ఆ రోజుల్లో…

1
4

[dropcap]ఆ[/dropcap]దివారం ఉదయం పది గంటలు. చిలుకూరు సమీపంలో ఉన్న ప్రసీద ఇంజనీరింగ్ కాలేజీ క్యాంపస్ ఎంట్రన్స్ లో ‘వెల్కమ్ టు 2003 ఇంజనీరింగ్ బ్యాచ్’ అని ఫ్లెక్సీ స్వాగతం పలుకుతోంది.

కార్లు, క్యాబుల్లో అలనాటి జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ ఒక్కొక్కళ్ళే వస్తున్నారు. పట్టుచీరలో బొద్దుగా కనిపిస్తున్న సుష్మ, స్లిమ్‌గా హీరోలా ఉన్నాడు విశాల్. ఇద్దరూ లోపలికి వస్తున్న వాళ్లని రిసీవ్ చేసుకుంటున్నారు.

“ఏయ్ హనీ… సారీ… అ…అ.. అనీ.. అనితా!” అన్నాడు విశాల్.

లోపలికి వస్తున్న అనిత కళ్ళు పెద్దవి చేసి, విశాల్‌ని చూస్తూ

“నీలో మార్పేం లేదురా! ఇంకో పదేళ్ళ తర్వాత చూసినా నువ్వు నాగార్జునలా స్లిమ్ గానే ఉంటావు”

“నువ్వేంటే.. బాబూ! బబ్లీలా!?! వాకింగ్, డైటింగ్ చెయ్యట్లేదా?…”

“అమ్మాయిలం బాబూ! అప్పట్లానే ఎలా ఉంటాం? నందిత నీకు అన్నం పెట్టటం లేదా?” అంది.

“మెల్లగా మాట్లాడు.. నందితకు, నాకూ పెళ్లవలేదు. తను వాళ్ళ మామయ్య కొడుకునే చేసుకుంది. అడుగో ఆయనే” అని చూపిస్తుంటే, అనిత ఆశ్చర్యంగా చూసింది.

అంతలో అక్కడికి నందిత వచ్చింది.

“హాయ్… హాయ్”

“అనితా!” అంది నందిత ఆమెని హగ్ చేసుకుని.

“ఏంటే విశాల్‌కి హ్యాండ్ ఇచ్చావా?”

“హుష్.. మా ఆయన వింటాడు.” అంది నందిత.

అప్పుడే అక్కడికి బుల్లెట్ మీద బాల్రెడ్డి వచ్చాడు. అందరూ బుల్లెట్ చూసి ‘బుల్లెట్ బాల్రెడ్డీ’ అనేశారు.

పలకరింపులయ్యాక “బాల్రెడ్డీ! ఏం చేస్తున్నావురా?” అడిగాడు శంకర్.

“ఏముందిర భయ్ చెయ్యనీకి, కాలేజీల గాపోరి, గీపోరి ఎన్కబడి బడీ చివరికి మామ కూతుర్నే పెండ్లి జేస్కుని, ఊర్ల కల్టివేషన్ జేస్కుంటున్న” అన్నాడు.

“అక్కడ చూడండి. సుజాత కదా!” అంది అనిత.

సెక్యూరిటీ గార్డులతో లోపలికి వస్తున్న సుజాత చూసి “కలెక్టర్ అయింది.” అన్నాడు బాల్రెడ్డి.

“అవును మొదటి నుంచి దాని ఎయిమ్ సివిల్సే.. షి సక్సీడెడ్”. అంది నందిత.

ఆ తర్వాత రవి, సంధ్య, శంకర్, కిషోర్, సరళ, కళాధర్ అప్పటి బ్యాచ్‌లో చాలామంది వచ్చారు.

“అవునూ.. సురేష్ ఎక్కడ రా?”

“ఆడు ఏడుంటడ్రా భయ్.. కెమెరా పట్టుకుని ఏమూలో పిక్స్ తీనీకి పోయుంటడు.” అన్నాడు బాల్రెడ్డి.

