Site icon Sanchika

ఆచార్యదేవోభవ-32

[box type=’note’ fontsize=’16’] ఈ శీర్షిక ద్వారా గత 20వ శతాబ్దిలో ఎందరో విశ్వవిద్యాలయ, కళాశాలల తెలుగు అధ్యాపకులను/ఆచార్యులను తీర్చిదిద్దిన గురువరేణ్యులను పరిచయం చేస్తున్నారు డా. అనంత పద్మనాభరావు. [/box]

నిత్య పరిశోధనానంద:

[dropcap]కొం[/dropcap]దరు ఎం.ఏ. డిగ్రీ సంపాదనతో సంపాదనాపరులై సాహిత్య వ్యాసంగాన్ని అడపాదడపా కొనసాగిస్తారు. మరి కొందరు పి.హెచ్.డి. సంపాదనకు పరిశోధించి విశ్వవిద్యాలయాలలోనో, కళాశాలల్లోనో కుదురుకొని అధ్యాపకత్వంలో పడి పరిశోధనవైపు మొగ్గు చూపరు. ఏ కొద్దిమందో నిత్య సాహితీకృషీవలురు, పరిశోధకులు కన్పిస్తారు. వారిలో పెద్ద పీట వేయవలసిన వ్యక్తి వెల్దండ నిత్యానందరావు. ఆయన ప్రసిద్ధ వాఙ్మయ సూచీకర్త. విమర్శకులు, జీవిత చరిత్రకారులు. విశ్వవిద్యాలయాలలో తెలుగు పరిశోధన గూర్చి ఆయన స్వంత ఖర్చులతో ప్రచురించిన బృహత్గ్రంథం ఏ పెద్ద సంస్థనో చేయవలసిన పదేళ్ళ కృషి. దాదాపు 5500 సిద్ధాంత వ్యాసాల జాబితా అది.

నిత్యానందరావు మహబూబ్‌నగర్ జిల్లా మంగునూరులో 1962 ఆగస్టు 9న జన్మించారు. పాలెం ప్రభుత్వ ప్రాచ్య కళాశాలలో డిగ్రీ (1983) చేసి, ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ఎం.ఏ. (1985), ఎం.ఫిల్ (1988), పిహెచ్.డి (1990) సాధించారు. అదే విశ్వవిద్యాలయంలో లెక్చరర్‌గా తొలి అడుగు 1992 జూలైలో గాని దొరకలేదు. 2001లో రీడరు, 2009లో ప్రొఫెసర్‍గా పదోన్నతులు లభించాయి. 2021 ఆగస్టులో 60వ ఏట అడుగుపెట్టిన వెల్దండ 30 ఏళ్ళు పి.జి.స్థాయి విద్యార్థులకు బోధన చేశారు. 2015-17 శాఖాధ్యక్షులు.

పరిశోధనలకు పెద్ద పీట:

ఎం.ఫిల్ సిద్ధాంత వ్యాసానికి ఎంచుకున్న అంశం – చంద్రరేఖా విలాపం – తొలి వికట ప్రబంధం కాగా, డాక్టరేట్ కోసం వినూత్నంగా – తెలుగు సాహిత్యంలో పేరడీ – ఎంచుకొన్నారు. వీరి ఇతర గ్రంథాలు – హాసవిలాసం (2005), నిత్యవైవిధ్యం (2007), నిత్యానుశీలనం (2010), నిత్యాన్వేషణం (2018), పరిశోధనా వ్యాసమంజరి (2009), ఆధునిక భాషా శాస్త్రము – ప్రకార్య భాష (2010).

