Site icon Sanchika

ఆచార్యదేవోభవ-34

[box type=’note’ fontsize=’16’] ఈ శీర్షిక ద్వారా గత 20వ శతాబ్దిలో ఎందరో విశ్వవిద్యాలయ, కళాశాలల తెలుగు అధ్యాపకులను/ఆచార్యులను తీర్చిదిద్దిన గురువరేణ్యులను పరిచయం చేస్తున్నారు డా. అనంత పద్మనాభరావు. [/box]

సాహిత్య ప్రస్థాన – త్రయం:

[dropcap]వి[/dropcap]శ్వవిద్యాలయ స్థాయిలో తెలుగు శాఖలో ఆచార్యులుగా ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మూడు విశ్వవిద్యాలయాలలో శాఖాధ్యక్షులుగా వ్యవహారించడం ‘గిన్నీస్ బుక్’ కెక్కవలసిన చారిత్రకాంశం. తెలుగు వారికి కొలకలూరి ఇనాక్ చిరపరిచితులు. ఆయన కుమార్తెలిద్దరు – ఆశాజ్యోతి బెంగుళూరు విశ్వవిద్యాలయంలోను, మధుజ్యోతి పద్మావతీ మహిళా విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖలో ప్రొఫెసర్లుగా లబ్ధప్రతిష్ఠులు. ఇనాక్ కుమారుడు సుమకిరణ్ శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయ ఆంగ్ల శాఖలో ఆచార్యులు. అలా నలుగురు ప్రొఫెసర్లు.

ఇనాక్ అట్టడుగు వర్గాలకు చెందిన కుటుంబంలో గుంటూరు జిల్లా వేజెండ్లలో 1939 జూలైలో జన్మించి, స్వయంకృషితో, పట్టుదలతో దీక్షగా ఒక్కొక్క మెట్టు ఎక్కి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయ వైస్-ఛాన్స్‌లర్‌ స్థాయికి ఎదగడం చరిత్రలో భాగం. వాల్తేరులో బి.ఏ. ఆనర్స్ (1956-59) చేసి, శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం నుండి పి.హెచ్.డి. 1972లో సాధించారు.

తెలుగు వ్యాస పరిణామం – పరిశోధనాంశం. ఆచార్య కోరాడ మహాదేవశాస్త్రి పర్యవేక్షకులు. 1980లో ఈ గ్రంథం ప్రచురితం. వందకు పైగా రచనలు వివిధ ప్రక్రియలలో ప్రచురించి విశిష్ట పురస్కారాలు అందుకొన్నారు. ప్రభుత్వ కళాశాలల్లో అధ్యాపకులుగా ఉద్యోగ జీవితం ఆరంభించి శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో లెక్చరర్‍గా చేరడంతో ప్రస్థానం మలుపు తిరిగింది. అదే సంస్థలో ఆచార్య పీఠాన్ని అధిరోహించారు. యూనివర్శిటీ కళాశాల ప్రిన్సిపాల్‌గా, డీన్‌గా, యు.జి.సి. ప్రొఫెసర్‍గా పని చేశారు. శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయ వైస్-ఛాన్స్‌లర్‌ పదవి వరించి వచ్చింది. అట్టడుగు వర్గానికి చెందిన వ్యక్తి ప్రతిభా సంపన్నతకు అది గుర్తింపు.

ఆచార్య కొలకలూరి ఇనాక్

పద్యకవి:

వచన రచన, కథానిక, నవల, విమర్శ, పరిశోధన, రేడియో నాటకం, గేయం – ఇలా విస్తృత రచనలు చేసిన ఇనాక్‌కు పద్యకవిగా లోకమెరుగదు. 2008లో ‘ఆది ఆంధ్రుడు’ అనే పద్య కావ్యం, ‘ఇడుగో క్రీస్తు’, ‘సాక్షి’ – పద్య నాటకాలు వ్రాసారు. పద్యం పోకడ ప్రాబంధిక శైలిలో సాగింది. ఆంగ్ల రచనలు ప్రచురించారు.

