ఆచార్యదేవోభవ-24

0
2

[box type=’note’ fontsize=’16’] ఈ శీర్షిక ద్వారా గత 20వ శతాబ్దిలో ఎందరో విశ్వవిద్యాలయ, కళాశాలల తెలుగు అధ్యాపకులను/ఆచార్యులను తీర్చిదిద్దిన ప్రాతఃస్మరణీయ యశఃకాయులను పరిచయం చేస్తున్నారు డా. అనంత పద్మనాభరావు. [/box]

పరిశోధనలో సాటిలేని కొర్లపాటి:

[dropcap]కొం[/dropcap]దరి జీవితమే పరిశోధన కంకితం. కొందరి జీవితం సాహిత్య రచనకు. మరికొందరు శిష్యకోటిని ప్రోత్సహించడానికి జన్మిస్తారు. ఈ త్రివేణి సంగమం కొర్లపాటి శ్రీరామమూర్తి. సహస్ర చంద్ర దర్శనం చేసుకున్న వీరు సామాన్య రైతు కుటుంబంలో తూర్పు గోదావరి జిల్లా అంబాజీపేట సమీపంలో 1929 అక్టోబర్ 17 న (కొర్లపాటివారి పాలెంలో) ఐదుగురిలో మూడో సంతానంగా పుట్టారు. స్కూలు ఫైనల్ దశలో తండ్రి మరణం – కుటుంబ బరువు బాధ్యతలు పైనబడ్డాయి. వ్యవసాయాధారిత కుటుంబం. వంశ పారంపర్యంగా వస్తున్న జ్యోతిష పరిశీలన.

తండ్రి చాటున పెరిగిన బిడ్డ గావున ఒక్కసారిగా వ్యవసాయం అజమాయిషీ చేసే బాధ్యత స్వీకరించక తప్పలేదు. కానీ విద్యార్జనా తృష్ణ నశించలేదు. కాకినాడలోని పీఠికాపురాధీశ కళాశాలలో ఇంటరు, బీఏ భీమవరంలోని డబ్ల్యూజీబీ కళాశాలలో 1950-53 మధ్య పూర్తి చేశారు. ఇంటర్ కాగానే వివాహం జరిపించారు పెద్దలు.

డిగ్రీ పూర్తి కాగానే భీమవరంలోను, రాజమండ్రి కళాశాల లోను రెండేళ్ళు (1953-55) తెలుగు శాఖ ట్యూటర్‍గా పని చేశారు. అప్పుడే నాటక రచనకు నాంది పలికారు. అప్పట్లో  ఆంధ్ర విశ్వవిద్యాలయం నవలల పోటీ నిర్వహించేది. విశ్వనాథ వారి నవలకు బహుమతి లభించింది. అలానే 1955 జవనరి నెలలో శ్రీరామమూర్తి నవలకు బహుమతి లభించింది

ఆంధ్ర విశ్వకళా పరిషత్‌‌లో తొలి అడుగు:

బీఏ ఆనర్సులో చేరడానికి 1955 జూన్‌లో తొలిసారిగా విశాఖపట్నంలో అడుగుపెట్టారు. ఆ శుభ సమయం ఆయన జీవితంలో మరపురాని క్షణం. 1989లో అదే తెలుగు శాఖలో ప్రొఫెసర్‌గా రిటైరయ్యేవరకు విశ్వవిద్యాలయంతో బంధం వీడలేదు. ఆనర్స్‌లో స్వర్ణ పతకం 1957లో సాధించారు. వెంటనే పరిశోధక విద్యార్థిగా శ్రీనాథుని సాహిత్యం ఎంచుకుని పి.హెచ్.డి. గడించారు.

ఉద్యోగ వివరాలు:

  • 1959 – 66: ఆంధ్ర విశ్వవిద్యాలయం తెలుగుశాఖ ఉపన్యాసకులు
  • 1966 – 83: ఆంధ్ర విశ్వవిద్యాలయం తెలుగుశాఖ రీడరు
  • 1983 – 89: ఆంధ్ర విశ్వవిద్యాలయం తెలుగుశాఖ ప్రొఫెసర్‌

(1979-1982 మధ్య శాఖాధ్యక్షులు. అంతకు ముందు వరకు యస్వీ జోగారావు శాఖాధ్యక్షులు)

  • 1990: యు.జి.సి. ఎమెరిటిస్‌ ప్రొఫెసరు
ముల్క్‌రాజ్ ఆనంద్ రచన ‘మార్నింగ్ ఫేస్’‍కు రచయిత అనువాదాన్ని ఆవిష్కరిస్తున్న ముల్క్‌రాజ్ ఆనంద్ (1991)

వైవిధ్యభరితమైన రచనలు:

