[కస్తూరి మురళీకృష్ణ రచించిన ‘దుఖీ కీ పుకార్..’ అనే హిస్టారికల్ ఫిక్షన్ కథని అందిస్తున్నాము. ఈ కథా కాలం 1857. ప్రథమ స్వాతంత్ర్య పోరాటం విఫలమైన తరువాత బ్రిటీషువారు చివరి మొఘల్ సుల్తాన్ బహదూర్ షా జాఫర్‍ను ఖైదు చేసిన సంఘటనను ప్రదర్శిస్తుందీ కథ.]
[dropcap]బ్రి[/dropcap]టీషు సైనికులు జామా మసీదులో చలిమంటలు కాచుకుంటూ నృత్యాలు చేస్తున్నారు. వారి వెంట వచ్చి సిక్కు సైనికులు, పవిత్ర మసీదులో మిహ్రాబ్ వద్ద విజయనృత్యాలు చేస్తున్నారు (మిహ్రాబ్ అంటే మసీదులో గోడలపై, మక్కా దిక్కును సూచించే గుర్తు. ఆ గోడను ‘ఖిబ్లా’ అని అంటారు).
సంబరాల నడుమ, సంతోషాల నడుమ, ‘క్వీన్ విక్టోరియా’ను తలచుకున్నారు బ్రిటిష్ సైనికులు.
‘మన యుద్ధం ముగిసింది. సిపాయిల తిరుగుబాటు సంపూర్ణంగా అణగిపోయింది. మళ్ళీ మనకు పాత వైభవం వచ్చింది.’
లాహోర్ లోని ఆఫీసర్లకు ఢిల్లీ నుండి టెలిగ్రామ్ వెళ్లింది.
ప్రథమ స్వాతంత్ర్య యుద్ధం చివరి దశ అది. బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా జరిగిన పోరాటం అణగిపోయింది. ఢిల్లీ విప్లవకారుల చేజారిపోయింది. బ్రిటీష్ సైనికుల పరమయింది. దాంతో బ్రిటీష్ వారు కేవలం తమకు వ్యతిరేకంగా పోరాడినవారిపైనే కాదు, సామాన్యులపై కూడా కసి తీర్చుకుంటున్నారు. ఆకాలంలో ఢిల్లీలో జరిగిన మారణకాండకు ఈనాడు కూడా సభ్య సమాజం సిగ్గుతో తలవంచుకుంటుంది. తలచుకుని భయంతో గజగజ వణకుతుంది.
***
ఓ వైపు బ్రిటీష్ సైన్యాధికారులు తాగుతూ, నృత్యాలు చేస్తూ సంబరాలు జరుపుకుంటుంటే, మరో వైపు ఢిల్లీ వీధులలో మరో నృత్యం జరుగుతోంది. మానవుడు పిశాచి అయి మానవ ప్రాణాలను బలిగొంటూ చేసే హింసాత్మక కరాళ నృత్యం అది!
ఎవరు కనిపిస్తే వారిని – పసి పిల్లవాడు, స్త్రీ, వృద్ధుడు అని చూడకుండా నిర్దాక్షిణ్యంగా హింసించి చంపేస్తున్నారు బ్రిటీష్ సైనికులు. వారిని చెత్తలోకి విసిరేసే ముందు విలువైన వస్తువులు వెతికి తీసుకుంటున్నారు.
ఢిల్లీ గేట్ నుండి తుర్కమన్ గేట్‍ల నడుమ ఇళ్ళన్నీ ఖాళీ చేయించమని సైనికులకు ఆజ్ఞలు అందాయి. సాయుధుడు, నిరాయుధుడు అని చూడకుండా కనబడిన ప్రతి వాడినీ కాల్చేయటమే పని.
ఇళ్లల్లోకి దూరటం, కనబడిన వారిని కాల్చి బయటకు విసిరేయటమే పని. ఇళ్లలోని విలువైన వస్తువులను ఏరుకుని, ఇంటిని తగులబెట్టటం తప్ప బ్రిటీష్ సైనికులకు ఇంకేమీ పని లేదు.
