Site icon Sanchika

ఆచార్యదేవోభవ-21

[box type=’note’ fontsize=’16’] ఈ శీర్షిక ద్వారా గత 20వ శతాబ్దిలో ఎందరో విశ్వవిద్యాలయ, కళాశాలల తెలుగు అధ్యాపకులను/ఆచార్యులను తీర్చిదిద్దిన ప్రాతఃస్మరణీయ యశఃకాయులను పరిచయం చేస్తున్నారు డా. అనంత పద్మనాభరావు. [/box]

అద్వైత సచ్చిదానందం:

[dropcap]ఆం[/dropcap]ధ్ర విశ్వవిద్యాలయం చేసుకొన్న అదృష్టం తొలి రోజుల్లో వేదాంతం జీర్ణించుకొన్న సర్వేపల్లి రాధాకృష్ణ పండితుడు వైస్-ఛాన్స్‌లర్‌గా పదవీ బాధ్యతలు చేపట్టడం. తొలి రోజుల్లోనే ఫిలాసఫీ శాఖను ప్రారంభించారు. అక్కడి వేదాంతం పాదులలో మొలకెత్తిన తత్వవేత్త, అంతర్జాతీయ ఖ్యాతి గడించిన కొత్త సచ్చిదానందమూర్తి. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో తత్వశాస్త్రంలో ఎం.ఏ. ఆనర్స్ 1946లో ప్రథమ శ్రేణిలో పాసయ్యారు. తిరుపతిలోని వెంకటేశ్వర కళాశాలలో లెక్చరర్‌గా చేరారు. అక్కడి నుండి ఒరిస్సా రాష్ట్రంలోని ఒక కళాశాలలో ఫిలాసఫీ ఉపాన్యాసకులుగా చేరి క్రమోన్నతి పొంది యు.జి.సి. వైస్-ఛైర్మన్‌గా ఎదిగారు. వీరి జీవితంలో ప్రధాన ఘట్టాలు:

ఉద్యోగ పర్వం:

ఈ విధంగా నాలుగు దశాబ్దుల సుదీర్ఘ విద్యారంగానుభవం గల సచ్చిదానందమూర్తి గుంటూరు నాగార్జున యూనివర్శిటీలో బౌద్ధ అధ్యయన కేంద్ర స్థాపనకు మూలకారకులు.

ఆకాశవాణి కవి సమ్మేళనం 1976

సామాన్య కుటుంబం:

గుంటూరు జిల్లా సంగం జాగర్లమూడిలో రైతు కుటుంబానికి చెందిన కొత్త వీరభద్రయ్య, రత్నమాంబ దంపతులకు 1924 సెప్టెంబరు 25న సచ్చిదానందమూర్తి జన్మించారు. గుంటూరు హిందూ కళాశాలలో డిగ్రీ పూర్తి చేశారు. తొలిసారిగా ఆంధ్ర విశ్వవిద్యాలయంలో తత్వశాస్త్ర శాఖలో ఎం.ఏ. ఆనర్స్ చేశారు. అక్కడే ఆచార్యులుగా, శాఖాధిపతిగా ఎదిగారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తత్వశాస్త్రవేత్తగా పేరు గడించారు. గ్రామీణ వాతావరణంలో పుట్టి పెరిగి జీవిత చరమాంకంలో సంగం జాగర్లమూడిలోనే గడిపారు.

చిన్న వయస్సులో వి.సి.:

ఆ రోజుల్లో తల పండిన వారిని విశ్వవిద్యాలయ వి.సి.లుగా నియమించేవారు. సచ్చిదానందమూర్తి 1975లో (50 ఏళ్ళు) శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయ వి.సి.గా నియమించబడ్డారు. 1975-78 మధ్య ఆ పదవిలో పని చేసి, తిరిగి ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆచార్యులుగా వెళ్ళారు. వెంకటేశ్వర విశ్వవిద్యాలయానికి ఆయన నాల్గవ వి.సి. 1954లో ప్రకాశం పంతులు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆ విశ్వవిద్యాలయం ప్రారంభించారు. తొలి వి.సి. యస్. గోవిందరాజుల నాయుడు ఒక దశాబ్ది (1954-64) పాటు మార్గదర్శనం చేశారు. ఆ తరువాత దశాబ్దిలో సి. వామన రావు, డా. డి. జగన్నాథ రెడ్డి (1964-74) వి.సి.లు. 1975లో సచ్చిదానందమూర్తి పదవీ స్వీకారం రెండు దశాబ్దుల ప్రాయపు విశ్వవిద్యాలయ ప్రగతికి దోహదం చేసింది.