వీరి రచనలు హిందీ, ఆంగ్లం, తమిళ, కన్నడ, మలయాళ భాషలలోకి అనువదించబడ్డాయి. జర్మన్, ఫ్రెంచి, పంజాబీ, మణిపూరి అనువాదాలు విశేషం.

పరిశోధనా కృషి:

ఇనాక్ గత ఆరు దశాబ్దులుగా నిత్య సాహితీ కృషీవలుడు. వీరి రచనలపై ప్రముఖ విమర్శకులు విహారి 2019లో ‘అద్వితీయ’ అనే పేర ఒక విస్తృత గ్రంథం రచించారు. అందులో నవలాకారుడిగా ఇనాక్ నవలలలో- సర్కారు గడ్డి, అనంత జీవనం – విశ్లేషించారు. కవిత్వ రస విద్య అనే ప్రకరణంలో ఆది ఆంధ్రుడు, త్రిదవ పతాకం, మెరుపుల ఆకాశం, అమరావతి ప్రస్తావించారు. సాహిత్య విమర్శ సూత్రం అనే అంశంలో సాహిత్య అకాడమీ బహుమతి పొందిన విమర్శిని ప్రశంస ఉంది. ‘విమర్శకుల తొలి పంక్తిలో తొలి పేరు ఆచార్య ఇనాక్’ అని విహారి నిరూపించారు. 11 నవలలు ప్రచురించారు.

ఇనాక్ ఆధ్వర్యంలో 18 పిహెచ్.డిలు, 15 యం.ఫిల్ సిద్ధాంత వ్యాసాలు వెలువడ్డాయి. ఇనాక్ రచనలు విశ్వవిద్యాలయాల స్థాయిలో తెలుగు, హిందీ, ఇంగ్లీషులలో పి.జి. స్థాయిలో పాఠ్యగ్రంథాలైనాయి. విశ్వవిద్యాలయాల గ్రాంట్ల సంఘం, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ వంటి ప్రతిష్ఠాత్మక సంస్థలతో విశిష్ట అనుబంధం వుంది. పది మేజర్ ప్రాజెక్టులు పరిశోధనాత్మకంగా వెలువరించారు.

కెనడా, బ్రిటన్, జోర్డాన్, ఇజ్రాయిల్, మారిషస్, మలేషియా దేశాలను సాంస్కృతిక వినిమయ పథకంలోనూ, కామన్వెల్త్ యూనివర్శిటీ సదస్సుకు, ప్రపంచ తెలుగు మహా సభలకు దర్శించారు.

వీరు చిన్నతనంలో రచించిన ‘దృష్టి’ రేడియో నాటకం జాతీయ స్థాయిలో ఆకాశవాణి బహుమతి నందుకొంది. వీరి కథా సంపుటాలు – గులాబి నవ్వింది, భవాని, ఇదా జీవితం, ఊరబావి, సూర్యుడు తలెత్తాడు, కట్టడి, కొలుపులు, గుడి, మన ఊళ్ళలో మా కథలు, పోలి తదితరాలు.

పురస్కార ప్రభ:

వీరి సాహితీ ప్రస్థానంలో భారతీయ జ్ఞానపీఠ వారి మూర్తిదేవి పురస్కారం ఒక మైలురాయి (2015). భారత ప్రభుత్వ పద్మశ్రీ 2014, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ కళారత్న (2009), యన్.సి.సి. వారి గౌరవ కల్నల్ (2000), ఆకాశవాణి జాతీయ కవి (1998), తెలుగు విశ్వవిద్యాలయ విశిష్ట పురస్కారం, సి.పి. బ్రౌన్ అకాడమీ (2011) ప్రధానాలు.

ప్రత్యేక ముద్ర:

దళిత జనోద్ధారణ తన ఆశయంగా, తాను పడ్డ కష్టనష్టాలను గరళకంఠుడిగా దిగమ్రింగి సాహితీ జీవనయాత్ర కొనసాగించడంలో వీరి సతీమణి భాగీరథ భాగస్వామ్యం ప్రముఖం. నలుగురు సంతానం విశిష్ట స్థానాలను ఆక్రమించడం, తాను నలుగురిలో విశిష్ట ప్రేమాదరాలు పొందడం వర్ణిస్తే అదృష్టవంతుని ఆత్మకథ అవుతుంది.

