Site icon Sanchika

ఆచార్యదేవోభవ-26

[box type=’note’ fontsize=’16’] ఈ శీర్షిక ద్వారా గత 20వ శతాబ్దిలో ఎందరో విశ్వవిద్యాలయ, కళాశాలల తెలుగు అధ్యాపకులను/ఆచార్యులను తీర్చిదిద్దిన ప్రాతఃస్మరణీయ యశఃకాయులను పరిచయం చేస్తున్నారు డా. అనంత పద్మనాభరావు. [/box]

శ్రీ వేంకటేశ్వరుని సన్నిధిలో…

[dropcap]ఎ[/dropcap]న్నడో ఆంధ్ర విశ్వవిద్యాలయ స్థాపన జరిగింది (1926). రాయలసీమకు చెందిన విద్యార్థులు అటు మదరాసు విశ్వవిద్యాలయం గాని లేదా ఇటు విశాఖపట్టణం ఆంధ్ర విశ్వవిద్యాయానికి గాని ఉన్నత విద్యకు వెళ్ళవలసివచ్చేది. 1953 అక్టోబరులో తొలి భాషా ప్రయుక్త ఆంధ్ర రాష్ట్రం కర్నూలులో ఏర్పడి టంగుటూరి ప్రకాశం పంతులు ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన ముందుచూపుతో 1954లో తిరుపతిలో శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం ప్రారంభించబడింది. సువిశాలమైన భూమిని తిరుమల తిరుపతి దేవస్థానం విరాళంగా అందించింది. తొలి వైస్ ఛాన్స్‌లర్‍గా సీరం గోవిందరాజులు నాయుడు నియమితులయ్యారు. ప్రస్తుతం తిరుపతిలో శ్రీ పద్మావతీ మహిళా విశ్వవిద్యాలయం, శ్రీ వేంకటేశ్వర పశు విశ్వవిద్యాలయం, శీ వేంకటేశ్వర వేదిక్ విశ్వవిద్యాలయం, శ్రీ వేంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ (SVIMS), జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయాలున్నాయి.

‘జ్ఞానం సమ్యగవేక్షణం’ అనే మోటో శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం ఎంచుకుంది. దాదాపు 400 మంది బోధనా అధ్యాపకులు, ఐదు వేల మంది విద్యార్థులున్నారు. 1954లో ఆర్ట్స్ కళాశాల తి.తి.దే. భవనాలలో ప్రారంభమైంది.

ఉపకులపతులు:

ఈ విశ్వవిద్యాలయ వైస్-ఛాన్స్‌లర్ల వివరాలివి:

1954-64 యస్. గోవిందరాజులు నాయుడు
1964-69 సి. వామన రావు (విద్యా శాఖ డైరక్టరు)
1969-75 డా. డి. జగన్నాథ రెడ్డి (వైద్యశాఖ డైరక్టరు)
1975-78 ఆచార్య కొత్త సచ్చిదానంద మూర్తి (ఫిలాసఫీ)
1979-80 ఆచార్య యం. శాంతప్ప (మదరాసు)
1980-84 ఆచార్య యం.వి.రామశర్మ (ఇంగ్లీషు)
1984-87 ఆచార్య జి.యన్. రెడ్డి (తెలుగు)
1988-91 ఆచార్య యస్.వి.జె. లక్ష్మణ్ (ఫిజిక్స్)
1991-94 ఆచార్య పి. జయరామరెడ్డి (ఫిజిక్స్)
1994-97 ఆచార్య రాళ్లపల్లి రామమూర్తి (జువాలజీ)
1998-2001 ఆచార్య కొలకలూరి ఇనాక్ (తెలుగు)
2001-2004 ఆచార్య పి. మురళి (మేనేజ్‍మెంట్ స్టడీస్)
2004-2007 ఆచార్య యస్. జయరామిరెడ్డి (ఫిజిక్స్)
2008 ఆచార్య సి. రత్నం (9 నెలలు)
2008-2011 ఆచార్య యన్. ప్రభాకర రావు (ఫిజిక్స్)
2011-2015 ఆచార్య డబ్ల్యూ. రాజేంద్ర (జువాలజీ)
2015-2018 ఆచార్య ఏ. దామోదరం (జె.ఎన్.టి.యు)
2018-2020 ఆచార్య వి.వి.యన్. రాజేంద్ర ప్రసాద్ (ఇంగ్లీషు)
2020- ఆచార్య కె. రాజారెడ్డి (చరిత్ర)
శ్రీ బంగారు లక్ష్మణ్ సమక్షంలో పిరాట్ల గారిని సత్కరిస్తున్న రచయిత

కీర్తి తోరణాలు:

ఈ విశ్వవిద్యాలయంలో చదివినవారు ఉన్నత పదవులధిష్ఠించారు.

