Site icon Sanchika

ఆచార్యదేవోభవ-15

[box type=’note’ fontsize=’16’] ఈ శీర్షిక ద్వారా గత 20వ శతాబ్దిలో ఎందరో విశ్వవిద్యాలయ, కళాశాలల తెలుగు అధ్యాపకులను/ఆచార్యులను తీర్చిదిద్దిన ప్రాతఃస్మరణీయ యశఃకాయులను పరిచయం చేస్తున్నారు డా. అనంత పద్మనాభరావు. [/box]

సజీవ స్వరాలు-2:

[dropcap]మ[/dropcap]దరాసు విశ్వవిద్యాలయ తెలుగుశాఖ కీర్తి ప్రతిష్ఠలను యావద్భారతదేశానికి చాటి చెప్పిన ఘనత ఆచార్య మాడభూషి సంపత్ కుమార్‍ది. రెండు దశాబ్దుల కాలంలో 2000-2019 తెలుగు శాఖ పక్షాన ఎన్నో సభలు, సెమినార్లు జాతీయ స్థాయిలో ఏర్పాటు చేసి, దేశం నలుమూల నుండి పండితుల నాహ్వానించి పత్ర సమర్పణ చేయించారు. వస్తుతః ఆయనలో ప్రసార మాధ్యమ లక్షణాలున్నాయి. జీవిత ప్రారంభదశలో జర్నలిస్టుగా పనిచేయడమే అందుకు కారణం.

ఆచార్య యం. సంపత్ కుమార్:

చిత్తూరు జిల్లా కమ్మపల్లె కుగ్రామంలో 1959 సెప్టెంబరు 17న జన్మించిన సంపత్ 2019 సెప్టెంబరులో మదరాసు విశ్వవిద్యాలయ తెలుగు శాఖాధ్యక్షులుగా రిటైరయ్యారు. చిత్తూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డిగ్రీ పూర్తి చేసి 1983లో మదరాసు విశ్వవిద్యాలయంలో తెలుగు ఎం.ఏ. చేశారు.

వీరి గురువైన ఆచార్య జి.యస్. కృష్ణమూర్తి వద్ద – ఎరుకల తమిళభాషలో బంధు వాచక పదలు – సామాజిక భాషాశాస్త్ర అధ్యయనంపై యం.ఫిల్ చేశారు. 1987లో ఆచార్య చల్లా రాధాకృష్ణ శర్మ పర్యవేక్షణలో ఎరుకల భాషకు వర్ణనాత్మక వ్యాకరణంపై పరిశోధించి మధురై కామరాజ్ విశ్వవిద్యాలయం నుండి పి.హెచ్.డి. పొందారు. 2015లో అత్యాధునిక తెలుగు కవితా దృక్పథాలు అనే అంశంపై పరిశోధనకు మదరాసు విశ్వవిద్యాలయం డి. లిట్ ప్రదానం చేసింది. మదరాసు విశ్వవిద్యాలయంలో పని చేసే ఉపాధ్యాయులలో వీరికే డి.లిట్ ప్రథమంగా వచ్చింది.

జీవన సమరం:

30 ఏళ్ళ ప్రాయంలో పాత్రికేయ రంగంలో ప్రవేశించి దాదాపు దశాబ్దిపైగా వివిధ పత్రికలలో సబ్ ఎడిటర్ నుండి న్యూస్ ఎడిటర్ స్థాయి వరకు ఎదిగారు. ఆరితేరిన సంపాదకుల వద్ద పనిచేయడం ఆయన జీవితంలో ఒక అదృష్టం. తద్వారా భాషా సాహిత్యాల మీద పట్టు సాధించారు. తాను చదువుకున్న విశ్వవిద్యాలయంలోనే అధ్యాపకుడిగా చేరడం మరో మలుపు.

తెలుగుశాఖ ఉపన్యాసకుడిగా:

పత్రికలో పని చేస్తున్న సంపత్ కుమార్‍కు అనుకోని రీతిలో మదరాసు విశ్వవిద్యాలయం అధ్యాపకత్వం లభించింది. కొత్తగా ఏర్పడిన ఖాళీలో 2000 నవంబరు 16న తెలుగు శాఖలో లెక్చరర్ అయ్యారు. తాను పని చేసిన రెండు దశాబ్దుల కాలంలో అనేక జాతీయ, అంతర్జాతీయ సదస్సులను చొరవ తీసుకుని నిర్వహించారు. అంతేకాదు, 24 గంటల నిరవధిక కవిసమ్మేళనం నిర్వహించి ప్రపంచ రికార్డు సృష్టించారు..

