ఎవరి దారి వారిదే..!

0
3

[శ్రీ యన్. వి. శాంతి రెడ్డి గారు రచించిన ‘ఎవరి దారి వారిదే..!’ అనే టీనేజ్/వేదాంత కథ అందిస్తున్నాము.]

[dropcap]ఋ[/dropcap]షికేశ్ నుండి ఆంధ్రా వచ్చిన తర్వాత నాలుగైదు ఆశ్రమాలు ఆశ్రయం ఇస్తామని నన్ను ఆహ్వానించాయి. అలా ప్రతీ ఆశ్రమానికి వెళ్లి పరిశీలించాను. వసతి బావుంటే భోజనం బావుండలేదు. ప్రతి చోటా తామస, రాజసిక ఆహారాలు మాత్రమే వడ్డిస్తున్నారు. ఋషికేశ్‌లో నిర్మల్ ఆసుపత్రి వారి సూచన మేరకు నేను ఉప్పూ, కారం, పులుపు లేని భోజనమే చెయ్యాల్సి వుంది. అందుకని ఆశ్రమాల వేట కొనసాగిస్తుండగా పరిచయమైన ఆ దొడ్ల సుధాకర రెడ్డి సలహాతో ఈ ధ్యాన జగతికి వచ్చి సెటిల్ అయ్యాను.

ఇక్కడి వాతావరణం సాత్వికం, ఆహారం బహు సాత్వికం! ధ్యానం చేసుకోడానికి పత్రి మారాజ్ స్థాపించిన పిరమిడ్లు వున్నాయి! ఉదయం యోగా, మెడిటేషన్ క్లాస్‌లు వున్నాయి. సాయంత్రం సత్సంగాలు జరుగుతాయి. మనం చదువుకొని వచ్చిన వేదాంత శాస్త్రం ప్రసంగాలు చెయ్యవచ్చు! అప్పటికే స్వామీ బ్రహ్మ విద్యానంద సరస్వతీ, స్వామిని సద్విద్యానంద సరస్వతీ అక్కడున్నారు. ఒకరు బ్రహ్మ సూత్రాలు, ఒకరు భగవత్ గీత ప్రవచనం చేస్తున్నారు. నన్ను ఉపనిషత్తుల భాష్యం చెప్పమని అడిగితే ఆనందంగా ఒప్పుకున్నాను! ఋషికేశ్ దయానంద సరస్వతి ఆశ్రమంలో నాకున్న అనుభవాన్ని బట్టి జగతి గ్రంథాలయ బాధ్యతను నా మీద పెట్టారు ధ్యాన జగతి జనరల్ సెక్రెటరీ దొడ్ల సుధాకర రెడ్డి గారు. ఆనందంగా స్వీకరించాను. ఉదయం పది గంటల నుండి పన్నెండు గంటల వరకు లైబ్రరీ తెరచి ఉంచుతాను.

ఆ రోజు లైబ్రరీ తెరచి శాంతి పత్రిక తీసుకొని చూస్తున్నాను. ఇద్దరు ఆశ్రమవాసులు వచ్చి పుస్తకాలు చదువుకుంటున్నారు. గుమ్మం దగ్గర అలికిడికి అటు చూసాను. అప్పుడప్పుడే యవ్వనం లోకి అడుగు పెడుతున్న నూనూగు మీసాల యువకుడు లోపలికి రావడానికి సందేహిస్తున్నాడు. మొహమాట పడుతుంటే నేను లోపలకు పిలిచాను నవ్వుతూ.

“మీరు హిమాలయాల నుండి వచ్చారట కదా? రిసెప్షనిస్ట్ నూలు నారాయణ పంపించారు” అన్నాడు.

“అవును నాతో మాట్లాడాలా?” అడిగాను

“అవును.. చాలా..!” అన్నాడు.

“సరే అయితే రా ఇలా వచ్చి కూర్చో! నాది ఒకే షరతు. అన్నీ నిజాలే చెప్పాలి. చాలా మంది అసలు విషయం దాచి పెట్టి కల్పించి చెపుతారు. అలాంటి వారికి కృత్రిమ సలహాలు మాత్రమే లభిస్తాయి.” అన్నాను

“అలాగే! నాదీ ఓ షరతు.” అన్నాడు.

“ఏంటి?” వెరైటీగా అనిపించాడు నాకు.

“నేను మాట్లాడిన విషయాలు మీరు కూడా మరెవరి వద్దా ప్రస్తావించరాదు” చాలా తెలివైన వాడిలా వున్నాడని పించింది.

“సరే! అలాగే! ప్రామిస్!” అన్నాను.