  1. శ్రీ కోట్ల విజయభాస్కరరెడ్డి, ఆం. ప్ర. ముఖ్యమంత్రి, కేంద్రమంత్రి
  2. శ్రీ యన్. చంద్రబాబు నాయుడు, ఆం. ప్ర. ముఖ్యమంత్రి
  3. డా. వై.యస్. రాజశేఖరరెడ్డి, ఆం. ప్ర. ముఖ్యమంత్రి
  4. శ్రీ ఏ.వి.ఎస్. రెడ్డి, ఐఎఎస్, కేంద్ర కార్యదర్శి, ఢిల్లీ
  5. డా. ఆర్. అనంతపద్మనాభరావు, దూరదర్శన్ అడిషనల్ డైరక్టర్ జనరల్

మరెందరో…

జిల్లాకో యూనివర్శిటీ:

దాదాపు రెండు దశాబ్దుల పాటు వేంకటేశ్వర విద్యాలయ పరిధిలో రాయలసీమ నాలుగు జిల్లాలు, నెల్లూరు జిల్లా మొత్తం 5 జిల్లాల కళాశాలలుండేవి. 1967-68 విద్యా సంవత్సరంలో అనంతపురం పి.జి.సెంటరును తిరుపతిలోనే ప్రారంభించారు. మరుసటి సంవత్సరం దానిని అనంతపురం ఆర్ట్స్ కళాశాలకు మార్చి ఎం.ఏ. క్లాసులు నడిపారు. మహాదేవశాస్త్రి స్పెషల్ ఆఫీసరు. తర్వాత జి.యస్. శ్రీదేవి డైరక్టరుగా వచ్చారు. 1981లో పూర్తి స్థాయి విశ్వవిద్యాలయం అయింది.

కర్నూలులో పి.జి. సెంటర్ ప్రారంభించి, తరువాత రాయలసీమ విశ్వవిద్యాలయంగా మార్చారు. చిత్తూరు జిల్లాలోని కుప్పంలో ద్రవిడ విశ్వవిద్యాలయం నెలకొల్పారు. కడపలో పి.జి.సెంటరు ప్రారంభించి, తర్వాత యోగి వేమన విశ్వవిద్యాలయంగా నామకరణం చేశారు. కావలిలో పి.జి.సెంటరు ఏర్పాటైంది. ఆ తరువాత 2006లో నెల్లూరులో విక్రమసింహపురి విశ్వవిద్యాలయం నెలకొల్పి తొలి వి.సి.గా శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయ ఆంగ్లభాషాచార్యులుగా పదవీ విరమణ చేసిన ఆచార్య సి.ఆర్. విశ్వేశ్వరరావును నియమించారు. వి.ఆర్. కళాశాల ఆవరణలో క్లాసులు ఏర్పాటు చేసి కృత్యాద్యవస్థలో విద్యాసంస్థను ఉన్నత ప్రమాణాల దిశగా విశ్వేశ్వరరావు మూడేళ్ళు నడిపించారు. 2007లో వారికి నేను మా నాన్నగారి పేర ఏర్పాటు చేసిన అనంతలక్ష్మీకాంత సాహితీపురస్కారం అందించాను. ఇప్పుడా విశ్వవిద్యాలయానికి స్వంత భవనాలు విశాలంగా వచ్చాయి.

