[box type=’note’ fontsize=’16’] బాల్యంలోని అమాయకత్వాన్ని, అందాన్ని గుర్తు చేసి మధురస్మృతులకు మళ్ళించే చల్లా సరోజినీదేవి కబుర్లు “సిరి ముచ్చట్లు” సిరీస్‌లో పదవ ముచ్చట. [/box]
[dropcap]సి[/dropcap]రి 10వ తరగతిలోకి వచ్చింది. తన బెస్ట్‌ఫ్రెండ్స్ విరజా, గిరిజలూ తనూ ఎప్పుడూ కలిసే వుండే వాళ్ళు. ఎప్పుడూ విడిపోని ఈ ముగ్గురినీ చూసి ‘కవిత్రయం’ అని చాలా మంది కామెంట్ చేసే వాళ్ళు. అసూయపడే కొందరు మాత్రం ‘మూడు కోతులు’ అనే వాళ్ళు. ఎవరేమనుకొన్నా ఈ ముగ్గురూ ఎంతో అన్యోన్యంగా, బడిలో వున్నంత సేపూ ఒకే జట్టుగా, కలిసికట్టుగా తిరిగేవాళ్ళు. సిరికి లాగే విరజా, గిరిజలకు కూడా వర్షమంటే చాలా ఇష్టం. వర్షంలో ఎంత సేపైనా తడవడం సరదా ముగ్గురికీ.
ఒకసారి స్కూల్ వదిలేసే సమయానికి ఏనుగుల గుంపులా నల్లని మేఘాలు కమ్ముకొని వచ్చాయి. చల్లటి గాలి ఆహ్లాదకరంగా వీస్తున్నది. లాస్ట్ పీరియడ్ గావడముతో పిల్లలంతా గ్రౌండ్‌లో తిరుగాడ్తూ ప్రకృతిని ఎంజాయ్ చేస్తూ, కేరింతలు కొడ్తున్నారు. వున్నట్లుండి మెరుపులు ఉరుములూ మొదలైనవి. సివిల్ డ్రెస్‌లో వున్న పిల్లలంతా రంగు-రంగుల సీతాకోకచిలుకల్లాగా గ్రౌండ్‌లో విహరిస్తున్నారు. గిరిజ కొంచెం సన్నగా వుంటుంది ముగ్గురిలో.
బలంగా వీచే గాలి కెదురెళ్తూన్న వారిలో గిరిజ అప్రయత్నంగానే రెండడుగులు ముందుకెళ్ళింది.
‘ఏయ్ ఎందుకే అలాగ ముందు పరిగెత్తుతున్నావు’ అన్నది విరజ. ‘నేనేమి వెళ్ళడం లేదు గాలే నన్ను తోస్తున్నది’ అన్నది గిరిజ.
సిరి గిరిజ చేయపట్టుకొని ‘మరి ఇంత సన్నగా మునక్కాడలాగుంటే గాలికీ లోకువే కదా!’ అన్నది నవ్వుతూ.
“సరిగా తినేడవదు కదా, అన్నీ ఏరేరి పెడ్తుందాయే” అన్నది విరజ.
“అవును మరి. పాపం వాళ్ళమ్మ ఎంతో కష్టపడి వండి బాక్స్ పెట్టిస్తే అన్నీ పడేస్తుంది గదా!” అన్నది సిరి. ‘ఇంక నుండీ అన్నీ తిని నీలాగ గుమ్మడి కాయనవుతాను లేవే’ అన్నది గిరిజ నవ్వుతూ. నిజానికి ఆ ముగ్గురిలోనూ కొంచెం బోద్దుగా వుండేది సిరే.
‘ఊ నిన్ను మునక్కాయన్నానని నన్ను గుమ్మడి కాయంటున్నావు కదూ?’ అలిగినట్లుగా అన్నది సిరి. “అదేమీ కాదులేవే. నువ్వు గుమ్మడికాయ లాగ నిండుగా వుంటేను…” అని నవ్వింది గిరిజ.
మరి నేనేమి కాయనన్నట్లు అడిగింది విరజ. సొరకాయ టపీమని అన్నది గిరిజ.
