ఆ మాట కోసం

0
2

[శ్రీ గంగాధర్ వడ్లమన్నాటి రచించిన ‘ఆ మాట కోసం’ అనే కథని పాఠకులకి అందిస్తున్నాము.]

[dropcap]మ[/dropcap]ధు లలితలిద్దరూ ఒకే ఆటో ఎక్కారు. కానీ ఆటోలో ఆ చివర ఒకరు ఈ చివర ఒకరూ ఎడంగా ఎడ మొహం పెడ మొహంగా కూర్చున్నారు. ఇటెటో మధు చూస్తూ ఉంటే, అటెటో లలిత చూస్తోంది. కానీ ఇద్దరూ ఒకరి మొహాలు ఒకరు చూసుకోవడానికి మాత్రం ఇష్టపడ్డం లేదు.

కొంతసేపటికి మధు నెమ్మదిగా తన మొహం తిప్పి లలిత వంక చూశాడు. ఆమె మొహం, సగం పండిన గోరింటాకులా ఎర్రగా ఉంది. ఆమెకి ఇంకా కోపం తగ్గలేదని అర్థం చేసుకున్న మధు, ‘మోహంలో కొంచెం ఎరుపు తగ్గాక మాట్లాడదాంలే’ అనుకుని ఆగిపోయి మళ్ళీఇటు తిరిగిపోయాడు. లలిత, అతను చూసినట్టు గమనించి “ఏవైనా చెప్పాలా? చెప్పాలనుకుంటే చెప్పండి, మీ కడుపులో ఉన్నది మనసారా కక్కండి” అసహనంగా అంది.

మధు కాస్త తడబడిపోతూ “అదీ, మరీ ఇలాంటి పరీక్ష పెట్టే పరిస్థితులు జీవితంలో మనకు ఎదురౌతాయాని మనకు ముందుగా తెలీదు. ఎందుకంటే, జీవితం అనేది ప్రయాణం లాంటిది. అది ఒక్కొక్కసారి మధ్యలోనే కొన్ని ప్రత్యేక కారణాలతో ఆగిపోవచ్చు లేదా పెద్ద రహదారుల మీద చిన్న కారులా జోరుగా అలా సాగిపోవచ్చు. ఉదాహరణకి జీవితం కూడా ఈ ఆటో ప్రయాణం లాంటిది, అది సజావుగా సాగితే సంతోషమే కానీ, ఒడిదుడుకులకి లోనైనప్పుడూ, గతుకులలో పడిలేస్తూ కుదుపులతో నిండినప్పుడూ, ఆ ప్రయాణం అక్కడితో ఆపేసి మరో దారి నుంచి వెళ్లడం మంచిదని నేను అనుకున్నాను. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. ఈ నిర్ణయం నీకు ఇష్టం లేదని నాకు స్పష్టంగా తెలుసు. కానీ తప్పదు” అన్నాడు ఇబ్బందిగా చేతులు నలుపుకుంటూ.

“మీరన్నట్టు కుదుపులు ఎక్కువ ఉండి, దారి బాలేకపోతే ప్రయాణం ఆపేయాల్సిన పని లేదు. మరో మార్గం చూసుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు. మరి అవసరంగా తెలుసుకోవాల్సింది ఏవిటంటే, ఏ దారులను దేనిపై దాటితే మేలో తెలుసుకోవడం. ఉదాహరణకి మనం ఆటోలో వెళుతున్నప్పుడు, చిన్న చక్రాలు కనుక చిన్న గతుకులు కూడా పెద్ద పెద్ద కుదుపులు తెస్తాయి. అలాంటప్పుడు ఆటో విడిచి ఓ కారు మీద వెళ్తే ఆ కుదుపులు తగ్గుతాయి. లేదంటే వోల్వో లాంటి అడ్వాన్స్డ్ బస్సుల్లో వెళితే చాలా మటుకు కుదుపులే తెలియవు. అలాగే భార్యాభర్తల మధ్య కూడా గొడవలు, కొట్లాటలు వస్తున్నప్పుడు, మన ఆలోచనలు కూడా ఆటో చక్రాల సైజు నుండి బస్సు చక్రాల సైజుకి విశాలం చేసుకుంటే, ఆ వచ్చే గొడవలు, చిన్న కుదుపులతో తేలిపోతాయ్ ” చెప్పిందామె ఎర్రగా చూస్తూ.

