Site icon Sanchika

ఆ వయసంతే

[శ్రీమతి మంగు కృష్ణకుమారి రచించిన ‘ఆ వయసంతే’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]సు[/dropcap]శీల చేతిలో ఆమె ఏడో క్లాసు చదువుతున్నప్పటి స్కూల్ ఫొటో ఉంది. కిందన ఆడపిల్లలూ.. కుర్చీల్లో టీచర్లూ, హెడ్ మాష్టరుగారూ, వెనకాల అబ్బాయిలూ.. ఏవో సామాన్లన్నీ సద్దుతూ ఉంటే పాతఫొటో దొరికింది.

మనసులో ఆ ఫొటో తీసినప్పటి వయసూ, అల్లరిమాటలూ, భయాలూ, మోమాటలూ, తలపుకి వచ్చేయి. ఆ రోజుల్లో తనూ, తన స్నేహితురాళ్ళూ ఎలా ఉండేవారో, తమ మధ్య జరిగే సంభాషణలూ, తలపుకి వస్తే, ఇప్పుడు నవ్వాగదు. అయినా ఆ లేత వయసూ, అప్పటి పరిస్థితులూ, స్కూలు వాతావరణంకి, అందరూ అలాగే ఉండేవారు అని కూడా అనిపిస్తూ ఉంటుంది. సుశీల కళ్ళ ముందు అప్పుడు జరిగినవన్నీ వలయాల్లా తిరుగుతున్నాయి.

హైస్కూల్లో:

ప్లే గ్రౌండ్‌లో ఆడపిల్లలు ఒక పక్కా, మగపిల్లలు మరో పక్కా నిలబడి ఉన్నారు. స్కూల్‌కి ఇనస్పెక్టర్ వస్తార‌ని, స్వాగతం చెప్పడానికి అందరి‌నీ గ్రౌండ్‌లో సమావేశపరిచేరు హెడ్మాష్టరుగారు.

ఇనస్పెక్టర్ రాలేదు కానీ, జల్లులు జల్లులుగా వాన మొదలయింది.

ఎనిమిదీ, తొమ్మిదీ క్లాసుల్లో ఆడపిల్లల్లో ఎక్కువమంది, లంగా జాకెట్టుతోనే ఉన్నారు. నలుగురయిదుగురు ఆడపిల్లలు మాత్రం వోణీ వేసుకుని ఉన్నారు. వానజోరు ఎక్కువ అయేటట్టు ఉంది. లంగా జాకెట్టుతో ఉన్న పిల్లలకి మనసులో భయంతో వణుకు వస్తున్నాది.

‘ఛీ ఛీ.. ఇందరు అబ్బాయిలు ఉండగా వానకి తడిసిన ఈ బట్టలతో ఎలా?’ మనసులో భయం ఉన్నా, కదలాలన్నా భయమే. ఏమో కదిలితే టీచర్లేమంటారో?

సుశీల, విజయభారతి చెవిలో నెమ్మదిగా అంది. “సిగ్గుతో ప్రాణం పోయేటట్టుందే, ఏం చేద్దాం?” విజయభారతి మిర్రి మిర్రి చూసింది.

“నా పరిస్థితి కూడా అదేనే.. కాసేపు ఓర్చుకోకపోతే ఎలా?”

ఇంతలో అతిథి రావడం, అందరూ బిజీ అవడం జరిగింది. పిల్లలందరినీ వాళ్ళ క్లాసురూముల్లోకి పంపించేసేరు.

ఎనిమిదీ, తొమ్మిదో క్లాసు చదివే ఆడపిల్లలకి విచిత్రమయిన స్థితి ఈ వయసు. భయం, ఆత్రం, సిగ్గూ తెలీని కుతూహలం ఇన్నీ కమ్మేసి ఉంటాయి. ముఖ్యమైన పెద్దమార్పు ఏ రోజు వస్తుందో తెలీదు. అప్పటిదాకా, లంగా జాకెట్టూతో తిరిగే పిల్లలు మీదన వోణీలు వేసుకోడం మొదలెట్టాలి.

