[శ్రీ ఎం. వెంకటేశ్వరరావు రచించిన ‘ఫస్ట్ లవ్’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]
[హసంతి ఇంటి నుంచి బయటకి వచ్చిన గౌతమ్ నేరుగా తన ఫ్రెండ్ డా. నరేష్ దగ్గరకి వెళ్తాడు. ఈ రోజు డ్యూటీ ఉందా అని అడిగి, అతను లేదని చెబితే, బయటకు వెళ్తాం పద అంటాడు. ఇద్దరూ కాఫీ డేకి వెళ్తారు. ఏంటలా ఉన్నావు, ఉడ్ బీ తో క్లోజ్ అయ్యావా అని నరేష్ అడిగితే, అదే సమస్య అంటూ జరుగుతున్నదంతా చెప్తాడు గౌతమ్. ఆమె నిన్ను ఇష్టపడుతోందా, ఎప్పుడైనా ఐ లవ్ యూ చెప్పిందా అని అడుగుతాడు నరేష్. చిన్న వయసు నుంచి హసంతిని ప్రేమిస్తున్నావని అన్నావు కదా, ఆమెకి ఏం నచ్చుతుందో, ఏం నచ్చదో నీకు తెలుసు కదా అని అడుగుతాడు నరేష్. తెలుసంటాడు గౌతమ్. అమ్మాయిలు తనకి నచ్చినవాడు ఇచ్చిన వాటిని ప్రాణప్రదంగా చూసుకుంటారని చెప్పి, నువ్వు ఇచ్చిన వస్తువు ఏదైనా తన దగ్గర ఉందా?, వాడుతోందా, నువ్వు చూశావా? అని అడుగుతాడు నరేష్. తాను ఇచ్చిన ఐఫోన్, డైమండ్ రింగ్ హసంతి వాడడం ఏనాడూ చూడలేదని తనలో తాను అనుకుంటాడు గౌతమ్. తను వాడడం చూశావా అని నరేష్ రెట్టిస్తే, గౌతమ్ మాట్లాడడు. ఇంతలో రఘరాం ఫోన్ చేయడంతో, మాట్లాడి – డాడీ ఫోన్ చేశారు, రమ్మంటున్నారు అంటాడు గౌతమ్. ఇద్దరూ బయల్దేరుతారు. కారులో హసంతి కుటుంబం, రఘురాం కుటుంబం అమ్మవారి గుడికి వెళ్తారు. ధృతి, స్వప్న మోపెడ్ మీద వెళ్తారు. పూజ పూర్తయ్యాక, శుభలేఖలు అమ్మవారి ముందు పెట్టిస్తాడు రఘురాం. అమ్మవారి సమక్షంలో శుభలేఖలని పూజారి గారి చేత పైకి చదివిస్తాడు. ఆ సమయంలోనే అక్కడికి వచ్చిన కార్తీక్ – ఆ రెండు కుటుంబాలని చూసి, హసంతిని తాను పెళ్ళి చేసుకోవాలనుకోవడం కరెక్టు కాదని భావించి, వెళ్ళిపోతాడు. ఒకసారి కార్తీక్‍ని కలవాలని వచ్చి అతని బైక్ దగ్గర నిలబడి చప్పుడు చేస్తుంది హసంతి. ఆమెను చూసి కూడా చూడనట్టు పక్కకు తప్పుకుంటాడు కార్తీక్. నిరాశగా ఇంటికి వెళ్ళిపోతుంది హసంతి. బ్యాగులో బట్టలు సర్దుకుని ఊరు విడిచి వెళ్ళడానికి సిద్ధమవుతుంటాడు కార్తీక్. అప్పుడు ధృతి అతని రూమ్‍కి వెళ్తుంది. హసంతిని వదిలి వెళ్ళిపోతున్నావా, నీదసలు ప్రేమేనా అని నిలదీస్తుంది. కార్తీక్ తన నిర్ణయానికి గల కారణాలు చెప్తాడు. సరే, నువ్వు హసంతి శ్రేయోభిలాషి వయితే, ఆమె పెళ్ళయ్యేదాకా ఉండి, అప్పుడు వెళ్ళిపో అని చెప్పి వెళ్ళిపోతుంది ధృతి. ఇక చదవండి.]
