ఫస్ట్ లవ్-21

0
3

[శ్రీ ఎం. వెంకటేశ్వరరావు రచించిన ‘ఫస్ట్ లవ్’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]

[ఓ రోజు మోపెడ్ మీద ధృతి, హసంతి వస్తుంటే, సడెన్‍గా కార్తీక్ వాళ్ళకి అడ్డొచ్చి నిలబడతాడు. వెళ్ళిపొమ్మని ధృతి అంటే, తాను హసంతితో మాట్లాడాలని చెప్పి ఆమెను బండి దిగమంటాడు. తనని వదిలేయమని, తన మనసులో అతనికి ఉన్న ప్రత్యేక స్థానాన్ని చెరిపేసేలా చేసుకోవద్దంటుంది హసంతి. కార్తీక్ ఆమెతో వాదిస్తాడు, ఆమె లేకుండా తాను బతకలేననీ అంటాడు. ఎంత చెప్పినా అర్థం చేసుకోవడం లేదని, తనని టార్చర్ పెట్టద్దని అంటుంది హసంతి. తనని అర్థం చేసుకోమంటాడు కార్తీక్. ఇంతలో ఇద్దరు ముగ్గురు అక్కడకి చేరి, ఏంటి ఏదైనా గొడవా, ఈ కుర్రాడు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడా అని అడుగుతారు. అలాంటిదేం లేదని చెప్పి వాళ్ళని పంపేసి, వచ్చేస్తారిద్దరూ. అశాంతిగా ఉన్న గౌతమ్ సుధాకర్‍తో బండి మీద ఎక్కడికైనా లాంగ్ డ్రైవ్ వెళ్దామా అని అడిగితే, సుధాకర్ వారించి, అతిగా ఆలోచించవద్దని అంటాడు. ఈలోపు అతనికి ఫోన్ వస్తుంది, మాట్లాడాకా, తాను ఆఫీసుకు వెళ్ళాలని చెప్పి వెళ్ళిపోతాడు సుధాకర్. కార్తీక్ తన కొలీగ్‍కి సురేష్‍కి ఫోన్ చేసి ప్రాజెక్టు కోసం అమెరికా తాను అమెరికా వెళ్ళడానికి సిద్ధమని చెప్తాడు. అయితే, రెగ్యులర్‍గా ఆఫీసుకు వచ్చి టీమ్‍కి ట్రైనింగ్ ఇవ్వమంటాడు సురేష్. సరేనంటాడు కార్తీక్. ధృతి ఇంట్లో ధృతీ, హసంతి కూర్చుని మాట్లాడుకుంటారు. కార్తీక్, గౌతమ్‍లలో ఎవరిని వదులుకోవాలో తేల్చుకోలేని స్థితిలో ఉన్నానని అంటుంది హసంతి. వాళ్ళిద్దరిలో ఎవరంటే ఇష్టమో తేల్చుకోమంటుంది ధృతి. కార్తీక్ రోడ్ పక్కన టీ స్టాల్ దగ్గర కనబడితే, అటుగా వెళ్తున్న రఘురాం అతన్ని గుర్తు పట్టి పలకరిస్తాడు. అన్యమనస్కంగా కార్తీక్‍ని ఏమైంది అని అడిగితే, ఏం లేదంటాడు. ఏదైనా ప్రేమ సమస్యా అని అడుగుతాడు. మీకెలా తెలుసు అంటే, అనుభవంతో తెలుస్తుందని అంటాడు. కార్తీక్ తన సమస్యని ఆయనకి చెప్తే, ఆయన ధైర్యం చెప్పి, వెళ్ళిపోతాడు. వాషింగ్ మెషీన్‍లో బట్టలేస్తున్నాను, నీ బట్టలేవయినా ఉంటే తీసుకురా అని కింద నుంచి పిలుస్తుంది కవిత. ఎన్నిసార్లు పిలిచినా సమాధానం రాకపోయేసరికి పైకి గదిలోకి వెళ్ళి చూస్తుంది. అక్కడ హసంతి ఉండదు. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తుంది. కంగారు పడి హసంతి స్నేహితులకు ఫోన్ చేస్తుంది. అందరూ తమ దగ్గరకు రాలేదనే చెప్తారు. ఇక చదవండి.]