అందరూ ఎక్సైట్‌మెంట్‌తో అలనాటి మిత్రులను కలుసుకున్న ఆనందంతో పలకరింపులు, ఎమోషన్లు, ఆశ్చర్యాలతో షేక్ హ్యాండ్లు, …హగ్గులతో ఎంతో సంతోషంగా ఉన్న వాళ్లందర్నీ, చాలా సంవత్సరాల తర్వాత చూసిన కాలేజీ తల్లి ఆప్యాయంగా ఆహ్వానించింది.

మైక్‌లో అనౌన్స్మెంట్ వినిపిస్తోంది.

“డియర్ ఫ్రెండ్స్! వెల్కమ్ టు రీయూనియన్… ఎంతో శ్రమపడి దేశవిదేశాల నుంచి వచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. మీరు అంతా మన కాలేజీలో కొత్తగా నిర్మించిన ఆడిటోరియం కం మినీ థియేటర్‌కి రావాలి. దానికంటే ముందు పక్కనే ఉన్న డైనింగ్ హాల్‌కి రండి. అందరం కలిసి అల్పాహారం తిందాం. తర్వాత మనందరికీ ఓ సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాడు సురేష్.”

పదినిమిషాల్లో అందరూ డైనింగ్ హాల్లో సమావేశమయ్యారు.

“మరి మన లెక్చరర్స్ ఎక్కడో!?” సందేహం వెలిబుచ్చింది సంధ్య.

“వస్తారు.. ముందు మనందరి కోసం సురేష్ ఎక్స్‌క్లూజివ్‌గా ఇచ్చే సర్ప్రైజ్ చూద్దాం. తర్వాత గురు పూజోత్సవం, లంచ్ తర్వాత పరస్పర అభిప్రాయవేదిక ఉంటాయి”చెప్పాడు కళాధర్.

అరగంట తర్వాత అందరూ ఆడిటోరియంలో సెటిల్ అయ్యారు. లైట్లు ఆరిపోయాయి.

డయాస్ మీద సురేష్ మైకు పట్టుకుని..”ఫ్రెండ్స్ మనందరం ఇన్నాళ్ళకి మళ్ళీ కలుసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. మనల్నందరినీ మూడు దశాబ్దాల వెనక్కి తీసుకెళ్లడానికి, ఆ పాత బంగారు లోకంలో విహరింప జేయడానికి, అలనాటి మధుర జ్ఞాపకాల్ని మన ముందుకు తెచ్చేందుకు.. ఇంటర్నెట్, వాట్సప్, ఫేస్బుక్‌ల ద్వారా అందరినీ కాంటాక్ట్ చేసి, ఇలా కలిపిన కళాధర్‌కి థాంక్స్ చెబుదాం. ప్రస్తుతం యు.ఎస్.లో జాబ్ చేస్తున్నాను. నా హాబీ ఫోటోగ్రఫీని వదలకుండా, దాంతోపాటు డైరెక్షన్ కోర్సుచేశాను. తొలి ప్రయత్నంగా ఓ షార్ట్ ఫిల్మ్ డైరెక్ట్ చేశాను. నా చిన్న ప్రయత్నాన్ని మీ అందరితో పంచుకోవాలని ఆశిస్తున్నాను.”

హాలంతా కరతాళధ్వనులతో మారు మ్రోగింది.

స్క్రీన్ మీద సినిమా మొదలైంది.

***

వర్షం ఉధృతంగా పడుతోంది. సిటీలో ట్రాఫిక్ స్తంభించింది. ఆకాష్ కాలేజీకి గంట ఆలస్యంగా, బైక్ మీద వర్షంలో పూర్తిగా తడిసిపోయి వచ్చాడు. కాలేజీ క్యాంపస్ లోకి వెళ్తుంటే…

శ్రావణి గొడుగు వేసుకుని వెళ్తూ కనిపించింది. మెయిన్ గేట్‌కి, మెయిన్ బిల్డింగ్‌కి ఫర్లాంగు దూరం ఉంది. శ్రావణి గొడుగు పట్టుకుని నడుస్తోంది. వేగంగా వీస్తున్న ఈదురుగాలికి గొడుగు రివర్సయింది..