ఎటు చూసినా శవాల గుట్టలు. తెగిన శరీరావయవాలు, రక్తం, మాంస ఖండాలు.. అక్కడక్కడా కొన్ని భవనాలలో బ్రిటిష్ సైనికులకు వ్యతిరేకత కనిపించింది.
వ్యతిరేకించిన వారి ఇళ్ళను మందుగుండుతో పేల్చి, మరింత్ర క్రూరంగా హత్య చేశారు. మనుషులను వరుసగా నిలబెట్టి పిట్టలను కాల్చినట్టు కాల్చేశారు. బ్రిటీశ్ వారి ఆగ్రహమంతా అధికంగా ముస్లీములపైనే. ముస్లీం లా కనిపించినవాడిని ముందూవెనుకా చూడకుండా చంపటమే!!
ఢిల్లీలో ఇంత భయంకరమైన దారుణ మారణకాండ సంభవిస్తూంటే, ఢిల్లీ పాలకుడు చివరి మొఘల్ రాజు అయిన బహదూర్ షా జాఫర్ ఎక్కడున్నాడు? ఏం చేస్తున్నాడు? ప్రాణాలు అరచేత పట్టుకుని, బ్రిటీష్ వారి కంట పడకుండా తప్పించుకుంటూ క్షణాలు లెక్కిస్తున్న సామాన్యులే కాదు, ఢిల్లీని హస్తగతం చేసుకున్న బ్రిటీష్ వారి మనస్సుల్లో కూడా ఇదే ప్రశ్న మెదలుతోంది.
బహదూర్ షా జాఫర్ తమకు చిక్కితే ఎలా హింసించి చంపుతారో, బ్రిటీష్ సైనికులు సైనికులు ఊహిస్తూ చర్చించుకుంటున్నారు.
***
ఢిల్లీలో జరుగుతున్న మారణకాండ వివరాలు వింటు మౌనంగా ఉన్నాడు బహదూర్ షా జాఫర్.
అప్పుడప్పుడు అలసటగా కళ్ళు మూసుకోని వెనక్కు చేరగిల పడుతున్నాడు. మరీ ఘోరమైన దారుణ మారణకాండ గురించి తెలిసినప్పుడు ‘యా అల్లా’ అంటున్నాడు. అతడి కనుకొలకుల చివర కన్నీటి చుక్కలు తళుక్కు మంటున్నాయి. ప్రాణ భయంతో ఎర్రకోట వదలి హుమాయున్ సమాధి వద్ద తలదాచుకున్నాడు సుల్తాన్ బహదూర్ షాహ్ జాఫర్.
“జహాపనా.. నాతో రండి. లఖ్నౌ పోదాం. అక్కడి నుండి మన పోరాటం సాగిద్దాం. ఢిల్లీలో ఉండి సాధించేదేమీ లేదు. మరణం తప్ప మరో భవిష్యత్తు లేదిక్కడ” ప్రాధేయపడుతూ అన్నాడు ‘బఖ్త్ ఖాన్’.
బహదూర్ షా అతడి వైపు నిర్భావంగా చూశాడు. మౌనంగా ఉన్నాడు.
“త్వరపడాలి. మనం ఆలస్యం చేస్తే బ్రిటీష్ వారికి చిక్కిపోతాం. ముందూ వెనుకా చూడకుండా కాల్చేస్తారు” తొందరపెట్టాడు ‘బఖ్త్ ఖాన్’.
బహదూర్ షా, హకీమ్ అహ్సానుల్లా ఖాన్ వైపు చూశాడు.
మొదటి నుంచీ నిర్ణయం తీసుకునే అలవాటు బహదూర్ షా జాఫర్‍కు లేదు. ఎవరో ఒకరు ఆయన తరఫున నిర్ణయం తీసుకుంటారు. అది సరైనదైతే పేరు బహుదూర్ షాది. పొరపాటు అయితే, దోషం సలహాచ్చిన వారిది.
