కణ్ణదాసన్ – ఒక నిఖార్సైన కవిత్వానుభవం

0
2

[జూన్ 24 ప్రముఖ కవి కణ్ణదాసన్ జయంతి సందర్భంగా ఈ వ్యాసం అందిస్తున్నారు శ్రీ రోచిష్మాన్.]

[dropcap]“కా[/dropcap]ళిదాసు తమిళ్షుడవాలనుకుని కణ్ణదాసన్ అయ్యాడు” – మన వేటూరి సుందరరామమూర్తి మాటలవి. ఆ కణ్ణదాసన్ ఒక తమిళ్ష్ కవి. 24/6 కణ్ణదాసన్ జన్మదినం సందర్భంగా ఆయనను అవలోకిద్డాం…

తెలుగు సినిమాపాటను, సినిమా కవులను ఎక్కువగా ప్రభావితం చేసిన పరభాషా కవి కణ్ణదాసన్.‌‌ తమిళ్ష్ కవి కణ్ణదాసన్ సినిమా పాటకు కావ్యస్థాయిని కలిగించారు. ఆయనలా మర్యాదను, మన్ననను పొందిన సినిమా కవి మనదేశంలో మరొకరు లేరేమో? ఒక కవి మరణించాక ఆ కవి పార్థివ దేహం వెనుక శ్మశానం వఱకూ పదవిలో ఉన్న ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి నడిచి వెళ్లడం అరుదైన సంఘటన. అది ఆ కవి ఎంతో గొప్పవాడు అన్నదాన్ని తెలియజేష్తుంది. 17/10/81న మరణించాక కణ్ణదాసన్ పార్థివదేహం వెనుక (22/10/81 న) అప్పటి తమిళ్ష్‌నాడు ముఖ్యమంత్రి ఎం.జి. రామచంద్రన్ శ్మశానం వరకూ నడిచి వెళ్లారు! ఇది ఒక కవికి, సినిమా కవికి దక్కిన అపూర్వమైన గౌరవం.

తమిళ్ష్‌లో బారతియార్ తరువాత గొప్ప కవిగా వినుతికెక్కిన కవి కణ్ణదాస‌న్. రాయడం అన్న కళపై పదునైన పట్టు ఉన్నవారు కణ్ణదాసన్. ఒక భావాన్ని కవిత్వంగా మలచడంలో ఆయన నేర్పు చాల గొప్పది. ఆయన రచనల్లో పద-పురోగతి విశేషమైంది. ఆయన వచనం రాసినా చాల బావుంటుంది. ఆయన మాట్లాడుతున్నప్పుడు కూడా ఒక తూగు ఉంటుంది. 16 ఏళ్లకే పత్రికా సంపాదకుడిగా పని చేశారు కణ్ణదాస‌న్. అటు‌ తరువాత సినిమా‌‌ కవి అయ్యారు. తరువాత రచయిత, రాజకీయ వేత్త, సినిమా నిర్మాత అయ్యారు. మొత్తం దక్షిణభారతదేశ‌ సినిమాల్లో సాటిలేని కవి ఆయన. కథలు, నవలలు, నాటకాలు వ్యాసాలు, అధ్యాత్మిక రచనలు ఇలా ఎన్నో‌ రాశారు.

కణ్ణదాసన్ కొన్ని‌ నిమిషాల్లో‌ ఒక పూర్తి‌ పాటను రాసేస్తారు.‌ ఆయన రచన ప్రవాహంలా సాగుతుంది. “జోరు మీదున్నావు తుమ్మేదా…” పాట సందర్భానికి అదే మట్టు (ట్యూన్)కు తమిళ్ష్‌లో 8 పల్లవులు, 24 చరణాలు రాసిస్తే దాసరి నారాయణ రావు ఆశ్చర్యపోయారట. “మ్రోగింది వీణ పదేపదే హృదయాలలోన…” మట్టుకు‌ ఒక‌ ప్రేమ గేయం మొదట కన్నడంలో వచ్చింది. కన్నడ కవి పాట రాయడానికి వారం రోజులు తీసుకున్నారు. తరువాత తమిళ్ష్‌లో వచ్చింది. తమిళ్ష్‌లో బాణిని వినడానికి మాత్రం పట్టే సమయంలో పాట రాయడం ముగించారు కణ్ణదాసన్.