శ్రీ వెల్దండ నిత్యానందరావు గారితో రచయిత 2019లో

జీవిత చరిత్రలుగా భారతీయ జ్వలిత చేతన బంకించంద్ర (2006), రాజనీతిజ్ఞుడు బూర్గుల రామకృష్ణారావు (2011) ప్రసిద్ధాలు. వివిధ విశ్వవిద్యాలయాలలో తెలుగు శాఖ బోర్డ్ ఆఫ్ స్టడీస్ సభ్యులుగా వ్యవహరించిన దిట్ట. బ్రౌన్ అకాడమీ కోసం 105 ప్రసిద్ధ పరిశోధనా వ్యాసాలు సిద్ధం చేశారు. ప్రస్తుతం వీరి సమగ్ర సాహిత్యం ఆరు సంపుటాలుగా వెలువడబోతోంది. వీరికి పిహెచ్.డి. పర్యవేక్షకులు ఆచార్య యస్వీ రామారావు. వెల్దండ పర్యవేక్షణలో 5గురు యం.ఫిల్, 13 మంది పిహెచ్.డి.లు పొందారు.

విదేశాలలో సాహితీ కురువృద్ధుడు:

ప్రాక్చశ్చిమాల సాహిత్య వారధి, సాహిత్య విమర్శకు భూమార్గం చూపిన దిట్ట, మేధావి, ఎవరో కాదు వెల్చేరు నారాయణ రావు. 90వ ఏట అడుగుపెడుతున్నా (1932 ఫిబ్రవరి 1) మేధా సంపత్తికి లోటు లేని వ్యక్తి. ప్రసిద్ధ క్షేత్రమైన పిఠాపురంలో జన్మించారు. బాల్యం శ్రీకాకుళం జిల్లా అంబకండిలో నడిచింది. 16 ఏళ్ళకే డిగ్రీ ఏలూరులో పూర్తి చేశారు. చిన్నతనంలోనే ఆంగ్ల సాహిత్య గ్రంథాలను అవలోకనం చేశారు. బొమ్మకంటి సోదరుల పరిచయ భాగ్యంతో సంస్కృత భాషపై పట్టు సాధించారు. అంబకండి నుండి అట్లాంటా దాకా జీవన గమనం పరుగులు తీసింది.

1954లో ఏలూరు సి.ఆర్.రెడ్డి కళాశాలలో బి.ఏ. చదివారు. 1968లో ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఎం.ఏ. (ప్రైవేటుగా) చదివి, పిహెచ్.డి.కి – తెలుగు కవితా విప్లవాల స్వరూపం – అనే అంశాన్ని ఆచార్య తూమాటి దోణప్ప పర్యవేక్షణలో స్వీకరించి 1974లో డిగ్రీ పొందారు. వెయ్యేండ్ల తెలుగు సాహిత్యంలో ఆయా యుగాలలో కవితా వస్తువు విషయంగా, ఛందఃపరంగా ప్రవర్తితమైన విప్లవ ధోరణులకు ప్రాక్ ప్రతీచీ విమర్శనా ధారలతో వివరించబడి ప్రప్రథమంగా శిష్ట వ్యావహారిక భాషలో వ్రాయబడిన గ్రంథమిది. 1970లో ఉస్మానియాలో లింగ్విస్టిక్స్ డిప్లొమా చేశారు.

డా. వెల్చేరు నారాయణ రావుగారు

వీరికి మార్క్సిస్టు మిత్రులు తోడయ్యారు. శ్రీశ్రీతో గాఢ పరిచయం ఏర్పడింది. ఏలూరులో ఉన్నప్పుడు పలు ఆంగ్ల గ్రంథాలకు తెలుగు అనువాదాలు చేశారు. రేడియో ప్రసంగాలు, పత్రికలకు వ్యాసాలు, సభా వేదికలపై ప్రసంగాలు అధికం. సిద్ధాంత వ్యాసం వ్రాస్తుండగా విస్కాన్సిన్ విశ్వవిద్యాలయం (మాడిసన్)లో సౌత్ ఏసియన్ విభాగంలో 1971లో తెలుగు బోధకులుగా చేరారు. తెలుగు సాహిత్య విమర్శలో తనదైన విలక్షణ శైలిని అలవర్చుకొన్నారు. 1987లో అక్కడే ప్రొఫెసర్ అయ్యారు.

