ఎంత చేరువో అంత దూరము-21

4
16

[శ్రీమతి పువ్వాడ శారద గారు రచించిన ‘ఎంత చేరువో అంత దూరము’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]

[మర్నాడు లేస్తూనే, ఆనంద్‍కి జ్వరం తగ్గిందో లేదో, ఫోన్ చేస్తానన్నారు ఇంకా చేయలేదు అనుకుంటూ పాడయిపోయిన తన ఫోన్ కేసి చూసుకుంటుంది ఊర్మిళ. మరునాడు తన స్టాఫ్ మహేష్‍తో ఆమెకు కొత్త ఫోన్‍ పంపిస్తాడు ఆనంద్. సార్ కారులోనే ఉన్నారని, పథ్యం వంట చేసి ఇవ్వమన్నారని చెప్తాడు. గబగబా వంట పూర్తి చేసి క్యారేజ్‍లో సర్ది పంపుతుంది. తన మొబైల్ బ్యాలెన్స్ రీ-చార్జ్ అయి ఉండడం చూసి, ఆనంద్ చేసిన ఆ పనిని అవమానంగా భావిస్తుంది. తన పరిస్థితికి వగస్తూ, ఫోన్ చేసి ఎలా ఉన్నారని అడుగుతుంది. బానే ఉన్నానని సమాధానం చెప్తాడు ఆనంద్. తనతో ఓ రకమైన డిస్టన్స్ మెయిన్‍టెయిన్ చేస్తున్నట్లు ఊర్మిళ గ్రహిస్తుంది. ఓ రోజున ఆనంద్ ఆమెకు ఫోన్ చేసి, ఆపేసిన చదువుని కొనసాగించమని, బి.కామ్‍లో చేరమని, హాస్టల్‌లో చేరమని చెప్పి, అందుకు తగిన ఏర్పాట్లు చేస్తాడు. జాయిన్ చేశాకా, ఆమెకు ఎంతో ధైర్యం చెప్తాడు, ముఖ్యమైన సూచనలు చేస్తాడు. ఇలా గతమంతా గుర్తు చేసుకుంటుంది ఊర్మిళ. ఇంతలో డాక్టర్, ఆనంద్ అక్కడికి రావడంతో ఊర్మిళ ఆలోచనలకు బ్రేక్ పడుతుంది. ఇంట్లోనే కేర్ తీసుకునేలా డాక్టర్లతో మాట్లాడి ఊర్మిళను డిశ్చార్జ్ చేయించి తీసుకొస్తాడు. ఇంటికి వెళ్తుంటే ఊర్మిళకి ఇబ్బంది అనిపిస్తుంది. మాలతిని చూడ్డడం ఇబ్బందైనా తప్పదనుకుంటుంది. ఇంజక్షన్ ఇవ్వడానికో నర్స్‌ని ఏర్పాటు చేస్తాడు ఆనంద్. తన బెడ్‍రూమ్ లోకి వెళ్ళిపోతుంది. ఊర్మిళ. మర్నాడే ఆనంద్ ఢిల్లీకి, అక్కడి నుంచి జర్మనీ వెళ్ళాలి. ఇంట్లో అన్ని ఏర్పాట్లు చేసి వెళ్తాడు. ఏదైనా అవసరమైతే వేణుని అడగమని జాహ్నవికి చెప్పి వెళ్తాడు. తండ్రి వెళ్తుంటే జానూ బాధపడతుంది. మళ్ళీ నాన్న వచ్చేసరికి తామిక్కడ ఉండరన్నదే అందుకు కారణం. మాలతి దాన్ని గమనించి, జాహ్నవిని ఓదారుస్తుంది. – ఇక చదవండి.]

అధ్యాయం 21

ఆనంద్ బరువెక్కిన హృదయంతో ఫైట్‌లో ఉన్నాడు.

మళ్ళీ వచ్చేవరకు జాహ్నవి వాళ్ళమ్మతో వెళ్ళిపోతుంది. అంతే కాదు, ఊర్మిళను ఆ పరిస్థితుల్లో వదిలి వెళ్ళడం కూడా బాధగా ఉంది.