ఎన్నో గొప్ప పాటల్ని రాశారు; ఎంతో గొప్ప పాటల్ని రాశారు కణ్ణదాస‌న్. “పక్షిని చూశాడు విమానాన్ని సృష్టించాడు, చేపల్ని చూశాడు పడవను సృష్టించాడు…” అంటూ “దేన్ని చూశాడు మతాన్ని కనిపెట్టాడు?” ‌అని బాధతో‌ అడిగారు కణ్ణదాసన్. పెళ్లికి సిద్ధమౌతున్న పెళ్లి కూతురుతో చెలికత్తే చేత ఇలా అనిపిస్తారు‌ కణ్ణదాసన్:‌ “పూయని స్త్రీత్వం పూస్తుంది, ఇంతకు ముందు తెలియని నిజం తెలుస్తుంది”. “ఎవరికి ఎవరు కాపలా…” అని తెలుగులో మనకు తెలిసిన పాటలో ఆత్రేయ ద్వారా కణ్ణదాసన్ భావాలు వినిపిస్తాయి. “ఒకరి తపనలో పుట్టేది కవిత రా/ఇద్దరి తపనలో పుట్టేది పాపరా” అని కణ్ణదాసన్ అన్నది “బుజ్జి బుజ్జి పాపాయి…” పాటలో ఆత్రేయ తెలుగులోనూ అన్నారు.

“దీపం కాంతిలో తిరుక్కుఱల్ (ఒక గొప్ప గ్రంథం) చదివితే అది దీపం గొప్పతనం కదా?

ఆ దీపంతో ఒక హృదయాన్ని కాల్చేస్తే దీపం కూడా పాపం కదా” అన్నారు కణ్ణదాస‌న్. “పారే నీరు బండ రాళ్లను డీ కొడుతూండడం వల్ల నీరు చెదిరిపోవడం లేదు, కాలక్రమంలో బండ రాయి అరిగిపోతూంటుంది” అని కణ్ణదాసన్ అన్నది ఆయన ఆలోచించే తీరులోని గొప్పతనాన్ని మనకు తెలియజేస్తుంది.

24/6/27న పుట్టిన కణ్ణదాసన్ కన్నియిన్ కాదలి (1949) సినిమాలో ‘కలత చెందకు మనసా’ అనే‌ అర్థం వచ్చే తమిళ్ష్ వాక్యంతో సినిమా కవిగా తన ప్రస్థానాన్ని మొదలు పెట్టారు.1958లో వచ్చిన మాలైయిట్టమంగై సినిమాతో కవిగా నిలదొక్కుకుని 60లలో నక్షత్రస్థాయిని అందుకున్నారు‌. నక్షత్రస్థాయిని అందుకున్న తొలి‌ దక్షిణాది సినిమా‌ కవి కణ్ణదాసన్. దక్షిణభారత సినిమాలో మన తెలుగు కవులతోపాటు మలయాళంలో వయలార్ రామవర్మ , పి.భాస్కరన్ వంటి వాళ్లు సైతం కణ్ణదాసన్‌కు దీటైన కవులు కాలేదు. కన్నడ సినిమా కవి ఆర్.ఎన్. జయగోపాల్ ఈ వ్యాస రచయితతో “దక్షిణాది సినిమాలో కణ్ణదాసన్ గొప్ప కవి” అని చెప్పారు. దక్షిణాది సినిమా పాటల రచనలో కణ్ణదాసన్ ఒక విప్లవం. కణ్ణదాసన్ చివరి పాట మూన్ఱామ్ పిఱై (తెలుగులో వసంత కోకిల) లోని “కణ్ణే కలైమానే…” (తెలుగులో “కథగా కల్పనగా…) పాట. కణ్ణదాసన్ తొలి, చివరి పాటలు క ఆక్షరంతోనే మొదలయ్యాయి.

