[తుర్లపాటి నాగభూషణ రావు గారి ‘తుర్లపాటి జీవన సాఫల్య యాత్ర’ అనే రచనని పాఠకులకు అందిస్తున్నాము.]
చూడు చూడు సినిమా:
[dropcap]ఐ[/dropcap]దేళ్లు నిండి ఆరో ఏడు నడుస్తోంది. ఊహ తెలుస్తున్న వయసు. ఇంట్లో వాళ్లు సినిమాకని బయలుదేర దీశారు. నాకూ ఉత్సాహంగానే ఉంది. ఆ సినిమాలో నాలాంటి పిల్లలేనట, భలే చక్కగా పాటలు పాడతారట.
‘అచ్చు అందులో ఒక పిల్లాడైతే ఇదిగో ఇలాగే వీడిలాగానే ఉంటాడటే’ అంటూ అమ్మ ఎవరితోనే చెబుతున్నది. ఆ మాట వినగానే నాలాగే సినిమాలో ఉన్న వాడిని చూడాలని నాకూ బోలెడు కోరిక పుట్టింది. ఆ సినిమా పేరు ‘లవకుశ’.
1963లో మంగళగిరిలో గుడి రోడ్డు చివర్లో ఒక థియేటర్ ఉంటే ట్రంక్ రోడ్ మీద మరో థియేటర్ ఉన్నట్లు గుర్తు. వీటిలో మరి ఏ థియేటర్‌కి వెళ్ళామో గుర్తుకు రావడం లేదు. సినిమాకి టైమ్ అయిపోతుందంటూ సాయంత్రం ఐదు నుంచీ ఇంట్లో హడావుడి. అమ్మతో పాటుగా మేము సినిమాకు బయలుదేరాము. నాన్న గారు అంత త్వరగా సినిమాలకి రారు. ఆ కాలంలో ఇలాంటి నాన్నలు – అంటే వాళ్లూ వాళ్ల ఉద్యోగం తప్ప ఇంట్లో వారిని సినిమాకో, సరదాగా పార్క్‌కో తీసుకెళ్ళాలన్న ధ్యాసే ఉండని వాళ్లు చాలా మందే ఉండేవారు. అలాంటి నాన్నలకు మా నాన్న లీడరేమో. ఆయన ‘సినిమా ద్వేషి’ ఏమోనని నాకు అనుమానం. అసలు ఆయన దగ్గర సినిమా కబుర్లు చెప్పాలంటే మాకు హడల్. అలాంటి కరడు గట్టిన సినిమా ద్వేషి తన జీవితంలో ఒకే ఒక్క సారి ఫ్యామిలీని సినిమాకు తీసుకు వెళ్ళారు. ఆ సంగతి తర్వాత చెబుతానేం.
సరే, లవకుశ సినిమా చూడటానికి బయలుదేరాం కదా.. మంగళగిరిలో ఆ రోజుల్లో ఆటోలు తిరిగిన గుర్తు లేదు నాకు. ఎక్కువగా గూడు రిక్షాలే కనబడేవి. సైకిళ్లు, రిక్షాలే వీధుల్లో తిరగాడుతుండేవి. ఈ బక్క ప్రాణులం – అంటే పిల్లలమన్న మాట అంత దూరం నడవలేరని అనుకుందేమో అమ్మ, అటుగా వెళుతున్న గూడు రిక్షాను పిలిచింది. బేరం ఆడాక దాంట్లో ఎక్కి కూర్చోమంది. మాతో పాటు పొరుగింటి అమ్మలక్కలు కూడా బయలుదేరారు. వారేమో ‘మేము నడిచే వస్తాం. మీరు వెళ్ళడమ్మా’ అంటూనే ‘హాల్లోకి వెళ్ళాక మా కోసం పక్కన జాగా ఉంచండేం’ అంటూ రెండు తుండు గుడ్డలు ఇచ్చారు. సినిమా టికెట్ మీద సీట్ నెంబర్లు ఉండేవి కావు. అసలు నేల, బెంచీలకైతే చెప్పేదే లేదు. ఇరుకు ఇరుగ్గా కూర్చోవడమే కదా. అమ్మ ఆ రెండు తువ్వాళ్లు అందుకుని రిక్షావాడ్ని ‘పోనియ్యవయ్యా సినిమా మొదలవుతోంది’ – అంటూ తొందర పెట్టింది. మాతో పాటు బయలుదేరిన వాళ్లు నడకలో మహా గడుసరుల్లా ఉన్నారు. వేగంగా నడిచి పోతున్నారు. ఎవరి తొందర వారిది. తీరా సినిమా హాలుకి చేరేసరికి నేల, బెంచీ టికెట్ల వద్ద పెద్ద పెద్ద క్యూలున్నాయి. ఐతే ఆడవారి క్యూ తక్కువగానే ఉండటంతో అమ్మ, అక్క చకచకా వెళ్ళి క్యూలో నిలబడి టెక్కెట్లు తీసుకొచ్చారు. టికెట్ ముక్కలు చేతిలో పడగానే గేట్ దగ్గరకు వెళుతుంటే అక్క అంది.