“నా పేరు భరణి. ఇంటర్ పరీక్షలు రాశాను. ఇంక చదవాలని లేదు. మానేస్తాను” అన్నాడు దృఢంగా

“మానేసి..?” అడిగాను

“ఏదైనా అడవులకు, వీలయితే హిమాలయాలకు వెళ్లి తపస్సు చేసుకోవాలని వుంది” అన్నాడు భరణి.

“తపస్సా? ఎందుకు?” అడిగాను ఆతృతగా.

“నాకు చాలా సమస్యలున్నాయి. సన్యాసం తీసుకొని వాటి నుండి  విముక్తి పొందుతాను” అన్నాడు.

“చూడూ! సన్యాసం సమస్యలకు పరిష్కారం కాదు. ఒక వేళ అదే నిజమైతే ఈ ప్రపంచంలో ప్రతీ ఒక్కరూ సన్యాసం తీసుకుంటారు. మామూలు మనిషి ఒక్కడూ కనిపించడు” అన్నాను.

“మరి.. సన్యాసం ఎందుకు తీసుకుంటారు? ఎప్పుడు తీసుకోవాలి?” చాలా అమాయకుడు అనిపించింది.

“సన్యాసం తీసుకోడానికి ఎవరి కారణాలు వారికుంటాయి. ముఖ్యంగా తమని తాము తెలుసుకోడానికి ఆ దీక్ష స్వీకరిస్తారు. ఇక పోతే నీ రెండో ప్రశ్నకు సమాధానం చెబుతాను విను! సన్యాసం తీసుకున్నా ఒకటే తీసుకోకపోయినా ఒకటే అనే భావం కలిగినపుడు సన్యాస దీక్ష తీసుకోవాలి! తెలిసిన దెయ్యం తెలియని దెయ్యం కంటే ఉత్తమం. సన్యాసం నీకు తెలియని దెయ్యం!” చెప్పాను.

“అంటే..?” కంగారుగా అన్నాడు భరణి.

“అంటే.. కర్తృత్వం స్వయంగా జారి పోయినప్పుడు.”

“మరి.. ప్రపంచంలో దుఃఖానికి కారణం?” అడిగాడు భరణి.

“భగవాన్ బుద్ధుడు ఎప్పుడో చెప్పాడు సర్వం దుఃఖమని, దుఃఖానికి కారణం అజ్ఞానమేనని, అజ్ఞానానికి కారణం అవిద్య అని, దానికి పరిష్కారం జ్ఞానమేనని, ద్వైత ప్రపంచ భావన సమసిపోయి, నామ రూప బుద్ధి, దేశ బుద్ధి, కాల బుద్ధి. అందరూ విడిచి పెట్టేస్తే అప్పుడీ లోకంలో దుఃఖానికి చోటే వుండదు!” చెప్పాను.

“ఈ చర్చ ఇలా ఉంచుదాం! నీ గురించి వివరంగా చెప్పు! ఎందుకు చదువు మానేయాలని పించినది? ఈ అడోలసెంట్ (Adolescent) ఏజ్‌లో ఈ విపరీత ధోరణులు మంచిది కాదు” అన్నాను.

“శాంతి నివాసం అని పేరెట్టుకున్న మా ఇంట్లో ఎప్పుడూ అశాంతే తాండవిస్తుంది. మా అమ్మా, నాన్నా ఎప్పుడూ వాదించుకుంటూనే ఉంటారు. ఇగో ప్రాబ్లెమ్. ఒకరు అవునంటే మరొకరు కాదంటారు. నిజాలు నా కళ్ళ ముందే ఖూనీ చేయబడతాయి. అబద్ధాలకే పెద్ద పీట వేస్తారు. నన్ను నిజం చెప్పాలంటూ వాళ్ళు అబద్ధాలే మాట్లాడుతారు. నిజానికీ అబద్ధానికి మధ్య నలిగి పోతున్నాను. బయటి వాళ్ళు ఏమైనా అడిగితే నేను నిజం చెప్పాలో, అబద్ధం చెప్పాలో కూడా వాళ్ళే డిసైడ్ చేస్తారు. ఇంటి దగ్గర ఇలా వుంటే ఇక కాలేజ్‌లో కూడా అదే తంతు! మా ఫిజిక్స్ లెక్చరర్ సుబ్బారావుకు సిగరెట్లు మేమే తేవాలి, మందు బాటిల్ మేమే తేవాలి. ఆయనకు కెమిస్ట్రీ మేడంకూ మధ్య పోస్ట్‌మాన్ కూడా మేమే! ఎదురు తిరిగితే ప్రాక్టికల్స్‌లో సున్నాలే గతి!” సమస్యను నాముందుంచాడు భరణి.

