ఆచార్యదేవోభవ-11

0
2

[box type=’note’ fontsize=’16’] ఈ శీర్షిక ద్వారా గత 20వ శతాబ్దిలో ఎందరో విశ్వవిద్యాలయ, కళాశాలల తెలుగు అధ్యాపకులను/ఆచార్యులను తీర్చిదిద్దిన ప్రాతఃస్మరణీయ యశఃకాయులను పరిచయం చేస్తున్నారు డా. అనంత పద్మనాభరావు. [/box]

కోరాడ పండిత వంశం:

[dropcap]మ[/dropcap]దరాసు విశ్వవిద్యాలయ తెలుగుశాఖ వ్యవస్థాపకులలో చిరస్మరణీయులు కోరాడ రామకృష్ణయ్య. వారిది పండిత వంశం. కోరాడ రామచంద్రశాస్త్రి గొప్ప పండితులు. వారి మనుమడే రామకృష్ణయ్య.

రామకృష్ణయ్య తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో మాతామహుల ఇంట 1891 అక్టోబరు 2న జన్మించారు. ప్రాథమిక విద్య పూర్తి చేసుకొని మచిలీపట్నం నోబుల్ కళాశాలలో 1915లో బి.ఏ చేశారు. 1921లో మదరాసు విశ్వవిద్యాలయములో ఎం.ఏ చదివారు.

ఉద్యోగ ప్రస్థానం:

డిగ్రీ పూర్తికాగానే 1915లో నోబుల్ పాఠశాలలో పండితులయ్యారు. కొంత కాలం తర్వాత విజయనగరం మహారాజా కళాశాలలో తెలుగు, సంస్కృతం పాఠాలు (1915-27) చెప్పారు. 1927లో మదరాసు విశ్వవిద్యాలయ తెలుగుశాఖ వ్యవస్థాపకులై 1949 వరకు 22 ఏళ్లు అధ్యయన అధ్యాపనాలు కొనసాగించారు. ఉమ్మడి మదరాసు రాష్ట్రంలో సాహిత్య సభలు మదరాసులో ఎక్కువగా జరిగేవి. 1924లో జరిగిన All India Oriental Conference లో రామకృష్ణయ్యకు సుప్రసిద్ధ భాషా శాస్త్రవేత్త డా. సునీల్ కుమార్ చటర్జీతో పరిచయమేర్పడింది. అది మొదలు వీరిద్దరి మధ్య సన్నిహిత పరిచయం ఏర్పడి ద్రావిడ భాషాధ్యయనానికి దారి తీసింది.

భాషాశాస్త్రవేత్తగా:

రామకృష్ణయ్య తొలితరం భాషాశాస్త్ర వేత్త. ఆయన రచనలివి

  1. సంధి (1935)
  2. Studies in Dravidian Philology (1953)
  3.  భాషోత్పత్తి క్రమము – భాషాచరిత్ర (1948)
  4. దక్షిణ ధేశ భాషా సారస్వతములు – దేశి (1949)
  5. భాషా చరిత్రక వ్యాసములు (1954)
  6. Dravidian Cognates
  7. ఆంధ్ర భారతకవితావిమర్శనము
  8. కాళిదాసుని ప్రతిభలు
  9. సారస్వత వ్యాసములు
  10. సాంస్కృతిక వ్యాసములు

రామకృష్ణయ్య కుమారులు మహదేవ శాస్త్రి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖ రీడర్‌గా వున్నారు. 1965-67లో నేను ఎం.ఏ తెలుగు చేసినపుడు వారు మాకు philology బోధించారు. ఆ పైన శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయ తెలుగు విభాగం ప్రొఫెసర్‌గా చాలా కాలం పని చేసి పదవీ విరమణ చేశారు. కోరాడ రామకృష్ణయ్య శతజయంతి సాహితీ నీరాజనం పేర స్మారక సంచికకు సంపాదకత్వం వహించారు. 1992లో ఈ గ్రంథం ప్రచురించారు. మహదేవశాస్త్రి కుమారులు సూర్యనారాయణ తిరుపతి రాష్ట్రీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో ఆచార్యులు. మరొక పుత్రుడు రామకృష్ణ అనంతపురం సాయిబాబా జూనియర్ కళాశాల అధ్యాపకులు.