‘ఎందుకలాగ’ అడిగింది సిరి.
‘మరి సొరకాయలో వున్నట్లుగానే వంపులన్నీ విరజలోనూ వున్నాయి కదే’ అంటూనే సిరి వెనక్కి వెళ్ళింది గిరిజ.
విరజ చిరుకోపంతో ‘నిన్నూ… ఆగక్కడ తంతాను చూడు’ అని గిరిజ వైపు రాబోయింది.
‘ఆగవే తల్లీ. అది నీ అందాన్ని పోగిడింది. వెక్కిరించలేదే’ అని సర్దిచెప్పింది సిరి. విరజ కూడా నవ్వేసింది. ముగ్గురూ చెట్టాపట్టాలేసుకొని కబుర్లు చెప్పుకొంటూ, నవ్వుకొంటూ నడుస్తున్నారలాగే. అనుకున్నట్లే హోరున వర్షం మొదలైంది. పిల్లలంతా బిలబలా పెరిగెత్తి వరండాలో తలదాచుకొన్నారు.
కాని ముగ్గురు మిత్రురాళ్ళు ఆనందంగా తడుస్తూ విహరిస్తున్నారు. విశాలమైన గ్రౌండ్‌లో, అక్కడక్కడా వున్న చెట్లు కూడా వర్షంలో తడుస్తూ, గాలికి కొమ్మలనూపుతూ తమ ఆనందాన్ని ప్రకటిస్తునాయి. వీళ్ళు ఆ చెట్ల క్రింది కెళ్ళే ప్రయత్నం కూడా చేయడములేదు. ముగ్గురి బట్టలూ తడిచి ముద్దయినవి. తలలు తడిచి, పాయలు పాయలుగా నీళ్ళు కారుతున్నాయి. వాళ్ళ లంగాల అంచులన్నీ మట్టితో నిండి, బాగా తడవడం వల్ల కాళ్ళకు చుట్టుకొంటున్నాయి. అయినా వాళ్ళ ఆనందంలో వాళ్ళున్నారు. మిగిలిన పిల్లలంతా వరండాలో నిలబడి వీళ్ళ వైపు కూతూహలంగా చూస్తూన్నారు. ఇంతలో పై అంతస్తులో నిలబడిన హెడ్‌మిస్ట్రెస్ వీళ్ళను చూసింది.
‘వర్షంలో ఎందుకలాగ తడుస్తున్నారు, లోపలికెళ్ళండి’ అని గట్టిగా కేకేసిందావిడ.
ముగ్గురూ తలెత్తి పైకి చూసారు.
‘ఏంటి చూస్తూన్నారు వెళ్ళండి లోపలికి’ అని మళ్ళీ గద్దించింది హెడ్‌మిస్ట్రెస్.
గబగబా వరండాలోకి వెళ్ళారు సిరి, విరజ, గిరిజలు. వర్షం తగ్గుముఖము పట్టింది. ఒక 5 నిమిషాలాగి తల బయటికి పెట్టి పైకి చూసింది సిరి. H.M కనబడలేదు. ‘పదండే మేమ్ లేదులే’ అంటూ మళ్ళీ సన్నగా కురుస్తున్న వర్షంలో తడిచేందుకు గ్రౌండ్‌లోకి దారి తీసింది సిరి. విరజ, గిరిజలు కూడా ముందు కెళ్ళారు. వీళ్ళను చూసిన మిగతా పిల్లలంతా కూడా వాళ్ళని అనుసరించారు. వర్షం బాగా తగ్గిందప్పటికి. సన్నగా పారుతున్న నీళ్ళలో చిన్న పిల్లలు కాగితపు పడవలు చేసి వేస్తున్నారు. అవి తయారు చేసిస్తున్నారు సిరి, విరజా గిరిజలు. పిల్లలంతా సంతోషంతో కేరింతలు కొడ్తూ ఆడుకోవడం చూసిన హెడ్‌మిస్ట్రెస్ కూడా చిరునవ్వులు చిందించింది.