[శ్రీమతి నారుమంచి వాణీ ప్రభాకరి రచించిన ‘పావురాలు – పెంపకాలు’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]
[dropcap]సూ[/dropcap]ర్యోదయానే బాల్కనీలో బట్టలు ఆరవెయ్యడానికి వెళ్ళింది కామాక్షి. రెక్కలు టపటపలాడిస్తూ రెండు పావురాలు రివ్వున ఎగిరిపోయాయి. బాల్కనీ అంతా చిన్న చిన్న ఈకలు, దూది పింజలతో నిండి ఉంది. నేలంతా పావురాల అల్లరి వల్ల చిన్న చిన్న ఎండుగడ్డి పరకలు పడి ఉన్నాయి. కామాక్షి మాత్రం నిట్టూర్చి ‘మళ్ళీ పావురాలు జంట ఆటకపై చేరినట్లు ఉంది. మళ్ళీ గ్రుడ్లు పెట్టి పిల్లల్ని చేసేదాకా త్రోలలేము. పావురాల ప్రసూతిశాల మా అటక’ అనుకుంది. జాగ్రత్తగా బట్టలు ఆరేసి బకెట్ పుచ్చుకుని, లోపలికి వచ్చింది. నేలపై కాగితాలు పరచింది. తుక్కు పడితే ఎత్తడానికి సులువుగా ఉండాలి గదా!
“అత్తయ్యగారూ, రాత్రి మళ్ళీ పావురాలు వచ్చి చేరాయి. ఇంకో నెల అవుతేగాని పిల్లలు ఎగరలేవు. అంత వరకూ మనకు ఇబ్బందే. వాసన కొడుతుంది. బట్టల నిండా తుక్కులు పడేస్తాయి. బట్టలు అక్కడే దులిపి తెస్తున్నాను.” అంది.
“పోనీ లేవే నీ పిల్ల పెళ్ళీడుకు వచ్చింది. దాని పెళ్ళి చేస్తే ఇంట్లో మనుమలు పుడతారు. అంతవరకూ మనకు పావురాల పిల్లలే సందడి” అన్నది. కామాక్షి మనస్సు చివుక్కుమంది. అత్తగారి మాటలు చిత్రంగా ఉంటాయి.
కూతురు శ్రావ్య ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తుంది. భర్త రావ్ బ్యాంక్ మేనేజర్, చింతలు లేని కుటుంబము. శ్రావ్య తరువాత ఇంకో పిల్లాడిని చూద్దాము అంటే వినలేదు. ‘ఈ బిజీ లైఫ్‌లో పిల్లల్ని కనడం, పెంచడం, సవ్యంగా జీవితం అందించడం చాలా కష్టము. నా ఉద్యోగ బాధ్యతలు నావి. నీకు ఇంటి పనులతో, మా అమ్మ చాదస్తం, మా నాన్న అహంకారంతో సరిపోతుంది. ఒక్క పిల్ల చాలు, చాలు. తమ్ముడిని గట్టెక్కిస్తే అంతే చాలు’ అన్నాడు.
తన తల్లి తండ్రి కన్నపిల్లలకి – తన తోబుట్టువులకి న్యాయం చెయ్యడానికి కంకణం కట్టుకున్నాడు రావ్. కామాక్షిని పురిటికి పంపిస్తూ ఆడ అయినా, మగ అయినా ఒక్కరే అని సరిపెట్టుకున్నాడు. కామాక్షి పుట్టింటివారు ధనవంతులు. కనుక తనకి ఇబ్బంది కలుగలేదు. రావ్‌కి అప్పటికి ఇద్దరు అక్కలు పెళ్ళిళ్ళకి ఉన్నారు.
