[dropcap]సి[/dropcap]నిమా, సంగీతం, కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపురూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు’ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.
~
దిలీప్ కుమార్ ‘జుగ్నూ’ – వివాదం – సంచలనం!:
దిలీప్ కుమార్ నటించిన ‘జుగ్నూ’ అనే సినిమా అప్పట్లో ఓ సంచలనం! పెను వివాదానికి కారణమయ్యింది.
ఆ సినిమాని సామాన్య (మాస్) ప్రేక్షకులు ఆదరించగా, ఉన్నత వర్గాల (క్లాస్) ప్రేక్షకులు మాత్రం తిరస్కరించారు. లైంగికభావనలు రెచ్చగొట్టేలా కొన్ని దృశ్యాలు ఉన్నాయని, కాలేజీని ప్రేమ కలాపాలకు నిలయంగా చూపారని ఆ సినిమాపై ప్రధాన ఆరోపణలు. ఎన్నో రాష్ట్ర ప్రభుత్వాలు ఆ సినిమాని నిషేధించాయి, ఫలితంగా అందులోని ‘అసభ్యత’ను తొలిగించేలా, డిస్ట్రిబ్యూటరే సినిమాకి కత్తెర్లు వేశారు.
జుగ్ను (తుమ్మెద, 1947) అనేక అంశాలలో ముఖ్యమైన చిత్రం. ఇది – సినీరంగంలో కొత్తగా ప్రవేశించిన దిలీప్ కుమార్‌కు మొదటి బాక్సాఫీస్ విజయం అందించిన చిత్రం, అలాగే, బొంబాయి నుండి కరాచీకి శాశ్వతంగా వెళ్లిపోతున్న సింగింగ్ స్టార్ నూర్ జెహాన్ చివరి చిత్రం. జుగ్ను విషయంలో మరో విచిత్రం కూడా ఉంది. దేశానికి స్వాతంత్ర్యం రాకముందు చిత్రీకరణ జరుపుకుని, స్వాతంత్ర్యం, దేశ విభజన అనంతరం విడుదలైన కొన్ని సినిమాలలో ఇది ఒకటి.
జుగ్ను చిత్రం పట్ల వ్యక్తమైన ప్రతిస్పందన – సామాన్య ప్రేక్షకులకి విపరీతంగా నచ్చేయటం, ఉన్నత వర్గాల్లో ‘నైతిక భయాందోళన’ రేకెత్తించడం, కొత్త ప్రభుత్వం దాన్ని శిక్షార్హమైన చర్యగా పరిగణించటం – ఈ మూడు ప్రతిస్పందనలు అప్పట్లో దేశంలో సంభవిస్తున్న మార్పుల ఫలితం. ఇది స్వతంత్ర భారతదేశం ప్రారంభించబోయే సెన్సార్‌షిప్ ప్రాజెక్ట్‌కు రంగం సిద్ధం చేసింది. ‘సులువుగా మోసపోగల ప్రజల’ – ‘దుర్బల నైతికతను’ రక్షించే లక్ష్యంతో ఏర్పడ్డ సెన్సార్ విధానం- నేటికీ ఆ పనిలోనే నిమగ్నమై ఉంది.
ప్రస్తుత తరం ప్రేక్షకులు జుగ్నుని రన్-ఆఫ్-ది-మిల్ రొమాంటిక్ కామెడీగా పరిగణిస్తారు (ఇది దిలీప్ కుమార్ అనేక ఇతర చిత్రాల వలె విషాదాంతం), కొన్ని విభాగాలను మెచ్చుకుంటారు, కొన్నింటిని తిరస్కరిస్తారు. నటి నూర్ జెహాన్ అప్పటి భర్త షౌకత్ హుస్సేన్ రిజ్వీ నిర్మించి దర్శకత్వం వహించిన ఈ చిత్రం కథ సాధారణమైనది. సూరజ్‍గా నటించిన దిలీప్ కుమార్, జుగ్నుగా నటించిన నూర్ జెహాన్ ఒకే క్యాంపస్‌లో ఉన్న వేర్వేరు కాలేజీల్లో చదువుకుంటూ ప్రేమలో పడతారు. జుగ్ను ఓ అనాథ; సూరజ్ అప్పుల పాలయిన ధనవంతుడు రైసాహెబ్ ఏకైక కుమారుడు. ఆర్థిక కష్టాలు తీరిపోతాయనే ఆశతో సంపన్న కుటుంబానికి చెందిన అమ్మాయితో సూరజ్‌కి పెళ్లి చేయాలని అతని కుటుంబం ప్రయత్నిస్తుంది. ఈ పరిస్థితులలో ప్రేమికులు వివాహం చేసుకోలేరు, దాంతో అవిశ్వాసం ప్రదర్శించాల్సి వస్తుంది. ఇద్దరూ భగ్నహృదయులై, చివరికి, వారి జీవితాలని విషాదభరితం చేసుకుంటారు.