మధు అయోమయంగా బుర్ర గోక్కుని “ఇలాంటి లాజిక్కులకి మాత్రం తక్కువ లేదు” అంటూ పళ్ళు కొరికి మళ్ళీ అటువైపుకి తిరిగి పోయాడు.

కొద్దిసేపటి తర్వాత మళ్లీ మధే అందుకుంటూ “ఇలా అంటున్నానని ఏవనుకోవద్దు, ఒకసారి నువ్వు కోర్టుకు రావాల్సి ఉంటుంది. అప్పుడు జడ్జిగారు విడాకులు మీకు సమ్మతవేనా అని అడుగుతారు. బహుశా ఒక నెల తర్వాత విడాకులు రావొచ్చు. లాయర్ గారు చెప్పిన ప్రకారం అయితే, అప్పుడే ఇద్దరికీ విడాకులు మంజూరు చేసేస్తారు, సరేనా” అన్నాడు

“నాకు ఆ మాత్రం తెలీదనుకోకండి, నేను కూడా చదువుకున్న దాన్నే. నాకెందుకు తెలియదు, లాయర్ గారు నాకు విడిగా, మీకు విడిగా చెప్పలేదు కదా! అలాగే వస్తాను, సమ్మతం తెలియజేస్తాను, ఇక మీరు దాని గురించి వర్రీ అయిపోయి బుర్ర పాడుచేసుకోకండి” మళ్ళీ అటు తిరిగిపోయింది.

“అలాగే” అన్న మధు, కాస్త ఇబ్బందిగా చేతులు నలుపుకుంటూ, “మీవాళ్లు, ఇంత సడన్‌గా ఎందుకు వచ్చావు అని అడిగితే ఏం చెప్తావు” అడిగాడు .

“భయపడి చావకండి, మా అన్నయ్య అసలే కోపిష్టని నాకు తెలుసు. కాబట్టి నింద నా మీదే వేసుకుంటాను. మీతో వేగలేకపోతున్నానని, ఇంకా వేగితే మాడిపోతానని ఏదో ఒకటి చెప్పి అతనిని కన్విన్స్ చేస్తాను. మీరు వెళ్ళాక నెమ్మదిగా చెప్తాను. మీరు మామూలుగా, విషయం మీ చెల్లెలు చెబుతుంది అని ఒక చిన్న హింట్ ఇచ్చి వెళ్లిపోండి, మిగతాది నేను చూసుకుంటాను” చెప్పింది లలిత.

కొంత భారం దిగిపోయినట్టు, రిలాక్స్ అవుతూ, ‘అమ్మయ్య’ అని మనసులో అనుకుని “థాంక్యూ” అన్నాడు. అలా అంటుండగానే ఆటో లలిత వాళ్ళ ఇంటి ముందు ఆగింది.

ఆటో డబ్బులు ఇచ్చేసాక ఇంట్లోకి వెళదాం అనుకుంటూనే ఆగిపోయాడు. బయట, వాళ్ళ అన్నయ్య కనిపించడంతో చూసి పలకరించాడు. అతనూ పలకరించాడు. క్షేమ సమాచారం వగైరా అడగడం అయిపోయాక, “ఏమీ లేదు, మీ చెల్లెలు నీకు వివరాలన్నీ చెబుతుంది. ఆవేశ పడకుండా అర్థం చేసుకుంటారని అనుకుంటాను” అన్నాడు.

“నా చెల్లెలు ఏం చేసినా సరిగానే చేస్తుంది. ఏం చెప్పినా కరెక్ట్ గానే చెబుతుంది, నేను అడిగి కనుక్కుంటానులేండి, ఇబ్బంది లేదు. మీరు ఇక వెళ్ళి రండి” అన్నాడు చిన్నగా నవ్వుతూ.

ఎందుకో అతని మాటలు మధు చెంప మీద ఫెడీల్, ఫెడీల్ మని కొట్టినట్టు అనిపించింది. ఏవైనా అంటే, ఎటు పోయి ఎటు వస్తుందో అనీ, ‘మౌనేన కలహో నాస్తి’ అని మనసులో అనుకుని మౌనంగా ఉండిపోయాడు.