“చూడు భరణీ! నీ గురించి, జగత్తు గురించి నీవు ఏర్పరుచుకున్న తప్పుడు భావాలే నీ మానసిక ఒత్తిడికి కారణం! నీవు చూస్తున్న వారూ, నామరూపాత్మకమైన ఈ ద్వంద్వాలు నీవు సృష్టించుకున్న జగత్తులోనివే గాని అన్యం కాదు. నిజానికి నీవు తప్ప రెండోది ఏది లేదు. నిద్రలో నీవు తప్ప మరెవరూ, మరేదీ వుండదు. నిద్ర లేవగానే ఒక్కొక్కరు ఒక్కొక్కటి నీ భావన లోకి వస్తాయి. దీన్నే నిత్య సృష్టి – నిత్య ప్రళయం అంటారు. నీవు సృష్టించుకున్న జగత్తులో కొన్ని నీకు నచ్చేవి కొన్ని నచ్చనివి వుంటాయి. అది నీ మనసు కల్పించే భ్రమ. మనసు మనిషికి ఒక పనిముట్టుగా వుండాలి గానీ మనసుకు పట్టాభిషేకం చేసి దానికి బానిసై పోతాడు మనిషి! నీ సమస్యలకు కూడా కారణం నీ మనస్సే!” చెప్పాను.

“మీరేం మాట్లాడుతున్నారో నాకు ఏ మాత్రం తెలియడం లేదు” అన్నాడు భరణి.

“అది తెలియడానికి సాధన చెయ్యాలి. తపస్సు చెయ్యాలి. తపస్సు అంటే కష్టాలను సహించాలి. చలి – వేడి, సుఖం – దుఃఖం ఆదిగా వున్న ద్వంద్వాలను సహించ గలగాలి. పక్షి తను వాలిన చెట్టు కొమ్మ మీద ఆధారపడి వుంటుందని అందరూ భావిస్తారు. కానీ అది తన రెక్కల మీద మాత్రమే ఆధారపడుతుంది. అలాగే నీవు నీలోని బ్రహ్మత్వం మీదే ఆధారపడి వుండాలి! డు యూ నో.. ఒన్ విత్ ది సెకండ్ ఈస్ డ్యూయాలిటి. ఒన్ వితౌట్ సెకండ్ ఈస్ అద్వైత! మనిషికి గతం గుర్తొస్తే బాధ, భవిష్యత్తు భావన చేస్తే భయం కలుగుతాయి! యాస్ లాంగ్ యాస్ యూ ఆర్ సీకింగ్ హ్యాపీనెస్/సెక్యూరిటీ; యూ విల్ రిమైన్ అన్‌హ్యాపీ/ఇన్‌సెక్యూర్!

తలుపు తెరవాలన్నా, బండి ముందు కెళ్ళాలన్న రెండే మార్గాలు ‘పుష్/పుల్’! పడవ మీద ఎక్కితే అది నిన్ను ఆవలి తీరానికి చేరుస్తుంది కానీ దాన్ని పూజిస్తూ కూర్చుంటే నిన్ను ఎక్కడకూ తీసుకెళ్ళదు. ఈ రోజుల్లో దేవుడికి దండం పెట్టేది గౌరవం, ప్రేమా, భక్తితో కాదు భయంతో పెడుతున్నారు! సరిగా ఆలోచించడం తెలియని మూర్ఖులు గుడ్డిగా నమ్ముతుంటారు! ఆ నమ్మకమే ఈనాటి మతాల బలం! ఇప్పుడు నడుస్తున్న ఆశ్రమాలు – పీఠాలు- దేవాలయాలు మార్కెట్టులో వున్న దుకాణాలతో సమానం. నీ ఆందోళనకు కారణం విచారణలో భయాన్ని, నమ్మకంలో బలాన్ని వూహించుకోడమే! సరిగా ఆలోచించడం మొదలుపెట్టు! తపస్సు చేసుకోవడానికి, హిమాలయాలకు వెళ్ళడానికి తొందర పడొద్దు. నీ చదువు మానేయాలని ఆలోచన విరమించుకో! మన దేశంలో వున్న సన్యాసి మహాత్ములలో చాలా మంది పీజీలు పిహెచ్‌డిలు చేసినవారే!” అంటూ నా ప్రసంగం ముగించాను.

నా సలహాలు భరణికి రుచించినట్లు లేవు. అసహనంగా కదిలాడు. లేచి నిలబడ్డాడు.

“బుద్ధి తక్కువై మీదగ్గర కొచ్చాను. నేను అనుకున్నది సాధించడానికి వెళుతున్నాను” అంటూ విసవిసా నడుచుకుంటూ బయటికి వెళ్లిపోయాడు.