“పోతే పోనీ పోరా (పోనాల్ పోగట్టుమ్ పోడా)” వంటి మామూలు మాటల్ని కవిత్వం చేశారు కణ్ణదాసన్. ఈ మాటలు ప్రాయశ్చిత్తం డబ్బింగ్ సినిమాలో అనిశెట్టి ద్వారా తెలుగులోకి వచ్చాయి. ఈ పాట తమిళ్ష్ మూలంలో “అరువు ఇచ్చిన వాడు అడుగుతున్నాడు/లేదంటే వాడు వదిలేస్తాడా?/బంధాన్ని చెప్పుకుని ఏడిస్తే/ప్రాణాన్ని తిరిగిచ్చేస్తాడా” అని కణ్ణదాసన్ చెప్పిన గొప్ప భావాన్ని తెలుగులోకి అనిశెట్టి తీసుకురాలేదు. ఇంతకన్నా ముందు 61లో విడుదలైన కలిసివుంటే కలదు సుఖం సినిమా ద్వారా కణ్ణదాసన్ భావాలు తెలుగులోకి తొలిసారి వచ్చాయి. ఆ సినిమాలో ఆరుద్ర రాసిన “మేలిమి బంగరు మెలిక తిరిగినా విలువ తరిగేనా…” పాటలో మనం వినేవి కణ్ణదాసన్ భావాల్నే. కణ్ణదాసన్ భావాల్ని తొలిసారి తెలుగులోకి తెచ్చింది ఆరుద్ర. కృష్ణశాస్త్రి, దాశరథి, ఆత్రేయ, అనిశెట్టి ప్రభృతులు కణ్ణదాసన్ భావాల్ని తీసుకున్నారు. కణ్ణదాసన్ తమిళ్లో రాశాక ఆ సందర్భానికి తెలుగులో ఇల్లాలు(1965) సినిమాలో “నీవు నా కళ్లలోనే నిలిచావు…” అంటూ శ్రీశ్రీ రాసింది కణ్ణదాసన్ శైలికి, శయ్యకు, శిల్పానికి, బావానికి సరితూగలేదు. “గోదారి గట్టుంది…” అని దాశరథి రాసింది కణ్ణదాసన్ నుంచి తీసుకున్నదే. “మంటలు రేపే‌ నెలరాజా…” పాటలో “మదిలో శాంతి లేనపుడు‌ ఈ మనిషిని దేవుడు చేశాడు” అని దాశరథి కణ్ణదాసన్ భావాన్నే తీసుకున్నారు. ఈ పాట రచనలో దాశరథి కణ్ణదాసన్‌కు సరితూగలేకపోయారు. “రాముడు ఎంత మంది‌ రామ్ముళ్లమ్మా” అని‌‌‌ అంటూ కణ్ణదాసన్ రాముడిపై రాసిన పాటను విని ఆరుద్ర “మీకిలాంటి ఆలోచన ఎలా వచ్చింది?” అని కణ్ణదాసన్‌ను అభినందన పూర్వకంగా అడిగారట. కణ్ణదాసన్ రాసిన ఆ పాట స్ఫూర్తితోనే “శ్రీరామ నామాలు శతకోటి…” అంటూ మీనా (1973) సినిమాలో రాశారు ఆరుద్ర. కణ్ణదాసన్ రాసిన ఈ రాముడు పాట ఆధారంగా పెళ్లికూతురు(1970) సినిమాలో దాశరథి కూడా రాముడు పాట రాశారు.

వీరాభిమన్యు సినిమాలో “చూచి, వలచి చెంతకు పిలచి…” అంటూ ఆరుద్ర రాశారు. ఈ సందర్భానికి ముందుగా కణ్ణదాసన్ రాశారు. తమిళ్లో ఈ పాట రచనాసంవిధానం, శయ్య, భావాల పరంగా చాల గొప్పగా ఉంటుంది. కణ్ణదాసన్ ఈ పాటలో Dramatic irony ని‌ సాధించారు. ఆరుద్ర రచన కొంత అనువాదం, కొంత అనుకరణగా సాగి‌ కొన్ని చోట్ల తేలిపోయింది‌. మంచి రోజులు వచ్చాయి సినిమా(1972)లో దేవులపల్లి కృష్ణశాస్త్రి “నేలతో నీడ అన్నది నను తాకరాదనీ/పగటితో రేయి అన్నది నను తాకరాదనీ” అని రాసింది పూర్తిగా కణ్ణదాసన్ భావమే. “నీడను చూసి నేల అన్నది నన్ను తాకద్దు” అని కణ్ణదాసన్ అంటే కృష్ణశాస్త్రి “నేలతో నీడ అన్నది” అని ఔచిత్యం లేకుండా అన్నారు‌. “తల్లితండ్రి ఒకరి నొకరు తాకనిదే/నీవు లేవు, నేను లేను, లోకమే లేదులే” అని కృష్ణశాస్త్రి అన్నది కణ్ణదాసన్ తమిళ్‌లో అన్నదానికి నకలే. ఈ పాటలో (దాశరథి రాసిన?) మూడవ చరణానికి కూడా ఆధారం కణ్ణదాసన్ చింతనే. గుడిగంటలు సినిమాలో అనిశెట్టి రాసిన “జన్మమెత్తితిరా అనుభవించితిరా” పాటలో “పుట్టడానికి ముందు ఉన్న హృదయం ఇవాళ వచ్చిందిరా/మరణించాక వచ్చే ప్రశాంతత వచ్చేసిందిరా” అని తమిళ్‌లో కణ్ణదాసన్ గొప్పగా అన్నది తెలుగులో లేదు. మొగుడా పెళ్లామా సినిమాలో (1975) “పరమశివుని మెడలోని పాము అన్నది గరుడా క్షేమమా…” అంటూ సి. నారాయణ రెడ్డి కణ్ణదాసన్‌ను అనుసరిస్తూనే రాశారు.

