళ్ళల్లో లక్ష్యాన్ని సాధించాలనే ఆకాంక్షతో.. సర్వసంగపరిత్యాగిలా యోగిలా.. కన్పించారు అల్లూరి సీతారామరాజుగారు రాఘవకు అతని మిత్రులకు.
ఆనందంతో రాఘవ వారి పాదాలపై వాలిపోయాడు. తన చేతులతో రాఘవను పైకి లేపి.. “తమ్ముడూ!.. నీ పేరేమిటి?..” చిరునవ్వుతో అడిగాడు శ్రీ సీతారామరాజుగారు.
“సార్!.. నా పేరు రాఘవ.. నేను మిమ్మల్ని అన్నయ్యా అని పిలవవచ్చా సార్!..” పరవశంతో అడిగాడు రాఘవ.
“పిలువు తమ్ముడూ!..”
“అన్నయ్యా!.. మీరంటే నాకు ఎంతో అభిమానం.. మీ గురించి విన్న తర్వాత మిమ్మల్ని ఒకసారి చూడాలనేది నా ఆశ. అందుకే యిలా వచ్చాను. మిమ్మల్ని చూచాను. ఇప్పుడు నాకు చాలా ఆనందంగా వుంది అన్నయ్యా!..”
“హుఁ.. మన సమాజం దృష్టిలో నేను అతివాదిని.. తెల్లవారి దృష్టిలో నేను విప్లవకారుణ్ణి. యీ అడవి సోదరుల దృష్టిలో వారి నాయకుణ్ణి. మూడు వర్గాల వారూ మనుషులే.. కానీ ఆ తొలి రెండు వర్గాల వారికి నేను గిట్టని వాణ్ణి. యీ అమాయకులు నన్నే సర్వస్వంగా భావిస్తున్నారు. నా కోసం ప్రాణాలను అర్పించే దానికి సిద్ధంగా వున్నారు. నమ్మిన సిద్ధాంతానికి.. నన్ను అనుసరించే వారికే.. నేను సొంతం” విరక్తిగా నవ్వారు శ్రీ సీతారామరాజుగారు.
ఆశ్చర్యంతో.. వారిని చూడటం.. రాఘవ అతని మిత్రుల వంతయింది. కొన్ని క్షణాల తర్వాత..
“చదువు.. సంస్కారం వున్న మన సాటివారు నా ఆశయాన్ని ఆమోదించలేదు. ఆక్షేపించారు.. యీ అటవీ సోదరులు నా మాటలను గౌరవించారు. ఆ కారణంగా నేను అడవుల పాలు కావలసి వచ్చింది. నా అంతిమ శ్వాస వరకూ.. నేను నా లక్ష్యసిద్ధికి పోరాడుతాను” ఎంతో గంభీరంగా తన నిర్ణయాన్ని తెలియజేశారు శ్రీ అల్లూరి సీతారామరాజుగారు.
“అన్నయ్యా!.. నేను మీతో వుండవచ్చా..”
“ఏమిటీ.. నీవా!..”
“అవును..”
“మీదే వూరు?..”
“విశాఖపట్నం..”
“అమ్మా నాన్నా తమ్ముళ్ళు చెల్లెళ్ళు.. వున్నారా!..”
“అమ్మా నాన్నలు లేరు. ఒక చెల్లి, నాన్నమ్మ, మామయ్య, అత్తయ్య బావా వున్నారు”
“ఓ.. చాలా పెద్ద కుటుంబం..” చిరునవ్వుతో చెప్పాడు శ్రీ సీతారామరాజు. కొన్ని క్షణాల తర్వాత..
“తమ్ముడూ!.. అమ్మానాన్న లేని కారణంగా.. నీ చెల్లికి నీవే వివాహం చేయాలి. వయస్సు మీరిన నానమ్మను జాగ్రర్తగా చూచుకోవాలి. నీవు నాతో యీ అడవిలో వుంటే ఆ బాధ్యతలను ఎవరయ్యా నెరవేరుస్తారు!.. వద్దు.. అలాంటి సంకల్పాన్ని మనస్సున పెట్టుకోవద్దు. ఎంతవరకూ చదివావు?..”