ఏ సంబంధం తెచ్చినా ‘జాతకం బాగాలేదు. పిల్ల సుఖపడదురా!’ అంటూ వాళ్ళ నాన్న సంబంధాలన్నీ త్రోసి పుచ్చారు. అప్పటికి బ్యాంక్ క్లర్క్‌గా ఉన్న రావ్ ఇంక విసిగిపోయి ఎలాగైనా అక్కలిద్దరికి పెళ్ళి చెయ్యాలని లీవ్ పెట్టి మ్యారేజ్ బ్యూరో లన్నీ తిరిగి, తండ్రి మాట ప్రక్కనపెట్టి ఓ బ్యాంక్ ఉద్యోగిని, ఓ ఎల్.ఐ.సి ఉద్యోగిని పట్టుకుని పెళ్ళి చేసాడు. అక్కలిద్దరికి పురుళ్ళు – బాలసారలు చేసి తన జేబులు ఖాళీ చేసుకున్నాడు.
కామాక్షి కూతురు శ్రావ్యకి పదిహేను ఏళ్ళు వచ్చాయి. పిల్ల పెద్దది అవుతోంది. అన్ని రకాల సామాగ్రి అమర్చుకోవాలి. కామాక్షి ఇంటి దగ్గరే శారీ పెయింటింగ్, ఎంబ్రాయిడరీ క్లాసులు నిర్వహించేది. అది అత్తగారికి, మామగారికి ఇష్టం ఉండేది. కాదు. ఆడబడుచులిద్దరూ, గతంలో కాన్వెంట్లో చేసి కొంత డబ్బు నిల్వ చేసుకున్నారు. నగలు ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పుడు మరిది పెళ్ళి ఉంది. అతనికి జాబ్ చేసే అమ్మాయిని చేస్తానన్నారు. పెద్దకోడలు అర్ధకోడలు అన్నట్లు, కామాక్షి ఒక రకంగా అవసరం లేని ఎన్నో సమస్యలు ఎదుర్కొంది.
తన పిల్ల ఎదిగే టైముకైనా తన కష్టాలు, సమస్యలు తీరితే అంతే చాలు అనుకుంది. శ్రావ్య అదృష్టం, తండ్రి రావ్‌కి బ్యాంక్ మేనేజర్ ప్రమోషన్ వచ్చి, ట్రాన్స్‌ఫర్ అయింది. ఒక ఏడాది పాటు అటు ఇటు వెళ్ళి వచ్చేవాడు. పిల్ల చదువుతో కామాక్షి సతమతమయ్యేది. అందుకే ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు అన్నారు. కుటుంబాన్ని రావ్ ఎలాగో గట్టెక్కించాడు. ఇంక తన పిల్ల బాధ్యత చూడాలి.
ఈ తరం పిల్లలు ఇంజనీరింగ్ తప్ప వేరేవి చదవరు. ఏవో సంబంధాలు తెగ చూస్తున్నారు. ఒక్కటీ జాతకం కుదరటం లేదు. ‘దీనికీ అత్తల పోలిక వచ్చినట్లుంది. ఏ సంబంధం కుదరట్లేదు’ అని ఆలోచిస్తూ కామాక్షి బాల్కనీ తలుపు తీసింది ఆరిన బట్టలు తెచ్చుకోవడం కోసమంటూ. ఈ రోజుల్లో ఇల్లు కట్టడం మహాకష్టము. ఏదో బ్యాంక్ లోన్‌తో ఈ అపార్ట్‌మెంట్ ఏర్పాటు చేసుకున్నారు.
అత్తగారికి మామగారికి ఇది నచ్చదు. ‘పావురాలు గదూ! మాకు పావురాలకి తేడా ఏముంది?’ అంటూ అత్తగారు సాగదీస్తుంది.
పావురం పిల్లల కోసం మెత్తని దూది ఈకలు తెచ్చి అన్నీ అమర్చి అందంగా తీర్చిదిద్దినట్టుగా చిన్న చిన్న ఎండుగడ్డి పరకలపై పరిచింది. తల్లి ప్రాణం కదా ఏ జంతువైనా సరే పశు, పక్షి, కీటకాలు మొదలు మనిషి వరకూ పిల్లల పెంపకంలో అత్యంత శ్రద్ధ వహిస్తాయి. అవి గ్రుడ్డుని పొదిగి ఎదిగే వరకూ ఆహారం సమకూర్చి, కంటికి రెప్పలా కాచుకుంటాయి. ఏదైనా మనిషి అలికిడి అయితే రెక్కలతో చప్పుడులు, ముక్కులతో టికటికలు చేస్తాయి. తమ పిల్లల్ని కాపాడుకొంటాయి. మరి మనిషి తమ పిల్లల్ని పెంచడంలో గగనపు అంచుల్ని చేరాలని ఆశలు పెంచుకుంటాడు.