‘అమ్మా, తమ్ముడికి టెకెట్ తీసుకోవడం మరిచిపోయామే’
‘అవును గదా, మరిచిపోయానే. గేట్ కీపర్ ఏమాంటడో చూద్దాం’ అంటూనే ఓ క్షణం ఆలోచించి, ఆ వెంటనే నన్ను చంకనేసుకుంది. ముందే చెప్పాను కదా, నాకప్పుడు ఆరో ఏడు నడుస్తోంది. నేను చిన్న పిల్లాడినేమీ కాను. ఎవరైనా నువ్వు బుజ్జాయివి అంటే నాకు కోపం వచ్చేది కూడాను. నేను పెద్ద పిల్లాడినే అని గట్టిగా అరచి చెప్పాలనిపించేది. అమ్మ సందర్భాన్ని బట్టి నా వయసు మారుస్తుండేది. అంటే బస్సు ఎక్కినప్పుడు కండెక్టర్ రాగానే ‘మా పిల్లాడికి ఐదేళ్లు కూడా రాలేదింకా’ అంటూ టికెట్ కోయనివ్వకుండా అడ్డుపడేది. చాలా మంది కండెక్టర్లు నా ఆకారం చూసి వీడు బుజ్జాయే అని నమ్మేసే వారనుకోండి. కానీ కొంత మంది గడుసు కండెక్టర్లు మాత్రం ‘ఏదీ నిలబడు, ఇలా రా, ఈ స్తంభం (బస్సులో మధ్యమధ్యన ఉండే ఇనుప కడ్డీలన్న మాట) దగ్గర నిలబడు’ అంటూ హుకం జారీ చేసేవారు. అప్పుడు నాకు చాలా భయం వేసేది. ‘వీడెవడో స్కూల్లో మాష్టార్లా ఉన్నాడే’ అన్నట్లు చూసేవాడ్ని. ఆ స్తంభం మీద ఎత్తుని అంచనా వేయడం కోసం గీతలుండేవి. ఐదేళ్లు దాటిన పిల్లలను కనుక్కోవడానికి ఇదో టెక్నిక్ అన్నమాట. నేను వెళ్ళి నిలుచున్నాను. వాడు ఏమీ అనలేదు. పోయి కూర్చోమన్నాడు. ఎందుకంటే నేను గీత దాటలేదు కదా. అదన్న మాట.
ఈ తంతు అంతా జరుగుతున్నంత సేపూ అమ్మా ఆ కండెక్టర్ని బుట్టలో వేసుకోవడం కోసం ఏదో చెబుతూనే ఉంది, ‘వీడు పుట్టి ఐదేళ్లు కూడా దాటలేదు నాయనా. నేనేమన్నా అబద్దం చెబుతానా, కృష్ణానది పుష్కరాలు రావడానికి మూడేళ్ల ముందే కదా వీడు పుట్టింది అవును కదే’ అంటూ అక్క వైపు చూసేది. అక్క కూడా తల ఊచేది. ఈలోగా కండెక్టర్ నన్ను పంపించేసే వాడు. నేను దర్జాగా సీట్లో కూర్చునేవాడ్ని. అయితే కాస్త ముందుకు పోయిన వాడు మళ్ళీ వెనక్కి వచ్చి ‘ఇదిగో అమ్మో, మీ వాడికి టెకెట్ లేదు. ఒళ్లో కూర్చోబెట్టుకో. అలా సీట్లో కూర్చోబెట్టుకోకూడదు తెలుసా’ అని అరిచేసేవాడు. ‘ఏదోలే నాయనా, సీటు ఖాళీగా ఉంటే కూర్చున్నాడు అంతే, ఎవరైనా వస్తే నా వొళ్ళోకే వస్తాడు’ అంటూ రాగం తీసేది అమ్మ. ఇదంతా నాకు గుర్తే.. ఎందుకంటే నేను బుజ్జాయిని కాదుకదా..