[dropcap]గౌ[/dropcap]తమ్ వేగంగా, హసంతి కలిసెళ్లిన పార్కుల్లో, టీ స్టాల్ దగ్గర కంగారుగా వెతుకుతున్నాడు. రెస్టారెంట్ దగ్గర వెతికాడు. ఎక్కడా కనిపించలేదు. చిల్డ్రన్స్ పార్క్ దగ్గరికి వచ్చాడు. అందులోనూ హసంతి కనిపించలేదు. బయటికి వస్తుంటే గౌతమ్ ఫ్రెండ్ సుధాకర్ కనిపించాడు.

“రేయ్ గౌతమ్! ఆగరా! ఏంట్రా రెస్ట్‌లెస్‌గా తిరుగుతున్నావు. ఏమైందిరా?” అన్నాడు దగ్గరకు వచ్చి.

“………”

“చెప్పరా! ఏమైంది?” మళ్లీ అడిగాడు సుధాకర్.

“ఏంటో రా! పెళ్లి పనులు మొదలుపెట్టినప్పటి నుంచి అందరూ మంచి జరగాలని కోరుకుంటారు. కానీ నా విషయంలో ఏదో తెలియని చెడు జరుగుతోందనిపిస్తోంది. అదే ఏంటో అర్థం కావడం లేదు” అన్నాడు గౌతమ్.

“ఇందులో అర్థం కాకపోవటానికి ఏముందిరా? అసలు హసంతికి నువ్వు నచ్చావో? లేదో? తెలుసుకున్నావా? మీ ఇంట్లో గాని, వాళ్ళింట్లో గాని ఒక్కళ్ళైనా ఆమెని అడిగారా? అడిగి ఉండరే?”

నిజమేనన్నట్టు చూశాడు గౌతమ్.

“ఇది నీ ఒక్కడి సమస్యే కాదురా! అన్ని కుటుంబాల్లో జరుగుతున్నదే. కొంతమంది ఇంట్లో తెలిస్తే గొడవవుతుందన్న భయంతో ప్రేమించిన వారితో లేచిపోతున్నారు. తర్వాత తలరాత బాగుంటే కలిసి ఉంటున్నారు. లేదంటే కొంతమంది తిరిగి వస్తున్నారు. కొంతమంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఎక్కువ శాతం ఒకరిని ప్రేమించి మరొకర్ని చేసుకుని, కాంప్రమైజ్ అవుతున్నారు. కొంతమంది డైవర్స్ కోసం కోర్టులు చుట్టూ తిరుగుతున్నారు. చాలామంది ఈ జ్ఞాపకాలు, తిరిగిన ప్రదేశాలను మర్చిపోవటానికి భర్తతో విదేశాలకు పారిపోతున్నారు.

అమ్మాయి నచ్చితే చాలు, ఆమెకి అబ్బాయి నచ్చాడో లేదో తెలుసుకోవాలన్న ఆలోచన తల్లిదండ్రులకు ఎందుకు రాదో అర్థం కాదు. ఆ కాలం నుంచి ఈ కాలం వరకూ ఇదే సమస్య.

ఎంగేజ్మెంట్ అయ్యాక కూడా అమ్మాయికి ఎవరితోనైనా ఎఫైర్ ఉందేమోనని శీల పరీక్ష చేస్తారే.. తప్ప, అబ్బాయికి మాత్రం క్లీన్ చిట్ ఇస్తున్నారు. కొంచెం ఆలోచించు. మిగతా వాళ్ళ సంగతి వదిలేయ్. ఎట్‌లీస్ట్ నువ్వు హసంతిని అడిగావా?”

గౌతమ్ మొహం జేవురించింది.

“లేదు.. తనే అడగొచ్చుగా!” అన్నాడు.

“చూసావా! నీలోనూ మేల్ ఈగో ఎంతుందో? ఏమని అడుగుతుంది నేను నీకు నచ్చానా లేదా అని ఆమెకు ఆమె నిన్ను అడగాలా!?! ఎంగేజ్మెంట్ అయ్యాక అమ్మాయిలకి ఆ స్వేచ్ఛ ఉందంటావా? సరేలే ఇప్పుడు అవన్నీ ఎందుకు కానీ, ఏంటి ఎవరికోసం వెతుకుతున్నావు?”

గౌతమ్ విషయం చెప్పాడు.

“అర్జెంటుగా ఆఫీస్‌కి వెళ్ళాలి రా లేకపోతే నీతో వచ్చేవాడిని” అన్నాడు సుధాకర్.

