శ్రీవర తృతీయ రాజతరంగిణి-13

0
2

[శ్రీవర విరచిత జైన (జైనులాబిదీన్) రాజతరంగిణిగా పేరుపొందిన తృతీయ రాజతరంగిణి వ్యాఖ్యాన సహిత అనువాదాన్ని ధారావాహికగా అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]

అన్యోన్యం సరూషో రాజపుత్రయోర్మన్త్రి దుర్నయాత్।
అభూజ్జ్యేష్ఠ కనిష్టత్వం ప్రక్రియా రహితం తయో॥
(శ్రీవర రాజతరంగిణి, 64)

మంత్రుల కుట్రల కారణంగా సుల్తాన్ పెద్ద కొడుకు, చిన్న కొడుకుల నడుమ క్రోధ, వైషమ్యాలు పెరిగిపోయాయి. పెద్ద చిన్న అన్న భేదం లేకుండా వారిద్దరూ ఒకరినొకరు ద్వేషించుకోసాగారు.

శ్రుత్వథ పుత్రయోః వైరమన్యోన్యం జాతు భూపతిః।
ఆహ స్మాదమఖానం స విదేశగమనత్వరామ్॥
(శ్రీవర రాజతరంగిణి, 65)

పుత్రుల నడుమ వైర భావనలను తెలుసుకున్న సుల్తాన్, పెద్దవాడయిన ఆదమ్‍ఖాన్‍ను విదేశాలకు పంపాడు.

శ్రీవరుడు చెప్పినదాన్నే మరో రకంగా చెప్తారు పర్షియన్ చరిత్ర రచయితలు. పుత్రుల నడుమ ద్వేష భావనలు ఎంత తీవ్రమయ్యాయంటే, వారు తండ్రిపై విప్లవానికి, తిరుగుబాటుకు కూడా సంసిద్ధమయ్యారు. విషయం తెలుసుకున్న సుల్తాన్ వారిని వేరు చేయాలనుకున్నాడు. తన సంతానంలో జ్యేష్ఠుడైన ఆదమ్ ఖాన్ అంటే సుల్తాన్‍కు ఇష్టం లేదు. అతడిని తన వారసుడిగా ప్రకటించినా, ఆదమ్ ఖాన్ – సమయమంతా తాగుడులో, విలాసాలలో గడపటం సుల్తాన్‌కు నచ్చలేదు. అలాంటివాడు రాజు అయితే కశ్మీరానికి నష్టం అని భావించాడు. అందుకని అతడిని కశ్మీరు బయటకు పొమ్మని ఆజ్ఞాపించాడు.

‘సైన్యం ఇచ్చి తిబ్బత్తుపైకి పెద్ద కొడుకుని యుద్ధానికి పంపాడ’ని ఫరిష్తా రాశాడు. ‘తిబ్బత్తుపై యుద్ధానికి ఆదమ్ ఖాన్‍ను పంపాడ’ని తవక్కల్ అక్బరీలో రాశారు. శ్రీవరుడు మాత్రం ‘విదేశం’ అన్నాడు.  కాశ్మీరు కాకుండా వేరే దేశానికి పంపాడని మాత్రం చెప్పాడు శ్రీవరుడు.

యుక్తముక్తం న గృహ్ణామి కుపుత్ర యది మద్దచః।
మానప్రాణ ద్వంసే ప్రత్యూహస్తేవ్యథా భవేత్॥
(శ్రీవర రాజతరంగిణి, 66)

సుల్తాన్ తన పెద్ద కొడుకుని ‘కుపుత్ర’ అని సంబోధించాడని శ్రీవరుడు రాస్తున్నాడు. ‘ఓరి దుష్టుడా, నేను ఆజ్ఞాపించినట్లు నువ్వు చేయకుంటే నీ ధనం, మానం, ప్రాణం సర్వం ధ్వంసం చేస్తాను’ అన్నాడు శ్రీవరుడు.

శ్రీవరుడు జైనులాబిదీన్‍కు ఆంతరంగికుడు. ఫరిష్తా కానీ, తవ్వకల్-ఎ-అక్బరీ రాసిన ఖ్వాజా నిజాముద్దీన్ అహ్మద్ కానీ జైనులాబిదీన్ తరువాత వందేళ్ల తరువాతనే తమ రచనలు చేశారు. పైగా వారు కశ్మీరుకు చెందినవారు కారు.  కాబట్టి, పెద్ద కొడుక్కు దేశ బహిష్కారం విధించాడు సుల్తాన్ అని చెప్పే బదులు, సైన్యం తోడిచ్చి టిబెట్‌పై దాడికి పంపాడనటం పరువుగా ఉంటుందని భావించి ఉంటారు.  ఈ విషయంలో శ్రీవరుడిని ప్రామాణికంగా తీసుకోవచ్చు.

