Site icon Sanchika

ఆచార్యదేవోభవ-2

[box type=’note’ fontsize=’16’] ఈ శీర్షిక ద్వారా గత 20వ శతాబ్దిలో ఎందరో విశ్వవిద్యాలయ, కళాశాలల తెలుగు అధ్యాపకులను/ఆచార్యులను తీర్చిదిద్దిన ప్రాతఃస్మరణీయ యశఃకాయులను పరిచయం చేస్తున్నారు డా. అనంత పద్మనాభరావు. [/box]

అసాధారణ ధారణా పటిమ:

[dropcap]ఉ[/dropcap]స్మానియా విశ్వవిద్యాలయ తెలుగుశాఖ తొలి రోజుల్లో రాయప్రోలు సుబ్బారావు, ఖండవల్లి లక్ష్మీరంజనంల కృషిని తెలుసుకొన్నాం. శాంతినికేతన్‌లో రవీంద్ర కవీంద్రుని అంతేవాసిగా వుండి ఉస్మానియాలో తెలుగు అధ్యాపకులుగా ఇంటర్ పాఠాలు చెప్పిన రాయప్రోలువారు 1940 నుండి ఎం.ఏ. పాఠాలు బోధించారు. 1919లో ప్రారంభమైన తెలుగుశాఖకు 1941లో వారు ఆచార్యులయ్యారు. 1946 వరకు ఆ శాఖాధ్యాక్షులు. ఆ తర్వాత ఖండవల్లి లక్ష్మీరంజనం 1964 వరకు అధ్యక్షులు. 1964లో దివాకర్ల వెంకటావధాని (1911-1986) శాఖాధ్యాక్షులయ్యారు. వారి హయాంలో ప్రాచ్యవిద్యా ప్రణాళికలో ఎం.ఓ.యల్. పరీక్షలు ప్రారంభించారు (1967). తెలుగుశాఖకు ఒక కన్ను ఎం.ఏ, మరో కన్ను ఎం.ఓ.యల్‌గా భావించారు. ఆయన అసాధారణ ధారణా పటిమగల మనీషి.

గ్రంథావిష్కరణ సభకు విచ్చేసినపుడు ఆ పుస్తకాన్ని ఆవిష్కరించి అరగంటలోపు తమ ఉపన్యాసంలో ఆ గ్రంథంలోని పద్యాలను అలవోకగా యథాతథంగా ఉదహరించడం 1985 ప్రాంతంలో ప్రత్యక్షంగా చూశాను. అవధాని పశ్చిమ గోదావరి జిల్లా యండగండిలో 1911లో జన్మించారు. తిరుపతి వేంకటకవులలో ఒకరైన దివాకర్ల తిరుపతి శాస్త్రి వీరి పినతండ్రి. చిన్నతనంలో వెంకటావధాని విజయవాడలో విశ్వనాథ సత్యనారాయణ ఇంట్లో వుండి చదువు కొనసాగించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో బి.ఏ ఆనర్సు పూర్తి చేశారు. వీరి గురువులు పింగళి లక్ష్మికాంతం, గంటి జోగిసోమయాజులు. ధర్మవరం రామకృష్ణమాచార్యులపై విమర్శవ్యాసం ప్రచురించారు. ఎం.ఏ ఆనర్స్ పొందారు.

ఉస్మానియా తెలుగు శాఖలో 1951లో చేరి 1957లో రీడరు, 1964లో ప్రొఫెసరు అయ్యారు. 1974-75 మధ్య ఎమరిటస్ ప్రొఫెసరు, 1975-78 మధ్య యు.జి.సి ప్రొఫెసర్‌గా వ్యవహరించారు. 15 మంది వీరి వద్ద పరిశోధన చేసి పి.హెచ్.డి. పొందారు. ఉపన్యాసకులుగా ఆంధ్ర రాష్ట్రంలోని మారుమూల గ్రామాలకు కూడా వెళ్లి తెలుగు సాహిత్య వైభవాన్ని చాటి చెప్పారు. యువ భారతి ఆధ్వర్యంలో ఎన్నో కావ్యాలు పరిచయం చేశారు. తనదైన విలక్షణశైలిలో ప్రసంగించడం ఆయన ప్రత్యేకత. వసుచరిత్ర ప్రసంగం చెబుతుండగా వర్షం పడింది. ప్రేక్షకులు గొడుగులు పట్టుకుని నించొని విన్నారు.

