ఆచార్యదేవోభవ-16

1
2

[box type=’note’ fontsize=’16’] ఈ శీర్షిక ద్వారా గత 20వ శతాబ్దిలో ఎందరో విశ్వవిద్యాలయ, కళాశాలల తెలుగు అధ్యాపకులను/ఆచార్యులను తీర్చిదిద్దిన ప్రాతఃస్మరణీయ యశఃకాయులను పరిచయం చేస్తున్నారు డా. అనంత పద్మనాభరావు. [/box]

ఆంద్ర విశ్వకళాపరిషత్ 1926:

[dropcap]మ[/dropcap]దరాసు విశ్వవిద్యాలయ చట్టం 1926 ద్వారా ఆంధ్ర భాషా ప్రాంతంలోని విద్యార్థులకు వసతి సౌకర్యం గల బోధనా సంస్థగా యూనివర్శిటీకి అనుబంధ సంస్థలు ఏర్పర్చుకునేలా సంస్థను ఏర్పరచారు. ఆంధ్ర మేధావుల చిరకాల వాంఛ అది. దేశంలోని అతి ప్రాచీన విశ్వవిద్యాలయమే గాక వసతి సదుపాయాలు కల్పించే రీతిలో వివిధ బోధనా శాఖలతో విలసిల్లుతోంది. అనేక విధాలుగా ఈ విశ్వవిద్యాలయం ఉన్నత విద్యలో ఉత్తమ ప్రమాణాలు సాధించింది. ‘నాక్’ సంస్థ ద్వారా ‘ఏ’ గ్రేడు పొందింది. ఈ విశ్వవిద్యాయలం తొలి వైస్-ఛాన్స్‌లర్ సర్ సి.ఆర్.రెడ్డి. ఈ సంస్థ ఉపకులపతి డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ భారత ఉపరాష్ట్రపతిగా, రాష్ట్రపతిగా పదవులు అలంకరించారు. ఇక్కడ ‘లా’ చదివిన శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు భారత ఉపరాష్ట్రపతి (2017-2022).

హేమాహేమీలు:

పూర్వం ఈ యూనివర్శిటీలో పలువురు ప్రముఖులు అనుబంధం కలిగి ప్రఖ్యాతి గడించారు. టి. ఆర్. శేషాద్రి, సూరి భగవంతం, హిరేన్ ముఖర్జీ, హుమయున్ కబీర్, వి.కె. ఆర్.వి. రావు ప్రభృతులు, నోబెల్ బహుమతి గ్రహీత సర్. సి. వి. రామన్, ప్రొ. సి.ఆర్. రావు ఈ విద్యాసంస్థ పూర్వ విద్యార్థులు. లోకసభ స్పీకర్ జి.యం.సి. బాలయోగి, రిజర్వు బ్యాంకు గవర్నరు దువ్వూరి సుబ్బారావు, కేంద్రమంత్రులు పళ్ళంరాజు, పనబాక లక్ష్మి, కె. ఎర్రంనాయుడు, సుప్రీం కోర్టు న్యాయమూర్తి జాస్తి చలమేశ్వర్, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జి. రోహిణి, స్వాతంత్ర పోరాట వీరుడు అల్లూరి సీతారామరాజు, యన్‍.టి.రామారావు (ముఖ్యమంత్రి), కె. రోశయ్య (ముఖ్యమంత్రి, గవర్నరు), సినీ ప్రముఖులు అక్కినేని, చిరంజీవి, భానుమతి, యల్.వి. ప్రసాద్, యస్.వి.కృష్ణారెడ్డి, తనికెళ్ళ భరణి, రమణమూర్తి, ఆర్.పి. పట్నాయక్, త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రభృతులు; సుప్రీం కోర్టు న్యాయవాది పి. వి. రావు, ఐఎఎస్ అధికారులుగా కె. పద్మనాభయ్య, వైద్యనాథ అయ్యర్, అబ్రహం, కె.యస్.శర్మ, యుపిఎస్‌సి సభ్యులుగా కె.ఎస్. చలం తదితరులు కేంద్ర కార్యదర్శులయ్యారు. బాలాంత్రపు రజనీకాంతరావు ఆకాశవాణిలో ఉన్నత పదవుల ధిష్ఠించారు.