కుటుంబాలతో పోట్లాటలు, అత్తమామల ఆరాటాల మధ్య అత్తింటిలో ఆడపిల్ల సర్దుకుపోవడానికి ఎన్నో సమస్యలు! అత్తమామ, భర్త ఈ కుటుంబంలో ఆడపిల్ల అతుక్కుపోవడానికి ఎన్నో పరీక్షలు! సజావుగా ఏ ఆడపిల్ల జీవితము లేదు. కలిసిపోదామన్నా సరే ఆంక్షలతో భయపెట్టి దూరంగా ఉంచే కుటుంబాలెన్నో ఉన్నాయి. ఇందుకే కామాక్షికి అడపిల్ల పెళ్ళి అంటే చాలా భయము. అయినా తప్పదు. నమ్మకంతో అత్తింటికి పంపాలి. అలా పంపినా సరే, ఏరోజు ఇంటికి తిరిగి పంపిస్తారో తెలీదు.
ఎంత చదివినా ఎంత ఉద్యోగం చేసినా ఆడదాన్ని చిన్నచూపు చూస్తున్నారు. కోడలిగా అడుగుపెట్టి ఎన్నో సమస్యలు ఎదుర్కొని తన కుటుంబము ఏర్పాటు చేసుకోవాలంటే అయిన వాళ్ళ నుంచే ఆంక్షలు. కొడుకు తమ గుప్పెట్లో నుంచి జారకుండా నొక్కిపెట్టి – కోడల్ని పరాయి మనిషిలాగ పెడుతున్నారు.
కామాక్షికి శ్రావ్య పెళ్ళి ఒక భయంగా బెదురుగా ఉంది. ఆనాడు తాను ఎన్నో సమస్యలు ఎదుర్కొంది. ఇంక తన పిల్లకి ఆ బాధలు వద్దు అనుకుంది.
అయితే శ్రావ్య రాగానే తనకు నచ్చిన పెళ్ళి సంబంధాలు చెప్పింది కామాక్షి. ‘అలాగే’ అని తన కొలిగ్ ఒకడున్నాడనీ, తనతో ఎప్పటినుంచో పెళ్ళి ప్రస్తావన తెస్తున్నాడనీ, తనే ఆలోచిస్తున్నట్టు అమ్మకి చెప్పింది శ్రావ్య. “అయితే నాన్నని ఆదివారం ఇంటికి రమ్మని చెప్పు” అన్నది కామాక్షి. ఈ విషయం ఇంట్లో ఎవరికి చెప్పలేదు.
శ్రావ్యను తొందరగా రమ్మని చెప్పింది. మూడు గంటల ప్రాంతంలో ఎర్రకారులో ప్రతాప్, అతని కూడా ఓ అరవై యేళ్ళ స్త్రీ వచ్చింది.
కామాక్షి లోపలికి ఆహ్వానించింది. డ్రాయింగ్ రూమ్‍లో కూర్చోబెట్టి కాఫీ టిఫిన్ అన్నీ ఇచ్చింది. అత్తగారు, మామగారు, భర్త అందరినీ పరిచయం చేసింది. ఈలోగా బాల్కనీలో చప్పుడు! అది ఏమిటని ప్రతాప్ తల్లి అడిగింది.
కామాక్షి చిన్నగా నవ్వి “బాల్కనీ పావురాల ప్రసూతి కేంద్రం. అది దానికే వదిలేసాము” అన్నది.
“ఆంటీ మీరు పావురాల్ని ఇంత బాగా చూస్తున్నారు. మరి మమ్మల్నెంత బాగా చూస్తారో కదా!” అన్నాడు ప్రతాప్. “నోరు లేని జీవాలకి ఆశ్రయం ఇచ్చారు. నోరున్న జీవులం మనం ఇంకా బాగా చూడాలి గదా!” అన్నాడు.
