Site icon Sanchika

ఆచార్యదేవోభవ-17

[box type=’note’ fontsize=’16’] ఈ శీర్షిక ద్వారా గత 20వ శతాబ్దిలో ఎందరో విశ్వవిద్యాలయ, కళాశాలల తెలుగు అధ్యాపకులను/ఆచార్యులను తీర్చిదిద్దిన ప్రాతఃస్మరణీయ యశఃకాయులను పరిచయం చేస్తున్నారు డా. అనంత పద్మనాభరావు. [/box]

ఆంధ్ర విశ్వకళా పరిషత్ నుండి రాష్ట్రపతి భవనానికి:

[dropcap]ఆం[/dropcap]ధ్ర విశ్వవిద్యాలయం సగర్వంగా చెప్పుకొనే అంశం – దేశానికి ఇద్దరు ఉపరాష్ట్రపతులను, తత్రాపి రాష్ట్రపతిని ప్రసాదించటం. తొలి వైస్ ఛాన్స్‌లర్ సి.ఆర్. రెడ్డి కాగా, మలి ఉపకులపతి సర్వేపల్లి రాధాకృష్ణన్. ఇద్దరూ ప్రముఖ విద్యావేత్తలు. రాధాకృష్ణ పండితుడిగా ప్రఖ్యాతి వహించిన ఆయన 1929లో ఆక్స్‌ఫర్డ్‌లో మాంచెస్టర్ కళాశాల ప్రిన్సిపాల్‍గా ఆహ్వానం అందుకొని చేరారు. 1931లో ఆంద్ర విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులుగా పదవీ బాధ్యతలు స్వీకరించి ఆరేళ్ళ పాటు కొనసాగారు. తొలి స్నాతకోత్సవంలో మాట్లాడుతూ –

“Our moral sense and sympathetic imagination are not much wrapped by dogma. Our women are relatively morel free. Love of the mother-tongue binds as all” అని మాతృభాషాభిమానాన్ని ప్రశసించారు.

1936లో ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలో ప్రాచ్య మతాల ఆచార్యులుగా ఎంపిక చేయబడ్డారు. ఆ సంవత్సరం, మరుసటి సంవత్సరం నోబెల్ బహుమతికి ఆయన పేరు ప్రతిపాదించారు. మదనమోహన మాలవ్యా ఆహ్వానం మేరకు బెనారస్ హిందూ విశ్వవిద్యాలయ వైస్-ఛాన్స్‌లర్‍గా 1939లో చేరి 1948 జనవరి వరకు ఉన్నారు. ఆ విధంగా కలకత్తా, ఆంధ్ర, బెనారస్ విశ్వవిద్యాలయాలతో సన్నిహిత సంబంధం కలిగి వున్నారు. 1946-52 మధ్య యునెస్కోకు భారత ప్రతినిధిగా హాజరయ్యారు.

స్వాతంత్రానంతరం:

వేదాంతవేత్తగా, విద్యావేత్తగా ఖ్యాతిగాంచిన రాధాకృష్ణన్ భారతదేశం స్వతంత్రం కాగానే 1949-52 మధ్య సోవియట్ యూనియన్‍లో భారత రాయబారిగా వ్యవహరించారు. రాజ్యాంగ సభ సభ్యుడిగా ఎంపికయ్యారు. 1952లో తొలి ఉపరాష్ట్రపతిగా ఎన్నికై రెండు పర్యాయాలు ఆ పదవికి వన్నె తెచ్చారు. 1962లో రెండవ రాష్ట్రపతిగా ఎన్నికై 1967వరకు వ్యవహరించారు. కాంగ్రెస్ పార్టీ నేపథ్యం ఆయనకు లేదు సరిగదా, బ్రిటీష్ వ్యతిరేక కార్యకలాపాలలోనూ పాల్గొనలేదు. భారతీయ సంస్కృతి పట్ల ఆయనకున్న నిబద్ధత పదవులను తెచ్చిపెట్టి అంతర్జాతీయ గౌరవం పొందగలిగారు. ఆయన జన్మదినం – సెప్టెంబరు 5 ను ఉపాధ్యాయ దినోత్సవంగా పాటిస్తున్నారు. 86వ ఏట 1975 ఏప్రిల్ 17న మదరాసులో స్వగృహంలో పరమపదించారు.