తెలుగు కావ్యాలకు ఆంగ్లానువాదం:

(1) పాల్కురికి సోమ బసవ పురాణం (2) శ్రీనాథ కావ్యాలు (3) అల్లసాని పెద్దన మనుచరిత్ర (4) దూర్జటి కాళహస్తీశ్వర శతకం (దీనికి హాంకే హోఫెట్జ్ సహకారం కూడా ఉంది). అంతే కాదు, నన్నయ్య, శ్రీనాథుడు, సూరన, అన్నమయ్య వంటి ప్రాచీనులు; గురజాడ, చాసో వంటి ఆధునికుల రచనలకు పదిహేనింటికి ఆంగ్లానువాదాలు చేశారు.

ఇతర రచనలు – క్షేత్రయ్య పదాలు, శ్రీనాథ క్రీడాభిరామం, విక్రమోర్వశీయం – గ్రంథాల ఆంగ్లీకరణ చేశారు. నారాయణరావు ‘Walking Encyclopedia’ అని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ శ్రీ హరిచందన విశ్వభూషణ్ ప్రశంసించారు. 1987లో జెరూసలెంలోని హిబ్రూ విశ్వవిద్యాలయం వెల్చేరును ‘ఫెలో’గా సమ్మానించింది.

పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం, మండలి వెంకట కృష్ణారావు అంతర్జాతీయ తెలుగు కేంద్రం పక్షాన మండలి వెంకట కృష్ణారావు సంస్కృతి పురస్కారాన్ని 2019 ఆగస్టులో హైదరాబాదులో ప్రదానం చేశారు. కేంద్ర సాహిత్య అకాడమీ వారు విశిష్ట సభ్యత్వం (ఫెలోషిప్)తో 2021లో గౌరవించారు. ప్రస్తుతం నారాయణరావు ఏలూరు సమీపంలో కొప్పాకలో స్థిరపడ్డారు.

మధుర మీనాక్షి – తెలుగు విభాగం:

మదురై కామరాజ్ విశ్వవిద్యాలయంలో 1971లో తెలుగు విభాగం ప్రారంభించారు. తొలి అధ్యాపకులు ఆచార్య తిమ్మావజ్ఝల కోదండరామయ్య. ఇక్కడ ఎం.ఏ., పిహెచ్.డి (యంఫిల్) కోర్సులు నడుపుతున్నారు. స్వర్ణోత్సవ సంబరాలకు సిద్ధమవుతోంది తెలుగు శాఖ.

1966లో ఈ విశ్వవిద్యాలయం ప్రారంభించారు. తెలుగు – తులనాత్మక సాహిత్య విభాగం ఎందరో విద్యార్థులను, పరిశోధకులను తీర్చిదిద్దింది. తొల్కాప్పియం, తిరుక్కురళ్, తిరుప్పావై, త్యాగరాజ కీర్తనలను తెలుగు శాఖ అనువదింపజేసింది.

మధుర మీనాక్షి సన్నిధిలో చల్లా (1929-98):

ఆచార్య చల్లా రాధాకృష్ణశర్మ రచయిత, కవి, విమర్శకుడు, బహుభాషావేత్త, అనువాదకులు, బాల సాహిత్య రచయిత. కృష్ణాజిల్లా ఎందరో ప్రముఖ రచయిత పుట్టినిల్లు. రాధాకృష్ణశర్మ ఆ జిల్లాలో సోమవరప్పాడులో 1929 జనవరి 6న పండిత కుటుంబంలో జన్మించారు. తండ్రి లక్ష్మీనారయాణశాస్త్రి అష్టావధాని, పండితులు. చెంగల్పట్టు, నెల్లూరులలో చదివి 1950లో డిగ్రీ పూర్తి చేశారు.  మదరాసు విశ్వవిద్యాలయంలో ఎం.ఏ. చేశారు. నిడుదవోలు వెంకటరావు పర్యవేక్షణలో – Tamil Element in Telugu Literature – అనే అంశంపై పరిశోధన చేసి యం.లిట్ పొందారు. తమిళ-తెలుగు రామాయణాల తులనాత్మక పరిశోధనకు పింగళి లక్ష్మీకాంతం పరీక్షకులుగా పి.హెచ్.డి. లభించింది.

