[dropcap]ఆ[/dropcap]కాశమంత సముద్రం
ఒక చిన్న తరగతి గదిలో
ఇమిడిపోవడం
ఎంత ఆశ్చర్యం?
ఒక గాంభీర్యమైన అలజడి
ఒక ఆధునికమైన సంప్రదాయం
ధిక్కరిస్తూనే నిలిచిన ఒక సంయమనం
ఏదైతేనేం
ఆ సముద్రమెపుడూ
అలుపెరుగని జీవనోత్సాహమే
ప్రతికెరటానా అవధిలేని ప్రేమే.
కనికట్టు చేసినట్టు
కాలాన్ని నిలబెట్టి
కనురెప్పవేయనీకుండా
సాగిన భావప్రసారం
సముద్రపు లోతునూ
ఆకాశపు ఎత్తునూ
కొత్తగా ఆవిష్కరించింది.
నిర్భయం
నిగర్వం
నిరాడంబరం
నిసర్గమూ అయిన ఆ సముద్రం
ఒక ఆవేశాన్ని
ఒక ఆలోచనను పొదువుకున్న
నిండైన మరెన్నో సముద్రాలను
నాలుగు గోడల మధ్య సృష్టించింది.
క్షణక్షణానా ఉప్పొంగి నిలిచేందుకు
అలుపెరుగని ఆరాటాన్నిచ్చింది.