1964లో నేను డిగ్రీ విద్యార్థిగా వి.ఆర్. కళాశాల, నెల్లూరులో సాంస్కృతిక ఉత్సవాలలో ఒక నాటికలో స్త్రీ పాత్ర ధరించి గోవిందరాజులు చేతుల మీదుగా బహుమతి స్వీకరించాను. వామనరావు హాయాంలో 1965-67 ఎం.ఏ. విద్యార్థిగా తిరుపతిలో రిపబ్లిక్ డే దినోత్సవం ప్రసంగాలు వారివి విన్నాను. ఆయన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యా డైరక్టరుగా లబ్ధప్రతిష్ఠులు. నేను కందుకూరు ప్రభుత్వ కళాశాల అధ్యాపకుడిగా పని చేస్తున్నపుడు డా. డి. జగన్నాథ రెడ్డి మా కళాశాల ఇన్‍స్పెక్షన్‌కు వచ్చారు. ఆయన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్య శాఖ డైరక్టర్‍గా ప్రసిద్ధులు. నేను తిరుపతి విశ్వవిద్యాలయంలో 1974 మార్చిలో అష్టావధానం చేసినపుడు వారు, వారి శ్రీమతి నన్ను సన్మానించారు.

సచ్చిదానందమూర్తి పదవీకాలంలో రెండుసార్లు ఉత్తర ప్రదేశ్ మాజీ గవర్నరు డా. బెజవాడ గోపాలరెడ్డి తిరుపతి విశ్వవిద్యాలయ సదస్సుల ప్రారంభోత్సవాలకు విచ్చేశారు. వాటి రికార్డింగుకు వెళ్ళినప్పుడు, గోపాలరెడ్డిగారితో పాటు నేనూ, వి.సి. బంగళాలో సాహిత్య గోష్ఠులకు హాజరయ్యాను. కొత్త రఘురామయ్య, గోపాలరెడ్డి కేంద్రమంత్రివర్గంలో పని చేశారు. రఘురామయ్య సచ్చిదానందమూర్తి కుటుంబ పెద్ద. విద్యావేత్తగా, తత్వవేత్తగా తిరుపతి దేవస్థానం ప్రచురించిన భగవద్గీతకు సచ్చిదానందమూర్తి చక్కటి పీఠిక వ్రాశారు.

యు.జి.సి. పదవీ బాధ్యతలు:

ప్రతిష్ఠాత్మక విశ్వవిద్యాలయ గ్రాంట్ల సంఘం అధికార పదవిలో లోగడ ఆంధ్ర విశ్వవిద్యాలయానికి వి.వి.గా పని చేసిన వి.యస్. కృష్ణ 1961లో అధ్యక్షులయ్యారు. ఉపాధ్యక్ష పదవిలో అదే విశ్వవిద్యాలయానికి చెందిన ఇద్దరు – సచ్చిదానందమూర్తి, బి. రామచంద్రరావులు పని చేశారు. అధ్యక్ష పీఠాన్ని అలంకరించారు ఆచార్య జి. రామిరెడ్డి.

సచ్చిదానందమూర్తి ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి తత్వశాస్త్రంలో పరిశోధన చేసి 1956లో పి.హెచ్.డి. పట్టా పొందారు. విదేశాలలో వివిధ విశ్వవిద్యాలయాలతో ఆయనకు ప్రగాఢ అనుబంధం వుంది.

25 విశ్వవిద్యాలయాలలో పరిశోధనలకు మార్గదర్శనం చేశారు.

1968 లోను, 1980 లోను ఇండియన్ ఫిలాసఫికల్ కాంగ్రెస్ సభలకు అధ్యక్షులుగా వ్యవహరించారు. భారతదేశంలో అనేక విశ్వవిద్యాలయాలు గౌరవ డాక్టరేట్లు ప్రదానం చేశాయి. డా. బి.సి.రాయ్ జాతీయ అవార్డును 1982లో తొలిసారిగా వీరికే ప్రదానం చేశారు. 1984లో పద్మభూషణ్, 2001లో పద్మవిభూషణ్‍లతో కేంద్ర ప్రభుత్వం సత్కరించింది.

కళాప్రపూర్ణ, మహామహోపాధ్యాయ ఆయనకు లభించిన గౌరవాలు. మహాయన బౌద్ధంపై విశేష కృషి చేశారు. ఇంగ్లీషులో, తెలుగులో 40 దాకా ప్రామాణిక గ్రంథాలు వెలువరించారు. వీరి ప్రముఖ గ్రంథాలు:

  1. Revelation and Reason in Advaita Vedanta
  2. Radhakrishnan: His Life and Ideals
  3. Studies in the Problems of Peace
  4. The Indian Spirit
  5. Metaphysics – Man and Freedom

1988లో బీజింగ్ విశ్వవిద్యాలయము, 1989లో రష్యన్ అకాడమీ ఆఫ్ స్టడీస్ వారు గౌరవ డాక్టరేట్లతో సత్కరించారు.

వీరి కుమారులు రఘునాథ్ ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్శిటీ విజయవాడ సెంటర్ డెప్యూటీ డైరక్టర్‍గా పని చేశారు. సంగం జాగర్లమూడిలో విశ్రాంత జీవనం గడుపుతూ సచ్చిదానందమూర్తి గుంటూరులో 86వ ఏట 2011 జనవరి 25న కాలధర్మం చెందారు. తత్వశాస్త్ర ఆచార్యుడిగ అఖండ ఖ్యాతి గడించారు.