తర్వాత లలిత వంక గుచ్చి గుచ్చి చూస్తూ, “నాకు ఇది కష్టంగానే ఉంది. నిన్ను ఇలా ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోవడం నా మనసుకి ఏదోలా ఉంది. కానీ ఎవరి జీవితాలు వాళ్ళు సుఖంగా, సంతోషంగా, హాయిగా జీవించాలంటే ఇదే మంచి నిర్ణయం అని నాకు అనిపించింది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను, నిన్ను ఒప్పించాను. అయితే భవిష్యత్తులో నువ్వు, నేను సంతోషంగా ఉంటావని నా గట్టి నమ్మకం” అన్నాడు కళ్ళజోడు తీస్తూ.

అతని మాటలు పూర్తి కాకుండానే, కన్నీళ్లు తుడుచుకుంది.

ఆ ఏడుపు చూసిన మధు తెగ ఇదైపోయాడు. తర్వాత, “నీకు ఇష్టం లేదంటే ఇది ఇక్కడితో ఆపేద్దాం. మళ్ళీ లాయర్ గారి దగ్గరికి వెళ్లి మనకి ఈ విడాకులు అక్కర్లేదని చెప్పేద్దాం సరేనా, బాధపడకు. నేను విడాకులు ఇచ్చి నీకు అన్యాయం చేశానని నువ్వు అనుకోవడం నాకు ఇష్టం లేదు” అన్నాడు. ఆమె భుజంపై చెయ్యి వేస్తూ.

ఆమె అతని చేతిని నెమ్మదిగా పక్కకి తీసేస్తూ, చిన్న నవ్వు నవ్వి, “నా ఈ ఏడుపు నాకోసం కాదు, మీ కోసం, పోయిన మీ అమ్మగారికి ఇచ్చిన మాట చెల్లించలేకపోతున్నందుకు” చెప్పింది తేలిగ్గా.

“మా అమ్మ నీ దగ్గర మాట తీసుకుందా. ఏవని!”

“తండ్రి లేని పిల్లాడని గారం చేసానూ, నే లేకున్నా నువ్వే వాడ్ని బాధ్యతగా చూసుకోవాలీ, వాడి చేయి ఎప్పుడూ విడిచిపెట్టకూడదూ అని చెప్పి మాట తీసుకుంది. ఆమెకి ఇచ్చిన ఆ మాటని నిలబెట్టుకోవడం కోసమే, ఈ మూడేళ్లలో మీరు ఏవన్నా పడ్డాను. ఎన్నో సహించాను. కానీ మీకు వేళకి ఇంత వండి పెట్టాను. అలాగే మీరు అటు, ఇటు వెళ్లి, ఇంటికి రాకపోతే, బాధ్యతగా ఫోన్ చేసి ఇంటికి రప్పించేదాన్ని. అతి పోకడలున్న స్నేహితులతో ఎక్కువ కలవకుండా మిమ్మల్ని కట్టడి చేశాను. కానీ ఇప్పుడు అవన్నీ ఎవరు చేస్తారు? ఇవి తలుచుకునే నాకు మీపై జాలేస్తోంది. టూకీగా చెప్పాలంటే, ఇన్నాళ్ళూ మీపై జాలిపడి, ఆ మాట కోసం నిలబడి ఈ విడాకులకి ఒప్పుకోలేదు.” అంటూ ఆమె జర జరా లోపలికి వెళ్ళిపోయింది.

మధుకి అప్పటి వరకూ ఉన్న ధైర్యం మొత్తం పోయింది. గుండె గుబేలుమంది. ఇప్పుడు అతనికి ఏమీ కనబడడం లేదు. కళ్ళు నులుముకున్నాడు. ఎందుకో కొంత నీరసం కూడా ఆవహించింది. ఆ గుమ్మం దగ్గర నుంచి కదలలేక, అక్కడే బొమ్మలా నిలబడిపోయి, ఆమె వెళ్ళిన వైపే చూస్తూ ఉండిపోయాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here