ఆచార్యదేవోభవ-30

0
2

[box type=’note’ fontsize=’16’] ఈ శీర్షిక ద్వారా గత 20వ శతాబ్దిలో ఎందరో విశ్వవిద్యాలయ, కళాశాలల తెలుగు అధ్యాపకులను/ఆచార్యులను తీర్చిదిద్దిన ప్రాతఃస్మరణీయ యశఃకాయులను పరిచయం చేస్తున్నారు డా. అనంత పద్మనాభరావు. [/box]

భాషాశాస్త్ర ‘మహాదేవుడు’:

[dropcap]శ్రీ[/dropcap]శైల భ్రమరాంబ అనుగ్రహంతో ఏడు తరాల వరకు పాండిత్య స్ఫూర్తిని వరంగా పొందిన వంశం కోరాడ వారిది. తాళ్ళపాక వంశీయుల విషయంలో ఆరు తరాలని ప్రతీతి. కోరాడ రామచంద్రశాస్త్రి తొలి తెలుగు నాటకం – మంజరీ మధుకరీయం – రచయిత. ఆయన మనుమడు పరిశోధకుడైన కోరాడ రామకృష్ణయ్య. మదరాసు తెలుగు విశ్వవిద్యాలయం సందర్భంలో వారి కృషి పరిశీలించాం.

రామకృష్ణయ్య ద్వితీయ సంతానం మహాదేవశాస్త్రి. ఆయన తిరుపతిలో 1965-67 మధ్య మాకు ఎం.ఏ. తెలుగులో భాషాతత్వశాస్త్రం సాకల్యంగా బోధించారు. గంట కొడితే పాఠం ఆపే రకం కాదు. సబ్జెక్టులో మునిగిపోయేవారు. తరువాతి క్లాసు టీచరు వాకిట్లో కనిపిస్తే విరమించేవారు. ప్రతి క్లాసులోను తన గురువైన సునీల్ కుమార్ చటర్జీ ప్రస్తావన ఏదో ఒక రూపంలో ఉద్వేగభరితంగా చేసేవారు. తిక్కన అంటే ఆయన కిష్టం. తిక్కన అల్పాక్షరముల అనల్పార్థ రచనను ప్రస్తావించి – కట్టి – తొడి – పూసి – అని ఉదహరించేవారు. సిలబస్ పూర్తి చేయాలనే ఆతురత ఆయనలో కనిపించేది కాదు. ఎర్రన పద్యం ‘గాసట బీసట్ చదివి’ ప్రస్తావించేవారు తరచూ.

శ్రీ కోరాడ మహాదేవశాస్త్రి గారు

1942లో ఎకనామిక్స్ ఎం.ఏ. చేశారు. వెంటనే కేంద్ర కార్మిక శాఖలో ఉద్యోగం వచ్చింది. ఉద్యోగికి దూరభూమి లేదు – అని నమ్మిన వారు – సిమ్లాలో చేరారు. మనసంతా సాహిత్య పరిశోధనపై వుంది. ఆ ఉద్యోగం వదిలేసి వచ్చేశారు. కలకత్తా విశ్వవిద్యాలయంలో లింగ్విస్టిక్స్ ఎం.ఏ. చేశారు. ఢిల్లీలో ‘ఫికీ’ సంస్థలో సీనియర్ రీసెర్చ్ ఆఫీసరుగా పని చేశారు. సునీల్ కుమార్ చటర్జీ పశ్చిమ బెంగాల్ రాష్ట్ర శాసన మండలి అధ్యక్షులుగా 1952-58 మధ్య వ్యవహరించారు. భాషా శాస్త్ర పరిశోధనలో ఆయన దిట్ట. ఆయన వద్ద మహాదేవశాస్త్రి ‘ది హిస్టారికల్ గ్రామర్ ఆఫ్ తెలుగు’ అనే అంశంపై సిద్ధాంత వ్యాసం సమర్పించి 1959లో డి. లిట్ పొందారు. కలకత్తా విశ్వవిద్యాలయంలో ద్రవిడియన్ ఫైలాలజీలో ఎం.ఏ. చేశారు.