అప్పటి రాష్ట్రపతి కె. ఆర్.నారాయణ్‍తో రాష్ట్రభతిభవన్‍లో రచయిత

అబ్బురపరచిన గ్రంథాలయాధికారి:

ఆంధ్ర విశ్వవిద్యాలయంలో వివిధ విభాగాలలో పని చేసిన ఎందరో సాహితీ క్షేత్రంలో తమ వంతు కృషి చేశారు. అట్టివారిలో అబ్బూరి రామకృష్ణారావు (1896-1979) ప్రముఖులు. మహాకవి శ్రీశ్రీ తనకు 1931లో అబ్బూరి వారి సాహచర్యంలో ఒక నూతన దృక్పథం ఏర్పడిందన్నారు. అప్పట్లో రామకృష్ణారావు ఆంధ్ర విశ్వవిద్యాలయ గ్రంథాలయాధికారి. రోజూ ఒక కొత్త పుస్తకం శ్రీశ్రీ చేత చదివించారు. శ్రీశ్రీ తన ‘అనంతం’లో ఈ విషయం ముచ్చటించారు.

అబ్బూరి గొప్ప భావకవి. 1896లో మే 20న గుంటూరు జిల్లా తెనాలి దగ్గర జెముడుపాడులో జన్మించారు. 15వ ఏట ఐదవ ఫారం చదువుతూ ‘జలాంజలి’ కవితారచన చేశారు. మైసూరులో వున్నప్పుడు రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మతో కలిసి ‘అనంతరామకృష్ణులు’గా జంట కవితలల్లారు. 1915లో ‘మల్లికాంబ’ అనే విషాద కావ్యం ప్రచురించారు.

1917-19 మధ్య శాంతినికేతన్ అంతేవాసి అయ్యారు. ఠాగూరు, అరవింద్ ఘోష్‌ల సాహచర్యంలో వంగ సాహిత్య ధోరణులతో బాటు రాజకీయ వాసనలు అబ్బాయి. 1919లో ఆంధ్ర దేశానికి తిరిగి వచ్చి రామదండు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య శిష్యుడిగా స్వరాజ్యోద్యమంలో పాల్గొన్నారు. ‘జలియన్‌వాలాబాగ్’ అనే బుర్రకథ వ్రాసి ప్రచారం చేశారు. నాటక రంగాభివృద్ధికి కృషి చేశారు.

అప్పట్లో ఆంధ్రపత్రిక దినపత్రిక వెలువడేది. అందులో సారస్వతానుబంధం మొదలు పెట్టించి – తానే ‘అభినవ కవితా ప్రశంస’ వ్యాసం ప్రచురించారు. కృష్ణాపత్రికలో ‘రసమంజరి’ అనే అనుబంధం ప్రారంభింపజేశారు. శాంతినికేతన్‍లో ‘ఉహాగానం’ సృష్టించారు. ‘నదీ సుందరి’ (1923), ‘మంగళసూత్రం’ (1924) ప్రచురించారు. కొన్ని ఇతర రచనలు, ‘త్రిశంకు కావ్యం’ నేడు అలభ్యం.

1926లో ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రారంభమైనపుడు మైసూరులో పరిచయమైన సి.ఆర్. రెడ్డి ముందు రామకృష్ణారావును తెలుగు శాఖలోనూ, ఆ తర్వాత విశ్వవిద్యాలయ లైబ్రేరియన్‍గాను నియమించారు. 34 సంవత్సరాల పాటు గ్రంథాలయాభివృద్ధికి అవిరళకృషి చేశారు. నవల, నాటక రచయితగా, విమర్శకుడిగా ప్రసిద్ధి. కన్యాశుల్కం నాటకంలో నటించారు (రామప్ప పంతులుగా).

శ్రీ పుట్టపర్తి వారు, శ్రీ దాశరథి గార్ల సమక్షంలో రచయిత

డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ విదేశీ పర్యటన ముగించుకుని వచ్చి తెచ్చిన కమ్యూనిస్టు సాహిత్యాన్ని ఆంధ్ర విశ్వవిద్యాలయ గ్రంథాలయానికి బహుకరించారు. వాటిని అధ్యయనం చేసిన అబ్బూరి వామపక్ష భావజాలం పట్ల ఆకర్షితులయ్యారు. 1943లో అభ్యుదయ రచయితల సంఘం స్థాపించారు. 1956లో ఈ సంస్థకు శ్రీశ్రీ అధ్యక్షులు.

ఆంధ్ర విశ్వ కళాపరిషత్ 1974లో అబ్బూరికి కళాప్రపూర్ణ ప్రదానం చేసింది. 1979 ఏప్రిల్ 30న అబ్బూరి కన్నుమూశారు. వీరి కుమారులు వరదరాజేశ్వరరావు ఆంధ్ర ప్రదేశ్ అధికార భాషా సంఘం అధ్యక్షులుగా పని చేశారు. వరద సతీమణి ఛాయాదేవి ప్రముఖ రచయిత్రి.

Exit mobile version