[శ్రీపార్థి గారు రాసిన ‘ఆ కళ్ళు’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]
[dropcap]నా[/dropcap] కళ్ళతో మీరు చూడండి – ఆ దృశ్యాలు మీకు కనపడతాయి.
నా చెవులతో మీరు వినండి – ఆ ఆర్తనాదాలు మీకు వినపడతాయి.
ఆ కళ్ళు నన్ను వేటాడుతున్నాయి. అర్ధరాత్రి హఠాత్తుగా నిద్రలేపి ప్రశ్నిస్తున్నాయి.
తోడేళ్లలాంటి మానవ మృగాల మధ్య లేడి పిల్లలా ఆమె చిక్కినపుడు, నన్ను కాపాడూ అని ఆమె చూసిన చూపులు నన్ను వెంటాడుతున్నాయి.
ఈ సంఘటన జరిగి ముఫ్పై యేళ్లకు పైగా గడిచినా, ‘నన్ను వదిలేసి నీ మానాన నువ్వు వెళ్లిపోతావా’ అని నాముందు ఆమె ప్రత్యక్షమై నన్ను ప్రశ్నిస్తున్నట్టుగానే వుంది.
వాన చినుకలా మొదలై జడివానగా మారి తుఫానులా నా జీవితంలో చెలరేగిన సంఘటన.
***
“సద్దుల బతుకమ్మా, దసరా పండుగ వస్తాంది, ఇంట్ల నయాపైస లేదు. నువ్వు మీ బాపు దగ్గరకు పోయి పైసలు దేవాల్రా చిన్నోడ” అన్నది అమ్మ దసరా సెలవులిచ్చిన మొదటి రోజు.
“మనూరికా.. అబ్బ! నేను బోనే గంత దూరం, నాకు భయం” అన్నాను లాగుపైన అంగి తొడుక్కుంటూ.
“షిన్న పోరనివారా, ఏడోది జదువుతానవు, ముడ్డికిందికి పన్నెండెండ్లు అచ్చినయ్, ఇంక బయమేంద్రా, ఇట్లపోయ్ అట్లరారా” అంటూ గోడకు ఆనుకొని కూచుంది అమ్మ.
“అబ్బ నేను బోనే అమ్మా, ఇయ్యాటి సంది దసరా సెలవులు, నేనాడుకోవాలే” అన్నాను అమ్మ చెయ్యిపట్టుకొని పక్కన కూచూంటూ.
“కిరికెట్టెనా ఆడేది, ఆటకు ఆ పోరాగాండ్లు ఇంటికి రాని చెప్త ఒక్కొక్కని సంగతి”
“ఇగ వాళ్లనేమనకు గని, నేనొక్కన్ని ఎట్లబోవాల్నె, ఎన్నడన్న ఒక్కన్ని బోయిన్న, ఎప్పుడుబోయిన నీతోటే గదా” అన్నాను అమ్మ ఒడిలో తలపెట్టి పడుకుంటూ.
“నేను జెప్తగదరా ఎట్లబోవాల్నో” అన్నది అమ్మ నా చెంపలు పట్టుకొని ముద్దాడుతూ.
“సరే మరి ఒచ్చినంక క్రికెట్ బాలుకు పైసలిత్తవ”
“ఇత్తపోరా”
“ఒట్టు”
“ఒట్టు, నాతోడు, సరేనా, ఇంకేంది”
“సరే ఐతే ఎప్పుడుబోవాలే మరి”
“రేప్పొద్దుగాల ఎనిమిదన్నరకు సింగరేణి రైలుకు బో”
***
“ఇగోరా బ్యాగు ఒక జత అంగి లాగు బెట్టిన” అంటూ బ్యాగు నా చేతికిచ్చి – “ఊరికి బోతవా ఆయింత యేనన్న కాటుగల్తవ (తప్పిపోతవా)” అంది అమ్మ నా భుజాలు పట్టుకొని.
“యే, తెల్లారిలెత్తె వరంగలు అంతా తిరుగుతడు వాడెడికిబోతడే” అంది మాకు కిరాయకు ఇచ్చిన మా సుట్టపు ఇంటి ముసల్ది తమలపాక్కు సున్నం రాసుకుంటూ.
“చార్జిలకు పైసలియ్యి నేను బోతా” అన్న అమ్మతో ఇన్నే వుంటే ఈ ముసల్ది నామీద ఇంకేం చెప్తదోనని.
“ఇగో చార్జిలకు పైసలు పది రూపాయలు, స్టేషనుకు రిక్షా ఎక్కకు అదో రూపాయిన్నర దండుగ, గీన్నె గదా నడ్సుకుంటబో” అంటూ పైసలు నాచేతికిచ్చి.
“ఈడ సింగరేనెక్కు రెచ్నిరోడు స్టేషన్ల దిగు మధ్యల అన్ని స్టేషన్ల ఆగుతది బండి. మంచిర్యాల తరువాత బాగా జూడు, రవీంద్రఖని మందమర్రి బెల్లంపల్లి తరువాత రెచ్నిరోడు అత్తది. ఆడ దిగి ఆటో ఎక్కి తాండూరు ఐ.బి.ల దిగు ఆన్నుంచి మనూరు తొమ్మిది కిలోమీటర్లు ఉంటది. ఆటో ఎక్కి మనూర్లకు బో, ఆటోకు పైసలు తక్కువైతే మీ బాపును అడిగియ్యి, ఏమంటానా” అంది అమ్మ ఇదంత వింటూ ఏదో ఆలోచిస్తున్న నన్ను చూసి.
“నాకెర్కెగని, నేనుబోతాన ట్రైను టైం అయితాంది”
“నిమ్మలంగ బో, బండి తంతెలకాడ (మెట్లు), తలుపుల కాడ గూసోకు లోపల గూసో, దిగేటప్పుడు పయిలం(జాగ్రత్త)” అంటూ మా గల్లి మూల తిరిగే దాక చెప్తూనే వుంది అమ్మ.