సరోజకి సిగ్గు. అప్పటిదాకా లంగా జాకెట్టుతో వచ్చి, ఒక్కసారి వోణీతో ఎలా రావాలి? ఈ అబ్బాయిలు కూడా ఉంటారు. ఎలా?

పెద్దమనిషి అవడం. ఈ ప్రహసనం అందరిలోనీ ఒక దడ కలగచేస్తుంది.

కొంతమంది పిల్లలకి అంటే ఏమిటో తెలీదు. తెలిసిన పిల్లలు తెలీనివాళ్ళకి చెవిలో గుసగుసలు. నమ్మశక్యం కానట్టు వీళ్ళ వెర్రి చూపులు. “విమల రోజూ రాటం లేదేం?” ఇంగ్లీషు సారు అడిగేసరికి, సక్కూబాయికీ, కృష్ణలీలకీ బిపి పెరిగిపోయింది. విమలకి మూడోరోజు. మర్నాడు వాళ్ళింట్లో అట్లబంతిట.

ఇలాంటివి ఎలా చెప్తారు? ఇద్దరూ కొయ్యకట్టినట్టు ఉండిపోయేరు.

మర్నాడు ఆడపిల్లలందరూ మీట్ పెట్టుకున్నారు. చంద్రకళ “ఏవే, ఇలాటివి అవడానికి ముందే, మా ఇంట్లో వోణీల ఫంక్షన్ అని చేసిస్తారే” అంది.

“దేనికీ..?” ఆసక్తిగా అడిగింది పద్మప్రియ.

“ఏమోనే, మా అక్క అప్పుడు మా అమ్మ “ఈ పిల్లలు ఏ దుర్ముహుర్తాన సమర్తాడిస్తారో.. మంచిరోజు చూసి వోణీ వేయించీయాలి వదినా” అని పక్కింటావిడతో అంటోంది.

“ఛీ సిగ్గమ్మా.. అలాటి మాటలు ఎలా అంటారే” సిగ్గుతో మెలికలు తిరిగింది వసంతలక్ష్మి. సుశీలకి కూడా సిగ్గువేసింది.

“ఛ అంత ముతక మాటలేమిటే?” అంది.

“ఓసీ.. మా మామ్మ దగ్గర ఇంకా ‌ముతక మాటలు విన్నానే” ఆరిందాలా అంది జగదంబ.

“పెద్దవాళ్ళు అంటే అన్నారులేవే..‌ మనం ఎందుకు అనడం? మా అమ్మ మమ్మలని ఇలాగే కోప్పడుతుంది. ‘మేం పెద్దవాళ్ళం, అంటే అంటాం. మీరెందుకు ముదిమాటలు ఆడతారు?’ అని” ప్రమీల కూడా వాళ్ళమ్మ లాగే చేతులు తిప్పింది.

రెండు రోజుల్లో విమల తలనిండా పూలతో, కొత్త లంగా జాకెట్టూ, మీదన వోణీతో వచ్చింది. సుశీలా, విజయభారతీ ఒకళ్ళ మొహం ఇంకొకళ్ళు చూసుకున్నారు. విమలకూడా ఆ రోజంతా సిగ్గుపడుతూ ఎవరి మొహం చూడకుండా, నోట్సులో మొహం దాచుకొని తిరిగింది.

వారం తిరక్కుండా ఆడపిల్లలకి మరో కబురు. సత్యవాణి పెద్దపిల్ల అయిందిట.

వాళ్ళమ్మ క్లాసు పిల్లలందరినీ, పేరంటానికి రమ్మని కబురు పెట్టింది. “మా అమ్మ పంపిస్తేనే వస్తాం” ఇంచుమించు అందరూ అదే కబురు సత్యవాణికి పంపేరు.

ఇంకా పెద్దపిల్ల అవని ఏ అమ్మాయినీ ఈ పేరంటానికి పంపడానికి వాళ్ళ అమ్మలు అనుమతించలేదు.

మర్నాడు సత్యవాణి ఇంటికి వెళ్ళిన ఇద్దరు పెద్ద పిల్లలు అక్కడి కబుర్లన్నీ ఉత్సాహంగా చెప్పడం మొదలెట్టేరు.