అల్లసాని పెద్దనగా అద్భుత ప్రదర్శన:

1960-80ల మధ్య ఆంధ్రదేశంలోని పలు ప్రాంతాలలో భువనవిజయ ప్రదర్శనలు ఘనంగా జరిగాయి. అందులో దివాకర్ల అల్లసాని పెద్దనగా అద్భుత వైదుష్యాన్ని ప్రదర్శించారు. దాదాపు 40 గ్రంథాలు ప్రచురించారు. తెలుగు శాఖ ఠీవిని తన వచస్సుతో వర్చస్సుతో నిలబెట్టారు.

భువన విజయం

అవధానిగారి కాలంలో తెలుగు శాఖలో MEN OF LETTERS ధారావాహిక ప్రసంగ కార్యక్రమం మొదలైంది. ఆ ప్రణాళికలో భాగంగా ఆధ్యాపకులొక్కక్కరు నిర్దేశింపబడిన కవిని గూర్చి 150 పుటల గ్రంథం తయారు చేయాలి. వీటిని యు.జి.సి సహకారంతో ప్రచురించారు.

  1. నన్నయభట్టారకుడు – ఆచార్య దివాకర్ల వెంకటావధాని
  2. ఎఱ్ఱాప్రగడ – డా. పి.యశోదారెడ్డి
  3. అల్లసాని పెద్దన – పల్లా దుర్గయ్య

ఈ మూడు గ్రంథాలు అలా వెలువడ్డాయి.

ఆంధ్ర సాహిత్య సదస్సు:

తెలుగు శాఖలో అధ్యాపకులు ఈ సదస్సులో పరిశోధనా వ్యాసాలు చదివి చర్చించే అవకాశం కల్పించారు. 1966 సెప్టెంబరులో ప్రారంభమై దాదాపు 16 సమావేశాలలో 80 దాకా వ్యాసాలు చర్చించబడ్డాయి. కార్యదర్శులుగా డా.జి.వి.సుబ్రమణ్యం, డా.యం.వీరభద్రశాస్త్రి వ్యవహరించారు. మరో కొత్త పథకం క్రింద ‘షార్ట్ సర్టిఫికెట్ కోర్సు’ ప్రారంభించారు. తెలుగు పండితులకు, కళాశాల అధ్యాపకులకు ఆధునిక దృక్పథాన్ని అలవరచడానికి అవధాని తద్వారా ప్రయత్నించారు. 1973 వరకు అవధాని ఆ శాఖాధ్యాక్షులు.  60 మంది దాకా సర్టిఫికెట్ కోర్సులో ఆంధ్రవిద్వాంసులు ఉపన్యాసాలిచ్చారు.

1964 నుండి 1973 వరకు తొమ్మిదేళ్లు దివాకర్ల తమ వచోవిన్యాసంతో, అసాధారణ ధారణాశక్తితో, సాత్విక ప్రవృత్తితో తెలుగు శాఖను పురోగమన దిశలో నడిపించారు. నన్నయ భారతం పై ఖండవల్లి లక్ష్మీరంజనం పర్యవేక్షణలో వారు చేసిన పి.హెచ్.డి పరిశోధనా గ్రంథం ఉత్తమ ప్రమాణాలతో నిండి వుంది. ఏది మాట్లాడినా, ఏమి వ్రాసినా సాధికారికంగా చెప్పగల ధిషణ ఆయనది.