“నో ప్రాబ్లం యు క్యారీ ఆన్ రా”

సుధాకర్ వెళ్ళిపోయాడు.

గౌతమ్ కి కార్తీక్ బైక్ మీద వెళ్తూ చెప్పిన మాటలు గుర్తొచ్చాయి.

“గౌతమ్! హసంతి నాకే సొంతం. తనని ఎవరికోసమో వదులుకోను.”

ఫోన్ తీసి కార్తీక్‌కి కాల్ చేశాడు గౌతమ్.

ఫోన్ వైబ్రేట్ అవుతుంటే మెల్లగా చెవి పక్కన పెట్టుకుని ‘హలో’ అనే లోపల “హసంతి ఎక్కడ కార్తీక్?” గౌతమ్ గొంతు కరకుగా అడిగింది.

“……”

“హసంతి ఎక్కడ?”

“……”

“హసంతి ఎక్కడ కార్తీక్? నిన్నే అడుగుతున్నాను”

“.. ….”

“చూడు కార్తీక్! హసంతి నాకు మాత్రమే కాదు. మా కుటుంబంలో అందరికీ ఆమె అంటే ఇష్టం. ఆఖరికి చనిపోయిన మా అమ్మకి కూడా. తనులేని మా ఫ్యామిలీని ఊహించుకోలేను. నీ ఒక్కడి స్వార్థం కోసం, మమ్మల్ని అందరినీ బాధకు గురి చెయ్యకు. తనకు ఏదైనా అన్యాయం జరిగితే, నేను పైకి కనిపించే అంత సాఫ్ట్‌గా మాత్రం ఉండను.” అని ఫోన్ కట్ చేశాడు గౌతమ్.

ఒక్క మాటకీ బదులు చెప్పలేదు కార్తీక్. ఎటువంటి రియాక్షన్ లేకుండా ఫోన్ చెవి పక్కనుండి తీశాడు కార్తీక్.

‘నాకు తెలియకుండానే నన్ను ఓ అమ్మాయి ప్రేమిస్తోందని తెలిసిన క్షణం పొందిన ఆనందం.. కంటే ఇప్పుడు ఎదురవుతున్న హర్డిల్స్ వింటున్న కొద్దీ ఎక్కువ సంతోషంగా ఉన్నట్టు అనిపిస్తోంది. పోయిన చోటే వెతుక్కోవాలి అన్నట్టు.. హసంతికి, నాకు మధ్య ఏర్పడ్డ వన్ సైడ్ లవ్ కాస్తా, గౌతమ్ రాకతో ముగ్గురి మధ్యా ట్రయాంగిల్ లవ్ గా మారింది. ఓ.కే. లెట్ మీ ఫైట్. గెలుపు ఎవరిదో కాలమే నిర్ణయిస్తుంది’ అనుకుని బైక్ మీద హసంతి కోసం అన్వేషణ మొదలు పెట్టాడు.

***

మరోపక్క గౌతమ్ రోడ్లు, పార్కులు, ట్యాంక్ బండ్, పబ్లిక్ గార్డెన్స్ తిరుగుతున్నాడు.

ఇద్దరూ పోటీ పడ్డట్టు ఒక్క హసంతి కోసం గచ్చిబౌలి, దుర్గం చెరువు, పబ్లిక్ గార్డెన్స్ తిరుగుతున్నారు.

మొత్తానికి ఇద్దరు ప్రేమ పిచ్చోళ్ళు హసంతి కోసం గాలిస్తున్నారు.

కార్తీక్ ఓ చోట నిలబడి ధృతికి ఫోన్ చేశాడు.

“కార్తీక్ నీకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదా? హసంతి తన సిట్యువేషన్ నీకు వివరంగా చెప్పింది కదా! ఏంటి? అర్థం చేసుకోకుండా.. ఎందుకిలా వెంబడిస్తున్నావో అర్థం కావట్లేదు.

అసలు ఈ సమస్యలన్నిటికీ నేనే కారణం. నాకు చాలా సిగ్గుగా ఉంది. అనవసరంగా నీ మీద జాలిపడి నీకు హసంతి అడ్రస్సు, ఫోన్ నెంబర్ ఇచ్చినందుకు గిల్టీగా ఉంది. ఇప్పుడు చూడు.. తను ఎక్కడికి వెళ్ళిందో, ఏమైందో, అంత అయోమయంగా ఉంది.”