‘సింగరేణి ప్యాసింజరు రెండవ నెంబరు ప్లాటుఫాంపై బయలుదేరుటకు సిద్ధంగా వుంది’ అన్న అనౌన్సుమెంటు వినపడుతోంది, నేను చేతులూపుకుంటూ కాళ్లాడిచ్చుకుంటూ సినిమా పోస్టర్లు చూస్తూ వరంగల్ రైల్వే స్టేషనుకు చేరుకునేసరికి.
పరిగెత్తుకుంటూ స్టేషనులోకి పోయిన, ట్రైన్ ప్లాటుఫాం మీద వుంది. టికెటు కౌంటురు వైపు పోయి చూస్తే పెద్ద యుద్ధమే జరుగుతుంది అక్కడ టికెటు కోసం. ఏం చేద్దామా అని ఆలోచిస్తుండగానే “ట్రైను కదిలింది” అంటూ కౌంటరు మూతపడింది.
“రెచ్నిరోడుకు తరువాత ట్రైను ఏముంది?” అని అడిగాను ఎంక్వైరీ కౌంటర్‌లో కూర్చొని చిన్న దువ్వెనతో కనుబొమ్మలను మీసాలను పదే పదే దువ్వుకుంటున్న బుర్ర మీసాలయనను.
“పదిన్నరకు ఎక్సుప్రెసు ట్రైను వుంది, బెల్లంపల్లిలో ఆగుతది” అన్నాడు ఆయన మీసాలను సవరించుకుంటూ.
వెళ్లాలా వద్దా అని ఆలోచిస్తూ స్టేషను బయటకు వచ్చాను, చాయ తాగడానికి చాయ బండి కోసం చూస్తూ లాగు జేబులు వెతుక్కున్నాను. అమ్మ ఇచ్చిన పదిరూపాయలు పోను మనం ఆడిడ కమిషను కొట్టి సంపాయించిన చిల్లర ఉన్నాయి. అన్ని లెక్కపెడితే ఐదు రూపాయలయినయి.
ఇంటికి పోతే అమ్మ తిడ్తది, ఇయ్యాల ఊరికి పోయి బాపు దగ్గర పైసలు తీస్కొని రేపు పొద్దుగాల ట్రైనుకు రిటను అయితే మధ్యాహ్ననానికల్లా వరంగల్ల వుంట, రాంగానే అమ్మ దగ్గర పైసలు దీస్కొని బాలు కొనుక్కొవచ్చని ఆలోచించిన, ఎందుకంటే క్రికెటు ఆడాల్నంటే ఎవని బాలు వాడే దెచ్చుకోవాలే. దాని మీద వాని పేరు రాసుకోవాలే.
సింగరేణి తప్ప ఎప్పుడైతే ఎక్సుప్రెసు ట్రైను ఎక్కలే నేను. కాని ఎక్సుప్రెసు ట్రైను స్పీడుగా పోతది, సింగరేణి లెక్క అన్ని స్టేషన్లల్ల ఆగది గద్దెల్సు. ఎట్లైతే గట్లాయే పోవుడే బెటరు అని చాయ్ తాగూతూ ఆలోచించిన.
టికెటు కౌంటరు దగ్గరకు పోయి ఎక్సుప్రెసు ట్రైనుకు బెల్లంపల్లికి టికెటు ఇమ్మని పదిరూపాయలిచ్చిన, రెండు రూపాయలు వాపసు ఇచ్చి టికెటు ఇచ్చిండు. ట్రైను టైం అయ్యేదాక ప్లాటుఫాం అంత తిరుక్కుంట టైంపాసు జేసిన, పదకొండు గంటలకు ట్రైనొచ్చింది. ఎక్కె జనాలు పెద్దగ లేరు. యేడబ్బా ఎక్కాల్నొ మనకేమెరుక, జండ్రలు రిజర్వేషను అని మనకు తెల్వది గద. నాముందు ఆగిన డబ్బాలో ఎక్కిన. పెద్ద పెద్ద ఇనుప సందుగలు, బిస్తర్లతోటి ఒక్కొక్క సీట్ల ఒగడు పండుకొని వున్నరు. ఇదేంది కూసోడానికి లేదు అని అటీటు తిరుగుతానా సీటు కోసం. వీడెంది ఇట్ల తిరుగుతాండు అని చూసిన ఒకరిద్దరు, “క్యారే” అని హిందీలో అడగడం మొదలుపెట్టారు. నాకు హిందీ రాదు, వాళ్లకు తెలుగు రాదు, సరిపోయింది మాకు మాకు.
మొత్తానికి తేలిన విషయం ఏమంటే, అది మిలట్రి వాళ్లకు కేటాయించిన రిజర్వేషను డబ్బా అని, అందులోకి ఎవరూ ఎక్కగూడదని, సరే, వీళ్లతో మనకెందుకొచ్చిన కొట్లాట ఇంకో డబ్బాలోకి పోదామనుకునే లోపు ట్రైను కదిలింది. మెల్లగా బ్యాగు సంకంలో పెట్టుకొని డబ్బా మధ్యలో ఓ సీటుకానుకొని నిలబడ్డ.
ఇప్పుడాలోచిస్తే అది స్లీపర్ కోచు కాదు, ప్యాసింజర్లు కూచునే జండ్రలు డబ్బానే మిలట్రి వాళ్లకు స్లీపరుగా ఒక్కొ సీటు కేటాయించారు. ఒకడు లుంగీతో ఒకడు లాగుతో అందరూ నెత్తిమీద సగం వెంట్రుకలు సగం గుండుతో దిగ్గోరిగిచ్చుకొని, చిత్ర విచిత్రంగా అనిపించింది నాకు వాళ్లను చూస్తుంటే. మిలట్రి వాళ్లను చూసిందే తక్కువ ఒకేసారి ఇంతమందిని అస్సలు చూసిందే లేదు.