రచయితకు 2000 సంవత్సరంలో ఢిల్లీలోని ఎ.పి.భవన్‍లో డా. పి.ఎల్. సంజీవరెడ్డి

ఉపరాష్ట్రపతిగా ‘లా’ కళాశాల విద్యార్థి:

ఆంధ్ర విశ్వవిద్యాలయంలో లా కళాశాల విద్యార్థి భారత ఉపరాష్ట్రపతిగా 2017 ఆగస్టులో ఎన్నిక కావడం సంస్థ చరిత్రలో సువర్ణాధ్యాయం. నెల్లూరు జిల్లా చవటపాళెంలో 1949 జూలై 1 న జన్మించిన వెంకయ్య నాయుడు వి. ఆర్. కళాశాలలో బి.ఎ. డిగ్రీ చేసి విశాఖపట్టణంలో ‘లా’ కళాశాలలో చేరారు. కళాశాలలో విద్యార్థి సంఘాధ్యక్షులయ్యారు.

1972లో ఆంధ్రోద్యమ సమయంలో ఆయన ప్రధాన పాత్ర పోషించారు. 1974లో జయప్రకాశ్ నారాయణ ఛాత్ర సంఘ సమితి, ఆంధ్ర ప్రదేశ్ కన్వీనరుగా వ్యవహరించారు. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడి జైలు శిక్ష అనుభవించారు. అమోఘమైన వాగ్ధాటితో ఆయన ప్రేక్షకుల్ని ఆకట్టుకొంటారు.

రాజకీయ రంగ ప్రవేశం:

నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజక వర్గం నుండి 1978, 1983లో రెండు సార్లు ఆంధ్రప్రదేశ్ శాసన సభకు ఎన్నికయ్యారు. క్రమంగా భారతీయ జనతాపార్టీలో ప్రముఖ స్థానం వహించారు.  1998 నుండి వరుసగా మూడు సార్లు కర్నాటక నుండి రాజ్యసభకు ఎంపికయ్యారు. 1996-2000 మధ్య బి.జె.పి. వక్తగా పేరు తెచ్చుకొన్నారు.

పార్టీ పదవులు:

రాష్ట్ర స్థాయిలోనూ, కేంద్ర స్థాయిలోనూ బి.జె.పి.లో కీలక పదవులు అధిష్ఠించారు. 2004లో బి.జె.పి. జాతీయ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

మంత్రి పదవులు:

1999లో అటల్ బిహారీ వాజ్‍పేయి మంత్రివర్గంలో గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఎన్నో గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలు ప్రోత్సహించారు. 2014లో మోడీ మంత్రివర్గంలో పట్టణాభివృద్ధి, పార్లమెంటరీ వ్యవహారాల శాఖను కేటాయించారు. 2016లో రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఎంపికయ్యారు. 2016 జూలైలో సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ అదనపు బాధ్యతలు చేపట్టారు.

ఉపరాష్ట్రపతిగా:

2017 ఆగస్టులో 13వ ఉపరాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు పోటీలో గెలుపొందారు. స్వచ్ఛంద సంస్థ అయిన స్వర్ణభారత్ ట్రస్ట్ ద్వారా నెల్లూరు, విజయవాడ, హైదరాబాదులో ఎందరో యువతీయువకులకు ఉపాధి, శిక్షణ కల్పిస్తున్నారు. మాతృభాషాభిమాని. ఏటా ఉగాది ఉత్సవాలు తన ఇంట్లో ఘనంగా జరుపుతారు. 2001లో మా నాన్నగారు లక్ష్మీకాంతరావు స్మారక పురస్కారాన్ని గ్రామీణాభివృద్ధి శాఖామాత్యులుగా డా. ఇలపావులూరి పాండురంగారావుకు ప్రదానం చేశారు. వెంకయ్యనాయుడు, నేను బుచ్చిరెడ్డిపాళెం హైస్కూలులోనూ, నెల్లూరు వి.ఆర్. కళాశాలలోను చదువుకొన్నాం. ఆయన స్నేహశీలి.

