Site icon Sanchika

ONE PART WOMAN కు పెరుమాళ్ మురుగన్ రాసిన మరో సీక్వెల్ A LONELY HARVEST

[box type=’note’ fontsize=’16’] స్ప్రెడింగ్ లైట్ జ్యోతిగా, పుస్తకం జ్యోతిగా, తెలుగు సాహితీ అభిమానులకు సుపరిచితమయిన పి.జ్యోతి, సంచిక పాఠకుల కోసం ప్రత్యేకంగా రచిస్తున్న పుస్తక పరిచయాలు/సమీక్షలు… [/box]

[dropcap]పె[/dropcap]రుమాళ్ మురుగన్ ONE PART WOMAN నవలకు కొనసాగింపుగా రాసిన రెండు సీక్వెల్స్‌లో TRIAL BY SILENCE గురించి గత వారం తెలుసుకున్నాం. ఇవాళ అదే కథకు రెండెవ సీక్వెల్ గురించి తెలుసుకుందాం. మొదటి నవలలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్న కాళిని తల్లి చూసి ఆపుతుంది, కాపాడుతుంది. A LONELY HARVEST కథ పూర్తి విరుద్దంగా సాగుతుంది. తన భార్య తమకు సంతానం లేదనే ఒక్క కారణంతో, తమ పన్నేండేళ్ళ వైవాహిక జీవితాన్ని, తానామెపై చూపిన ప్రేమను మరచి సంఘాచారాన్ని అనుసరించి గుడి సంబరాలకు వెళ్ళి ఒక పరాయి మగాడితో రాత్రి గడిపి వచ్చిందని తెలుసుకున్న కాళి ఆత్మహత్య చేసుకుంటాడు.

పొన్న తాను భర్త అనుమతి తోనే గుడి సంబరాలకు వెళుతున్నానని అనుకుంటుంది. కాని భర్త నుంచి ఈ విషయాన్ని కుటుంబం అంతా దాని ఉంచారని తెలుసుకుని తాను మోసపోయానని బాధపడుతుంది. భర్తని శవంగా చూసి ఆమె తట్టుకోలేకపోతుంది. ఆమెకు అండగా ఆమె తల్లి, అత్తగారు ఆమెతో ఉండిపోతారు. విధవగా కొత్త జీవితాన్ని ఒంటరిగా గడపడానికి పొన్న ఇప్పుడు అలవాటు పడాలి. అప్పటి దాకా భర్త చాటు భార్యగా బ్రతికిన ఆమెకు భర్త వదిలి వెళ్ళిన బాధ్యతలును ఒంటరితనం అనుభవిస్తూ తానే నెరవేర్చాలి అని అర్థం అవుతుంది. కాళికి తన పొలం అన్నా, పశువులన్నా చాలా ప్రాణం, అతనేసిన వంగ తోట ఎండిపోతూ ఉంది. పొన్నకు ప్రతి చెట్టులో అడుగులో భర్త కనిపిస్తూ ఉంటాడు. అది అతను కష్టించి తీర్చిదిద్దిన ప్రపంచం. దాన్ని కాపాడడం తన బాధ్యత అనుకుంటుంది పొన్న. కాని భర్త మరణం ఏర్పర్చిన లోటు, ఆ తరువాత ఒంటరితనంతో ఆమె అలసిపోయి, శారీరికంగా శుష్కించి పోయి ఉంటుంది. కుటుంబంలో ఇటువంటి విషాద పరిణామాల మధ్య స్త్రీలందరూ తమ పాత ద్వేషాలను, కోపాలను మరచి ఎలా ఒక్కటవుతారో ఈ నవలలో రచయిత చూపిస్తారు. పొన్న కోసమే అన్నట్లు ఆమె తల్లి, ఆమె ఆత్తగారు బ్రతుకుతూ ఉంటారు. ఆమెను మళ్ళీ మామూలు జీవితంలోకి తీసుకురావడానికి వాళ్ళిద్దరూ విపరీతంగా కష్టపడతారు. కాళీ లాగే ఆమె ఎక్కడ ఆత్మహత్య చేసుకుంటుందో అని నిత్యం కాపలా కాస్తూ ఉంటారు.