[dropcap]పం[/dropcap]జాగుట్ట సెంట్రల్ షాపింగ్ మాల్‌కి సురేష్, కార్తీక్, రాజు వచ్చారు.
రాజుకి పెళ్లి కుదిరింది. షాపింగ్ కోసం ఫ్రెండ్స్‌ని తీసుకొచ్చాడు.
“ఒరేయ్! పెండ్లి కొడకా! తొందరగా సెలెక్ట్ చేసుకో. ఈలోపల నేను, సురేష్ ఒక రౌండ్ సైట్ సీయింగ్‌కి వెళ్ళొస్తాం” అన్నాడు కార్తీక్.
“రేయ్! ఉండండి.. రా! బాబూ! ఇన్ని బట్టల మధ్య ఏది సెలెక్ట్ చేసుకోవాలో నాకు అయోమయంగా ఉంటుంది. రా! ప్లీజ్” అన్నాడు రాజు.
“ఇదేందిరా సామి! నీతోటి మా చెడ్డ ఇబ్బంది వచ్చినాదే” కార్తీక్ అన్నాడు.
“ఏం.. పర్లేదు. నీ సెలక్షన్ బాగుంటుంది అనే కదా! మిమ్మల్ని ఇద్దరినీ తీసుకొచ్చింది”
“ఏంట్రా! నీ కంటికి బట్టలు వెతికిపెట్టే పనిమనిషి లాగ కనిపిస్తున్నామా? ఏంది?”
“అదేం లేదు.. లేరా! బాబూ!”
“ఎన్ని జతలు కావాలి?”
“ఆరు జతలు. ఒక సూటు, ఎక్స్‌ట్రా బ్లేజర్”
“ఎన్ని జీన్స్, ఎన్ని ఫార్మల్స్”
“అవి మూడు.. ఇవి మూడు”
“ఒరేయ్ పదండి రా!” అని జీన్స్ ఉన్న వైపు వెళ్లారు.
జీన్స్, ఫార్మల్స్.. సెలెక్ట్ చేశాక షర్ట్స్ వైపు వచ్చారు. అది ముగించుకుని, ట్రైల్ రూమ్ ముందు నిలబడ్డారు సురేష్ కార్తీక్ బట్టలు పట్టుకొని.
రాజు ఒక్కొక్క జత తీసుకెళ్లి ట్రైల్ రూమ్‌లో, వేసుకొని బయటకు వచ్చి బాగుందా అంటే “ఓ.కే.. ఓ.కే” అంటున్నాడు సురేష్.
ఇంతలో వెనక నుండి
“హలో కార్తీక్! ఏంటి ఇక్కడ?” అనేసరికి తెలిసిన గొంతును గుర్తుపట్టి వెనక్కి తిరిగి..
“హలో మేఘన గారూ! బహుకాల దర్శనం” అన్నాడు ఆశ్చర్యంగా.
“ఫస్ట్ ఫ్లోర్‌లో చూశాను. అవునా! కాదా! అనుకుంటూ మీ వెనకే వచ్చాను” అంది మేఘన.
చేతి మీద రాజు బట్టల్ని సురేష్ కిచ్చి.. కొంచెం పక్కకు వచ్చాడు కార్తీక్.
“చెప్పండి మేఘన గారూ! ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? అదే కంపెనీలో ఉన్నారా? మారారా?”
“హమ్మా! బతికించారు. ఇదే మాటలని ఐదారు భాషల్లో చెప్పలేదు.” అంది
“భలే గుర్తు చేశారు.”
