నాన్నే మార్గదర్శి

1
4

[డా. మైలవరపు లలితకుమారి రచించిన ‘నాన్నే మార్గదర్శి’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]నా[/dropcap] జన్మకు మూలం నీవైతే
జననానికి కారణం అమ్మ
అమ్మ మంచితనం నేర్పితే
నాన్నప్రేమే రక్షణ కవచం
ఒడిదుడుకులను తట్టుకుంటూ
సమాజంలో ధైర్యంగా
తల ఎత్తుకొని జీవించటం నేర్పావు
మంచి చెడుల విచక్షణను నేర్పావు
తప్పు చేసినప్పుడు చూపులతోనే
అదిలించి దండించావు
గెలిచిన వేళల వెన్నుతట్టి
ప్రోత్సహించావు
మాటలతో అమృతం పంచావు
చేతలతో అభివృద్ధికి బాటలు పరిచావు
నీవు కష్టాలు భరించి
సుఖాలు మా కందించావు
నీ భుజాలపై నెత్తుకుని
లోకం పోకడ చూపావు
వేలు పట్టి నీవు నడకలు నేర్పితే
నీ అడుగులు జాడలుగా మలచుకుని
నీ మార్గదర్శకత్వంలో
నీ కనుచూపుల క్రమశిక్షణతో
నీ ఆశలను సోపానాలుగా చేసుకుని
ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ
నీ కలలకు సాకారాన్నయి
నీ ఆశలకు ఆలంబనగా నిలిచా
నలుగురిని ఆదరించే నీ మానవత
పెద్దలను గౌరవించాలన్న నీ శిక్షణ
సాటివారికి సహాయ సహకారాలను
అందించాలనే నీ విలువల ఆలోచనా తరంగాలలో
ఒక అలనైనాను
‘ఆత్మావై పుత్ర నామాసి’ అన్న
వేద వాక్యానికి అర్థాన్నవుతా
నీ ఆశలను ఆశయాలను తీర్చి
నీ ప్రతిబింబాన్నౌతా
దీపం దీపాన్ని వెలిగించినట్లు
నీ స్పూర్తితో వెలుగులుపంచుతా
అహర్నిశలు మా ఔన్నత్యానికి
వెలుగుదారులు పరచిన
నాన్నా నువ్వే నాకు మార్గదర్శివి
నీబాటే మాకు అనుసరణీయం
నీ మాటే ఆదర్శం.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here