ట్రైను మంచి ఊపుమీద వెళ్తుంది. నా ముందున్న వాళ్లు పేకాట ఆడటం మొదలుపెట్టారు. నేను వాళ్లను చూస్తూ నిలబడ్డాను. ముందు మామూలుగా ఆడి తరువాత డబ్బుల్లోకి దిగిపోయారు. రమ్మి ఆడుతున్నట్టుగా వుంది. వాళ్ల ఆటలోకి నేను మెల్లగా లీనమైపోయాను. వాళ్లతో పాటు నాకు టైం తెలియడం లేదు. ఈ లోపు వరంగలులో బయలుదేరిన తరువాత ఆగింది ట్రైను. కిటికిలోంచి బయటకు చూస్తే ‘మంచెరియాల్’ అనే బోర్డు కనపడింది. తరువాత వచ్చేది బెల్లంపల్లి, నేను దిగాల్సిన స్టేషను.
ట్రైను కదిలింది, ఆట రంజుమీదుంది. నువ్వా నేనా అన్నట్టు ఆడుతున్నారు. ఎవరికెవరు తగ్గట్లేదు. వీళ్లకన్నా ముందు వాళ్ల ఆటలో నేను లీనమైపోయాను. ఆడుతున్నవాళ్లెవరికి టైం తెలియడం లేదు. ముఖ్యంగా నాక్కూడా. ఈ లోపు మల్లీ ట్రైను ఆగింది. అర నిమిషంలో కదిలింది. అప్పుడు చూసాను పసుప్పచ్చ బోర్డు మీద నలుపు రంగు అక్షరాలు ‘బెల్లంపల్లి’ అని, అంతే నా గుండె ఒక్కసారిగా ఆగినంత పనైంది.
“అమ్మో” అని ఒక్కసారిగా గట్టిగా అరిచాను. ఇప్పటి వరకు మంచిగనే వుండే ఈ పోరనికేమైంది అన్నట్టు వాళ్లు నన్ను ఆశ్చర్యంగా చూస్తున్నారు. అప్పటికే ట్రైను స్పీడందుకుంది.
“నా స్టేషను, నేను దిగాల్సిన స్టేషను” అంటూ కాళ్లు కింద టపటప కొడుతూ, చేతులు పైకి ఆడిస్తూ, ఏడుపు అందుకున్నాను.
“క్యా హోగయారే” అంటూ వాళ్లు పేకాట ఆపి నన్ను సముదాయించడం మొదలుపెట్టారు. వీడిక్కడ దిగాలి, దిగలేదు అనే విషయం నాలొల్లితో వాళ్లకు అర్థమైంది.
ట్రైను డబ్బా యేగిరిపోయెట్టు ఒకటే లొల్లి, నేను మాఊరు పోవాల్రో అని. ఈ గందరగోళంలో బక్కగా పొడుగ్గా నల్ల గడ్డం పెద్ద మీసాలు మాసిన బట్టలతో చేతిలో పచ్చి పల్లీల బుట్టతో మాదగ్గర కొచ్చాడు ఒకతను “క్యా హోగయ భాయ్” అంటూ.
వాళ్లు విషయం చెప్పారు హిందీలో, వాళ్లతో అతనేదో మాట్లాడాడు హిందీలో, నాకేం అర్థం కాలేదు వాళ్ల సంభాషణ.
ఈ వచ్చిన వాడు నా వేపు ఒకసారి ఎగాదిగా చూసి “యే ఊరు తమ్మి నీది” అన్నాడు
“వరంగలు” అన్నాను
“యాడుంటవు వరంగల్ల”
చెప్పాను.
“నాది గూడ వరంగలే, రైల్వే స్టేషను ఎదూరుంగ బస్టాండు పక్కన పెద్ద చాయ షాపు వుంటదిజూడు అగో అండ్లుంట” అంటూ నా పేరడిగాడు.
చెప్పాను.
తన పేరు చెప్పి, “సరే భయపడకు క్రాసింగు ఏమన్నుంటే బండి కానార్ల (కాగజునగరు) ఆగుతది. లేకపోతే డైరెక్టు ‘బల్లార్షా’ల ఆగుతది” అన్నాడు.
‘హమ్మయ్య కాగజునగరు అయినా పర్వాలేదు, బస్సులో రిటను రావచ్చు’ అనుకున్నా మనసులో.
“కానార్ల ఆగుతే దిగు లేకపోతే బల్లార్షాల దిగి రాత్రి ఇంకో బండెక్కి వరంగలు పోదాం, నేను పల్లీలు అమ్ముకొని మళ్లొస్తా ఈన్నే గూసో” అంటూ ముందుకు వెళ్లిపోయాడు అతను.
కాగజునగరు ఎప్పుడు వస్తుందా అనుకుంటూ నేను డోరు దగ్గరకు వెళ్లి నిలబడ్డా, నా కళ్ళ ముందే రెచ్నిరోడు స్టేషను వెళ్లిపోయింది. ఒకలాంటి భయం, గుండెదడతో ప్రతి స్టేషను పేరు చదువుతూ డోరు దగ్గరే నిలబడి చూస్తున్న, దాదాపు అరగంట తరువాత కాగజునగరు బోర్డు కనబడింది దూరంగా ట్రైను కొంచెం స్లో అయింది. హమ్మయ్య ఆగుతుంది అనుకున్న, అంతలోనే స్పీడందుకొని స్టేషను దాటుకొని వెళ్లిపోతోంది ట్రైను. డోరు బయట తల పెట్టి చూస్తున్న నాకు ట్రైను పెద్ద మలుపు తీసుకోవడం కనిపించింది.
కొద్దిసేపటికి ‘మాణిక్ ఘర్’ అనే స్టేషను దాటుకుంటు ట్రైను వెళ్లిపోతోంది.
మహారాష్ట్రలోకి ఎంటరైపోయాను. కొత్త ప్రాంతం, కొత్త భాష, కొత్త మనుషులు. అంతా కొత్త.