సినిమా గేట్ దగ్గరకు రాగానే అమ్మ నన్ను ఛటక్కున ఎత్తుకుంది. అక్కడితో ఆగలేదు, ‘ఓరేయ్ నిద్రపో..’ అని నాకు మాత్రమే వినిపించేలా చెవిలో చెప్పింది అమ్మ.
అదేమిటీ సినిమా చూద్దువుగాని రారా అంటూ తీసుకుని వచ్చి ఇప్పుడేమే చంకనేసుకుని నిద్రపోరా అంటూ చిచ్చి కొడుతున్నది.. నాకు అర్థం కాలేదు. ఆ తర్వాత తెలిసిందిలే అమ్మ మనసేమిటో.
గేట్ దగ్గర వాడికి అమ్మ టికెట్లు ఇచ్చింది. వాడేమో లెక్క చూసుకుని టికెట్లు చింపి సగం ముక్కలు చేతిలో పెడుతూ అదేంటమ్మా ఈ అబ్బాయికి తీసుకోలేదేం అన్నాడు. వాడెంత మందిని చూశాడో ఇలాంటి వాళ్లను.
‘వీడికా, వీడికి ఈ మధ్యనే ఐదేళ్లు వచ్చాయి. ఐదేళ్లు నిండందే టికెట్ ఏమిటయ్యా, మరీనూ..’ లా పాయింట్ తీసింది.
అమ్మ ఇలా అంటంటే నేను మధ్యలో నా తలకాయ లేపుతుంటే అమ్మ తన చేతితో నొక్కి పెడుతూ, గేట్ కీపర్ తో – ‘చిన్న పిల్లాడయ్యా, వీడికేమన్నా సినిమా అంటే తెలుసా. నిద్రపోతున్నాడు చూడు’ అంటూ లోపలకి పోతుంటే , వాడు అనుమానంగా చూశాడు. మొత్తానికి వాడు దారి ఇవ్వగానే మేము లోపలకు వెళ్ళాము.
అప్పటికే సినిమా చూడటానికని వచ్చిన వాళ్ళలో చాలా మంది గుప్పుగుప్పున పొగ వదులుతున్నారు. ఇవన్నీ మామూలే అన్నట్లు అమ్మ తన చీర కొంగుని ముక్కుకు ఆనిచ్చుకుని ఖాళీ జాగా కోసం చూస్తున్నది. అది బెంచీ క్లాస్. వరుసుగా బెంచీలు పరిచారు. వీపు ఆనుకునే సౌకర్యం లేదు. కుర్చీ, రిజర్వ్ క్లాస్ లకు ఆ సౌకర్యం ఉంటుంది. అయితే నేల కంటే ఈ క్లాస్ కాస్త మెరుగన్నమాట. మేము కూర్చున్నాక ప్రక్కవాళ్లు ఇచ్చిన తుండుగుడ్డలు పరిచింది. ఎవరు వచ్చినా ‘ఇక్కడ ఉన్నారండీ, ఇప్పుడే బయటకు వెళ్ళారు’ అంటూ వారిని సాగనంపుతోంది. ఇదో టెక్నిక్ అన్న మాట. నాకిప్పుడిప్పుడే ఇలాంటి టెక్నిక్‌లు తెలిసిపోతున్నాయన్న మాట. ఓ పావుగంట కాగానే ప్రక్కింటి పిన్నిగారు వాళ్లు వచ్చే దాకా అమ్మకు ఇదే పని.
సరే, సినిమా మొదలైంది. గేట్ కీపర్ చెకింగ్‌కి వచ్చి అమ్మ ప్రక్కన హాయిగా కూర్చుని సినిమా చూస్తుంటే ‘ఏమమ్మో, టికెట్ తీసుకోలేదు, పైగా వాడికో సీటా వొళ్లో కూర్చోబెట్టుకోవమ్మా’ అంటూ కసిరాడు. ఇవన్నీ మామూలే ఉన్నట్లు అమ్మ వాడు కనుమరుగ్యయేదాకా నన్ను తన వొళ్లో కూర్చోబెట్టుకుని ఆ తర్వాత ప్రక్కన కూర్చోమంది.