ఎప్పుడో ఎక్కడో ఒక మహాత్ముడి రూపంలో దర్శనమిస్తాడేమో అనుకుంటూ నా పనిలో బడి ఆ విషయం మర్చిపోయాను!

***

ఆ రోజు రెండవ శనివారం. వరుసగా రెండు రోజులు సెలవులు కావడంతో ధ్యాన జగతికి ఉదయం నుండే సందర్శకుల తాకిడి మొదలయ్యింది. పిరమిడ్లు, సరోవరాల మధ్యలో ఉన్న పర్ణ కుటీరాలకు సందర్శకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. సుధాకర రెడ్డి గారు సెక్యూరిటీ సిబ్బంది  పెంచారు. రెండు వందల మందికి అదనంగా వంటలు కూడా చేయించారు. సందర్శకులలో కొంత మంది లైబ్రరీని కూడా చూడటానికి వస్తుంటారు. ఒక అరగంట ముందు గానే లైబ్రరీ తెరచి కూర్చున్నాను.

ఒకతను ఇన్సర్ట్ చేసుకొని నీటుగా తయారై వచ్చాడు. యాభై సంవత్సరాలు వుండవచ్చు. నమస్కరించాడు.

“నా పేరు జనార్దన్, మేనేజర్, యూనియన్ బ్యాంక్ అఫ్ ఇండియా, ఆదికవి నన్నయ యూనివర్సిటీ బ్రాంచ్” – పరిచయం చేసుకున్నాడు. నేను చిరునవ్వుతో ఆసనం చూపించాను. “నిన్న బ్రాంచ్‌కి వచ్చినప్పుడు సుధాకరరెడ్డి మీ గురించి చెప్పారు. మిమ్మల్ని కలిస్తే సమస్యల్లో వున్న నాకు సాంత్వన లభిస్తుందని చెప్పారు.” అన్నారు.

“అలాగే జరగాలని ఆశిద్దాం!” అన్నాను.

“మాకొక అమ్మాయి. పేరు భవ్య. డిగ్రీలో జాయిన్ చెయ్యాలి. చదవనని మొండికేస్తుంది. ఈమధ్య కాలంలో చాలా దిగులుగా వుంటుంది. ఆత్మహత్య కూడా అటెంప్ట్ చేసింది. ఏ విధమైన సమస్యలు లేని మాకు ఇదో పెద్ద సమస్య అయ్యింది. ప్రతి క్షణం కనిపెట్టుకొని వుండాల్సి వస్తుంది. ఈ విషయంలో మీరు నాకు సరైన మార్గం చూపించగలరని ఆశిస్తున్నాను” అన్నారు జనార్దన్.

“నా సలహా వల్ల మీ సమస్య పరిష్కారమైతే నా కంటే భాగ్యవంతుడు వుండడు. ఆ ఈశ్వరుడు అలాగే దీవించాలని ఆశిద్దాం! మీ అమ్మాయిని తీసుకువచ్చారా?” అడిగాను

“లేదు. అవసరమైతే తీసుకొస్తాను” అన్నారు జనార్దన్.

“రేపు పంపించండి. మీరు అమ్మాయితో రావద్దు” అన్నాను.

“అలాగే” అన్నారు జనార్ధన్.

“చూడండి జనార్దన్! సంసారంలో సమస్యలుంటాయి. సమస్యలకు మరో పేరే సంసారం. సంసారులు ఒక దానిని పొందటానికి ఎంత కష్టపడతారో దానిని విడిచి పెట్టాలంటే అంత కన్నా ఎక్కువ కష్టపడతారు. సంసార వృక్షం అవ్యక్తం నుండి ప్రభవించింది. దాని బుద్ధి వృక్షం మొదలు, అహంకారం శాఖలు, మహా భూతాలు ఉప శాఖలు, ఇంద్రియాలు తొర్రలు, ఎడ తెగని ఆశలే చిగుళ్ళు, శుభ అశుభములే ఫలాలు అట్టి సంసార వృక్షాన్ని జ్ఞానం అనే కత్తితో శేషం మిగలకుండా తెగ నరికినవాడు అవశ్యం బ్రహ్మ పదం పొందుతాడని మహా భారతంలోని అశ్వమేధ పర్వం చెబుతుంది. గొంతులో అడ్డు పడ్డ కప్పను పాము మింగాలేదు, బయటికి కక్కాలేదు. అలాంటి పాము లాంటి వారు సంసారులు! శిశువు జన్మించినప్పుడు చాలా స్వచ్ఛంగా వుంటుంది. తర్వాత తల్లిదండ్రుల వల్ల, ఉపాధ్యాయుల వల్ల, భాషల వల్ల, కాలం వల్ల, పరస్పర విరుద్ధమైన భావజాలం వల్ల కలుషిత మౌతుంది. తమను తాము తెలుసు కొనే జ్ఞానం కొద్ది మంది మాత్రమే కలిగి ఉంటారు! ఇకపోతే నేను మీకిచ్చే సందేశం ఏమంటే భార్య నందు భార్య దృష్టి నీ, కుమార్తె యందు కుమార్తె దృష్టినీ, అలాగే మిత్రుని యందు శత్రువు నందు ఆ యా దృష్టి కోణాలను విడిచి పెట్టి వారి యందు బ్రహ్మత్వమును, దివ్యత్వమును, సత్యాత్మను సందర్శించడం అభ్యాసం చెయ్యండి! మీ గృహం ప్రేమకు నిలయం కావాలి గానీ సరిహద్దు కాకూడదు!!” అంటూ ముగించాను.