శ్రావ్య పకపక నవ్వుతూ “వాటి లైఫ్ స్టైలే వేరు – మన లైఫ్ స్టైలే వేరు కదా! పశు, పత్ని, సుతాలయ రుణ రూపేణా ప్రాప్తిహిః” అన్నది.
తాత, బామ్మ ఆశ్చర్యంగా చూసారు. తమకి ఏమీ చెప్పలేదు అన్నభావం వచ్చేలా! తండ్రి నవ్వుకున్నాడు.
“మీరు ఒక మంచి రోజు మా ఇంటికి రండి” అంటూ ప్రతాప్ తల్లి లేచింది. ప్రతాప్ తండ్రి గల్ఫ్‌లో ఉంటాడు. “ఆయన వచ్చాక అన్నీ మాట్లాడుకుందాము. నాకు ఒక్కడే కొడుకు, కూతురు కెనడాలో ఉంది. శ్రావ్య నాకు నచ్చింది” అన్నది.
బొట్టు పెట్టి, పళ్ళు ఇచ్చి, “శుభం” అన్నది కామాక్షి. ‘పిడికిట తలంబ్రాల పెళ్ళి కూతురు’ అన్న పాట సెల్‌ఫోన్ నుంచి వినిపించింది.
***
పెళ్ళి అంటే రెండు కుంటుంబాలు కలసి చేసుకుని, ఒకరికి ఒకరు అండదండలుగా ఉండాలి.
ఇంటికి వెళ్ళాక ప్రతాప్ తల్లి, కొడుకుతో మాట్లాడుతూ, “పెళ్ళికి కావల్సిన వస్తువులు, ఏర్పాట్లు చాలా ఉంటాయి. నాకంత ఓపిక లేదు. పూర్తిగా తెలియదు కూడాను. అక్క వస్తే అన్నీ చూస్తుంది. క్రాంతిని ముందుగా టిక్కెట్ బుక్ చేసుకుని రమ్మంటాను” అంది.
సరేనని ప్రతాప్ టికెట్ బుక్ చెయ్యడానికి అక్క క్రాంతితో సంప్రదించాడు. ఒక పదిహేను రోజుల్లో శెలవులు పెట్టి రావడానికి వీలు ఉంటుందని చెప్పిందన్నాడు. తల్లి సరేనన్నది.
కొన్ని కుటుంబాల్లో భర్తలు సంపాదించిన డబ్బు దాచేది భార్యలే కదా! ఒక ప్రక్క ప్రపంచం ఎంత మారినా, ఇంటి భాద్యతలు భార్యలు వహించడం తప్పలేదు.
అత్తగారు ఉంటే, ఇంటి పెత్తనం అత్తగారిదే. కొందరయితే క్రొత్త కోడల్ని వందరకాలుగా, పరిశీలించి, పరిశోధిస్తారు. ఆ పిల్ల ఆ ఇంటిని నడపగలదా! లేదా? అని అనుమానము. ఇల్లు వాకిలి క్రొత్త కోడలు పిల్ల చేతిలో పెడితే మిగిలిన వారి పరిస్థితి ఏమిటి? వంట వార్పు అన్నీ తేడాలే – అన్నీ బాధలే! కట్టుబొట్టు అన్నీ విమర్శలే! విమర్శలే ధ్యేయంగా తప్ప, వివేకం ఉండటం లేదు.
ఒక్కసారి ప్రతాప్ తల్లి తన జీవితంలో పడిన బాధలు సమస్యల గురించి ఆలోచించుకుంది.
భర్త ఎక్కడో దూరంగా ఉండగా ఇద్దరి పిల్లలతో అత్తమామలతో వారికి నచ్చేవిధంగా ఎంత ఉన్నా ఎప్పుడూ తనని మెచ్చుకోలేదు, ఆదరించలేదు. ‘నేను పడిన సమస్యలు, నా కూతురికి రాకూడదు అనుకున్నట్లే నా కోడలిని ఎంతో ప్రేమగా చూడాలి, రెండు కుటుంబాల మధ్య చక్కని అవగాహన కావాలి. అందరూ అత్తలు ఇలా వ్యవహరిస్తే సమస్యలుండవు కదా’ అనుకుంది.
