మానస సంచరరే -2: ‘రాతి’ చరామి!

6
3

[box type=’note’ fontsize=’16’] “పాలరాయి, ఎర్రరాయి, నల్లరాయి… ఎన్ని రకాల రాళ్లు! అంతేనా! రంగు రాళ్ల వంటి విలువైన రాళ్లు మరెన్నో! వీటికోసం ఎంత అన్వేషణ, ఎన్ని గొడవలు..” అంటూ రాళ్ల ముచ్చట్లను పాఠకులతో పంచుకుంటున్నారు జె. శ్యామలమానస సంచరరే-2: ‘రాతి’ చరామి!” అనే కాలమ్‍లో.  [/box]

‘రాళ్లల్లో ఇసకల్లో రాశాము ఇద్దరి పేర్లు

కళ్లు మూసి చిన్నగా కలిపి చదువుకో ఒక్కసారి

కలలోన తీయగా గురుతు తెచ్చుకో…’

ఎ.సి. బస్సులో ప్రయాణిస్తూ పాటల్ని ఎంజాయ్ చేస్తున్న నాకు ఆ పాటతో అంతరంగ కడలిలో ఆలోచనా తరంగాలు ఎగసిపడటం మొదలయ్యాయి.

రాళ్లతో మనిషి అనుబంధం ఎంత రాసినా తరగనిదేమో. ఎందుకంటే చరిత్ర పూర్వ యుగాలను ప్రస్తావించుకుంటే ముందుగా పేర్కొనేది ‘రాతియుగా’న్నే. ఆ తర్వాతే కంచు, ఇనుప యుగాలు వస్తాయి. రాతియుగం 3.4 మిలియన్ల సంవత్సరాలు నడిచిందట. అప్పుడు రాతి వాడకం ఎంతో విరివిగా ఉండేది. రాళ్లతోనే అన్ని పనిముట్ల తయారీ. ఆదిమ మానవుడు రాళ్ల రాపిడితోనే కదూ నిప్పు పుట్టించింది. అవి ‘నిప్పురాళ్లు’గా నిలిచిపోయాయి. ఇప్పుడు అది తేలికగా అనిపించవచ్చేమో కానీ అప్పటికి అది ఎంత గొప్ప ఆవిష్కరణ!

‘అహెూ! ఆంధ్రభోజా! శ్రీకృష్ణ దేవరాయా!… ఈ శిధిలాలలో చిరంజీవి వైనావయా… శిలలపై శిల్పాలు చెక్కినారూ…’ నాకెంతో ఇషష్టమైన పాట మొదలైంది. ఆ శిల్పకళ ఈ నాటికీ మనల్ని ఎంతగా ఆకట్టుకుంటోంది!

కళాహృదయం లేనివాళ్లు ‘రాజుల సొమ్ము రాళ్లపాలు’ అనటం మామూలే. హంపి, మహాబలిపురం మొదలైన తావుల్లో రాతి రథాలు, రాతి స్తంభాలు.. ఇది అది అనేమిటి శిల్పి ఉలి చెక్కనిదంటూ ఏమీలేదు. అపర బ్రహ్మలు వారు! సహజంగానే చిత్రవిచిత్ర రూపులు తొడిగే రాతి ఆకృతులెన్నో… తిరుమలలో ‘శిలా తోరణం’ అలాంటిదేగా. నా ఆలోచనను చెదరగొడుతూ… ఉహు… కాదు కాదు… ఆలోచనకు మరింత ఊపిరి పోస్తూ మరో పాట మొదలైంది…

‘ఈ నల్లని రాలలో ఏ కన్నులు దాగెనో… ఈ బండల మాటున ఏ గుండెలు మ్రోగెనో..