“ధన్యవాదాలు! విలువైన సందేశం ఇచ్చారు. రేపు మా అమ్మాయిని తీసుకొచ్చి లైబ్రరీకి పంపించి నేను దొడ్ల సుధాకర రెడ్డి గారి కుటీరంలో కూర్చుంటాను” అంటూ వెళ్ళడానికి లేచాడు.

“మంచిది! మీకు శుభం కలుగుతుంది!” అంటూ వీడ్కోలు పలికాను.

***

తరవాత రోజు ఆదివారం లైబ్రరీకి సెలవు. కానీ జనార్దన్‌ను రమ్మన్నాను కాబట్టి టైం కి వెళ్ళాను. లైబ్రరీ ముందు ఒక మెరుపు తీగ లాంటి టీనేజ్ అమ్మాయి ఎదురు చూస్తుంది.

“నీ పేరు.. భవ్యా?” అడిగాను. ఆ అమ్మాయిలో ఏదో ప్రత్యేక మైన ఆకర్షణ వుంది. ఆ వయసే కారణమేమో!

“అవును అంకుల్! డాడీ నన్ను ఇక్కడ డ్రాప్ చేసి రెడ్డి గారి కుటీరానికి వెళ్ళారు” అంది.

లోపల కూర్చున్నాము.

“చూడు భవ్య ! నీవు ఏమి మాట్లాడాలన్నా నిర్మొహమాటంగా భయం లేకుండా మాట్లాడు. దయచేసి అబద్ధాలు మాత్రం చెప్పకు! మనం మాట్లాడుకున్న మాటలు మనిద్దరి మధ్యే వుంటాయి” అన్నాను.

“అంకుల్! ఈ లోకంలో ఒకరిని ఒకరు మోసం చేసుకోవడమే వుంటుందా? మోసం ప్రాతిపదిక మీదనే ఆధారపడి ఈ సృష్టి జరిగిందా?” ఆవేశంగా అడిగింది.

“చూడమ్మా! మోసం చేసే వాని లోను మోసగింపబడే వాని లోను వున్నది ఒకే ఆత్మ చైతన్యం! కానీ ఇద్దరిలా భాసిస్తారంతే! ఇది అర్థం చేసుకోడానికి చాలా సాధన చెయ్యాలి. అందరిలోనూ, అన్నిటి లోనూ వున్నది ఒకే ఆత్మ చైతన్యం. ‘మమాత్మా సర్వభూతానాం’ అన్న గీతా వాక్యం అదే చెబుతుంది. భగవత్ గీతా, బ్రహ్మ సూత్రాలు, ఉపనిషత్తులు కూడా సర్వాత్మ భావాన్నే బోధిస్తున్నాయి!” చెప్పాను.

“ఈ విషయాలు అర్థం కావాలంటే వేదాంత శాస్త్రం చదువుకోవాలా?” అడిగింది భవ్య.

“శాస్త్రం ఆత్మ అంటే ఏమిటో చెప్పదు. ఏది ఏది ఆత్మ కాదో చెబుతుంది. శాస్త్రం ఆత్మను ఆవరించి ఉన్న అద్యారోప దోషములను తొలగించడంలో ఉపయోగ పడుతుంది. శిష్యుడు జ్ఞానం పొందే వరకే దేవుడైనా, గురువైనా, శాస్త్రమైనా ఆత్మ స్వరూపాన్ని తెలుసుకున్నాక తనకూ, గురువుకూ, దేవుడికీ, మరి దేనికీ తేడా లేదని అన్నీ ఒకటే నని తెలుస్తుంది! ఆత్మ నేత్రములకు నేత్రము. ఆత్మను గ్రంథాలలో వెదక రాదు. పంచ కోశములలో వెదకాలి. నిన్ను నీవు చిన్మయిగా భావిస్తే అందరూ అలానే కనిపిస్తారు! సత్యాన్ని అన్వేషించాలనే అభిలాష కల వారికే వేదాంతం!” చెప్పాను.