తడి బట్టలతో క్లాసుకి ఎలా వెళ్ళాలో అర్ధం కాలేదు.

***

ఆకాష్ షుగర్ ఫ్యాక్టరీ ఓనర్ కొడుకు. ఇంజనీరింగ్ చదువు కోసం హైదరాబాద్ వచ్చి మాదాపూర్‌లో రూమ్ తీసుకుని ఫ్రెండ్స్‌తో ఉంటున్నాడు. హ్యాండ్సమ్‌గా అందంగా ఉండే ఆకాష్‌కి సినిమా హీరోలా ఉంటాననే ఫీలింగ్. అందుకే ఏం చేసినా ప్రత్యేకంగా కనిపిస్తాడు. చేతికున్న ఫ్ వాచ్ దగ్గర్నుంచి, బైక్ మీద స్టిక్కర్ వరకూ ప్రతిదీ స్టైలే.

శ్రావణి వాళ్ళ నాన్న రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తాడు. డబ్బుకి తక్కువ లేదు. పైగా అందగత్తె .. ఆమె ధరించే దుస్తులు మొదలు, చెవి రింగుల వరకు అన్నీ సంథింగ్ స్పెషల్ గానే ఉంటాయి.

అందుకే.. కాలేజీలో ఆమెకంత ఫ్యాన్ ఫాలోయింగ్. కాలేజీలో అడుగు పెడితే చాలు ఎంత లేజీ ఫెలో అయినా క్రేజీగా ఓ లుక్ వెయాల్సిందే.

ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్‌లో మ్యాథ్స్ క్లాస్‌లో ఓ కుర్ర లెక్చరర్ శ్రావణి మీద నుంచి దృష్టి మరల్చకుండా ఆమె వైపే చూస్తూ పాఠం చెప్తున్నాడు. వెనకనుండి ఆకాష్ లేచి

“సార్! ఎంతసేపు… ఆ అమ్మాయినే చూసి పాఠం చెప్తారు? మెడ కండరాలు పట్టేస్తాయి. ఇటు తిరిగండి” అని అరిచేసరికి క్లాస్ అంతా గొల్లుమన్నారు.

అదిగో ఆ రోజు నుండి అందరి కళ్ళు శ్రావణి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూంటే, ఆమె కళ్ళు మాత్రం స్టైల్ కింగ్‌లా కనిపించే ఆకాష్ చుట్టూ పచార్లు చేయటం మొదలెట్టాయి.

***

ఇటు చూడండి… వీడి పేరు నిఖిల్. వీడికి తనో మన్మధుననే ఫీలింగ్. వీడికే కాదులేండి. కాలేజీ చదువుకి వచ్చిన ప్రతి వాడికి ఉండేదే. రంగు రంగుల ప్రపంచం. చుట్టూ అందమైన అమ్మాయిలు కనిపిస్తుంటే ‘బ్రహ్మకైనా పుట్టు రిమ్మ తెగులు’ అన్నట్టు ఈ ఫీలింగ్ లేకపోతే అది కాలేజీ లైఫే కాదు అంటాడో రచయిత.

అసలు బ్రహ్మ మ్యానుఫ్యాక్చరింగ్ స్టేజ్ లోనే.. ప్రాయానికి వచ్చి కాలేజీలో చేరే అబ్బాయిలు, అమ్మాయిలకి శృంగార హార్మోన్లు కాస్తంత అదనంగా వేసి భూమ్మీదికి పంపుతున్నాడల్లే ఉంది. అందుకే ఏ మారుమూల కాలేజీలో చూసినా లవ్ లేని యూత్‌ని వేళ్ళ మీద లెక్క పెట్టొచ్చు. అసలా థ్రిల్లే వేరు. ఎక్కడో ఒక చోట స్పందించి తీరాల్సిందే!

***

నిఖిల్ కూడా ఇంజనీరింగ్ సెకండియరే. ఐ.టీ బ్రాంచ్. వీణ్ణి అందరూ ఐ.టీ నిఖిల్ అని పిలుస్తారు. వీడు ఫ్యాంటసీ లోకి వెళ్ళాడంటే సర్వం మర్చిపోతాడు. ఎలాగో చూద్దాం రండి.