“వద్దులేండి! నేను అక్కడే ఉన్నాను. కనీసం మెసేజ్ లకి కూడా అందనంత దూరం వెళ్లిపోయారు. అసలు నేను గుర్తున్నానా?” అంది మేఘన నిష్ఠూరంగా.
“ఇంకా మతిమరుపు రాలేదు లెండి”
“ఏంటి సంగతులు ఇప్పుడు ఎక్కడ?”
“ప్రస్తుతం విప్రో”
“మీ తొలిప్రేమ దొరికిందా!”
“దొరికినట్టే దొరికి.. ఫిష్ చేతిలో నుంచి జారిపోయింది”
“అర్థం కాలేదు”
“చేసుకోకండి. ఎందుకంటే ప్రపంచంలో ఏ బంధమైనా బాధను పంచుకునేదిలా ఉండాలి కానీ, బాధను పెంచేదిలా ఉండకూడదు అన్నాడు షేక్‌స్పియర్.”
“ఓకే.. ఓకే! ఫిలాసఫీ చదువుతున్నారా”
“కొత్తగా చదవక్కర్లేదండి. జీవితమే నేర్పిస్తుంది”
“మీ మ్యూజిక్ ఎంతవరకు వచ్చింది?”
“ప్రస్తుతం ఓ షార్ట్ ఫిలింకి మ్యూజిక్ కంప్లీట్ చేశాను. మరో షార్ట్ ఫిలింలో యాక్ట్ చేస్తున్నాను.”
“యాక్టింగ్ కూడానా.. బహుముఖ ప్రజ్ఞాశాలి.”
“అంత లేదు లేండి!” అన్నాడు. అంతలో..
అక్కడికి మేఘన కజిన్ పూర్ణ వచ్చింది.
“రావే! పూర్ణా! ఇతనే కార్తీక్”
“హలో!” అన్నాడు.
“నీ క్రష్ అని చెప్పావే. మ్యూజిక్ మాన్.. ఇతనే కదా!” అంది పూర్ణ.
“అయ్యో అదేం లేదండి. మేఘన గారు నన్ను చూడగానే ఊహల మేఘాల్లోకి వెళ్లిపోయారు.”
“కార్తీక్ దిస్ ఈజ్ పూర్ణ. డి.ఆర్.డి.ఎల్.లో జూనియర్ సైంటిస్ట్. షాపింగ్ చేద్దామంటే వచ్చాను”
“హాయ్!” అని,.
“సరే! మీరు మాట్లాడుతుండండి. నేను సెకండ్ ఫ్లోర్‌లో ఉంటాను” అని పూర్ణ వెళ్ళిపోయింది.
“మిమ్మల్ని ఎవరైనా లేక మీరు ఎవరినైనా ప్రపోజ్ చేశారా!”
“ఇంకా అంత అదృష్టం కలగలేదు. నా క్రష్‌లో ఇంకా నువ్వే ఉన్నావు కార్తీక్. నీ ప్లేస్‌ని ఎవరు ఇంకా రీప్లేస్ చేయలేదు” అందొకలా!
“అంటే మీ ప్రేమని ప్రేమించే ప్రేమ మిమ్మల్ని ప్రేమించడానికి ఇంకా మీ దగ్గరికి ప్రేమతో రాలేదన్న మాట”
“హ్హ..హ్హ”
“హ్హ .. అని నవ్వటం కాదు. ఇప్పుడు నేను చెప్పింది ఒకసారి రిపీట్ చేయండి”
“అమ్మో! నావల్ల కాదు.”
“పోనీ ఇందులో ఎన్ని ప్రేమలు ఉన్నాయో! చెప్పండి”
“ఫోర్”
“ఫైవ్”
“అబ్బా! ఈ తికమక పజిల్స్ నావల్ల కాదు బాబు”
“అవును.. మీ పోస్ట్ గ్రాడ్యుయేట్ పానీపూరి సెంటర్ మీతో పాటు తీసుకెళ్లారా! అక్కడ కనిపించడం లేదు”
“లేదండి.. ఇప్పుడు కూకట్‌పల్లిలో జె.ఎన్.టి.యు సెంటర్ దగ్గర టిఫిన్ సెంటర్ ఓపెన్ చేశాడు. మంచి డిమాండ్ ఉంది.”
