తెలుగులో ‘మంకుతిమ్మన కగ్గ’-8

1
3

[కన్నడంలో శ్రీ డి.వి.జి. రచించిన ‘మంకుతిమ్మన కగ్గ’ను తెలుగులోకి అనువదించి అందిస్తున్నారు శ్రీ కల్లూరు జానకిరామరావు.]


~
71.
రవికి, కిరణాల ముడి; గగనమునకు మబ్బుల ముడి;
భువికి, భ్రమణంపు ముడి; గాలికి వీచు ముడి;
ఈ విశ్వమియ్యది పరిపరి విధముల చిక్కు ముడి,
ఇవి వీడని బంధములు – మంకుతిమ్మ!

72.
బంధమదెదో యొకటున్న దన్నింటికిని పరికించి చూడ, ఈ
బంధమ్ముల ముడి విడిపించు నెవడు?
బంధమున్నది జీవుల మధ్య, జడ చేతనముల మధ్య; దేనికేది
బంధమో తెలియకున్నది – మంకుతిమ్మ!

73.
సరస విరసాల కలగూర మీ బ్రహ్మండ భాండారమిది, దీనికి
దూరమై మనగల వాడ నేనని నుడువ బోకు
అరయ నీ ఒంటరివే నీలోన, వుండవలె బంటువై
మరి బయట – అలకరించుకొనవలె దీనిని – మంకుతిమ్మ!

74.
ఊరకే ఒంటరిగా నేనెటులుండ గలాడ;
నా రూపములు కోటానుకోటులు – పరిఢవిల్ల జేతునని యా
విరించి తలచిన యా తలపు గాదె – ఇమ్మాయ,
నరయ ఇమ్మాయాలోకమే కద మన నెలవు – మంకుతిమ్మ!

75.
జనన మిచ్చిన విత్తునే కనుమరగ జేసి, వృక్షమది
యనంతమై విస్తరించు రీతి; సృష్టియది తన మూలమునే కప్పి
మన ఎదుట నటన మాడుచునున్నది – కాగిన పాల
పైని తరగ కప్పివేయదే పాలను – మంకుతిమ్మ!

76.
తానొంటరి వాడనైతినిగదా యని తలచి
తన్మహిమ నీ విశ్వ నిర్మాణంబు గావించి, నెలసి
వినోద విరోధములకు తానొడబడక యన్నింటికి
తానతీతుడై నిర్లిప్తుడై విహరించడే విరించి – మంకుతిమ్మ!

77.
తన దీధితుల నెంచి యెంచి మైమరచెడి రతనంబు రీతి,
తన నిజ పింఛ వర్ణాలనెంచి తన్ను తానె మరచు మయారి రీతి,
తన సృష్టి నిర్మాణమునకు తన్మయుడై, పులకించుచున్నాడు
తనకు తానే యా బ్రహ్మ – మంకుతిమ్మ!

78.
తరుణి, తన యాభరణంబుల తొడుగుచున్, తీయుచున్
దర్పణమున తన సోయగమును పరికించుచు విశ్వమునే
మరచు రీతి; తన లీలా విలాసంబుల విహరించుచు
నెరయుచున్నాడు పరమేష్టి – మంకుతిమ్మ!

79.
విరిగిన పలకను తా మరి మరి శ్రమపడి
మరల మరల జోడింప నాయాసపడి
పరిసరముల మరచి ప్రవర్తించెడి, బాలకు చందాన
పరబ్రహ్మ సృష్టియందు లీనమైయున్నాడు – మంకుతిమ్మ!

80.
ఒంటరిగ చీట్లపేక తా నాడుచున్, తానె ఇర్వుర వోలె
నాటలాడుచు తన్నుదాను మరచినట్లు; తన
యాట లోన బమ్మయు తన్ను తానె మరచి
ఒంటిగ నాడుచున్నాడు – మంకుతిమ్మ!

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here