[box type=’note’ fontsize=’16’] “ఇక్కడున్న సమానత్వం ఏ తత్వంలోనూ లేదు, ఇక్కడున్న నిజం ఏ ఇజంలోనూ లేదు” అంటున్నారు శ్మశానం గురించి భువనచంద్ర ఈ మహా ప్రస్థానం కవితలో. [/box]
[dropcap]ఇ[/dropcap]ది స్మశానం
ఇక్కడ దొరికేది వైరాగ్యం
ఇక్కడ శరీరాలు భూస్థాపితం చెయ్యబడతాయి
ఇక్కడే కొత్త జీవాలకు బాటలు వెయబడతాయి.
పిల్లలూ పాపలూ
పురుషులూ స్త్రీలూ
పాపులూ పవిత్రులూ
చరిత్రకారులు చరిత్రహీనులు
అందరూ ఇక్కడికే చేరుతారు
మట్టిలో మట్టిగా కలిసిపోతారు
ఇక్కడ ఏ ఇజమూ లేదు
ఉన్న ఒకే ఒక్క నిజం తప్ప
ఇక్కడ ఏ తంత్రమూ లేదు
మట్టిలో కలిసే మానవ చరిత్ర తప్ప
సాహసం అనే భ్రమలో
ప్రాణాలు పొగొట్టుకునే సైనికుడూ
మతం పేరు మీద
మనిషిని చంపే నరహంతకుడూ
న్యాయం న్యాయం అంటూ పోరాడీ
అలసిపోయిన అమరవీరుడూ
పవిత్రాత్మలో లీనమవ్వాలనే
పరమార్థాంలో బ్రతికే యతీశ్వరులూ
అందరూ మీకు ఇక్కడే దొరుకుతారు
గుప్పెడు బూడిదగా..
గంపెడు మట్టిగా!
ఎవరు నేనని అడిగితే
ఏమి చెప్పనూ?
నీలోనే వున్నాను
నీతోనే వుంటాను
ఉండి ఉండి నాలో నిన్ను
చేర్చుకుంటాను.
అదిగో అటు చూడు
వన్నెలు చిలికే ఒకప్పటి వయ్యారి
ఆమె చేసే
వలపుల నృత్యం కనిపించడం లేదూ?
ఆమె కాలి అందెల సవ్వడి
వినిపించడం లేదూ?
ఆ పక్కన విను
గ్రతి తప్పక గళంలో లయలు పలికించే
ఆ మధురస్వరం వినిపించడం లేదూ?
ఆ మాధుర్యంలో కలిసే ప్రకృతి కనిపించడంలేదు
అదిగో అక్కడ… అటువైపు
జెండా పట్టుకున్న యువకుడు
ఆ వెనుక కదిలే నవతరం
బోసి నవ్వుల బాపూజీ
జగజ్జేత అలెగ్జాడర్…
మానవత్వం పేరిట
మానవసంబంధాలు నిర్మించిన
సైంటిస్టులు అరుగో…
అక్కడే!
చరిత్ర కందని వీరులూ
చరిత్ర కెక్కిన శూరులూ
సమరయోధులూ, సంవిధాతలూ
నిష్కరులూ… ముష్కరులూ
అందరూ అక్కడ నీ కళ్ళకి కనిపించడం లేదూ?
వారి పలుకులు నీ చెవులకి వినిపించడం లేదూ?
ఎందుకు ఆ భయం
వికసించిన మొగ్గలతో
పరవశించిన పువ్వులతో
ఉద్వేగపరిచే
ఉద్యానవనం కాదిది.
బూడిద కుప్పలలో
గాలిన ఎముకలతో
తవ్విన గోతులతో
ఏడ్చే నక్కలతో
ఊగే ముళ్ళకంపలతో
సాగే శవయాత్రలతో
కారే కన్నీటి ప్రవాహంతో
కాలే కట్టెలతో మండే మంటలతో
పొంగే కంపుతో
నీ అహాన్నీ నీ ధనాన్నీ
నీ ఆశనీ నీ అదృష్టాన్నీ
నీ దుఃఖాన్నీ నీ సుఖాన్నీ
నీ ఆలోచననీ నీ అర్భాటాన్ని
నీ మనసునీ నీ శరీరాన్ని
అన్నింటినీ అంతట్నీ
పుడ్చిపెట్టే పవిత్ర స్థలిమిది
నిజం చెప్పే న్యాయస్థానమిది.
ఎవరి కోసం నీ ఏడుపు
ఎవరుంటారని నీ భ్రమ
నీ కోసం నువ్వు ఏడవ లేవు… మరి
ఎవరి కోసమే ఎందుకేడుస్తావూ?
కారే కన్నీళ్ళతో
కాలే కట్టెల్ని ముంచగలవా
పగిలే గుండెలతో
రగిలే చితిని ఆర్పగలవా?
వీరంతా నీ వారనుకున్నావు
అవన్నీ నీవి అనుకున్నావు
ఏదో సంపాయించా ననుకున్నావు
ఎంతో జాగ్రత్త పడ్డాననుకున్నావు
ఏమనుకున్నా ఏం చేసినా
ఇక్కడికి ఎక్కడికిపోతావూ?
తామసంతో తప్పించుకుందా మనుకున్నా
తడబడుతూ రాక తప్పలేదుగా
అందుకే వద్దు ఆ కన్నీళ్ళు
అందుకే వద్దా నిట్టూర్పులు
ఇక్కడున్న సమానత్వం
ఏ తత్వంలోనూ లేదు
ఇక్కడున్న నిజం
ఏ ఇజంలోనూ లేదు… అందుకే
కళ్ళు తుడుచుకో..
కౌగిలించుకో
మనసుకున్న తెరలు విప్పు
అశాంతికి శెలవు చెప్పు!