“నిజంగా! అతనికి మీ ఎంకరేజ్మెంట్ ఎంతో ఉంది.”
“నాదేం లేదండి, జస్ట్ చిన్న మొక్క నిలదొక్కునే దాకా నీళ్ళు పోశాను. అంతే!”
“గ్రేట్”
“ఇప్పుడైనా ఫోన్ నెంబర్ ఇస్తావా?కార్తీక్” అంది.
“మేఘన గారూ! నాది అదే ఫోన్ నెంబరు. మారింది నాది కాదు మీది. ఫోన్ నెంబర్ మారిందని కనీసం మెసేజ్ కూడా పెట్టలేదు.”
“ఓ.. ఐ యాం సారీ! నా ఫోన్ పోయింది. దాంట్లోనే నీ నెంబరు ఉంది.”
“మనసుంటే మార్గాలనేకం. ఫోన్ నెంబర్ కనుక్కోవడం మీకేం అంత కష్టమైన పని కాదు”
“…”
“అందుకే నా ఫోను నిశ్శబ్దమైంది. నీ ఫోన్లో నా నంబర్ లేనట్టు తెలిసిపోయింది కాబోలు” అన్నాడు
“హైకూలా ఉంది. భలే చెప్పారు. దట్ ఈజ్ కార్తీక్.”
“వెళ్దామా” అన్నాడు సురేష్.
“రాజు గారి షాపింగ్ అయిందా?”
“అయి చాలా సేపు అయింది”
“సరే మేఘనా! మళ్ళీ కలుద్దాం” అన్నాడు
“ఓకే బై..” అని చెయ్యి ముందుకు చాపింది.
చేతులు జోడించి “బై” అన్నాడు.
“యూఁ..” అంది
“యా.. యా.. నేనే కార్తీక్” అంటూ రాజు సురేష్‌తో కలిసి బయటికి వచ్చాడు.
***
ఇంట్లో పెళ్లి పనులు మొదలయ్యాయి. కవిత, ఆమె చెల్లెలు సరోజ, ఇంకో బంధువు పార్వతి కలిసి పసుపు వినాయకుడికి బియ్యం కట్టారు. పసుపుకొమ్ములు పసుపుగా కొట్టారు. ధృతి ఆమె ఫ్రెండ్ కలిసి శుభలేఖలకి పసుపు రాస్తున్నారు.
ఇంట్లో ఇంత హడావిడిగా తన గదిలో సోఫాలో దిగాలుగా కూర్చొని వెనక్కి వాలి కళ్ళు మూసి ఆలోచిస్తోంది హసంతి. కళ్ళ ముందు కార్తీక్‌ని కలిసిన సందర్భాలు, తన చేతిలో చిన్న బొకే పెట్టడం, ఐ లవ్ యు చెప్పటం కనిపిస్తున్నాయి.
ఎదురుగా గౌతమ్ ఓ పక్క, కార్తీక్ మరో పక్క నుంచొని తనకోసం చేతులు చాపి, ‘నువ్వు నా దానివి’ అంటే ‘నువ్వు నా దానివి’ అని పోటీ పడుతున్నారు. ఎంత ఆలోచించినా మనసు కార్తీక్‌కే ఓటేస్తోంది.
కళ్ళు తెరిచి ఓ నిర్ణయానికి వచ్చిన దానిలా.. లేచి డ్రెస్సింగ్ టేబుల్ మీదున్న సెల్‌ఫోన్, వాలెట్ తీసుకుని బయలుదేరబోతుంటే.. అంతలో మనస్సాక్షి ప్రతిబింబం రూపంలో నిలబడి..