కణ్ణదాసన్ ప్రభావం‌ ఎక్కువగా ఉన్న తెలుగు సినిమా కవి ఆత్రేయ.‌ “తలచినదే జరిగినదా దైవం ఎందులకు/ జరిగినదే తలచితివా శాంతి లేదు నీకు”, “తెలిసేట్లు చెప్పేది సిద్ధాంతం/అది తెలియకపోతేనే వేదాంతం” అంటూ కణ్ణదాసన్ చెప్పినవి ఆత్రేయ ద్వారా తెలుగులోకి వచ్చాయి. “దేవుడు నేనై పుట్టాలి/ దేన్నో తాను ప్రేమించి/ ఆడదాని మనసంటేనే/విషమని తెలిసి ఏడ్వాలి” అని కణ్ణదాసన్ భావాన్ని కొంచెం మార్చి రాశారు ఆత్రేయ.

ప్రపంచంలో మరే కవి రాయనన్ని మనసు పాటలు రాసిన ఆత్రేయ ప్రేమనగర్ సినిమాలో రాసిన “మనసు గతి ఇంతే” పాటకు తమిళ్ష్‌లో రాస్తూ ‘కవులు ఇలా శాపనార్థాలు పెడుతున్నట్టుగా అనకూడదు‌’ అన్న ఆలోచనతో కణ్ణదాసన్‌ “రెండు మనసులు కావాలి దేవుణ్ణి‌ అడుగుతాను/తలుచుకుని బాధపడడానికి ఒకటి/మరిచిపోయి బతకడానికి ఒకటి” అని ఆత్రేయకు అతీతంగా చాల గొప్పగా రాశారు. ఈ కణ్ణదాసన్ మాటల్నే కళ్యాణప్రాప్తిరస్తు సినిమా(1996)లో భువనచంద్ర “రెండు మనసులు కావాలి/వలపించాడానికి ఒకటి/విలపించడానికి ఒకటి” అని మళ్లీ చెప్పారు. గుప్పెడు మనసు సినిమాలో “మౌనమె నీ భాష ఓ మూగ మనసా” అని ఆత్రేయ రాసిన పాట సందర్భానికి ముందుగా కణ్ణదాసన్ “మౌనంలో ఆడుకునే మనస్సాక్షీ” అంటూ రాశారు. ఈ పాటలో కొన్ని చోట్ల కణ్ణదాస‌న్ భావాల్ని యథాతథంగా ఆత్రేయ తీసుకున్నారు. కొన్ని చోట్ల కణ్ణదాసన్ స్థాయిని అందుకోలేదు. తమిళ్ష్‌లో కణ్ణదాసన్ స్థాయి పద, భావ ప్రయోగ రీతిని తెలుగులో ఆత్రేయ సాధించలేకపోయారు. కణ్ణదాసన్‌ను ఆత్రేయ బాగా అర్థం చేసుకున్నారేమో? తనపై కణ్ణదాసన్ ప్రభావం ఉందని ఆత్రేయ స్వయంగా చెప్పుకున్నారు. కణ్ణదాసన్ కూడా ఆత్రేయ రాసిన “నవ్వినా ఏడ్చినా కన్నీళ్లే వస్తాయి” అన్న దాన్ని తీసుకుని “నవ్వినా‌ కన్నీళ్లు వస్తాయి/ఏడ్చినా‌ కన్నీళ్లు వస్తాయి/కలయికలో నవ్వు వస్తుంది/వియోగంలో ఏడుపు వస్తుంది/ఏడ్చినా నవ్వినా‌ సుఖమైన నెమ్మది వస్తుంది” అని రాశారు.