పాపాలకు తాపాలకు బహు దూరములో నున్నవి

మునులవోలె కారడవుల మూలలందు పడియున్నవి

కదలలేవు మెదలలేవు పెదవి విప్పి పలుకలేవు

ఉలి అలికిడి విన్నంతనే

గలగలమని పొంగిపొరలు…

పైన కఠినమనిపించును లోన వెన్న కనిపించును

జీవమున్న మనిషి కన్న శిలలే నయమనిపించును…

శిలల స్వభావ వైశిష్ట్యాన్ని తెలిపే చక్కని పాట. ‘పాషాణ హృదయం’ అని కఠినాత్ములనంటారు కాని రాయి అంత కఠినం కానే కాదు. అనేక పర్యాటక స్థలాలలో కదలక మెదలక రోజంతా నిలుచునే ‘స్టోన్ మ్యాన్’లు గుర్తొచ్చారు. కూటికోసం కోటి పాట్లు.. పిల్లలు సైతం ‘స్టాట్యూ’ ఆటతో వినోదిస్తుంటారు. పల్లెల్లో పిల్లలు ‘నాలుగు రాళ్ల’ ఆట ఆడటం పరిపాటి. ఆడపిల్లలు నునుపైన రాళ్లతో ‘అచ్చంగిల్లాలు’ ఆడటం అలనాటి ముచ్చట. రాయి చెప్పులో దూరితే మాత్రం ఇబ్బందే అంటూ చెప్పులోన రాయి, చెవిలోన జోరీగ… బాధ ఇంతింతగాదయా’ అంటాడు వేమన.

‘రాయినైనా కాకపోతిని రామపాదము సోకగా, బోయనైనా కాకపోతిని పుణ్యచరితము పాడగా…’ పాట చెవులను తాకి అహల్య శాప వృత్తాతం స్ఫురణకు తెచ్చింది.

అంతలో పాటలు ఆగిపోయాయి కానీ నా ఆలోచన మాత్రం రాళ్ల చుట్టూనే పరిభ్రమిస్తోంది.

పాలరాయి, ఎర్రరాయి, నల్లరాయి… ఎన్ని రకాల రాళ్లు!

అంతేనా! రంగు రాళ్ల వంటి విలువైన రాళ్లు మరెన్నో! వీటికోసం ఎంత అన్వేషణ, ఎన్ని గొడవలు..

నాగార్జున సాగర్ వెళ్లినపుడు అక్కడి అసంఖ్యాక రాళ్లను చూస్తుంటే ఎన్నెన్ని భావాలు మనసులో చెలరేగాయో. ఈ రాళ్లన్నిటికీ నోళ్ళొస్తే… ఆ ఊహే థ్రిల్లింగ్‌గా అనిపించింది.

రాళ్లల్లో కొన్ని మనిషి మొక్కే రాళ్లు, కొన్ని మనిషి తొక్కే రాళ్లు…

‘రాయిని మాత్రం కంటే దేవుడు కనరాడు

దేవుని మాత్రం కంటే దేహం కనరాదు’ దశావతారంలో పాట గుర్తొచ్చింది.

అంతలో ఎదుటి వ్యక్తి చేతిలో పేపర్ పై… ‘పోలీసులపై రాళ్ల వర్షం… అల్లరి మూకలపై బాష్పవాయు ప్రయోగం…’ అని కనబడింది. హు.. హింసకూ మనిషి రాళ్లనే వాడుతున్నాడు.

‘మంచికి సమాధి కడతారా? ఇది మనుషులు చేసే పనియేనా…. ఏ తప్పూ చేయనివాడు ముందుగ రాయి విసరాలి’ నిజమే… ఒకరిపై రాళ్లే సేందుకు ఉత్సాహపడేముందు ఆత్మవిమర్శ ఉండాలికదా. సమాధులు కట్టడానికి కూడా మళ్లీ ఆ రాళ్లే ఆధారం.

కల్తీ వ్యాపారులు కల్తీకి రాళ్లను వాడటం మామూలేకదా. బియ్యంలో, పప్పుల్లో రాళ్లు ఏరుకోలేక జనసామాన్యం సతమతమవడం తెలిసిందే. ఇంటి నిర్మాణాలలోను ఎన్నో ప్రాంతాల్లో రాళ్ల వాడకం ఏనాటినుంచో ఉన్నదే… పల్నా టి సీమను వర్ణిస్తూ శ్రీనాథుడు ‘నాగులేటి నీళ్లు… నాపరాళ్లు’ అంటాడు. అయితే రాళ్లతో ఇళ్ల నిర్మాణం క్షేమం కాదని లాతూర్ భూకంపం తెలియజెప్పింది.