నటీనటుల ప్రదర్శన పరంగా చూస్తే, ఈ సినిమా ఓ మాదిరిగా ఉంటుంది, కానీ తొలి అర్ధభాగంలోని కామెడీ, మలి అర్ధభాగంలో పాటలు సినిమాపై ఆసక్తిని నిలిపి ఉంచుతాయి.
అప్పటి వార్తాపత్రికల ప్రకటనలలో ఈ సినిమాకి ‘ది సాంగ్ ఆఫ్ ది యూత్’గా ముద్రవేసి, పలు నగరాల్లో ‘సిల్వర్ జూబ్లీ’ జరుపుకుంటోందని ప్రకటించినప్పటికీ, ప్రేమ కలాపాలకు నిలయంగా కాలేజీని చూపారని, యువతలో లైంగిక భావనలను రెచ్చగొట్టారనీ; భారతీయ యువతకి ప్రేమా, అందులో విజయం, వైఫల్యం తప్ప మరేవి పట్టవన్నట్టు ఈ సినిమా చిత్రించిందని సమాజంలోని ఉన్నత వర్గాల నుంచి ఈ సినిమాపై తీవ్రమైన ఆరోపణలొచ్చాయి.
విమర్శకులు పదే పదే లేవనెత్తిన మరో వివాదాస్పద అంశం, రూబీ మైయర్స్ పోషించిన లేడీస్ హాస్టల్ మేట్రన్ పాత్రకీ – బాలుర కళాశాలకు చెందిన ఒక ప్రొఫెసర్ పాత్రకీ మధ్య రొమాన్స్ చిత్రణ. కళాశాలలో ఆదర్శంగా సాగాల్సిన అభ్యాస కార్యకలాపాలపై ఏమాత్రం దృష్టి పెట్టకుండా భారతదేశ ఉన్నత విద్యాసంస్థలను నీచంగా చూపినందుకు మరికొందరు దీనిని నిందించారు.
ఫిల్మిండియా వంటి అప్పటి ప్రసిద్ధ సినీపత్రికలకు ఆంగ్ల పాఠకులు వ్రాసిన కొన్ని ఉత్తరాలను గమనిస్తే – ‘జుగ్ను’ పట్ల వ్యక్తమైన ఫిర్యాదుల గురించి తెలుస్తుంది. ఇలాంటి ‘అసభ్య’ చిత్రానికి సెన్సార్ బోర్డు ఎలా అనుమతినిచ్చిందంటూ కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. దీనిని పునఃపరిశీలించాలని మరికొందరు డిమాండ్ చేశారు. ‘జుగ్ను’ లోని అసభ్యతని, ఇంకా కాలేజీ అమ్మాయిలను ‘వేశ్యలు’గా చిత్రీకరించడాన్ని వ్యతిరేకిస్తూ – పాఠకులు మొత్తం పాటని (లూట్ జవానీ..) తమ ఉత్తరాలలో రాసేవారు. సింగపూర్, కొలంబోలో నివసిస్తున్న భారతీయులు కూడా ఈ చిత్రం ‘భారతదేశంలో కళాశాల జీవితం గురించి తప్పుడు అభిప్రాయాన్ని వ్యాప్తి చేస్తోంద’ని ఆందోళనతో ఉత్తరాలు రాశారు.
ఫిల్మిండియా అక్టోబర్ 1948 సంచికలో ప్రచురించబడిన ఒక లేఖలో – “మిస్టర్ పటేల్, నన్ను నమ్మండి. కాలేజ్‌లో ప్రదర్శించబడిన ఒక నాటకంలో ఒక కాలేజ్ అమ్మాయి చేసిన అసభ్యతతో కూడిన డ్యాన్స్‌ని చూసినప్పుడు మొత్తం ప్రేక్షకులు విస్తుపోయారు – ఇక్కడ భారతీయ చిత్రాల పోషకులు మధురమైన పాటలతో కూడిన మంచి కథలను ఇష్టపడతారు; చారిత్రక వక్రీకరణలను, అర్ధ నగ్న నృత్యాలు కాదు,” అంటూ కొలంబోకు చెందిన ఎం.టి. పియాశీల వ్రాశారు,
జోధ్‌పూర్‌కు చెందిన శివ దాస్ సింగ్ అనే విద్యార్థి, ‘జుగ్ను’ తన విద్యా అవకాశాలను ప్రభావితం చేస్తుందని భయపడ్డాడు. “ఈ సినిమాను చూసిన మా తల్లిదండ్రుల మనస్సుపై ఎలాంటి ప్రభావం ఉంటుంది.. అప్పుడు మా తల్లిదండ్రులు మా చదువులను కొనసాగించడానికి అనుమతిస్తారా?” అని ప్రశ్నించాడు.