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారికి రాఘవ పాండవీయం పుస్తకం అందజేస్తున్న రచయిత

మదరాసు విశ్వవిద్యాలయంలో ద్రావిడ భాషలు:

సర్ రఘుపతి వెంకటరత్నం నాయుడు మదరాసు విశ్వవిద్యాలయ వైస్ ఛాన్స్‌‌లర్‌గా వుండగా 1927లో ద్రావిడ భాషలను ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. అలా తెలుగు, కన్నడ, మలయాళ, తమిళ భాషాశాఖలు ఆరంభమయ్యాయి. ద్రావిడ బాషల తులనాత్మక పరిశోధన జరపాలని నాయుడుగారి సంకల్పం. విజయనగరం కళాశాలలో పని చేస్తున్న రామకృష్ణయ్య పాండిత్యాన్ని గూర్చి వారికి తెలిసింది. వారిని ఆహ్వనించారు. తమ కెరుక వున్న ప్రదేశం వదలి వెళ్లడం రామకృష్ణయ్య కిష్టం లేదు. అయినా నాయుడుగారి ప్రఖ్యాతి తెలిసి వుండడంవల్ల, విశ్వవిద్యాలయంలో పరిశోధనలకు చక్కని అవకాశాలుంటాయనీ కళాశాల అధ్యాపకులు చెప్పారు. ‘మీరు ఒకవేళ తిరిగి వస్తే విజయనగరం కళాశాలలో మీ ఉద్యోగానికి భద్రత వుంటుంద’ని యాజమాన్యం హామీ ఇచ్చింది.

ప్రాచ్య పరిశోధనా సంస్థ:

రామకృష్ణయ్య 1927లో మద్రాసులోని ప్రాచ్య పరిశోధనా సంస్థలో అధ్యాపకులుగా చేరారు. తమిళ, తెలుగు బాషలలో తనకున్న పరిచయాలతో తులనాత్మక అధ్యయనానికి బాటలు వేశారు. ప్రాచీన అధ్యాపకుల వేషధారణలో ఆయన ఎగ్మురులోని విశ్వవిద్యాలయ ప్రాంగణానికి క్రమశిక్షణగా సమయపాలన పాటిస్తూ హజరయ్యేవారు.

ఎగ్మూరులో వున్న విశ్వవిద్యాలయ ప్రాంగణం 1939లో ప్రస్తుతం వున్న మెరీనా బీచ్ నూతన భవనాలలోనికి పరిశోధనా సంస్థను తరలించారు. ఆంగ్ల భాష పైనా కూడా పట్టు వుండటంతో రామకృష్ణయ్య సాహిత్య విమర్శకు పెద్ద పీట వేశారు. తెలుగు భాషలో విమర్శ సాహిత్యం అప్పటకింకా వేళ్లూనుకోలేదు. విమర్శనాధోరణులను ఆకళింపు చేసుకొని తన పాండిత్య ప్రకర్షను విశ్లేషణా ధోరణులని జోడించి తొలుత ‘ఆంధ్రభారత కవితావిమర్శనం’ ప్రచురించారు. అది ఇప్పటికీ మహాభారత రచనపై ప్రామాణిక గ్రంథం.