నాది కాని ప్రపంచం, ఒక్కసారిగా నన్ను భయం ఆవహించింది, ఏంటి పరిస్థితి ఇప్పుడేం చెయ్యాలి. వెంటనే పల్లీలతను గుర్తొచ్చాడు, వెళ్లినవాడు ఇంకా రాలేదు. వస్తాడా రాడా ఒకవేళ రాకపోతే, అతను కనపడకపోతే నా పరిస్థితి ఏంటి. ఒక్క క్షణం కూడా ఆగలేదు నేను, అతను వెళ్లిన వైపు ఒక్కొక్క డబ్బా చూసుకుంటూ వెళ్లాను. మొదటి డబ్బాలో లేడు రెండో డబ్బాలో లేడు మూడో డబ్బాలో లేడు. నాలో టెన్షను పెరిగిపోయింది. అమ్మ గుర్తొచ్చింది.
ఏడుపు భళ్ళున బయటకొచ్చి విశ్వరూపం దాల్చేలా వుంది. అలా నాలుగో డబ్బాలోకి వెళ్లగానే కాళ్లు బయటకు పెట్టి స్టీలు రాడు పట్టుకొని డోరు దగ్గర కూచొని వున్నాడు. పల్లీల బుట్ట అతని వెనకాల వుంది. హమ్మయ్య దొరికాడు అనుకున్నాను.
పక్కన ఎవరో అమ్మాయితో మాట్లాడుతున్నాడు. నన్ను చూసి పక్కన కూచోమన్నట్టు సైగ చేశాడు. పల్లీల బుట్ట పక్కకు జరిపి కూచున్నాను. ఆ అమ్మాయి ఎవరో నాకర్థం కాలేదు.
మాసిపోయిన బట్టలు, చేతిలో గుడ్డతో కుట్టిన సంచి, కొబ్బరి పీచులా రేగిపోయిన జుట్టు, మనిషి పొట్టిగా కొంచెం బొద్దుగా వుంది. నల్లటి మసి మరకలు ఆమె తెల్లటి ముఖాన్ని కప్పేసాయి.
అతనితో మాట్లాడుతూ నన్ను చూసి చూడనట్టుగా చూసింది. ఆ ఒక్కచూపులో ఆమె కళ్ళు నన్ను ఆకర్షించాయి. ఆ కళ్ళలో ఏదో మెరుపుంది. ఆకర్షణ వుంది. ముఖం కళగా వుంది.
“మనం పెళ్లి చేసుకుందాం, ఇల్లు తీసుకుందాం, కలిసుందాం” అంట పల్లీలతను ఆమెతో ఏదో నమ్మబలుకుతున్నాడు. దానికి ఆమె ఆనందంగా కళ్ళను చిత్రంగా తిప్పుతూ ఆసక్తిగా వింటోంది. వాళ్ల సంభాషణ విన్న చాలాసేపటి తరువాత అతనికి ఆమె కొద్దిసేపటి క్రితమే పరిచయమైందని అర్థమైంది. ఇంకా చెప్పాలంటే నన్ను కలిసి వెళ్లిన తరువాతే ఆమెను కలిసాడు అనేది నాకు స్పష్టమైంది. దీనికంటే ముందుగా ఇక్కడి నుండి ఎలా బయటపడాలా అనే ఆలోచనలో నేనున్నాను.
నాలుగ్గంటలకు బల్లార్షా స్టేషనులో ముగ్గురం ట్రైను దిగాం. బయటికి వచ్చి రోడ్డు పక్కన బండిమీద పూరి తిన్నాం.
“నన్ను ట్రైను ఎక్కిస్తే వరంగలు పోతా” అన్నాను పల్లీలతనితో
“ఇప్పుడు పోవుటానికి అటు యే బండ్లు లేవు, రాత్రి ఓ బండి వుంది, దానికి పోదాం” అన్నాడు.
ఇక అక్కడి నుండి వాళ్లు యేటు వెళితే నేనూ అటే, వాళ్లిద్దరితో పాటే నా ప్రయాణం.
టిఫిను తిన్నాక ఊరికి పక్కగా వున్న ఒక చెరువు దగ్గరికి తీసుకెళ్లాడు. ఇద్దరు అందులో స్నానం చేశారు. నేను దూరంగా రోడ్డు మీద కూచొని ఆలోచిస్తున్నాను. నా దగ్గర వున్న డబ్బులు టిఫినుకు చాయకు అయిపోయాయి. ఇప్పుడెంది నా పరిస్థితి. ఇక్కడి నుండి వరంగలు ఎలా వెళ్లాలి అని ఆలోచిస్తున్న సమయంలో వాళ్లిద్దరు వచ్చారు. అతను మా ఇద్దరిని వోచోటకు తీసుకెళ్లి, ఆమెను కూచొబెట్టి నన్ను పక్కకు తీసుకెళ్లి ఆమె వైపు అదోరకంగా చూస్తూ – “దాన్ని జూత్తూవుండు, యేడికి బోనియకు ఇప్పుడే వస్తా” అని పల్లీల బుట్టతో సహ వెళ్లాడు. అతనటు వెళ్లగానే సిమెంటు బల్లపై ఆమెకు కొంచెం దూరంగా కూచున్నాను. కొద్దిసేపటి తరువాత “ఏం జేస్తవు నువ్వు” అని అడిగింది నావైపు చూస్తూ సన్నని గొంతుతో.
“చదువుకుంటున్నాను” అని చెప్పాను తల వంచుకొని బ్యాగుపైనున్న ఇంగ్లీషు అక్షరాలను దిద్దుతూ, అతను నా గురించి చెప్పినట్టున్నాడు అనుకున్నాను మనసులో.
“అదృష్టవంతుడివి” అంది చేతిలో వున్న గుడ్డ సంచిని వొళ్లో పెట్టుకుంటూ.