శ్రీవరుడు రాసిన దాన్ని బట్టి చూస్తే, సుల్తాన్‌కు ఆదమ్ ఖాన్ ధూర్తుడని తెలుసుననీ, అతడికి దేశ బహిష్కారం లాంటి శిక్ష విధించాడనీ, తిరగబడకుండా హెచ్చరించి ఉంటాడనీ అనిపిస్తుంది.

శృత్వేతి పితృసందేశ స భృత్యాన్నవీద్ వరమ్।
తత్ పర్ణోత్సపథా యామః సుస తత్వైవ నః సదా॥
(శ్రీవర రాజతరంగిణి, 67)

తండ్రి మాటలు విన్న ఆదమ్ ఖాన్ తన సేవకులతో ‘పర్ణోత్స పోదాం రండి. అక్కడే సుఖంగా ఉందాం’ అన్నాడు.

‘పర్ణోత్స’ అంటే ఇప్పటి పూంఛ్. తిబ్బత్తుపై దాడికి వెళ్లటం, సుల్తాన్ సైన్యం ఇచ్చి పంపటం అంతా పర్షియన్ చరిత్ర రచయితలు కల్పించిన కట్టుకథ. ఎందుకంటే, ఆ కాలంలో జరిగిన సంఘటనలకు శ్రీవరుడు ప్రత్యక్ష సాక్షి. పైగా, శ్రీవరుడు, రాజతరంగిణి రచనను, కత్తుల నీడలో నిలబడి రాస్తున్నాడు.  ఒక్క పొరపాటు పదం, ఒక్క చులకన వ్యాఖ్య దొర్లినా రాజతరంగిణి రచన పూర్తికాదు. అతని తల శరీరం నుంచి వేరయిపోతుంది. శ్రీవరుడు చెప్పిది సత్యమనీ, ఆ కాలంలోనూ ఆమోదం పొందింది కాబట్టి ఆదమ్ ఖాన్ తిబ్బత్తు కాదు, ‘పర్ణోత్స’కు దేశ బహిష్కారం తరువాత వెళ్ళాడనీ నమ్మవచ్చు.

అథోచుస్తే తవ భ్రాతా దాతా జాతోత్సుదారథీః।
స్వలక్ష్మీం భృత్యసాత్ కర్తుం స క్షమో న భవాన్ కృదిత॥
(శ్రీవర రాజతరంగిణి, 68)

ఆదమ్ ఖాన్ మాటలు విన్న సేవకులు ‘నువ్వు మాకు ధనం ఇవ్వగలవా?’ అని సూటిగా అడిగారు. అంతేకాదు, ‘మీ సోదరుడు మాకు ధనం ఇస్తాడు. అలా నువ్వు ఇస్తావా?’ అని అడిగారు.

వరం మరణమేవాస్తు తదగ్రే నోద్య సేవయా।
విక్రమాది గుణైర్హీనం న త్యామేవం భజామహే॥
(శ్రీవర రాజతరంగిణి, 69)

తన స్వధనం ఇష్టం వచ్చినట్టు ఇచ్చే అతడి (సోదరుడు) సమక్షంలో మరణం శ్రేష్ఠం. విక్రమంతో సహా ఇతర సుగుణ రహితుడవైన నీకు సేవ చేయం.

ఆదమ్ ఖాన్‌ అంటే సేవకులలో సైతం ఎంతటి చులకన భావాలున్నాయో ఈ వాక్యాలు స్పష్టం చేస్తాయి. అందుకే ఆదమ్ ఖాన్‍ను సుల్తాన్ ‘కుపుత్ర’ అన్నాడు. దేశం వదిలి పొమ్మన్నాడు.

అగ్రజానుజయోః రాజపుత్రయోః సుఖదుఃఖయోః।
విపర్యయం వ్యథాద్ వేధాః ప్రమాతేవ విభాగినోః॥
(శ్రీవర రాజతరంగిణి, 70)

అన్నదమ్ములు ఆస్తులను విభాగించుకునే సమయంలో ఒక మధ్యవర్తి నడుమన నిలబడేట్టు, జ్యేష్ఠుడు, కనిష్టుడి – అదృష్టం, సుఖం, దుఃఖాల నడుమ విధి నిలబడింది.

చక్కటి తాత్త్విక భావన కలిగించే శ్లోకం.

అన్నదమ్ములిద్దరూ ఆస్తులు పంచుకుంటున్నారు. ఇద్దరూ ఆస్తులు సమానంగా పంచుకున్నా, ఇద్దరి అదృష్టాలు, సుఖదుఃఖాలు ఒకటి కావు. మన కళ్ళ ముందే మనం అంబానీ సోదరులను చూస్తున్నాం. వారి నడుము ఆస్తి పంపకాలు సమానంగా జరిగాయి. కానీ, ఇప్పుడు చూస్తే అంబానీ సోదరుల అదృష్ట సుఖదుఃఖాలు, ఆస్తిపాస్తుల నడుమ ‘విధి’ నుంచోడం అర్థమవుతుంది.

