Site icon Sanchika

ఆచార్యదేవోభవ-14

[box type=’note’ fontsize=’16’] ఈ శీర్షిక ద్వారా గత 20వ శతాబ్దిలో ఎందరో విశ్వవిద్యాలయ, కళాశాలల తెలుగు అధ్యాపకులను/ఆచార్యులను తీర్చిదిద్దిన ప్రాతఃస్మరణీయ యశఃకాయులను పరిచయం చేస్తున్నారు డా. అనంత పద్మనాభరావు. [/box]

విదుషీమణి వైదుష్యం:

[dropcap]మ[/dropcap]దరాసు విశ్వవిద్యాలయ తెలుగు శాఖలో ఇప్పటివరకు అధ్యాపకులుగా పనిచేసిన మహిళలలో ఏకైక వ్యక్తి డా. యస్. శమంతకమణి. స్వయంకృషితో ప్రతిభాపాండిత్యాలతో తెలుగు శాఖలో ప్రవేశించి శాఖాధిపతి అయి రిటైరయ్యారు.

1949లో జన్మించిన శమంతకమణికి చిన్నతనంలోనే పితృవియోగం కలిగింది. తెలుగు భాషాభిమానంతో బి.ఏ. డిగ్రీని (1967-70) మదరాసు క్వీన్ మేరీస్ కళాశాలలో పూర్తి చేశారు. అంతటితో ఆగలేదు. 1970-72 మధ్య రాజధాని కళాశాలలో తెలుగు ఎం.ఏ. చేశారు. అక్కడ ఆమెకు ఉత్తమ గురువుల బాసట లభించింది. సాళ్వ కృష్ణమూర్తి, దేవళ్ళ చిన్నికృష్ణయ్య, యల్.బి.శంకరరావులు ఆచార్యులు.

అదృష్టం ఆమె వెన్నంటి వుంది. తాను చదివిన రాజధాని కళాశాలలో వెంటనే 1972లో అధ్యాపకురాలయ్యారు. అక్కడి నుండి 1974లో పొన్నేరి ప్రభుత్వ కళాశాలకు బదిలీ అయ్యారు. అక్కడే పరిశోధనకు రిజిస్టరు చేసుకుని డా. వి. రామచంద్ర పర్యవేక్షణలో పి.హెచ్.డి. సాధించారు. తన కభిమాన పాత్రమైన సంగీతంలో పరిశోధన చేశారు. ‘త్యాగరాజు కవిత్వము – విమర్శనాత్మక పరిశీలన’ అనేది అంశం. ఆ గ్రంథాన్ని 1988లో వదాన్యులు బి.వి.యస్. మణి ఆర్థిక సహకారంతో ప్రచురించారు. ఈ సిద్ధాంత వ్యాసాన్ని సాళ్వ కృష్ణమూర్తి, మంగళంపల్లి బాలమురళీకృష్ణ ప్రశంసించడం మరో భాగ్యం.

మదరాసు విశ్వవిద్యాలయం తెలుగు శాఖలో ప్రవేశించడం మరో అదృష్టం. 1985లో ఏర్పడ్డ ఖాళీలో తొలి మహిళగా కాలు పెట్టారు. క్రమంగా రీడరు, ఆ తర్వాత ప్రొఫెసర్ అయ్యారు. 2002లో శాఖాధ్యక్షురాలయ్యారు. 60 ఏళ్లకే 2009 జూన్‍లో అనారోగ్యంతో మరణించారు.

పరిశోధనకు ఎందరినో ఆమె ప్రోత్సహించారు. 12 మంది పి.హెచ్.డి.లు, ఇంకెందరో ఎం.ఫిల్ పట్టాలు పుచ్చుకొన్నారు. పాఠం చెప్పడంలో ఆమె నేర్పరి అని సీనియర్ అధ్యాపకులు డా. లింగంనేని బసవ శంకరరావు తెలుగు దీప్తి సంచికలో వ్రాసిన వ్యాసంలో ప్రశంసించారు.  బాల వ్యాకరణం, సంస్కృతం, తెలుగు కావ్యాలు బోధించడంలో అందె వేసిన చేయి. పదవీ బాధ్యతలు నిర్వహిస్తూ మరణించిన తొలి ఆచార్యులు ఆమె. 2009లో ఆమె తర్వాత డా. మాడభూషి సంపత్ కుమార్ శాఖాధ్యక్షులయ్యారు.