ఆకాశవాణి డైరక్టరుగా, సమాచార ప్రసార శాఖ మంత్రి శ్రీ అరుణ్ జైట్లో తో రచయిత

పురస్కార గ్రహీతలు:

ఈ విద్యా సంస్థ అధ్యాపకులు, విద్యార్థులకు  జాతీయ స్థాయి పురస్కారాలు అనేకం లభించాయి. ఎనిమిది మంది శాంతిస్వరూప్ భట్నాగర్ అవార్డు, ముగ్గురు పద్మభూషణ్, నలుగురు పద్మశ్రీ, ఇద్దరు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు పొందారు.

తొలినాళ్ళలో:

కట్టమంచి రామలింగారెడ్డి 1926లో తొలి వైస్ ఛాన్స్‌లర్. 1931లో డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ ద్వితీయులయ్యారు. 1931 జూలైలో యూనివర్శిటీ ఆర్ట్స్ కళాశాల ప్రారంభమయింది. తొలుత తెలుగు, హిస్టరీ, ఎకనామిక్స్, పాలిటిక్స్ కోర్సులు ప్రవేశపెట్టారు. 1932లో ఫిజిక్స్, కెమిస్ట్రీలతో ఆనర్స్ కోర్సుల సైన్స్ అండ్ టెక్నాలజీ కళాశాల మొదలయింది. దేశంలోనే ప్రథమంగా అనేక నూతన కోర్సులు ప్రవేశపెట్టారు. ప్రస్తుతం 313 కోర్సులు నడుపుతున్నారు. ఇంజనీరింగ్ కాలేజ్, ఫార్మసీ కాలేజి విఖ్యాతి చెందాయి. న్యాయకళాశాల విశిష్టం.

సువిశాలమైన 422 ఎకరాలలో 121 భవనాలలో బోధన నడుస్తోంది. 324 స్టాఫ్ క్వార్టర్స్ ఉన్నాయి. విశాఖపట్టణం, విజయనగరం, శ్రీకాకుళం, ఉభయగోదావరి జిల్లాల పరిధిలో కళాశాలలు దీని పరిధిలో ఉన్నాయి. పోస్టు గ్రాడ్యుయేట్ కోర్సులకు తోడు పి.హెచ్.డి. అవకాశాలున్నాయి. కాకినాడ, ఎచ్చెర్ల (శ్రీకాకుళం), తాడేపల్లి గూడెం, విజయనగరాలలో యూనివర్శిటీ క్యాంపస్ కళాశాలలున్నాయి.

దూరవిద్యా కోర్సులు 1972లో మొదలయ్యాయి. 80 వేల మంది దీని ద్వారా ఏటా విద్య నభ్యసిస్తున్నారు. ఈ విశ్వవిద్యాలయంలో 25 పరిశోధనా కేంద్రాలు కృషి చేస్తున్నాయి. ప్రస్తుతం 354 మంది ప్రొఫెసర్లు, 198 మంది అసోసియేట్ ప్రొఫెసర్లు, 115 మంది అసిస్టెంట్ ఫ్రొఫెసర్లు, 2500 మంది సహాయక సిబ్బంది ఉన్నారు.

ఈ విశ్వవిద్యాలయం ఎంబ్లెమ్‍ను ప్రఖ్యాత చిత్రకారులు కౌతా రామమోహనశాస్త్రి రూపొందించారు. యూనివర్శిటీని తొలుత విజయవాడలోని యం.జి.రోడ్డులో విక్టోరియా జూబ్లీ మ్యూజియంలో ప్రారంభించారు. దీనిని 1877లో విక్టోరియా మహారాణి స్వర్ణోత్సవాల సందర్భంగా (1837 -1901) సందర్భంగా యూరోపియన్ శైలిలో నిర్మించారు. 1921లో అఖిల భారత కాంగ్రెస్ మహాసభలు ఇక్కడ జరిగాయి. ఈ సభలలో మార్చి 31, ఏప్రిల్ 1న పింగళి వెంకయ్య రూపొందించిన త్రివర్ణ పతాకాన్ని మహాత్మాగాంధీ ఆమోదించారు.

2008లో కడపలో భువనవిజయంలో తిమ్మరుసుగా రచయిత

విశాఖకు తరలింపు:

విశ్వవిద్యాలయాన్ని విజయవాడలోనే కొనసాగించాలని అయ్యదేవర కాళేశ్వరరావు పట్టుబట్టారు. కాని విద్యావేత్త అయిన సి.ఆర్.రెడ్డి ఛలోక్తిగా “Bezawada had only agriculture but not culture” అని చమత్కరించి విశాఖపట్టణానికి తరలించారు. ఆ విధంగా ఈ సంస్థ విశాఖలో స్థిరపడింది.