ఉత్తర భారతంలో విజయవంత్రంగా ప్రదర్శితమయ్యాకా, ‘జుగ్నూ’ 1 అక్టోబర్ 1948 నాడు బొంబాయి లోని ‘కాపిటల్ సినిమా’లో విడుదలయింది. విజయవంతంగా నడుస్తున్నప్పటికీ – ఫిల్మిండియా ఎడిటర్ బాబూరావ్ పటేల్ ‘Jugnu: A dirty, disgusting, vulgar picture!’ అనే శీర్షికతో రాసిన సమీక్ష కారణంగా నాలుగు వారాల్లోనే ఈ సినిమాని థియేటర్ల నుండి తొలగించారు.
“భారతదేశంలో కాలేజీ జీవితం అంటే అబ్బాయిలు అమ్మాయిలను వెంటపడటం, వారి హ్యాండ్ బ్యాగ్‌లను వెతకడం, వారి టిఫిన్ బాక్సులలో ఆహారాన్ని తినేయడం, ఇంకా అసభ్యకరమైన హావభావాలు చేస్తూ సూచనాత్మక ప్రేమ పాటలు పాడడం వంటి సుదీర్ఘ శృంగార కలాపాలు తప్ప మరొకటి కాదని ‘జుగ్ను’ మనకు చెబుతుంది; అమ్మాయిలు గట్టిగా నిట్టూరుస్తారు, అబ్బాయిలను టీ కోసం రెచ్చగొడతారు, తమ స్నేహితులను తారుస్తారు, మగపిల్లల సైకిల్ టైర్లను పంక్చర్ చేసి విరహ, ప్రేమగీతాలు పాడతారు,” అంటూ సమీక్షలో రాశారు పటేల్. “తన వృత్తి పట్ల నిబద్ధత, ఆత్మగౌరవం ఉన్న ఏ ఎగ్జిబిటర్ కూడా ఈ సినిమాని తన థియేటర్‌లో ప్రదర్శించడు” అన్నారు.
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, బొంబాయిలోని వార్డెన్ రోడ్‌లోని ఊమర్ పార్క్‌లో ఉండే ఫిల్మిండియా ఎడిటర్ పటేల్ – నటి నూర్ జెహాన్ ఇరుగు పొరుగువారు.
ఈ సమీక్షలో పటేల్ మరో విషయం తెలిపారు. తాను సమీక్ష ‘అడ్వాన్స్‌డ్ కాపీ’ని అప్పటి బొంబాయి హోం మినిస్టర్ మొరార్జీ దేశాయ్‌కి పంపానని; అక్టోబర్ 26న సినిమాను వీక్షించిన మొరార్జీ, మూడు రోజుల తర్వాత – జనరల్ క్లాజెస్ యాక్ట్ 1897 జనరల్ సెక్షన్ 21 కింద నిషేధం విధించారని పటేల్ తెలిపారు. అయితే సెన్సార్ బోర్డు లోని సభ్యులందరూ ఆమోదించిన సినిమాపై హోం మినిస్టర్ ‘ఏకపక్ష చర్య’ని చిత్ర నిర్మాతలు, పంపిణీదారులు తీవ్రంగా నిరసించారు, కానీ ఫలితం లేకపోయింది.
బొంబాయి తర్వాత, అనేక ఇతర ప్రాంతీయ ప్రభుత్వాలు ఈ చిత్రాన్ని నిషేధించాయి. పంపిణీదారు – భరత్ పిక్చర్స్, అకోలా – సర్టిఫికేషన్ కోసం సినిమాను మళ్లీ సమర్పించవలసి వచ్చింది, అప్పుడీ సినిమా గణనీయంగా కత్తిరించబడింది. జూలై 7, 1947న బాంబే బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ నుండి ఈ చిత్రం మొదటి సెన్సార్ సర్టిఫికేట్ పొందినప్పుడు, దాని మొత్తం పొడవు 14,093 అడుగులు అని రికార్డులు చూపిస్తున్నాయి. నిషేధం తర్వాత చేసిన సవరణల తర్వాత, అది 11,559 అడుగులకు తగ్గించబడింది. రన్ టైమ్ విషయానికొస్తే, ఈ చిత్రం దాని అసలు నిడివి 156 నిమిషాల్లో 28 నిమిషాలను కోల్పోయింది. కొన్ని నెలల తర్వాత ఈ చిత్రం కుదించిన రూపంలో మళ్లీ తెరపైకి వచ్చింది.
