ఆచార్యదేవోభవ-3

0
2

[box type=’note’ fontsize=’16’] ఈ శీర్షిక ద్వారా గత 20వ శతాబ్దిలో ఎందరో విశ్వవిద్యాలయ, కళాశాలల తెలుగు అధ్యాపకులను/ఆచార్యులను తీర్చిదిద్దిన ప్రాతఃస్మరణీయ యశఃకాయులను పరిచయం చేస్తున్నారు డా. అనంత పద్మనాభరావు. [/box]

అదృష్టలక్ష్మి వరించిన నారాయణుడు:

[dropcap]కొం[/dropcap]దరి జీవితాలలో అదృష్టం వెదుక్కొంటూ వస్తుంది. మరికొందరికి కాలం కలిసి రాదు. అందరికీ అనుకొన్నవన్నీ జరగవు. అదృష్టవంతుని ఆత్మకథలా సి. నారాయణ రెడ్డి జీవితంలో అన్ని సోపానాలు అధిగమించారు. కరీంనగర్ జిల్లా హనుమాన్‌జీ పేటలో 1931 జూలైలో జన్మించిన నారాయణ రెడ్డి ఉర్దూ మాధ్యమంలో చదువుకొన్నారు. ఆయన తెలుగు జాతి కేతనం. తెలుగు భాషా చేతనం.

“పంచెకట్టులో ప్రపంచాన మొనగాడు
కండువా లేనిదే గడపదాటని వాడు
పంచభక్ష్యాలు తన కంచాన వడ్డించినా
గోంగూర కోసమే గుటకలేసేవాడు
ఎవడయ్యావాడు? ఎవడు వాడు
ఇంకెవరయ్యా తెలుగువాడు” –

అని తెలుగుదనాన్ని, తెలుగు ధనాన్ని కవితలో సి.నా.రె. ప్రకటించారు. ఎన్నో సాంస్కృతిక, సాహిత్య సంస్థలకు మార్గదర్శనం చేసిన చైతన్య స్రవంతి.

ఉస్మానియాలో తొలి అడుగు:

1951లో ఉస్మానియా తెలుగు ఎం.ఏ.లో చేరాడానికి తొలి అడుగు వేశారు. ఆయన కవితా ప్రపంచంలోకి అడుగుపెట్టేనాటికి భావకవిత్వం అవసాన దశలో, అభ్యుదయ కవిత్వం ఆరంభ దశలో వున్నాయి. ఆయన తన స్వీయ ముద్రను వేయడానికి గేయ కవితా రచనను ఎంచుకొన్నారు. చారిత్రక నేపథ్యంతో, కల్పనా చాతుర్యం మేళవించి నాగార్జున సాగరం, కర్పూర వసంత రాయలు, విశ్వనాథ నాయకుడు వంటి రచనలు చేసి లబ్ధ ప్రతిష్ఠ నందారు. దాశరథి, సి.నా.రె. తెలంగాణా సూర్యచంద్రులుగా ప్రశస్తి పొందారు. సినీ గీత రచనలో అందెవేసిన చేయి. సుమారు 3500 పాటలు వ్రాశారు. అన్ని రసాలను, అన్ని రకాల భావాలను, అన్ని తరగతుల ప్రేక్షకులను రంజింపజేశారు. ‘నా దేశం భగవద్గీత, నా దేశం అగ్నిపునీత సీత’ అని గర్వంగా చెప్పారు. విశ్వగీతి, స్వప్నభంగం, నాగార్జున సాగరం, కర్పూర వసంతరాయలు, వీరి రచనలలో ప్రసిద్ధ గేయ కావ్యాలు. ఋతుచక్రం ఆత్మాశ్రయ కావ్యం.

