తెలంగాణ మలితరం కథకులు – కథనరీతులు-7: విస్మృత కథకుడు విద్వాన్ నాగం

1
3

[box type=’note’ fontsize=’16’] “విస్మృత కథకుడు విద్వాన్ నాగం” అనే ఈ వ్యాసంలో విద్వాన్ నాగం గారి ‘నాగం కథలు’ కథా సంపుటిని పరిచయం చేస్తున్నారు కె.పి. అశోక్ కుమార్. ‘రచయిత ఏ వస్తువు తీసుకున్నా, వాటి కథా కథనాలను ఆద్యంతం ఆసక్తిగా, ఉత్కంఠభరితంగా రూపొందించడంలో మంచి నేర్పు ప్రదర్శించారు. చక్కటి శైలి, పఠనీయతా గుణం ఈ కథలలో పుష్కలంగా వుంది’ అని వివరిస్తున్నారు. [/box]

[dropcap]వి[/dropcap]ద్వాన్ నాగం పేరుతో రచనలు చేసిన నాగం మల్లారెడ్డి నల్లగొండ జిల్లా నూతన్‌కల్‌లో 15 జనవరి 1933న జన్మించారు. నిజాం వ్యతిరేక ప్రజా విముక్తి పోరాటంలో తానూ ఒక క్రియాశీల కార్యకర్తగా పాల్గొన్నారు. మల్లారెడ్డి 1951లో వాల్తేరు నుంచి మెట్రిక్ పాసై కొంతకాలం ప్రభుత్వ సహకార శాఖలో ఉద్యోగం చేశారు. 1952లో ఉపాధ్యాయుడిగా చేరిన మల్లారెడ్డి హిందీ విద్వాన్, హిందీ పండిత్ శిక్షణ పూర్తి చేసి ప్రథమశ్రేణి హిందీ పండిత్‌గా పదోన్నతి పొందారు. తర్వాత ప్రయాగ హిందీ విశ్వవిద్యాలయం వారి సాహిత్యరత్న, హైదరాబాద్ నుండి ఉస్మానియా ఎం.ఏ. పట్టా పొందారు. 1987లో మెదక్ బాలికల జూనియర్ కళాశాల అధ్యాపకుడిగా వెళ్ళి 1991లో సూర్యాపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలకు ట్రాన్స్‌ఫర్ మీద వచ్చి అక్కడే ఉద్యోగ విరమణ చేశారు.

మొదటినుండి విప్లవభావాలు కలిగిన నాగం మల్లారెడ్డి కులరహిత సమాజం కోసం, సమసమాజ స్థాపన కోసం ఎంతగానో కృషి చేశారు. తన పేరులోని కులవాచకమైన రెడ్డి పేరును త్యజించి, విద్వాన్ నాగం పేరుతో చలామణీ అయ్యారు. తన సంతానానికి కూడా రెడ్డి పేర్లు చేర్చలేదు. సూర్యాపేటలో నాస్తిక కేంద్రం నెలకొల్పి దాని ద్వారా అధ్యయన శిబిరాలు, తదితర కార్యక్రమాలు కొనసాగించారు. చివరివరకూ ప్రజాసేవా కార్యక్రమాలలో తిరిగిన నాగం మల్లారెడ్డి 11 సెప్టెంబర్ 2000 నాడు కన్నుమూశారు. వారి భార్య సుశీలమ్మగారు కూడా స్వయంశక్తితో విద్యనభ్యసించారు. 1965లో గ్రామ సర్పంచ్‌గా ఎన్నికై, ఎన్నో ప్రజోపయోగ కార్యక్రమాలను చేపట్టారు. 1972లో అసోసియేట్ ఉమెన్ వర్కర్ ట్రైనింగ్, గ్రామ సేవికా ట్రైనింగ్ సెంటర్ల ఏర్పాటులోనూ, శిక్షణలోనూ పాల్గొని స్త్రీల అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహించారు. ప్రస్తుతం వృద్ధాప్యంలో కుకట్‌పల్లిలో ఉంటున్న తమ కూతురు నాగం సుమతి దగ్గర విశ్రాంతి తీసుకుంటున్నారు.

