ఆ కళ్ళు

0
2

[dropcap]ఆ[/dropcap] కళ్ళు
నీలాలు … నీలోత్పలాలు
నీల గగనాన
మిలమిలా మెరిసే జంటనక్షత్రాలు

ఆ కళ్ళు
విజ్ఞానం నిండిన లోగిళ్ళు
వివేకం విహరించు వాకిళ్ళు
విచక్షణ వీక్షించు గవాక్షాలు

ఆ కళ్ళు
జాలిచూపించు జలపాతాలు
కాంక్షరగిలించు కందర్పశరాలు
భావవ్యక్తీకరణ భాండాగారాలు
నవరసపోషణ నటవిశిష్ఠరత్నాలు

ఆ కళ్ళు
సిగ్గుకు చిరునామాలు
విలాసానికి శాశ్వతవిలాసాలు
వెటకారానికి చక్కటి వెక్కిరింపులూ
కోపానికి కస్సుమనే కోడెత్రాచులు

ఆ కళ్ళు
విరహిణి అభిసారిక దూతికలు
వలపుల వరూధిని చెలికత్తియలు
పొందుగోరు ప్రణయిని ఆంతరంగికలు
ప్రణయదేవత పిలుపునందించు ప్రతీహారికలు

ఆ కళ్ళు
కాలాన్ని కాటేసే కాలసర్పాలు
గంటల్ని నిమిషాలుగా, క్షణాలుగా
సమయాన్ని మింగేసే కృష్ణబిలాలు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here