నేను ఆమె వైపు చూసాను. ముఖం మెరిసిపోతుంది. ఇందాకటి మసి మరకలు తగ్గాయి, ముఖమంతా కళ్ళె అన్నట్టుగా వుంది. ఇందాకటి కంటె ఆ కళ్ళు ఇంకా అందంగా వున్నాయి. ఇంత భయంలోను ఆ కళ్ళు నన్ను ఆకట్టుకున్నాయి. కాని ఆ కళ్ళ వెనుక ఏదో తెలియని భయం బాధ వున్నట్టుగా నాకు అనిపించింది. అది నిజమో కాదో తెలీదు.
సుమారు గంట తరువాత వచ్చాడతను. మందు తాగినట్టున్నాడు అతని వాలకం చూస్తే తెలిసిపోతుంది. యే పని లేకుండ ఊరంతా తిప్పాడు మా ఇద్దరిని. అతను కంటిన్యూగా ఆమెకు యేవేవో మాటలు చెప్తూనే వున్నాడు. ఆ మాటలు ఆమెను నమ్మించెట్టుగా ఉన్నాయి. ఆ మాటలకు ఆమె ముఖం వెలిగిపోతోంది. వాళ్లిద్దరు ముందు నడుస్తుంటే వెనకాల నేను. అప్పటికే చీకటి పడింది. తిరిగి తిరిగి మళ్లీ రైల్వే స్టేషనుకు చేరుకున్నాం.
ఇప్పుడే వస్తానని ప్లాటుఫాంపై మా ఇద్దరిని కూచొబెట్టి ప్లాటుఫాం చివర వరకు నడుచుకుంటూ వెళ్లి ఆ చీకట్లో కలసిపోయాడు అతను. నేను ఆమెకు కొంచెం దూరంగా కూచున్నాను. ఆమె గురించి అడగాలని ఆమెతో మాట్లాడాలని నాకనిపించినా ధైర్యం చేయలేకపోయాను. మా అక్కలతో అమ్మతో మా ఇంటి ముసల్దానితో మా నాయనమ్మతో బాగా కలిసిపోయి మాట్లాడే నేను, బయటి ఆడవాళ్లతో క్లోజుగా ఎప్పుడూ మాట్లాడలేదు. పైగా తప్పిపోయి ఇలా వచ్చాననే భయం నాలో ఎక్కువగా వుంది. దాంతో నేను పట్టు పురుగులా ముడుచుకుపోయి కూచున్నాను. కాని ఈవిడెవరు, ఇతనితో ఎందుకు వుంటుంది అని మాత్రం లోపల తొలుస్తుంది. ఆమె యేదో బాధలో వున్నట్టుగా వుంది, అదేందో నా వయసుకు వున్న ఊహకు అందట్లేదు.
ఊరికి దూరంగా యేరి పారేసినట్టుగా వుంది రైల్వేస్టేషను. స్టేషనుకు మూడవ ప్లాటుఫాం అవతల చిక్కటి చీకటి అలముకొని వుంది. ఆ చీకట్లో దూరంగా ఒక లైటు వెలుగుతూ కనిపిస్తుంది. ఎక్కడో దూరంగా అరుపులు కేకలు వినపడుతున్నాయి.
రైళ్ళ అలికిడి లేక ప్లాటుఫాం ప్రశాంతంగా వుంది. అక్కడక్కడ లైట్లు మినుకు మినుకు మంటూ వెలుగుతున్నాయి. దూరంగా ఒకరిద్దరు ముసుగుతన్ని పడుకున్నారు.
మాకు దగ్గరలో ఒకతను సిగరెటు తాగూతూ మా వైపే చూస్తున్నాడు.
గద్దుమ(గడ్డం) కింద రెండు చేతులు పెట్టుకొని ఆమె వైపు చూసాను. శూన్యంలోకి చూస్తూ ఏదో ఆలోచిస్తున్నట్టుగా వుంది. కరిగిన కాలం గురించి బాధ, కలసిరాని భవిష్యత్తు గురించి బెంగ ఆమె మదిలో వున్నట్టు ఇప్పుడాలోచిస్తే అనిపిస్తుంది.
“పద” అంటూ వెనక నుండి నా భుజం మీద చెయ్యి వేసాడతను. ప్లాటుఫాం మీద వున్న గడియారం వైపు చూసాను, రాత్రి పది దాటింది.
“మన ట్రైను ఎప్పుడు?” అని అడిగాను.
“ఇంకా టైముంది, పోదాం” అంటూ మా ఇద్దరిని ప్లాటుఫాం చివరి వైపుకు తీసుకెళ్లాడు. ప్లాటుఫాం దిగి ఇంకా ముందుకు నడిచాం. మసక వెలుతురుందక్కడ. చిన్న చిన్న లైట్లు వెలుగుతున్నాయి. మనుష్య సంచారం లేదు. అలా కొంత దూరం పోయాక సిగ్నలు ఇచ్చే క్యాబిను దగ్గర ఆగాం. ఆ క్యాబిను గోడ మీద ABANDONED అని రాసివుంది. దాని అర్థం అప్పుడు నాకు తెలియదు. ఆ క్యాబినుకు పైకి ఎక్కడానికి ఇనుప మెట్లు వున్నాయి. ఆ మెట్ల మీద నుండి పైకి వెళ్తె ఒక పెద్ద గదిలా వుంది. కింది నుండి చూస్తే ఆ ఇనుప మెట్లపైన గదిలోకి వెళ్లడానికి తలుపు అంటూ ఏది లేదు. లోపల కరెంటు కూడా లేదు. చీకటిగా వున్నట్టు తెలుస్తోంది.