***

“ఒరేయ్ నిఖిల్ గాడు వస్తున్నాడ్రా!” అన్నాడు బస్టాపులో నిలబడ్డ రవి. బస్టాప్‌లో కాలేజీ బస్సు కోసం నిలబడ్డ ఫ్రెండ్స్‌ని దూరం నుండే చూసి, చేయ్యి ఊపుతూ దగ్గరకొచ్చాడు నిఖిల్.

“హాయ్ షైలా, హలో షివా గుడ్ మార్నింగ్ “అని స్టైల్‌గా విష్ చేశాడు.

“కొత్త డ్రస్సా బాసూ! అదిరింది” అన్నాడు శ్రీను.

“లోపల కూడా అన్నీ కొత్తవే” అన్నాడు వెటకారంగా నిఖిల్.

ఆ మాటను పాము చెవుల్లా క్యాచ్ చేసిన కిరణ్మయి కిసుక్కున నవ్వింది. అంతే! తన మాటకు రెస్పాండ్ అయిన కిరణ్ ముందు కమలహాసన్‌లా బిల్డప్ ఇస్తూ ‘థాంక్యూ కిరణ్’ అని తనలో తాను అనుకున్నాడు.

అందివచ్చిన అవకాశాన్ని వదలకుండా నిఖిల్ పక్కన నిలబడ్డ చారి.. “ట్రై చేస్తున్నావా బాసూ! కొత్త షర్టూ, కొత్త ఫిగరూ, చిన్న పార్టీ” అని అంటుంటే నిఖిల్ అదిరిపడ్డాడు. వీడేంటి పార్టీ అంటున్నాడు.

అంతలోనే ఫ్రెండ్స్ ముందు “ఇవ్వాళ నిఖిల్ మన అందరికీ పార్టీ ఇస్తాడు” అని అనౌన్స్ చేసిన చారిని తినేసేలా చూసి, అమ్మాయిల ముందు అభాసు పాలుకావడం ఇష్టంలేక, ఇంట్లో తల్లికి అబద్ధం చెప్పి నొక్కేసిన డబ్బుందన్న ధైర్యంతో, లోపల ఏడుస్తూ, పైకి నవ్వుతూ, ‘ఓ.కే’ అనేసాడు అంబానీ తమ్ముళ్ళా.

ఆరోజు క్యాంటిన్లో అందరికీ ట్రీట్ ఇచ్చాడు. తననే చూస్తూ తన జోకులకి నవ్వుతూ, చూపులు కలుపుతున్న కి.. కి.. కిరణ్ పక్కన నుంచుని కావాలని చేతులు తగిలిస్తూ, కావాలనే కాఫీ షర్టు మీద కాఫీ పోసుకున్నాడు. వెంటనే కిరణ్మయి రియాక్ట్ అయి కర్చీఫ్ తడుపుకు వచ్చి తుడుస్తుందనుకున్నాడు… కానీ ఇది సినిమా కాదు.

“నిఖిల్ త్వరగా నీళ్ళతో కడిగెయ్… మరకపడితే పోదు.” అని ఉచిత సలహా పారేసి, కిరణ్ వెళ్లిపోతుంటే ఉలిక్కిపడ్డాడు. జేబులో ఉన్న డబ్బుకి కాళ్ళొచ్చి క్యాష్ కౌంటర్ లోకెళ్ళిపోతుంటే… బిల్లు కట్టి బయటకు వచ్చిన బకరా నిఖిల్… వెళ్ళిపోతున్న కిరణ్‌ను వదలకుండా వెంటపడి మరీ ఆమె చెవిలో ప్రేమ మంత్రం ఊదేశాడు.

ఇప్పుడు చూడండి… క్యాంటీన్లో ఇద్దరూ ఓమూల పక్క పక్కనే కూర్చుని కేరింతలు, నవ్వులు, తుళ్ళులతో, చిన్న చిన్న టచ్చెస్‌తో స్పర్శానందంలో మునిగి తేలుతున్నారు.