“మీరు గొప్ప ముఘల్ వంశ వారసులు. హిందుస్తాన్ శహెన్ షాహ అని గుర్తుంచుకోండి. యుద్ధం బ్రిటీష్ సైన్యాధికారులకు, వారి క్రిందిస్థాయి సైనికులకూ నడుమ జరిగింది. దీనితో మీకు కానీ మొఘల్ సామ్రాజ్యానికి కానీ ఎలాంటి సంబంధం లేదు. మీరు పారిపోతే, ఢిల్లీ వదిలిపోతే, మీరూ నేరస్థులలో ఒకరవుతారు. మీరు సుల్తాన్. మీకు బ్రిటీష్ వారితో ఎలాంటి వైరం లేదు” చెప్పాడు అహ్సానుల్లా ఖాన్. బహదూర్ షాహ జఫర్ ను ఢిల్లీలో వుంచటంలో అహ్సానులాహ్ ఖాన్ స్వార్ధం వుంది. సుల్తాన్ ను బ్రిటీష్ వారికి అప్పగిస్తే అతనికి అనేక లాభాలు ఒనగూడతాయి.
బహదూర్ షా, నెమ్మదిగా బఖ్త్ ఖాన్ వైపు తలతిప్పాడు.
“నేను ఢిల్లీ సుల్తాన్.. మొఘల్ సుల్తాన్” అన్నాడు అస్పష్టంగా.
‘బఖ్త్ ఖాన్’ సజ్దా చేశాడు. నిశ్శబ్దంగా నీడలలో కలసిపోయాడు. బహదూర్ షా ఆలోచనలలో మౌనంగా ఉండటం చూసి, అహ్సానుల్లా ఖాన్ నెమ్మదిగా గది వదిలి వెళ్ళిపోయాడు.
శూన్యం లోకి దృష్టిలేని చూపులతో చూస్తున్నట్లున్న బహదూర్ షా పెదిమలు మెల్లిగా కదిలాయి.
జాఫర్ అహ్వల్ ఆలమ్ కా కభీ కుఛ్ హై, కహీఁ కుఛ్ హై
కే క్యా క్యా రంగ్ అబ్ హైఁ ఔర్ క్యా క్యా పెష్తార్ యాన్ థే
(ప్రపంచం కాలంతో మారుతూనే ఉంటుంది జాఫర్. ఒకప్పుడు ఎన్నెన్ని రంగురంగుల దృశ్యాలు చూపించింది.. ఇప్పుడు ఏం చూపిస్తోంది?)
***
“ప్రభూ.. బ్రిటీష్ సైన్యం హుమాయూన్ మజహర్ దగ్గరకే వస్తోంది. మీరు ఇక్కడ ఉన్నారని ఎవరో బ్రిటీష్ వారికి తెలిపినట్టున్నారు..”
బహుదూర్ షా జాఫర్‌లో ఎలాంటి భావం కనబడలేదు. నిర్భావంగా కూర్చున్నాడు.
“రజాబ్ అలీ, ఇలాహ్ బక్షీలు పదిహేను మంది సైనికులతో చర్చల కోసం వస్తున్నారు” మరొకరు వార్త అందించారు.
బహదూర్ షా లో ఎలాంటి చలనం లేదు.
“మౌల్వీ, రిసాల్దార్ మాన్‌సింగ్‌లు లోపలకి వస్తున్నారు..” కంగారుగా చెప్పారు.
బహదూర్ షా మాట్లాడలేదు.
నిండా మునిగినవాడిలా, నిమ్మకు నీరెత్తినట్టు కూర్చుని ఉన్నాడు.
తలుపు వద్ద శబ్దమయింది.
బహదూర్ షా కళ్ళు విప్పలేదు. ఆ వైపు చూడలేదు.
దూరం నుంచి చూసేవారికి ఓ నిర్జీవ విగ్రహం ఉన్నట్టు కనిపించింది.
***
విలియం స్టీఫెన్ రైక్స్ హడ్సన్ ఉద్విగ్నతతో చూస్తున్నాడు హుమాయూన్ మజహార్ దర్వాజా వైపు.
దారంతా రాజ కుటుంబీకులు బిచ్చగాళ్ల లాగా పడి ఉన్నారు.