ప్రవృతిరీత్యా భావుకుడైన నాగం మల్లారెడ్డి కవిత్వం రాశారు. కథలతో పాటు “వలయాలు” అనే నవలను కూడా రాశారు. తెలంగాణా పోరాట యోధులు, గొబ్బూరి కృష్ణుడు, చంద్రశేఖర్ ఆజాద్ చరిత్ర పేరుతో జీవిత చరిత్రలను రాశారు. ఇవి గాక ఇంకా కొన్ని తెలుగు హిందీ రచనలు వివిధ పత్రికల్లో ప్రచురింపబడినాయి. కులవాచకమైన పేరు మీద అయిష్టతతో వీరు ‘నామరె’, ‘యం.ఆర్. నాగం’, ‘విద్వాన్ నాగం’ అనే కలం పేర్లతోనే తమ రచనలు వెలువరించడం గమనించదగ్గ విషయం.

‘నాగం కథలు’ పేరిట వెలువడిన కథా సంపుటిలో పది కథలు ఉన్నాయి. ఈ కథలలో ఎక్కువ భాగం స్త్రీల వైవాహిక జీవితాన్ని, మనస్తత్వ చిత్రణను తెలియజేస్తాయి.  పెళ్ళి కాని యువతుల జీవితాలు ఎన్ని మలుపులు తిరుగుతాయో ‘ఋషికన్య’, ‘మానభంగం’ కథలు వివరిస్తాయి. శ్వేతద్వీపంలో ఉన్న ‘ఋషికన్య‘ చాలా అందగత్తె. ఋషి తపోమహిమకు భయపడి దేవతలు కూడా ఆమె చేరువకు రాలేకపోతారు. భరతఖండంలోని సముద్రవ్యాపారి కొడుకు సోమ శేఖర్ సకల విద్యలను అభ్యసించి, ధన సంపాదన తర్వాతనే వివాహం చేసుకోవడానికి నిర్ణయించుకుంటాడు. తాను విని ఎన్నో కలలు గన్న ఋషికన్యను చేరడానికి వ్యాపారం పేరిట ఓడలు తీసుకుని సముద్రయానం చేస్తాడు. ఎన్నో కష్టాలు పడి మంచుప్రాంతమైన శ్వేతద్వీపాన్ని చేరుకుంటాడు. ఋషికన్యను వెతుక్కుంటూ వచ్చిన మానవుడికే ఆమెను ఇచ్చి పెళ్ళి చేస్తానన్న మాటకు కట్టుబడి ఆ ఋషి, ఆమెను సోమ శేఖరుడి కిచ్చి పెళ్ళి చేస్తాడు. ఋషికన్య కోరిక మేరకు సోమ శేఖరుడు అక్కడే ఉండిపోయినా, కూతురు అత్తారింట్లోనే ఉండడం సబబు అని నచ్చజెప్పి వారిని ఇంటివైపు పంపించి, ఋషి తపస్సు కోసం వెళ్ళిపోతాడు. ఏకాంత ద్వీపంలో ఋషి తపోమహిమ వల్ల ఋషికన్య క్షేమంగా వుండగలిగింది. అదే సామాన్య స్త్రీలు ముఖ్యంగా బీదింటి యువతుల పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే ‘మానభంగం‘ కథ చదవాల్సిందే. ఇల్లు గడవడమే కష్టంగా వున్న పేదరికంలో, వయసొచ్చిన పిల్ల వరలక్ష్మికి పెళ్ళి చేయడం ఇంటివాళ్ళకు పెద్ద సమస్యగా తయారవుతుంది. ఇంటిపనుల్లో చేదోడువాదోడుగా వుండే వరలక్ష్మి ఒక రోజు కట్టెలకని పొలాలకు వెళుతుంది. అక్కడ పల్లెటూరి కామందు, పెదకాపు కుమారుడు కోటిరెడ్డి వేసవి సెలవల్లో ఇంతికి వచ్చి, వాహ్యాళికని పొలానికి వస్తాడు. నిండు యవ్వనంలో వున్న వరలక్ష్మిని చూసి కామోద్రేకంతో, రాక్షసంగా ఆమెను బలాత్కరిస్తాడు. ఈ అన్యాయాన్ని, అవమానాన్ని భరించలేక వరలక్ష్మి నూతిలో దూకి ఆత్మహత్య చేసుకుంటుంది.

