Site icon Sanchika

ఆ ముసలామె

[box type=’note’ fontsize=’16’] గోపాల్ ప్రసాద్ ‘నిర్దోష్‘ హిందీలో “ఓ బుఢియా” పేరిట రాసి, ఇంద్రప్రస్థ భారతి పత్రిక ఏప్రిల్ 2018 సంచికలో ప్రచురించిన హిందీ కథకి కొల్లూరి సోమ శంకర్ అనువాదంఆ ముసలామె“. [/box]

[dropcap]కొం[/dropcap]దరికి కలిగే ఇబ్బందులకు కారణం ఆ ముసలామె. కొందరికి ఇబ్బందులకు పరిష్కారం ఆ ముసలామె. కొందరికి ఆమెని చూస్తే రోత, కొందరికి ఆమె దేవదూత. అయితే నిజానికా ముసలామె ఎవరనేదీ తనూ స్పష్టం చేయదు, ఇతరులకెవరూ ఆమె గురించి ఖచ్చితంగా చెప్పలేరు.

ఇందుకు కారణం ఉండేది. తన వ్యక్తిత్వాన్ని, తను చేసే పనులనూ తనే గుప్తంగా, ఒక చిక్కుప్రశ్నలా ఉంచుకుంది. ఎవరూ ఆ రహస్యాన్ని ఛేదించలేకపోయారు.

ఆమె భర్త రైల్వేలో పనిచేసేవాడని జనాలనేవారు. అందువల్ల ఆయన రాత్రింబవళ్ళు రైల్లోనే సమయం గడిపేవాడట. నెలా – నెలన్నర కొకసారి తమ స్వగ్రామానికి వచ్చేవాడట. తన భార్యని అక్కడే ఉంచి వెళ్ళాడట. ఆయన ఎప్పుడూ ఆమెని తనతో పాటు తీసుకెళ్ళలేదట. ‘నేను రాత్రింబవళ్ళు రైల్లోనే గడుపుతాను. క్వార్టర్స్‌లో నువ్వొకదానివే ఒంటరిగా ఉండాల్సి వస్తుంది’ అనేవాడట. ఒంటరితనం ఇంకా బాధిస్తుందని అనేవాడట. అందుకే ఆమెని గ్రామంలోనే విడిచి వెళ్ళాడట.

భర్త తర్కానికి ఆమె జవాబు చెప్పలేకపోయింది. ఆ విధంగా ఆమె ఆ గ్రామంలోనే ఉండిపోవాల్సి వచ్చింది. కొన్నాళ్ళ తర్వాత ఆమె భర్త ఓ రైలు ప్రమాదంలో మరణించాడు. ఈ విధంగా ఆమెకు సంతానం కలగకుండానే, జీవితంలో ఆమె ఆశ అడుగంటిపోయింది. తరువాత ఆమెని నష్టజాతకురాలిగా భావించి అత్తింటివాళ్ళు ఇంట్లోంచి తరిమేసారు.

ఆమెకి పెన్షన్ మాత్రమే ఆధారం. ఈ పెన్షన్ డబ్బుల సాయంతోనూ, తన తెలివితేటలతోనూ ఆ ముసలామె గ్రామంలో కొందరినీ తనని ద్వేషించేవారిగా, మరికొంతమందిని గౌరవించేవారుగా చేసుకుంది.

ఆమెని ద్వేషించేవాళ్ళు చాలామందే ఉన్నారు. వాళ్ళకి ధనబలం, జనబలం ఉంది, ఈ బలాల తోనే వాళ్ళు తమకన్నా క్రిందస్థాయి వాళ్ళకి – అధిక వడ్డీలకి అప్పులిచ్చి, అవి తీర్చలేనప్పుడు వాళ్ళ ఇళ్ళు, భూములు లాక్కోవాలనే ఆశతో ఉంటారు.