“జ్ఞాన యోగం అంటే ఏమిటి?” అడిగింది.

“జ్ఞానం అంటే తెలుసుకోవడం, యోగం అంటే చెయ్యడం. అంటే ఒక కర్మను తెలిసి చెయ్యడము. నీ గురించి నీకు తెలియనంత వరకూ నీవు ఏర్పాటు చేసుకున్న ఏ రిలేషన్‌షిప్ అయినా ఆఖరికి దేవుడితో నైనా సరే నీకు దుఃఖాన్నే కలిగిస్తుంది. నీ గురించి నీకు తెలిస్తే ఈ జగత్తు గురించీ, దేవుడి గురించి కూడా నీకు తెలుస్తుంది. ‘నేను’ అది కాదు, అది నేను కాదు (అహం ఇదం న) అనే సత్యం నీకు అవగతం కావాలి మొదట! సరే ఇక నీ గురించి చెప్పు! ఎందుకు చేసావా పని” ఆత్మహత్యా ప్రయత్నాన్ని సూటిగా ప్రశ్నించాను.

రంగులు మారిపోయాయి భవ్య మోహంలో. మెల్లగా చెప్పడం ప్రారంభించింది.

“ఆర్థిక ఇబ్బందులు లేని ఫ్యామిలీ మాది. నాన్న బ్యాంక్ మేనేజర్, అమ్మ కాలేజ్ లెక్చరర్. మా క్లాస్‌మేట్స్ చాలా మందికి బోయ్ ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్లంతా చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు అనే ఫీలింగ్ కలిగేది. నేను ఏదో పోగొట్టుకుంటున్నాననే రాంగ్ నోషన్ పెంచుకొని నా జీవితాన్ని నాశనం చేసుకున్నాను. నాకు పరిచయమైన ఆ మోహన్‌తో సినిమాలకు, షికార్లకు తిరగడం మొదలు పెట్టాను. ఏది చేసినా పెద్ద అచీవ్‌మెంట్‌లా అనిపించేది. అది పెద్ద అగాధమని, దుఃఖానికి హేతువు అనీ తెలిసేటప్పటికే పీక లోతు వూబిలో దిగబడి పోయాను. తన కోర్కె తీర్చుకొనే వరకు తియ్యగా మాట్లాడిన మోహన్ నేను నగ్నంగా పడుకున్న ఫొటోస్ తీసి డబ్బుల కోసం బ్లాక్‌మెయిల్ చెయ్యడం మొదలుపెట్టాడు. అవకాశం ఉన్న మేరకు ఇచ్చాను. నా బంగారు నగలన్నీ తెచ్చి ఇచ్చెయ్యమని లేకపోతే నా నగ్న ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరించాడు. ఈ నా సమస్యలకు ఆత్మహత్యే పరిష్కారమని భావించి ఆ ప్రయత్నం చేశాను. ఆ ప్రయత్నంలో కూడా ఫెయిల్ అయ్యాను. జీవించి ఉన్న శవంలా మిగిలి వున్నాను. ఏ క్షణంలో ఏమి జరుగబోతుందో ప్రతి క్షణం నరకాన్ని అనుభవిస్తున్నాను” అంటూ వెక్కి వెక్కి ఏడ్వడం మొదలు పెట్టింది. మనసు లోని భారమంతా దిగి పోయే వరకు ఏడవనిచ్చాను.