తొలి తెలుగు ఎం.ఏ. విద్యార్థి – ‘గంగిరెద్దు’:

ఏకశిలా నగరానికి సమీపంలోని హనుమకొండలో పల్లా దుర్గయ్య జన్మించారు. ఉస్మానియాలో డిగ్రీ చదివారు. అప్పట్లో ఉద్యమ ప్రాభవం వల్ల కొంత కాలం నాగపూర్‌లో చదివి డిగ్రీ పూర్తి చేశారు. 1940 విద్యా సంవత్సరంలో ఉస్మానియాలో ఎం.ఏ. తెలుగు ప్రవేశ పెట్టారు. ఏకైక విద్యార్థిగా పల్లా దుర్గయ్య ఎం.ఏ.లో చేరారు. ఒకే విద్యార్థి-ముగ్గురు ఉపన్యాసకులు అని చమత్కరించేవారు. తెలుగు శాఖలోని రాయప్రోలు సుబ్బారావు, ఖండవల్లి లక్ష్మీరంజనంలతో బాటు అనుబంధ కళాశాలలో పని చేస్తున్న కురుగంటి సీతారామయ్య కూడా వీరికి పాఠాలు బోధించారు.

ఎం.ఏ. పూర్తి కాగానే అనుబంధ కళాశాలలో అధ్యాపకులుగా చేరి దుర్గయ్య 1960లో విశ్వవిద్యాలయంలో ఉపన్యాసకులుగా చేరారు. అంతకు ముందు 1945లో చాదర్‌ఘాట్ కళాశాలలో తెలుగు జూనియర్ లెక్చరర్‌గా చేరి 13 ఏళ్లు పని చేశారు. 1958-60 మధ్య హైదరాబాదు సాయం కళాశాల అధ్యాపకులు. తర్వాత 1960 నుండి 1976లో రిటైరయ్యేంత వరకు విశ్వవిద్యాలయ తెలుగు శాఖ కీర్తి ప్రతిష్ఠలు పెంపొందించారు.

ఖండవల్లి లక్ష్మీరంజనం పర్యవేక్షణలో దుర్గయ్య ప్రబంధ వాఙ్మయ వికాసంపై పరిశోధన చేసి 1960లో పి.హెచ్.డి. పొందారు. నేను కందుకూరి రుద్రకవి రచనల పై 1973-76 మధ్య పరిశోధన కొనసాగిస్తూ వారిని కలిశాను. పరిశోధనా గ్రంథం అప్పటికి ప్రచురింపబడలేదు. రుద్రకవి నిరంకుశోపాఖ్యానానికి బృహత్ కథామంజరిలోని ఠింఠాకరాళుని కథయే మూలమని తాము పరిశీలించిన అంశాన్ని నాకు వివరించారు.

కందుకూరు కళాశాలలో దేవులపల్లి కృష్ణశాస్త్రి, ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రిగార్లు

దుర్గయ్య పర్యవేక్షణలో జి.వి.సుబ్రమణ్యం, బోయి విజయలక్ష్మి, మాదిరాజు రంగారావు, యం.సుజాత పరిశోధనలు చేసి పి.హెచ్.డిలు పొందారు. దుర్గయ్య రచనలలో ‘గంగిరెద్దు’ కావ్యం ప్రసిద్ధం. కరుణరసాత్మక కావ్యంగా తెలంగాణా పల్లెపట్టుల జీవనవిధానం ఆధారంగా కల్పిత కావ్యం రచించారు. ఇందులో సంక్రాంతి వర్ణన పద్యాలు ప్రజాదరణ పొందాయి.

వీరి పాలవెల్లి పద్యగేయ సంపుటి ప్రశంసార్హం.

వీరి ఇతర రచనలు 1. చతురవచోనిధి, అల్లసాని పెద్దన.

తెలుగు శాఖలో తొలి విద్యార్థి (ఎం.ఏ.)గా దుర్గయ్య చరిత్ర సృష్టించారు.

రామనారాయణ జంట కవులు:

దివాకర్ల వెంకటావధాని తరువాత తెలుగు పీఠ అధ్యక్షత బాధ్యతలు 1973లో బిరుదురాజు రామరాజు చేపట్టారు. వరంగల్ సమీపంలోని దేవనూరులో 1925లో రామరాజు జన్మించారు. వరంగల్‌లో మహాత్మా గాంధీ పర్యటించినపుడు పాదయాత్రలో రామరాజు పాల్గొన్నారు. ఆర్య సమాజ ప్రభావం ఆయన పైన పడింది. నిజాం కళాశాలలో బి.ఏ. చదువుతున్న సమయంలో దాశరథితో పరిచయమైంది. నిజాం ప్రభువుకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో పాల్గొన్నందుకు 1947లో మూడు నెలల కారాగార శిక్ష పడింది. తొలి రోజుల్లో సి.నారాయణరెడ్డితో కలిసి రామనారాయణ జంటకవులుగా కొంత కాలం కొనసాగారు.

