[త్వరలో సంచిక ప్రచురించనున్న ‘సైనిక కథలు’ సంకలనం కోసం వంశీకృష్ణ పరిమళ గారు పంపిన కథ. కొత్తగా రాసి పంపిన కథలు ముందు సంచికలో ప్రచురితమవుతాయి. ప్రతిపాదిత సంకలనంలో, ఇప్పటికే ప్రచురితమైన కథలతో బాటు, సంపాదకుల ఎంచుకున్న ప్రమాణాల ప్రకారం కొత్తగా రాసి పంపిన కథల్లోంచి కొన్ని స్వీకరించబడతాయి.]
[dropcap]కా[/dropcap]శ్మీర్ లోయ ప్రాంతం. సమయం అర్ధరాత్రి పన్నెండు గంటలు. ప్రాంతం మొత్తం నిశ్శబ్దంగా, నిర్మానుష్యంగా ఉంది. చుట్టూ భీకర గాలులు వీస్తున్నాయి.
ఇంతలో ఓ మూల నుండి ఓ ఏడుపు వినిపించింది. కన్నవాళ్ళను, భార్యా బిడ్డలను కోల్పోయిన బాధలో ఓ వ్యక్తి గట్టిగా ఏడుస్తున్నాడు. అతని హృదయ వేదన ఆ యమధర్మరాజుకి కూడా కంటతడి తెప్పిస్తుంది.
చుట్టూ ఉన్న ప్రకృతి కూడా అతనికి ఏ విధమైన సహాయం చేయలేక ఐదు నిముషాలు పాటు నిస్సహాయంగా ఉండిపోయింది.
ఇంతలో మరొక వ్యక్తి అతని దగ్గరికి వచ్చి “ఒరేయ్ ఏమైందిరా, ఎందుకు ఏడుస్తున్నావ్?” అన్నాడు.
“అదేరా పొద్దున్న, పొద్దున్న ఏం జరిగిందో మర్చిపోయావా, ఇక ఈ రోజు నుండి నా వాళ్ళు నాకు కనిపించర్రా, నా భార్య, నా పిల్లలు, నను కనిపెంచిన తల్లి తండ్రులు అంతా అంతా..” అని మళ్ళీ ఏడుస్తున్న జవాన్ శ్రీహరితో, ఓదారుస్తున్న మరో జవాన్ బాలెందర్ నవ్వుతూ,
“ఒరేయ్, ఇప్పుడేం జరిగిందని అంతలా ఏడుస్తున్నావ్, నువ్వేమన్న పెళ్లికి వచ్చావా, పేరెంటానికి వచ్చావా, లేకపోతే సినిమా చూడటానికి వచ్చావా, ఆర్మీలో చేరిన రోజే మన ప్రాణం, సర్వం ఈ దేశం కోసమే అని ప్రమాణం చేసామురా మరిచిపోయావా?” అన్నాడు.
“అది కాదురా, పొద్దున్న పొద్దున్న..”
“అబ్బా పొద్దున్న, పొద్దున్న.. ఏం జరిగింది, వాడెవడో ఉగ్రవాది మన కళ్లు గప్పి మన పైన కాల్పులు జరిపిపోయాడు, దాంతో మనమో పది మందిమి పోయాం. అంతేగా, ఆ మాత్రం దానికి దిగులు ఎందుకురా, మన దేశాన్ని కాపాడుకోవటానికి ఇంకా కోట్లాదిమంది సైనికులు ఉన్నారు మన దేశంలో.”
“అది కాదురా, మా అమ్మా నాన్నకి నేను ఒక్కణ్ణే కొడుకుని, పాపం ఇప్పుడు వాళ్ళు, నన్ను పెళ్లి చేసుకున్న పాపానికి నా భార్య, తన కడుపులో పెరుగుతున్న..” అంటూ దుఃఖం ముంచుకురాగా.. మాట్లాడలేకపోయాడు శ్రీహరి.
“షటప్ రా, దేహం విడవగానే దేశభక్తి చచ్చిపోయిందా? మనం ఎవరి కోసం ఇచ్చాంరా ప్రాణం? మన తల్లి కోసం కాదా? దేశం కన్నా గొప్పది ఏముందిరా?” అని ఆగి
“నాకు మాత్రం, అంతెందుకు అక్కడ చూడు పొద్దున్న మనతో కాల్పుల్లో చనిపోయిన ఆ సైనికులకు మాత్రం కుటుంబాలు లేవా, మనం బాధ పడాల్సింది మనం చచ్చినందుకు కాదురా, ఆ ఉగ్రవాదిని చంపకుండా చనిపోయినందుకు”, అంటూ ఆపాడు బాలెందర్.
మళ్ళీ తనే మాట్లాడుతూ, “పర్లేదు, రేపో ఎల్లుండో మన మిత్రులు వాళ్లకు కాటిమార్గం చూపిస్తారు” అన్నాడు.
“అది కాదురా, నీకు నిజంగా బాధగా లేదా?” అడిగాడు శ్రీహరి.