వాళ్ళ ఈ ఆశలపై నీళ్ళు జల్లుతూ ఆ ముసలామె అతి తక్కువ వడ్డీకే అవసరం ఉన్నవాళ్ళకి అప్పులివ్వసాగింది. ఫలితం ఆ ముసలామె పెద్ద పెద్ద వడ్డీ వ్యాపారుల కరకు చూపుల దృష్టిలో పడింది. రైతులు, రైతుకూలీల హృదయాల్లో స్థానం సంపాదించుకుంది.

ఆ ముసలామెలో మరో సుగుణం ఉంది, తన ఖాళీ సమయాలలో గ్రామంలోని చిన్న చిన్న పిల్లలందరినీ పోగేసి వాళ్ళని చదివిస్తుంది, కథలు చెబుతుంది. ఆమె చెప్పే  ప్రతీ కథ చదువు విలువని చాటి చెప్తుంది. నైతిక విలువలను పాటించాలనీ, అన్యాయాలను ఎదుర్కోవాలనీ చెప్తుంది. ఆమె కథలలోని ఆకట్టుకునే గుణం, ఆమె కథ చెప్పే తీరు వల్ల పిల్లలు కూడా ఆమె అభిమానులుగా మారిపోయారు.

ఈ ముసలామె తన చిన్నప్పుడు ఇంట్లోంచి పారిపోయి, అతన్ని పెళ్ళి చేసుకుందని చెప్పుకుంటారు. అందుకే ఆమెకి అటు పుట్టింటివాళ్ళూ, ఇటు అత్తింటివాళ్ళూ ఎవరూ అండగా నిలవలేదు. భర్త చనిపోయాడు, సంతానం లేదు!

తన జీవితంలోని ఈ శూన్యాన్ని పూరించుకోడానికి ఆ ముసలామె ఎప్పటికప్పుడూ ఏదో ఒక పనిలో ఉండడం అలవాటు చేసుకుంది. నెలాఖరులో ఒక్కసారి పట్నం వెళ్ళి పెన్షన్ డబ్బులు తెచ్చుకుంటుంది. ఆమెకి జీవితంలో అవసరమైనదంటూ ఏమీ లేదనిపించేలా… మిగతా ఇరవై తొమ్మిది రోజులూ రాత్రింబవళ్ళు గ్రామంలోనే ఏదో పనిలో లీనమై ఉంటుంది.

సూర్యోదయానికి ముందే నిద్ర లేవడం, సూర్యోదయం అయ్యేసరికి ఇల్లు శుభ్రం చేసేసుకుంటుంది. స్నానాపానాలు కానిచ్చి గబగబా వంట చేసేసుకుంటుంది. తర్వాత గ్రామంలోనీ ప్రతీ వీధీ తిరుగుతుంది. ఆడవాళ్ళు, మగవాళ్ళతో ముచ్చట్లాడుతుంది, వాళ్ళ స్థితిగతులు తెలుసుకుంటుంది. సూర్యాస్తమయం సమయానికి కూరలు కొనుక్కుంటుంది. అప్పటికి బడికి, ఆటలకి వెళ్ళిన పిల్లలు తిరిగొచ్చేస్తారు. హోం వర్క్ చేసుకోడానికి, కథలు వినడానికి ఆ ముసలామె దగ్గర చేరతారు. పిల్లల పని పూర్తయ్యాకా, రాత్రి వంట చేసుకోని తిని దీర్ఘ శ్వాస తీసుకుని పడుకుంటుంది. ఇదీ ఆమె ఇరవై నాలుగు గంటల దినచర్య.

గ్రామంలోని ఆడవాళ్ళకి ఆమె అంటే ఇష్టమేమీ తక్కువ లేదు. ఆడవాళ్ళకి, పిల్లలకి వచ్చే రోగాలకి ఇంటివైద్యాలు ఆ ముసలామెకి చాలా తెలుసు. ఈ విషయాలలో తనకున్న జ్ఞానాన్ని ఆమె ఆ మహిళలకు ఉచితంగా పంచుతుంది. ఇంతే కాకుండా ఆ ముసలామె కుటుంబ కలహాలను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తుంది. అత్తాకోడళ్ళ తగవులు తీర్చడం ఆ ముసలామె ప్రత్యేకత.