శ్రీకృష్ణదేవరాయలుగా రచయిత

సజీవ స్వరాలు:

తెలుగు శాఖలో పని చేసిన వారిలో ప్రస్తుతం (2001) పదవీ విరమణ చేసిన ఆచార్యుల వివరాలను కొంత పొందుపరుస్తాను. 1978లో అధ్యాపకులుగా చేరిన జి.వి.యస్.ఆర్.కృష్ణమూర్తి, 1976లో చేరిన వి. రామచంద్ర, 2000లలో చేరిన సంపత్ కుమార్, ప్రస్తుత శాఖాధ్యక్షులు విస్తాలి శంకరరావు తెలుగు రథ సారథులు. ఎందరినో అధ్యాపకులను తయారు చేశారు. పరిశోధనలకు పెద్ద పీట వేశారు.

వి. రామచంద్ర:

వీరు రీసెర్చి స్కాలర్‍గా శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో పరిశోధన చేస్తున్న కాలంలో అక్కిరెడ్డి వీరి సహ పరిశోధకులు. నేను 1965-67 మధ్య ఎం.ఏ. చదివినప్పుడు వీరు తెలుగు శాఖలో పరిశోధకులు.

1976లో రామచంద్ర మదరాసు విశ్వవిద్యాలయంలో రీడర్‍గాను, అక్కిరెడ్డి లెక్చరర్‍గాను చేరారు. 1984లో రామచంద్ర ప్రొఫెసర్ అయ్యారు. 1987లో గంధం అప్పారావు రిటైర్ కాగా రామచంద్ర శాఖాధ్యక్షత వహించి ఒక దశాబ్ది తర్వాత 1997లో రిటైరయ్యారు. 1984లో అక్కిరెడ్డి రీడరై 1997లో రామచంద్ర తర్వాత శాఖాధ్యక్షులయ్యారు. మూడేళ్ళకు 2000లలో అక్కిరెడ్డి రిటైరయ్యారు.

రామచంద్ర తిరుపతిలో శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో పింగళి లక్ష్మీకాంతం పర్యవేక్షణలో పరిశోధన చేశారు. ఆయనకు ప్రియశిష్యులలో ప్రథములు. దానికి కారణం రామచంద్రలో ప్రతిభ. పి.యు.సి. చదివే రోజుల్లోనే బౌద్ధ భిక్షుకి ‘శుభ’ గాథను పద్యకావ్యంగా మలచారు. ఇతర రచనలు: – ఎర్రాప్రగడ- మోనోగ్రాఫ్; వెంకటేశ్వర శతకం, అశ్రుతర్పణం, మహాప్రబోధం, వాసంతిక (పద్య కావ్యాలు); పద్య నాటకం – విజయ రఘునాథం; అంతకు మించి పరిశోధనా గ్రంథాలలో – సుధాలహరి, తిక్కన కవితా శిల్పం, ఎర్రన ప్రబంధ పరమేశ్వర బిరుదము – ప్రముఖాలు.

పిహెచ్‌డి పరిశోధనకు – ఎర్రాప్రగడ రచనలు – విమర్శనాత్మక పరిశీలన – అంశాన్ని ఎంచుకుని సప్రామాణిక గ్రంథం తయారు చేశారు. ఎర్రన్నపై తొలి సిద్ధాంత గ్రంథమిది. అంతటితో ఆగక తిక్కన కవితా శిల్పంపై మరో పరిశోధన పూర్తి చేశారు.

రామచంద్ర చిత్తూరు జిల్లా నేలటూరు గ్రామంలో జన్మించారు. ఎం.ఏ. పూర్తి చేసి కొంత కాలం శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో పని చేశారు. 1968లో అనంతపురం పి.జి. సెంటరు ఏర్పాటయినప్పుడు అధ్యాపకులయ్యారు. 1976లో రీడర్‍గా మదరాసు విశ్వవిద్యాలయంలో చేరి అక్కడే రిటైరయ్యారు. 12 మంది హి.హెచ్.డిలు, 25మంది యం.ఫిల్.లు వీరి పర్యవేక్షణలో చేశారు. పద్యం మీద సాధికారికంగా మాట్లాడగల దిట్ట.