“మళ్ళీ అడిగిందే అడుగుతావ్. భారత జవాను బాధపడేది, శత్రువులు తప్పించుకున్నప్పుడేరా, తొక్కలో ప్రాణం పోయినప్పుడు కాదు” అని ఆగి
“నీకు, పుట్టబోయే బిడ్డను చూసుకోవాలి అని కోర్కె ఉండుడు తోని, కొంచం మైండ్ డిస్టర్బ్ అయినట్టు ఉంది. గందుకే గిట్ల అంటున్నట్టు ఉన్నావ్. ఇదవరిదాంక ఒకటే తీరుగా ఏడిచినవ్. నీ ఏడుసుడు చూసి, ఆ దేవుడు కూడా పరేషాన్ అయి, నిన్ను మీ వోళ్ళతోని కల్పించి, మళ్ళీ తోల్కొని రమ్మని నన్ను పంపిండు. పద పోయొద్దాం మన ఊరికి.” అన్నాడు బాలెందర్.
“సారీ రా, నా వాళ్ళను కోల్పోయానే అని బాధ పడుతున్నాను కానీ, దేశం మొత్తం నాదే కదా అన్న విషయం మరిచిపోయాను. ఎటూ వెళ్లడం వద్దు, మీరంతా వెళ్లిన చోటికే వెళ్దాం పద” అన్నాడు శ్రీహరి.
“లేదు బ్రదర్. దేవుడు చెప్పిండు అంటే ఏదో కారణం ఉంటది. పద పోదాం మీ ఊరికి” అని తీసుకొని వస్తడు బాలెందర్.
***
హైదరాబాద్‌లో కె.పి.హెచ్.బి.లో రేషన్ షాపు దగ్గర బియ్యం కోసం నిలబడ్డ తన అమ్మని చూసి, శ్రీహరి బాలెందర్‌తో “అదేంట్రా నేను చనిపోయిన విషయం మా అమ్మకి ఇంకా తెలియదా, ఇలా రేషన్ షాప్ దగ్గర బియ్యం కోసం నిలబడి ఉంది” అన్నాడు.
“ఒరేయ్ నువు ఒక రోజులు, రెండు రోజులు కాదురా, దాదాపు 5 ఏళ్ళు ఏడిచినవ్, అంటే నువు చనిపోయి, సారీ మనం చనిపోయి 5 ఏళ్ళు అయింది. ఎంత కన్నతల్లి అయినా 5 ఏళ్ళ పాటు బాధతోనే ఉండదు కదరా. బాధ ఉంటుంది కాకపోతే దాన్ని గుండెల్లోనే పెట్టుకునే శక్తినీ, మరుపుని ఇస్తాడు రా దేవుడు. అందుకే మీ అమ్మ మాములుగా జీవితం గడుపుతుంది” చెప్పాడు బాలెందర్.
ఆ రేషన్ షాప్ వ్యక్తి “ఏందమ్మా నువ్వు, నీకు మొన్ననే చెప్పినగదా, ఇంకా బియ్యం రాలేదు అని. రోజూ ఎందుకు ఇట్ల వచ్చి ఒర్రిపిస్తవ్ నన్ను. మీ కొడుక్కి సర్కార్ నుండి బాగానే వచ్చుంటయి కదా పైసలు, ఇంకా ఎందుకు రేషన్ బియ్యం మీద పడి ఏడుసుడు” అన్నాడు.
“అది కాదయ్యా,ఇంకా ఆ డబ్బులు శాంక్షన్ కాలేదు. ఏవో ఫార్మాలిటీస్ ఉన్నాయి అంట” అంది శ్రీహరి తల్లి.
“అబ్బో, పైసలు వచ్చినోళ్ళు అందరు, ఆ వచ్చినయ్ అని చెప్పుతరు. సరే తి. పోయిన నెల బియ్యం ఉన్నాయి, కొంచపోతా అంటే కొంచపో, లేకపోతే ఇంకో వారం అయినాంక రా”
“లేదయ్యా, ఇంట్లో బియ్యం నిండుకున్నయ్, ఉన్నవేవో ఇయ్యి”
“సర్కార్ పైసలు అస్తూనే ఉంటయి, మళ్ళీ రేషన్ కార్డుల మీద బతుకుతరు. అన్ని మీకే పెట్టినంక పేదోళ్లకు ఏం మిగుల్తది” అన్నాడు రేషన్ షాప్ అతను.
“అది కాదయ్యా,ఇంకా రాలే పైసలు “ అని శ్రీహరి అమ్మ ఏదో చెప్పబోతుంటే
“ఆ సరే తీ మంచిది” అని పాత బియ్యం ఇచ్చి పంపించిండు.
తన తల్లితో అమర్యాదగా ప్రవర్తించిన షాప్ వ్యక్తి మీద కోపంతో శ్రీహరి అతన్ని కొట్టాలని చూడగా బాలెందర్ ఆపుతూ,
“బ్రో నీకు చెప్పడం మరిచిపోయిన, నీ వల్ల ఏ ఒక్క మనిషికి చిన్న దెబ్బ తగిలినా, నిన్ను వెంటనే తన దగ్గరికి తెచ్చేసుకుంటాను అని దేవుడు నాతో చెప్పాడు, ఈ లఫుట్ గాన్ని కొట్టి, నీ వాళ్ళను కలుసుకునే అవకాశం వదులుకుండు అవసరమా” అంటూ ఆపాడు.
శ్రీహరి వాళ్ళ అమ్మ వెళ్ళిపోయాక రేషన్ షాప్ వ్యక్తితో పక్కన మనిషి “ఈ నెల బియ్యం వచ్చినయి కదయ్యా, పాపం వానలో తడిసిన బియ్యం ఇచ్చి పంపుతవేంది ఆమెకి” అన్నాడు.