తులనాత్మక అధ్యయనానికి ‘ఆశాజ్యోతి’:

బెంగుళూరు విశ్వవిద్యాలయంలో జ్ఞానభారతి క్యాంపస్‍లో తెలుగు శాఖకు ఆశాజ్యోతి – కొలకలూరి ఆశాజ్యోతి. ఆచార్య కొలకలూరి ఇనాక్ ప్రథమ సంతానం ఈమె. తండ్రిని మించిన తనయ. బోధనలో, తులనాత్మక అధ్యయనంలో, పరిశోధనలో, అధికార బాధ్యతల నిర్వహణలో ఆమె అద్వితీయ. అనంతపురంలోని శ్రీ సత్యసాయి ఉన్నత విద్యాసంస్థలో 20వ ఏట డిగ్రీని 1983లో పూర్తి చేసి, 1985లో అదే సంస్థనుండి తెలుగు ఎం.ఏ. ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు. శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం నుండి 1990లో పి.హెచ్.డి. చేసి తూమాటి దోణప్ప స్వర్ణపతకం పొందారు.

తెలుగు శాఖ అధ్యక్ష స్థానం అలంకరించి ప్రొఫెసర్‍గా, బోర్డ్ ఆఫ్ స్టడీస్ అధ్యక్షులుగా (పిజి కోర్సులు, యు.జి.కోర్సులు) వ్యవహరిస్తున్నారు. కన్నడ, సంస్కృత, హిందీ, రష్యన్, ఆంగ్ల భాశలలో ప్రావీణ్యం సంపాదించారు. ఆధునిక సాహిత్యం, తులనాత్మక సాహిత్యం, జానపద సాహిత్యం వీరి అభినివేశ బోధనలు. జాతీయ అంతర్జాతీయ సదస్సులలో 55 పత్రాల సమర్పణ/అధ్యక్షత చేశారు.

స్వయంగా విశ్వవిద్యాలయంలో వర్క్‌షాపులు పది దాకా సమర్థవంతంగా నిర్వహించారు. ఆకాశవాణి కడప, బెంగుళూరు కేంద్రాల నుండి ప్రసంగాలు మౌలికాంశాలపై చేశారు. 50 దాకా పత్రికా వ్యాసాలు ప్రచురించారు. కోవిడ్ కారణంగా అంతర్జాతీయ అంతర్జాల సదస్సులు తెలుగు సాహిత్య సంబంధం గానూ, తెలుగు, సంస్కృతాలకు ఐరోపా దేశీయుల సేవ పైన, జరిపారు. అనువాద విషయంగా విశేష పరిశ్రమ చేశారు.

ఆచార్య కొలకలూరి ఆశాజ్యోతి

తెలుగు శాఖకు కన్నడ భాషతో అనుబంధాన్ని పెంచి కర్నాటక రాష్ట్రంలోని సాహితీవేత్తల ప్రశంసలందుకొన్నారు. వీరి రచనలు – పల్లెపాటలు (1997), రచయితతో ముఖాముఖీ (2000), ఆధునికాంద్ర కవిత్వంలో జానపదతివృత్తం (2004), సాహిత్య సమాలోచన (2012), ఆశాజ్యోతీయం (2016), బతుకు (2019), మాతంగి దివిటీ (2019), కందుకూరి వీరేశలింగం – సమాకాలీన సమాజం. ఈమె పర్యవేక్షణలో 11 మంది పిహెచ్.డిలు, నలుగురు యం.ఫిల్ పట్టాలు పొందారు. బరంపురం విశ్వవిద్యాలయ డి.లిట్ పరీక్షాధికారిగా వ్యవహరించారు. వివిధ సంస్థల అవార్డులు, పురస్కారాలు వరించి వచ్చాయి. యురోపియన్ దేశాలు, అమెరికా, దుబాయ్, శ్రీలంక, మాల్దీవులు, టాంజానియా, గ్రీస్, డెన్మార్క్, బ్రిటన్, స్వీడన్ దేశాలు విస్తృతంగా పర్యటించిన వ్యక్తి. రాష్ట్రేతర ప్రాంతంలోని తెలుగువారికి ఈమె ఆశాజ్యోతి.