పొన్న కష్టమైన పొలం పనులు చేయడం మొదలెడుతుంది. పొలంలో ఒక చోట అమ్మవారికి ఒక గుడి కట్టడం. బావి వద్ద నుండి నీరు మోసుకురావడం కష్టమని తెలిసి బావి వద్దే పెద్ద తొట్టీలు నిర్మించి అందులో నీళ్ళను నిలువ చేసుకోవడం ఇలా కొన్ని కొత్త ప్రయోగాలతో పొన్న పొలం పనులను స్వయంగా చేయడానికి సిద్దపడుతుంది. ఆ పనులలో తన దుఖాన్ని మర్చిపోయే ప్రయత్నం చేస్తుంది. ఎవరి మీదా ఆధారపడకుండా ఒంటరిగా జీవిస్తూ తన పొట్ట తాను పోషించుకునే స్థాయికి రావడానికి శారీరకంగా తనను తాను మలచుకుంటుంది. ఆమె పడే కష్టం చూసి తల్లి, అత్త బాధపడినా కాళి మరణం అనే బాధ నుండి తనను తాను ప్రపంచం వైపుకు మళ్ళించుకోవడానికి పనే ఆమెకు ఆసరా అని అందరూ గుర్తిస్తారు.

పొన్న అన్న ముత్తు కూడా తాను చేయవలసిన పనులు చేస్తూ పొన్నకు సహాయంగా ఉంటాడు. కుటుంబంలో ఉన్న సౌకర్యం ఇదే. కష్టకాలంలో నలుగురు కలిసి ఒకటిగా తమ సమస్యలను పరిష్కరించుకునే ప్రయత్నం కుటుంబ అనుబంధాలలోనే సాధ్యం అవుతుంది. అప్పుడే పొన్న గర్భవతి అని ఇంట్లో వారికి తెలుస్తుంది. గుడి సంబరాలకు వెళ్ళడం వల్ల కాళీని పోగొట్టుకున్నా, పొన్నకు చివరకు తల్లి అయే అవకాశం కలిగిందని, ఆ ఇంటికి మళ్ళీ మంచి రోజులు వస్తాయని ఆశిస్తారు ఆ ఇంట్లో ఆ వృద్ధ స్త్రీలు.

భర్త చనిపోయిన రెండు నెలల తరువాత గర్భం దాల్చిన స్త్రీ ఊరి పంచాయాతీ ఎదుట కడుపులో బిడ్డకు తండ్రి మరణించిన తన భర్తే అని ఒక ప్రతిజ్ఞ చేసుకోవాలి. అది అక్కడి ఆచారం. ఆమె పట్ల ఎవరికి అనుమానం ఉన్నా వారు అక్కడ పంచాయితీలో తమ అనుమానాన్ని చెప్పుకోవాలి. ఆ బిడ్డ చనిపోయిన భర్తదే అని నిరూపించవలసిన అవసరం ఆ విధవ కుటుంబానిది. పొన్న వివాహమయి పన్నేండేళ్ళు సంతానం లేకుండా ఉండడం, ఆమె గుడి సంబరాలకు వెళుతున్నప్పుడు ఎవరో చూడడం ఇవి కొంత అనుమానానికి తావిచ్చినా పొన్న అత్తగారు ఆ గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్ళి తన కోడలి కడుపులో ఉంది కాళి అంశమే అని పంచాయితికి వచ్చి తమ కుటుంబానికి అండగా నిల్చి, సహాయపడమని అందరినీ అడుగుతుంది. ఊరిలో కొందరికి కొన్ని అనుమానాలున్నా, ఆ కుటుంబ స్థితిని ఎరిగి ఉన్నవారు కాబట్టి తమ అనుమానాలు బైట పెట్టరు. నిర్ణయించిన రోజు పొన్న పంచాయితీకి వస్తుంది. ఊరి మంగలి పొన్న గర్భవతి అన్న విషయం పంచాయితీకి విన్నవిస్తాడు. ఆ బిడ్డ కాళి బిడ్డడే అని చెబుతాడు. ఊరి వారందరూ మౌనంగా దాన్ని అంగీకరిస్తారు. ఈ ఊరిలోని ముసలి అవ్వలు అందరూ పొన్న పక్షాణ నిలుస్తాడు. ఆ గర్భంలో ఉన్న బిడ్డకు ఊరి ఆమోదం లభిస్తుంది. సంఘంలో తమ సంతతిగా ఆ బిడ్డను ఆ ఊరు స్వీకరిస్తుంది. పొన్న అన్ని రకాల అవమానాల నుండి విముక్తి పొందుతుంది.