“మరి ఆ నానిన బియ్యం ఎవడి మొఖాన కొట్టాలి, నువు తింటవా, నను తినమంటవా, పండిన పంటలను భద్రపరుచుకోడానికి ఆ రైతులకే గోదాముల దిక్కులేక, నానిన పంటలు కొనండి మహాప్రభో అని ఆ మార్కెట్ యార్డ్ లలో రైతులు దళారుల కాళ్ళ మీద పడి ఏడుస్తుంటరు. మరి నాలాంటి డీలర్‌ల బాధలు ఎవరికి చెప్పుకోవాలే. మళ్ళీ నా మీదికి ఒక అధికారి వచ్చి, ఆ లెక్క ఏది, ఈ లెక్క ఏది, అని చిత్రగుప్తుని లెక్క తీస్తడు. వాడికివన్నీ ఇనిపించవు, కనిపించవు. నానిందిరా, మురిగిందిరా అంటే నమ్మడు. ఉల్టా నన్నే దొంగ, బ్లాక్‌లో అమ్మేటోడు అని అంటడు. వాడి లెక్క వాడికి చెప్పాలి. అందుకే ఆ మురిగిన బియ్యం ఇలాంటోళ్ల మొఖాన కొడ్తుంట. అయినా ఆమెకు చెప్పిన, కొన్నాళ్ళాగి రావమ్మా అని, ఇంటే గదా, ఖర్మ, ఉన్న ఒక్క కొడుకును కలెక్టర్‌నో, డాక్టర్‌నో, ఇంజనీర్‌నో చేయకుండా ఆర్మీకి పంపింది, ఆయనకేమో గాచారం బాగాలేక కాల్పుల్లో చచ్చిపోయిండు అంట. ఈమెకి సర్కార్ పైసలు అచ్చినయి అనే ఇన్నా, మరి ఈమెనేమో ఇంకా రాలేదనబట్టే, మరి నిజం ఏందో ఆ దేవునికే తెల్వాలె” అన్నాడు.
ఇదంతా విన్న బాలెందర్ శ్రీహరితో “చూసినవా, ఆయన బాధలు ఆయనకున్నాయ్. పద పోదాం, అమ్మ వెళ్ళిపోతుంది” అని తోల్కొని పోయిండు.
వెళ్లే దారిలో శ్రీహరి బాలెందర్‌తో – “అమ్మేంటి బ్రో, అలా అయిపోయింది. చాలా దిగులుగా ఉంది. బట్టలు కూడా పాతవి ఉన్నాయి, అయినా నాన్న తీసుకొని వెళ్తాడు కదా రేషన్ బియ్యం, అమ్మే వచ్చింది ఏంటి. శ్రీలక్ష్మి అయినా రావచ్చు కదా?” అన్నాడు.
ఇంకా ప్రశ్నలు మీద ప్రశ్నలు అడుగుతుంటే బాలెందర్ “బ్రో, వాళ్లకు వేరే పని పడి ఉందేమో, వెళ్తున్నాం కదా,అన్నీ కనుక్కుందాం పద” అన్నాడు.
వాళ్ళు వెళ్లే దారిలో ఓ సినిమా హల్ దగ్గర పెద్ద గొడవ జరుగుతోంది. రెండు గ్రూప్‌లు కొట్టుకుంటున్నాయి, ఒక్కో గ్రూప్‌లో ఐదు మంది. వాళ్ళ వయసు 16-22 మధ్య ఉంది.
“ఒరేయ్ మా హీరోనే ఎక్కిరిస్తవా రా, నీ హీరోనే వేస్ట్ గాడురా, వాడికి దాదాపు 10 ఏళ్ళ కెళ్ళి హిట్టే లేదు. ఇప్పటికీ ఇండస్ట్రీ హిట్ మా వోడిదేరా” అని ఓ గ్యాంగ్ అనడంతో, మరో గ్యాంగ్ లోని ఒకడు
“ఒరేయ్ ఇండస్ట్రీ హిట్, తొక్కలో హిట్, మా హీరోకి హిట్ లేకపోవచ్చురా, కానీ యాక్టింగ్‌లో మీ హీరో కన్నా మా హీరో వంద కాదు కాదు వెయ్యి రెట్లు నయంరా” అన్నాడు.
“తొక్కలో డబ్బా మొకం ఏసుకొని వాడో హీరో, వాడికి యాక్టింగ్ కూడానా”,
“నీ హీరో వాడి సినిమాల్లో కొత్త కొత్త హీరోయిన్ లను పెట్టి, వాళ్ళను బరువాతల చూపెట్టుకుంటా, ఐటమ్ సాంగ్‌లు పెట్టుకుంటా లాక్కొని వస్తున్నాడు, వాడో హీరోనా బే” అని ఒకరనొకరు గల్లా పట్టుకొని కొట్టుకుంటున్నారు.
ఆ దృశ్యం చూసిన శ్రీహరి ఆ గ్యాంగ్ లో తన చిన్నమ్మ కొడుకు సునీల్ ఉండటం చూసి బాలెందర్ తో “బ్రదర్ ఈ పిల్లగాడు, మా చిన్నమ్మ కొడుకు, స్కూల్‌లో టాప్ స్టూడెంట్. ఇదేంటీ ఇట్లా అయిపోయిండు” అని చెప్పి, వాళ్ళ మధ్యలోకి పోయి “అరేయ్ ఆగండిరా” అని ఆపబోయాడు.