అసలు మాలతి జ్ఞానంతో వ్యవహరించి ఉంటే ఊర్మిళ తన జీవితంలోకి వచ్చేదే కాదు.

తామిద్దరం కలిసి ఊర్మిళకు పెళ్ళి చేద్దామన్నాడు.

అప్పుడు, “ఆ పెళ్ళిని అడ్డం పెట్టి మీకు మరింత స్వేచ్ఛ తీసుకుంటారు” అంది.

“నీకేమైనా పిచ్చి పట్టిందా! మనిషి లాగా ఆలోచించు!” అన్నాడు.

“నాకు తెలుసు. మా మేనత్త అలాగే మోసపోయి, చివరకు ఆత్మహత్య చేసుకుంది. నేనా పని చచ్చినా చేయను. నా బిడ్డ కోసం బ్రతుకుతాను. మొగవాళ్ళంతా ఇంతే. కొందరు దౌర్భాగ్యపు ఆడవాళ్ళూ కూడా అంతే! రాఖీ కట్టి భార్యకు అనుమానం రాకుండా, అతన్నే పెళ్ళి చేసుకున్న సినిమా యాక్ట్రెస్‌ ఉన్నారు..” ఈ వితండ వాదన కాస్తా, నిజం అని నమ్మే స్థాయికి మనసుకు ట్రైనింగ్ ఇచ్చింది. ఇప్పుడామెను ఎవరూ నమ్మించలేరు.

సైకాలజస్ట్‌ను అడిగితే “తనకు కౌన్సిలింగ్ చాలా అవసరం” అన్నాడు.

ఎవరి మాట వినని మనిషికి ఎవరేమి చెప్పగలరు.

పాపం, ఊర్మిళ కుటుంబ సభ్యులను అందరినీ కోల్పోయింది. అదోలాంటి వైరాగ్యం అలుముకుంది ఆమెను. ప్రపంచంతో ఒంటరిగా పోరాడే సత్తువ లేక డిప్రెషన్‌లో ఉంది.

మితిమీరిన ఆత్మాభిమానం, పిరికితనం సమాన స్థాయిలో ఉన్నాయి. లౌక్యం, గడుసుతనం ఎప్పటికి నేర్చుకుంటుందో తెలియదు.

పెళ్ళి పట్ల ఆసక్తి లేదు.

హాస్టల్‌లో చేరి చదువుకోమంటే సరేనంది.

ఊర్మిళ హాస్టల్ నుండి ఫోన్ చేసేది.

సబ్జెక్ట్‌పై డౌట్స్ అడిగేది.

డౌట్స్ లేకున్నా, “సర్! ఎలా ఉన్నారు?” అని అడిగేది.

మొదట్లో విసుగు వచ్చేది. కానీ ఆ అడగడం లోని కన్సర్న్ తను అర్థం చేసుకునేవాడు.

వంగి దండం పెట్టి, ఏడ్చిన ఊర్మిళ తనకో జ్ఞాపకంలా మిగిలిపోయింది.

పాపం, అనిపించింది.

కాస్త తన గంభీరతను తగ్గించుకున్నాడు.

భోజనం చేస్తూ, ఆఫీస్ నుండి ఇంటికి వస్తూ – ఊర్మిళ కాల్స్ రిసీవ్ చేసుకునేవాడు. ఆ ఫోన్ కాల్స్ వల్ల ఏదో సాంత్వన లభించడం గుర్తించాడు.

ఏ మనిషికి అయినా తనపై అటెన్షన్ పెట్టే వారు అవసరమే!

పాపం, తను ఫోన్ చేస్తే ఊర్మిళ కూడా అంతే సంతోషిస్తుంది కదా అనిపించింది. తనుగా ఫోన్ చేసినందుకు ఊర్మిళ సంతోషించడం ఆమె స్వరం లోనే తెలిసింది.

తను కూడా ఆమెకు ఫోన్ చేయడం మొదలైంది.