కుశుడెందుకు నీలంగా..?
నాకు ఊహ తెలిసినప్పటి నుంచి రామాయణం కథ వింటూనే ఉన్నాను. కానీ వాళ్లు చెప్పిన కథలో రాముడి పిల్లల గురించి చెప్పినట్లు లేదు. కానీ ఈ సినిమాలో రాముడి పిల్లలు కనబడతారని ముందే అమ్మ చెప్పింది. సినిమా మొదలైనప్పటి నుంచి అమ్మను తడుతూ- ‘రాముడి పిల్లలేరీ?’ అని అడుగుతూనే ఉన్నాను.
అలా అడిగినప్పుడల్లా అమ్మేమో, ‘వస్తార్రా చూడు.. కథ నడవనీ , విసిగించక చూడు’ అంటూనే ఉంది. అలా ఓ పది సార్లు అడిగాక సడన్‌గా అమ్మ అంది, ‘ఇదిగో వీరేరా రాముడి పిల్లలు’ అంది. ఇద్దరూ ఇంచుమించు నా ఈడు వారిలాగానే నా ఫ్రెండ్స్ లాగానే ఉన్నారు. కాకపోతే ఒకరేమో ఎఱుపు ఛాయ, మరొకరు నీలం ఛాయ. అదే నాకు ఆశ్చర్యమేసింది. ‘అమ్మా, వాడెందుకే నీలంగా ఉన్నాడు, ఇందాక రాముడు కూడా నీలంగా ఉన్నాడేంటే’ అని అడుగుతుంటే అమ్మకు ఏం చెప్పాలో అర్థం కాక నెత్తిమీద మొట్టికాయ వేసింది. ఈ అమ్మలంతే వాళ్లకి తెలియకపోతే ఆ విషయం ఒప్పుకోరు. పైగా మెట్టికాయ వేయడమో లేదా గిల్లడమో చేస్తుంటారు. కాస్త పెద్దయ్యాక తెలిసింది, రాముడు, కృష్ణుడు లాంటి వాళ్లకు సినిమా వాళ్లు, డ్రామాల వాళ్లు నీలం రంగు పులుముతారని. నీలం అంటే నలుపు అన్న అర్థం కూడా ఉన్నదని బోలెడు పెద్దయ్యాక తెలిసిందనుకోండి. నాటకాల వాళ్లు రాముడిని, కృష్ణుడిని నల్లరంగు పులిమి స్టేజీ ఎక్కిస్తే జనం ఝడుసుకుంటారని నీలం రంగు పులమడం మొదలెట్టుంటారు. బ్లాక్ అండ్ వైట్ సినిమాల్లో ఈ రంగు గోల లేదు. కానీ కలర్ సినిమాలు వచ్చాక రాముడు, కృష్ణుడికి నాటకాల వాళ్లలాగానే ఓ డబ్బా నీలం రంగు తెచ్చి పులమడం మొదలెట్టారని టెన్త్ చదువుతున్నప్పుడు నా ఫ్రెండ్ ఒకడు వివరంగా నా యీ చిన్ననాటి డౌట్ తీర్చాడు.
సినిమా నాలెడ్జ్ వాడికి చాలా ఎక్కువ. సినిమా టైటిల్స్ మిస్సయ్యేవాడు కాడు. సినిమా అంటే ఎలా చూడాలో ఓ సారి పెద్ద క్లాసే పీకాడు. అదంతా రాస్తే చాటభారతం అవుతుంది కనుక, క్లుప్తంగా ఇస్తున్నాను..