ద్రావిడ భాషలకు సంభంధించి భాషాతత్వ పరిశోధనలో రామకృష్ణయ్య ప్రముఖ భాషా శాస్త్రవేత్త కాల్డ్వెల్ సిద్ధాంతాన్ని పునాదిగా ఎంచుకొని తెలుగు భాషా పరిశోధనకు పూనుకొన్నారు. అప్పటి వరకు తెలుగు భాషాశాస్త్ర అధ్యయనం క్షుణ్ణంగా విశ్వవిద్యాలయ స్థాయిలో కొనసాగలేదు. లోకంలో అప్పటికి ‘జనని సంస్కృతంబె ఎల్ల భాషలకు’ అనే వాదం ప్రచారంలో వుంది. దానిని పరసత్వం చేయడానికి ప్రయత్నించి సఫలురయ్యారు. ఫలితంగా రామకృష్ణయ్య గ్రంథం- Studies in Dravidian Language  వెలువడింది. కాల్డ్వెల్ అనుయాయిగా రామకృష్ణయ్య ద్రావిడ భాషా సిద్ధాంతాన్ని అనేక సభలలో నొక్కి వక్కాణించారు. సహేతుక ప్రమాణాలను చూసి నిరూపించారు. పండితులు అంగీకరించేలా వాదించారు. అనంతపురం సీడెడ్ డిస్ట్రిక్ట్ కళాశాలలో అధ్యాపకులు చిలుకురు నారాయణరావు వాదన వేరు. ఆయన వ్రాసిన History of Telugu Language బాగా ప్రసిద్ధి పొందింది. ఇద్దరివీ భిన్న ధోరణులు.

ద్రవిడియన్ ఎటమలాజికల్ డిక్షనరీ:   

భాషా శాస్త్ర ప్రగతిలో ఈ నిఘంటువు చాలా ప్రామాణికం. 1961లో ఇది వెలువడింది. ప్రఖ్యాత విదేశీ భాషా శాస్త్రవేత్తలైన ఎమినో, బరోలు ఇందులో సక్రమణంగా ఆర్య భాషలు, ద్రావిడ భాషలు రెండు భిన్న భాషా కుటుంబాలకు చెందినవని నిరూపించారు. ప్రపంచం ఆ వాదనను అంగీకరించక తప్పలేదు. అప్పటికిగాని రామకృష్ణయ్య వాదనకు బలం చేకూరలేదు. రామకృష్ణయ్య పని చేసిన 1927-1949 మధ్య కాలంలో తెలుగు శాఖలో పని చేసిన అధ్యాపకుల వివరాలను ఆచార్య మాడభూషి సంపత్ కుమార్ ప్రచురించిన తెలుగు దీప్తిలో అందించారు. విశ్వవిద్యాలయ 90 వార్షికోత్సవాల సందర్భంగా 2019 ఏప్రిల్‌లో పాలపిట్ట బుక్స్, హైదరాబాదు వారు దీనిని ప్రచురించారు (వికారి ఉగాది). రామకృష్ణయ్య కాలంలో తెలుగు శాఖలో పని చేసిన హేమాహేమీల వివరాలవి.

  1. కోరాడ రామకృష్ణయ్య 1927-49
  2. నండూరి బంగారయ్య 1927-28
  3. పింగళి లక్ష్మీకాతం 1927-30
  4. వజ్ఘల చినసీతారామశాస్త్రి 1930-33
  5. శ్రీపాద లక్ష్మీపతిశాస్త్రి 1930-33
  6. నిడుదవోలు వెంకటరావు 1944-60

రామకృష్ణయ్య తరువాతి కాలంలో శిష్ట్లా రామకృష్ణ శాస్త్రి, నిడుదవోలు వారు శాఖాద్యక్షులుగా వున్న సమయంలో 1949లో చేరి 1969 వరకు పని చేశారు. 1927 నుండి 1970 వరకు ఒక పూర్వార్ధ శకంగా మదరాసు తెలుగు శాఖ చరిత్రను పరశీలించవచ్చు. వారందరూ పండితులు పాండిత్య ప్రకర్షతో లోక ప్రసిద్ధులైన విశ్వవిద్యాలయంలో చేరారు. 1960లో నిడదవోలు వారు రిటైరుకాగా శిష్ట్లా వారు శాఖాధ్యక్షులయ్యారు.