లక్ష్మీదేవి ఉత్సాహంగా “ఏమర్రా, వాణి వాళ్ళింట్లో అచ్చం మా ఇంట్లోలాగే చేసేరు.‌ వసంతంలో చేతులు ముంచి, వెనక్కి చూడకుండా గోడమీద వేయించేరు” అంది.

“అలా ఎందుకే?” ఆసక్తిగా అడిగింది విజయభారతి.

ఆరిందా జగదంబ టకటకా జవాబు చెప్పేసింది. “అలా చూడకుండా వేసినపుడు, కుదురుగా వస్తే పెళ్ళి జరిగిన రోజు వానపడి ఇబ్బంది రాదుట.”

లక్ష్మీదేవి చిరుకోపంగా జగదంబని చూసి అంది “అదే అనుకో.. నేను చెప్పేదాన్నిగా, నీకు తెలుసా, వాణికి మూడు రోజులూ పులగం, పరమాన్నం మాత్రమే పెడతారు.”

జగదంబ భుజాలు కదిపింది. “మా మామ్మా అంతే” అంటూ వింటున్న ఆడపిల్లల మొహాల్లో సన్నటి సిగ్గురేఖలు. మధురమయిన పులకింతలు కూడా.

మర్నాడు క్లాస్ టీచర్ క్లాసులో అబ్బాయిలని హెడ్ మాష్టారు డ్రిల్‌కి రమ్మంటున్నారని పంపి, ఆడపిల్లలకి ఒక క్లాసు తీసుకుంది. ఘల్లు ఘల్లుమనేలా గజ్జెలు పెట్టుకోడం మానీయాలంది. అన్నిటికన్నా ఆడపిల్లలు

పెద్దవుతున్నారు కాబట్టీ, ఇంక అందరూ ఓణీలు వేసుకోవలసిందే అని వార్నింగ్ ఇచ్చింది.

అమ్మాయిలు గడ్డకట్టినట్టు చూస్తూ ఉండిపోయేరు. టీచర్ వాళ్ళ సందేహం గమనించి అన్నాది. “భయపడకండి. మీ పేరెంట్స్‌కి మేం నోటీసు పంపుతాం. మీరు పట్టుకెళ్ళి ఇవ్వండి చాలు”

టీచర్లు చెప్పిన విషయమో ఏమోగానీ, దాదాపు పదిహేనుమంది అమ్మాయిలు ఒకే రోజు వోణీలతో వచ్చేరు. అలా అలా టెంత్‌కి వచ్చేసరికి అందరూ లంగా వోణీలకి అలవాటు పడి చిలకల్లా వచ్చేవారు.

టెంత్‌కి రాడానికి ముందే ఆడపిల్లలకి మరో కొత్త సమస్య వచ్చింది. ప్రసన్న కళ్ళనీళ్ళు పెట్టుకుంటూ “ఈ సెలవల్లో‌ నా పెళ్ళే..” అంది. అందరూ మళ్ళా రకరకాల చర్చలు.

“కాదే మా తాతగారు కూడా, మా నాన్నతో ‘మన ఉమకి సంబంధాలు చూడవట్రా’ అంటున్నారు. మా నాన్న ‘టెంత్ లో చూద్దాం లే’ అనేసేడు” ఉమ.

“నాకయితే చదువుకోవాలని ఉందే” ఇందిర. ఒకొక్కళ్ళూ ఒక్కోమాట చెప్పేరు.

టెంత్ సీరియస్‌గా చదవాలని, టీచర్ల వార్నింగులూ.. ఇంట్లో పెద్దల మందలింపులూ కొంచెం రోజులు సాఫీగా నడిచినా ఒకరోజు పోస్ట్‌మేన్ ఒక ఉత్తరం పట్టుకొచ్చి “ఇక్కడ ఇందిర ఎవరండీ.. ఆమెకే ఉత్తరం” అన్నాడు.