ఫోన్ ఆఫ్ చేసిన కార్తీక్ బైక్ తీసుకొని బిర్లా మందిర్‌కి వచ్చాడు. ఓ కార్నర్‌లో కూర్చున్నాడు.

‘నా అనే వాళ్ళు లేక నా గుండెలోతుల్లో నేను నలిగిపోతూ యాంత్రిక జీవితం గడుపుతున్న సమయంలో.. ప్రేమిస్తున్నానని, నా కోసం పంపిన గిఫ్ట్ ప్యాక్‌లో తన మనసంతా కవితల రూపంలో తెలిపి, డోంట్ స్మోక్ అని సలహా ఇచ్చి, చిన్న కైట్ మీద ఫైండ్ ద మూమెంట్ అని ఆట పట్టించి, ఎప్పుడూ నీ తోనే ఉంటానని, చేతికి కడియం పంపినప్పుడు.. తొలిసారి హృదయంలో ప్రేమ కెరటాలు ఉవ్వెత్తున అలజడి రేపాయి. అప్పుడు మనసు ఆనంద తాండవం చేసి, తన కోసం రెండు ఆనంద భాష్పాల్ని కళ్ళు రాల్చాయి.

ఆమె నాదే.. నాకే సొంతం. నా కోసమేనని వెతుక్కుంటూ వెళ్ళినప్పటి నుంచీ.. ప్రతిరోజూ మనసు రోదిస్తూనే ఉంది.

ఇద్దరి మధ్యా గోడ కట్టి ,దాని మీద నిలబడ్డాడు గౌతమ్.

ఇటా? అటా? ఎవరెటో అర్థం కాని నాలుగు రోడ్ల కూడలిలో నిలబడ్డ ముగ్గురిలో జత కాబోయే ఇద్దరి కోసం నాలుగో రోడ్డు ఖాళీగా ఉంది. ఈ ఒత్తిడి తట్టుకోలేక హసంతి ఎక్కడికెళ్ళిందో!?!?!?’

‘ప్రేమే నేరమౌనా! మాపై ఈ పగేలా!’ పాత పాట గుర్తొచ్చింది కార్తీక్‌కి. అసలు ఆ పాట ఎవరు పాడారో కూడా తనకు తెలియదు. అప్పటికి తను పుట్టను కూడా లేదు. కానీ ప్రేమ అప్పటికీ, ఇప్పటికీ, ఎప్పటికీ ట్రాజిడీగానే ముగియాలా? సరిగ్గా ఇప్పుడు రాలాయి కార్తీక్ కళ్ళను అవే రెండు కన్నీళ్లు వేదనగా. జేబులో ఉన్న హసంతి పంపిన కర్చీఫ్ తీసి తుడుచుకున్నాడు స్వాంతన కోసం.

హసంతి ఆలోచనల నుండి రిలాక్స్ అవ్వాలని.. పైకి వెళ్లి దేవుడు దర్శనం చేసుకుని వచ్చాడు. గుడికి ఎడమవైపున ఉన్న మెట్లమీద ఓ కార్నర్‌లో కూర్చున్నాడు కార్తీక్. షార్ట్ ఫిలిం కోసం చేసిన బ్యాగ్రౌండ్ స్కోరు ఫోన్‌లో మళ్ళీ వినటానికి చెవుల్లో ఇయర్ డ్రాప్స్ పెట్టుకున్నాడు.

***

ట్యాంక్ బండ్. జనం అంతగా లేని ఓచోట బెంచీ మీద హసంతి కూర్చొని ఆలోచిస్తోంది. చల్లగాలికి జుట్టు ఎగురుతోంది ఆమె మనసు లాగే..

మొహం మీద పడుతున్న ముంగురుల్ని వెనక్కి నెట్టుకుంది. గౌతమ్ గురించి గానీ, కార్తీక్ గురించి గానీ.. ఆలోచించకూడదనుకుంది. బలవంతంగా కాలేజీలో రోజుల్లోకి ప్రవేశించాలని మనసుని సమాయత్తం చేసి, అలనాటి ఫ్రెండ్స్‌ని, లెక్చరర్స్‌ని గుర్తు చేసుకోవాలని ప్రయత్నం చేస్తోంది.

తనకు సమీపంలో ఇద్దరు లవర్స్ కూర్చుని చెప్పుకుంటున్న కబుర్లు హసంతిని ఆసక్తిగా వినేలా చేశాయి.