“బి.యస్.స్సీ..”
“ఉద్యోగ ప్రయత్నం చేయలేదా!..”
“భద్రాచలంలో ఫారెస్టు రేంజర్ పని చేస్తున్నాను”
“ఎంత కాలంగా!..”
“ఆరు నెలలుగా..”
“వీరిరువురూ నీకేం కావాలి?..”
“నా స్నేహితులు. ఫైనల్ యియ్యర్. బి.యస్.స్సీ చదువుతున్నారు..”
“చూడు రాఘవా!.. బాగా చీకటి పడిపోయింది. యీ రాత్రికి యిక్కడే వుండి వేకువనే బయలుదేరండి. మా వారు మిమ్మల్ని అడవిని దాటిస్తారు. ఒక్కమాట. నన్ను గురించి గాని.. నాతో వున్న వారిని గురించిగాని ఎవరకీ చెప్పవద్దు. అది మీకు మాకు అపాయం. మరొక మాట.. మీరు చదివి సంపాదించిన విజ్ఞానాన్ని.. కేవలం మీ స్వార్థానికే కాకుండా.. నీతి.. న్యాయం.. ధర్మం.. చల్లగా వర్ధిల్లే దానికి.. మనుషుల మధ్యన ఐక్యతను.. ప్రేమసౌభాత్రాలను పెంపొందించే దానికి వుపయోగించండి. అహంకారాన్ని.. స్వార్థాన్ని.. ద్వేషాన్ని.. జయించండి. జన్మనిచ్చిన తల్లిదండ్రులకు.. పుట్టిన యీ మన ఆంధ్రగడ్డకు.. మన భారతావనికి కీర్తి ప్రతిష్ఠలు చేకూరేలా జీవిత గమనాన్ని సాగించండి.. మీకు నా శుభాశీస్సులు..” కూర్చొని వున్న శ్రీ సీతారామరాజుగారు లేచి ప్రక్కన వున్న గుడిశలోకి వెళ్ళిపోయారు.
నలుగురు ఆటవీకులు వారికి భోజనం పెట్టారు. వీరి ప్రక్కనే పడుకొన్నారు. వేకువన ఐదు గంటలకు వారు.. ఆ ముగ్గురినీ లేపి అడవిని దాటించారు.
అధ్యాయం 28:
రేపు కాశీకి ప్రయాణమనగా ఆ రోజు వుదయం దేవతార్చనాది ప్రాతఃకాల చర్యలను ముగించి నరసింహశాస్త్రి పంచాగాన్ని, అద్వైత్ జాతకాన్ని చేతికి తీసికొని తన గదిలో టేబుల్ ముందు కూర్చున్నారు.
పావుగంటసేపు పంచాంగాన్ని, అద్వైత్ జాతకాన్ని పరిశీలించారు. వారి ముఖకవళికలో మార్పు. ప్రశాంతంగా ఎప్పుడూ వుండే ఆ ముఖంలో కలవరం.
కొన్నిక్షణాలు గట్టిగా కళ్ళు మూసుకొన్నాడు. మనోవేదన.. కళ్ళు మూసుకొన్నంత మాత్రాన ఆగదు. కన్నీటి రూపంతో అది కరిగి నరసింహశాస్త్రి చక్కిళ్ళ పైకి జారింది. కొన్ని నిముషాలు నిశ్చలంగా కూర్చుండిపోయారు శాస్త్రిగారు. ‘యీ జగతిలోని ప్రతి జీవికి సృష్టి కర్తవు నీవే.!.. ప్రతి ఒక్కరి జీవిత గమనం నీ నిర్ధేశకత్వంతోనే ముందుకు సాగుతుంది. దాన్ని మార్చుకోగల శక్తి.. సామర్థ్యం.. ఏ ఒక్కరికీ లేదు. నేనూ వారిలో ఒకడినే కదా!.. నీ నిర్ణయపాలనే నా కర్తవ్యం. నాకు సహనాన్ని శక్తిని.. అన్నింటినీ భరించే దానికి ప్రసాదించు సర్వేశ్వరా!.. ప్రసాదించు..’, చేతులు జోడించి లోకేశ్వరుని ధ్యానించారు నరసింహశాస్త్రిగారు.