సినిమా చూసేందుకూ ఓ పద్ధతి:
‘ఓరేయ్.. సినిమాకి ఎలా వెళ్లాలంటే, ఓ పావు గంట ముందే సినిమా హాల్‌కి చేరేలా చూసుకోవాలి. వచ్చేటప్పుడే ఓ వేరుశనగ కాయల ప్యాకెట్లో నాలుగు జీడీలో తెచ్చుకుంటే ఇంకా బాగుంటుంది. సీట్లు ఖాళీగా ఉంటే ఫ్యాన్ క్రిందనే కూర్చోవాలి. లేటుగా వెళ్ళి సీటు దొరక్క, ఎక్కడో ఏదో మూలన దొరికిన సీట్‌తో సర్దుకుపోయి ఫ్యాన్ గాలాడక, ఉక్కబోతతో ఇబ్బంది పడుతూ సినిమా చూడకూడదు. సినిమా హాల్లో లైట్లు ఆపేయగానే కర్టెన్ పైకి లేస్తుంది. ఇది తప్పకుండా చూడాల్సిందే. అలా నెమ్మదిగా కర్టెన్ లేస్తున్నప్పుడు చక్కటి మ్యూజిక్ వస్తుంటుంది. కర్టెన్ క్రింద భాగంలో కట్టిన రంగురంగుల లైట్లు నెమ్మదిగా పైకి వెళుతుంటే భలే థ్రిల్ గా ఉంటుంది. సగం కర్టెన్ లేవగానే స్వాగతం అన్న కార్డ్ స్కీన్ మీద పడుతుంది. ఆ తర్వాత హాలులో పొగ త్రాగరాదు అని వేస్తారు. మరేం ఫర్వాలేదు. నీ దగ్గర సిగరెట్ ఉంటే ముట్టించమని దాని అర్థమన్నమాట. ఆ తర్వాత నిశ్శబ్దం అన కార్డ్ పడుతుంది. మనం ఎలెర్ట్ అవ్వాలి. మొదట న్యూస్ రీల్ పడుతుంది. గంభీరమైన కంఠంతో వాడెవడో –
‘బీహార్ లో వరదలు..
వేలాది మంది నిరాశ్రయులయ్యారు.
సిక్కింలో కొండ చరియలు విరిగిపడి వందలాది మంది మృతి.. ఇలాంటి భయపెట్టే వార్తలు చెప్పి, చివర్లో క్రీడలు అంటూ హాకీలో భారత్‌కి స్వర్ణం అంటూ ముగిస్తాడు. ఈ న్యూస్ రీలర్ చూడటానికి భలేగా ఉంటుందిరా. మిస్ కాకూడదు. అది అయ్యాక మళ్ళీ నిశ్శబ్దం అన్న కార్డ్ పడుతుంది. సినిమా మొదలవుతుందనే అనుకుంటాము. కానీ కాదన్న మాట. ఈసారి రాబోయే సినిమాల గురించి ట్రైలర్స్ వస్తాయి.
భయంకర పోరాటాలు.
మత్తెక్కించే పాటలు.
ఆనంద పరిచే నృత్యాలు.
ఉత్కంఠ కలిగించే సన్నివేశాలు.
మీ అభిమాన థియేటర్‌లోకి.. త్వరలో.. అతి త్వరలో.. అంటూ సాగుతుంటుంది ఈ సినిమా ట్రైలర్. ఆ తర్వాత నిజం సినిమా మొదలవుతుందన్న మాట. టైటిల్స్ జాగ్రత్తగా చూడాలిరా. ఏ బ్యానర్ క్రింద రిలీజ్ అయిందీ, నిర్మాత ఎవరు, దర్శకుడు ఎవరు. ముఖ్య పాత్రలను ఎవరు పోషించారు. పాటలు పాడింది ఎవరు.. రాసింది ఎవరు. డైలాగ్‌లు ఎవరు రాశారు. ఫోటోగ్రఫీ ఎవరు.. ఆర్ట్ డైరెక్టర్ ఎవరు.. ఇలా అన్నీ జాగ్రత్తగా స్కీన్ మీద చదివి బుర్రలోకి ఎక్కించుకోవాలి తెలుసా. సినిమా కథ కూడా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. శుభం కార్డ్ పడే లోపుగానే హడావుడిగా బయటకు వెళ్ళిపోకూడదు.
ఇలా చెప్పేవాడు వాడు. అంత శ్రద్ధగా నేను ఏ సినిమా చూసేవాడ్ని కాదనుకోండి. నాకు మరో ఫ్రెండ్ విష్ణు ఉండేవాడు. వాడూ నేనూ సినిమా బాగోలేకపోతే మధ్యలోనే లేచి బయటకు వెళ్ళిపోయే వాళ్లం. కానీ ఇక్కడా ఒక ఇబ్బంది ఎదురయ్యేది. మధ్యలో బయటకు వెళతామంటే గేట్లు ఓ పట్టాన తెరువరు. కాసేపు వాగ్వాదం చోటు చేసుకునేదన్న మాట. చివరకు గేటు తెరవడం మేము బయటకు వెళ్ళి ఊపిరి పీల్చుకోవడం వంటి సంఘటనలు అప్పుడప్పుడు జరిగేవి.