ఈ నవలలో ప్రాచీన గ్రామీణ తెగలలో కొన్నిఆచారాలను రచయిత చెప్పే ప్రయత్నం చేసారు. కొంత మంది సంతానం లేని స్త్రీలు ఒక రాత్రి మరో మగాడితో గడిపి అలా పుట్టిన సంతానాన్ని దేవుడిచ్చిన వరంగా అనుకుని జీవించే వెసలుబాటు కొన్ని ప్రాంతాలలో ఉన్నది అని వారు తన మొదటి నవలలో చెప్పడం జరిగింది. అలాగే వితంతువు అయిన స్త్రీ తన బిడ్డకు తండ్రి, మరణించిన భర్తే అని ప్రమాణం చేసి ఊరి ఆమోదం పొందవలసిన అవసరం ఉండడం, దానికి పంచాయితీ అమోదం లభించవలసిన అవరం ఉండడం గురించి ఈ నవలలో ప్రస్తావిస్తారు. అలాగే ఈ పుస్తకంలో ఎన్నో జానపద కథల ద్వారా కుటుంబ సభ్యుల మధ్య నడిచే సంఘాషణలలో వచ్చే సెక్స్‌కు సంబంధించిన వివరాలు, శారీరిక సంబంధాలకు, పవిత్రత అనే ముసుగు వేసి అనవసర ప్రాధాన్యత ఇవ్వకుండా గడిపిన వారి జీవితాలు కనిపిస్తాయి.

కాళి మేనమామ పాత్ర ఈ నవలలో కూడా వస్తుంది. జీవితాన్ని చాలా తేలికగా తీసుకునే వ్యక్తి అతను. అతన్ని కోరి వచ్చిన స్త్రీ లందరితో కలిసి ఉండడం అతని అలవాటు. అలా అతని జీవితంలో ఎందరో స్త్రీలు వచ్చారు, వెళ్లారు. అతను వివాహం చేసుకోలేదు. కాని అతనికి కొంత పొలం ఉంది. ఆ పొలం కోసం అతని తమ్ముడే తన భార్యను అతని వద్దకు పంపిస్తాడు. ఆమె అన్న ద్వారా గర్భవతి అయితే ఆ సంతానం కోసం అతని ఆస్తి రాసి ఇస్తాడు అని అతను ఆలోచిస్తాడు. అయితే ఆ మేనమామతో సంబంధం పెట్టుకున్న అతని మరదలు అతన్ని ప్రేమించడం మొదలెడుతుంది. ఆమెకు వయసుకు వచ్చిన పిల్లలున్నారు. కాని అందరినీ వదిలేసి అతనితో ఉండడానికి సిద్దపడుతుంది. దానికి ఆమె భర్త పిల్లలు ఆమెను విపరీతంగా కోడతారు, ఇంట్లో బంధిస్తారు. కాని అక్కడి నుండి తప్పించుకుని ఆమె ప్రతిసారి బావగారి దగ్గరకు రావడం, తమ్ముని కుటుంబం తనను చంపేస్తారని ఇతను ఆమెను తప్పించుకుని తిరగడం జరుగుతుంది. చివరకు ఆమె పిచ్చి దయ్యి పుట్టింట్లో చెట్టుకు కట్టివేసి ఉన్న స్థితిలో కనిపిస్తుంది.