ప్రొ. చల్లా రాధాకృష్ణశర్మగారితో రచయిత 1994లో

ఉద్యోగ పర్వం:

శర్మ సైన్సు టీచర్‌గా సత్యవేడులోను, తెలుగు లెక్చరర్‍గా మద్రాసులోని త్యాగరాయ కళాశాల లోను పనిచేశారు. 1957లో కేంద్ర సాహిత్య అకాడమీ వారి ప్రాంతీయ కార్యాలయ కార్యదర్శిగా 24 సంవత్సరాలు పని చేశారు. మదురై కామరాజ్ విశ్వవిద్యాలయంలో పని చేస్తున్న తిమ్మావజ్ఝల కోదండరామయ్య మరణంతో ఏర్పడిన ఖాళీలో 1981లో తెలుగు శాఖ ఆచార్యులుగా శర్మ ప్రవేశించి పదవీ విరమణ వరకు బోధించారు.

రచనాపర్వం:

వంద దాకా గ్రంథాలు తమలాంధ్ర ఆంగ్ల భాషలలో ప్రచురించారు. ఢిల్లీలో సాహిత్య అకాడమీలో పని చేస్తున్నప్పుడు అప్పటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ అకస్మాత్తుగా అకాడమీకి వచ్చినప్పుడు కరచాలనం చేశానని శర్మ మధురానుభూతి గుర్తు చేసుకునేవారు. పిల్లల కోసం వీరు రచించిన ‘టేల్స్ ఫ్రమ్ తెలుగు’ వివిధ భాషలలోకి అనువదించబడింది. తమిళం నుంచి చాలా అనువాదాలు తెలుగులోకి చేశారు. జయదేవుడి జీవిత చరిత్రను వ్రాశారు. 1998 అక్టోబరులో మరణించారు. ‘చరిత్రె కెక్కిన చరితార్థులు’ అనే పేరుతో మూడు భాగాలుగా పిల్లలకు పరిచయం చేశారు. వీరితో పాటు ఈ విశ్వవిద్యాలయంలో గిరి ప్రకాశ్ పని చేశారు. 1984లో యస్. జయప్రకాష్ లెక్చరర్‌గా చేరి 2009లో రిటైరయ్యారు.

ఈ విశ్వవిద్యాలయం నుండి తొలి పి.హెచ్.డి. యన్. భక్తవత్సలరెడ్డి కాగా, రాధాకృష్ణశర్మ వద్ద మాడభూషి సంపత్‌కుమార్ పి.హెచ్.డి. తర్వాత సంపాదించారు. ప్రస్తుతం జొన్నలగడ్డ వెంకటరమణ తెలుగు శాఖాధిపతి.

రాజధానిలో వీరభద్రుడు:

దేశ రాజధాని ఢిల్లీలో తెలుగు బోధనకు నాంది పలికినవారు ఆచార్య కొత్తపల్లి వీరభద్రరావు (వీరు రాయప్రోలు సుబ్బారావు అల్లుడు). తొలుత ఢిల్లీ విశ్వవిద్యాలయంలో పని చేసి ఆ తరువాత హైదరాబాదు వచ్చారు. ఢిల్లీ అనగానే గుర్తుకు వచ్చే వ్యక్తి పండితారాధ్యుల చిన వీరేశలింగం. 11 భాషలు కలిపి Modern Indian Languages విభాగం ఢిల్లీలో ఏర్పడింది.