తాను సెమినార్లు నిర్వహించడమే గాక, ఎన్నో జాతీయ అంతర్జాతీయ సదస్సులలో పత్రసమర్పణ చేశారు. తెలుగు శాఖలో పని చేస్తూ మెరీనా క్యాంపస్ డైరక్టర్ అయిన తొలి వ్యక్తి వీరే. కేవలం విశ్వవిద్యాలయం నాలుగు గోడలకే పరిమితమై అధ్యయన, అధ్యాపనాలు కొనసాగించడమే గాక మదరాసు నగరంలోని వివిధ సంస్థలలో క్రియాశీలకంగా వ్యవహరించారు.

సంపత్ కుమార్ పర్యవేక్షణలో విశ్వవిద్యాలయంలో దాదాపు 27మంది పి.హెచ్.డి. సిద్ధాంత వ్యాసాలు సమర్పించారు. తెలుగు శాఖకు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను ఆహ్వానించి ప్రసంగాలు చేయించారు. మరో విశేషం – తెలుగు శాఖలో అతి తక్కువ కాలం పని చేసింది కూడా ఈయనే.

కాళోజీగారితో రచయిత

గ్రంథ రచనా నిపుణుడు:

2010 నుండి 2020 వరకు 12 గ్రంథాలు ప్రచురించారు. అందులో  వ్యాస సంపద, జీవితం-కవిత్వం, వ్యాకరణ విజ్ఞానం, తమిళ జానపద కళలు, అనువాద విజ్ఞానం, ఆలోచనలు, మూడో మనిషి – ప్రధానం.

వీరి సంపాదకత్వంలో మూడు గ్రంథాలు వెలువడ్డాయి. అనువాద గ్రంథాలు ప్రచురించారు. ఆరు కవితా సంపుటాలు వెలువరించారు. వీరు అనేక అవార్డులు పొందారు. వీటిల్లో సాహిత్య రత్న అవార్డు, చిత్తురు; శ్రీకృష్ణదేవరాయల జాతీయ పురస్కారం ప్రధానం. విదేశాలలో పర్యటించారు. 73మంది వీరి పర్యవేక్షణలో యం.ఫిల్ చేశారు.

భవిష్యత్తుకు మార్గదర్శి:

2020 నాటికి  మదరాసు విశ్వవిద్యాలయ తెలుగు శాఖలో మిగిలిన ఏకైక వ్యక్తి డా. విస్తాలి శంకరరావు. వీరు ప్రకాశం జిల్లా జార్లపాళెం గ్రామంలో జన్మించారు. 2004 నుంచి ఇక్కడ అసోసియేట్ ప్రొఫెసర్‍గా ఉన్నారు. నరసరావుపేట కళాశాలలో బి.ఏ. చేశారు. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం నుండి ఎం.ఏ., ఎం.ఫిల్, పి.హెచ్.డి. పొందారు. అన్నామలై విశ్వవిద్యాలయం నుండి భాషాశాస్త్రంలో ఎం.ఏ. చేశారు.

ప్రకాశం జిల్లా వీధి నాటకాలపై ఎం.ఫిల్; అదే జిల్లా జానపద కళారూప ప్రదర్శన-సాహిత్యాంశాలపై పి.హెచ్.డి. పొందారు. తెలుగు పౌరాణిక రంగస్థల నాటక సాహిత్యం-విశ్లేషణాత్మక అధ్యయనం అనేది డి.లిట్ పరిశోధన. 24 గ్రంథాలు పరిశోధనాత్మకంగా ప్రచురించారు.

తమిళ తెలుగు జానపద కళారూపాల తులనాత్మక పరిశోధన – వీరి యు.జి.సి. మేజర్ రీసెర్చ్ ప్రాజెక్టు. వీరి పర్యవేక్షణలో 13 పి.హెచ్.డి.లు, 42 యం.ఫిల్‍లు అవార్డు అయినాయి. ఆకాశవాణిలో ప్రసంగాలు చేశారు (40).

బాల్యం నుండి రంగస్థలంపై వీధి నాటక ప్రదర్శనలిచ్చి, రంగస్థల నటుడిగా, జననాట్యమండలి కళాకారుడిగా గుర్తింపు పొందారు. 90 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర గల తెలుగు శాఖకు భవిష్యత్తరాలకు చుక్కాని శంకరరావు.