95 ఏళ్ళలో ఉపకులపతులు:

శతాబ్ది ఉత్సవాల వైపు పరుగులు తీస్తున్న ఈ సంస్థకు ఉపకులపతులుగా లబ్ధప్రతిష్ఠులు పనిచేశారు.

(1) కట్టమంచి రామలింగారెడ్డి – ఏప్రిల్ 1926 – జూలై 1930; మే 1936 – డిసెంబర్ 1949

(2) సర్వేపల్లి రాధాకృష్ణన్ – మే 1931 – మే 1936

ఆ తర్వాత డా. వి.యస్. కృష్ణ డిసెంబరు 1949 – 1961 జూన్ (యుజిసి ఛైర్మన్) (12 సంవత్సరాల సుదీర్ఘ కాలం వి.సి. ఆ తర్వాత యూనివర్శిటీ గ్రాంట్ల సంఘం అధ్యక్షత. ఈ విశ్వవిద్యాలయం నుండి బి. రామచంద్రరావు, కె. సచ్చిదానందమూర్తి – యుజిసి – ఉపాధ్యక్ష పదవి నధిష్ఠించారు).

ఏ.ఎల్. నారాయణ (1961-66),  కె. ఆర్. శ్రీనివాస అయ్యంగార్ (1961-68), లంకపల్లి బుల్లయ్య (1968-74), యం.ఆర్. అప్పారావు (1974-80) – వీరు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా వ్యవహరించారు. జస్టిస్ ఆవుల సాంబశివరావు (1980 -83) – వీరు ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి. వీరి కుమార్తె ఆవుల మంజులత తెలుగు విశ్వవిద్యాలయ వి.సి.

తర్వాతి కాలంలో వరుసగా కె. రామకృష్ణారావు, కె.వి. రమణ, యం. గోపాలకృష్ణారెడ్డి, ఆర్. రాధాకృష్ణ, వై. సి. సింహాద్రి (ఈయన నాగార్జున, బెనారస్ హిందూ విశ్వవిద్యాలయాల విసి కూడా), యల్. వేణుగోపాలరెడ్డి, బి. సత్యనారాయణ, జి.యస్.యన్. రాజు, పి.వి.జి. ప్రసాదరెడ్డి విశ్వవిద్యాలయ ప్రతిష్ఠను ఇనుమడింపజేశారు.

లోగో:

ఆంధ్ర విశ్వవిద్యాలయ లోగోలో ‘తేజస్వినా అవధీతమస్తు’ అని లిఖించబడింది. “May the divine light illuminate our studies” అని భావం. దివ్య ప్రకాశం మా విద్యలను ఉత్తేజితం చేయు గాక – అంటూ ఉదయిస్తున్న సూర్యుడు, స్వస్తిక చిహ్నము, చుట్టూ సర్పాల బంధం అమర్చబడ్డాయి. సూర్య కిరణాలు సంస్థలోని వివిధ శాఖలకు, అవి ధరించిన స్వస్తిక ఉపనిషత్ వాక్యానికీ, సర్పాలు రెండు విజ్ఞాన భాండాగర పరిరక్షణ చేస్తూ పద్మపత్రాల ధారణ చేస్తాయి. సంప్రదాయ బద్ధంగా ఆంధ్రులు నాగ పూజ చేయడాన్ని రెండు సర్పాలు గుర్తు చేస్తాయి. కౌతా రామమోహనశాస్త్రి రూపొందించిన ఈ చిహ్నాన్ని కట్టమంచి రామలింగారెడ్డి ఆమోదించారు.

2007లో ఆకాశవాణి విజయవాడ కేంద్రం సిబ్బందిచే రచయితకు సత్కారం

కౌతా రామమోహనశాస్త్రి:

వీరు ప్రముఖ చిత్రకారులు (1906-1976). వీరి సోదరులు ఆనంద మోహన శాస్త్రి (1908-40) కూడా గొప్ప చిత్రకారులు. రామమోహనశాస్త్రి డ్రై పాయింట్ ఎబ్బింగ్ పద్ధతిలో చక్కని చిత్రాలు వేశారు. మొట్టమొదటి తెలుగు సచిత్ర మాసపత్రిక ‘శారద’కు సంపాదకులు. వీరి చిత్రాలలో కేశాలంకరణ, నిరీక్షణ, BIRDS, ఆపిల్ సెల్లర్, ట్రఫాల్గర్ స్క్వేర్ – ప్రసిద్ధాలు. వీరి కుమార్తె కౌతా ప్రియంవద ఆకాశవాణి కడప, విజయవాడ కేంద్రాలలో మ్యూజిక్ కంపోజర్‍గా పని చేసి పదవీ విరమణ చేశారు. రామమోహనశాస్త్రి (మచిలీపట్టణం) ప్రమోద్ కుమార ఛటర్జీ వద్ద చిత్రలేఖనం నేర్చుకొన్నారు.