నిజానికి హడ్సన్ కేవలం యాభై మంది సైనికులతో మాత్రమే వచ్చి దుస్సాహసం చేశాడు. అక్కడ సుల్తాన్ సమర్ధకులు వేల సంఖ్యలో వున్నారు. విప్లవకారులున్నారు. సామాన్యులున్నారు. వారిలో కొందరు సాయుధులు. అప్పటికే ఒకసారి వారు సుల్తాన్‌ను బంధించాలని వచ్చినవారిపై దాడి చేశారు.
అక్కడున్న వారిలో ఆగ్రహం కన్నా నిరాశ అధికంగా వున్నదని హడ్సన్‌కు తెలుసు. వీరంతా జీవచ్ఛవాలనీ తెలుసు. ఆవేశం ప్రదర్శిస్తారు. కానీ, అధికారం ముందు తలవంచుతారు. కానీ, ఒకడు తిరగబడితే మిగతావారంతా గుంపులా తిరగబడతారు. అందుకని హడ్సన్ దూతలను పంపి తాను దూరంగా నిలబడ్డాడు.
హడ్సన్ వచ్చింది బహదూర్ షా జాఫర్‌ను బందీగా పట్టుకోవటానికి. కానీ తను సుల్తాన్‍ను బందీగా చేస్తే వీళ్ళంతా ఊరుకుంటారా? తిరగబడరూ?
సుల్తాన్ శాంతంగా వస్తాడా? పోరాడతాడా?
సమయం గడుస్తున్న కొద్దీ ఉద్విగ్నత పెరుగుతోంది.
‘శాంతంగా లొంగిపోతే ప్రాణభిక్ష పెడతాం, లేకపోతే చంపేస్తాం’ అన్న సందేశంతో మౌల్వీని, రిసాల్దార్‍ను లోపలకు పంపించాడు.
వాళ్ళింత వరకూ రాలేదు. వాళ్ళని చంపేసి ఉంటారా?
చెమటలు ధారాపాతంగా కారిపోతున్నాయి.
బహదూర్ షా జాఫర్‌ను బంధించినవాడిగా తన పేరు చరిత్రలో నిలిచిపోతుందన్న దురాశతో ఈ దుస్సాహసానికి ముందుకొచ్చాడు హడ్సన్.
జీనత్ మహల్ (బహదూర్ షా బేగమ్), హకీమ్ అహ్సానుల్లాల ప్రకారం బహదూర్ షా కు ప్రాణభయం ఎక్కువ. అతడు లొంగిపోతాడు సులభంగా అని చెప్పారు. కానీ ఇంతసేపా?
ఆలోచిస్తున్న హడ్సన్ దృష్టి తలుపు వద్ద కదలికతో తీక్షణమైంది.
రిసాల్దార్ కనిపించాడు. అతడి ముఖంపై చిరునవ్వుంది
నిట్టుర్చాడు హడ్సన్. తుపాకీని దించాడు.
“సుల్తాన్ వస్తున్నారు” చెప్పాడు రిసాల్దార్.
ఇంతలో కలకలం వినిపించింది.
పల్లకిలో సుల్తాన్ వస్తున్నాడు. పల్లకికి ఇరువైపులా మిర్జా ఇలాహ్ బక్ష్, మౌల్వీలున్నారు. వెనుక బేగమ్, మీర్జా జహాన్ బఖ్త్, మీర్జా ఖులీ ఖాన్‍ల పల్లకీలున్నాయి. ఇంకా వారి సేవకులు, అక్కడ తలదాచుకున్నవారు పెద్ద సంఖ్యలో ఉన్నారు.
ఇదంతా దూరంగా నిలబడి చూస్తున్న హడ్సన్ దగ్గరకు మౌల్వీ వచ్చాడు.
“మీ గురించి సుల్తాన్ చాలా విన్నాడు. మీరు ఆజ్ఞాపిస్తే వేల సంఖ్యలో ఉన్న విప్లవకారులు భయంతో ఆయుధాలు విసర్జించారంటారు. మీరు కాల్చిన తరువాత మాట్లాడుతారంటారు. కాబట్టి, మీ నోటి నుంచి తన ప్రాణానికి, బేగం ప్రాణానికి ఎలాంటి ప్రమాదం లేదన్న వాగ్దానం కోరుతున్నారు సుల్తాన్”.