***

బైక్ పార్కింగ్ స్టాండ్ దగ్గర నిలబడి ఫ్రెండ్స్ తో సొల్లు కబుర్లు చెబుతూ వచ్చే అమ్మాయిల మీద కామెంట్స్ చేస్తూ నిలబడ్డ ఆ బ్యాచ్ దగ్గరికి వేగంగా వచ్చిన ఈ బుల్లెట్ సాంబిరెడ్డిని చూడండి…

“ఏంట్రా సాంబిరెడ్డీ? కొత్త బండా?”

“కనబడ్డంలా బే!. మా అన్న అమెరికా నుండి పోస్ట్ లో పంపిండు”

“కలర్ మస్తుంది రెడ్డీ!”

“అవ్ మల్ల… అటు చూడండి. మస్తు ఫిగర్ వస్తంది. “అని చూపించాడు

ఇంజనీరింగ్ థర్డ్ ఇయర్ చదువుతున్న మీనాక్షి పరిగెత్తుకుంటూ అక్కడకు వస్తోంది.

“మామా.. కత్తిలా ఉంది కదా! ..”అని సాంబిరెడ్డి అండ్ కో.. సొల్లు కార్చుకుంటున్నారు చూడండి.

సాంబిరెడ్డికి తమిళం వచ్చు. మీనాక్షి తమిళమ్మాయి.. మరందుకే సాంబిరెడ్డి మీనాక్షితో అరవంలో మాట్లాడుతున్నాడు.. వినండి.

“ఎన్న మీనాక్షీ! ఓడోడి వరే…” (ఏంటి మీనాక్షి పరిగెత్తు వస్తున్నావ్)

ఆమె ఆమె బదిలివ్వకుండా వెళ్ళిపోతున్నా… వదలకుండా చూపుల బాణాలు ఎలా సంధిస్తున్నారో చూడండి.

***

కార్తీక్‌ది ఇంజనీరింగ్ సెకండియర్ ఐటీ గ్రూప్. కళ్ళజోడు, భుజానికో డీజిల్ బ్యాగ్,.. అందులో కెమెరా, రైటింగ్ ప్యాడ్ ఎల్లప్పుడూ వాడిని అంటి పెట్టుకొని ఉండే నేస్తాలు.

ప్రకృతి కాస్త అందంగా కనపడితే చాలు రాళ్ళు, రప్పలు, కొండలు, గుట్టలు, మనుషులు, జంతువులు ఏదైనా పర్వాలేదు.. కాదేది వీడి ఫోటోగ్రఫీ కనర్హం. ఏమాటకామాటే చెప్పుకోవాలి వీడిలో కళాతృష్ణ ఎక్కువే.

ఆ మధ్య ఓ ఫోటో కాంపిటీషన్ కి పంపడానికి వీడి కంట్లో పడ్డ దృశ్యం చూడండి.

క్యాంటీన్లో టేబుల్ మీద మూగిన ఈగల్ని క్లోజప్ లో తీసేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఎదురుగా క్లాస్మేట్ నస్రీన్ ఫ్రెండ్స్‌తో కూర్చుంది. కార్తీక్ కెమెరా పట్టుకుని ఈగల్ని జూమ్ చేస్తుంటే, నస్రీన్ తన ఎదని ఫోటో తీస్తున్నాడనుకుని, అపార్థం చేసుకుని వేగంగా లేచొచ్చి, కార్తీక్ ని లాగి చెంప మీద కొట్టింది.

“సారీ” అని సైలెంట్ గా వెళ్ళిపోయాడు కార్తీక్.

అక్కడే ఉన్న ఆకాష్… నస్రీన్‌తో కార్తీక్ గురించి చెప్పాడు. నస్రీన్ తెగ ఫీలైపోయి… క్లాసులో సైలెంట్‌గా కూర్చున్న కార్తీక్ దగ్గరకెళ్లి ‘సారీ’ చెప్పింది. స్టేట్ వైడ్ ఫోటో కాంపిటీషన్లో కార్తీక్ పంపిన ఫోటోకి సెకండ్ ప్రైజ్ వచ్చింది.