కట్టమంచి రామలింగారెడ్డి (1880 -1951):

ఆంధ్ర విశ్వవిద్యాలయ సర్వతోముఖాభివృద్ధికి అహరహం కృషి చేసి – ఆ వృక్షం ఫల పుష్పభరితం కాగా చూచి సంతోషించారు కట్టమంచి. విద్యావేత్తగా, సాహితీ విమర్శకుడిగా నిరుపమాన సేవ జేశారు. పాత కొత్తల మేలు కలయికకు ఆయన వారధి, రథసారథి. చిత్తూరు జిల్లాలో 1880 డిసెంబరు 10న కట్టమంచిలో జన్మించారు. తండ్రి సుబ్రమణ్యరెడ్డి ప్రాచీన కావ్యాల పరిచయం గల వ్యక్తి. రామలింగారెడ్డి మదరాసు క్రిస్టియన్ కళాశాలలో రాజకీయ, ఆర్థికశాస్త్రం, తత్వశాస్త్రాలలో ఉత్తీర్ణులై విదార్థి వేతనంపై కేంబ్రిడ్జ్ యూనివర్శిటీలో ఉన్నత విద్యాభ్యాసం చేశారు.

ఉద్యోగపర్వం:

కేంబ్రిడ్జి నుండి రాగానే 1908లో 28వ ఏటనే బరోడా కళాశాలలో వైస్-ప్రిన్సిపల్‍ అయ్యారు. మైసూరు ప్రభుత్వ విద్యాశాఖ అసిస్టెంట్ ఇన్‌స్పెక్టర్ జనరల్, మైసూరు మహారాజా కళాశాల ఆచర్య పదవి ఆయనను వరించాయి. ఆంధ్రమహాసభ అధ్యక్షుడిగా 1924లో ఎన్నుకోబడ్డారు. 1926లో ఆంధ్ర విశ్వవిద్యాలయం తొలి విసి.గా నియమింపబడి ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా 1930లో పదవిని త్యజించారు. చిత్తూరు జిల్లా బోర్డు అధ్యక్షులుగా 1935లో రాజకీయ జీవితం మొదలెట్టారు. రాధాకృష్ణన్ తరువాత 1936-48 మధ్య తిరిగి ఉపాధ్యక్ష స్థానం ఆంధ్ర విశ్వవిద్యాలయంలో లభించింది. ఏతావాతా ఒకటిన్నర దశాబ్ది కాలం పని చేశారు.

రాజకీయ రంగంలో మదరాసు లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యత్వం 1937లో లభించింది. మైసూరు విశ్వవిద్యాలయ ప్రోఛాన్స్‌లర్‌గా 1949లో నియమితులయ్యారు. అంటే 70వ సంవత్సరం వరకు ఆయన ఏదో ఒక పదవిలో కొనసాగారు.

సాహితీ సంపద:

రామలింగారెడ్డి రచించిన ఖండకావ్యం – ముసలమ్మ మరణం – పోటీలో బహుమతి పొందిన నాటికి ఆయన వయస్సు 19 సంవత్సరాలే. విషాదాంత కావ్యాలు తెలుగులో రాని రోజుల్లో అదొక విశిష్ట కావ్యాం. కరుణ రసాత్మక కావ్యం. సాహిత్య విమర్శలో ఆయన ఉద్దండుడు. భారత విమర్శనము, వేమనపై పరిశీలనము, కళాపూర్ణోదయ పరిశోధనము, కవిత్వతత్వ విచారము – రామలింగారెడ్డి ఆధునిక సాహితీ ధోరణులకు నిదర్శనము.

ఆంధ్ర విశ్వవిద్యాయం ఆయనను 1937లో కళాప్రపూర్ణ బిరుదుతో సత్కరించింది. బ్రిటీషు ప్రభుత్వం 1942లో ‘సర్’ బిరుదం ప్రకటించింది. 1951 ఫిబ్రవరి 24న మరణించారు. ఆయన బ్రహ్మచారి. వరుసకు మనుమరాలైన డా. సత్యభామా రెడ్డి చే నేను కడప ఆకాశవాణి కేంద్రం నుండి ‘మా తాతగారు’ అనే ప్రసంగం 1977లో చేయించాను. సాహిత్య విమర్శ చరిత్రకు కట్టమంచి యుగపురుషుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here