సినీమా పోస్టర్లు చూసి కథలు చెప్పేవారు, పాటల పుస్తకంలోని కథ చదివేసి సినిమా చూసినట్లు బిల్డప్‌లు ఇచ్చే వారు కూడా తారస పడేవారు.
సరే, లవకుశ సినిమా దగ్గరకు వెళదాం పదండి. నీలం పిల్లాడి పేరు కుశుడు. అచ్చు నాలాగే బక్కగా ఉన్నాడు. వాడి తమ్ముడు లవుడేమో ‘బల’రాముడిగా బొద్దుగా ఉన్నాడు. సినిమా చూసి ఇంటికొచ్చాక చాలా రోజుల పాటు నన్ను నేనే కాసేపు కుశుడిగా భావించుకునే వాడ్ని. ఇంట్లో నీలం రంగు పొడర్ ఉందా అమ్మా అని కూడా నాలుగైదు సార్లు అడిగాను. నీలం రంగు పౌడర్ ఉండి ఉంటే, అమ్మ ఇచ్చి ఉంటే నేను ఒళ్లంతా పట్టించుకుని కుశునిగా మారిపోయి పద్యాలు చెప్పాలనుకున్నాను. సినిమా వాళ్లకు దొరికిన నీలం పౌడర్ నాకెందుకు దొరకలేదా అని ఆ తర్వాత కూడా చాలా కాలం ఆలోచించాను. చాలా పెద్దయ్యాక తెలిసింది ఇదంతా మేకప్ కిట్ మహిమ అని. సినిమా వాళ్లు, నాటకాల వాళ్ల దగ్గర ఇలాంటి మేకప్ కిట్‌లు ఉంటాయని తెలిసింది.
జీవము నీవే కదా..:
లవకుశ తర్వాత నాకు బాగా నచ్చిన సినిమా 1967లో వచ్చిన భక్త ప్రహ్లాద. అప్పటికి నాకు పదేళ్లు వచ్చాయి. నేనేమీ చిన్న పిల్లవాడిని కానన్న ధీమా వచ్చేసింది. పాఠ్యపుస్తకాల్లోని చిన్న చిన్న పద్యాలు నేర్చుకోవడం అబ్బింది. అప్పుడప్పుడు సినిమా పాటలు కూడా పాడుతుండేవాడిని. భక్తప్రహ్లాద సినిమాలో ప్రహ్లాదుడు పాడిన పద్యాల్లో కొన్ని కంఠస్థం చేయగలిగాను. ఎప్పుడైనా బంధువుల ఇళ్లకు వెళ్ళినప్పుడు, ‘మా వాడు భక్తప్రహ్లాద సినిమాలో పద్యాలు భలేగా పాడతాడు..’ అంటూ నలుగురి ముందు అమ్మ గొప్పగా చెప్పేది. దీంతో నాకు బోలెడు ధైర్యం వచ్చేది. ‘అవును, పాడతాను’ అంటూ రెడీ అయ్యేవాడినన్న మాట. అమ్మో, నాన్నో అప్పుడప్పుడు మన ప్రతిభ గురించి గొప్పగా చెబుతుంటే హుషారు వచ్చేస్తుందనీ, దీంతో పిల్లలు ఆ పని పట్ల ఆసక్తి పెంచుకుంటారని కొంత మంది తల్లిదండ్రులకు తెలియదనుకోండి.
‘జీవము నీవే కదా
బ్రోచే భారము నీవే కదా..’
అంటూ సాగే పాట అంటే నాకు బోలెడు ఇష్టం. ఈ పాట ఎవరన్నా పాడమనగానే పాము ఎక్కడుందా అని వెతుక్కునే వాడ్ని. నిజం పాము కోసం కాదనుకోండి. పాము లాగా మెడలో ఓ చిన్న తాడో, రిబ్బనో వేసుకునేవాడ్ని. చక్కగా చేతులు జోడించి కళ్లు తన్మయత్వంతో మూసుకుని ‘జీవము నీవే కదా..’ అని పాడుతుంటే విన్నవారు భలేగా మెచ్చుకునేవారు.