ఇలా ఎన్నో ఎడతెరిపి లేని ఆలోచనలు. తన కూతురు బాధపడకూడదన్నట్లే తన కోడలు బాధపడకూడదు. కోడలు రాకుండానే తనకి నచ్చేలా ఇల్లు సర్థించాలి. ఈతరం పిల్లలకి, కిచెన్ మోడ్రన్‌గా ఉండాలి. క్రొత్త సామానులన్నీ పెట్టాలి. పాత సామానులు ఎవరికైనా ఇచ్చేయాలి అనుకుంది.
ఇదే మాట ప్రతాప్‌తో అంటే, “పర్వాలేదమ్మా! తనకి నచ్చినట్లుగా తనే సర్దుకుంటుంది. శ్రావ్య మంచి పనిమంతురాలు. వాళ్ళ ఇంట్లో వాళ్ళమ్మ సలహాలు, సంప్రతింపులతో తనే చేసుకుంటుంది” అన్నాడు.
“ఒక వేళ ఆ పిల్ల తెలియక ఏదైనా కసురుకున్నా, మనమే సర్దుకోవాలి. ఒకే చేస్తే పోలా!”
“నువ్వేమి సర్దక్కర్లేదు. శ్రావ్య వచ్చాకా తనకి నచ్చినట్లు తను ఉంటుంది. అత్తగా నువ్వు ఆంక్షలు పెట్టకుండా మనం ప్రేమగా చూస్తే మనం అంటే గౌరవం ఉంటుంది” అన్నాడు.
“అప్పుడే, నీ పెళ్ళాం రాకుండానే నువ్వు అంత గారం చేస్తున్నావు” అంది తల్లి.
“అవును అమ్మా. ఇప్పటి ఆడపిల్లలు పూర్వకాలం వాళ్ళల్లా మాట పడరమ్మా! మన ఇంటికి వచ్చిన దీపం – ఇల్లాలు కదా! ఆ కోడల్ని అలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలాంటి బట్టలు వేసుకో అలాంటి బట్టలేసుకో అంటూ సలహాలు చెప్పవద్దు” అన్నాడు.
కొడుకు, రాబోయే భార్యపై ఎంత ప్రేమ చూపిస్తున్నాడో అనుకుంది. కాని ఈలాంటి ప్రేమ భార్యపై ఉంటే గాని కుటుంబాలు సజావుగా ఉండడు. తను కొడుక్కి భార్యనెలా చూసుకోవాలో నేర్పించాలనుకుంది, వాడే నాకు కోడల్ని ఎలా చూడాలో చెబుతున్నాడని అనుకుంది.
అవును నిజమే, పావురాలు – పక్షలు పిల్లల్ని ఎంత ప్రేమగా పెంచుతాయి. మెత్తని దూదులు, ఈకలతో పెంచి, ముక్కులతో ఆహారం తినిపిస్తాయి. కొంచెం ఎదిగేటప్పటికి ఎగరడం రాగానే వదిలేస్తాయి. అయితే మానవులే పిల్లల చదువులు, పెళ్ళిళ్ళు అయినా అత్తమామ పెత్తనంలో, కనుసన్నలతోనే మెలగాలనే స్వార్థంతో ఎంతో మంది కుటుంబాల్లో అత్తింట బాధలతో, ఆరళ్ళతో, జీవితాలు గడపడమే కాదు, కుటుంబాలు విడదీయడానికి వెనుకాడట్లేదు. పొమ్మనలేక పొగపెడతారు, బెదిరిస్తారు. వాళ్ళకి కొడుకు డబ్బుకావాలి. కోడలు అడ్డు. తెల్లవారింది మొదలు, కాఫీ దగ్గరనుంచి పచ్చడిలో పోపు వరకు అన్నీ విమ్మర్శలే. అయినా అత్తగారి అనుభవం ముందు కోడలికి ఎలా అంత అనుభవం ఉంటుంది ఆలోచించరెందుకు? ఆడపిల్ల అంటే ఆనందంగా వెళ్ళాలిగాని భయంతో, బాధతో అడుగు