ఐతే, ‘జుగ్ను’ ఎదుర్కున్న విమర్శల పరిధి, పలు విధాలుగా, సినిమాలోని రెచ్చగొట్టే అంశాలకు విషమానుపాతంలో ఉంది. ఈ ప్రతిస్పందనను రెండు సందర్భాలలో అర్థం చేసుకోవచ్చు. మొదటగా, కొత్తగా స్వాతంత్య్రం పొందిన భారతదేశంలోని ఉన్నత వర్గాల దృష్టి ‘దేశ నిర్మాణం’పై ఉంది, ఈ ప్రాజెక్టుకు యువత శక్తులు, సేవలు ఎంతో అవసరం. శృంగార కార్యకలాపాల కోసం బాధ్యతను విస్మరించే యువతగా, నిర్లక్ష్యపు కుర్రకారుగా ‘జుగ్ను’లో చూపడం ప్రభుత్వానికి, మరికొందరికి అంతగా నచ్చలేదు.
రెండవది, ఈ చిత్రం నాయిక నూర్ జెహాన్, దర్శకనిర్మాత రిజ్వీ దేశ విభజన సమయంలో భారతదేశాన్ని కాదని పాకిస్తాన్‌ను ఎంచుకోవాలని తీసుకున్న నిర్ణయం భారతీయ ఉన్నత వర్గాలలో వారి పట్ల, వారి ఈ చిత్రం పట్ల తక్కువ సానుభూతిని మిగిల్చింది. ఉదాహరణకు, ‘జుగ్ను’ సమీక్షలో, దర్శకుడు షౌకత్ రిజ్వీకి, హైదరాబాద్‌లోని తీవ్రవాద, వేర్పాటువాద రజాకార్ ఉద్యమానికి అధిపతి అయిన ఖాశిం రిజ్వీకి మధ్య తప్పుడు, అసంబద్ధ సంబంధాన్ని పేర్కొన్నారు పటేల్.
అప్పట్లో అత్యంత శక్తివంతమైన సినిమా పత్రికలలో ఒకటైన ఫిల్మిండియా పేజీలలో – దేశవిభజన సమయంలో రెండు దేశాల మధ్య తిరుగుతున్న ముస్లిం దర్శకనిర్మాతలను (కొందరు భారతదేశంలోనే ఉండాలని నిర్ణయించుకున్నారు) పదేపదే ‘ఫిఫ్త్ కాలమిస్ట్స్’గా పేర్కొనేవారు. వీరు ‘సినిమా అనే శక్తివంతమైన మాధ్యమాన్ని దుర్మార్గపు ప్రయోజనాల కోసం ఉపయోగించర’ని నిర్ధారించుకోవాల్సిన అవసరం ఉందని వాదించేవారు.
“మనతో ఉంటూ మనల్ని దెబ్బతీయాలని చూసే మతోన్మాద నిర్మాతల సామాజిక వ్యతిరేక, మత వ్యతిరేక కార్యకలాపాలను సెన్సార్ వారు జాగ్రత్తగా గమనించాలి” అని నవంబర్ 1948 ఫిల్మిండియా సంచికలో సంపాదకీయం హెచ్చరించింది.
చట్టపరమైన, ప్రాసంగిక అవరోధాలు ఎదుర్కున్నప్పటికీ, ‘జుగ్ను’ ఆ సమయంలో అతిపెద్ద చిత్రాలలో ఒకటిగా నిలిచింది. దిలీప్ కుమార్ తన కెరీర్‌ను ఘనంగా ప్రారంభించారు. నిజానికి, బాంద్రాలో వేసిన ‘జుగ్ను’ పెద్ద పోస్టర్ – పెషావర్‌లోని పండ్ల వ్యాపారి గులాం సర్వర్ ‘ఆఘా’కి తన కుమారుడు యూసుఫ్ సినీరంగం లోకి ప్రవేశించి స్టార్‌గా ఎదిగాడన్న వార్తను తెలిపింది.