సమాచార ప్రసార శాఖల మంత్రి శ్రీ జైపాల్ రెడ్డి గారితో రచయిత

ఇతర విశ్వవిద్యాలయాలకు వి.సి.లుగా వెళ్ళిన వ్యక్తులు:

ఆచార్య ముజఫర్ అలీ అబ్దుల్ హక్ ఉర్దూ విశ్వవిద్యాలయం, కర్నూలు
ఆచార్య పద్మనాభరెడ్డి శ్రీ వేంకటేశ్వర పశు విశ్వవిద్యాలయం, తిరుపతి
ఆచార్య యస్. జె. లక్ష్మణ్ నాగార్జున విశ్వవిద్యాలయం, గుంటూరు
ఆచార్య పి.ఆర్. నాయుడు శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం, అనంతపురం
ఆచార్య రత్నకుమారి పద్మావతీ మహిళా విశ్వవిద్యాలయం, తిరుపతి
ఆచార్య యం.జె. కేశవమూర్తి శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం, అనంతపురం
ఆచార్య పి. రాయపరెడ్డి పద్మావతీ మహిళా విశ్వవిద్యాలయం, తిరుపతి
ఆచార్య సరోజమ్మ పద్మావతీ మహిళా విశ్వవిద్యాలయం, తిరుపతి
ఆచార్య జమున పద్మావతీ మహిళా విశ్వవిద్యాలయం, తిరుపతి
ఆచార్య ఈడిగ సత్యనారాయణ ద్రవిడ విశ్వవిద్యాలయం, కుప్పం
ఆచార్య రాజారాం రెడ్డి విక్రమసింహపురి విశ్వవిద్యాలయం, నెల్లూరు
ఆచార్య కె. రత్నయ్య ద్రవిడ విశ్వవిద్యాలయం, కుప్పం
ఆచార్య పి.వి. అరుణాచలం ద్రవిడ విశ్వవిద్యాలయం, కుప్పం

ప్రారంభ దశ:

1954 సెప్టెంబరు 2న 6 బోధనా శాఖలతో విశ్వవిద్యాలయం ప్రారంభమైంది. ప్రకాశం పంతులుతో బాటు ఉప ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి కూడా సభలో పాల్గొన్నారు. తొలి స్నాతకోత్సవం 1958 ఫిబ్రవరి 14న జరిగింది. ఆ సమయంలో నీలం సంజీవరెడ్డికి గౌరవ డాక్టరేట్ ప్రదానం చేశారు.

తెలుగు శాఖ:

విశ్వవిద్యాలయం స్థాపించిన ఐదేళ్ళకు 1959-60 విద్యాసంవత్సరంలో తెలుగు విభాగం ప్రారంభమయింది. 1981లో దానిని తెలుగు అధ్యయన విభాగంగా మార్చారు. ప్రస్తుతం ఏటా 40 మంది రెండేళ్ళ ఎం.ఏ. కోర్సులలో చేరుతున్నారు. దానికి తొడు 18 నెలల పూర్తి కాలం, 30 నెలల పార్ట్ టైం ఎం.ఫిల్ కోర్సులున్నాయి. మూడేళ్ళ పూర్తికాలం లేదా నాలుగేళ్ళ పార్ట్ టైం పి.హెచ్.డి. కోర్సు లభ్యం. భాష, సాహిత్యాలపై పరిశోధనలు విస్తృతంగా జరిగాయి. వ్యావహారిక భాషను సిద్ధాంత గ్రంథంలో వాడవచ్చునని ప్రకటించిన తొలి విశ్వవిద్యాలయం ఇది. నవంబరు 2009లో స్వర్ణోత్సవాలు వైభవంగా జరిగాయి. 1973లో కుద్దూరి సుబ్బారెడ్డి తొలిసారిగా వ్యావహారిక భాషలో సిద్ధాంత గ్రంథం రూపొందించారు. తులనాత్మక అధ్యయనం విషయంలో ఇంగ్లీషు, హిందీ, తమిళ, ఉర్దూ శాఖలతోనూ, ఇతర విశ్వవిద్యాలయాలతోనూ తెలుగు శాఖ కలిసి పనిచేస్తోంది.

దిగ్దంతులైన ఆచార్యులు:

తొలినాళ్ళలో తెలుగుశాఖలో ఆచార్యులుగా పని చేసిన దిగ్దంతులు యావద్భారతదేశంలోనే పేరు మోసిన పండితులు. సర్వశ్రీ రాయప్రోలు సుబ్బారావు, భూపతి లక్ష్మీనారాయణరావు, ఆచార్య పింగళి లక్ష్మీకాంతం (1961-65), భద్రిరాజు కృష్ణమూర్తి ప్రభృతులు చిరస్మరణీయులు.