సద్గురు శివానందమూర్తిగారితో రచయిత

ప్రగతి పథంలో తెలుగు శాఖ:

కోరాడ వారు 1930లో సీనియర్ లెక్చరర్‌గా పదోన్నతి పొందారు. సహాద్యాపకులుగా నండూరి బంగారయ్య, పింగళి లక్ష్మీకాంతంలు పని చేశారు. బంగారయ్య కేవలం ఒక సంవత్సరమే పని చేశారు. ఆయన సుప్రసిద్ధ సాహిత్య విమర్శకులు. వస్తుతః న్యాయవాది. నాటకకర్త. తూర్పు గోదావరి జిల్లా చెయ్యేరులో 1903లో నవంబరులో 20న జన్మించారు. న్యాయవాదిగా రాజమండ్రిలో ప్రాక్టీసు మొదలెట్టారు. పత్రికలలో సాహిత్య విమర్శనా వ్యాసాలు ప్రచరించారు. పండితుల ప్రశంసలందుకున్నారు. ‘వాగరి’ అనే కలం పేరుతో వ్యాసాలను 1922-56 మధ్య పత్రికలలో ప్రచురించారు. ‘తెలుగా? ఆంధ్రమా?’ అనే వ్యాసం వాదనలకు దారి తీసింది. కాళిదాసు అభిజ్ఞాన శాకుంతలంపై సవిమర్శక గ్రంథం వ్రాశారు. వారి కాలంలో  స్త్రీల పాత్రలు స్త్రీలే పోషించాలని ప్రతిపాదించారు. బంగారయ్య 1927-28 మధ్య తెలుగు శాఖలో పని చేశారు.

పింగళి లక్ష్మీకాంతం 1927-30 మధ్యలో తెలుగు శాఖలో వీరితో కలిసి పని చేశారు. ఆయన మూడు విశ్వవిద్యాలయాలలో… మదరాసు, ఆంధ్ర, శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయాలలో పని చేయడం విశిష్టత. ఆకాశవాణి విజయవాడలో ప్రవచన శాఖ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. వివరాలు ఆంధ్ర విశ్వవిద్యాలయ సందర్భంలో ప్రస్తావిస్తాను.

శ్రీపాద లక్ష్మీపతిశాస్త్రి (1887-1944):

నిఘంటు నిర్మాణంలో అఖండులు. వావిళ్ళ నిఘంటువు, సూర్యారాయంధ్ర నిఘంటువులలో కృషి చేశారు. 1931-33 మధ్య వావిళ్ల వేంకటేశ్వర శాస్త్రి వావిళ్ల నిఘంటువు మొదలెట్టారు. అందులో లక్ష్మీపతిశాస్త్రి చేరి 1934లో అకారాదిగా “ఇంచు” శబ్దము వరకు వ్రాశారు. 188 పుటలలో అది ప్రకటించారు. 1930-33 మధ్య కాలంలో మదరాసు విశ్వవిద్యాలయ తెలుగు శాఖలో పని చేశారు.

వీరి రచనలు:

  1. బాణ గద్య కావ్య కథలు
  2. కుమార సంభవ విమర్శనము
  3. మహానుభావులు
  4. దాస్యవిమోచనము
  5. పాణిగ్రహణము – వివాహ మంత్రార్థము
  6. మరుత్తరాట్ చరిత్ర (నాటకం)
  7. దశకుమార చరిత్ర (అనువాదం)
  8. వావిళ్ల నిఘంటువు

జూనియర్ లెక్చరర్లుగా వజ్ఝల వారు, శ్రీపాద వారు విశ్వవిద్యాలయంలో కలిసి పని చేశారు. 1949లో రామకృష్ణయ్య తెలుగు శాఖలో రీడరుగా రిటైరయ్యారు. వీరి కాలంలో చేరిన నిడదవోలు వెంకటరావు తర్వాత తెలుగు శాఖాధ్యక్షులయ్యారు. మిగతా వివరాలు సశేషం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here