ఇలా ఎన్నో సంఘటనల ద్వారా ఆ రోజులలో కుటుంబ సభ్యుల మధ్య నడిచిన అక్రమ సంబంధాల గురించి చెబుతూ ప్రతి కుటుంబంలో సంతానం అవసరం చెప్పే ప్రయత్నం చేస్తారు రచయిత. ఆర్థిక, సామాజిక భద్రత కోసం సంతానం దంపతులకు అవసరం. సమాజంలో సంతానం లేని వారు ఎన్నో హక్కులను పోగొట్టుకుంటారు. సంతానం తల్లి తండ్రుల, కుటుంబ భద్రత కోసం అత్యవసరం. మానవ నాగరికత, ఈ భద్రత పై ఆధారపడి ఉంది. అందుకే పిల్లల కోసం అంతగా కుటుంబాలు తపిస్తాయి. చివరకు పొన్న ఒక మగ పిల్లవాన్ని కంటుంది. పురుషాధిక్యత ఉన్న ప్రపంచంలో ఒంటరిగా బ్రతకడానికి అలవాటు పడుతుంది. ఆమెను కాళి భార్యగా ఆమె బిడ్డని కాళి బిడ్డగా అంగీకరించిన ఊరు ఆమెకు అన్ని విధాలుగా సహాయపడుతుంది. ఈ సామాజిక భద్రత కోసమె మనిషి తెగలతో సహజీవనం చేస్తాడు. సమూహంలో ఉండడానికి సిద్దపడతాడు. సమాజం తాను ఆమోదించిన వ్యక్తిని ఆదుకోవడానికి ముందుకు వస్తుంది. ఆ సహయం కోసమే సమాజ ఆమోదం కోసం తాపాత్రయ పడతాడు మనిషి.

తెగలుగా మానవులు బ్రతకడానికి కారణాలు, సమాజం మనిషి జీవితంలో నిర్వహించే పాత్ర, సమాజ ఆమోదం ఎందుకు ఎంతవరకు అవసరం, అన్న విషయాలను ఈ నవలలో రచయిత చెప్పే ప్రయత్నం చేసారు. చాలా చోట్ల సమాజ ఆమోదమే నైతికత అవుతుంది. ఆ ఆమోదం కోసమే మనిషి జీవితాంతం కష్టపడతాడు. సమాజం తన ఒడిలోకి తీసుకున్న వ్యక్తి పట్ల చాలా బాధ్యతగా ఉంటుంది. కాని తనను ఎదిరించిన వ్యక్తిని అంతే కఠినంగా శిక్షిస్తుంది. అందుకే మనిషి తనను తాను సమాజానికి అనుకూలంగా మలచుకుంటాడు. సమాజాన్ని మనిషిని వేరు చేసి చూడలేం. ఒంటరిగా మనిషి జీవించడం చాలా కష్టం. తనదైన సమూహం కోసం మానవుడు ఎప్పుడూ వెతుకుతుంటాడు. దానికి సంబంధించి ఎన్నో అంశాలను, కారణాలను ఈ నవల చర్చకు తీసుకువస్తుంది.

ఒకే నవలకు రెండు సీక్వెల్లు నాకు తెలిసి ఎవరూ రాయలేదు. కథా రచనలో ఇటువంటి ప్రయోగాలు జరిగాయి కాని ఒకే రచయిత తన కథకు రెండు ముగింపులను రెండు నవలలుగా రాయగా చదవడం ఇదే ప్రథమం. అందుకే పెరుమాళ్ మురుగన్ రెండు నవలలను ఇలా పరిచయం చేయడం జరిగింది.

 

 

Exit mobile version