గ్రామంలోని అసహాయులకు ఆ ముసలామె మరో కోణంలోంచి గొప్ప ఉపకారి. ప్రభుత్వం నుంచి అందే పథకాలకు అర్జీలు రాయడంలో వారికి ఆ ముసలామె ఏ ప్రతిఫలమూ ఆశించకుండా సాయం చేస్తుంది.

ఇదంతా చెప్పడంలోని ఉద్దేశం ఏంటంటే – గ్రామంలోకి చాలామందికి ఆమె ఓ తప్పనిసరి అవసరం లాంటిది. వీళ్ళతో వ్యవహరించేడప్పుడు ఆమెలోని ఓ చీకటి పార్శ్వం బయటపడుతూంటుంది. అతి తక్కువ వడ్డీకి అప్పులిచ్చి, ఆ అప్పుల్ని వసూలు చేసుకునేడప్పుడు ఆ ముసలామె చాలా నిక్కచ్చిగా ఉంటుంది. తిట్ల దండకం అందుకుంటుంది, ఎప్పటివో పాత విషయాలు తవ్వి తీస్తుంది. ఆ సమయంలో ఆమె రూపం చూసినవారెవరైనా ఆమె గ్రామంలో దేవత లాంటిదనీ, ఆమెలో మంచితనముందీ అంటే నమ్మడం కష్టం.

ఇలాంటి ఒకరోజు ఆ ముసలామె తన బాకీలు వసూలు చేసుకునేందుకు వీరేందర్ తల్లి కోమల్ వద్దకు వెళ్ళింది. బాకీ వసూలుకి తన ఇంటి గుమ్మం దిగేముందు ఆమె చాలా కోపంగా ఉంది. ఎందుకంటే ఇప్పటికే రెండు సార్లు వెళ్ళొచ్చింది, రెండు సార్లూ ఇళ్ళు తాళం వేసే ఉంది. రెండు సార్లూ ఉత్త చేతులతో తిరిగిరావడంతో – ఈ రోజు ఆ ముసలామె కోపం పట్టలేకపోతోంది. అయితే ఈ రోజు ఆ ఇంటి తలుపు తీసే ఉంది. అంతే, ఇంకేముందీ, గుమ్మం బయటే నిలుచుని తిట్లు లంకించుకుంది.

“ఏవమ్మా కోమలమ్మా! ఏంటి విషయం? నా డబ్బులు మింగేస్తావా? తీసుకుని మూడు నెలలు అయ్యింది, అసలు మాట దేవుడెరుగు… ఇప్పటిదాక వడ్డీ అయినా ఇవ్వలేదు. రెండు సార్లు వచ్చి, ఉత్త చేతులతో తిరిగెళ్ళాను. ఈ రోజు మాత్రం డబ్బు తీసుకునే వెళతాను. ఆఁ.. అప్పు తీసుకునేడప్పుడు ఎన్ని ఇచ్చకాలాడావు? తిరిగి ఇవ్వాలంటే మాత్రం ఇంటికి తాళాలేసుకుని తిరుగుతావా? ఆహా… ఆహా” అంది.

లోపలి నుంచి జవాబు రాలేదు. దాంతో ఆ ముసలామె మరింత గట్టిగా అరవసాగింది. “నీకు ఎగ్గొట్టే ఆలోచన ఉన్నట్టు నేనెప్పుడో పసిగట్టాను. తోటి పిల్లలతో పాటు చదువుకోడానికి మీ వీరేందర్‌ని మా ఇంటికి పంపించనప్పుడే నాకర్థమైంది. అరే, ఏమనుకుంటున్నావ్… ఊరికే వదిలేసుకోడానికి ఆ డబ్బేమీ నాకు తేరగా రాలేదు…”

