[box type=’note’ fontsize=’16’] ఈ శీర్షిక ద్వారా గత 20వ శతాబ్దిలో ఎందరో విశ్వవిద్యాలయ, కళాశాలల తెలుగు అధ్యాపకులను/ఆచార్యులను తీర్చిదిద్దిన గురువరేణ్యులను పరిచయం చేస్తున్నారు డా. అనంత పద్మనాభరావు. [/box]
తెలుగు – కన్నడ సాహితీ మైత్రి:
బెంగుళూరు విశ్వవిద్యాలయంలోని తెలుగు శాఖ అతి ప్రాచీనం. తులనాత్మక అధ్యయనానికి ఈ శాఖ ప్రాధాన్యమిస్తోంది. 1974లో ఈ శాఖ ప్రారంభమైంది. ఎం.ఏ. తెలుగు బోధనను కర్నాటకలో చేస్తున్న ఏకైక సంస్థ ఇది. ప్రస్తుత శాఖాధ్యక్షత సౌజన్యశీలి అయిన ఆచార్య కొలకలూరి ఆశాజ్యోతి వహిస్తున్నారు.
తెలుగు శాఖలో పని చేసిన ప్రముఖులు:
- ఆచార్య తంగిరాల వెంకటసుబ్బారావు
- ఆచార్యబాడాల రామయ్య
- ఆచార్య చన్నాప్రగడ తిరుపతిరావు
- డా రత్నాకరం శంకరనారాయణ రాజు
- డా విష్ణుభొట్ల విశ్వనాథశాస్త్రి
- ఆచార్య జి యస్ మోహన్
- ఆచార్య చన్నాప్రగడ జయలక్ష్మి
- ఆచార్య కొలకలూరి ఆశాజ్యోతి
- డా ప్రభాకర్
ఈ విశ్వవిద్యాలయం నుండి నేటి వరకు 80 పి.హెచ్.డి.లు, 30 దాకా యం.ఫిల్‌లు వచ్చాయి.
వీరగాథల తంగిరాల:
1960వ దశకంలో పరిశోధనలు నిర్వహించి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం నుండి పి.హెచ్.డి.లు పొందిన వ్యక్తులు మదరాసు, బెంగుళూరు విశ్వవిద్యాలయాలలో అధ్యాపకులుగా చేరి ఆచార్య పీఠాలను అలంకరించారు. 1965-67 మధ్య నేను తెలుగు ఎం.ఏ. చేస్తుండగా పరిశోధకులుగా ఉన్నవారిని గూర్చి ప్రస్తావిస్తాను.
వి. రామచంద్ర చౌదరి, యస్. అక్కిరెడ్డి మదరాసు విశ్వవిద్యాలయంలో లబ్ధప్రతిష్ఠులయ్యారు. యల్.బి. శంకరరావు అనుబంధ కళాశాలలో పని చేశారు. తంగిరాల వెంకట సుబ్బారావు బెంగుళూరు విశ్వవిద్యాలయ తెలుగు శాఖ ప్రారంభకులు. పి. వి. ప్రసాదరావు (ప్రసాదరాయ కులపతి) హిందూ కళాశాల అధ్యక్షులై కుర్తాళం పీఠాధిపతియై గురుపీఠంలో ఆధ్యాత్మిక భావజాలాన్ని పంచుతున్నారు.
తంగిరాల:
పింగళి లక్ష్మీకాంతం పర్యవేక్షణలో ‘తెలుగు వీరగాథా కవిత్వం’ అనే అంశంపై పరిశోధన ప్రారంభించి, వారు 1965లో పదవీ విరమణ చేయగా, ఆచార్య జి.యన్.రెడ్డి పర్యవేక్షణలో సుబ్బారావు సిద్ధాంత గ్రంథం సమర్పించారు. 1935 మార్చి 30 న జన్మించిన తంగిరాల 1965 నాటికే వివాహితులు. కొంత కాలం పోస్టల్ విభాగంలో పని చేశారు.
1974లో బెంగుళూరు విశ్వవిద్యాలయంలో తొలిసారిగా ఎం.ఏ. తెలుగు శాఖ ప్రారంభించినప్పుడు సుబ్బారావు అధ్యాపకులుగా చేరారు. వీరికి తోడు చెన్నాప్రగడ తిరుపతి రావు మరో అధ్యాపకులు. పాఠ్యప్రణాళిక తయారు చేసి తులనాత్మక పరిశీలనకు దోహదం చేశారు.