“బ్రదర్ నువ్వు సారీ.. మనం వాళ్లకు కనిపించము” శ్రీహరితో చెప్పాడు బాలెందర్.
ఆ గ్యాంగ్‌ల గొడవ కొనసాగుతోంది.
“ఒరేయ్ దీంట్లో మా హీరో ఆర్మీ ఆఫీసర్ రా”
దాంతో, అవతల గ్యాంగ్‌లో ఉన్న శ్రీహరి తమ్ముడు “మీ వాడికి లవర్ క్యారెక్టరే సక్కగ చేయడానికి రాదు, ఇప్పుడు దీంట్లో ఆర్మీ ఆఫీసర్ అంట. బొంగులో” అని అంటుంటే,
వెంటనే ఓ పెద్దాయన వచ్చి సునీల్‌ని గట్టిగా కొట్టి, “అరేయ్ సునీల్, టెన్త్ అయిపోయి ఇంటర్ లోకి రాగానే కొమ్ములు వచ్చేసాయా, ఇలా థియేటర్‌లలో పడికొట్టుకుంటారా, సిగ్గు లేదు” అన్నాడు.
సునీల్ కోపంగా, “ఓయ్ నువ్వు మా స్కూల్ సార్‌వి కదా అని రెస్పెక్ట్ ఇచ్చి చెప్తున్నా, గమ్మున మూసుకొని పో, నీకెందుకు ఇవన్నీ” అన్నాడు.
“సార్‌కి భయపడ్డాడు, సార్‌కి భయపడ్డాడు” అంటూ అవతలి గ్యాంగ్ వాళ్ళు వెక్కిరించారు.
దాంతో సునీల్ గ్యాంగ్ వాళ్ళు ఆ సార్‌ని తోసేశారు. సార్ కిందపడిపోయాడు.
మెల్లగా పైకి లేచి నడుస్తూ బాధపడుతూ, “వీళ్ళ పెద్దమ్మ కొడుకు ఆర్మీ జవాన్ అయి, దేశం కోసం ప్రాణాలు అర్పిస్తే, వీడేమో ఇలాంటి చెత్త హీరోల కోసం, థియేటర్‌లలో గొడవ పడుతున్నాడు. టాప్ స్టూడెంట్ కదా అని నాలుగు మంచి మాటలు చెప్పిన పాపానికి, నన్ను ఇలా” అని వాపోయాడు
“ఛీ.. ఛీ.. సమాజం నాశనం అయిపోయింది. సినిమాలు, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, పార్టీలు, తాగుడు, తినుడు, ఎంజాయ్‌మెంట్, ఇవి తప్ప వేరే ఏవీ పట్టని యువతరం వచ్చేసింది. పాపం వీళ్ళ కోసం ఆ సైనికులు ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ, మంచు కొండల్లో జీవిస్తూ, అహోరాత్రాలు కష్టపడుతూ, దేశాన్ని కాపలా కాస్తారు. దేశం కోసం ప్రాణాలు అర్పిస్తారు. కానీ ఈ యువత అవేమి పట్టించుకోకుండా, వాళ్ళ త్యాగాలకు విలువ ఇవ్వకుండా, ఇలా నాశనం ఐపోతున్నారు. అసలు వచ్చే తరంలో దేశం కోసం బతికే సైనికుడు పుడతాడు అన్న నమ్మకమే లేకుండా పోతుంది వీళ్ళను చూస్తే” అని బాధపడుతూ వెళ్ళిపోయాడు.
అది చూసిన శ్రీహరి, బాలెందర్‌లు కూడా బాధపడ్డారు.
ఇంతలో శ్రీహరి అమ్మ కూడా ఏ తొవ్వలో పోయిందో కనిపించకుండా పోయింది.
శ్రీహరి, బాలెందర్‌తో “అమ్మ వెళ్లిపోయినట్టు ఉంది ఇంటికి, పద నేను చెప్తాను రూట్” అని తన ఇంటికి తీసుకొని వెళ్ళాడు.