“భవ్యా! రిలాక్స్! డోంట్ బి ఎమోషనల్! కంట్రోల్! ఆ మోహన్ సంగతి నేనూ సుధాకర రెడ్డి గారు చూసుకుంటాం! జన్మలో నీ జోలికి రాకుండా చూసే బాధ్యత మాది. గతమంతా మర్చిపో! ఇఫ్ యూ ఎక్స్‌పీరియన్స్ పెయిన్ ఇన్ రిలేషన్‌షిప్, దట్ ఈస్ నాట్ లవ్. అండ్ ఇట్ ఈజ్ అటాచ్మెంట్ ఓన్లీ. ఇఫ్ యూ డోంట్ ఎక్స్‌పీరియన్స్ ఎనీ ఫీలింగ్ ఇన్ రిలేషన్‌షిప్, దట్ ఈస్ లవ్ అండ్ ఫ్రీనెస్! మనసు శుద్ధి కావాలంటే భూతకాలం (బాధ) భవిష్యత్ (భయం) విషయ సుఖాలు (వర్తమానం) లను నీ నుండి తీసి వేయాలి. ఏది సత్యమో దానిని అసత్యంగా భావించేవారు లోక దృష్టి కలవారు. దీనికి పరస్పర విరుద్ధంగా ఉంటుంది శాస్త్ర దృష్టి! లేని దానిని పొందడానికి చేసే క్రియ కర్మ కాండ. ఏ మనిషికి కోరికలూ భయాలు వుండవో అతనికి ఏ కర్మల తోను, ఉపాసనల తోనూ పని లేదు. నీ కళ్ళతో చూసిన పువ్వు – నీ కళ్ళు మూసుకొని చూసిన (భావన చేసిన) పువ్వు రెండూ అసత్యమే! నీవు స్వయంగా చూసినప్పుడు కూడా పువ్వు తాను పువ్వు నని నీతో చెప్పదు. అది పువ్వని నీ మనస్సు చెబుతుంది. మనసు చెప్పింది సత్యమని అంగీకరించడానికి ప్రమాణం లేదు. వేదాలు ప్రమాణమని చెబుతుంటారు చాలా సందర్భాలలో కానీ అవి పరమార్థం కాదు! సాధన దృష్టితో చూస్తే వేదాలు ప్రమాణమే కానీ తాత్విక దృక్పథంతో చూస్తే వేదాలు కూడా మిధ్యే! ఒక నదిని దాటాక పడవను విడిచి పెట్టినట్టు, లక్ష్యాన్ని చేరుకున్నాక వేదాలను కూడా విడిచి పెట్టాలి! ఓకె భవ్య! చాలా చెప్పాను. ఆలోచించి నీ జీవితాన్ని తీర్చి దిద్దుకో!

మానవ జన్మ వచ్చింది మనల్ని మనం సంస్కరించు కోవడానికి, ఈ జనన మరణ చక్రం నుండి విడి వడి జన్మ రాహిత్యం పొందడానికే నని తెలుసుకో!” ప్రసంగం ముగించాను.

సమయం పన్నెండు గంటలు అయింది. లైబ్రరీ ముందు జనార్దన్ కారు ఆగింది. ప్రశాంతంగా వున్న కూతుర్ని చూడగానే ఆనందం అతని మోహం మీద చిరునవ్వు అయి వెలిసింది!

***

బయటి ప్రసంగాలు మానేశాను. ప్రయాణాలు మానేసి కూడా పది సంవత్సరాలు దాటింది. కానీ ఆ రోజు వచ్చిన ఏర్పేడు చిన్మయారణ్యం నుండి వచ్చిన వార్షికోత్సవ ఆహ్వానాన్ని కాదనలేకపోయాను. ఎందుకంటే సుధాకర రెడ్డి గారు కూడా నాతో వస్తామన్నారు. రిజర్వేషన్ చేయించారు. తిరుపతిలో ఇద్దరు స్నేహితులను కలుసుకొని ఏర్పేడు వెళ్ళాలని తిరుమల ఎక్స్‌ప్రెస్‌లో తిరుపతి స్టేషన్‌లో దిగి మమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి వచ్చే వారికొరకు చూస్తున్నాము. అప్పుడే బయటి నుంచి నలుగురు పిల్లలతో లోపలికి వస్తున్న దంపతులు కనిపించారు. చాలా గమ్మత్తుగా అనిపించారు. ఆమె చంకలో పసిబిడ్డ, అతని భుజం మీద చిన్న పిల్లాడు. ఇద్దరు పిల్లలు వారి చేతులు పట్టుకొని నడుస్తున్నారు. అందరూ తలనీలాలు సమర్పించి, తిరు నామాలు దిద్దుకొని చూడముచ్చటగా వున్నారు. నేను వారినే గమనిస్తున్నాను. అతని చూపు నా వైపు ప్రసరించింది. నేను నా చూపు మరల్చుకున్నాను. అతను వాళ్లందరితో కలసి మేమున్న చోటుకు వచ్చాడు. నేను కలవర పడ్డాను.

“ప్రణామాలు గురువు గారూ!” అంటూ నాకాళ్ళ మీద పడ్డాడు. మిగతా వాళ్ళ చేత కూడా దండాలు పెట్టించాడు. రెడ్డి గారు కూడా ఆశ్చర్యంగా చూస్తున్నారు.