పరిశోధనా పరమేశ్వరుడు:

సి.నా.రె. ‘ఆధునికాంధ్ర కవిత్వం – సంప్రదాయములు – ప్రయోగములు’ అనే అంశంపై చేసిన పరిశోధన ఈనాటికీ మణిపూస. 650 పుటల బృహద్గ్రంథం. ఎనిమిది అధ్యాయాలలో విశ్లేషణ కొనసాగింది. ప్రాచీన కవులు పాటించిన సంప్రదాయాలు, 19వ శతాబ్దిలో వచ్చిన పెనుమార్పులు, నవ్య కవితా మహోదయం, యుగకర్తలైన గురజాడ, రాయప్రోలు అడుగుజాడలు, భావకవిత్వ ప్రస్థానము, అభ్యుదయ కవిత్వోద్యమము, నవ్య కవితాధోరణులను తమ పరిశోధనలో విస్తారంగా ప్రస్తావించారు.

సికింద్రాబాద్ ఆర్ట్స్ కళాశాలతో అధ్యాపక జీవితాన్ని ఆరంభించి, ఆచార్య పదవిని విశ్వవిద్యాలయంలో అధిష్ఠించారు. 1983లో శాఖాధ్యక్ష పదవిని వదులుకొనగా, కె. గోపాలకృష్ణారావు ఆ పీఠాన్ని అలంకరించారు. స్రవంతి – సాహిత్య మాసపత్రికకు ప్రధాన సంపాదకులుగా మాదృశులైన యువ రచయితలకు ప్రోత్సాహం కలిగించారు.

వెంబడించిన పదవులు:

సినీరంగంలో తనదైన ముద్ర వేసి, అధ్యాపకుడిగా శిష్యకోటిలో చెరగని ముద్రవేసిన సి.నా.రె.ను పదవులు ఒకటి వెంబడి మరొకటి వరించాయి. 1981 జూలైలో అధికార భాషా సంఘం అధ్యక్షులుగా యావదాంధ్ర దేశం సంచరించి పలు జిల్లాలలో కలెక్టర్లకు మార్గదర్శనం చేశారు. కడప పర్యటించినప్పుడు ఆకాశవాణి ప్రొడ్యూసర్‍గా నేను వారిని ఇంటర్వ్యూ చేశాను. 1975 నుండి 2005 వరకు నేను ఆకాశవాణి, దూరదర్శన్‍లలో వివిధ హోదాలలో ఎక్కడ పని చేసినా వారు కవి సమ్మేళనాలలో, సదస్సులలో పాల్గొని తనదైన బాణీలో ప్రసంగించారు. పద్మశ్రీ, పద్మభూషణ్ గౌరవాలు వారికి దక్కాయి.

ఉపాధ్యక్ష పదవులు:

ఒక విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్స్‌లర్ కావడమే అరుదు. ఆయన 1985లో ఆంద్రప్రదేశ్ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులయ్యారు. ఖైరతాబాదులోని ఇప్పటి ప్రెస్ క్లబ్‍లో వారి కార్యాలయం. ఒక సంవత్సరం ఆ విశ్వవిద్యాలయంలో దృశ్యశ్రవణ విభాగానికి అభ్యర్థిని ఎంపిక చేసే కమిటీకి ఆయన అధ్యక్షతతో నేనూ సభ్యుడిగా పాల్గొన్నాను. ఉమాపతివర్మను ఎంపిక చేశాం. 1989లో నారాయణ రెడ్డి తెలుగు విశ్వవిద్యాలయ ఉపాధ్యక్షులయ్యారు. ఛాన్స్‌లర్‌గా ముఖ్యమంత్రి యన్.టి.రామారావు తొలినాళ్ళలో వ్యవహరించారు. ఆ తర్వాత గవర్నర్ ఛాన్స్‌లర్‍గా మార్పు వచ్చింది. 1991లో పి.వి. నరసింహారావు స్నాతకోపన్యాసం చేయడం చారిత్రాత్మకం.