ఇలాంటి అమాయక యువతి ‘కొడిగట్టిన దీపం‘లో కూడా కనిపిస్తుంది. ఇందులొ డాక్టర్ అనిల్ తన భార్య రేఖను నాగరికంగా లేదనీ, సంస్కార హీనురాలని ఆమెను అవమానిస్తూ చివరకు వదిలించుకుంటాడు. తను ఒకప్పుడు ప్రేమించిన తన మెడికల్ కాలేజ్ స్టూడెంట్ సాధనను పెళ్ళి చేసుకుంటాడు. మరి నవనాగరికురాలైన సాధన పరపురుషుల కౌగిళ్ళలో వుంటే, అదేమని అడిగితే సంస్కారం లేదు, గెటవుట్ అంటుంది. దాంతో ఆమెకు విడాకులిచ్చిన డాక్టర్ అనిల్ దూరప్రాంతానికి ట్రాన్స్‌ఫర్ చేయించుకుంటాడు. అక్కడ ఆసుపత్రిలో చేరి సీరియస్ కండీషన్‍లో ఉన్న పేషంట్‌ని చూసి ఆమె రేఖ అని గుర్తుపడతాడు. తన సర్వశక్తులు ఒడ్డి ఆమెను బ్రతికించుకుంటాడు. ‘కొడిగట్టిన దీపం’ కాదు, తన జీవన జ్యోతియని తెలియజేస్తాడు.

ఇక ‘గిదేందే పిల్లా‘ కథలో పిల్లలు కావడంలేదని మొదటి భార్యను విడిచి పేరిగాడు, రంగిని మారుమనువు చేసుకుంటాడు. భర్త అంటే ఆధిపత్యం చూపించాలనుకునే పేరిగాడు, భార్య అంటే అణకువగా వుండాలనుకునే రంగిల మధ్య జరిగే అలకలు, దెప్పులాటలు, ప్రేమలు, పోట్లాటలు అన్నీ మరిచిపోయేలా, ఆమె నెల తప్పిందనే విషయం వారిని ఒకటి చేస్తుంది.

అక్రమ సంబంధాలు ఎప్పటికైనా అనర్థదాయకమే. వివాహితుల మధ్య కొనసాగే అక్రమ సంబంధాల వల్ల కాపురాలు కూలిపోవచ్చు. ధన, మాన, ప్రాణాలకు హాని కలగవచ్చు. అక్రమ సంబంధాలలో ఇరుక్కున్న ముగ్గురి ఆడవాళ్ళ జీవితాలను వివరిస్తూ రచయిత మూడు కథలు రాశారు. రంకు నేర్చినామె బొంకు నేర్వదా? అని ఒక సామెత. ఎందుకు నేర్వదు? తప్పకుండా నేరుస్తుందని ‘నెఱజాణ‘ కథ తెలియజేస్తుంది. ఇందులో భార్యను గుడిసెలో ఒంటరిగా వదిలి, రాత్రివేళ పొలం కాపలాకు వెళ్ళిపోతుంటాడు భర్త. కానీ భార్య ప్రవర్తనను అనుమానించిన భర్త ఒక రాత్రి ఆమెను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకోవాలని వస్తాడు. ప్రియుడితో సరస సల్లాపాలతో వున్న భార్య, భర్త రాకను పసిగడుతుంది. భర్తను ఏమార్చి ప్రియుడితో కలిపి, ఇద్దరినీ పనిమీద బయటకు పంపించిన ఆ ‘నెఱజాణ’ చాకచక్యాన్ని కథ చదివి తెలుసుకోవాల్సిందే. ‘హంసవింశతి’, ‘శుకసప్తతి’ కథల్లో కనిపించే విధానంలో ఈ కథ సాగడం విశేషం.