పెట్టరాదు. క్రొత్తగా వచ్చిన కోడల్ని ప్రేమతో ఆదరణగా చూడాలి అంతేగాని అత్తింటి నుంచి భయపడి వెళ్ళిలా ప్రవర్తించకూడదు. కొందరు రాత్రి నిద్రలో నడుస్తారు. కొందరు అరుస్తారు. కొందరు ఏడుస్తారు, కొందరు భయంతో నిద్రపోతారు. ఇలాంటి రకరకాల అనుభవాలు ఉండకూడదు. పరాయి పిల్ల మన ఇంటికి వచ్చి, మన పిల్ల అవుతుంది. పుట్టింట్లో ఎలా పెరిగినా, ఎలా ఉన్నా అత్తిల్లే ఆమె జీవితకాలం ఉండే చోటు, అందుకని అత్తిల్లు నందనవనం కాకపోయినా సౌలభ్యంగా ఉండాలి. ఆత్మీయత ఆదరణ పంచాల్సింది అత్తమామలే. తల్లిని ఇల్లుని పుట్టింటి వారిని వదిలి వస్తుంది. శ్రావ్యను తను ఎంతో బాగా చూసుకోవాలి. శ్రావ్య ఈతరం పిల్ల. ఆమెకు నచ్చినట్లుగా ఉండమనాలి. మోడరన్ డ్రస్సులు ఇష్టపడితే, అవి వేసుకోమనాలి. చీరలు నగలు తన అభిరుచికి తగ్గట్టుగా కొనాలి అనుకుంది ప్రతాప్ తల్లి.
ఈ మాటలన్నీ ప్రతాప్‌తో అంటే ఏమంటాడో? క్రాంతితో అంటే ఏమంటుందో? కాదు, కాదు తను శ్రావ్య తల్లిదండ్రులదో ఈ విషయాలు పంచుకోవాలి. అపుడే ఆనందంగా ఉంటుంది. “అత్తింటిలో మీ పిల్లకి ఎటువంటి భయాలు, బెంగలు ఉండవు. మీ ఇంటికన్నా స్వేచ్ఛగా మా ఇంట్లో (అత్తింట్లో) తను ఉండవచ్చు. ఆమెకు ఇదే సొంతిల్లు కదా!” అని ఫోన్‍లో కామాక్షితో చెప్పింది.
***
“శ్రావ్యా నువ్వు అదృష్టవంతురాలివి. మీ అత్తగారు ఎంత మంచిదో!” అంది కామాక్షి.
“ఏంటమ్మా! నేను మంచిదాన్ని కాదా! నా అంత మంచి పిల్ల దొరకడము వారి అదృష్టం అని కూడా అనుకోవాలి” అంటూ కొంటెగా నవ్వింది.
“చూడమ్మా! అత్తింటివారు అంత బ్రాడ్‍గా ఆలోచించరు. వారే సర్దుకుంటే క్రొత్త ఇల్లు కనుక ఆమె సర్దుకుపోతుంది. ఇలా అత్తింటి వారు ఆలోచించాలి. కోడలివి కదా, అత్తకి, మామకి నువ్వు మర్యాద ఇవ్వాల్సిందే” అంది కామాక్షి.
“అమ్మా, నేను సాంప్రదాయ కుటుంబంలోంచి పెరిగాను. నీ పెంకంపై నీకు నమ్మకం లేదా? ఎందుకంత అనుమానం?” అంటూ శ్రావ్య గలగలా నవ్వింది.
ఈలోగా ఫోన్ రింగ్ అయ్యింది. “ఉండమ్మా! మా అత్తగారు ఫోన్ చేస్తోంది. ఆవిడ దగ్గర ముందే అన్ని విషయాలు తెల్సుకుందాము. ఆవిడకి నచ్చినట్లుగా ఉంటాను.” అని చెప్పి,
“ఆఁ.. ఆఁ.. అత్తయ్యగారు నమస్కారం. చెప్పండి నేను ఫ్రీగానే ఉన్నాను” అంటూ శ్రావ్య తన గదిలోకి వెళ్ళిపోయింది.
‘శుభస్య శ్రీఘ్రం’ అని కామాక్షి కూతుర్ని చూసి నవ్వుకుంది.