ఆచార్య బిరుదరాజు రామరాజు

1951లో తెలుగు శాఖలో ఉపన్యాసకులుగా చేరి 1973లో శాఖాధ్యక్షులయ్యారు. 1982 ఫిబ్రవరి వరకు ఆ పదవి నధిష్ఠించి డీన్‌గా రిటైరయ్యారు. ఖండవల్లి లక్ష్మీరంజనం పర్యవేక్షణలో జానపదగేయ సాహిత్యంపై పరిశోధన చేసి పి.హెచ్.డి. పొందారు. వీరి పర్యవేక్షణలో 37 మంది పి.హెచ్.డిలు పొందడం విశేషం. ఆంధ్రయోగులు అనే గ్రంథాన్ని నాలుగు సంపుటాలుగా ప్రచురించారు. వీరి కుమార్తె రుక్మిణి కాకతీయ విశ్వవిద్యాలయంలో ఆచార్యులుగా పదవీ విరమణ చేశారు.

రామరాజు సారథ్యంలో తెలుగు శాఖ పురోభివృద్ధిని సాధించింది. రామరాజుకు రాజాలక్ష్మీ పౌండేషన్ అవార్డు లభించింది. ఆధ్యాత్మిక రంగంలో విశేష కృషి చేశారు. వీరి హయాంలో రెండో ఆచార్య పదవిని భర్తీ చేసి సి.నారాయణ రెడ్డి పదోన్నతి పొందారు. 1977లో యు.జి.సి. వారు ఫ్యాకల్టీ ఇంప్రూ‌వ్‌మెంట్ ప్రోగ్రాం కింద తెలుగు శాఖను ఎంపిక చేశారు.

1977లో వేసవి శిబిరం నిర్వహించి 40 మందికి శిక్షణ ఇచ్చారు. సాహిత్య బోధనా పద్ధతుల గురించి ఆంధ్ర, శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయాచార్యులు విచ్చేసి బోధన చేయడం విశేషం. 1979లో ‘అధికార బాషగా – బోధన బాషగా తెలుగు’ అనే అంశంపై మూడు రోజుల సదస్సు నిర్వహించారు.

నన్ను ఆకాశవాణికి ఎంపిక చేసిన రామరాజు:

1975 జూన్‌లో ఆకాశవాణి హైదరాబాదు ప్రాంగణంలో ప్రొడ్యూసర్ ఉద్యోగానికి నేను ఇంటర్వ్యూ కెళ్ళాను. స్టేషన్ డైరక్టరు పి.బాలగురుమూర్తి, విజయవాడ డైరక్టరు బాలాంత్రపు రజనీకాంతరావులతో బాటు రామరాజు కమిటీలో సభ్యులు. నా పరిశోధనా సందర్భంగా వారితో నా పరిచయం 1974 నుండి వుంది. నా సమాధానాల పట్ల బోర్డు తృప్తి పడింది. నేను 1975 ఆగస్టులో కడపలో చేరాను.

1982-87 మధ్య నేను హైదరాబాదులో అసిస్టెంట్ డైరక్టర్‌గా పని చేసినపుడు పలు ప్రసంగాలకు తెలుగు శాఖకు చెందిన పలువురు అధ్యాపకులు రికార్డింగుకు వచ్చేవారు. అప్పుడు కూడా రామరాజు విశేషంగా ఆదరించేవారు. ధార్మిక చింతన గలవారు. నా పరిశోధనకు వారు adjudicator గా వుండి ప్రశంసా వాక్యాలు వ్రాశారు. రాజసం వుట్టిపడే ముఖ లక్షణాలు వారి ప్రత్యేకత. గంభీరమైనది వారి విలక్షణత.

Exit mobile version