ఉద్యోగ ప్రస్థానం:

2021 మహాదేవశాస్త్రి శతజయంతి సంవత్సరం. 21 డిసెంబరు 1921 నాడు మచిలీపట్టణంలో జన్మించారు. 1957లో చిదంబరంలోని అన్నామలై విశ్వవిద్యాలయంలో లింగ్విస్టిక్ శాఖలో అధ్యాపకులుగా చేరారు. ప్రముఖ భాషాశాస్త్రవేత్త డా. మీనాక్షి సుందరం అక్కడ శాఖాధిపతి. మూడేళ్ళ పాటు మహాదేవశాస్త్రి పాఠాలు బోధించారు. 1960-68 మధ్య తిరుపతి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయ తెలుగు శాఖ అధ్యాపకులుగా అధ్యయన అధ్యాపనాలు కొనసాగించారు. వీరి పర్యవేక్షణలో 14 పిహెచ్.డి.లు, నాలుగు యం.ఫిల్‍లు వచ్చాయి.

అనంతపురంలో తొలి అడుగు:

1968లో పి.జి.సెంటర్ అనంతపురంలో పెట్టినప్పుడు మహాదేవశాస్త్రి స్పెషల్ ఆఫీసరుగా నియమితులయ్యారు. డా. శ్రీదేవి డైరక్టరుగా వచ్చేంత వరకు వారే అధిపతి. ఆ తరువాత ఆచార్యులుగా అనంతపురంలో 1989లో రిటైరయ్యారు. ఎందరో పరిశోధకులకు పర్యవేక్షకులు.

శాంతినికేతన్‍లో…:

1980 నవంబరులో శాంతినికేతన్‍లో అఖిల భారత ప్రాచ్యభాషా సదస్సులో ఒక సెషన్‌కు మహాదేవశాస్త్రి అధ్యక్షులు. ఆ సభలో నేను ‘Udaharana Literature in Telugu’ అనె ఆంగ్ల ప్రసంగ పత్రం సమర్పించాను. కార్యవర్గ ఎన్నికలలో మహాదేవశాస్త్రి పోటీ చేశారు. దాక్షిణాత్యులం శాస్త్రిగారికి మద్దతునిచ్చాం. తిమ్మావజ్ఝల కోదండరామయ్య, బేతవోలు రామబ్రహ్మం, నేను, ఇంద్రగంటి శ్రీకాంతశర్మ ప్రభృతులం నాలుగు రోజులు జరిగిన సదస్సులలో పాల్గొన్నాం.

పాండితీధనుడు:

యునెస్కో ప్రాజెక్టు క్రింద మానవశాస్త్ర విభాగంలో (Anthropology)లో క్షేత్రస్థాయి పరిశోధనలు చేసి భోజ్‍పురి మాండలికంపై అధ్యయనం చేశారు. విదేశాలలో భాషాశాస్త్ర బోధన చేసినవారిలో జి.యన్.రెడ్డి, మహాదేవశాస్త్రి, వేటూరి ఆనందమూర్తి ప్రముఖులు.

జర్మనీలో ఎగరేసిన జెండా:

మహాదేవశాస్త్రి 1976-78 మధ్య జర్మనీలోని కొలోన్ విశ్వవిద్యాలయంలో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండాలజీ విభాగంలో విజిటింగ్ ప్రొఫెసర్‍గా పని చేశారు. 1996లో నేను కొలోన్ పర్యటనను వెళ్లినపుడు ఈ విభాగానికి వెళ్ళి శాస్త్రి గారు పనిచేసిన పదవిని దర్శించాను.

జర్మనీ రేడియో ప్రాంగణంలో రచయిత 1996లో

1971లో Dravidian Linguistic Society స్థాపించిన ముగ్గురు శాస్త్రవేత్తలలో మహాదేవశాస్త్రి ఒకరు. మిగిలిన వారు వి.వి. సుబ్రమణ్యం, ఆర్. సి. హీరేమఠ్. త్రివేండ్రంలోని International School of Dravidian Linguistics సంస్థకు గౌరవాధ్యక్షులు. ద్రవిడియన్ ఎన్‍సైక్లోపీడియా తయారు చేస్తూ నా చేత పింగళి సూరనపై వ్యాసం వ్రాయించారు.