కొన్ని నిముషాల తర్వాత.. లేచి పంచాంగాన్ని అద్వైత్ జాతకాన్ని యథాస్థానంలో వుంచి గది తలుపు తెరచుకొని బయటికి వచ్చారు.
సావిత్రి ఎదురయింది. “సుల్తాన్ భాయ్ మీకోసం వచ్చారండి..” అంది.
“ఓ.. అలాగా!..” సాలోచనగా వరండాలోకి నడిచారు.
సుల్తాన్.. చేతులు జోడించి.. “నమస్కారం స్వామీ!..” వినయంగా చెప్పాడు.
“కూర్చో సుల్తాన్ భాయ్!..” తాను కుర్చీలో కూర్చున్నాడు.
సుల్తాన్ అరుగు మీద కూర్చున్నాడు.
“మేరీ మేడం పంపింది కదూ సుల్తాన్!..” శూన్యంలోకి చూస్తూ అడిగారు నరసింహశాస్త్రి.
“అవును స్వామి.. అద్వైత్‌ని..” సుల్తాన్ పూర్తి చేయక ముందే..
“వారికి చెప్పు.. అద్వైత్‌ను వారితో లండన్‌కు పంపుతాను” చెప్పారు శాస్త్రిగారు.
ముఖద్వారం వద్ద నిలబడి వున్న సావిత్రి.. ఆ మాటను విని తన చెవులను తాను నమ్మలేక పోయింది. నరసింహశాస్త్రి వైపు ఆశ్చర్యంతో చూచింది.
“సావిత్రీ!.. ఆశ్చర్యపడకు. మన వాడికి సముద్రాలను దాటే యోగం వుంది. దాన్ని మనం ఆపలేము. అది ఆ దైవనిర్ణయం..” సావిత్రి వైపుకు చూడకుండానే.. ఆమె ముఖ భంగిమలను గ్రహించిన నరసింహశాస్త్రి చెప్పారు.
సావిత్రి కళ్ళు చెమ్మగిల్లాయి. మెల్లగా వంటింటి వైపుకు పోయింది. లోనికి కన్నీటితో వెళుతున్న సావిత్రిని చూచిన సుల్తాన్ మనస్సుకు బాధ కలిగింది.
“స్వామీ!.. అమ్మగారికి ఇష్టం లేకపోతే మీరు బాబును..” సుల్తాన్ పూర్తి చేయక మునుపే..
“పంపను అని చెప్పవచ్చు కదా అనే కదా నీవు అనాలనుకొన్నది!..” అడిగారు నరసింహశాస్త్రిగారు.
“అవును స్వామీ!..”
“సుల్తాన్!.. మనం అనుకొన్నవన్నీ జరిగితే.. మనం దేవుణ్ణి తలచుకోము. అర్థం అయిందా!..” విరక్తిగా నవ్వారు నరసింహశాస్త్రి.
సుల్తాన్ సాలోచనగా తల ఆడిస్తూ వారి ముఖంలోకి చూచాడు.
“తల్లి కదా సుల్తాన్.. కొడుకు.. ఒక్కగానొక్కడు.. తనకు దూరంగా వెళుతున్నాడంటే.. ఏ తల్లికైనా బాధగానే వుంటుంది. బిడ్డ ఎడబాటును మనస్సు అంగీకరించని కారణంగా!..”
“అవును స్వామీ!..”
“కొంత కాలానికి మనస్సు కుదుట పడుతుంది. అది మన చుట్టూ వున్న యీ ప్రకృతికి వున్న మహిమ.. రేపు మా కాశీ ప్రయాణం. పది రోజుల్లో తిరిగి వస్తాము. మేము వచ్చిన తర్వాత.. అద్వైత్‌ను మేరీ మేడంతో లండన్‌కు తప్పక పంపుతానని వారికి చెప్పు..” అన్నారు శాస్త్రిగారు.