దిక్కు తోచని పరిస్థితుల్లో, ఒకరి మీద ఒకరు కనబరుచుకునే ఈ ఆటెన్షన్ గొప్ప ఊరటలా ఉంది..

ఒక రోజు తన మేనమామ వచ్చాడు.

“అసలేంటో తేల్చుకోలేకపోయావా?” అన్నాడు తనని చూసి, మాలతి పై ఆగ్రహం వచ్చింది ఆయనకు.

“తేల్చుకునేందుకు ఏముంది మామయ్య! నేను తప్పు చేసానని ఒప్పుకోవాలిట. మరెప్పుడూ చేయనని మా అమ్మపై ఒట్టు వేసి చెప్పాలిట. ఒకే ఒక్కసారి ఈ మాటలు మాట్లాడి ఫోన్ పెట్టేసింది. ఆ తర్వాత నెంబర్ కూడా మార్చుకున్నారు.”

తన మాటలకు మామయ్య ఆలోచిస్తూ ఉన్నాడు.

“ఓ అమాయకురాలి పేరు ఆమె పరోక్షంలో వాడుకునే అధికారం నా కెక్కడిది? ఆమెను ఇందులోకి లాగడం నైతికత అనిపించుకుంటుందా!”

“జీవితంలో ఒంటరితనం కంటే శాపం లేదు, రా!” అన్న మామయ్య మాటల్లో వాస్తవం తనకు తెలుస్తూనే ఉంది. అయినా తానేమీ చేయగలడు?

“చెప్పినట్టు ఒట్టేస్తే వస్తుందటనా!”

“తను వచ్చినా, రాకున్నా నేనా పని చేయను,” అన్నాడు.

తనకు నిజమైన శ్రేయోభిలాషి తన మామయ్యనే!

“ఇల్లెందుకు మారావు, రా!” అన్నాడు.

“చుట్టుప్రక్కల వాళ్ళలో పలుచ నయ్యాను, మామయ్య!” అన్నాడు.

ఆయన బాధగా నిట్టూర్చారు.

“ఇదంతా కాదు. వస్తుందా, రాదా తేల్చుకో!” అన్నాడు.

అప్పటికప్పుడు రాధమ్మ ద్వారా మాలతి నెంబర్ తీసుకున్నారు. ఫోన్ చేసాడు. ఆమె వింటూనే కట్ చేసింది.

రాధమ్మ గారి నెంబర్‌కు కలిపాడు..

రాధమ్మ గారు లైన్ లోకి వచ్చారు. “చెప్పండమ్మా, ఏమిటీ సంగతి” అన్నాడు మామయ్య. తాను ఇద్దరి మాటలు వింటున్నాడు.

సారాంశం ఇది.

తన వెనకాల నాటకాలు సాగించిన వ్యక్తి ముఖం రోజూ చూస్తూ, తాను భరించలేదట.

“మైగాడ్! ఎంత మొండితనం” అంటూనే –

“ఆనంద్! నేను ఆమెకు నోటీస్ పంపుతాను.” అన్నాడు మామయ్య.

“భార్యను కాపురానికి రమ్మని కోర్టు ద్వారా కోరే హక్కు భర్తకు ఉంటుంది. ఈ నోటీస్ వల్ల నీకు విడాకులకు అడ్డంకులు రావు. అసలు ఆరేళ్లు ఒకరి కొకరు దూరంగా ఉన్నారంటేనే విడాకులు మంజూరు అయినట్టే!” అన్నాడు.

మంత్రాలు మనుసులను కలుపలేవు. విడాకులు ప్రేమలు దూరం చేయలేవు.

“నేను ఇంకా అంత దూరం ఆలోచించ లేదు, మామయ్యా!” అన్నాడు.

“ఇట్స్, ఓ.కె!” అని ఆగి,

“ఈ నోటీస్ మాత్రం అవసరం, ఆనంద్! ఇది నీ భార్యను దగ్గర చేసేందుకే! ఈ నోటీస్‌కు అర్థం అక్కడున్న లాయర్ గారు గ్రహిస్తారులే!” అన్నాడు.