ప్రొ. కొత్తపల్లి వీరభద్రరావు గారు

ముమ్మిడివరంలో వీరేశలింగం:

వీరేశలింగం ముమ్మిడివరంలో 1922లో జన్మించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి తెలుగు ఎం.ఏ. స్వర్ణపతకంతో సాధించారు. ఏలూరులో సి.ఆర్.రెడ్డి కళాశాలలో 1948-62 వరకు తెలుగు అధ్యాపకులుగా చేశారు. ఢిల్లీ విశ్వవిద్యాలయం నుండి కొత్తపల్లి వీరభద్రరావు హైదరాబాదుకు రాగా వీరేశలింగం 1962లో ఉపన్యాసకులుగా చేరి 1982 వరకు పనిచేసి రిటైరయ్యారు. 1982లో పునర్నియామకం జరిగి 1987 వరకు ఢిల్లీలో పని చేశారు. ఓ సాయంవేళ వాకింగ్ కెళ్ళి తిరిగి వస్తుండగా మారుతీ కారు ఢీకొట్టి కాలు దెబ్బతింది. పరిశోధకుడిగా మాడరన్ ఇండియన్ లాంగ్వేజ్ విభాగంలో తెలుగు శాఖలో మంచి పేరు తెచ్చుకొన్నారు. నాటకాలు వేయడం, వేయించడం ఆయన ప్రతిభకు తార్కాణం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి 1948-56 మధ్య ప్రసంగాలు చేశారు. 1997లో హైదరాబాదులో స్వగృహంలో కాలధర్మం చెందారు. వీరి కుమారులు పి.యస్. మూర్తి ఆకాశవాణి శ్రోతల విభాగ ఉన్నతాధికారి (డైరక్టర్)గా పని చేసి ఢిల్లీలో పదవీ విరమణ చేశారు.

ద్విపద వాఙ్మయ సుశీల:

ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎం.ఏ. చదివిన టి. సుశీల భగవాన్ సత్యసాయి మహిళా కళాశాలలోనూ (1967-70), కాశీ హిందూ విశ్వవిద్యాలయంలోనూ (1970-72) పని చేసి 1972లో ఢిల్లీ విశ్వవిద్యాలయంలో ఉపన్యాసకురాలిగా చేరారు. 1992లో ప్రొఫెసర్ అయ్యారు. ఢిల్లీ విశ్వవిద్యాలయం నుండి ద్విపద వాఙ్మయంపై పరిశోధన చేసి పి.హెచ్.డి. పొందారు. 1979లో ఆ గ్రంథం ప్రచురించారు. దివాకర్ల వెంకటావధాని వీరి సిద్ధాంత గ్రంథానికి పరీక్షాధికారి. ఆయన మాటలలో – “ద్వైతాద్వైత విశిష్టాద్వైతములను, వేదాంత గ్రంథములను సమీక్షించినపుడు వారు చూపిన ఆధ్యాత్మిక పరిజ్ఞానం నా కచ్చెరువు గొల్పినది”. ఆచార్య జి.యన్.రెడ్డి – “ఉన్నవాటిలో డా. సుశీల గారి ఈ విమర్శ గ్రంథం వినుతశీలం” అన్నారు.

ఢిల్లీ విశ్వవిద్యాలయం తెలుగు శాఖలో సర్టిఫికెట్ కోర్సు, డిప్లోమా కోర్సు, అడ్వాన్స్‌డ్ డిప్లొమా కోర్సులు (ఒక్కొక్కటి ఒక సంవత్సరం), యంఫిల్, పిహెచ్‍డిలు ఉన్నాయి. ఈ విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్లుగా – యన్. వెంకటరామప్ప (బెంగుళూరు విశ్వవిద్యాలయం; గంప వెంకటరామయ్య (హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం) 2008 నుండి బోధన చేస్తున్నారు.

Exit mobile version