కణ్ణదాసన్‌పై మన వేమన ప్రభావం ఉన్నట్టుగా తెలుస్తుంది‌. వేమన పద్యాల్ని అణ్ణాదురై (కణ్ణదాసన్‌కు అత్యంత ఆత్మీయులు) “వేమన వెడి గుండుగళ్” (వేమన బాంబులు) పేరుతో తమిళ్లోకి అనువదించారు. వాటివల్లో, మఱో విధంగానో కణ్ణదాసన్ వేమనను ఆకళింపుచేసుకున్నట్టున్నారు. “పునాదిలేకుండా కట్టిన భవనం గాలికి నిలబడదు”, “అందంగా ఉండే మేడి పళ్లు సంతలో అమ్మబడడం లేదు”, “ప్రమిద ఉన్నా నూనె లేకపోతే వెలుతురు దొరకదు” వంటి కణ్ణదాసన్ మాటల్లో వేమన శైలి కనిస్తూంటుంది. వేమన భావాల్ని కణ్ణదాసన్ కొన్ని సినిమా పాటల్లో వాడారు. “లేడు లేడటన్న లేడు లేనే లేడు/కాడు కాడటన్నఁ గానె కాడు/తోడు తోడటన్నఁ దోడనే తోడౌను” అని వేమన అన్నది ఒక కణ్ణదాసన్ పాటలో వినిపిస్తుంది. “ఉరిమి మొరుగు కుక్క యోగినే మెరుగురా” అని వేమన అన్నదాన్ని కణ్ణదాసన్ ఒక సందర్భంలో తన మాటలుగా చెప్పారు‌.

ఒక చింతనను కవిత్వం చెయ్యడంలో‌ కణ్ణదాసన్ సిద్ధహస్తుడు. కణ్ణదాసన్ అభివ్యక్తి ఉన్నతంగా ఉంటుంది. ‘మనిషి మరణిస్తాడు‌’ అన్న విషయాన్ని ఆయన ఇలా‌ రాస్తారు: “ఆత్మ వదిలేస్తుంది/తనువు నశించిపోతుంది/నిప్పు కాల్చేస్తుంది/ఉనికి శూన్యంలో ఉంటుంది” ఇలా‌ విషయాలను ఆయన కవిత్వంగా మలిచే తీరు చాల గొప్పగా‌ ఉంటుంది. “కరుణ పొంగే హృదయం/దేవుడు నివశించే నిలయం/ కరుణను మరిచిపోయి బతుకుతున్నారు /దేవుడిని వెతుకుతూ తిరుగుతున్నారు”, “మనిషి జీవితంలోని శోకమంతా మనసువల్ల వచ్చిన రోగం”, “తప్పుచెయ్యడానికి సాహసించిన మనిషి ఏడవడం లేదు/పొరబాటున కూడా ఆకాశం మట్టి‌పై పడిపోవడం లేదు” వంటివి కణ్ణదాసన్ గొప్పగా అన్న వాటిలో‌ కొన్ని. “నేను ప్రేమ అనే కవితను చెప్పాను పానుపు పైన” అని నాయకుడంటే “ఆ కరుణకు నేను కానుక నిచ్చాను ఊయల పైన” అని నాయిక అంటుంది. ఇలాంటివి విరివిగా రాశారు కణ్ణదాసన్. కణ్ణదాసన్ పదాల ఎన్నిక, అల్లిక (word-play) ఉదాత్తంగా ఉంటాయి. ఆయన రచనల్లో పద-పురోగతి (word-progression) ఉంటుంది.