లోక్‌సభ స్పీకర్ జి.ఎమ్.సి. బాలయోగి నుంచి ఢిల్లీ తెలుగు అకాడమీ అవార్డు స్వీకరిస్తున్న రచయిత

సానికొమ్ము అక్కిరెడ్డి:

తెలుగు శాఖలో ఆచార్యులుగా పని చేసి ప్రస్తుతం నెల్లూరులో నివాసముంటున్న అక్కిరెడ్డి మృదుస్వభావి. వీరి మేనమామ వెంకటరెడ్డి నేను బి.ఏ. చదివే రోజుల్లో నెల్లూరు వి.ఆర్.కళాశాలలో మాకు 1962-65 మధ్య హిస్టరీ పాఠాలు చెప్పారు. అధ్యాపకుడిగా ఆయనకు మంచిపేరు. అక్కిరెడ్డి అప్పటి నెల్లూరు జిల్లా పొదిలి తాలూకాలో 1940లో జన్మించారు. నెల్లూరు వి.ఆర్.కళాశాలలో బి.ఏ. డిగ్రీ చేసి, తిరుపతిలో యస్.వి. యూనివర్సిటీలో తెలుగు ఎం.ఏ. చేశారు. అక్కడ పరిశోధక విద్యార్థిగా చేరి ఆచార్య జి.యస్. రెడ్డి పర్యవేక్షణలో ‘English Loan Words in Telugu’ అనే అంశం చేపట్టారు. కొంతకాలం అక్కడే ట్యూటర్‍గా పనిచేశారు.

మదరాసు పచ్చయ్యప్ప కాలేజీలో తెలుగు అధ్యాపకులుగా చేరారు. క్రమంగా మదరాసు విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖలో ఖాళీ ఏర్పడగా 1976లో ఉపన్యాసకులయ్యారు. వీరి పర్యవేక్షణలో పలువురు భాషా విజ్ఞాన పరిశోధనలు చేశారు. తొలి పి.హెచ్.డి. – కవిత్రయ దుర్యోధనుడు. కొత్త విషయాలపై పరిశోధన చేయించటం వీరి ప్రత్యేకత. 20 పి.హెచ్.డి.లు, 44 యం.ఫిల్‍ పరిశోధనలకు వీరు పర్యవేక్షకులు.

వీరి రచనలు: 1. English Loan Words in Telugu 2. Perspectives in Dravidian Linguistics 3. అనువాద సిద్ధాంతాలు 4. నా రేడియో ప్రసంగాలు.

వీరి ‘అనువాద సిద్ధాంతాలు’ అనేక విశ్వవిద్యాలయాలలో పాఠ్యగ్రంథం. అక్కిరెడ్డి స్నేహశీలి.

డా. బెజవాడ గోపాలరెడ్డి స్మారక అవార్డు స్వీకరిస్తున్న రచయిత

1976 నాటి తెలుగు శాఖ:

మదరాసు విశవిద్యాలయంలో 1976 వరకు ఎం.ఏ. కోర్సులు లేవు. అప్పటి వైస్ ఛాన్స్‌లర్ ప్రముఖ విద్యావేత మాల్కం ఆదిశేషయ్య పిజి కోర్సులు ప్రవేశపెట్టేందుకు ప్రయత్నించి సఫలమయ్యారు. ఎం.ఏ. విద్యార్థులకు బోధించాలంటే ఆయా శాఖలలో సుశిక్షితులైన అధ్యాపక వర్గం అవసరం. తదనుగుణంగా తెలుగు శాఖలోనే గాక అన్ని డిపార్టుమెంట్లలో ఒక ప్రొఫెసర్, ఒక రీడర్, ఇద్దరు లెక్చరర్ల పోస్టులు మంజూరయ్యాయి. అలా గంధం అప్పారావు ప్రొఫెసర్‍గా, రామచంద్ర రీడర్‍గా, కృష్ణమూర్తి, అక్కిరెడ్డి లెక్చరర్లుగా 1976 నాటికి తెలుగు శాఖ పుష్టిగా వుంది.