“ఎక్కడికి వెళ్తున్నావు? హసంతీ! కింద అందరూ బిజీగా ఉన్న సమయంలో నీకేమీ పట్టనట్టు ఎక్కడికెళ్తున్నావు?” అంది.
“ఎక్కడికీ లేదు” అంది తత్తరపాటుగా.
“నువ్వు లేదంటే.. ఏదో ఉందన్నట్టుగా ఉంది.”
“అలాంటిదేం లేదు.”
“అంటే.. నువ్వు కార్తీక్‌ని కలవడానికి వెళ్తున్నావా?”
“అవును.”
“ఇన్ని రోజులూ సైలెంట్‌గా ఉండి, ఇప్పుడు ఎందుకు వెళ్తున్నావు?”
“ఇహ సైలెంట్‌గా ఉండలేక”
“చూడు.. ఇప్పుడు నువ్వు కార్తీక్ కోసం వెళితే, గౌతమ్ ఏమనుకుంటాడు? పాపం! గౌతమ్! అనిపించడం లేదా? నీ మీద తన పంచప్రాణాలు పెట్టుకున్నాడు. నువ్వేమో నాలుగు రోజుల్లో పెళ్లి పెట్టుకొని కార్తీక్ కోసం వెళ్తానంటున్నావు.”
“అయ్యో! అయ్యో!” అని చెవులు మూసుకుని, “నేను కార్తీక్‌ని ప్రేమిస్తున్నాను. ఎవరేమనుకున్నా నాకు అనవసరం. నాకు కార్తీకే కావాలి. నాకేం కావాలో, ఎవరు కావాలో నాకు బాగా తెలుసు.” అరిచినట్టు అని, ఎదురుగా నిలబడ్డ మనస్సాక్షిని “వెళ్ళు, నువ్వు వెళ్ళు.. నా ముందు నుంచి వెళ్ళిపో..” అంది ఏడుస్తూ.
మనస్సాక్షి మాయమైంది. హసంతికి మొహం నిండా చెమటలు పట్టేశాయి.
అంతలో వెనుక నుండి తల్లి వచ్చి
“హసంతీ! ఏం చేస్తున్నావే ఒంటరిగా ఇక్కడ? ఇప్పుడు మామయ్య గౌతమ్ వస్తారు. మనం అందరం పెళ్లి బట్టల షాపింగ్‌కి వెళ్తున్నాం. త్వరగా రా! కింద ధృతి, స్వప్న ఉన్నారు. గౌతమ్ వాళ్ళు వచ్చాక వాళ్ళని వెయిట్ చేయించడం బాగుండదు. త్వరగా రా!” అని కిందకి వెళ్ళింది.
***
“నువ్వేం చేస్తున్నావో తెలుస్తోందా? హసంతీ! ఈ ఇంటి పరువు, మర్యాద మంట కలిపి పోదాం అనుకుంటున్నావా? పాపిష్టిదానా? నా కడుపున చెడబుట్టావు. ఎక్కడికి వెళ్తావే” అని ఏడుస్తూ, ఎదిగిన కూతురని కూడా చూడకుండా.. చెంపల మీద ఎడాపెడా వాయించింది.
ఏడుస్తూ కిందే కూర్చుంది హసంతి.
కవిత ఏడుస్తూ.. “నిన్నని ఏం లాభం? అంతా నా ఖర్మ” అని తలబాదుకునుంటే.. హసంతి లేచిచ్చి, తల్లి కాళ్ళ దగ్గర కూర్చొని కాళ్లు పట్టుకుంది ఏడుస్తూ.
“అమ్మా! అమ్మా! ప్లీజ్ అమ్మా! ఒక్కసారి నేను చెప్పేది వినమ్మా!” అని ఏడుస్తోంది హసంతి.
***
గౌతమ్ గదిలో కింద కూర్చొని వెడ్డింగ్ కార్డ్స్‌ని ముక్కలు, ముక్కలుగా చించి పడేస్తున్నాడు. ఫోన్ మోగుతున్నా పట్టించుకోవటం లేదు.