  • నవల: చిత్రశాల (1957), ద్వితీయ ముద్రణ 1968
  • కథల సంపుటులు: గుడిగోపురం (1957), వీణ (1961)
  • కావ్యఖండిక సంపుటి: సువర్ణరేఖలు (1976)
  • చారిత్రక నాటకాలు: ధర్మజ్యోతి (1967), ప్రతిజ్ఞ (సంస్కృతానువాదము 1976), పాండవులమెట్ట (1985), పలనాటి వీరచరిత్ర (1985), శ్రీ కృష్ణదేవరాయలు, భువన విజయము (1997)
  • సాంఘిక నాటకాలు: సమత (2005), నటన (2005)
  • పరిశోధనా గ్రంథాలు: శ్రీనాథుడు (1971), ఈశ్వరార్చన కళాశీలుడు (డి.లిట్‌ 1974), కావ్యజ్యోత్స్న (1977), నాథయోగి వేమన (1987), చరిత్రచర్చ (1989), సాహిత్య సంపద (1989), సాహిత్యసమస్యలు (1990), సాహిత్యమంజరి (2004)

సాహిత్య చరిత్ర:

తెలుగు సాహిత్య చరిత్ర, ఐదు భాగాలు (1991-98 మధ్య) ప్రామాణికమైన సాహిత్య చరిత్రగా గుర్తింపు పొందింది. వీరి సిద్ధాంతీకరణను పలువురు పరిశోధకులు అంగీకరించారు.

కందుకూరి రుద్రకవి జీవితకాల విషయంలో నేను చేసిన సిద్ధాంతీకరణను శ్రీరామమూర్తి అంగీకరించడం తాతాచార్యుల ముద్రగా అందరూ భావిస్తున్నారు. ఆయన జీవితమంతా శ్రీనాథునిపై పరిశోధనకు వెచ్చించారు. అంతకుమించి సాహిత్యచరిత్ర రచనకు జీవితమంతా ధారపోశారు. ఈనాడు ఆంధ్రదేశంలో ఆరేడు సాహిత్యచరిత్రలు చెలామణీలో ఉన్నాయి. పింగళి లక్ష్మీకాంతం మొదలు ఆధునికులలో వెలమల సిమ్మన్న, ధ్వానాశాస్త్రి వరకు ఎందరో అనర్ఘమణిరత్నాల వంటి కవుల చరిత్రను రచించారు. ఆరుద్ర సంపుటాలు పరిశోధనా పటిమకు, నిరంతర అధ్యయనానికీ నిదర్శనాలు. తంజావూరు లైబ్రరీ వంటి గ్రంథాలయాలలో నెలల తరబడి అన్నాహారాలు మాని ఆయన త్రవ్వి వెలికి తీసిన ప్రాచీన కవులెందరో!

జూలై 26, 2011న కొర్లపాటి వారు కన్నుమూశారు. నిరంతర ఈశ్వరార్చన కళాశీలుడు కనుమరుగయ్యాడు. చారిత్రక నవల, నాటకాల రచనకు ఆయన ప్రాధాన్యమిస్తూ సాహిత్యచరిత్రకు అగ్రపీఠం వేశారు.

ఈనాడు రామోజీరావు గారు, ప్రొఫెసర్ బషీరుద్దీన్‌తో 1986లో రచయిత

తనకు తానే సాటి ‘కొర్లపాటి’:

ఆయన శిష్యుడు జోస్యుల కృష్ణబాబు గారి మాటల్లో-

“సాహిత్య చరిత్రను కొర్లపాటి శ్రీరామమూర్తి గారే బోధించాలి. ఆయన ముఖం తిప్పరు. మనమూ తిప్పలేం. గంటా ఎప్పుడైపోయిందో తెలీదు. నన్నెచోడుని కుమారసంభవాన్ని గూర్చి చెబుతూ అందర్నీ తన వాదన వైపు లాక్కుపోయేవారు. ఈ విషయంలో ఎలా కుదురుతుందీ? అనేవాళ్ళే గానీ ఆయనకు ఎదురుపడి వాదించిన వాళ్లెవరూ కనిపించలేదు.

శ్రీనాథుని గూచి చెపుతుంటే పరకాయ ప్రవేశమే. ఆంధ్రీకరణ గూర్చి చెప్పేటప్పుడు శ్రీహర్షుని నైషధ శ్లోకమూ, దానికి శ్రీనాథుని అనువాదమూ పుస్తకం చూడకుండానే చెబుతూ వివరించేవారు. విపరీతమైన పరిశోధన జిజ్ఞాస వీరి సొంతం.