నవ్వుకున్నాడు హడ్సన్.
మాట గాలిలో కలసి పోతుంది.
అతడికి ఎర్రకోటలో సంఘటన గుర్తుకు వచ్చింది.
ఢిల్లీలో తమకు దారి చూపించేందుకు – పారిపోతున్న ఓ వ్యక్తిని పట్టుకున్నాడు. ‘దారి చూపించు. ప్రాణాలతో వదలి పెడతాన’న్నాడు. వాడు ఎర్రకోట దగ్గర చేర్చిన తరువాత, వాడిని కాల్చి చంపిన తరువాతనే ఎర్రకోటలో అడుగు పెట్టాడు. ఇప్పుడు సుల్తాన్‍కు వాగ్దానం కావాలి!
సుల్తాన్ దగ్గరకు వెళ్ళాడు. పల్లకి లోకి చూశాడు.
ఓ ముసలి వ్యక్తి, ముఖమంతా ముడుతలతో, ముఖాన్ని ఒంటిని కప్పేసే తెల్లటి గడ్డంతో, చిన్న చిన్న రంధ్రాల్లాంటి జీవం లేని కళ్లతో, వణుకుతూ తన వైపే చూస్తున్న వ్యక్తి పల్లకిలో కనిపించాడు.
‘ఇతడా హిందుస్తాన్ ప్రజల భాగ్యవిధాత? ఇతడి కనుసన్నల్లో దేశం అంతా గడగడ వణుకుతూ నిలిచిందా? ఇతడికేనా తమ పూర్వ సైన్యాధికారులు వంగి వంగి సలాములు చేసి, అభ్యర్థించింది? ఇప్పుడు అతడు గడగడ వణకుతూ ప్రాణభిక్ష వేడుకుంటున్నాడు’.
హడ్సన్ పెదవులపై తిరస్కారంతో కూడిన వ్యంగ్యమైన చిరునవ్వు నిలిచింది.
“మీ ప్రాణాలకు ప్రమాదం లేదు. మిమ్మల్ని మా నుంచి తప్పించాలని ఎవరయినా ప్రయత్నిస్తే మాత్రం, ముందుగా పోయేవి మీ ప్రాణాలే” కటువుగా చెప్పాడు.
తల వంచి అభివాదం చేశాడు బహదూర్ షా జాఫర్.
తనకు తల వంచి అభివాదం చేస్తున్న ఈ బలహీన ముసలి శరీరం, ఒకప్పుడు హిందుస్తాన్ ను శాసించింది!
తన్నుకు వస్తున్న వికటాట్టహాసాన్ని ఆపుకున్నాడు హడ్సన్.
“నడవండి” ఆజ్ఞాపించాడు. “ఎవరైనా ఒక్క అడుగు ముందుకు వేసినా, ప్రమాదకరంగా తోచినా, కాల్చి పారేయండి.”
***
ఢిల్లీ వీధులలో పల్లకీలో ప్రయాణిస్తున్న బహదూర్ షా హృదయం చిత్రంగా స్పందిస్తోంది.
అంతా కలలాగా ఉంది.
నగరం నిర్మానుష్యంగా వుంది. అప్పుడప్పుడూ జీవచ్చవాల్లాంటి మనుషులు తట్టాబుట్టా మోసుకుని భయంభయంగా నగరం వదలి పారిపోవటం కనిపిస్తోంది. బ్రిటీష్ సైనికులు ఖాళీ ఇళ్ళను కొల్లగొట్టటం కనిపిస్టోంది.
ఒకప్పుడు నగరం హడావిడిగా తిరిగే మనుషులు, వ్యాపారులు, ఓంటెలు, ఎద్దులతో కళకళ లాడుతూండేది. పిల్లల అరుపుల కేకల పరుగుల ఆటలతో సందడిగా వుండేది. ఆడవాళ్ళ మాటలు, వ్యాపారుల బేరసారాలతో నగరమంతా సజీవంగా తళతళలాడుతూండేది.