అప్పుడు బయటకొచ్చింది కోమల్. మాసిన, చిరిగిన చీరతో. వస్తూనే ఆ ముసలామె కాళ్ళ మీద పడింది. “అమ్మా అలాంటిదేం లేదు. మీ అప్పు ఎగ్గొట్టే ఉద్దేశం నాకు లేదు. వీరేందర్‌ని మీ దగ్గరకు పంపకుండా ఆపడంలో ఏ చెడు ఆలోచన లేదు. మీకెలా చెప్పను? నిజానికి మూడు నెలల నుంచి వీరేందర్ ఆరోగ్యం బాగోలేదు. అసలు వాడి చికిత్స కోసమే మీ దగ్గర అప్పు చేశాం. ఇన్ని రోజులు పట్నంలో పెద్దాసుపత్రిలో వాడికి చికిత్స చేయిస్తున్నాం… మీరిచ్చిన డబ్బులతోనే….” అంది.

అలా చెప్తూ, కోమల్ ఆ ముసలామె పాదాల్ని చుట్టుకుని ఏడుస్తూనే ఉంది. ఆమె రోదనకి ఆ ముసలామె కోపం పోయింది. ఆమె కూడా కూలబడి, కోమల్‌ని పక్కకి తీసుకుని, వణుకుతున్న గొంతుతో… “వాడికి చికిత్స చేయిస్తున్నావా? ఇప్పుడెక్కడున్నాడు? అసలేమయింది చెప్పు?” అంది.

ఆ ఇంటి చుట్టూ కొంతమంది గ్రామస్థులు చేరారు. ఆ ముసలామె కూడా ఏడవడం వాళ్ళందరూ చూశారు.

ఆ ముసలామె ఏడవడం చూసి, కోమల్ తెప్పరిల్లింది. ఆమెని ఓదార్చడం మొదలెట్టింది. “అమ్మా… ఊర్కో. నిజానికి క్రిందటి అశ్వయుజ మాసంలోనే వాడి ఆరోగ్యం పాడయింది. మెరుగపడలేదు. ఎవరి దిష్టి అయినా తగిలిందేమో అనుకున్నాను. జ్వరం ఎంతకీ తగ్గడం లేదు. ఒక్కోసారి తగ్గినా మళ్ళీ ఒకటి రెండు రోజులకే మళ్ళీ వస్తోంది. ఇన్ని రోజులుగా మేము వైద్యులకి హకీంలకి, భూతవైద్యులకి… అందరికి చూపించాం. కాని ఏం ఫలితం లేకపోయింది. అలసి, ఓడిపోయి వాడిని పట్నంలోని ఆసుపత్రిలో చేర్చాం. అక్కడ కొన్ని మందులు ఆసుపత్రిలోనే ఇచ్చారు, ఇంకొన్ని బయట కొనాల్సి వచ్చింది. ఇప్పటివరకూ మీరిచ్చిన డబ్బుతోనే వాడికి వైద్యం జరిగింది. ఈ రోజు ఉదయం వాడికి స్పృహ తప్పింది… నా దగ్గర ఇంక డబ్బు లేదు. అమ్మా… మీ దగ్గర మళ్ళీ అప్పు చేద్దామనే నేను పట్నం నుంచి వచ్చాను… మీ దగ్గరకే వద్దామనుకుంటున్నాను. వాడిని కాపాడండమ్మా… ఈ దీపావళికి మా ఇంట్లో చీకట్లు తప్పవేమోనని భయమేస్తోంది…”