తన రచనలపై పరిశోధన చేసిన శ్యామ్‌ప్రసాద్ సిద్ధాంత వ్యాసాన్ని విడుదల చేస్తున్న రచయిత

పరిశోధనకు పుట్టినిల్లు:

కోరాడ వారితో మొదలై, విస్తాలి వారితో విస్తరించిన తెలుగు శాఖ పరిశోధనకు పెద్ద పీట వేసింది. 1869లో ఎం.ఏ. పరీక్ష ఉత్తీర్ణుడైన తొలి వ్యక్తి వెలగపూడి సుందరరామయ్య తెలుగువాడు. ఆ సందర్భంగా ఫోర్ట్ సెయింట్ జార్జ్ కోటలో 13 ఫిరంగులు పేల్చారు. చిలుకూరి నారాయణరావు ఇక్కడే ఎం.ఏ. చేసి 1928లో పి.హెచ్.డి. చేసిన తొలి వ్యక్తి అయ్యారు. ఈ విశ్వవిద్యాలయ అనుబంధ రాజధాని కళాశాల (ప్రెసిడెన్సీ)లో కూడా ఎం.ఫిల్, పి.హెచ్.డి.లు చేసే అవకాశం ఉంది.

వివిధ కాలాలలో పి.హెచ్.డి.లు పొందినవారు:

రెండు చోట్ల 1928-2020 మధ్యకాలంలో 563 మంది పరిశోధన చేశారు.

పరిశోధనలో వైవిధ్యం:

చారిత్రక నేపథ్యం గలిగి తొమ్మిది దశాబ్దులు తెలుగు పరిశోధనకు ఎందరో మహనీయులు పాటుపడిన తెలుగు శాఖలో యాదృచ్ఛికమే అయినా ’11వ శతాబ్ది తెలుగు’ పై చిలుకూరి వారు పరిశోధనకు నాంది పలికారు. ఆనాటి నుండి నేటి వరకు భాషా శాస్త్ర పరిశోధన కొనసాగుతోంది. ద్రావిడ భాషలకు సంబంధించి మాత్రమే గాక సంఖ్యావాచకాలు, తెలుగు నామ స్వరూపం, క్రియా పద స్వరూపం, నగరస్థల నామాలు, బంధు వాచకాలు ప్రధానాలు. తెలుగు భాషను పరిశీలించడానికి ఇతర విద్యార్థులకు కూడా ఇవి ఉపయోగకారులు.

మహాభారత పరిశోధన:

మహాభారతంపై నాలుగు రకాలుగా పరిశోధనలు జరిగాయి. (1) వివిధ పర్వాలు (2)  వివిధ పాత్రలు (3) వివిధ అంశాలు (4) భాషాపరమైన పరిశోధనలు ప్రధానం.

అలానే 15 సిద్ధాంత వ్యాసాలు రామాయణంపై వచ్చాయి. తెలుగు కావ్యాలు అన్నింటి మీద సవిమర్శనాత్మకమైన పరిశోధనలు జరిగాయి. అనువాదాలకు తెలుగు శాఖ ప్రత్యేక ప్రాధాన్యమిచ్చి ప్రోత్సహించింది. జర్నలిజం పైనా దృష్టి సారించారు. కిన్నెర, ఆంధ్రజ్యోతి, చందమామ, ఈనాడు, సప్తగిరి, మూసీ పత్రికలలో భాషా సాహిత్యాల గూర్చి రీసెర్చి విస్తృతంగా జరిగింది.

తిరుమలలో ఆంజనేయ స్వామి విగ్రహం వద్ద రచయిత

జానపద బాణి:

తెలుగులో జానపద సాహిత్యం అపారం. తమిళనాడు జిల్లాల్లోని జానపద సాహిత్యంపై పరిశోధకులు విస్తృతంగా పర్యటించారు. సామెతలపైనా కూలంకుష చర్చ జరిగింది.

వీటికి తోడు వ్యక్తిగత కవుల రచనలపై పరిశోధకులు కృషి చేశారు. వేమన, జాషువా, కందుకూరి, తుమ్మల, పింగళి, దువ్వూరి, కరుణశ్రీ, విశ్వనాథ ప్రభృత ఆధునిక కవితాతత్వం సిద్ధాంత వ్యాసాల రూపంలో వెలువడటంతో పరిశోధనకు పుష్టి చేకూరింది.

క్రైస్తవ మత సంబంధము, వ్యాకరణము, సినిమా పరిశ్రమ – ఇత్యాది అంశాలు పరిశోధనకు పాత్రమయ్యాయి. ఈ విధంగా మదరాసు విశ్వవిద్యాలయ తెలుగు శాఖ శతాబ్ది ఉత్సవాలకు సమీపంగా ముందుకు సాగుతోంది.

Exit mobile version