ఇందిర లేచి కవర్‌లో ఉన్న ఫ్రమ్ ఎడ్రస్ చూసి, ఇంగ్లీష్ మాష్టారితో “మాష్టారూ ఈ ఉత్తరం మీద ఉన్న ఫ్రమ్ ఎడ్రస్ ఎవరో నాకు తెలీదండీ.. నాకీ ఉత్తరం వద్దు” అని చెప్పింది. మాష్టారు పోస్టుమేన్‌కి ఉత్తరం తిరిగి ఇవ్చేసి “ఈసారి ఆడపిల్లలకి ఎవరికి ఉత్తరం వచ్చినా హెడ్ మాస్టర్ గారికి ఇచ్చీ. మీ డిపార్ట్మెంట్‌కి మేం లెటర్ పెడతాంలే” అన్నారు.

ఆ మర్నాడు అందరూ ఆ విషయం మీద కాసేపు చర్చించేరు. ఇందిర కళ్ళనీళ్ళు పెట్టుకుంటూ “నాకేమో చదువుకోవాలని ఉంది.. ఇలా ఉత్తరాలు తెలీనివాళ్ళు రాస్తే, మా అమ్మ ఇప్పుడే చదువు మానీమంటుంది.”

విజయభారతి “మా ఇంట్లో ‘పాసయితే కాలేజీ లేకపోతే మేరేజీ’ అని మా నాన్న, అన్నయ్యా డిసైడ్ చేసేరే..” అంది దీనంగా.

“కాదే.. మనం చదువుకుంటాం అని పట్టుపడితే, చదివించరా” అంది వాసుకి సాలోచనగా.. చూసినా, అందరూ ఖండించేరు.

“మీరు ఈ ప్రాంతం కాదు కదే.. మీకు తెలీదు. నా పెళ్ళి‌ మా బావతో కుదిరిపోయింది. మా అత్త ‘దాన్ని టెంత్ దాకా చదివించండర్రా’ అనబట్టీ చదువుతున్నాను” అంది సరళ.

విజయభారతి సుశీలతో, “ఏమే మీ నాన్నగారికి చదువులంటే చాలా ఇష్టం అంటావు కదే.. చదువుకుంటావా?” అంది.

సుశీల బిక్కమొహం వేసింది. “ఏమోనే, మా అమ్మ ఏమంటే అదే అవుతుంది” అంది.

సగంమంది అమ్మాయిలు చదువు ఆపీడమే అన్నారు. నలుగురు తప్పనిసరిగా చదివితీరతాం అన్నారు.

మిగతా అందరూ ‘పాసయితే కాలేజీ, లేకపోతే మేరేజీ’ అని వాళ్ళే ఒప్పేసుకున్నారు.

ఒక్కళ్ళు కూడా ‘మనకి లేడీ టీచర్లు ఉన్నారు కదా.. ఆ రోజుల్లో వాళ్ళు చదువుకొని ఉద్యోగంకి వచ్చేరు కదా, మనం ఎందుకు చదువుకోము?’ అని అనుకోలేదు. సాదా మధ్యతరగతి వాళ్ళ భావనలు అంతే. వాళ్ళ వదినలో, అక్కలో ఏ టీచరు ఉద్యోగమో చేస్తున్నా సరే.. తమ పిల్లలకి మాత్రం టెంత్ అయేసరికి పెళ్ళి చేసి పంపేయాలన్న బలమైన పట్టుదలతో ఉండేవారు.

“అమ్మమ్మా..” మనవరాలు శ్రేయ పిలుపుకి లేచింది సుశీల.

“ఎవరందరూ అమ్మమ్మా?” సుశీల చేత్తోని ఫొటో చూస్తూ అడిగింది.

సుశీల దానికి ఫొటో చూపిస్తూ ఎవరు ఎవరో చెప్పి, అప్పటి సంగతులు చెప్తూ ఉంటే నవ్వు ఆగక కిల‌కిలా నవ్వింది.

“అవునే బుడిగీ.. మీ తెలివితేటలూ మాకు లేవు. ఆ రోజుల్లో అందరం అలాగే ఉండేవాళ్ళం” నవ్వుతూ అంది సుశీల.

Exit mobile version