ఈలోపు ఆ ముసలామె తనని తాను సంబాళించుకుంది. కోమల్ నుంచి అప్పు వసూలు చేసుకోడానికి వచ్చిన ఈ ముసలామె తన రొండిలో దాచుకున్న డబ్బు సంచీ నుంచి రెండు వేల రూపాయల గులాబీ రంగు నోటు తీసి ఇవ్వడం గ్రామస్థులంతా చూశారు. “కోమల్, ఈ డబ్బు ఉంచుకో. వెంటనే బిడ్డని ఆసుపత్రికి తీసుకెళ్ళు. పిల్లవాడి చికిత్సలో ఏ లోటూ జరగకూడదు. నేను పెన్షన్ తీసుకోడానికి రేపు పట్నం వస్తున్నాను. అప్పుడు ఇంకొంత డబ్బు ఇస్తాను. అవసరమైతే పట్నంలోనే మరో పెద్దాసుపత్రికి మారుద్దాం. పిల్లవాడికి పూర్తిగా నయమయ్యాకే మన గ్రామం తిరిగి వెళదాం… వెళ్ళు.. ఈ దీపావళి నాడు మీ ఇంట్లో చీకట్లు ఉండవులే… నువ్వు, నేను, వీరేందర్ కలసి పండగ జరుపుకుందాం ఈసారి….” అందా ముసలామె.

కోమల్ ఆ ముసలామెని హత్తుకుని గట్టిగా ఏడ్వసాగింది. ముసలామెకి మేలు కలగాలని కోరుకుంది. బిడ్డకి పూర్తిగా నయమైతే ఆ ముసలామెకి జీవితాంతం ఋణపడి ఉంటానని అంది. అయితే ఆ ముసలామెకి మళ్ళీ కోపం రావడం జనాలు చూశారు. కోమల్‌ని విడిపించుకుని, తోసేసింది.

మెత్తని స్వరంతో, “వెళ్ళు. ఎక్కువ నాటకాలు వద్దు. తొందరగా పిల్లాడి దగ్గరకెళ్ళు. ఏం తెలివితక్కువ మనిషివే నువ్వు… మొదట ఏమో నాటు వైద్యుల దగ్గరకెళ్ళావు, తర్వాతా మూలికలవాళ్ళ దగ్గరకి… ఈలోపు పిల్లాడి జబ్బు ముదిరిపోయింది. ఇప్పుడు కూడా ఇంకా వేషాలేస్తున్నావ్… విను. ఇంటికి తాళం పెట్టు… నేరుగా ఆసుపత్రికి వెళ్ళు. కొంత డబ్బుతో మందులు కొను, కొంత డబ్బుతో కడుపునిండా ఏదైనా తిను. తిండీతిప్పలు లేకుండా కడుపు మాడ్చుకుని నువ్వు రోగం తెచ్చుకోకు.. ఇంక వెళ్ళు… తొందరగా…” అంది ముసలామె.

అక్కడ గుమిగూడిన జనాలు కొద్ది సేపటి క్రితం ఆ ముసలామె వీరేందర్ ఇంటి ముందు పెద్ద గొంతేసుకుని అరవడం చూశారు, కాని ఇప్పుడు నీటి బుడగలా మారడం చూస్తున్నారు. అక్కడే ఉన్న జమీల్ భాయ్… “ఈ ముసలామె చూడ్డానికి శిలలా ఉంటుంది. పైకి కఠోరం.. లోపలేమో కోమలం.. వెన్నలాంటి మనసుకలది…” అన్నాడు.

ఆ ముసలామె బుస్సుమనిపొంగుతూ కదిలింది, కోమల్ ఆమెకి మేలు కలగాలని కోరుతూ ఇంట్లోకి నడిచింది.

***

మర్నాడు ఆ ముసలామె తన పెన్షన్ డబ్బులు తెచ్చుకోడానికి పట్నం వెళ్ళింది. ఆమె వీరేందర్‌ని చూడ్డానికి ఆసుపత్రికి వెళ్తుందనీ, అవసరమైన సమాచారం తెలుసుకుని… మహా అయితే సాయంత్రం చీకటి పడే వేళకి వచ్చేందని గ్రామస్థులు అనుకున్నారు. కానీ, సాయంత్రం ఏంటి, రాత్రయినా ఆమె రాలేదు.