అలా తన ఇంటికి వెళ్లి అక్కడ తన ఇంట్లో వేరే వాళ్ళు ఉండటం చూసి ‘మా ఇంట్లో వేరోళ్ళు ఉన్నారే, నాన్న, అమ్మ, శ్రీలక్ష్మి ఎక్కడ ఉంటున్నారు మరి. ఇల్లు అమ్మేశారా’ అని ఆలోచన చేస్తుండగానే,
ఆ ఇంటి ప్రస్తుత ఓనర్ ఫోన్‌లో ఒక వ్యక్తితో మాట్లాడుతూ, “ఏమాటకా మాటనే చెప్పుకోవలయ్యా, ఈ ఇంట్లోకి వచ్చి 2 ఏళ్ళన్నా కాలేదు కానీ, అన్ని శుభాలే. ఆ ఆర్మీ మనిషి చేసుకున్న పుణ్యమో, మరేందో కానీ, ఏ పని చేసిన కలిసస్తున్నాది. పట్టిందల్లా బంగారం ఐతున్నాది. కాకపోతే ఆ పిల్లగాడి కుటుంబమే ఆగమైందన్న బాదోటి మిగిలిపోయినాదప్పా” అని ఆగి
“ఆ ఏం అంటున్నావు, ఏమైనాదనా, ఈ ఇల్లు శ్రీహరి అని ఓ ఆర్మీ అతనిదిరా, పాపం ఆయన లడక్‌లో ఉగ్రవాదుల కాల్పుల్లో చనిపోయినాడు. సొంత ఇల్లు కూడా లేకుండే ఆయనకి, ఉన్న ఈ ఇంటికి బ్యాంకు లోన్‌లు కట్టాల్సి ఉండే. ఆయన అలా చనిపోయిన తరువాత వాళ్ళ నాయన, బ్యాంకు వాళ్లతోని మాట్లాడి, ప్రభుత్వం నుండి డబ్బులు రాంగానే ఇచ్చేస్తాం అని, కొన్నాళ్ళు బ్యాంకోళ్లను ఒప్పించినాడు. కానీ పాపం ఆయన కూడా అర్దాంతరంగా చనిపోవడంతోని, ఆ పిల్లగాని అమ్మ, భార్య, 3 ఏళ్ళ కొడుకు ఇల్లు ఖాళీ చేసి, ఇదే టౌన్ స్లం ఏరియాలో కిరాయి ఇంటికి పోయుండారు పాపం” అని చెప్పాడు.
అవతలి వ్యక్తి ఏదో అడిగినట్లున్నాడు.
“ఏంటి, వాళ్ళ నాయిననా, జబ్బుతో కాదురా, ఆయన ప్రయివేట్ స్కూల్లో సోషల్ టీచర్, ఉదయం స్కూల్‌కి వెళ్దాం అని స్కూటీ మీద పోతుంటే, ఎవడో దొంగ నా కొడుకు, బాగా తాగి, రాంగ్ రూట్‌లో రాష్ డ్రైవింగ్ చేసి, వారి చావుకి కారణం అయినాడు. ఆ శ్రీహరి లాంటి పిల్లగాళ్లేమో, దేశం కోసం ప్రాణాలు ఇస్తుంటే, ఈ నా కొడుకులు తాగి తందానాలు ఆడుకుంట అమాయకుల ప్రాణాలు తీస్తున్నారు. ఈళ్ళు కూడా ఉగ్రవాదులేరా, ఈళ్ల నుండి కూడా దేశానికి రక్షణ కావాలే” అన్నాడు.
శ్రీహరికి మొత్తం విషయం అర్థమై భోరున విలపిస్తూ ఉండగా బాలెందర్ ఓదారుస్తూ “ఒరేయ్ ఏడవకురా, నీ కష్టం చూస్తే నాకూ ఏడుపస్తుంది. కానీ..” అంటూ ఆపాడు.
“కాదు బ్రో, నాన్న, నాన్న చనిపోయాడంట. నన్ను అల్లారుముద్దుగా పెంచి పెద్ద చేసిన నాన్న, ఆక్సిడెంట్‌లో చనిపోయాడంటరా. పాపం దెబ్బలు ఎంత గట్టిగా తగిలి ఉంటాయో. అయినా ఆక్సిడెంట్‌లో మనిషి చావడం ఏంటిరా, ఆ మాత్రం చూసి నడపలేరా బ్రో” అన్నాడు.
బాలెందర్ బాధపడుతూ, “యేటా లక్షల్లో జనాలు ఆక్సిడెంట్‌లలో చనిపోతున్నారు బ్రదర్. దాంట్లో అధిక శాతం మద్యం మత్తులో డ్రైవింగ్ చేసి చచ్చేవాళ్ళు, రాంగ్ రూట్‌లో వాహనం నడిపి ఇతరుల చావుకు కారణం అయ్యేవాళ్ళే ఎక్కువ. ఇగ రాత్రి పూట అధిక వేగంతో వెళుతూ, ఆగి ఉన్న భారీ వాహనాలను ఢీ కొని చనిపోయేవాళ్లు కూడా చాలామంది. ప్రభుత్వాలు ఎంత అవగాహనా కల్పించినా వీరిలో మార్పు రావడం లేదు బ్రదర్” అన్నాడు.
“బ్రో వీళ్ళ ప్రాణాలు రక్షించడం కోసమే కదా, మనం తిండి నిద్రలు మాని, రేయింబగళ్ళు దేశ సరిహద్దుల్లో కాపలా కాసేది. ఇలా ఇంత నిర్లక్ష్యంగా ప్రాణాలు కోల్పోయే వాళ్ళ కోసం ఎందుకు బ్రో, మనం గడ్డకట్టే చలిలో పహారా కాయడం” అన్న శ్రీహరిని ఓదారుస్తూ
“బాధపడకు బ్రదర్, ముందు మీ అమ్మగారు, శ్రీ లక్ష్మి ఎక్కడున్నారో చూద్దాం పద” అని తీసుకొని వెళ్ళాడు బాలెందర్.
***
కె.పి.హెచ్.బి. స్లమ్ ఏరియాలో ఓ రేకుల ఇంట్లో వంట చేస్తున్న శ్రీహరి అమ్మ, శ్రీహరి భార్య శ్రీలక్ష్మితో – “నువ్వేం బాధ పడకమ్మ, నీకు నయం కాగానే, నీకో మంచి పిల్లగాన్ని చూసి పెళ్లి చేయిస్తాను” అంది.