వీరి గ్రంథాలు:

  1. Historical Grammar of Telugu 1969
  2. Descriptive Grammar and Hand Book of Modern Telugu 1985
  3. ఆంధ్ర వాజ్మయ పరిచయము
  4. బాల ప్రౌఢ వ్యాకరణ దీపిక
  5. తెలుగు దేశ్యవ్యుత్పత్తి నిఘంటువు
  6. స్థానిక తెలుగు భాషా శబ్దవ్యుత్పత్తి నిఘంటువు
  7. A Folktale in Western Bhojpuri (1954)
  8. Prakrit Inscriptions in Buddhic Andhra
  9. Dialectal differences in Eleventh Century Telugu
  10. పాళీ భాషా వాఙ్మయములు
  11. ప్రాఙ్నన్నయ శాసన భాషలో గ్రాంథిక వ్యావహారిక భేదములు.
  12. కోరాడ రామకృష్ణయ్య స్మారక సంచిక సంపాదకత్వం (1992)

శాస్త్రిగారికి శ్రీ ఖరనామ సంవత్సరంలో బ్రౌన్ పురస్కారం 2011లో ప్రదానం చేశారు. మహాదేవశాస్త్రి 2016 అక్టోబరు 11న తిరుపతిలో తమ కుమారుడు సూర్యనారాయణ ఇంట్లో కాలధర్మం చెందారు. శాస్త్రి గారికి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ హంస అవార్డు, మండలి వెంకట కృష్ణారావు స్మారక పురస్కారం లభించాయి.

తండ్రిని మించిన తనయుడు:

“20 శతాబ్ది తొలి పాదంలో ఆచార్య కోరాడ రామకృష్ణయ్య గారు, ద్రావిడ భాషా తులనాత్మక అధ్యయనానికి వైతాళికులు కాగా, వారి కుమారులు ఆచార్య కోరాడ మహాదేవశాస్త్రి తెలుగు దేశ్య పదాలకు మూల ధాతువులను కనుగొని, ఆ మూల ధాతువుల నుండి ఏర్పడిన పదాలను ఒక అకారాది క్రమంలో పేర్చి తెలుగు దేశ్య వ్యుత్పత్తి నిఘంటువును నిర్మించారు… వీరి ‘హిస్టారికల్ గ్రామర్ ఆఫ్ తెలుగు’ గ్రంథాన్ని చదివి అందులో మహాదేవశాస్త్రి గారు – ‘ంబు’ పదప్రయోగం గురించి చేసిన విశ్లేషణ ఆధారంగా ప్రముఖ తమిళ భాషా చారిత్రక పరిశోధకులు శ్రీ ఐరావతం మహదేవన్ సింధు నాగరికతా ఫలకాలలో కనిపించేవి కొన్ని తెలుగు పదాలు కూడా అయ్యే అవకాశం ఉందని ప్రకటించారు” – అధికార భాషా సంఘం అధ్యక్షులుగా డా. మండలి బుద్ధప్రసాద్ మహాదేవశాస్త్రి గ్రంథానికి ముందుమాట – భాషా సాగర మథనం – పేర వ్రాశారు. ఆ గ్రంథావిష్కరణ అనంతపురంలో శాస్త్రి గారి సమక్షంలో బుద్ధప్రసాద్, అప్పటి రాష్ట్రమంత్రి పల్లె రఘునాథరెడ్డి ఘనంగా నిర్వహించారు.

శాస్త్రి గారి కుమారులు డా. సూర్యనారాయణ రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం తిరుపతిలో ప్రొఫెసర్. మరొక కుమారుడు రామకృష్ణ అనంతపురం సాయిబాబా కళాశాలలో ఇంగ్లీష్ లెక్చరర్. శాస్త్రి గారికి ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె. సతీమణి సరస్వతీదేవి.