నెఱజాణ లాంటి నేర్పు లేకపోవడం వల్లనే నాంచారి జీవితం నాశనమైపోతుంది. ‘నాంచారి‘ భర్త చనిపోతూ ఆమెకు పదిహేనేండ్ల కొడుకు సర్వడు, చిన్న ఇల్లు, గొర్లెమందను మిగిల్చి పోతాడు. అయినా ఆమె మునుపటిలానే కష్టపడుతూ ఆస్తిని పెంచుకోగలుగుతుంది. సహజంగానే ఆమె అందగత్తె కావడం వలన అలంకరణలు పెరిగి యవ్వనోద్రేకంలో తోడు కోసం వెతుక్కుంటుంది. అలా లింగడితో సుఖం మరిగిన నాంచారి తమకు అడ్డు రాకుండా కొడుకు సర్వడ్ని చంపి బావిలో వేస్తుంది. ఉన్న ఆటంకం తొలగిపోయేటప్పటికి లింగడికి సర్వాధిపత్యం లభించినట్లయి, నాంచారిని చిన్నచూపు చూడడం మొదలుపెడతాడు. వాడి మాటలు నమ్మి రెంటికి చెడిన రేవడిలా తన పరిస్థితి తయారైందని నాంచారి విచారిస్తుంది. ప్రతీకారేచ్ఛతో విషం కలిపిన మద్యం ఇచ్చి లింగడిని చంపివేస్తుంది. సర్వడి హత్యను పసిగట్టి వచ్చిన పోలీసులు తలుపు తట్టడంతో, నిజం తెలిసిపోయిందని గ్రహించిన నాంచారి ఉరి వేసుకుని చచ్చిపోతుంది.

అక్రమ సంబంధాల విషయంలో స్త్రీనే దోషిగా నిలిపి శిక్షించడానికి ఉబలాటపడే పెద్దల వెనుక పురుషాధిక్య భావజాలం ఎంత బలంగా పనిచేస్తుందో ‘న్యాయ నిర్ణయం‘ కథలో చూడవచ్చు. ఇందులో సైనికుడుగా యుద్ధానికి వెళ్ళిన అజిత్ ఇంటికి తిరిగి వచ్చేసరికి జారత్వ దోషంతో న్యాయ విచారణను ఎదుర్కుంటున్న భార్య సునంద గర్భిణిగా కనిపిస్తుంది. ఆమె పాపం చేసింది కాబట్టి మరణదండన విధిస్తాడు పీఠాధిపతి. ఆమె చివరి కోరికగా, “సమయింపలేని ఉద్రేక స్థితిలో జరిగిపోయిన ఒకే ఒక చర్య వల్ల స్త్రీ చావవలసిందేనా?” అని ప్రశ్నించి, దీనికి సమాధానం కావాలని కోరుతుంది. దాంతో ఆనాటి పురుషాధిక్య సమాజంలో స్త్రీలు పడిన బాధలు ఒక్కొక్కటి బయటపడుతుంటాయి. అజిత్ తండ్రి నాలుగుసార్లు పెండ్లి చేసుకుంటాడు. మొదటి ఇద్దరు భార్యలు అతనిచేత వధింపబడినారు. మూడవది స్వయంగా ఆత్మహత్య చేసుకున్నది. నాల్గవ భార్యకు అజిత్ పుట్టి ఏడాది నిండకుండానే అతని తండ్రి చనిపోయాడు. ‘అతను బతికి వుంటే నేను ఎప్పుడో చనిపోయేదాన్ని’ అని అజిత్ తల్లి చెబుతుంది. ఆమె కూడా సునంద చావవలసిందే అంటుంది. ఎందుకని ప్రశ్నిస్తే, “సునందను నీవు ఇప్పుడు వధించకున్నా, సంఘం ఆమెను మనిషిగా ఉన్నంతకాలం వధిస్తునే వుంటుంది” అంటుంది. “స్త్రీ అంటే స్వాభావికముగా వంచకురాలు, భయంకరమైనది. పురుషుడామెను సక్రమమార్గాన నడిపించే రక్షకుడిగా వుండాలి. స్త్రీ తన స్వేచ్ఛను సద్వినియోగం చేసుకోలేదు” అని పీఠాధిపతి అభిప్రాయం. అంతలో గుంపు లోంచి వసుమతి అనే వృద్ధురాలు లేచి “ఓ అజితా! సునంద ఒక్కదానికే మరణశిక్ష విధించబడింది. ఆమె గర్భస్త శిశువుకు వర్తించదు” అని అడ్డుకుంటుంది. న్యాయము, సంప్రదాయము అన్నప్పుడు ఆ వసుమతి “నేను పదహారేండ్ల ప్రాయములో ఇద్దరు పురుషులచే మానభంగానికి గురి అయ్యాను. అందులో ఒకరు ప్రస్తుత పీఠాధిపతి సత్యదేవుడనీ, రెండవవాడు తన భర్త అయిన ధర్మదేవుడని చెబుతుంది. దాంతో ముఖం చెల్లక పీఠాధిపతి సత్యదేవుడు వెళ్ళిపోతాడు. మొదటినుంచి ఈ వ్యవహారాన్ని అంతా వ్యతిరేకిస్తున్న చార్వాకుడు మిగిలివుంటాడు. న్యాయము, సంప్రదాయం అని మాట్లాడేవాళ్ళలో పవిత్రులుగా వున్నవారు ఎవరో ముందుకు రమ్మంటాడు. ఈ విచారణను ధైర్యంగా ఎదుర్కున్న సునంద, నిజాయితీగా తన తప్పుని ఒప్పుకుని, అందరిని ప్రశ్నించి ఆలోచింపజేసింది. ఆమె నిజాయితీకి మెచ్చి ఆమెను విడుదల చేస్తానంటాడు. అజిత్ ఆమెను మునుపటిలానే స్వీకరించడానికి ముందుకురాగా, అత్త కూడా ఆమెను చేరదీయడంతో కథ ముగుస్తుంది. ఈ కథలో స్త్రీ పురుష సంబంధాలు, సంప్రదాయాలు, సామాజిక విలువలను విస్తృతంగా చర్చకు బెట్టిన విధానం ఆలోచింపజేస్తుంది. ఆర్.జి. కులకర్ణి రాసిన “చార్వాక అండి చారిణి” అన్న ఆంగ్ల గ్రంథం ఆధారంగా రాసిన ఈ పెద్ద కథను ఎక్కడా బిగి సడలకుండా ఆసక్తితో రూపొందించిన విధానం ఆకట్టుకుంటుంది.