అంతే! కార్తీక్ క్రియేటివిటీకి ఫిదా అయిన నస్రీన్ ని చూడండి.. కార్తీక్ ఎదురుపడితే చాలు ముఖం మీద పరదా పక్కకు తప్పించి ఎలా సైట్ కొడుతూ కళ్ళూ కళ్ళూ కలుపుతోందో.

ఆరోజు వర్షం పడుతోంది. నస్రీన్ ఫ్రెండ్స్‌తో లైబ్రరీకి వెళ్తోంది. వర్షంలో చెట్టు కొమ్మ మీద తడుస్తూ కూర్చున్న చిలుకల్ని కార్తీక్ ఫోటో తీస్తున్నాడు. కార్తీక్‌ని చూసి హాయ్ చెప్పి వెళ్తున్న నస్రీన్ కాలుజారి పడబోయింది. అక్కడే ఉన్న కార్తీక్ ఆమెని పడకుండావ పట్టుకున్నాడు. ఎలాగో చూడండి… రాజ్ కపూర్ నర్గీస్‌ల ‘ఆర్కే’ లోగోలా.

అంతే! ఆ తొలి స్త్రీ స్పర్శకి కార్తీక్ లో హార్మోన్లు హార్మోనియం వాయించడం ఆరంభించాయి. ఆమె మొహం మీద పరదా వెనక్కి పడిపోయింది. కళ్ళూ కళ్ళు కలిశాయి. ఒక్క క్షణం మాత్రమే. అయినా ఆ మధుర క్షణం ఇద్దరి మనసుల్లో డ్యూయెట్ పాటందుకుంది.

“తుఝే దేఖా తో హై జానా సనం” అని నస్రీన్ మనసు ఆలపిస్తుంటే… ఆ ముగ్ధ సింగారాన్ని ఆమెకు తెలియకుండా కెమెరాలో బంధించి, విజిల్ పాట కార్తీక్ ఎలా పడుకుంటున్నాడు వినండి..

‘ప్యార్ హోతాహై దీవానా సనం’.

***

నాలుగేళ్ళ కాలేజీ జీవితం ముగిసేసరికి విడిపోతున్న, వీడిపోతున్న బాధ… అందరి మొహాల్లో వర్ణనాతీతం. అందమైన కాలేజీ జీవితంలో చిలిపి ఊహలు, అల్లర్లు, ర్యాగింగ్లు, ఆవేశాలు, అబద్ధాలు, ఆనందాలు, పందాలు, పోటీలు, ప్రేమలు, బ్రేకప్‌లు… వీటన్నిటి మధ్య చదువు. భవిష్యత్తులో పోటీ ప్రపంచంలో ఎదుర్కోబోయే భిన్న మనస్తత్వాల్ని, భిన్న పరిస్థితుల్ని జీవితానికి సరిపడా అనుభూతుల్ని ప్రాక్టికల్‌గా చూపించి మనం మనల్ని ఎలా తీర్చిదిద్దుకోవాలో, నేర్పించి పంపుతుంది కాలేజీ. నాలుగేళ్లు ఎలా గడిచాయో తెలుసుకునే లోపలే.. కాలచక్రాన్ని గిర్రున తిప్పేసి సెండ్ఆఫ్ చెప్పేస్తుంది. కాలేజీ నుండిబయటకు వచ్చిన వాళ్ళు.. ఎవరికి ఎవరు ఏమవుతారో, ఎవరు ఏ తీరం చేరుతారో.. జీవితంలో సెటిల్ అవ్వాలన్న పరుగు పందెంలో రెడ్ సిగ్నల్ పడకూడదని, అజ్ఞానం తొలగించి, విజ్ఞానం ప్రసాదించి సంపూర్ణ వ్యక్తిత్వాన్నందించి, దీవించి పంపే గురువుల వద్ద వీడ్కోలు తీసుకుని, భారమైన మనలసుతో రెక్కలొచ్చిన పక్షుల్లా ఎగిరి పోతుంటే.. కళాశాల మాత్రం ఎప్పట్లానే ఉంది.

అంత సేపూ ఆడిటోరియంలో సినిమా చూసిన అందరి మనసులూ భారం అయ్యాయి.