కబళించిన మృత్యువు:

1968లో అనంతపురం పి.జి.సెంటరు ప్రారంభించినపుడు తెలుగు శాఖలో ప్రప్రథమంగా నలుగురు అధ్యాపకులు చేరారు.

  1. ఆచార్య కోరాడ మహాదేవశాస్త్రి (తిరుపతి నుండి బదిలీ)
  2. కె. నాగభూషణరావు
  3. వి. రామచంద్ర చౌదరి
  4. శలాక రఘునాథశర్మ
ఆకాశవాణి హైదరాబాదు కేంద్రంలో అప్పటి గవర్నర్ శ్రీ రామ్‌లాల్‍తో రచయిత, 1983

కల్లూరు నాగభూషణరావు:

1961 జూలైలో డా. కోరాడ మహాదేవశాస్త్రి పర్యవేక్షణలో – Descriptive Grammar of Nannaya’s Age – అనే అంశంపై పరిశోధన ప్రారంభించి 1964 జూలైలో పూర్తి చేశారు. 1965 జూలైలో డాక్టరేట్ పొందారు. 1968 లో అనంతపురం తెలుగు శాఖలో చేరారు. 1976లో అనారోగ్యంతో మరణించారు. యల్లంరాజు శ్రీనివాసరావు, నాగభూషణరావు తల్లులు అక్కాచెల్లెళ్ళు. భాషాశాస్త్రంలో వచ్చిన తరువాతి పరిశోధనలకు, సిద్ధాంత వ్యాసాలకు నాగభూషణరావు థీసిస్ మార్గదర్శి అయింది.

వి. రామచంద్ర చౌదరి:

వీరు అనంతపురంలో పని చేసి తరువాత మద్రాసు విశ్వవిద్యాలయానికి వెళ్ళి అక్కడ ప్రొఫెసరుగా రిటైరయ్యారు. 1960 జూలై నుండి 1964 జూలై వరకు ఆచార్య పింగళి లక్ష్మీకాంతం పర్యవేక్షనలో ఎఱ్ఱాప్రగడ రచనలపై పరిశోధన చేసి 1966లో డాక్టరేట్ పొందారు.

1996లో ఢిల్లీ ఆకాశవాణి పురస్కారం అందుకున్న రచయిత

విశేషాంశం:

1965-67 మధ్య నేను ఎం.ఏ.(తెలుగు) చదువుతున్నప్పుడు పలువురు పరిశోధక విద్యార్థులు తిరుపతిలో పరిశోధక విద్యార్థులు. తరువాతి కాలంలో వారు వివిధ విశ్వవిద్యాలయాల శాఖాధిపతులు కావడం విశేషం. అప్పట్లో యు.జి.సి. వారు పరిశోధకులు పారితోషికం ఇచ్చేవారు. ఉద్యోగం లభించేంత వరకు వారు అలా పరిశోధన కొనసాగించేవారు. అప్పటి పరిశోధకులు వీరు

  1. వి. రామచంద్ర చౌదరి – ఎర్రన రచనలు – (పింగళి లక్ష్మీకాంతం పర్యవేక్షణ)
  2. యల్. బి. శంకరరావు – నన్నెచోడుని కుమార సంభవ వ్యాకరణము – (కోరాడ మహాదేవశాస్త్రి పర్యవేక్షణ)
  3. పి.వి.యల్.వి. ప్రసాదరావు (ప్రసాదరాయ కులపతి) – ఆంధ్ర భాగవత విమర్శ – (కోరాడ మహాదేవశాస్త్రి పర్యవేక్షణ)
  4. తంగిరాల వెంకట సుబ్బారావు – తెలుగులో వీరగాథా కవిత్వం – (డా. జి.యన్. రెడ్డి పర్యవేక్షణ)
  5. యస్. అక్కిరెడ్డి – English Loan Words in Telugu – (డా. జి.యన్. రెడ్డి పర్యవేక్షణ)

ఈ విధంగా పరిశోధనలు కొనసాగాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here