రచయిత మంచితనాన్ని తెలియజేసే ఒక కథ, కథకుడి ఉలికిపాటును తెలియజేసే మరో కథ ఇందులో వున్నాయి. ‘దోహదం‘ కథలో అద్దె ఇంట్లో వున్న ఒక మతిమరపు రచయిత చేసే అవకతవక పనులన్నింటినీ ఆ ఇంటి యజమాని కూతురు సుందరి చక్కదిద్దుతూ అతడ్ని హెచ్చరిస్తూ వుండేది. భర్త విడిచిపెట్టిన సుందరి భవిష్యత్తు కొరకు ఎప్పుడూ వగచే ఆ ముసలి తల్లిదండ్రుల పట్ల రచయితకు జాలి ఏర్పడుతుంది. తనను ఆప్యాయంగా చూసుకునే ఆ కుటుంబ సభ్యుల ఋణం తీర్చుకోవడానికి, సుందరిని పెళ్ళి చేసుకుంటానని ఆమెతో చెబుతాడు. దానికి సుందరి తిరస్కరించి, ఆయన రచనలు చదివి ఆయన పట్ల ఆరాధనాభావాన్ని ఏర్పరుచుకున్నానని చెబుతుంది. “నేను ఎక్కడ ఏ పరిస్థితులలో వున్నా నా అంతిమయాత్రను గురించిన సమాచారం మీకు తప్పక అందుతుంది. అప్పుడు నేటి నా మానసిక స్థితిని గూర్చి ఒక కథ వ్రాయండి. అంతే చాలు” అని కోరుకుంటుంది.ఇది జరిగిన కొన్ని రోజులకే సుందరి కనిపించకుండా పోతుంది. తన వల్లనే డిస్టర్బ్ అయి సుందరి ఇంట్లోంచి వెళ్ళిపోయిందేమో అనే శంకతో రచయిత కొట్టుమిట్టాడుతూంటాడు. సుందరి వెళ్ళిపోయిన రెండు నెలలకు అతనికి ఒక ఆకాశరామన్న ఉత్తరం వస్తుంది. అందులో “మీరు చలనమిచ్చి వదిలిన బండిని నేను గమ్యం చేర్చాలనుకున్నాను. ఆమె పట్ల మీరు ప్రదర్శించిన పరోపకార బుద్ధి వక్ర ఫలితాన్ని ఇచ్చింది. నేను వక్రంగా సాధించిన పెన్నిధి నడమంతరంగానే చరమాంకం ప్రదర్శించింది. తన వృద్ధ మాతాపితల బాధ్యతను మీకే వదులుతూ తన అంతిమయాత్రను గురించిన వర్తమానం మీకు తెలియజేయగోరుతూ రెండు రోజుల క్రితం సుందరి ప్రాణాలు విడిచింది” అని చదివి రచయిత దిగులుతో కుమిలిపోతూండగా కథ ముగుస్తుంది.