తెలుగు భాషా వికాసానికి కృషి చేస్తూ రేనాటి సూర్యచంద్రులు గ్రంథంలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, బుడ్డా వెంగళరెడ్డిల గురించి అనేక విషయాలు వెలికి తీశారు.
వీరి ఇతర రచనలు:
- హంసపదిక, వనదేవత, గుండెపూచిన గులాబి – సృజనాత్మక రచనలు
- జానపదసాహిత్యము-వీరగాథలు, కాటమరాజు కథలు, తెలుగు వీరగాథా కవిత్వము, అంకమ్మ కథలు, శ్రీకృష్ణ కర్ణామృతము – పరిశోధనాత్మక గ్రంథాలు
- కన్నడ రచనలు – వేమన- ఎరడు అద్యయనగళు, విశ్వనాథ సత్యనారాయణ, హిమవద్ గోపాలస్వామి
శ్రీకృష్ణ దేవరాయ రస సమాఖ్య:
1994 ఏప్రిల్‌లో సుబ్బారావు ఈ సంస్థను స్థాపించి ప్రతి నెలా ఒక సాహిత్య కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ప్రసంగాలు, గోష్ఠులు అసంఖ్యాకంగా చేయించారు. చైతన్య కవిత – అనే సాహిత్య పత్రికను చాలా కాలం నడిపారు. శేషేంద్ర సప్తతి సంచిక 1997-98 విశిష్టమైనది.
సాహితీమోహనుడు:
కన్నడాంధ్ర భాషలో రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కార గ్రహీత, తెలుగు విశ్వవిద్యాలయం సాహితీ పురస్కార గ్రహీత జి.యస్. మోహన్. బెంగుళూరు విశ్వవిద్యాలయ తెలుగు విభాగంలో 37 సంవత్సరాలు ఆచార్యులుగా, అధ్యక్షులుగా పని చేసి 2011 డిసెంబరులో రిటైరయ్యారు. ఆపైన ద్రావిడ విశ్వవిద్యాలయం ఎమిరిటర్ ప్రొఫెసర్‌గా 2016-18 సంవత్సరాలలో పని చేశారు. తెలుగు జానపద సాహిత్యం మీద విశేష కృషి చేసిన విజ్ఞాన ఖని.
ప్రసిద్ధ భాషా శాస్త్రవేత్త చిలుకూరు నారాయణరావు వీరికి మాతామహులు. మోహన్ అనంతపురం జిల్లా మలయనూరులో 1949 నవంబరు 3న జన్మించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో 1970-72లో తెలుగు ఎం.ఏ. చేసి 1979లో బెంగుళూరు విశ్వవిద్యాలయం నుండి అనంతపురం జిల్లా స్త్రీల పాటలపై పి.హెచ్.డి. సంపాదించారు. వీరు 70 గ్రంథాలు ప్రచురించారు. అందులో 15 అనువాదాలు, 18 జానపద సాహిత్య గ్రంథాలు.
వీరి పర్యవేక్షణలో 11 పి.హెచ్.డి.లు, 21 ఎం.ఫిల్. డిగ్రీలు వచ్చాయి. ద్రావిడ విశ్వవిద్యాలయం ప్రచురించిన ‘వజ్రకోశం’ తెలుగు నిఘంటువు సంపాదకులలో వీరొకరు. 2005లో కన్నడంలో మాస్తి చిన్న కథలు అనువాద గ్రంథానికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది.
వీరి రచనలు:
- జానపద విజ్ఞాన వ్యాసావళి (1981)
- జానపద విజ్ఞానాధ్యయనం (2001)
- తెలుగు జానపద విజ్ఞాన సూచి (1981)
- తెలుగు జానపద కథలు (1982)
- తెలుగు – కన్నడ సామెతలు
- ప్రసిద్ధ జానపద విజ్ఞానవేత్తలు
- విష్ణుకణిక
ద్రావిడ విశ్వవిద్యాలయం వారికి చిలుకూరి నారాయణ రావు జీవిత చరిత్ర (2017) వ్రాశారు. కేంద్ర సాహిత్య అకాడమీ వారికి కనకదాసు వ్రాశారు. ఆంధ్ర ప్రదేశ్‍లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు – ప్రధాన దేవాలయాలు తిరుపతి దేవస్థానం ప్రచురించింది.
అధ్యాపకుడుగా, ఆచార్యుడిగా, పరిశోధకుడిగా, తులనాత్మక సాహిత్య విశ్లేషకుడిగా మోహన్ ఘనాపాఠీ.