నలుగురిలో భయం లేకుండా పాడటం, మాట్లాడటం అలా అలవాటైందన్న మాట. ప్రహ్లాదునిగా నేను పాడిన పద్యాలు విన్న మా చిన్న మామయ్య ఓసారి మెచ్చుకోవడం నాకిప్పటికీ గుర్తే. స్టేజి ఫియర్ పోవడానికి ఇలాంటి సంఘటనలు పనికొచ్చాయని తర్వాత అర్థమైంది.
లవకుశ, భక్తప్రహ్లాద చెప్పిన తర్వాత నమ్మిన బంటు గురించి చెప్పకుండా ఉంటే ఎలా, పైగా మా నాన్న మాకు చూపించిన మొదటి సినిమా కదా.
నాన్న – ‘నమ్మిన బంటు’:
మా నాన్నగారు సినిమాల గురించి ఇంట్లో మాట్లాడటం నేను వినలేదు. అలాంటి ఆయన ఓ రోజున ‘సినిమాకి బయలుదేరండర్రా’ అంటూ ఓ ఆజ్ఞలాంటిది ఇచ్చారు. ఈ మాటతో అందర్నీలోనూ బోలెడు సంతోషం వేసినా పైకి మాత్రం గంభీరంగా ఉంటూ ఎవరికి వారం తయారవుతున్నాము. మా నాన్న నోట మరో మాట కూడా వచ్చింది. ‘మనం ఫోటో కూడా తీసుకుంటున్నాం, కాస్త బాగా తయారవ్వండి’ ఆశ్చర్యం, ఆనందం కలిసి ఆకాశంలో చెట్టాపట్టాలేసుకున్నాయి.
సాయంత్రం ఐదు కాగానే నాన్నగారు ఆఫీస్ నుంచి వచ్చేసి హడావుడిగా బయలుదేరదీశారు. అప్పుడు మేమున్నది గుంటూరులోని బ్రాడీపేటలో అన్న మాట. రెండు రిక్షాల్లో బయలుదేరాము. ఒక రిక్షాలో అమ్మా నాన్న కూర్చుంటే, రెండో రిక్షాలో ముగ్గురు పిల్లలం కూర్చున్నాము. రిక్షా బ్రాడీపేట దాటి ఓవర్ బ్రిడ్జ్ ఎక్కి క్రిందకు దిగి ఏసీ కాలేజీ, జిన్నా టవర్ మీదగా రాధాకృష్ణ పిక్చర్ ప్యాలెస్ దగ్గరకు వెళ్ళింది. అక్కడకు దగ్గర్లోనే ఉన్న ఓ ఫోటో స్టూడియోలో మేమంతా గ్రూప్ పోటోలు దిగాము. ఇదే మా మొట్టమొదటి ఫ్యామిలీ ఫోటో అన్నమాట. అక్కడి నుంచి సినిమా హాల్‌కి తీసుకువెళ్ళారు. ఈ సినిమా హాలుకి ప్రక్కనే వేంకటేశ్వరస్వామి ఆలయం ఉంది. నాన్నగారు ఈవో కనుక ఆలయంతో పాటు ఈ సినిమా హాలు వాళ్ల దగ్గర పలుకుబడి ఉన్నట్లుంది. మేము రాగానే హాలు వాడు మమ్మల్ని వీఐపీల్లా లోపలకి తీసుకువెళ్ళి, రిజర్వ్ క్లాస్‌లో ఒక మూలన ఉన్న ఐదు సీట్లు చూపించాడు. ఇంటర్వెల్‌లో కూల్ డ్రింక్ బాటిల్స్ వచ్చాయి. ఇంతకీ మేము చూసిన ఆ సినిమా ఏమిటో తెలుసా..
నమ్మిన బంటు. అక్కినేని, సావిత్రి నటించిన చిత్రం. ఆ వయసులో సినిమా కథ అర్థం కాలేదు కానీ, నాన్నగారు సినిమా పూర్తిగా చూడకుండా మధ్యమధ్యలో లేచి బయటకు వెళ్లడం మేము గమనించాము. ఆ తర్వాత అమ్మని అడిగాను. ఎందుకని నాన్న అలా చేశారని. ‘మరేం లేదురా, హాలు ప్రక్కనే గుడి ఉంది కదా. ఈయన ఆఫీస్ పని చేసుకుంటూనే మనకు సినిమా చూపించార్లే’ అంది. ఇప్పుడు ఆలోచిస్తుంటే నాకు అర్థమవుతోంది ‘నమ్మిన బంటు’ అంటే ఏమిటో, ఎవరో.