ఇప్పుడు…… కాలిపోయిన ఇళ్ళు, కూలిపోయిన గోడలు, వీధుల్లో శవాల గుట్టలు, రాబందులు, ఇంకా కాలుతూన్న ఇళ్ళనుంచి మంటలు, పొగలు…… స్మశానంలా, నరకానికి వాకిలిలా వుంది ఢిల్లీ నగరం.
జహా వీరానా హై పహ్లే కభీ ఆబాద్ యూన్ ఘర్ థే,
షాఘాత్ అబ్ హై జహా బస్తే, కభీ బస్తే బషర్ యూన్ థే
(ఇప్పుడు శూన్యంగా పాడుబడిన ఈ ప్రాంతంలో ఒకప్పుడు జీవంతో తొణికిసలాడిన నగరం ఉండేది. నక్కలు ఊళలు పెడ్తూ సంచరిస్తున్న ఈ వీధుల్లో, స్త్రీ పురుషులు గర్వంతో తల ఎత్తుకొని జీవించారు.)
బహదూర్ షా కంటి నుండి అతని హృదయ వేదన నీళ్ళలా కదలింది.
***
బహదూర్ షా జాఫర్ తల ఎత్తలేదు.
తల దించుకునే కూర్చున్నాడు.
తల ఎత్తితే తనని కాల్చి చంపుతారని అతనికి తెలుసు.
ఎందుకని ప్రాణాలు కాపాడుకోవాలనుకుంటున్నాడో కూడా అని అర్థం కావటం లేదు. కానీ ప్రాణాల మీద ఆశ పోవటం లేదు. అందుకే తల ఎత్తటం లేదు.
“పందివి రా నువ్వు. పందివి. తుచ్ఛుడివి. ముసలోడివి. పిరికిపందవు. నీవల్ల మావాళ్లు ఎంత మంది ప్రాణాలు కోల్పోయారో తెలుసా? నీ ప్రాణాలు మాత్రం కాపాడుకుంటున్నావు. పనికిరాని పందివి. పంది. పంది. పంది!”
కరువు తీరా బహదూర్ షా జాఫర్, ‘కింగ్ ఆఫ్ హిందూస్తాన్’ను బూతులు తిట్టాడు, అతని రక్షణ బాధ్యత తీసుకున్న ‘కెండాల్ కాగ్‌హిల్’.
బహదూర్ షా తల ఎత్తి చూస్తే కాల్చి చంపేందుకు సిద్ధంగా తుపాకీ పట్టుకుని ఉన్నాడు.
కానీ బహదూర్ తల ఎత్తలేదు.
చివరకి ఓపిక నశించి, మరిన్ని బూతులు తిట్టి, ‘ఛీ’ అని ఉమ్మేసి వెళ్ళిపోయాడు కెండాల్.
***
బహుదూర్ షా జాఫర్ తల ఎత్తటం లేదు.
“బోనులో ఉన్న జంతువులా ఉన్నాడు కదా!” ఒక బ్రిటీష్ సైనికుడు మరో సైనికుడితో అన్నాడు.
“ముసలి జంతువులా ఉన్నాడు” అన్నాడింకో సైనికుడు.
అందరూ, “ఓ జంతువా”, “పంది” అంటూ వెక్కిరిస్తూ పిలిచి నవ్వుకున్నారు.
ఖైదులో ఉన్న ఢిల్లీ సుల్తాన్‌ను జంతుప్రదర్శనశాలలోని కొత్త, విచిత్రమైన జంతువును చూసేందుకు వచ్చినట్టు తండోపతండాలుగా వచ్చి చూడసాగారు బ్రిటీష్ సైనికులు. కొన్ని నెలల క్రితం వరకు బహదూర్ షా దర్శనం లభించటమే దుర్లభమయ్యేది.
నడివీధిలో ఊరేగింపులో ఏనుగుపై నున్న బహాదూర్ షా జాఫర్‍ను, దూరం నుంచి నోరు తెరుచుకుని చూసేవారీ సైనికులు.
‘అదిగో హిందుస్తాన్ సుల్తాన్’ అని గుసగుసగా చెప్పుకునేవారు.