భావుకుని స్వగతం‘ కథలో, హైదరాబాదులో జరిగే కథకుల సమావేశానికి వెళ్ళి మన రచయిత అక్కడ తన కథను చదివి, వ్యాఖ్యానించి రావాలనే ఆహ్వానం అందుతుంది. ఆ సభకు అధ్యక్షులుగా ఒక మహిళను ఎంపిక చేయడం అతనికి నచ్చదు. ఎందుకంటే మహిళలు రంధ్రాన్వేషకులు అని రచయిత అభిప్రాయం. అందుకని నేర్పుగా ఎలా మాట్లాడాలా అని ఆలోచిస్తూ, పరధ్యానంగా తాను తాగుతున్న సిగరెట్ బయటకు విసిరేస్తాడు. బయట అది తొక్కిన మహిళ పెట్టిన కేకకు మన రచయిత వెళ్ళి క్షమాపణ చెప్పుకుంటాడు. తీరా తాను వెళ్ళి కథన సమావేశానికి ఆ మహిళయే అధ్యక్షురాలిగా కనిపించడంతో రచయిత ఖంగుతింటాడు. ఈయన వంతు వచ్చేసరికి అధ్యక్షురాలు ఆ సిగరెట్ ఉదంతంతో పాటు వారి రచనల మిద వ్యంగ్యంగా వ్యాఖ్యానించడంతో, తన కథను చదివి వివరణ ఇవ్వలేక రచయిత బయటకు వచ్చేస్తాడు. ఇందులో మొదటి కథ సీరియస్‌గా వుంటే, రెండవ కథ హాస్యధోరణిలో నడిచింది.

విద్వాన్ నాగం రాసిన కథలలో ‘అందని లోతులు’, ‘అధిక+అరి’ కథలు విలక్షణమైనవి. ‘అందని లోతులు‘ కథలో, ఇంట్లో అల్లారు ముద్దుగా పెరుగుతున్న బాలిక ఇందిర. తాను పుట్టిన తర్వాత ఎప్పుడూ రాని అక్కయ్య చాలా రోజులకు పుట్టింటికి వస్తుందంటే తల్లిదండ్రులతో పాటు ఇందిర కూడా చాలా సంతోషిస్తుంది. తీరా అక్కయ్య వచ్చింతర్వాత అందరూ అక్కయ్య చుట్టూ, ఆమె కొడుకు చుట్టే తిరుగుతూంటారు తప్ప ఇందిరను ఎవరూ పట్టించుకోరు. కొన్నిసార్లు చీవాట్లు కూడా తినాల్సి వస్తుంది. తన హక్కులను, ఆధిపత్యాన్ని ఎవరో గుంజుకున్నట్లుగా ఆ పసిహృదయం బాధ పడుతుంది. అక్కయ్య వెళ్ళిపోయింతర్వాత తల్లి మునుపటిలానే, తన పట్ల చూపించే ప్రేమాభిమానాలను చూసి ఆశ్చర్యపోతుంది. చైల్డ్ సైకాలజీ ఆధారంగా నడిచిన ఈ కథనంతా ఒక బాలిక దృక్పథంతో నడపడం వల్ల, కథ ఆసక్తికరంగా తయారై పాఠకులను ఆకట్టుకుంటుంది.