కాపురానికి రావాలని లాయర్ ద్వారా పంపిన నోటీస్‌కు స్పందన ఏమి దక్కలేదు.

రోజులు వారాలుగా, వారాలు నెలలుగా తిరిగి పోతున్నాయి.

ఒక రోజు ఆఫీస్‌లో లేడీస్ ఏదో షాపింగ్‌ల గురించి మాట్లాడుతూ తనని చూసి, మాటలు ఆపేసారు.

అది తనకో ఆలోచన తెచ్చింది.

అవును! ఊర్మిళకు కూడా ఏవో అవసరాలు ఉంటాయి, కదా!

చదువు పుణ్యమా, అని ఆమెకు ఇప్పుడు జాబ్ కూడా లేదు. అకౌంట్‌లో డబ్బులున్నాయో, లేదో!

డబ్బిస్తానంటే ఆమె అభిమానపడుతుంది. ఇంతా అని చెప్పలేదు.

కానీ, బాధ్యత తీసుకున్నాక తనకు తప్పదు, కదా!

మహేష్‌తో కార్డ్ పంపించాడు.

ఆ మరునాడు ఫోన్ చేసింది “సర్! థాంక్యూ!” అంది. అర్థం చేసుకున్నాడు. ఆమెకు నిజంగా అవసరాలకు డబ్బు అందింది అని.

“సర్! మహేష్ వస్తే, కార్డు తిరిగి పంపుతాను” అంది.

“ఆ విషయం నేను ఆలోచిస్తా లే!” అన్నాడు.

తాతయ్య ఆబ్దికం రేపు ఉందని మామయ్య ఫోన్ చేసాడు. ఆ టైం కు ఎక్క డ ఉన్నా, నమస్కరించుకోవడం ఆనవాయితీ!

మామయ్య ఆలా ఫోన్ చేసాక తనకు ఠక్కున తట్టింది.

ఆ రోజు ఊర్మిళ బర్త్ డే అని కాలేజీలో జాయిన్ చేసేటప్పుడు సర్టిఫికెట్‌లో చూసాడు. అదే రోజు తాతయ్య తిథి కావడం వల్లేమో, ఆ రోజు గుర్తుండి పోయింది.

ఊర్మిళకు ఫోన్ చేసాడు.

ఎవ్వరూ గుర్తుంచుకునే వారు లేని, తన పుట్టినరోజు గుర్తు పెట్టుకునేవారు ఒకరు ఉన్నారా!

“సర్! మీ కెలా తెలుసు?”

ఎలా తెలుసో చెప్పాడు.

“ఊర్మిళా! బర్త్ డేకి డ్రెస్ తీసుకో!” అన్నాడు.

అవతల కొన్ని క్షణాల నిశ్శబ్దం తర్వాత ఊర్మిళ వెక్కి వెక్కి ఏడుస్తూంది.

“వాట్ హెపెండ్!” అన్నాడు, అర్థం కాక.

“సంతోషించే వాళ్ళు ఎవరు ఉన్నారని, పుట్టినరోజు చేసుకోవాలి” అంది.

ఇలా ఇరుక్కుంటానని తెలియదు ఆనంద్‌కు.

ఆమెను కన్విన్స్ చేయక తప్పని పరిస్థితి.

“నువ్వు బ్రతికి ఉన్నావంటే దేముడు నిన్ను ఏదో సాధించాలనే ఉంచి ఉంటాడు” అన్నాడు.

“నిజమా! సర్!” అంది,

ఆ మాటతో కాస్త తేరుకుంది. “అందుకే, నాకు ఓకే ఒక కోరిక!” అంది.

“ఏమిటి!”

ఆమె చెప్పింది విని నివ్వెరపోయాడు.

తను తీర్చాలని ఆమె చెప్పకున్నా, ఆ మాట తనను ఆలోచింప జేసింది.

ఫైట్ ల్యాండ్ అవుతూంది..