అనగానే శ్రీలక్ష్మి పిచ్చి పిచ్చిగా నవ్వుతూ “అయ్ పెళ్లి చేస్తావా, కానీ నేను శ్రీహరినే చేసుకుంట, ఐ లవ్ శ్రీహరి. నాకు మీ ఆస్తి అంతస్తులు ఏమీ వద్దు. మీ కులాలు, గోత్రాలు తీసుకొని మీ ముక్కుల్లో పెట్టుకోర్రి, నా శ్రీహరి జవాన్. అంటే అన్ని కులాలకు, మతాలకు బంధువు. మీరు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా నేను శ్రీహరినే చేసుకుంటా” అంది.
ప్లేట్‌లో అన్నం కలిపి తెచ్చి తినిపిస్తూ “సరేనమ్మా, శ్రీహరి తోనే నీ పెండ్లి చేస్తాను, నా బుజ్జి కాదు, ఓ బుక్క తినమ్మా” అని తినిపించింది అత్తగారు.
వెంటనే శ్రీలక్ష్మి “ఏయ్ నాకే తినిపిస్తావా, నా చిన్ని జవాన్ శ్రీహర్షకి తినిపియ్యవా” అని పక్కనే చేతిలో గన్‌తో ఆడుకుంటున్న శ్రీలక్ష్మి కొడుకుతో
“ఏయ్ స్మాల్ జవాన్, తిను” అని అనగానే శ్రీహర్ష గన్‌తో “డుశుం, డుశుం” అన్నాడు.
శ్రీహరి అమ్మ శ్రీహర్షకి ముద్దపెట్టగానే “నాన్నమ్మ నేను కూడా నాన్న లాగా గన్ పట్టుకొని జవాన్ ఐతాను” అన్నాడు.
నాన్నమ్మ ఏడుస్తూ “సరేనమ్మా” అంది.
శ్రీలక్ష్మిని అలా చూసిన శ్రీహరి ఒక్కసారిగా కుప్పకూలిపోయి ఏడుస్తూ “ఇది చూడటానికా బ్రో, ఆ దేవుడు నన్ను నీ ఎంబడి ఇక్కడికి పంపిచ్చింది, అయ్యో అయ్యో ఎమ్.ఎస్.సి. గోల్డ్ మెడలిస్ట్ బ్రో తను. 6 ఏళ్ళ ముందు వాళ్ళ యూనివర్సిటీలో ఆర్మీకి సంబంధించిన ఓ సెమినార్ సందర్బంగా మా పరిచయం జరిగి, ప్రేమగా మారింది. మా కులాలు వేరే, నేను తక్కువ కులంవాన్ని అని, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోతే, దేశం కోసం పోరాడే జవాన్‌కి కులం ఏంటి అని, ఇంట్లో వాళ్లతో తెగదెంపులు చేసుకొని నా కోసం వచ్చేసింది బ్రో. అయ్యో, వాళ్ళ అమ్మా నాన్నల మాట వినుంటే, ఎంత గొప్ప జీవితాన్ని పొంది ఉండేదో. అంతా నా వల్లే, అంతా నా వల్లే. ఛీ, ఏ హోటల్ లోనో కప్పులు కడిగే ఉద్యోగం చూసుకున్నా, కుటుంబంతో సంతోషంగా ఉండేవాణ్ణి. దేశం కోసం బతకాలి అనుకున్న పాపానికి..” అని ఏడవసాగాడు.
ఇంతలో శ్రీలక్ష్మి వాళ్ళ అమ్మ అక్కడికి వచ్చింది. శ్రీహరి అమ్మతో “కన్న కూతురును ఇంట్లో ఉంచుకోలేని దరిద్రురాలిని వదినా, ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో, అత్తవైనా అమ్మలాగా చూసుకుంటున్నావు, అత్యాచారానికి గురైన కూతురును ఇంట్లో పెట్టుకుంటే, ఇంకో ఇద్దరు కూతుళ్ల భవిష్యత్ ఆగం ఐతుందని ఈ పిచ్చిదాన్ని వదిలి పెట్టానే గాని, దీని మీద ప్రేమ లేక కాదమ్మా. కులం కులం అని చూడకుండా, అల్లుడుగారికి అలా అయ్యాకయినా మిమ్మల్ని మా ఇంటికి తెచ్చుకొని ఉంటే, ఇంత ఘోరం జరగకపోయి ఉండేదేమో” అంది.
అనగానే ఆ మాటలు విన్న శ్రీహరికి అసలు ఏం జరుగుతోందో అర్థం కాకుండా పోయింది, పక్కనే ఉన్న బాలెందర్ కూడా షాక్‌కి గురయ్యాడు.
శ్రీహరి “అత్యాచారం, అత్యాచారమా, అయ్యో భగవంతుడా” అని దుఃఖించాడు.