సాంస్కృతిక బావుటా:

సి.నా.రె. 1997 జూలై నెలలో ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక మండలి అధ్యక్షులై 2004 జూలై వరకు ఏడేళ్ళు కొనసాగారు. ఆ మండలి అంతకు ముందు లేదు. చొరవ తీసుకుని సి.నా.రె. జాతీయ స్థాయిలో ఒక సదస్సు నిర్వహించి సాంస్కృతిక విధానం ముసాయిదా తయారు చేసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పంపారు. హంస అవార్డు సి.నా.రె. సృష్టి. ఇదే సమయంలో రచయితల ప్రతినిధిగా 1997లో రాజ్యసభకు రాష్ట్రపతి నియమించారు. ఒక తెలుగు కవికి దక్కిన అరుదైన అదృష్టమది. రాజ్యసభలో ఆయన సమకాలికులుగా రాజా రామన్న, షబానా ఆజ్మీ, కుల్దీప్ నయ్యర్, మన్మోహన్ సింగ్ ప్రభృతులున్నారు.

తన పదవీకాలంలో రాజ్యసభలో సి.నా.రె. 624 ప్రశ్నలను సంధించి సమాధానాలను రాబాట్టారు. 32 సార్లు ప్రత్యేక ప్రస్తావనలు చేయగలిగారు. యం.పి. లాడ్స్ నిధులను కడపలోని సి.పి.బ్రౌన్ అకాడమీకి, ఆంధ్ర సారస్వత పరిషత్‍కు, రాజ్‍కోట్‍లోని గాంధీజీ చదివిన పాఠశాలకు అందించారు. రాజ్యసభ సభ్యునిగా వివిధ మంత్రిత్వ శాఖల పార్లమెంటరీ స్థాయిసంఘాలలో సభ్యునిగా అనేక దేశాలలో పర్యటించారు.

సాయంకాలం సభలు:

1997 జూలైలో రాజ్యసభ సభ్యుడైనది మొదలు ఢిల్లీలో సమావేశాలు జరుగుతున్నప్పుడు ఆయనకు సాయంకాలాలు పొద్దు పోయేది కాదు. హైదరాబాదులో నిత్యం సభలలో పాల్గొనే తనకు ‘ఢిల్లీలో కాలం గడవదు’ అని నాతొ చమత్కించేవారు. 1997 అక్టోబరులో నేను ఆకాశవాణి కేంద్ర డైరక్టరుగా నియమింపబడ్డాను. అప్పటి నుండి ఆయన రాజ్యసభ సమావేశాలకు హైదరాబాదు నుంచి విమానంలో సోమవారం ఉదయం బయలుదేరే ముందు నాకు ఫోన్ చేసేవారు. “ఈ సాయంకాలం ఏదో ఒక సాంస్కృతిక సభకు వెళ్దాం” అనేవారు. నేను ఎంగేజ్‍మెంట్ కాలమ్ చూచి చెప్తే అంగీకరించేవారు. మా ఆఫీసు కారులో నేను సాయంకాలాలు సరాసరి షాజహాన్‍ రోడ్ లో వారి క్వార్టర్సుకి వెళ్ళేవాడిని. ఇద్దరం సభలకో, నృత్య ప్రదర్శనలకో వెళ్ళి 8 గంటల దాకా కాలం గడిపి మళ్ళీ వారిని క్వార్టర్సులో దింపి వచ్చేవాడిని. ఆ విధంగా వారు పదవీ విరమణ చేసేవరకు గడిచింది.

చివరి క్షణం వరకు 2017 జూన్ వరకు ఆయన హైదరాబాదులో ప్రతి సాయంకాలం ఏదో ఒక సభకు అధ్యక్షుడు/ముఖ్య అతిథిగా రవీంద్రభారతి, త్యాగరాయ గానసభలకు వెళ్ళి ప్రసంగించారు.