“మా అన్నయ్య నాకోసం సంబంధం తెచ్చాడు”

“మరింకేం చేసుకుని సెటిల్ అయిపో”

“నిజంగానే ఓ.కే చెప్పేస్తా! తర్వాత నువ్వే పిచ్చోడివై పోతావవు.” అంది ఆ అమ్మాయి.

“కలలో కూడా అలాంటి ఐడియాలు రానీకు లాస్యా. ఇక్కడ చెవిపెట్టి విను” అని ఆమె తలని తన గుండెల దగ్గర ఆనించుకున్నాడు.

“ఏంటి లబ్ డబ్ బదులు లాస్యా, లాస్యా అంటోంది” అందామె.

“అవును నా గుండె అట్టడుగు లోతుల్లో భద్రంగా దాచుకున్న మన ప్రేమకి ఎడబాటు లేదు. నా ఊపిరి నువ్వు. నన్ను ఆదరించిన నీ ప్రేమ నాకు ఎప్పుడూ అపురూపమైన తొలిప్రేమే” అతను అంటుంటే..

“ఆపు నిన్ను వదిలి, నేను ఎక్కడికి పోతాను రా! నువ్వు నా ఊపిరి. నా శ్వాస. లే! వెళ్దాం” అందామె. ఒకరి చేతిని మరొకళ్ళు పట్టుకుని వాళ్లు వెళ్లిపోతుంటే చూస్తున్న హసంతికి నవ్వొచ్చింది.

హసంతి సెల్ ఫోన్ ఆన్ చేసింది. తల్లివి 12 కాల్స్, గౌతమ్‌వి 7 కాల్స్, ధృతివి 4, కార్తీక్‌వి 2 కాల్స్ కనిపించాయి. ఇంటికి వెళ్దామని లేచించింది.

దూరంగా కార్తీక్ కనిపించాడు. అప్పటివరకు ప్రశాంతంగా ఉన్న హసంతి మనసులో మళ్ళీ ప్రకంపనలు మొదయ్యాయి.

కార్తీక్‌ని చూసిన సంతోషం, అసహనం రెండూ కలగలిగసిన నిరాశ. వేగంగా తలతిప్పుకుంది. కార్తీక్ లేచి తన వైపే నడిచి వస్తున్నాడు. వెళ్ళిపోదాం అనుకుంది. కానీ కాళ్లు కదలటం లేదు. కార్తీక్ దగ్గరగా వచ్చి ఎదురుగా నిలబడ్డాడు. అతని మొహంలో ఆశ్చర్యం, ఆవేదనా కనిపిస్తున్నాయి. ఒకరినొకరు చూసుకున్నారు గాని, కనీసం “హలో!” అని పలకరించుకోలేని దౌర్భాగ్యాన్ని చూసి, ఇద్దరి మధ్య ఉన్న ‘పిచ్చి ప్రేమ’ సిగ్గుతో తలదించుకుంది. వాళ్ళిద్దరినీ దూరం నుండి చూసిన గౌతమ్ వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు.

హసంతి వేగంగా వెళ్ళిపోతుంటే.. ఆమె వెళ్లిన వైపే శిలలా నిలబడి చూస్తూ..

‘ఇదేం టార్చర్ రా! బాబూ! అందుకేనేమో ప్రేమని సైలెంట్ కిల్లర్ అన్నారు’ అనుకున్నాడు కార్తీక్.

***

కవిత హాల్లో అటు, ఇటు తిరుగుతోంది. ఆమె మొహంలో అసహనం. హసంతి కనిపిస్తే గొంతు పిసికి చంపెయ్యాలన్నంత కోపం.

గౌతమ్‌కి కాల్ చేసింది. అతను ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. అంతలో వేగంగా ఇంట్లోకి వచ్చి, తన గదికి వెళుతున్న హసంతిని చూసి –

“ఎక్కడికి కెళ్లావే చెప్పా పెట్టకుండా! ఫోన్ ఎందుకు లిఫ్ట్ చెయ్యలేదు?” అంది.

తల్లి మాటలు పట్టించుకోకుండా వెళ్తుంటే.. కోపంతో “నిన్నూ” అని కవిత అంటుంటే..

వేగంగా లోపలికి వచ్చిన గౌతమ్‌ని ఆశ్చర్యంగా చూసి, “గౌతమ్!?” అంది.

ఆమె మాటలు పట్టించుకోకుండా పై రూమ్‌కి వెళ్ళాడు.