‘కర్ణాట క్షితిపాల మౌక్తిక సభాగారాంతర’ అంటూ పాఠం మొదలుపెడితే ఇక తల తిప్పబుద్ధి వేసేది కాదు. వీరి పాఠం రన్నింగ్ నోట్సు వ్రాసుకోవడానికి చాలా వీలుగా ఉండేది. నాలో సాహిత్యచరిత్రకు శ్రీపాద కృష్ణమూర్తి బీజాలు వేసి, నీరు పోసి, మొక్క మొలిపిస్తే, కొర్లపాటి మేష్టారు పుష్ఫఫలసమం చేశారు. ఈ ఇరువురి పాఠాలూ ఇప్పటికీ నా చెవుల్లో మార్మోగుతూనే వుంటాయి.”

కొర్లపాటీ! నీకు నీవే సాటి.

సాహిత్య ‘ప్రచారక్’ చిలుకూరి:

చిలుకూరి సుబ్రమణ్యశాస్త్రి (1928 సెప్టెంబరు 10) వైదిక పండిత కుటుంబంలో జన్మించారు. కృష్ణాజిల్లాలో ప్రాథమిక విద్యను పూర్తి చేసి 1945లో ఇంటర్ చేశారు. అప్పటి నుండి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ప్రచారక్‌గా తూర్పు గోదావరి జిల్లాలో పని చేశారు. 1950లో హిందూస్థాన్ సమాచార్ పత్రిక నిర్వహించారు. చదువుపై శ్రద్ధతో ఆంధ్ర విశ్వవిద్యాలయంలో తెలుగు ఆనర్సు చదివి 1959లో పట్టభద్రులైనారు. అప్పట్లో ఆచార్యులుగా వున్న కె.వి.ఆర్. నరసింగం వద్ద పి.హెచ్.డి.కి – ‘ఆంధ్ర సాహిత్యంలో సామెతలు – నుడికారాలు – సేకరణ’ అనే అంశం ఎంచుకుని సిద్ధాంత వ్యాసం 1963లో సమర్పించారు.

ప్రొ.కశిరెడ్డి వెంకటరెడ్డి గారితో 2001లో రచయిత

తెలుగు శాఖలో తొలి అడుగు:

సుబ్రమణ్యశాస్త్రి 1966లో తెలుగు శాఖలో అధ్యాపకులుగా చేరారు. క్రమంగా రీడరు, శాఖాధ్యక్షులు (1982-85), ఆచార్యులై 60వ ఏట 1988లో పదవీ విరమణ చేశారు. వీరి వద్ద 15 మంది పి.హెచ్.డి. పట్టాలు పొందారు. పరిశోధనలకు ఆయన మార్గదర్శనం చేశారు. వీరి హయాంలో కొత్త ఒరవడి సృష్టించారు. తెలుగు శాఖలో పరిశోధక విద్యార్థులు వారానికొకరు తమ పరిశోధనా కృషిని గూర్చి పదుగురి సమక్షంలో మాట్లాడాలి. ఇతరుల సందేహాలకు సమాధానాలు చెప్పాలి. ప్రతీ శనివారం ఈ సెమినార్‌లు క్రమం తప్పకుండా జరిగేవి. ఆయన పదవిలో ఉన్నంత కాలం అది కొనసాగింది. కేవలం సాహిత్య విషయాలే కాక, సంస్కృతి, ధర్మం, దేశభక్తి, క్రమశిక్షణల గూర్చి ముచ్చటించేవారు. ఆర్.యస్.యస్. ప్రాంత ప్రచారక్‌గా వ్యవహరించారు.

వారి సహాధ్యాపకురాలు కోలవెన్ను మలయవాసిని మాటల్లో… “చిలుకూరి వారు నిరంతరం చిరునవ్వు చిలకరింపజేస్తూ, తెలుగు శాఖ అభివృద్ధికి నిరంతరం కృషి చేశారు. పోతన సాహిత్య గోష్ఠిలో ‘పోతన ఆత్మీయత’ అనే ఆయన ప్రసంగం పరిశోధనాత్మకం. ఆజానుబాహులు, నిండైన విగ్రహం, చూడగానే నమస్కరించాలనే భావన కలుగుతుంది…. నేను రిటైరయిన రోజున వారిని చూడడానికి వెళ్ళాను. ‘బాగా చిక్కిపోయారు మేష్టారు!’  అన్నాను.

ఆయన ‘ఇది అబ్రిజ్డ్‌డ్ వెర్షన్ అమ్మా!’ అన్నారు. అంతటి చమత్కారి.”

చిలుకూరి వారు 2009 మే 15న పరమపదించారు. 2015లో వీరి శ్రీమతి శాంతమ్మ వీరి సిద్ధాంత గ్రంథం ప్రచురించారు. ఉపకులపతి ఆవిష్కరించారు.

(విషయ సేకరణ: ఆచార్య కోలవెన్ను మలయవాసిని సహకారంతో)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here