“నువ్విక్కడే గూసో మేమిప్పుడే వస్తాం” అంటూ ఆమెను తీసుకొని అతను ఇనుప మెట్లెక్కి పైకెళ్లాడు. నేనో రాయి చూసుకొని దాని మీద కూచున్నాను. వాతావరణం చల్లగా వుంది. భయంతో నా వొళ్లు వేడెక్కింది. అతను ఎప్పడొస్తాడా ఎప్పుడు వెళ్లిపోదామా అని చూస్తున్నాను. ఎందుకంటే నాకై నేను వెళ్లడానకి కనీసం ఒక్క రూపాయి కూడా నా దగ్గర లేవు. నాది నాకే ఏమి అర్థం కాని పరిస్థితి. భయంతో బిగుసుకుపోయి అలాగే కూచున్నాను. చాలాసేపటి తరువాత మౌనంగా వాళ్లు కిందకి దిగారు. ఆమెను చూస్తే జుట్టంతా రేగిపోయి, బట్టలకంతా దుమ్ముకొట్టుకుపోయి వుంది. అర్థం అయి కానట్టుగా వుంది నా పరిస్థితి.
“దా” అన్నాడు
ముందుకు నడుస్తూ, యజమానికి బాసిసల్లా ఇద్దరం అతని వెనకాల వెలుతున్నాం. మూడవ నెంబరు ప్లాటుఫాం దాటినాక వున్న చీకటి ప్రాంతంలోకి వెళ్లాం. అలా నడుస్తూ స్టేషనుకు దూరంగా చిన్న లైటు వెలుగుతున్న చోటుకు చేరుకున్నాం. అది పాత పెంకుటిల్లు రైల్వే ఆఫీసులా వుంది. ఆఫీసు ముందు భాగంలో పక్క పక్కనే రెండు దర్వాజలు వున్నాయి. వాటికి తాళాలు వేసి వున్నాయి. ఆ రెండు దర్వాజల ముందు నున్నటి సిమెంటు గచ్చుతో పొడవుగా వరండా వుంది. ఆ వరండాకు పిట్ట గోడ ఒకటి కట్టి వుంది. ఆ వరండాలో ఎవరు కూచున్న బయటకు కనిపించరు. నిలబడితే మాత్రం సగం మనిషి కనిపించేట్టుగా వుంది.
ఆ పెంకుటిల్లుకు కొంచెం దూరంగా ఓ చెట్టు కింద నన్ను కూచొబెట్టాడు అతను. వరండాలోకి వెళ్లి లైటు ఆఫ్ చేసాడు. చిన్న వెలుతురు కూడా లేకుండా నా చుట్టు కటిక చీకటి ఆవరించింది. నా గుండెల్లో నిద్రపోతున్న భయం మళ్లీ బయటికొచ్చింది. నా కాళ్లు చేతుల్లో వణుకు మొదలైంది. కాళ్లు చేతులు ఒక దగ్గరికి చేర్చి కళ్ళు గట్టిగా మూసుకొని ఊపిరి బిగబట్టి కూచున్నాను.
వాళ్లు పడుకున్న చోటునుండి యేవో మాటలు శబ్దాలు లీలగా వినపడుతున్నాయి.
అవేవి గ్రహించే పరిస్థితిలో నేను లేను. వెళ్లిపోవాలి.. వెళ్లిపోవాలి.. ఇక్కడ నుండి వెళ్లిపోవాలి ఇదే నా ఆలోచన. రైల్వే స్టేషనులోకి పోదాం అనుకున్నాను కాని ఆ చీకట్లో దారి తెలియక ఆగిపోయాను.
కాసేపయ్యాక లైటు వెలిగింది. బీడి ముట్టిచ్చుకొని అతను బయటికొచ్చాడు. నా గురించి ఆలోచించే పరిస్థితిలో అతను లేడనిపించింది. స్టేషను వైపు వెళ్లిపోదామని లేచి నిల్చున్నాను. అప్పుడే నా వెనకాలేవో మాటలు వినపడ్డాయి. ఇక్కడెవరా అనుకుంటూ అటు వైపు తిరిగి చూసాను. ఒక ఇద్దరు వ్యక్తులు మా వైపే వస్తున్నారు. వీళ్లేవరా అనుకుంటుండగా, సరాసరి అతని దగ్గరికెళ్లారు.
ముగ్గురు ఏదో గుస గుసగా మాట్లాడుకుంటున్నారు. వాళ్ల మాటల మధ్యలో, వచ్చిన ఇద్దరిలో ఒకడు నావైపు చూపుడు వేలు చూపిస్తూ మాట్లాడుతున్నాడు. ఆ ఇద్దరు పల్లీలతనికి బాగా దగ్గరి వారిలాగా అనిపించారు నాకు. ఇందాక మా ఇద్దరిని రోడ్డు మీద కూచొబెట్టి వీళ్లిద్దరిని కలవడానికి వెళ్లాడేమో అనే అనుమానం కలిగింది నాకు.
వచ్చిన ఇద్దరూ నాకన్నా పది పదిహేనేళ్లు పెద్ద వాళ్లలాగ వున్నారు. బలిష్టంగా దున్నపోతుల్లాగ కనిపించారు. వాళ్లను చూస్తేనే భయం కలిగించేటట్టుగా వున్నారు. మొత్తానికి పల్లీలతనికి దగ్గరి దోస్తులని తెలిసిపోతోంది. ఇంతలో ఒకడు నా దగ్గర కొచ్చి –
“అరేయ్ ఇక్కన్నే గూసో, ఇటు ఎవరొచ్చినా ఉరుక్కుంట ఒచ్చి మాకు చెప్పు, యేడికన్నపోయినవనుకో, బిడ్డా మక్కిల్లిరుగుతయ్, ఏడిగ్గదులకు (ఎక్కడికి వెళ్లకు)” అంటూ ముఖం ఇంతజేసి, కళ్ళు పెద్దగ జేసి కుడిచెయ్యి చూపుడు వేలు ఆడిస్తూ నన్ను బెదిరించాడు. దాంతో నాకు లాగులో ఒంటెలుకు పోసుకున్నంత పనైంది. బిత్తర చూపులు చూస్తూ తలాడించాను. కాసేపటిదాక నాకా వణుకు తగ్గలేదు..