గుంటూరులోనే మరికాస్త పెద్దయ్యాక ఆ రోజుల్లో కొత్తగా కట్టిన రంగమహల్ థియేటర్‌లో నేనొక్కడినే సినిమాకు వెళ్ళాను. ఇదో సాహసమే. నెల రోజులుగా అమ్మ దగ్గర నుంచి తీసుకున్న డబ్బులు పోగేసి ఓ రోజు ఫ్రెండ్ వాడింటికి వెళుతున్నానని చెప్పి మాట్నీ వేళకు రంగమహల్కి చేరుకున్నాను. ఈ థియేటర్‌లో హిందీ సినిమా ఆడుతోంది. శేషమహల్‌కి ప్రక్కనే ఉంటుంది ఈ రంగమహల్. కొత్త థియేటర్ భలేగా ఉంటుందిరా అని స్కూల్లో ఫ్రెండ్స్ చెప్పడంతో ఈ సాహసం చేశాను. ఆ హిందీ సినిమా గొప్పదేమీ కాదు. లోపలకు వెళితే అసలు జనం లేరు. నాకు భయం వేసింది. బిక్కుబిక్కుమంటూ కూర్చున్నాను. దీనికి తోడు హిందీ కావడంతో కథ అర్థం కాలేదు. సినిమాలో కాసేపు పల్లెటూరి వాతావరణం, అంతలో మరి కాసేపు పట్నం సీన్లు దొర్లాయి. అరుచుకుంటున్నారు, కొట్టుకుంటున్నారు, అంతలో పాడుకుంటున్నారు. చేతికి వాచీ పెట్టుకునేటంతటి పెద్దోడిని కానుగా నేను. మాట్నీ షో అయినా గేట్లు మూసేసి చీకటి చేయడంతో కాసేపు ఆవగానే టైమ్ ఎంతైందో తెలియక బయట చీకటి పడిపోయిందేమో, అమ్మనాన్న అరుస్తారేమో అన్న దిగులు ఎక్కువైంది. నా అదృష్టం పండింది. ఇంటర్వెల్ కార్డ్ పడింది. లైట్లు వెలిగాయి. తలుపులు తీశారు. నేను పరిగెత్తుకుంటూ బయటకు వచ్చేశాను. గేటు వాడ్ని బతిమాలి రోడ్డెక్కాను. తీరా చూస్తే ఇంకా ఎండ బాగానే ఉంది. మిగతా సినిమా చూడకుండానే ఇంటికి చేరాను. ఇంట్లో వాళ్లు నా సాహసం గుర్తించలేదు. ఇలాంటి సాహసకృత్యాలు గుర్తించినా వారు మెచ్చుకోరు కదా. అందుకే కొన్ని సాహసా కార్యాలు మనలోనే ఉండిపోతాయన్న మాట.
పెద కాకాని తిరనాళ్లకు వెళ్ళినప్పుడు 16ఎంఎం ప్రొజెక్టర్‌తో వేసిన సినిమాని వీధిలో చూశాను. అదో వింత అనుభవం. సినిమా అంటే హాల్‌కి వెళ్ళాలన్న పద్ధతికి భిన్నంగా వీధిలోనే చిన్న తెరగట్టి దాంట్లో సినిమా చూపించడం విడ్డూరంగానే అనిపించింది. చిన్న తెరమీద సత్య హరిశ్చంద్ర, సత్యమేవ జయతే వంటి సినిమాలు చూశాను. స్కూల్‌లో చదువుకుంటున్న రోజుల్లో ఎడ్యుకేషన్ మూవీస్ అంటూ వీటిని చూపించే వారు. అలాగే కొన్ని సినిమాలకు స్టూడెంట్ కన్సెషన్ ఉండేది. గుంటూరు హరిహర మహల్‌లో ఓ సారి విద్యార్థులకు పావలాకే సినిమా (‘నిండు సంసారం’ అనుకుంటా) చూపించారు. ఇలా సినిమా ముచ్చట్లు ఇంకా చాలానే ఉన్నాయి. సందర్భోచితంగా మరి కొన్ని చెబుతాను.
(మళ్ళీ కలుద్దాం)