అథాశంక్య నృపః పాపం తద్దధాత్ కతిచిద్దినైః।
బహిర్నిష్కాసయామస భుట్టమార్గేణ తం సుతమ్॥
(శ్రీవర రాజతరంగిణి, 71)

అన్నదమ్ముల నడుమ వైరం ఎంత తీవ్ర స్థాయిలో ఉందంటే, ఆదమ్ ఖాన్ ప్రాణాలకు ప్రమాదం ఉందని శంకించాడు సుల్తాన్. అందుకని సోదరుల నడుమ పోరును, హింసను, హత్యలను నివారించేందుకు ఆదమ్ ఖాన్‌ను భుట్టమార్గం ద్యారా కశ్మీరు బయటకు పంపాడు.

‘భుట్టమార్గం’ అంటే ఫరిష్తా  వంటి వారు ‘తిబ్బత్తు’ అనుకున్నారు. కానీ టిబెట్ చరిత్రలో ఆదమ్ ఖాన్ ఆ దేశంపై దండెత్తినట్టు ఎక్కడా లేదు. అసలు ఆదమ్ ఖాన్ ఒక వీరుడన్న మాటే ఎక్కడా లేదు. అతని సేవకులు కూడా అతని మాట వినకుండా బహిరంగంగానే ఎదిరించారంటే అర్థం చేసుకోవచ్చు. పైగా వాళ్ళు ‘నీకు విక్రమం లేదు’ అన్నారు. కాబట్టి ఆదమ్ ఖాన్ ఎంత బలహీనుడో అర్థం చేసుకోవచ్చు. భుట్టమార్గం అంటే ప్రస్తుతం ‘జోజీలా పాస్’గా పరిగణిస్తున్న మార్గం. అటు నుంచి ‘లేహ్’కు వెళ్లవచ్చు. కొడుకులు ఒకరినొకరు చంపుకోకుండా చూసేందుకు జైనులాబిదీన్ ఆదమ్ ఖాన్‍ను ‘లేహ్’కు పంపించి ఉండవచ్చు. ఆదం ఖాన్ ఎక్కడికి వెళ్ళాడో స్పష్టంగా తెలియదు. అందుకనే శ్రీవరుడు విదేశం పంపించాడన్నాడు. ఎంత తెలిస్తే అంతే చెప్పటం, ఎలా తెలిస్తే అలా చెప్పటం శ్రీవరుడి దగ్గరనుంచి ఆధునిక అపర  మేధావి చరిత్ర నిర్మాతలు నేర్చుకోవాల్సివుంటుంది.

అయితే శ్రీవరుడు ఆదమ్‍ ఖాన్‍ను, జైనులాబిదీన్‍తో ‘కుపుత్ర’ అనిపించి, సేవకులు అతని మాట వినలేదు, అవమానించారు, ‘నీ సోదరుడి దగ్గరే మరణిస్తాం కానీ నీ దగ్గర పని చేయం’ అని అంత నిక్కచ్చిగా రాయటం వెనుక ఒక రాజకీయం ఉంది.

అధికారం కోసం అన్నదమ్ముల పోరులో విజయం సాధించి సింహాసనం అధిష్ఠించింది, కనిష్ట పుత్రుడు. ఆదమ్ ఖాన్ ఎంత ప్రయత్నించినా సింహాసనానికి చేరువ కూడా కాలేకపోయాడు. జైనులాబిదీన్ మరణం తరువాత సుల్తాన్ అయిన వాడి నీడలో జీవిస్తూ రాస్తున్నాడు శ్రీవరుడు. కాబట్టి, సోదరుడే అయినా, శత్రువు కాబట్టి, శ్రీవరుడు ఆదమ్ ఖాన్ గురించి ఇలా రాయగలిగాడు. ఇలా రాయటం వల్ల సుల్తాన్‍ను సంతోషపెట్టిన వాడయ్యాడు. ఆదమ్ ఖాన్ నిజంగా ‘కుపుత్రుడా?’, ‘భీరువా?’, ‘చేతకానివాడా?’. ఏమో.. శ్రీవరుడు మాత్రం ఇలా రాశాడు. ఇందుకు భిన్నమైన అభిప్రాయలు లేవు కాబట్టి ఇందుకు వ్యతిరేక అభిప్రాయాన్ని కలిగించే ఆధారాలు లభించనంత వరకు శ్రీవరుడు రాసిందే సత్యంగా భావించాల్సి ఉంటుంది.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here