ఇప్పుడు వాళ్ళే ఆయనను ఓ జంతువులా చూస్తూ హేళన చేస్తున్నారు. అసహ్యించుకుంటున్నారు. అవమానం చేస్తున్నారు.
“మా ఇంట్లో ముసలి ఖిత్మత్‌గార్ (సేవకుడు) ఇలాగే ఉంటాడు”.
ఇంతలో ఓ ఆఫీసర్ వచ్చాడు.
“ఏయ్ ముసలోడా. నేను బ్రిటీష్ మిలటరీ ఆఫీసర్‍ని వచ్చాను. లేచి నిలుచుని సలామ్ చెయ్యి” అరిచాడు.
బహదూర్ షా జాఫర్ తల ఎత్తలేదు.
తల దించుకునే అతి కష్టపడి లేచాడు.
నడుం వంచి, చేతులతో నేలను తాకాడు. తలను తాకాడు.
ఇంతలో ఓ సైనికుడు బహదూర్ షా జాఫర్ దగ్గరకు దూకి గడ్డం లాగాడు. అందరూ నవ్వారు. బహదూర్ షాహ్ జఫర్ గడ్డం పీకటం కోసం పోటీలు పడ్డారు.
తూలి పడబోయి తమాయించుకున్నాడు జాఫర్.
మెల్లిగా కూర్చోబోయాడు.
“నేనింకా ఇక్కడే ఉన్నాను. నేనున్నంత సేపూ నువ్వు నుంచుని ఉండాలి” అరిచాడా ఆఫీసర్.
బహదూర్ షా జాఫర్ తల వంచుకునే నిలుచున్నాడు.
బుల్‍బుల్ కో పాస్‌బాన్ సే న సయ్యాద్ సే గిలా
కిస్మత్ మే ఖైద్ లిఖీ థీ ఫస్ల్-ఎ-బహార్ మే
(కోకిలకు తన కాపాలదారుపై కానీ, తనను వేటాడేవాడిపై కానీ ఎలాంటి ఫిర్యాదులు లేవు. కోపం, ద్వేషాలు లేవు. వసంతంలో బందీగా ఉండమని అదృష్టంలో రాసి ఉంది. దానికి ఎవరిని అని ఏం లాభం?)
బహదూర్ షా ఎంత మౌనంగా ఉండి, వారు చెప్పింది చేస్తుంటే, వారికంత కసి పెరిగిపోతోంది.
***
రాత్రి నిద్రకు ఉపక్రమిస్తున్న బహదూర్ షాహ జఫర్ తలుపు వద్ద అలికిడి అవటంతో ఆ వైపు చూశాడు.
సివిల్ కమీషనర్ చార్లెస్ సాండర్స్, అతని భార్య మాటిల్డా లోపలకు వస్తున్నారు. తమను చూసి లేవబోతున్న బహాదూర్ షా జాఫర్‍ను వారించాడు సాండర్స్.
“మీ ఇద్దరు కుమారులు, ముగ్గురు మనమళ్ళు మరణించారు” మెల్లిగా చెప్పాడు సాండర్స్.
“ఎలా” అస్పష్టంగా అడిగాడు బహదూర్ షా జాఫర్.
సాండర్స్ ఒక్క నిమిషం మౌనంగా ఉన్నాడు, ‘చెప్పాలా? వద్దా?’ అని.
ఇంతలో, అక్కడ కాపలాగా ఉన్న సైనికుడు చెప్పాడు గబగబా –
“వాళ్ళు ఎలాంటి షరతులు లేకుండా లొంగిపోయారు. వారిని ఎడ్లబండిలో తీసుకువస్తుంటే, రక్షించాలని కొందరు విప్లవకారులు ప్రయత్నించారు. అది హడ్సన్‍కు కోపం తెప్పించింది. రాకుమారులను బండి దిగమని ఆజ్ఞాపించాడు. వారి దుస్తులు విప్పించి, కాల్చి చంపేశాడు. వారి ఒంటి మీద ఉన్న ఆభరణాలను హడ్సన్ జేబులో వేసుకున్నాడు. వాళ్ళ నగ్న శవాలను బహిరంగంగా వేలాడగట్టాడు. ” (ఇప్పటికీ ఆ దర్వాజాను ఖూనీ దర్వాజా అంటారు.)