అధిక+అరి‘ కథలో నౌకర్లు, చాకర్లు వున్న పెద్ద భవంతిలో విలాసంగా వున్న ఆఫీసర్ దగ్గరకు, రెండు నెలల నుండి రావల్సిన జీతం అయిదు రూపాయల కోసం పాకీ మనిషి వస్తుంది. ప్రసవ వేదన పడుతున్న తమ కుమార్తెను చూడడానికి ఐదు రూపాయలిస్తేనే వస్తానంటుంది మంత్రసాని. తనకు రావలసిన జీతం ఐదు రూపాయలు ఇమ్మంటే మండిపడ్డ ఆఫీసర్, ఆమెను వెళ్ళగొట్టమని నౌకరుకు చెబుతాడు. ఆమె కష్టం విన్న నౌకరు తన జేబులోంచి వున్న రెండున్నర రూపాయలు ఇచ్చి ఆమెను పంపించివేస్తాడు. యజమాని కంటే నౌకరే నయమని భావించిన పాకీ మనిషి ఇంటికి వెళ్ళేసరికి ప్రసవ వేదన తట్టుకోలేక చనిపోయిన కూతురు కనిపిస్తుంది. అధికారమదం తలకెక్కిన వాళ్ళు కష్టజీవుల కన్నీరును పట్టించుకోరని ఈ కథ తెలియజేస్తుంది. ఈ కథకు అధికారి అనే పేరు పెట్టడంలో రచయిత చమత్కారం చూపారు. “అధికారి” అనే పేరును విడదీస్తే ‘అధిక+అరి’ అవుతుంది. అంటే ఎక్కువమందికి శత్రువు అనే అర్థం వస్తుంది. అధికారులంతా ప్రజాశత్రువులుగా తయారవుతున్నారన్న భావన ఇందులో కనిపిస్తుంది.

ఈ సంపుటిలోని ‘నెఱజాణ’, ‘భావుకుని స్వగతం’, ‘న్యాయ నిర్ణయం’ కథలు తప్ప – తక్కినవన్నీ ఆంధ్ర పత్రిక, గోలకొండ పత్రిక, ప్రజావాహిని, శశిరేఖ, రత్నప్రభ, ప్రగతి పత్రికలలో ప్రచురింపబడినాయి. పత్రికల పేర్లు వున్నాయి కానీ కథలు ఎప్పుడు ప్రచురింపబడినాయో తేదీలు ఇవ్వలేదు. కానీ ఈ కథా సంపుటి 1966లో వెలువడింది కాబట్టి, ఈ కథలన్నీ అంతకుముందే రాసినవని గ్రహించాలి. ‘అధిక+అరి’ కథ మాత్రం 1970లో వెలువడిన ‘దర్పణం’ కథల సంపుటిలో ప్రచురితమైంది.

రచయిత ఏ వస్తువు తీసుకున్నా, వాటి కథా కథనాలను ఆద్యంతం ఆసక్తిగా, ఉత్కంఠభరితంగా రూపొందించడంలో మంచి నేర్పు ప్రదర్శించారు. చక్కటి శైలి, పఠనీయతా గుణం ఈ కథలలో పుష్కలంగా వుంది. ‘గిదేందే పిల్లా’ కథను పూర్తి తెలంగాణ మాండలికంలో తీర్చిదిద్దిన తీరు ప్రశంసనీయం. ఇందులో ‘ఋషికన్య’ శ్రీరామ కృష్ణదాస్ కథకు, ‘అందని లోతులు’ వి.కె. సుబ్రహ్మణ్యం గారి ఆంగ్ల కథకు అనువాదం కాగా, ‘న్యాయ నిర్ణయం’ కథకు ఆర్.జి.కులకర్ణి రాసిన “చార్వాక అండ్ చారిణి” అన్న ఆంగ్ల గ్రంథం ఆధారం. ఎక్కడా అనువాదం అని గుర్తించని విధంగా, స్వతంత్ర్య రచనల్లా ఇవి కొనసాగడం విశేషం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here