సాహితీ సౌరభ మధుజ్యోతి:

కొలకలూరి ఇనాక్ ద్వితీయ పుత్రిక మధుజ్యోతి. తిరుపతిలోని పద్మావతీ మహిళా విశ్వవిద్యాలయ తెలుగు శాఖ ఆచార్యులు ఆమె. తెలుగులో ఎం.ఏ, పిహెచ్‌డి చేసి ఆ విశ్వవిద్యాలయంలో ఉపన్యాసకులుగా చేరి ఆచార్యత్వం వహించారు.

1967 ఆగస్టులో జన్మించిన మధుజ్యోతి లెక్చరర్‌గా 5 ఏళ్లు, సీనియర్ లెక్చరర్‍గా 4 ఏళ్ళు, అసోసియేట్ ప్రొఫెసర్‌గా 7 ఏళ్ళు పని చేసి గత 12 సంవత్సరాలుగా ఆచార్య పదవిలో ఉన్నారు. 30 సంవత్సరాల పరిశోధనానుభవం, సాహిత్యం, సాహిత్య విమర్శ, అనువాదం, భాషాశాస్త్రం, జానపద సాహిత్యం ఈమె ప్రత్యేకాభినివేశాలు.

24 గ్రంథాలు ప్రచురించారు. 90 దాకా పరిశోధనా పత్రాలు ప్రచురించారు. ఇంతవరకు వీరి పర్యవేక్షణలో 12 మంది పి.హెచ్.డిలు సంపాదించారు. ప్రస్తుతం 8 మంది సిద్ధాంత వ్యాసాలు తయారు చేస్తున్నారు. నలుగురు ఎం.ఫిల్ చేశారు. ఒక విదేశీ విద్యార్థి పరిశోధన చేస్తున్నారు.

ఆచార్య కొలకలూరి మధుజ్యోతి

27 సంవత్సరాలు వివిధ హోదాలలో పాలనానుభవం పొందారు. 30 దాకా సదస్సులలో కీలకపాత్ర పోషించారు. ఆకాశవాణి ద్వారా 35 ప్రసంగాలు చేశారు. ఈమె కథలు, కవితలు వివిధ వారపత్రికలలో ప్రచురితమయ్యాయి.

1995లొ శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం నుండి తెలుగులో ఇతివృత్త నిర్వహణ అనే అంశంపై సిద్ధాంత వ్యాసం సమర్పించి పి.హెచ్.డి పొందారు.

పురస్కారాలు:

  1. ఉత్తమ అధ్యాపక అవార్డు (రాష్ట్ర ప్రభుత్వం) -2011
  2. గుర్రం జాషువా అవార్డు, 2016
  3. రాష్ట్ర ప్రభుత్వ ఉగాది పురస్కారం, 2017
  4. వానమామలై వరదాచార్యుల పురస్కారం, 2011 తదితరాలు.

ఈమె రచనలు:

  1. తెలుగులో స్త్రీల రచనలు
  2. బెజవాడ గోపాలరెడ్డి కవిత్వం – సౌందర్యం (2000)
  3. నాన్న – పద్మశ్రీ కొలకలూరి ఇనాక్ జీవిత చరిత్ర (2014)
  4. గుప్పెడు తలపులు (2015)
  5. పిడికెడు ఆలోచనలు (2009)

జాతీయ అంతర్జాతీయ సదస్సులలో పాల్గొన్నారు. కేంద్ర సాహిత్య అకాడమీ తెలుగు సలహా సంఘం సభ్యురాలు (2018-2022).

Exit mobile version