భూపతి లక్ష్మీనారాయణరావు ప్రభుత్వ కళాశాలలో పని చేసి తిరుపతికి వచ్చారు. వారు 1949 ప్రచురించిన ‘భారతము – తిక్కన రచన’ ప్రామాణికము. వారు 1959-61 మధ్య తెలుగు శాఖాధ్యక్షులు.

సాహిత్య అకాడమీ అధ్యక్షులు రమాకాంత్ రథ్‌ నుంచి మొమెంటో స్వీకరిస్తున్న రచయిత

మా తరానికి అధ్యాపకులు:

1965-67 సంవత్సరంలో నేను తెలుగు ఎం.ఏ. చేసి స్వర్ణపతకం సాధించాను. అధ్యాపకుడిగా పని చేస్తూ 1976లో పి.హెచ్.డి. సంపాదించాను. 1965 మే నెలలో పింగళి లక్ష్మీకాంతం రిటైరయ్యారు. 1965 జూన్‍లో మా క్లాసులు ఆరంభమయ్యాయి. ఆచార్య జి.యన్.రెడ్డి రీడర్‍గా, హెడ్‌గా ఉన్నారు. ఇతర అధ్యాపకులు – డా. కోరాడ మహాదేవశాస్త్రి (రీడరు), డా. జీరెడ్డి చెన్నారెడ్డి (రీడరు), డా. జాస్తి సూర్యనారాయణ (రీడరు), తిమ్మవజ్ఝల కోదండరామయ్య, పంగనమల బాలకృష్ణమూర్తి ఉపన్యాసకులు. కొంతకాలానికి మొదటి ముగ్గురూ ప్రొఫెసర్లు అయ్యారు.

గత ఆరు దశాబ్దుల కాలంలో పదుల సంఖ్యలో అధ్యాపకులు చేరారు. అధిక శాతం అక్కడే చదువుకున్నవారు. అక్కడే ఉపన్యాసకులుగా చేరి రీడర్లు, ప్రొఫెసర్లు అయ్యారు. తెలుగు శాఖను సుసంపన్నం చేశారు. ప్రస్తుతం 2021-22 విద్యా సంవత్సరంలో పని చేస్తున్న ఆచార్యులు వీరు – డా. యస్. రాజేశ్వరి (శాఖాధ్యక్షులు). ఇతరులు – పేట శ్రీనివాసులు రెడ్డి, కె. దామోదర నాయుడు, యన్. మునిరత్నమ్మ, మేడిపల్లి రవికుమార్, ఆర్ రాజేశ్వరమ్మలు.

పింగళి లక్ష్మీకాంతం మదరాసు, ఆంధ్ర, శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయాలు మూడింటిలో పని చేసిన ఘనత వహించారు. రాయప్రోలు సుబ్బారావు తర్వాత ఉస్మానియాకు వెళ్ళారు. భద్రిరాజు కృష్ణమూర్తి ఉస్మానియా లింగ్విస్టిక్స్ విభాగానికి వెళ్ళి, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం వైస్-ఛాన్స్‌లర్ అయ్యారు. తెలుగు శాఖ నుండి జి.యన్.రెడ్డి వైస్-ఛాన్స్‌లర్ అయ్యారు. అదే సమయంలో దోణప్ప తెలుగు విశ్వవిద్యాలయం, భద్రిరాజు కేంద్రీయ విశ్వవిద్యాలయాలకు ఉపకులపతులుగా వుండటం తెలుగు భాష చేసుకున్న అదృష్టం. పరిశోధనా రంగంలోనూ, పాఠ్యప్రణాళిక రూపకల్పన విషయంలోనూ శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం ఘన చరిత్రను కలిగి ఉంది. 1968లో అనంతపురం పి.జి. సెంటరు ఏర్పడడంతో కోరాడ మహాదేవశాస్త్రి అక్కడికి ప్రొఫెసరుగా, స్పెషల్ ఆఫీసర్‌గా వెళ్ళారు.

Exit mobile version