ఆంధ్ర సారస్వత పరిషత్:

హైదరాబాదులోని నల్లకుంటలో ఆంధ్ర సారస్వత పరిషత్ పని చేస్తోంది. అధ్యక్షులుగా దేవులపల్లి రామానుజరావు చాలాకాలం కొనసాగారు. వారి తర్వాత సి.నా.రె. అయితే బాగుండునని దేవులపల్లి కోరిక. తదనుసారంగా 1993లో సి.నా.రె. అధ్యక్ష పదవి నలంకరించి 2017 జూన్ 12న అస్తమించే వరకూ కొనసాగారు. చాలా సంవత్సరాల క్రిందట పరిషత్తుకు ప్రభుత్వం స్థలం లీజుపై ఇచ్చింది. సి.నా.రె. ముఖ్యమంత్రితో చనువుగా మాట్లాడి పరిషత్‍కు సొంతమయ్యేలా చేశారు. స్వయంగా యం.పి.లాడ్స్ నిధుల నుండి 25 లక్షలు, రెడ్డి ల్యాబ్స్ అధినేత డా. కె. అంజిరెడ్డి ద్వారా 14 లక్షలు సేకరించి నూతన భవన నిర్మాణం చేశారు. ప్రస్తుతమది తెలంగాణ సారస్వత పరిషత్. ‘పరిణత వాణి’ అనే పేర ఆత్మకథాత్మక ప్రసంగాలు ఏర్పాటు చేసి వాటిని ఏడు సంపుటాలుగా ముద్రించారు. ఆ కార్యక్రమంలో నేనూ ప్రసంగించాను.

విదేశీయాత్రలు:

‘సి.నా.రె. యాత్రాస్మృతి’ అనే అంశంపై నేను 12-6-2018న వారి ప్రథమ వర్ధంతి సభలో విశ్లేషణాత్మక ప్రసంగం చేశాను. సి.నా.రె. ముచ్చటగా మూడు విదేశీ పర్యటనలు చేశారు.

  1. మలేషియా – సింగపూరు, 1976 జూన్‍లో మూడు మారాలు.
  2. రష్యా – 1979 ఆగస్టు, 25 రోజులు
  3. అమెరికా, యూరప్, లండన్ – 1981 మే, 2 నెలలు

వాటి విశేషాలు యాత్రాస్మృతిలో ప్రచురించారు. సి.నా.రె. సమగ్ర సాహిత్యం అనేక సంపుటాలుగా వెలువడింది.

ఆత్మీయ బంధువు:

నా జీవితంలో బెజవాడ గోపాలరెడ్డి, డా.సి.నా.రె. వంటి సాహితీ, రాజకీయ ప్రముఖుల సాన్నిహిత్యం విశేషం. 1987లో నా సాహితీ రజతోత్సవ సభలో సి.నా.రె. నా వచన కవితా సంపుటి ‘భయం వేస్తోందా భారతీ’ ఆవిష్కరించారు. మా నాన్నగారి పేర అనంత లక్ష్మీకాంత సాహితీ పీఠం పక్షాన రావూరి భరద్వాజకు 2002లో ఢిల్లీలో అవార్డు ఇచ్చిన సభకు ఆయన అధ్యక్షులు.

1999 మేలో మా పెద్దబ్బాయి రమేష్ చంద్ర వివాహానికీ, 2001 డిసెంబరులో జనార్దన్ వివాహానికి సి.నా.రె. విచ్చేసి ఆశీర్వదించారు. ఢిల్లీలో పండారా క్వార్టర్సులో నేను వుంటున్నప్పుడు ఆతిథ్యం స్వీకరించారు. 2005 ఏప్రిల్‍లో నా పదవీ విరమణ సందర్భంగా కిన్నెర రఘురాం ఏర్పాటు చేసిన రవీంద్రభారతి సభలో సి.నా.రె. విచ్చేసి ప్రశంసావాక్యాలు పలికారు. 2017లో స్వర్ణోత్సవ సాహితీసభకు అధ్యక్షత వహించారు. మా నాన్నగారి షష్టిపూర్తి సంచికలు ప్రత్యేక సందేశం పంపారు. అలా ఆత్మీయ బంధువుగా సి.నా.రె. నాకే కాదు, ఎందరికో చిరస్మరణీయులు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here