గ్రామస్థులు చూస్తూనే ఉన్నారు. ఒకటి రెండు రోజులు ఏంటి, ఆ ముసలామె పదిరోజులయినా తిరిగి రాలేదు. ఇలా ఎవరికీ ఏమీ చెప్పకుండా ఇన్ని రోజులు ఎక్కడికీ వెళ్ళలేదా ముసలామె. అందుకే గ్రామస్థులకి సంశయాలు కలగసాగాయి – ఏదైనా అనుకోని ప్రమాదం జరగిందోమోనని! కొందరేమో – “పాపం! ఎవరైనా ఆమె దగ్గరున్న డబ్బు కోసం ఆమెకేదైనా హాని చేశారేమో? పట్నంలో ఇలాంటి ఘటనలు ఇప్పుడు చాలా ఎక్కువగా జరుగుతున్నాయట. పైగా దీపావళి పండగ దగ్గరికొస్తోంది. ఈ సమయంలో పట్నంలో జూదం ఆడడం, డబ్బు కొట్టేయడం వంటివి అధికంగా ఉంటాయట” అన్నారు.

మరికొందరేమో, ఆ ముసలామె తమ గ్రామాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిందేమోననుకున్నారు.

ఇంకొందరేమో – పట్నంలో ఆమెకి ఆమె పుట్టింటి వాళ్ళో, అత్తింటి వాళ్ళో కనిపించి ఉంటారనీ, వాళ్ళతో వెళ్ళి ఉంటుందని అనుకున్నారు.

ఇక ఆమె మేలు కోరుకునేవారు ఆ ముసలామె కనబడకపోవడం గురించి దిగులు చెందారు. గ్రామపు పెద్ద జమీందారు, వడ్డీ వ్యాపారులు మనసులో ఎంతో సంతోషించారు. ఆ ముసలామె గ్రామానికి తిరిగి రాకూడదని మొక్కులు మొక్కారు. లేదా ఆమెకి ఏదైనా ప్రమాదం జరిగాలి, అప్పుడే ఆమె తమ తమ వడ్డీ వ్యాపారాలకి అడ్డుందని భావించారు.

ఆ ముసలామె గురించి ప్రార్థనలు, శాపనార్థాల మధ్య గ్రామంలోని కొంతమంది ఉత్సాహవంతులైన యువకులు మర్నాడు ఉదయం పట్నం వెళ్ళి ఆసుపత్రిలో కోమల్‍ని కలిసి ముసలామె గురించి వివరాలు కనుక్కోడం మంచిదని భావించారు.

కానీ వారికా అవసరం పడలేదు. ఆ ముసలామె వీరేందర్‌తోనూ, వాళ్ళమ్మ కోమల్ తోనూ ఊర్లోకి వస్తూ కనబడింది. చూస్తుంటే వీరేందర్ ఆరోగ్యం కుదుటపడినట్టే ఉంది. కాని కోమల్ మాత్రం మునుపటి కంటే కాస్త చిక్కినట్టు, నలుపెక్కినట్లు, కొద్దిగా నిరాశగా ఉన్నట్లు అనిపిస్తోంది. చేతిలో సంచీ పట్టుకుని నడుస్తున్న ఆ ముసలామె జనాల్ని చూడగానే  దీర్ఘాలు తీయసాగింది – “అరే, మనుషుల మధ్య కేవలం రక్త సంబంధాలే ఉంటాయా? మనం ఒకరితో ఒకరం నడుచుకునే పద్ధతిని బట్టే సొంతవాళ్ళు, పరాయివాళ్ళు ఏర్పడతారు.  పిచ్చితల్లి! నన్ను పరాయిదాని భావిస్తూ వచ్చావు… ఓరే బాబులూ… మీరు తప్ప నాకెవరు ఉన్నారు? ముందే చెప్పి ఉంటే వీరేందర్ రోగం ఇంత ముదిరేదా? ఇప్పుడనుభవించు…. కొడుక్కి నయమైందనుకుంటే… తల్లికి పట్టుకుంది జబ్బు…” అంటూ ఒకేసారి కోమల్‌తోనూ, గ్రామస్థులతోనూ మాట్లాడింది.