దగ్గరగా వేస్తున్న తలుపు తీసుకుని లోపలికి వచ్చాడు సుధాకర్.
“రేయ్ గౌతమ్! ఇందాకట్నుంచి ఫోన్ చేస్తున్నా లిఫ్ట్ చేయవేరా? ఇదిగో ఇప్పుడు కూడా నా ఫోన్ కాలే వస్తోంది చూడు.”
ప్రపంచంలోని విచారమంతా మొహంలో నింపుకున్నట్టు దిగాలుగా కూర్చున్నాడు గౌతమ్. కింద పడ్డ వెడ్డింగ్ కార్డు ముక్కలను చూశాడు సుధాకర్. ఇంకా చింపుతూనే ఉన్న గౌతమ్ చేతిలో ఉన్న వెడ్డింగ్ కార్డ్స్ లాక్కుని..
“ఒరేయ్ ఏంట్రా? ఈ పిచ్చి పని. నాలుగు రోజుల్లో పెళ్లి పెట్టుకొని, శుభలేఖలు ఎవరైనా ఇలా చంపుతారా? అశుభంగా!” అన్నాడు కోపంగా.
“ఈ పెళ్లి జరగదు రా! జరగగనప్పుడు శుభలేఖలతో పనేంటి?” అన్నాడు గౌతమ్ విరక్తిగా.
“నీవి చేతలే కాదురా! మాటలు కూడా విచిత్రంగానే ఉంటాయి.”
“అవును రా! విచిత్రమైన పరిస్థితి నాది. హసంతికి నాతో పెళ్లి ఇష్టం లేదు. ఆమె మరొకతని ప్రేమిస్తోందని తెలిసాక, నన్ను ఆమెను ఎలా పెళ్లి చేసుకోమంటావురా?”
“అని హసంతి నీతో చెప్పిందా? ఇంతవరకు చెప్పలేదు కదా! నేనెప్పుడూ చూసినా ఆమె అలా ఎప్పుడూ కనిపించలేదు. నీకు ఇష్టం లేకపోతే మీ నాన్నతో, హసంతితో స్ట్రెయిట్‌గా చెప్పు. అంతేగాని హసంతి మీద మాత్రం నింద మోపకురా!”
“తెలిసీ, తెలియకుండా మాట్లాడకు. నీకు ఇంతకు ముందే చెప్పాను. కార్తీక్ అనే కుర్రాడు బైక్ మీద నన్ను ఫాలో అయ్యి – హసంతిని ప్రేమిస్తున్నట్టు, తనకు ఆమెను వదిలెయ్యాలనీ, లేకపోతే మీ పెళ్లి జరగనివ్వనన్నాడు”
“అయితే!?”
“ఒక్క విషయం రా! ఇక్కడ కార్తీక్ నీతో అన్నాడు కానీ, హసంతి ఏ రోజున నీతో చెప్పలేదు కద రా! ఎవరో ముక్కు మొహం తెలియని వ్యక్తి పెళ్లి జరగనివ్వనని, ఛాలెంజ్ చేస్తే.. నువ్వు ఎందుకు జరగదో నేనూ చూస్తా!.. అని బెట్ కట్టి రావాల్సింది. మీ అమ్మ హసంతికి, నీకూ పెళ్లి జరగాలని కోరుకుంది కదా! ఎవరో మూడో వ్యక్తి మాటలకు ఇంపార్టెన్స్ ఇచ్చి, ఇంట్లో మూల కూర్చుని పిచ్చిపిచ్చి ఆలోచనతో మనసు పాడు చేసుకోకు రా! ఇలా వెడ్డింగ్ కార్డ్స్ ముక్కలు చెయ్యటం మీ డాడీ చూస్తే బాధపడతారు. ముందు క్లీన్ చెయ్యరా! తర్వాత కలుద్దాం” అని వెళ్ళాడు సుధాకర్.
(సశేషం)