సురేష్ గొంతు మళ్లీ వినిపిస్తోంది.

“ఫ్రెండ్స్ చూశారుగా! ఇది మన జీవితం. అందరూ కనెక్ట్ అయ్యారు కదా!

‘ప్రేమ పెన్నిధి గాని ఇంటను నెవ్వరు నేర్పరీ కళ.. ఒజ్జ నెవ్వరు లేరు’ అని గురజాడ వారు అన్నట్టు… ప్రేమించడం, ప్రేమించబడడం, ప్రేమను పంచడం ఒక కళ. ఇది ఇంట్లో గాని, కాలేజీలో గాని ఎవ్వరూ నేర్పరు. ప్రాయం తెచ్చిన పరువం సంతరించుకున్న ప్రతి ఒక్కరిలో ఆపోజిట్ సెక్స్ అమ్మాయినో, అబ్బాయినో చూడగానే వచ్చే హార్మోన్ల అలజడి ఆట. అందమైన అనుభవం. ఇది అందరికీ అనుభవంలోకి వచ్చే సారూప్యమైన సయ్యాటే. అయినా ఎవరి అనుభవం వారిది.

కాలేజీ రోజుల్లో పొందే ఈ అందమైన అనుభూతి మరణం వరకు గుండె లోతుల్లో గూడుకట్టుకుని బతికే ఉంటుంది . ఎప్పుడూ గుర్తొచ్చినా అవ్యక్తమైన,అనిర్వచనీయమైన, ఆనంద లోకాల్లో విహరింపజేయటమే ఈ కాలేజీ ప్రేమకున్న పవర్. అదేనండి లవ్.. ప్రేమ.. ఇష్క్.. కాదల్. అందుకే ఈ షార్ట్ ఫిల్మ్‌కి టైటిల్ నిర్ణయించే బాధ్యత మీ ముందుంచుతున్నాను.” అన్నాడు.

సురేష్ తొలి సినిమాకి ఏకగ్రీవంగా “ఆ రోజుల్లో…” టైటిల్ ఖరారైంది.

సురేష్ మాట్లాడుతూ “మనం కాలేజీలో ఎవరెరితోనో ఫ్రెండ్‌షిప్ చేస్తాం. ప్రేమలో పడతాం. అదే జీవితం అనుకుంటాం. కానీ కాలేజీ బయటకు వచ్చాక రియాలిటీ భిన్నంగా ఉంటుంది. ప్రేమికులంతా భార్యాభర్తలు కాలేరు. పెళ్ళికి ముందు జీవితం వేరు. కానీ నేను కాలేజీ రోజుల్లో ఇష్టపడ్డ ఫాతిమానే పెళ్ళి చేసుకున్నాను. నౌ షి ఈజ్ విత్ మి” అని పిలిచాడు. అందరూ ఆ ఇద్దరినీ చూసి ఆనందంగా క్లాప్స్ కొట్టారు.

తర్వాత గురుపూజోత్సవం జరిగింది. దాని తర్వాత అందరూ కలిసి లంచ్ చేశారు. ఈవినింగ్ సెషన్లో అందరూ తమ తమ అనుభవాల్ని పంచుకొని రీ యూనియన్‌లో రీఛార్జి చేసుకుని బయలుదేరారు.

ఇందులో గమ్మత్తేమిటంటే సురేష్ తీసిన ‘ఆ రోజుల్లో’ షార్ట్ ఫిలింలో ఆకాషే.. విశాల్ అనీ, శ్రావణే.. నందిత, కార్తికే… సురేష్ ,. నస్రీనే…ఫాతిమా అని… అందరూ ‘ఆ రోజుల’కి కనెక్ట్ అయ్యారు.

వాళ్లే కాదు మనలోనూ చాలామంది తేలుకుట్టిన దొంగలు ఉన్నారు. జీవిత భాగస్వాముల ముందు పెదవి విప్పితే పరువు ఫట్ మంటుందని సైలెంటై పోతుంటారు.

ఆ రోజులు తిరిగి రాని రోజులే మరి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here