శ్రీహరి అమ్మ శ్రీహరి అత్తగారితో “దాంట్లో నా తప్పు కూడా ఉంది వదినా. మావారు తన కొడుకు ఇష్టంగా కొన్న ఇంటిని కాపాడుకోవడం కోసం, ప్రభుత్వం నుండి వచ్చే నష్టపరిహారం తెచ్చయినా దాన్ని కాపాడుకుంటాను అని, ఏళ్ళ పాటు ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరిగారు. ఆక్సిడెంట్‌లో ఆయన చనిపోయాక అయినా ప్రభుత్వం నుండి వచ్చే నష్టపరిహారం గురించి మరిచిపోవలిసింది. ఎమ్.ఎస్.సి. గోల్డ్ మెడలిస్ట్‌గా మంచి కాలేజీలో లెక్చరర్ ఉద్యోగం చేస్తున్న శ్రీలక్ష్మిని కూడా ఆ విషయం మరిచిపోమని గట్టిగా చెప్పి ఉండాల్సింది. ఒక జవాన్ త్యాగానికి ఈ దేశం ఇచ్చే ఆ పరిహారం డబ్బులు కోసం ఒక రాజకీయ నాయకుడిని కలిసిన పాపానికి, ఆ నాయకుడి కొడుకు..” అని ఆగి ఏడుస్తూ
“ఆడదంటే శృంగార వస్తువేనా, వీళ్లకు అమ్మ, చెల్లి, అక్క, అత్త ఎవరు ఉండరా, ఓ కాలేజీ లెక్చరర్‌కి కూడా రక్షణ లేదా ఈ దేశంలో” అని ఏడ్చింది.
“ఇది నా ఒక్క కూతురు కష్టం కాదు వదినా, ఈ దేశంలో పుట్టిన ప్రతి సామాన్య ఆడబిడ్డా ఈ గండంలో పడింది. డ్రగ్స్, గంజాయి మత్తులో తూగుతు, టివిలు, ఇంటర్నెట్‌లు నేర్పుతున్న విశృంఖలత్వంలో ఈ మగాళ్ళు మృగాళ్ళళా తయారయ్యారు. అమ్మా, అక్కా వరసలు తెలియని జంతువుల్లాగా, ప్రతి ఆడపిల్లను వక్ర బుద్ధితో చూడటం నేర్చుకుంటున్నారు. నా కూతురికి జరిగిన అవమానమే, ఈ దేశంలో ప్రతి రోజు ఏదో ఓ మూల ఓ ఆడకూతురుకి జరుగుతూనే ఉందమ్మా, ఈ సిగ్గులేని ప్రభుత్వాలకి చీమ కుట్టినట్టు అయినా లేదు. భారతమాత అని కీర్తించే ఈ దేశంలోని నేతలు, డబ్బులిస్తే వారి ఇంట్లో ఆడోళ్ళను కూడా..” అని ఓ క్షణం ఆగి,
“అంతకు మించిన దరిద్రులు కూడా ఉన్నారమ్మా, ఇలాంటి లుచ్చా లఫంగి నా కొడుకులకి రక్షణ ఇవ్వడం కోసమా నా అల్లుడు లాంటి వాళ్ళు దేశానికి కాపలాగా నిలుస్తున్నారు” అంది శ్రీహరి అత్త.
బదులుగా శ్రీహరి అమ్మ “అవున వదినమ్మా, దేశంలో ఎక్కడ చూడు అవినీతి, అన్యాయం, స్త్రీల మీద అఘాయిత్యాలు, సామాన్యుల మీద దాష్టికాలు, బాధ్యత లేని పౌరులు, బుద్ధి లేని అధికారులు, సిగ్గు శరం లేని రాజకీయ పార్టీలు..” అని ఆగి
“గుంతల రోడ్లు, తెరిచి ఉన్న మాన్‍హోల్‌ల వల్ల ముక్కుపచ్చలారని చిన్నారులు ప్రాణాలు కోల్పోతుంటే, స్లమ్ ఏరియాలలో కూటికి గుడ్డకు ఏడుస్తూ జనం పశువుల్లా బతుకుతుంటే, మద్దతు ధర లేక రైతులు, ఉద్యోగాలు లేక యువత ఆత్మహత్యలు చేసుకుంటుంటే, స్త్రీలు రక్షణ లేక రాక్షసుల చేతిలో నాశనం ఐతుంటే నిమ్మకు నీరెత్తినట్టుండే ఈ పార్టీస్వామ్యం కోసం నా కొడుకును బలి చేసినందుకు సిగ్గు పడుతున్నాను అమ్మా. సిగ్గుపడుతున్నాను” అంది.
ఇంతలో ఇద్దరు అధికారులు డబ్బులు తీసుకొని వచ్చి శ్రీహరి అమ్మకి ఇచ్చి “ఇదిగోండమ్మా, మీ అబ్బాయి డబ్బులు. దీనికోసం ఐదేళ్ల పాటు ఓ లొల్లి లొల్లి చేస్తిరి. మెల్లగా రాకపోదునా పైసలు” అన్నారు.
వాళ్ళల్లో ఒకడు శ్రీలక్ష్మిని చూపిస్తూ “ఇదిగో ఈ పిచ్చిదాన్ని చూసుకొని అపోజీషన్ పార్టీ వాళ్ళు, మా సార్‌ని బద్నామ్ చేద్దాం అని ప్లాన్ ఏసిర్రు. గాళ్ళతోని కలిసి మీరు గడిబిడి పంచాయతీలు పెట్టుకుంటా కూసోకుండా, గమ్మున ఈ పైసలు తీసుకొని ఏదన్నా ఊరు ఎల్లిపోయి మంచిగ బతుకుర్రి, అయ్యిందేదో అయిపోయింది, న్యాయం బీయం ఆంటే ఏమస్తది, మా సార్ జైల్లో పడితే నీ కోడలకి పిచ్చి తగ్గుతదా, లేకపోతే నీ కోడలు శీలవంతురాలు ఐతదా హ హ” అంటూ నవ్వాడు.