అంతలోనే ‘టోరీ పైన్స్’ గుర్తుకొచ్చింది. శాండియాగోలోని ఓ బీచ్ ప్రాంతమది. లహెూయా, డెల్ మార్‌ల మధ్య ‘టోరీ పైన్స్’ నెలకొంది. అక్కడ పసిఫిక్ సముద్రానికి ఓ వైపు అంతా గోడ కట్టినట్లుగా కొండరాళ్లు కొలువుతీరాయి. కొన్ని చోట్ల ఆ గోడలో కొంత ఖాళీ ఏర్పడి లోగిళ్లలా మనిషి అక్కడ నిలబడి ఫొటో దిగేందుకు వీలుగా ఉన్నాయి. పసిఫిక్ అందం ఓవైపు… ఇక్కడ అల్లరి చిల్లరగా పడి ఉన్న రాళ్ల అందం ఒకవైపు. రకరకాల సైజుల్లో, రకరకాల రంగుల్లో, రకరకాల ఆకారాల్లో… పలకలుగా, గుండ్రంగా, త్రికోణంగా, దీర్ఘచతురస్రంగా, అంచులు వంపులు తిరిగి, నీటిలో నాని, నాని… అరిగి… అరిగి రూపుదిద్దుకున్న అందమైన రాళ్లు. రాయి అతి కఠినం కాదన్నది ఇక్కడే రుజువవుతోంది. నీరే ఉలిలా పనిచేస్తోంది ఇక్కడ. ఈ లెక్కన రాయి కన్నా నీరే కఠినమైందేమో. తన నిరంతర తాకిడితో రాతినే అరగదీస్తోంది. ఎంత చిత్రం! అంతుచిక్కని ప్రకృతికి మనసు అభివాదాలర్పించింది. సిమెంట్ రంగులో, నీలా కాశపు రంగులో, కాఫీరంగులో, నలుపు, తెలుపుల్లో, లేత ఎరుపులో, పాచి రంగులో ఎన్నెన్ని వర్ణాలో… అలాగే వాటి మీద డిజైన్లు కూడా. నాలో నిగూఢంగా దాగిన బాల్యం ఒక్కసారిగా పైకి ఉబికింది. ఏరటం మొదలు పెట్టాను. నిజంగా ఈ రాళ్లు ‘సౌందర్యానికి గీటురాళ్లు!’ అనిపించింది.

స్టోన్ పెయింటింగ్ కోసమని దీప కొన్ని రాళ్లు ఏరటమే కాదు నాకు ఓ ‘స్టోన్ పెయింటింగ్’ ను తీపి గురుతుగా ఇచ్చింది కూడా.

నా ఆలోచనకు అంతరాయం కలిగించింది వెనక సీట్లో ఓ వృద్ధ జంట సంభాషణ… ‘ఎన్ని వేలు సంపాదిస్తే ఏముంది… నాలుగురాళ్లు వెనకేసుకోవటం తెలియకపోయాక’ ఆమె వాపోతోంది… నాకు నవ్వువచ్చింది. పాత జ్ఞాపకం ఒకటి తొంగిచూసింది. ఓ సారి మిత్రబృందంతో విహారానికి వెళ్లినపుడు ‘సూర్య’ చేత్తో రాళ్లు తీసుకొని ఒక్కొక్కటి వెనుకగా వేసుకోవటం మొదలు పెట్టాడు.

మేం ఆశ్చర్యపోయి ‘ఏంటది, ఏంచేస్తున్నావు?’ అని అడిగితే ‘మా అమ్మ నాలుగురాళ్లు వెనకేసుకోమంది’ అంటూ నవ్వాడు. మేమంతా కూడా శ్రుతి కలిపాం. అన్నట్లు రాజు అంటుండేవాడు… ఉద్యోగంగానీ ఊడిందంటే ఏం ఉన్నా, ఉండకపోయినా మూడు రాళ్లు మాత్రం అందరికీ ఉంటాయని. మూడురాళ్ల పొయ్యి పెట్టి దోసెలు పోసి అమ్ముకుంటే దానికన్నా లాభదాయక మైంది మరొకటి ఉండదనేవాడు. అమ్మ తన చిన్నతనంలో రాచ్చిప్పలో పులుసు చేసేది. ఎంత రుచిగా ఉండేదో! కాస్త లావుగా మొరటుగా ఉంటే ‘బండోడు’ అనటం కద్దు. నోరు లేనిదని కాబోలు రాయినవమానిస్తారు.

‘రాయి, రప్పను కానేకాను మామూలు మనిషిని నేను’ అని ఓ చిత్ర గీతం. ‘రావూరి భరద్వాజ’ నవల ‘పాకుడు రాళ్లు’ జ్ఞానపీర్ అవార్డునందుకొంది. జానపద చిత్రాలలో వ్యక్తులు శాపవశాత్తు శిలలుగా మారటం, మళ్లీ ఏ శక్తిమంతుడో వారిని శాపవిముక్తులను చేయటం తెలిసిందే.

‘నెక్స్ట్ స్టాప్ కోటి’ వినిపించడంతో శిలల మధ్యే ఆలోచనల్లో పరిభ్రమిస్తున్న నేను ఆ మాట ‘శిలా శాససమే’ (అది లాస్ట్ స్టాప్ కాబట్టి) అనుకుంటూ ఉలిక్కిపడిలేచాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here