1985లో హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్‌లర్ భద్రిరాజు కృష్ణమూర్తి గారికి సత్కారం

ఆంధ్రవిజ్ఞనకోశం – అంటు’మామిడి’:

మామిడిపూడి వెంకటరంగయ్య (1889 జనవరి  – 1982 జనవరి) నెల్లూరు జిల్లాకి చెందినవారు. 1907లో మదరాసు పచ్చయ్యప్ప కళాశాలలో డిగ్రీ పూర్తి చేసి అక్కడే ట్యూటర్‍గా చేరి 1910లో హిస్టరీ, ఎకనామిక్స్, పాలిటిక్స్‌లో ఎం.ఏ. సాధించారు. చదువుకుంటూ స్వాతంత్రోద్యమంల్లో చురుకుగా పాల్గొన్నారు. ఉద్యోగాలు ఆయనను వెంబడించి వచ్చాయి. 1927లో విజయనగరం మహరాజా వారి సంస్థానంలో దివాన్‍గా చేరారు. 1928-31 మధ్య నెల్లూరు వి.ఆర్. కళాశాల ప్రిన్సిపాల్.

సర్వేపల్లి వారు మామిడిపూడికి ఆహ్వానం:

వెంకటరంగయ్య ప్రతిభా వ్యుత్పత్తులు తెలుసుకున్న ఆంధ్ర విశ్వవిద్యాలయ వైస్ ఛాన్స్‌లర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ వారిని 1931లో రీడర్‍గా ఆహ్వానించారు. 1938లో ప్రొఫెసర్ అయ్యారు. యూనివర్శిటీ కళాశాల ప్రిన్సిపాల్‍గా 1944 వరకు పని చేశారు. బొంబాయి విశ్వవిద్యాలయం వారి ఆహ్వానం మేరకు 1949 నుండి 1952 వరకు పొలిటికల్ అండ్ సోషల్ సైన్స్ విభాగ అధ్యక్షత వహించారు.

బహుముఖీన ప్రతిభ:

వెంకట రంగయ్య అనేక పరిశోధనాత్మక గ్రంథాలు ప్రచురించారు.

కుటుంబ ఘనత:

మామిడిపూడికి పదిమంది సంతానం. మామిడిపూడి ఆనందం వృత్తి రీత్యా చార్టర్డ్ అకౌంటెంట్. రెండు పర్యాయాలు ఆయన రాజ్యసభ సభ్యులు. వారి కుమార్తె శాంతా సిన్హా. రంగయ్య మరో కుమారుడు పట్టాభిరామ్ – హిందూ దినపత్రికకు అసోసియేట్ ఎడిటరు. మామిడిపూడి వెంకటరంగయ్య ఫౌండేషన్‌ను 1981లో వారి స్మారకార్థం ఏర్పాటు చేసి బాలల  హాక్కులు, ఆరోగ్యం, సహజ వనరుల మేనేజ్‍మెంట్ గూర్చి కృషి చేస్తున్నారు. రంగయ్యకు 1968 లో పద్మభూషణ్; శాంతా సిన్హాకు 2004లో పద్మశ్రీ, రామన్ మెగసెసే అవార్డులు లభించాయి.

ఆంధ్ర విశ్వవిద్యాలయంలో వెంకటరంగయ్య (1931-1944) 14 సంవత్సరాలు ఆచార్యులుగా పని చేసి ఎందరో ఘనులను తీర్చిదిద్దారు. 93 ఏళ్ళ వయస్సులో 1982, జనవరి 13న సికింద్రాబాదులో పరమపదించారు.