కోమల్ కొడుకు చెయ్యి పట్టుకుని తమ ఇంటి వైపు అడుగులు వేసింది. అంతే, ఆ ముసలామె కోపం పట్టలేక అరిచింది. “ఓయ్… అటెటు వెళుతున్నావ్? మీ తల్లీకొడుకులకు సేవలెవరు చేస్తారు? ఒక్కదానివీ ఏం వండుకుంటావు… ఏం తింటావు? మా ఇంటికి పద… పూర్తిగా కోలుకునేవరకూ అక్కడే ఉందుగానీ… ఆఁ, దీపావళి రోజున మీ ఇంటికి వెళ్ళి ఇల్లాంతా శుభ్రం చేశాకే, మా ఇల్లు సర్దుకుంటాను. రాత్రి మనమిద్దరం వెళ్ళి దీపాలు వెలిగిద్దాం. పట్నం నుంచి కొన్ని పటాసులు తెస్తాను. పిల్లాడు కాల్చుకుంటాడు… పండగ రోజున మిఠాయిలు కూడా మీ ఇంట్లోనే తిందాం…”

ముసలామె మాటలింకా పూర్తి కాక ముందే, కోమల్ వచ్చి ఆమెని హత్తుకుంది దుఃఖంతో. “అమ్మా… అమ్మా నా మీద ఎంత దయ చూపిస్తున్నావు? బదులుగా నేనేమివ్వగలను?” అంటూ గట్టిగా రోదించసాగింది.

గుండెలవిసేలా ఏడిస్తే మనసులో బాధ తగ్గుతుందని ముసలామెకి తెలుసు. మనసులోకి మకిలి కంటి ద్వారా బయటకి పోతుంది. అప్పుడు మనసు, శరీరం రెండూ తేలికవుతాయి. ఆ ముసలామె కోమల్‌ని కాసేపు ఏడవనిచ్చింది. తర్వాత తనని విడదీస్తూ, “పద… పద… ఇంక చాలు. ఆకలేస్తుంది, తొందరంగా వండుకుని తినాలి. సాయంకాలమయ్యేలోపు కులేసర్ మహతో దగ్గరికి వెళ్ళి ఈ నెల వడ్డీ తెచ్చుకోవాలి… పద… త్వరగా…” అంది.

గ్రామస్థులు గట్టిగా నవ్వారు. ఆ ముసలామె కరుణామూర్తి అని వాళ్ళకి అర్థం కావడం లేదు. లేదా వాళ్ళ ఆలోచనలెక్కడో చిక్కుకుపోయుంటాయి.

కోమల్ తనని తాను స్థిమితపరుచుకుని నిలబడింది గానీ ఓ క్షణం పాటు ఊగిసలాడింది. ఈసారి ఆ ముసలామె తనతో రమ్మని ప్రేమగా పిలుస్తూ… “ఓ కోమల్!… వీరేందర్ పూర్తిగా కోలుకోడానికి కనీసం ఇంకో వారం పది రోజులు పడుతుంది. నువ్వు కూడా కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలి. రా… అమ్మా, మా ఇంటికి వెళదాం. మీ ఇద్దరు కోలుకునే వరకూ మీ ఇద్దరికీ నేను సేవ చేస్తాను. నాక్కూడా వయసైపోతోంది… నాకూ విశ్రాంతి కావాలి. అందుకే… ఈ రోజు నుంచే… వచ్చి నాతో ఉండు….” అంది.

ఈ మాటలకి వీరేందర్ ఏమీ జవాబివ్వలేదు, కోమల్ కూడా బదులివ్వలేకపోయింది. ఇద్దరూ ఒకరినొకరు చూసుకున్నారు… ఆ ముసలామెని అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు…

హిందీ మూలం: గోపాల్ ప్రసాద్ ‘నిర్దోష్’

అనువాదం: కొల్లూరి సోమ శంకర్

Exit mobile version