కణ్ణదాసన్ అసలు పేరు ముత్తయ్యన్. కణ్ణదాసన్ అంటే కృష్ణదాసుడని అర్థం. యవ్వనదశలో‌ నాస్తికుడైన ఆయన తప్పు తెలుసుకుని తరువాత ఆస్తికుడయ్యారు. “నలువైపుల నుంచీ బాధలు వస్తే/నాస్తికులకూ దేవుడు ఉంటాడు;/కనిపించేదంతా దుఃఖం అయితే/ దేవుడికీ దేవుడు ఉంటాడు”. అని అన్నారు. “నాగు పడగపై నర్తనాలు చేసి/దాహాన్నంతా తీర్చుకున్నాడు…” అనీ, “వాడి మోహస్థితి కూడా ఒక/యోగస్థితిలాగా ఉంటుంది…” అనీ కృష్ణుడిపై రాశారు.

కణ్ణదాసన్ 5వేల పైచిలుకు పాటలు, 4వేల పైచిలుకు కవితలు రాశారు. పలు సినిమాలకు కథలు, సంభాషణలు, ఇతర కథలు, నవలలు, నాటకాలు, వ్యాసాలు రాశారు‌. 79లో సేరమాన్ కాదలి అనే నవలకు కేంద్రసాహిత్య అకాదెమీ అవార్డ్‌ను అందుకున్నారు. 68లో కుళ్షన్‌దైక్కాగ సినిమాలోని “రామన్ ఎన్బదు గంగై నది…” పాటకు ఉత్తమ గీత రచయితగా కేంద్ర ప్రభుత్వ‌ పురస్కారాన్ని అందుకున్నారు. అర్తముళ్ళ ఇందు మదమ్ (అర్థవంతమైన హిందూమతం) అనే ప్రశస్తమైన గ్రంథాన్ని రాశారు. భగవద్గీత, భజగోవిందం కృతులకు అనువాదాలు చేశారు. 57 పుస్తకాలు రాశారు‌‌. 23- 3- 78 నుంచీ చివరి వఱకూ తమిళ్ష్‌నాడు ఆస్థాన కవిగా ఉన్నారు‌.

“నేను కణ్ణదాసన్ పాటలవల్లే ఇళయరాజా నయ్యాను, కణ్ణదాసన్ నా హీరో” అని ఇళయరాజా బహిరంగంగా చెప్పారు. “నేను నిరాశనుంచి బయటకు వచ్చి నిలబడి ప్రముఖకవినై బతికింది కణ్ణదాసన్ పాట వల్లే” అని తమిళ్ష్ కవి వాలి చెప్పేవారు.

“తమిళ్ష్ నా ప్రాణం; సంస్కృతం నా ఆత్మ” అని నినదించారు‌ కణ్ణదాసన్. రవీంద్రనాథ్ టాగూర్, రూమీ, వంటి కవుల స్థాయిలో కణ్ణదాస‌న్ ఇలా రాశారు:

“దేవుడిచ్చిన వీణ దానిపై దేవి చేసిన గానం
వెతికే చేతులు వెతికితే అందులో రాగం లేకుండా‌ పోతుందా? –
మేఘం పాడే పాటను విన్నాను నేనూ పాడుకుంటున్నాను
మోహమా? శోకమా? ఇంకా నా‌ మనసు నిద్రపోతూంటుందా?
అనుదినమూ అన్వేషిస్తూంటాను.
ఆకాశం నా భవనం అవని నా వేదిక
వర్ణాలు నే చేసే ఆలోచనలు
ఎక్కడి నుంచో ఇక్కడికి వచ్చాను
సంగీతంలో‌ మై మరిచిపోయాను
భగవంతుడి‌ సభలో కళాకారుణ్ణి నేను”

ఈ కవిత కణ్ణదాసన్ మరణానంతరం సినిమా పాటగా వచ్చింది. సినిమాలకు రాస్తున్నప్పుడు కుడా కొన్నిసార్లు సినిమా సందర్భానికి మించిన మార్మికత (mysticism)తోనూ, abstract గానూ రాశారు కణ్ణదాసన్.

గుడిగంటల శబ్దాన్ని నేను విన్నాను;
అనుగ్రహభాషణం చేసే పక్షుల రావాన్ని విన్నాను.
నా దేవుడు వాడే వాడే అంటూ పాడుతున్న పలుకును విన్నాను;
నీ నాథుడు వాడే వాడే అంటున్న అమ్మ పలుకును విన్నాను.

నెలకొంటున్న సంధ్యాసమయంలో
నా దేవుడు వచ్చాడు రథంలో
పేదవాడి ఇల్లు ఇది అన్నాడు;
రెండుకళ్ల చూపుతో పూమాల వేశాడు.
నా దేవుడు వాడే వాడే అంటూ పాడుతున్న పలుకును విన్నాను;
నీ నాథుడు వాడే వాడే అంటున్న అమ్మ మాటను విన్నాను.