“అలాగే స్వామీ!..” సెలవు తీసికొని సుల్తాన్ వెళ్ళిపోయాడు.
నరసింహశాస్త్రి సాలోచననగా కళ్ళు మూసుకొన్నారు.
సావిత్రి వరండాలోకి వచ్చింది. అద్వైత్ విషయంలో శాస్త్రిగారు, తన భర్త.. తీసికొన్న నిర్ణయం ఆమెకు నచ్చలేదు. ఇష్టం లేదు. భర్త వెనుక భాగానికి వచ్చి..
“ఏమండీ!..”
“ముందుకు వచ్చి కూర్చో సావిత్రీ!..” మెల్లగా ప్రశాంతంగా చెప్పారు నరసింహశాస్త్రి. సావిత్రి ముందుకు వచ్చి నిలబడింది. ఆమె ముఖంలోకి చూచారు శాస్త్రిగారు.
“అక్కయ్య మామయ్య ఇంటికి వెళ్ళింది. సుమతి పాండురంగలు మన శంకరశాస్త్రిగారి యింటికి వెళ్ళారు. ఇకపోతే.. అద్వైత్ సీత ఉదయాన్నే తయారై స్కూలుకు పిల్లలను ఎక్స్‌కర్షన్‌కు తీసికొని వెళ్ళేదానికి వెళ్ళారు. ఇప్పుడు ఇంట్లో వుండేది మన ఇద్దరమే. యిలాంటి సమయంలో నీవు నాకు దగ్గరగా కూర్చోవడం తప్పు కాదు సావిత్రీ!.. రా కూర్చో” చిరునవ్వుతో చెప్పారు నరసింహశాస్త్రి.
సావిత్రి వారి ముఖంలోకి క్షణంసేపు చూచి వారికి ముందున్న కుర్చీలో కూర్చుంది.
“ఆఁ.. చెప్పు.. ఏం చెప్పదలచుకొన్నావో!..”
“మన ఆదిని మేరీ మేడంతో..”
“లండన్‍కు పంపుతున్నాము..” సావిత్రి పూర్తి చేయక ముందే నరసింహశాస్త్రి చెప్పేశారు.
తలపైకెత్తి ఆశ్చర్యంతో శాస్త్రిగారి ముఖంలోకి క్షణంసేపు చూచి తలను దించుకొంది సావిత్రి.
“మీ నిర్ణయాన్ని మార్చుకోలేరా!..” మెల్లగా అడిగింది సావిత్రి.
“ఇది నా నిర్ణయం కాదు..”
“ఆ దేవుడిదంటారు!..”
“అవును సావిత్రి..”
“నాకు ఇష్టంలేదండీ!..” మెల్లగా నేలను చూస్తూ అంది సావిత్రి.
కొన్ని క్షణాలు సావిత్రి పరీక్షగా చూచి, దృష్టిని ఆకాశం వైపుకు త్రిప్పి నిట్టూర్చి.. “సావిత్రీ!.. నీవు నీ నిర్ణయాన్ని మార్చుకోవాలి..” మెల్లగా చెప్పారు నరసింహశాస్త్రి.
“వాడు మనకు ఒక్కగానొక్కడు..” విచారంగా అంది సావిత్రి.
“ఆ విషయం నాకూ తెలుసుగా!..” మెల్లగా చెప్పారు శాస్త్రిగారు. కొన్నిక్షణాలు వారి మధ్యన మౌనంగా గడిచిపోయాయి.
“వాడు సముద్రాలు దాటి వెళ్ళి సంపాదించ వలసినంత అవసరం మనకేముంది!..”
“వాడి సంపాదన అవసరం మనకు లేదు.. కానీ వాడి అవసరం వారికి వుంది. నేను ఆదిని పంపుతానని వారికి మాట ఇచ్చాను.”
“అంటే!..”