కిటికీ దగ్గర నిలబడ్డ హసంతిని చూసి గౌతమ్ గొంతు పెంచి..

“అసలు ఏమనుకుంటున్నావు హసంతీ! మనమేం చేసినా ఎవరు అడుగుతారులే అన్న ధైర్యమా? ఎవరిని అడిగి ఒక్కదానివే బిర్లా మందిర్‌కి వెళ్ళావు. పెళ్లి ఇంకా వారం రోజులు కూడా లేదు. ఇలా చెప్పా పెట్టకుండా ఎలా వెళ్తావు? నీకోసం ఎంతో సేపటి నుంచి ఎక్కడెక్కడ వెతికానో తెలుసా!? మనకి ఎంగేజ్మెంట్ అయిందని గుర్తుంచుకో! మొన్న కూడా నన్ను ఇష్టం వచ్చినట్టు మాట్లాడావు. ఇహ మీదట ఇలా కాలు బయట పెడితే..” అతని మాట ముగియకముందే..

“ఆపు గౌతమ్! అంత పెద్ద తప్పు నేనేం చేశాను. నేనేమీ లేనిది అనలేదు నిన్ను. నువ్వు అన్నవే నీకు చెప్పాను. నేనేం చేసినా, ఎక్కడికి వెళ్ళినా, మీ అందరి దగ్గర పర్మిషన్ తీసుకుని వెళ్లాలా? నా ప్రతి కదలిక మీకు తెలియాలా! నువ్వు ఎప్పుడు నాతో మాట్లాడినా.. ఏదో ఒక సమస్య, దానికి జవాబు కూడా నీ దగ్గర రెడీగా ఉంటుంది” అంది చిరాగ్గా.

“నువ్వెక్కడికెళ్ళావని నేను అడగకూడదా? నిన్నేదో బాధ పెట్టాలని అడగటం లేదు. నిన్ను జాగ్రత్తగా చూసుకోవాలన్న చనువుతో అడిగాను. నీకేం కావాలో చెప్తే, నేనే తెచ్చిస్తాను. ఎక్కడికి వెళ్లాలో చెబితే.. నేనే తీసుకెళ్తాను కదా! ఇంట్లో చెప్పకుండా వెళ్తే ఏంటి అర్థం? నువ్వు కనబడలేదని అత్తయ్య ఎంత కంగారు పడ్డదో తెలుసా!” అన్నాడు.

“అయ్యో! నేను చెప్పేది నీకు అర్థం కావట్లేదు. నా బాధంతా నువ్వు ఇలా అడగటమే. ఇంటి నుండి కాసేపు బయటికి వెళ్తే, తిరిగి రావడం నాకు తెలియదా? గడప దాటితే తప్పు చేసినట్టేనా! నాకు ఇండివిడ్యువాలిటీ ఉండకూడదా?” అంది కోపంగా.

“నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావు హసంతీ!”

“…….”

“ఇప్పుడు చెప్పు వింటాను. నీ ప్రాబ్లం ఏంటి?” అన్నాడు.

“ఏం ప్రాబ్లం లేదు, ఏదో ఉందని నువ్వే ఊహించుకుంటున్నావు”

“ముసుగులో గుద్దులాట ఎందుకు? హసంతీ! అసలు నీకు నేను ఇష్టమో! కాదో! చెప్పు.”

“ఈ ప్రశ్న ఇంతకుముందే అడిగి ఉంటే.. ఇంత దూరం నువ్వు రావాల్సిన అవసరం ఉండేదే కాదు గౌతమ్. నాకు ఈ మానసిక క్షోభ ఉండేది కాదు. మనసేం బాగాలేక, రిలీఫ్ కోసం బయటికి వెళ్లాను. నాకు తలనొప్పిగా ఉంది. కొంచెం సేపు నన్ను ఒంటరిగా వదిలేయ్. తర్వాత మాట్లాడదాం ప్లీజ్!” అని చేతులు జోడించింది.

గౌతమ్ మౌనంగా బయటికి వెళ్లాడు. తలుపు తీసి బయటికి రాగానే కవిత “ఏమైంది గౌతమ్! ఏదైనా ప్రాబ్లమా?” అంది కంగారుగా.

“ఏం లేదు అత్తయ్యా! తనకి తలనొప్పిగా ఉందట. కొద్దిసేపు ఒంటరిగా వదిలేయండి” అని తిరిగి చూడకుండా వెళ్ళిపోయాడు.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here