1978లో డా. బెజవాడ గోపాలరెడ్డి గారితో కడపలో రచయిత

డిగ్రీలు లేని పాండిత్య ప్రకర్ష:

మల్లంపల్లి సోమశేఖర శర్మ (1891 – 1963) ప్రసిద్ధ చారిత్రక పరిశోధకులు. పశ్చిమ గోదావరి జిల్లాలో జన్మించారు. వీరి పూర్వీకులు తెలంగాణకు చెందినవారు. ఆంధ్ర చరిత్రకారులలో అగ్రతాంబూలం శర్మగారిదే. సాహిత్య రంగంలో పరిశోధనలు, రాజకీయ రంగంలో ఆయన విశేష కృషి చేశారు. రాజమండ్రిలో విద్యార్థిగా వుండగా, బిపిన్ చంద్రపాల్ ప్రసంగ ప్రభావంతో వందేమాతరం ఉద్యమంలోకి ఉరికారు.

రాజమండ్రిలో మెట్రిక్యులేషన్ పూర్తి చేసి పాత్రికేయునిగా జీవితం ఆరంభించి వివిధ పత్రికలలో కథలు, నాటకాలు, నవలలు ప్రచురించారు. క్రమంగా ఉమ్మడి మదరాసు రాష్ట్ర రాజధాని మదరాసుకు తరలివెళ్లారు. అక్కడ విజ్ఞన సర్వస్వ పండిత బృందంలో ఒకరై చరిత్ర పరిశోధన మొదలుపెట్టారు. శాసన లిపి పరిశోధనలో ఆరితేరారు. నేలటూరు వెంకటరమణయ్యతో కలిసి నెల్లూరు, రాయలసీమ ప్రాంతాల శాసనాలను పరిశోధించి భారతి, శారద, ఆంధ్రపత్రికలలో విశ్లేషించారు.

అగ్రశ్రేణి పరిశోధన:

The History of Reddi Kingdom and Kondaveedu and Rajahmundri – అనే ఆంగ్ల గ్రంథం అసంఖ్యాక శాసనాలు, కావ్యాలు, చారిత్రక రచనల సమాచార ఫలితం. వీరి రచనలు.

ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆధ్యాపకత్వం:

సోమశేఖర శర్మ ప్రతిభను గుర్తించి ఆంధ్ర విశ్వవిద్యాలయం వారు డిగ్రీలతో ప్రమేయం లేకుండా వారిని అధ్యాపకులుగా నియమించారు. ఎందరో చరిత్రకులను ఆయన తీర్చిదిద్దారు. ‘మల్లంపల్లి సోమశేఖర శర్మ హిస్టారికల్ రీసెర్చ్ ఫౌండేషన్’ విశాఖపట్టణంలో స్థాపించబడి ఏటా ప్రముఖ చరిత్ర పరిశోధకులను సన్మానిస్తోంది.

1941లో వైస్ ఛాన్స్‌లర్‍గా వున్న సి.ఆర్. రెడ్డి మల్లంపల్లిని డిగ్రీతో సంబంధం లేకుండా హిస్టరీ శాఖలో నియమించారు. చరిత్రకునిగా, శాసన పరిశోధకునిగా విశ్వవిద్యాలయంలో ఎనలేని కృషి చేశారు. రెడ్డి వంశ రాజుల చరిత్రను త్రవ్విపోసి గ్రంథస్థం చేసిన మహనీయుడు సోమశేఖర శర్మ గారు. అందుకే విశ్వనాథ సత్యనారాయణ – “డిగ్రీలు లేని పాండిత్యాలు వన్నెకు రాని పాడు కాలాన బుట్టి” అని బాధపడ్డారు. యశఃకాయుడు మల్లంపల్లి.

Exit mobile version