అమ్మా అక్కలు అన్నయ్యలు మా నాయనమ్మ మా ఇంటి ముసల్ది అందరూ ఒక్కసారిగా గుర్తొచ్చి నాలో నేనే వణుకుతూ కూచున్నాను. అసలు ఇక్కడ యేం జరుగుతుంది, యేం జరగబోతోందో తెలియని పరిస్థితి. నేను వాళ్లకు దూరంగా ఆ చెట్టు కిందే కూచుని స్టేషను వైపు చూస్తున్నాను.
కాసేపటికి మెల్లగా లేచి దగ్గరగా వెళ్లి చూసాను, వీళ్లేం చేస్తున్నారా అని, ముగ్గురు కూచుని మందు తాగుతున్నారు, బయటికి వినపడకుండ మాట్లాడుకుంటున్నారు. తిరిగొచ్చి చెట్టు కింద రాయిమీద కూచోని, పారిపోవడానికి ఇప్పడు వీలవుతుందా అని ఆలోచించాను. నేను ఎక్కడికి వెళ్లిన స్టేషనుకే వెళ్లాలి, గట్టిగా వెతికితే స్టేషనులో దొరికిపోతాను దాని కోసం ఎందుకు పారిపోవడం అని అక్కడే కూలబడ్డాను.
ఇంతలో ఒక్కసారిగా నా వెనకాల నుండి గట్టి గట్టిగా ఆమె అరుపులు వినపడ్డాయి. విస్మయంగా వెనక్కి తిరిగి చూస్తే ఆమె ఇద్దరి కాలరు పట్టుకొని పెద్ద పెద్దగా బూతులు తిడుతోంది. వాళ్లు అవేమి లెక్క చేయకుండా ఆమె గొంతు పట్టుకొని గోడకు అదిమి పెట్టి ఇష్టమొచ్చినట్టుగా కొడుతున్నారు. పల్లీలతను ఓ పక్కన నిలబడి తనకేం పట్టనట్టుగా బీడీ తాగుతున్నాడు. ఇదంతా చూస్తున్న నాకు అరికాళ్లలోంచి మెదడులోకి భయం పాకింది.
ఒకడు ఆమెను గట్టిగా పట్టుకున్నాడు, నన్ను బెదిరించిన వాడు పల్లీలతన్ని వరండాలోంచి చెయ్యి పట్టి బయటికి తీసుకొచ్చాడు. ఇద్దరూ స్టేషను వైపు నా ముందు నుంచి వెళ్తూ నా వైపు చూసి “అరేయ్ రారా మాతో” అన్నాడు గట్టిగా నన్ను బెందిరించినోడు.
భయంతో ఒక్క ఉదుటున లేచి కుక్కలాగ వాళ్ల వెనకాల పడిపోయాను. వేరే గత్యంరం లేదు నాకు మరి.
అట్లా నడుస్తూ మూడో ప్లాటుఫాం మీదకు తీసుకెళ్లారు. ఇద్దరూ ఒక సిమెంటు దిమ్మెమీద బైఠాయించారు. వాళ్లకు ఓ పక్కగా బిక్కుబిక్కుమంటూ నేను కూచున్నాను. అరచేతిలో తంబాకు బాగా నూరి దాన్ని కింది పెదం కింద పెట్టి, అప్పుడు చెరో బీడీ ముట్టిచ్చారు ఇద్దరు. దూరంగా ఆమె వున్న రైల్వే ఆఫీసు, లైటు మాకు స్పష్టంగా కనిపిస్తోంది. అటువైపే చూస్తూ ఏదేదో మాట్లాడుకుంటున్నారు.
ఈలోపు బీడీ ముట్టిచ్చడానికి అగ్గిపెట్టె అంటూ ఒకతను వచ్చాడు మా దగ్గరకు.
బీడీ ముట్టిచ్చుకున్నంత వరకు నేను అతన్నే చూస్తూండిపోయాను. మేం స్టేషనుకు వచ్చిన దగ్గర నుండి అతడు మా చుట్టు పక్కలే తిరుగుతున్నట్టు అనిపించింది నాకు.
అతను మాకు దగ్గరగా తచ్చాడడం నేను గమనించాను.
ఈలోపు ఆమె దగ్గరున్న వాడు రమ్మని చెయ్యి వూపుతున్నాడు. అది చూసిన ఇద్దరిలో నన్ను బెదిరించినవాడు లేచి పరుగెత్తుతున్నట్టుగా వెళ్లాడు ఆమె వున్న ఇంటి వైపు. రెండోవాడు నిమ్మలంగా నడుచుకుంటూ మా దగ్గరకొచ్చాడు.
మూడు ప్లాటుఫాంలు మీద నాలుగు చక్కర్లు కొట్టిచ్చారు, ఇటు నుంచి అటు – అటు నుంచి ఇటు వాళ్లతో పాటు నన్ను. తరువాత ఆమె వున్న దగ్గరకు వెళ్లాం. నన్ను మళ్లీ చెట్టు కింద కూర్చొమ్మని వాళ్లు ఆమె వున్న దగ్గరకు వెళ్లారు. ఆమె ఏడుపులు నాకు వినపడుతున్నాయి. ఆ తరువాత నన్ను బెదిరించిన వాడు లేచి నిలబడ్డాడు. అంతా అర్థం అయ్యి కానట్టుగా ఉంది పరిస్థితి. కొంచెంసేపటికి వాళ్లు ముగ్గురు నా దగ్గరకు వచ్చి
“అరేయ్, దాన్ని జూస్తూ వుండూ, ఎక్కడికి పోనియ్యకు, దాన్ని కావలిగాయి. మేం బోయి బీడీలు, మందు దెచ్చుకుంటం” అన్నాడు అందులో ఒకడు.
