[డా.టి.రాధాకృష్ణమాచార్యులు రచించిన ‘ఆ హాల్’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
[dropcap]నా[/dropcap]కొక తరగతి గది
అదే నా శరీర నిర్మాణ శాస్త్ర వేదం
విప్పిచూపి
నాలోని నన్ను నాకు కణకణం
చదువై నేర్పిన కొత్తపాఠశాల
ఆ హాల్
సైగలతో పిలిచి పలకరించు
సుందర దరహాసాల అందాల మోముపై
సంక్లిష్ట అద్భుత నయనాల నిర్మతిని
విగతజీవై వివరించిన జ్ఞానబోధి
అంతర్ముఖమైన కెమెరా చిత్రాలలో
బింబప్రతిబింబమై జీవించే
కన్నుల రెటీనా విజ్ఞానవని
ఆ గది
నాలో నిదురించక నిదురించే
ప్రియ నేస్తమే
గుండె గొంతుకైన నిత్య స్పందన తీరంలో
ప్రసరించే దేహగేహాల రుధిర జీవ కావ్యం
నాలుగు గదుల రక్త ప్రవాహ గీతం
ప్రతి ఉదయం రాత్రి, నిరంతం సాగే
వెలుగు పూల గోప్యం విప్పిన
అవయవ నిర్మాణ విజ్ఞానశాల
ఆ హాల్
ఊపిరిలో ఊపిరై జీవించే
జీవన శ్వాసకోశ వీణియ తీగలు
ప్రాణమైన జీవ క్రియలో
బతుకున ఊయలూగే ఊపిరి
ప్రాణాధార వాయు ద్వారాలై
ఇలాగే
అన్ని క్రియలతో బతికే మనిషి
అపూర్వ నిర్మాణ కాంతి దేహంలో
తన రక్తమాంసముల మమతల కణాల నేర్పు
నెనరుగ నేర్చిన వేళ్ళు
నాలో ఎదిగిన చిగుళ్ళ ఆనవాలు
ఆ హాల్
సజీవ దేహాల సర్జరీకి అందివచ్చిన
అమూల్య మెట్లమేడ నాకు
ఆ హాల్
విలువైన సంక్లిష్ట వైద్యశాస్త్ర టీచింగ్ హాల్
అదే.. అదే.. ఎనాటమీ హాల్