యు-టర్న్:

1978లో వి.సి.గా వున్న ఆదిశేషయ్య రిటైరయ్యారు. కొత్త వైస్-ఛాన్స్‌లర్‌గా డా. జి.ఆర్.దామోదరన్ వచ్చారు. విశ్వవిద్యాలయంలో రాజకీయాల ఫలితంగా రెండేళ్ళ పాటు 1980-82 మధ్య యూనివర్సిటీలో పి.జి. కోర్సులు మూతబడ్డాయి. అదృష్టవశాత్తు ఆ తరువాత యం.శాంతప్ప వి.సి.గా నియమితులయ్యారు. కృష్ణమూర్తి వంటి పెద్దలు వి.సి.కి నచ్చజెప్పి ఎం.ఏ. కోర్సు పునః ప్రవేశపెట్టారు. అదొక చారిత్రాత్మక సంఘటన.

సమాచార ప్రసార శాఖల మంత్రి శ్రీ సి.యం. ఇబ్రహీం చేతుల మీదుగా అవార్డు స్వీకరిస్తున్న రచయిత

పరిశోధనా కృష్ణమూర్తి:

మదరాసు తెలుగు శాఖ అనగానే ప్రాచీన కాలంలో కోరాడ రామకృష్ణయ్య, ఆధునిక తరంలో జి.వి.యస్. కృష్ణమూర్తి చటుక్కున గుర్తుకొస్తారు. విద్యార్థులకు మార్గదర్శిగా అహర్నిశలు అధ్యయన, ఆధ్యాపనలతో కాలం గడుపుతున్న వ్యక్తి ఆయన. తొలినాళ్ళలో జీవితంలో ఆటుపోట్లకు లోనయ్యారు.

గుంటూరు జిల్లా ముప్పాళ్ళలో 1941లో మే 8న కృష్ణమూర్తి జన్మించారు. వారిది దిగువ మధ్యతరగతి కుటుంబం. 1958లో యస్.యస్.యల్.సి. పూర్తి చేసిన వెంటనే తుంగభద్రా డ్యాం నిర్మాణ సమయంలో 70 రూపాయల జీతంపై గుమాస్తాగా చేరారు. విశ్వవిద్యాలయంలో అధ్యాపకులయ్యే నాటికి 12 దాకా ఉద్యోగాలు చేయాల్సి వచ్చింది.

నరసరావుపేటలో పి.యు.సి. చదివి 1962లో బెజవాడలో పార్ట్-టైమ్ ఉద్యోగం చేస్తూ డిగ్రీ చదివారు. 1969లో ఆంధ్ర విశ్వకళాపరిషత్‍లో తెలుగు ఎం.ఏ. చేశారు. తూమాటి దోణప్ప సౌజన్యంతో 1972లో తెలుగు వ్యుత్పత్తి పదకోశంలో రీసెర్చి అసిస్టెంట్‍గా చేరి ఆరేళ్ళు ఉద్యోగించారు. ఆ సమయంలో పి.హెచ్.డి. పూర్తి చేశారు.

1978లో మదరాసు విశ్వవిద్యాలయంలో అధ్యాపకుని ఎంపికకు 56మంది పోటీ పడ్డారు. పోటీలో కృష్ణమూర్తి విజయం సాధించి ఆగస్టు 13న చేరిపోయారు. ఎందరో పరిశోధకులకు మార్గదర్శి. మదరాసు నగరంలోని పొట్టి శ్రీరాములు మెమోరియల్ సొసైటీ, అభ్యుదయ రచయితల సంఘాలలో క్రియాశీలక కార్యకర్త. 2002లో శాఖాధిపతిగా రిటైరయినా, తెలుగు శాఖతో అనుబంధం వదులుకోలేదు.

కొందరికి పదవులు వెదుక్కొంటూ వస్తాయి. మరి కొందరు వాటి వెంబడి పడతారు. “కృష్ణమూర్తికి వి.సి. పదవి రావలసి వుండింది. అనేక కారణాలతో అది అందుబాటులోకి రాలేదు. అయినా ఆయన బాధ పడలేదు” అంటారు మాడభూషి సంపత్ కుమార్.

Exit mobile version