ఆనంద్ ఆలోచనలకు బ్రేక్ పడింది.

***

టాబ్లెట్ చేతిలో పెట్టుకుని మంచం మీద నుండి టేబుల్ వైపుకు చేయి చాచి నీళ్ళు అందుకోబోతున్న ఊర్మిళ ఉలిక్కిపడ్డట్టు అయ్యింది.

టేబుల్ మీద ఫోటో వంక కళ్ళప్పగించి చూసింది. మాలతి గారు, ఆనంద్. తన బెడ్ రూమ్‌లో ఆ ఫోటో ఫ్రేమ్ చూసి, షాక్ అయ్యింది. తన నిస్సహాయ పరిస్థితిని ఇలా ఉపయోగించుకోవడం, శాడిజం అనిపించింది. ఇల్లంతా పెట్టుకున్న ఫోటోలు సరిపోనట్టు..

అన్నమ్మను పిలిచి ఫోటో తీసి ఏదయినా డ్రాయర్‌లో పెట్టమంది.

“ఎందుకూ! చెత్తబుట్టలో పడేస్తే పీడా పాయె గదా!” అంది అన్నపూర్ణమ్మ.

“నువ్వు ఓవర్ చేయకే! చెప్పింది చేయి చాలు” అంది విసుగ్గా.

అనూప్, అనూష్‌ను పిలవాలనుకునేంతలో వాళ్ళే వచ్చి, గడప దగ్గర నిల్చున్నారు. బ్యాండేజ్ కట్టుతో ఉన్న ఊర్మిళను బాధగా చూస్తూన్నారు. వాళ్ళను దగ్గరికి పిలిచింది.

“అమ్మా! నీకు ఇంకా తగ్గలేదా!” అన్నారు.

“తగ్గుతుంది నాన్నా! డాక్టర్స్ చెప్పిన టైం కాకముందే ఇంటికి వచ్చాను కదా!” అంది.

“ఐస్‌క్రీమ్ తింటారా!” అడిగింది పిల్లలను ఆప్యాయంగా.

తలడించారు.

వేణుకు ఫోన్ చేసి, పిల్లల కిష్టమైన ఐస్‌క్రీమ్స్ ఇంట్లో అందరికీ తెప్పించింది.

***

ఊర్మిళ హాస్పిటల్ నుండి వచ్చాక మాలతి ప్రవర్తనలో రోజు రోజుకీ మార్పు వస్తూంది. నాజూకయిన ఊర్మిళను, ఆ పరిస్థితుల్లో కూడా తరగని ఆమె అందాన్ని చూసి ఈర్ష్యాజ్వాలలు భగ్గుమంటున్నాయి. తన కంటే వయసులో చాలా చిన్నదయిన ఊర్మిళను చూస్తే, పోత పోసిన పుత్తడి లాంటి ఆమె మేని రంగు చూస్తే, మాలతి కళ్ళు ఎర్రబడుతున్నాయి. ఈ అందం తోనే తన పాలిట శాపమై, తన బ్రతుకు బుగ్గి చేసింది. ప్రస్తుతం ఆమె రూమ్‌లో నుండి బయటకు రాకున్నా, ఆమె ఇంట్లో ఉందన్న విషయమే అసహనం కలిగిస్తూంది మాలతికి. ఆ అసహనానికి శాంతి జపం ఏదీ లేనట్టు రోజుకింత నీళ్ళు పోసి, పెంచే మొక్కలా పెరిగిపోతోంది.

దానికి తోడు ఆనంద్ ఊర్మిళకు ఫోన్ చేయడం, ఆమె కండిషన్ గురించి అడగడం మరింత మండిస్తోంది. అది ఆనంద్ ఫోన్ అని తెలిస్తే, హాల్లో కూర్చొని బయటకు వినిపించే సంభాషణపై చెవి వేసి ఉంచుతుంది.

ఊర్మిళ అసౌకర్యంగా ఫీలయినా, ఊరుకోక ఏమి చేయగలదు?

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here