బోధనా చెన్నాప్రగడ:
బెంగుళూరు విశ్వవిద్యాలయ తెలుగు శాఖకు తొలి రోజులలో మార్గనిర్దేశనం చేసిన వారిలో తంగిరాల, చెన్నాప్రగడ ముఖ్యులు. చెన్నాప్రగడ తిరుపతిరావు భక్తి సంప్రదాయ కుటుంబంలో 1925 మార్చి 4న గుంటూరు జిల్లా తెనాలి తాలూకా కోవెలమూడి గ్రామంలో జన్మించారు. వీరి తండ్రి సీతారామయ్య ఏకతార వాయిస్తూ కీర్తనను రచించి పాడేవారు. భక్తితో మంగళగిరి పానకాల నృసింహ స్వామి కొండకు మెట్లు కట్టించారు.
తిరుపతిరావు బాల్యం పరమ దరిద్రాన్ని చవిచూసింది. అప్పట్లో ఎఫ్.ఏ. పూర్తి చేసి నిజాంపట్నంలో స్కూలు టీచరుగా చేరి ఆపైన కొవ్వూరు సంస్కృత పాఠశాలలో పని చేశారు. ప్రైవేటుగా బి.ఏ. పాసయ్యారు. గుంటూరు ఏ.సి. కాలేజీలో ట్యూటర్‍గా 1957 వరకు వ్యవహరించారు. ఖమ్మం జిల్లాలో జిల్లా పరిషత్ పాఠశాలల్లో ఇంగ్లీషు, తెలుగు, లెక్కలు బోధించారు. ప్రైవేటుగా ఉస్మానియాలో తెలుగు ఎం.ఏ. చేశారు.
తిరుపతిలో తిరుపతి:
శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో 1962-65 మధ్య రీసెర్చ్ అసిస్టెంట్‌గా పింగళి లక్ష్మీకాంతం వద్ద చేరి బొమ్మకంటి శ్రీనివాసాచార్యులు నిర్మిస్తున్న ఇంగ్లీషు – తెలుగు నిఘంటు కార్యక్రమంలో దీక్ష బూనారు. ఆయన జీవితంలో మలుపు బెంగుళూరు ఏ.పి.యన్. కళాశాల లెక్చరర్‍గా చేరడం.
1975లో పరిశోధనకు తంగిరాల వెంకట సుబ్బారావు వద్ద చేరి నంది తిమ్మన పారిజాతాపరణం – కన్నడ జగన్నాధ విజయ కావ్యాల తులనాత్మక అధ్యయనం చేసి డాక్టరేట్ పొందారు. భగీరథ ప్రయత్నంతో 1974లో బెంగుళూరు విశ్వవిద్యాలయంలో ఎం.ఏ. తెలుగు ప్రవేశపెట్టిన సుబ్బారావుతో కలిసి అధ్యాపకులుగా చేరారు. 1983లో పదవీ విరమణ చేశారు.
రిటైరయిన తర్వాత విద్యా సంవర్ధినీ పరిషత్ ప్రారంభించి ఎం.ఏ. విద్యార్థులలో పోటీతత్వాన్ని పెంచేందుకు పది సంవత్సరాలు నడిపారు.
తండ్రి తీర్చిదిద్దిన తనయ:
తిరుపతిరావు కుమార్తె జయలక్ష్మి 1952లో తెనాలిలో జన్మించారు. బెంగుళూరు విశ్వవిద్యాలయంలో తొలి తెలుగు బ్యాచ్ విద్యార్థి ఆమె. 1982లో విశ్వనాథ రామాయణ కల్పవృక్షము – పుట్టప్ప రామాయణ తులనాత్మక పరిశోధనకు డాక్టరేట్ పొందారు. 1983లో అక్కడే లెక్చరర్ అయ్యారు. రీడర్, ప్రొఫెసర్‌గా మెరిట్ ప్రమోషన్‍లు పొంది 2014లో రిటైరయ్యారు. తెలుగు రామాయణ భారతాలను కన్నడిగులకు పరిచయం చేశారు. అలాగే కన్నడ రామాయణ భారతాలను తెలుగు వారికి బోధపరిచారు. తండ్రిగారి పంచకన్యలను కన్నడంలోకి అనువదించారు. వీరి థీసిస్ ప్రచురించారు. బోధన ఏకైక లక్ష్యంగా పని చేసిన ఉదాత్త చరిత జయలక్ష్మి. జయహో!