“ఎవరు బాబూ మీరు?” అడిగాను

“నేను గురువుగారూ భరణిని. పన్నెండు సంవత్సరాల క్రితం ధ్యాన జగతిలో చాలా డిప్రెషన్‌తో మిమ్మల్ని కలిశాను. మీరు సాంత్వన వచనాలు పలికి ఓదార్చారు. మీమీద కూడా కోపగించి వెళ్లి పోయాను ఆ భరణి నేను!” అన్నాడు.

నాకు లీలగా గుర్తొచ్చింది. ఆశీర్వదించి పంపించాను. లోపల నవ్వు కూడా వచ్చింది. రెడ్డి గారితో అన్నాను.

“చూసారా రెడ్డిగారూ ఈ మాయ? సత్యాన్ని, ఆత్మను, దేవుడ్ని, అశ్రమాలలోనూ, హిమాలయాలలోనూ అన్వేషిస్తానని ఆనాడు నామీద కోపగించిన ఇతను ఈరోజు ఈ మాయా సంసారంలో పడి ఆ సత్యాన్ని, దేవుణ్ణి తన లోపల వెదకడం మానేసి గుడుల్లోనూ తీర్ధాలలోను వెతుకుతున్నాడు. ఒక మహాత్ముడిగా ఏదో ఒక ఆశ్రమంలో కనిపిస్తాడని అనుకున్నాను ఇలా ఒక సంసారిలా.. అప్పుడు అనుకోలేదు! చూసారా ఎవరూ వారి ప్రారబ్దాన్ని తప్పించుకోలేరు!”

ఇద్దరం నవ్వుకున్నాము!

***

సాయంత్రం 5 గంటలకి చిన్మయారణ్య వార్షికోత్సవ సభ ప్రారంభమయ్యింది. ముగ్గురు మహాత్ముల ప్రసంగాల తర్వాత నేను ప్రసంగించాల్సి వుంది. నేనూ, సుధాకర రెడ్డి గారితో పాటు ప్రేక్షకులలో కూర్చున్నాను. ఒక మహాత్ముని ప్రసంగం పూర్తయిన తర్వాత ఒక మాతాజీ ప్రవచనం మొదలయింది. అద్వైత వేదాంత సిద్దాంతం చాలా అద్భుతంగా ప్రసంగిస్తున్నారు. పేరు స్వామిని భవతారిణి సరస్వతీ. యోగవేదాంత ఫారెస్ట్ అకాడమీ, శివానంద ఆశ్రమం, ఋషికేశ్ లోనూ, సాందీపని విద్యాలయం, చిన్మయ మిషన్, ముంబై లోనూ వేదాంతం చదువుకున్నారట! చాలా చక్కటి అవగాహన కలిగిన ప్రసంగం. ఈమెతో మాట్లాడి మన ధ్యాన జగతికి తీసుకెళ్ళి ప్రవచనం చెప్పించాలని రెడ్డి గారు నిర్ణయించేసారు. ప్రసంగం చివరి దశకు చేరింది.

“ఒక్కొక్క సంఘటన, పరిచయం జీవితాన్ని మార్చేస్తుంది. నీవు వెదికే గురువు నీ వద్దకే వస్తారంటే నమ్మే దాన్ని కాదు. కానీ ఈ రోజు అది నిజమని నమ్ముతున్నాను. నేను నిత్యం పూజించే నా గురుదేవులు ఈ సభలో నాకు దర్శనం ఇవ్వడానికి ఇక్కడ ప్రత్యక్షమయ్యారు.” అంటూ డయాస్ దిగి ముందుకొస్తున్నారు. ‘ఈ మాతాజీనే కాకుండా, వీరి గురువును కూడా దర్శించుకొనే భాగ్యం కలిగింది’ అనుకొంటూ.. ఎవరా మహానుభావుడు అనుకొంటూ వెనక్కు తిరిగాము. నా పాదాలను ఎవరో స్పృశించినట్లై ఉలిక్కిపడ్డాను. భవతారిణి మాతాజీ తన ఆనంద భాష్పాలతో నా పాదాలకు అభిషేకం చేస్తుంది.

“నన్ను గుర్తించారా గురువర్యా! నేను మీ భవ్య. ఈ స్థితి, జీవితం మీ భిక్ష! నన్ను నేను తెలుసుకొనే జ్ఞాన భిక్ష పెట్టారు. ఇంత కాలంగా నిరీక్షిస్తున్నారు మిమ్మల్ని దర్శించుకోవాలని నేటికి నా తపస్సు ఫలించింది” అంది.

గుర్తొచ్చింది. బాంక్ మేనేజర్ జనార్దన్ కూతురు భవ్య. నాలో వున్న ఆత్మ చైతన్యం ఆరోజే నాకు తెలిసింది.

– స్వస్తి –

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here