“అక్కడికి వెళ్ళిన ఆదికి.. మంచి పేరు.. గౌరవం.. మర్యాద.. సంపద అన్ని లభిస్తాయి సావిత్రి.. కొంతకాలం ఉండి తిరిగి వచ్చేస్తాడుగా!..”
“ఎంతకాలం తర్వాత..” ప్రశ్నార్థకంగా నరశింహ ముఖంలోకి చూచింది సావిత్రి.
“ఓ సంవత్సరం అనుకో!..”
“ఒక్క సంవత్సరమా!..” ఆశ్చర్యంతో అడిగింది సావిత్రి.
“కావచ్చు..” మెల్లగా చెప్పారు శాస్త్రిగారు.
“అంతకాలం వాణ్ణి విడిచి నేను వుండలేనండీ!..” గద్గదస్వరంతో చెప్పింది సావిత్రి.
“నాకు మాత్రం బాధగా లేదనుకొంటున్నావా సావిత్రీ!..”
“అయితే.. మనమిద్దరం బాధపడుతూ వారితో వాడిని పంపడం ఎందుకు?..”
“అది వాడి యోగం..”
“వాడు మీతో నేను వెళతానని చెప్పాడా!..”
“లేదు..”
“మీ యీ నిర్ణయాన్ని వాడికి మీరు చెప్పారా!..”
“యీ సాయంత్రం వాడు రాగానే చెబుతాను..”
“ఏమని?..”
“లండన్‍కు వెళ్ళమని..”
“వాడు కాదంటే!..”
“ఆది నా బిడ్డ.. వాడు ఏనాడు నాకు తలవంపు కలిగేలా ప్రవర్తించడు..”
“మరి నేను.. మీకు వాడికి ఏమీ కానా!..” ఆవేదనతో అంది సావిత్రి.
“సావిత్రీ!..” ఆందోళనగా అన్నారు నరసింహశాస్త్రి.. – “నీవు యీ ఇంటి మహాలక్ష్మివి. నా అర్ధాంగివి. వాడిని కన్నతల్లివి. ఆవేశంతో మాట జారావు సావిత్రీ!.. నీవు.. నీవు మన యీ ఇంటి దేవతవు. కానీ.. దైవ నిర్ణయానికి ఎవరైనా బద్ధులు కాక తప్పదు సావిత్రీ!..” అనునయంగా చెప్పారు నరసింహశాస్త్రి..
“దీన్ని మీరు దైవ నిర్ణయం అంటారా!..”
“అవును సావిత్రీ!.. ఇది ఆ దైవ నిర్ణయమే!.. తల్లిగా నీ మనస్సున వున్న బాధ నాకు తెలియంది కాదు. దైవ నిర్ణయానికి మనం బద్ధులమే కదా సావిత్రీ! ..”
సావిత్రి కొన్నిక్షణాలు వారి ముఖంలోకి పరిశీలనగా చూచింది. “మీకున్నంత గుండె నిబ్బరం నాకు లేదండీ..”
“ఎదిగిన బిడ్డల మీద అతిగా మమకారాన్ని పెంచుకోకూడదు సావిత్రి. వారికి ఆ సర్వేశ్వరుడు నిర్దేశించిన మార్గంలో వారు కాలగమనంలో మనకు దూరం అవుతూ ఉంటారు. కన్న తల్లితండ్రులుగా మనం వారు ఎక్కడకు వెళ్ళినా.. ఏం చేసినా.. గౌరవ ప్రతిష్ఠలతో మనకు గర్వకారణంగా బ్రతకాలని ఆ సర్వేశ్వరుని కోరుకోవడం మన ధర్మం సావిత్రీ!.. అవునా!.. కాదా!..”
వంచి వున్న తలను పైకెత్తి.. నిట్టూర్చి.. “మీ యిష్ట ప్రకారమే చేయండి..” చెప్పి, లేచి లోనికి వెళ్ళిపోయింది సావిత్రి. మౌనంగా సావిత్రిని చూచారు శాస్త్రిగారు.
(ఇంకా ఉంది)