సాండర్స్ ముఖం తిప్పకున్నాడు. మాటిల్డా బేగమ్‍ను కలవాలని లోపలకు వెళ్లింది.
బహదూర్ షా జాఫర్ తల ఎత్తలేదు. తన బాధను ఎవ్వరికీ కనబరచలేదు. ఇప్పుడు తాను బాధపడినా బాధపడేదెవరు? తన కన్నీరుకు స్పందించేవారెవరు? అనుకున్నాడు.
ఇంతలో వార్త తెలిసినట్టుంది. లోపలనుంచి బేగమ్ జీనత్ మహల్ గొంతు పెద్దగా వినిపించింది.
“పీడ విరగడయింది. అడ్డు తొలగిపోయింది. ఇపుడు నా కొడుకు మీర్జా జవాన్ బఖ్త్ ఢిల్లీ సుల్తాన్ అయ్యేందుకు ఏ ప్రతిబంధకం లేదు” సంతోషంగా అంది జీనత్ మహల్.
మనసులో నవ్వుకున్నాడు బహదూర్ షా జాఫర్.
ఈ ఆశ, ఈ ఆరాటం, ముందుచూపు లేని ఈ స్వార్థం, భవిష్యత్తు గురించి ఆలోచన లేని ఈ లోభం, అధికార దాహం, ఈ దేశానికి శని లాగా పట్టుకున్నాయి . అందరూ కలసికట్టుగా నిలబడాల్సిన సమయంలో అహంకారం, స్వార్థం, కుట్రలు, కుతంత్రాలు, ద్వేషంతో, మోసాలాటలాడతారు. ఒకరినొకరు దెబ్బతీసుకుని విర్రవీగుతారు. నిలిస్తే అందరూ కలిసి నిలుస్తారు. ఒకరు దెబ్బ తింటే, అందరూ పడిపోతారన్న కనీస జ్ఞానం లేకుండా ఒకరినొకరు వెన్నుపోట్లుపొడుచుకుంటారు. ఏదో సాధించామన్న భ్రమలో ఉంటారు. తీరా గ్రహింపు వచ్చేసరికి అందరూ బానిసత్వపు పాతాళ బురదలో కూరుకుపోయి ఉంటారు.
మై నహీ హూఁ నగ్మా-ఎ-జాన్-ఫజా ముఝే సున్ కె కోయీ కరేగా క్యా
మై బడే బిరోగ్ కీ హూఁ సదా మై బడే దుఖీ కీ పుకార్ హూఁ
(నేను శ్రావ్యమైన గీతాన్ని కాదు, ఒకరు విని ఆనందించేందుకు. విని ఎవరేం చేస్తారు, నేను విభాజితుడి విహ్వల వేదనా ధ్వనిని. బాధాతప్త హృదయ రోదనను..)
ఇప్పటికీ ఆ హృదయ రోదన ధ్వనిస్తూనే ఉంది. దుఖీ కీ పుకార్ భారతదేశపు నలుమూలలా ప్రతిధ్వనిస్తూనే వుంది..
***
ఒక ప్రహసనంలాంటి విచారణ జరిపి బహదూర్ షాహ్ జాఫర్‌నూ అతని భార్యలను, సంతానాన్ని బర్మాకు పంపేశారు. అక్కడ అనామకుడిలా, మరణించాడు హిందుస్తాన్ ఒకప్పటి సుల్తాన్.. ఆయన మరణించేకన్నా ముందే దేశం కూడా అతడిని మరచిపోయింది.
బహదూర్ షాహ్ జాఫర్ సంతానాన్ని చంపి శవాలను వ్రేలాడదీసినందుకు హడ్సన్‌కు పై అధికారుల ప్రసంశలందాయి. బహదూర్ షాహ్ జాఫర్‌ను చంపకుండా అతడికి ప్రాణ భిక్ష పెట్టినందుకు అతడు పై అధికారులనుండి అభిశంసనలను ఎదుర్కోవాల్సివచ్చింది .