ప్రేమాలయం మధ్యలో
కరుణామయుడి ఒడిలో
ఎవరికీ తెలియని వేళలో
ఆశ్రయం పొందాను చివరలో
నా దేవుడు వాడే వాడే అంటూ పాడుతున్న పలుకును విన్నాను;
నీ నాథుడు వాడే వాడే అంటున్న అమ్మ మాటను విన్నాను.

విశ్వకవులు రవీంద్రనాథ్ ఠాగూర్, రూమీ వంటివాళ్ల స్థాయి రచన ఇది. తెలుగులో విశ్వనాథ సత్యనారాయణ, కృష్ణశాస్త్రి, ఉమర్ అలీ షాహ్ లు ఇలాంటి, ఈ స్థాయి రచనలు చేశారు.

(ఇది పాలుమ్ పళ్షముమ్ (1961) తమిళ్ష సినిమాలో కణ్ణదాసన్ రాసిన పాట.)

దక్షిణాది సినిమాకు సంబంధించి ముప్పయ్యో దశకం నుంచీ యాబయ్యో దశకం వఱకు తెలుగు పాటల కవిత్వం శ్రేష్ఠమైంది. అఱవై నుంచీ ఎనబయ్యో దశకం వఱకు కణ్ణదాసన్ వల్ల తమిళ్ష్ పాటల కవిత్వం శ్రేష్ఠమైనదయింది. ఆ శ్రేష్ఠత్వం మన తెలుగు సినిమా పాటల్నీ ప్రభావితం చెసింది.

కణ్ణాదాసన్ గఱించి స్మరించుకుంటున్న ఈ సందర్భంలో ఆయన రాసిన మఱో కవితను కూడా చవి చూడడం సమాయోచితంగా ఉంటుంది. ఇదిగో ఆ కవిత:.

~

భగవంతుడు
—————
“పుట్టడం వల్ల వచ్చేది ఏమిట”ని అడిగాను
“పుట్టి చూడు” అని భగవంతుడు అజ్ఞాపించాడు!
“చదువు అని అనడం ఏమిట”ని అడిగాను
“చదివి చూడు” అని భగవంతుడు ఆజ్ఞాపించాడు!
“తెలివిడి అని అనడం ఏమిట”ని అడిగాను
“తెలుసుకుని చూడు” అని‌ భగవంతుడు అజ్ఞాపించాడు!
“అనురాగం అని అనిపించేది ఏమిట”ని అడిగాను
“ఇచ్చి చూడు” అని‌ భగవంతుడు ఆజ్ఞాపించాడు!
“మమకారం అనేది ఏమిట”ని అడిగాను
“పంచి చూడు” అని భగవంతుడు ఆజ్ఞాపించాడు!
“ఇల్లాలి సుఖం అంటే ఏమిట” ని అడిగాను
“పెళ్లి చేసుకుని చూడు” అని భగవంతుడు ఆజ్ఞాపించాడు!
“బిడ్డ అనేది ఏమిట”ని అడిగాను
“కని చూడు” అని భగవంతుడు ఆజ్ఞాపించాడు!
“వృద్ధాప్యం అనేది ఏమిట”ని అడిగాను
“ఎదిగి‌ చూడు” అని భగవంతుడు ఆజ్ఞాపించాడు!
“బీదరికం అంటే ఏమిట”ని అడిగాను
“బాధపడి చూడు” అని భగవంతుడు ఆజ్ఞాపించాడు!
“మరణించాక ఏమిట”ని అడిగాను
“మరణించి‌ చూడు” అని భగవంతుడు ఆజ్ఞాపించాడు.
“అనుభవించి తెలుసుకోవడమే బ్రతుకంటే
భగవంతుడా నువ్వెందుకు?” అని‌ అడిగాను
భగవంతుడు కొంచెం దగ్గఱికి వచ్చి
“అనుభవం అన్నదే నేనే” అన్నాడు.

~

ఇలా కణ్ణదాసన్‌ను అనుభవంలోకి తెచ్చుకోవడం మేలైన, నిఖార్సైన కవిత్వాన్ని అనుభవంలోకి తెచ్చుకోవడమే!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here