“కాబట్టి గమ్మున ఈ పైసలు తీసుకొని, సార్ తోని ఫోటో దిగి, హాయిగా ఏదన్నా ఊర్లో పోయి బతుకుర్రి సరేనా” అన్నాడు ఇంకోడు.
శ్రీహరి అమ్మ “సరే బాబు, నీ కోసం, నీ నాయకుడి కోసం కాదు, నా కోడలు, మనుమడి కోసం నీ మాట ఇంట. మీరన్నట్టే ఊరు ఇడ్సి ఎల్లిపోతాం” అని చెప్పగానే వాళ్ళు పైసలు ఇచ్చి వెళ్ళిపోయారు.
శ్రీహరి అమ్మ శ్రీహరి ఫోటో చూస్తూ “చూసినావ్ రా కొడకా, గిట్లుంది దేశం. న్యాయం కోసం పోరాటం చేద్దాం అనిపిస్తుంది. కానీ ఇప్పుడు నాకు మద్దతుగా ఉన్న ఆ అపోజీషన్ వాళ్లలో సగం మంది అధికార పార్టీ లోకి జంప్ కావడానికి సిద్ధంగా ఉన్నార్రా. ఆ మిగిలిన వాళ్ళు కూడా నాలుగు రోజులు నన్ను, నీ త్యాగాన్ని వాడుకొని, ఆ తరువాత ఏదో సెటిల్‌మెంట్ చేసుకొని, సైలెంట్ అయిపోతార్రా. అందుకే డబ్బులు తీసుకుంటున్న బిడ్డా. మగ దిక్కు లేని ముస్సలిదాన్ని, ఇంతకన్నా ఎక్కువ ఏం చేయలేనురా. నన్ను నమ్ముకొని ఓ పిచ్చిది, ఓ చంటి పిల్లాడు ఉన్నార్రా. నువ్వే గనక నిజమైన దేశభక్తుడివి ఐతే ఈ నా వెధవలు అంతా నాశనం అయిపోతార్రా. నాలాంటి సామాన్యుడికి శాపనార్థాలు పెట్టే స్వాతంత్య్రం తప్పా ఇంకేమి రాలేదురా ఈ దేశంలో” అని ఏడవసాగింది. శ్రీహరి అత్త ఆమెను ఓదార్చసాగింది.
ఇదంతా చూస్తున్న శ్రీహరి, బాలెందర్‌తో “బ్రదర్ ఒక్క అవకాశం ఇస్తే, ఈ నా వెధవలందరికి బుద్ధి చెప్పుత, నా భార్య శీలానికి రేటు కట్టిన ఆ దొంగ నాయకుడిని నడిరోడ్డు మీద ఉరితీస్తా, దారి తప్పిన పౌరులను చేతిలో ఎకె47 పట్టుకొని దారిలోకి తెస్తా. ఆడపిల్ల వైపు కన్నెత్తి చూడాలంటేనే భయపడే సమాజాన్ని తీసుకొని వస్తా. ఒక్క ఛాన్స్ బ్రో. ఆ దేవుణ్ణి రిక్వెస్ట్ చేయవా ప్లీజ్” అన్నాడు.
వెంటనే బాలెందర్ దేవుని లాగా మారిపోయి, “యస్ బ్రదర్. ఇందుకోసమే నిన్ను ఇక్కడిదాకా తీసుకొని వచ్చింది. వెళ్ళు నీ దేశాన్ని రక్షించుకో, బోర్డర్ దాటిన ఉగ్రవాదులనే కాదు, బాధ్యతలు మరిచిన నీ పౌరులకు కూడా బుద్ధి చెప్పు. జవాన్ అంటే జీతగాడు కాదురా, ఈ దేశం రక్షణ కోసం ప్రాణాలు ఇస్తున్న వీరుడు అని ఈ ప్రజలకు, పాలకులకు, అధికారులకు కనువిప్పు కలిగించు. మీ ప్రాణాల రక్షణకై ప్రతి రోజూ వేలాది జవానులు సరిహద్దుల్లో కాపలా కాస్తుంటే, వందలాది జవాన్‌లు ప్రాణత్యాగం చేస్తుంటే, మీరేమో ప్రాణం విలువ తెలుసుకోకుండా, బాధ్యతలు మరిచి, కులం కోసం, మతం కోసం, హీరోల కోసం కొట్టుకొని చస్తారా? చిన్న చిన్న విషయాలకు ఆత్మహత్య చేసుకుంటారా? మద్యం మత్తులో తూగుతూ అమాయకుల ప్రాణాలు తీస్తారా? అని ప్రశ్నించి ఆ వెధవలకు బుద్ది వచ్చేలా చెయ్! స్త్రీల పై హింసకి పాల్పడుతున్న మృగాలను నరికి అవతల పారేయ్. ఈ యజ్ఞానికి అవసరమయ్యే ఆయుధ సామాగ్రిని, శక్తియుక్తులన్నీ నీకు ధారపోస్తున్నాను. వెళ్ళు” అని పంపించాడు.