“అదేటన్నబోయిందా నీ బొక్కలిరుగుతయి బిడ్డా” అంటూ నా మీదకు చెయ్యెత్తాడు ఇంకొకడు.
నేను తలూపడం తప్ప, నోట్లోంచి మాట రాలేదు, భయంతో నోరు మూసుకుపోయింది.
వాళ్లు కన్ను దూరం అయిన తర్వాత ముక్కుతూ మూలుగుతూ ఆమె లేచి వరండాలోంచి బయటికొచ్చింది. నేను ఆమెకు దగ్గరగా వెళ్లాను. రేగిపోయిన నెత్తి, చినిగిపోయిన జాకెటు, ఊడిపోయిన చీర, మట్టికొట్టుకుపోయిన ముఖం, గాజులు గీరుకుపోయి రక్తం కారుతున్న చేతులు, ఆమె అవతారం చూసి ఒక్కసారిగా నేను భయపడిపోయాను.
‘విజయవాడ వెళ్లవలసిన ట్రైను మరికొద్ది నిమిషాల్లో మూడవ నెంబరు ప్లాటుఫాంపై వచ్చును’ అని రైల్వేస్టేషను నుండి అనౌన్సుమెంటు చిన్నగా వినపడుతోంది. భాష తెలియకపోయినా విజయవాడ అనే పదం అర్థమయింది.
“మనం ఇక్కడి నుంచి పోదాం, నన్ను తీస్కపో, లేకుంటే నన్ను సంపేస్తరు, వాళ్లు నన్ను సంపేస్తరు, నన్ను బత్కనియ్యరు, ఈ బాధ నేను పడలేను. నన్ను తీస్కపో” అంటూ నా చేతులు పట్టుకొని వూపుతూ ఆమె ఏడూస్తూ దీనంగా అర్థిస్తోంది. ఆ కళ్ళలో భయం, ఆర్తి, ఆవేదన, బాధ..
ఇంతలో ఎవరో వస్తున్న అలికిడి అయింది. చూస్తే ఇద్దురు వ్యక్తులు మేమున్న వైపే వస్తున్నారు. ఇప్పుడే వెళ్లిన వాళ్లు అప్పుడే వస్తున్నారేంది అనుకున్నాను మనసులో.
కాని వాళ్లు పరిగెత్తుకుంటూ మా దగ్గరకొచ్చారు. చూస్తే కొత్తవాళ్లు, అపరిచితులు, వీళ్లెవరా అని ఆమె నేను ఆలోచించుకునేలోపే, ఆమె వెనకనుండి కుడిచేత్తో నోరు మూసి ఆమె ఎడమ చెయ్యి గట్టిగా పట్టుకున్నాడు ఒకడు, ఇంకొకడు నా రెండు చేతులు పట్టుకున్నాడు. పిడుగొచ్చి నెత్తిమీద పడ్డట్టుగా అయ్యింది నా పరిస్థితి, ఇంత భయంలోనూ నన్ను పట్టుకున్న వాన్ని ఎక్కడో చూసినట్టుగా అనిపించింది.
అప్పుడే పెద్ద శబ్దం చేస్తూ ట్రైను ప్లాటుఫాం మీదకు వస్తొంది. అనౌన్సుమెంటు కూడా వినపడుతోంది.
వాడి నుండి విడిపించుకోవడానికి ఆమె తీవ్రంగా ప్రయత్నిస్తొంది. నా పరిస్థితి అలాగే వుంది. కళ్ళతో అర్థిస్తూ నన్ను కాపాడూ అని ఆమె నావైపే చూస్తూన్నట్టుంది.
నాలో వున్న భయం ఒక్కసారిగా నన్ను ధైర్యవంతున్ని చేసింది. ఇంకేం ఆలోచించలేదు నేను, నా రెండు చేతులు పట్టుకున్నవాడి కుడి చేతిని బలంగా నా శక్తి కొలది కసిదీరా గట్టిగా కొరికాను. ఈ హఠాత్తు పరిణామానికి వాడు నా చేతులు వదిలేసాడు, ఇదే సందని నేను ట్రైనున్న ప్లాటుఫాం వైపు పరుగందుకున్నాను. పరుగంటే అది మాములు పరుగు కాదు, భయంలో నుండి వచ్చిన పరుగు, తప్పించుకోవాలనే కసి వున్న పరుగు, దేని గురించి ఎవరి గురించి ఆలోచన లేని పరుగు.
నన్ను పట్టుకోవడానికి నా వెనకాలే వాడు పరుగందుకున్నాడు, నేను ముందు వాడు వెనకా, నేను మూడవ నెంబరు ప్లాటుఫాంలో అడుగుపెట్టాను మెల్లగా ట్రైను కదిలింది. ఇంకా ఇంకా ఇంకా పరుగెత్తి పరుగెత్తి ట్రైను ఆఖరి డబ్బా ఆఖరి డోరు స్టీలు రాడు పట్టుకొని ట్రైను ఎక్కాను. క్షణం ఆగి, ఆదుర్దాగా అటువైపు డోరు దగ్గరకు వెళ్లి ఆమె వున్నవైపు చూసాను అక్కడ యేం జరుగుతుందా అని. నన్ను వెంబడించిన వాడు వడివడిగా ఆమె వున్న వైపు వెళుతున్నాడు.
నేను ఎక్కిన ట్రైను వైపు చూస్తూ, నన్ను కాపాడూ అన్నట్టుగా ఆమె చేతులూపడం కనిపిస్తోంది. వాళ్లిద్దరు ఆమెను గట్టిగా పట్టుకొని చెట్ల పొదల వైపు బలవంతంగా ఈడ్చకు వెళ్లడం కనుచూపు మేరలో కనిపిస్తోంది.
అప్పుడు గుర్తొచ్చింది నన్ను పట్టుకున్న వాడు, మేము రైల్వే స్టేషను వచ్చిన దగ్గర నుండి మమ్మల్ని ఫాలో అయినవాడు ఒక్కడేనని..