ఆచార్యదేవోభవ-35

0
2

[box type=’note’ fontsize=’16’] ఈ శీర్షిక ద్వారా గత 20వ శతాబ్దిలో ఎందరో విశ్వవిద్యాలయ, కళాశాలల తెలుగు అధ్యాపకులను/ఆచార్యులను తీర్చిదిద్దిన గురువరేణ్యులను పరిచయం చేస్తున్నారు డా. అనంత పద్మనాభరావు. [/box]

సాహిత్య విమర్శకు ‘రాచ’బాట:

[dropcap]ఆ[/dropcap]ధునిక సాహిత్య విమర్శకులలో అగ్రశ్రేణిలో నిలిచే ఆచార్యులు రాచపాళెం చంద్రశేఖరరెడ్డి. చిత్తూరు జిల్లా కుంట్రపాకంలో 1948, అక్టోబరు 16న జన్మించిన రాచపాళెం తిరుపతిలో తెలుగు ఎం.ఏ. చేసి 1972లో పిహెచ్‍.డి పట్టా ప్రభావతీ ప్రద్యుమ్న పరిశీలనపై పొందారు. మీసాల గుబురుతో గంభీరంగా కన్పించే ఈ రెడ్డి విమర్శలో కఠినుడు. వస్తుతః సౌజన్యమూర్తి.

శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో 1977 ఆగస్టులో లెక్చరర్‍గా ప్రవేశించి రీడర్‌గా 1985, ప్రొఫెసర్‌గా 1993లో పదోన్నతులు పొంది 2008లో రిటైరయ్యారు. ఆపైన కడప యోగి వేమన విశ్వవిద్యాలయంలో 2008-15 మధ్య ఆచార్యులుగా బోధించారు. అనంతపురం తెలుగు శాఖ అధ్యక్షులుగా 1993-96ల మధ్య దిశానిర్దేశం చేశారు. అకడమిక్ సెనెట్ సభ్యులుగా రెండేళ్ళున్నారు. కడపలో నెలకొన్న సి.పి.బ్రౌన్ అకాడమీ బాధ్యులుగా 2011-15 మధ్య పరిశోధనా రంగంలో దాని పురోగమనానికి దోహదం చేశారు.

వివిధ సాహితీ సంస్థల బాధ్యతలు:

నేషనల్ బుక్ ట్రస్ట్ సభ్యుడిగా (2010-2013) కేంద్ర సాహిత్య అకాడమీ తెలుగు సలహా సంఘ సభ్యులుగా రెండో మారు 2013-17; 2018 నుండి మార్గదర్శనం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ అధికార భాషా సంఘం సభ్యులుగా 2005-2007  మధ్య పలు ప్రాంతాలు సందర్శించారు. 2021లో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అచీవ్‌మెంట్ అవార్డు ప్రకటించింది. అనంతపురం జిల్లా రచయితల సంఘ ఉపాధ్యక్షత మరో కిరీటం.

కేంద్ర ఆహిత్య అకాడమీ వారు 2014లో వీరి రచన ‘మన నవలలు- మన కథానికలు’కు బహుమతి అందించారు. ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వం 2016లో తెలుగు భాషా పురస్కారంతో సత్కరించింది. ఇంతవరకు 60 దాకా గ్రంథాలు ప్రచురించారు.

1.శిల్పప్రభావతి, 2. తెలుగు కవిత్వం – నన్నయ ఒరవడి (1995), 3. ఆధునికాంధ్ర కవిత్వం – ఉద్యమాలు, సందర్భాలు (2002), 4. కొన్ని కావ్యాలు – కొందరు కవులు (2008), ఇంకా, విమర్శ -2011, జాతీయోద్యమ సాహిత్యం, విశ్వనరుడు – గుర్రం జాషువా తదితరాలు; ఆరు అనువాద గ్రంథాలు ప్రచురించారు. 22 గ్రంథాల సంపాదకత్వం వహించారు.

వీరి పర్యవేక్షణలో 25 పిహెచ్‌డిలు, 20 ఎం.ఫిల్‌లు వెలుగు చూశాయి. ఆకాశవాణి, దూరదర్శన్‍ల ద్వారా వందకుపైగా ప్రసారాలు చేశారు. ఆధునిక విమర్శనా సాహిత్య శిఖరంగా రాచపాళెం త్రినేత్రుడైన చంద్రశేఖరుడు.

అనంతపురంలో ఓ సదస్సులో రచయిత

దేవకీశ్రీనివాసులు:

భాగవతంలో దేవకీ వసుదేవులు పురాతన దంపతులు. శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖలో దంపతులు ఆచార్యులుగా చిరకాలం కొలువు దీరడం ‘హిస్టరీ ఆఫ్ ది రికార్డ్స్’. మరెక్కడా భార్యాభర్తలు ఆచార్యులుగా తెలుగు శాఖలో ఉన్న దాఖలాలు లేవు. బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో డా. బయ్యా సూర్యనారాయణ ఆచార్యులు. వారి సతీమణి రత్నావళి అదే శాఖలో ఉపన్యాసకులు. అనంతపురంలో పి.యల్. శ్రీనివాసరెడ్డి, యం.కె. దేవకి ఆచార్య దంపతులుగా శిష్యుల గౌరవాన్ని పొందగలిగారు. యోగి వేమన విశ్వవిద్యాలయంలో రామప్రసాద్ రెడ్డి, రమాదేవి దంపతులు తెలుగు బోధనలు కొనసాగిస్తున్నారు.

అనంతపురంలో శ్రీనివాసుడు:

తెలుగు శాఖలో అధ్యాపకులుగా చేరి రీడరు, ప్రొఫెసరు పదవు లలంకరించి అధ్యయన, అధ్యాపనలు కొనసాగించి, పరిశోధనలకు మార్గదర్శకులైనాడు పి.యల్. శ్రీనివాస రెడ్డి. వీరి స్వస్థలం కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం, పార్లపల్లి. 1949 ఆగస్టు 8న జన్మించారు. శ్రీనివాస రెడ్డి కవి, భావుకుడు. సమకాలీన సమాజంలోని స్థితిగతులను నిశితంగా మందలిస్తూ, ఖండిస్తూ, కవిత లల్లారు. ‘ఈ నరజన్మంబు కతన ఫలిత మింతయు కాన రాకున్న దేమి కృష్ణ!’ అని సున్నితంగా శ్రీకృష్ణుని ప్రశ్నించారు.

ప్రాణం నిలిపిన కవి:

ప్రధానం – అనే పేర శ్రీనివాస రెడ్డి ఒక కవిత వ్రాశారు. అది ఒక విద్యార్థి కంఠస్థం చేశాడు. హాస్టల్‌లో తన రూమ్‌కి వెళ్ళి చూస్తే తన మిత్రుడు సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు సిద్ధంగా ఉన్నాడు. వెంటనే ఇతడు ఆ కవిత చదివి వినిపించాడు:

“ఐ – అంటే నేను; ‘ఐ’ అంటే కన్ను
కన్నే నేను; నేనే కన్ను;
కన్ను సున్నితం; నేను ఉన్నతం
దేహానికి కన్నెంతో, దేశానికి నేనెంతో ప్రధానం.”

– “ఈ వాక్యాలు విని ఆ కుర్రవాడు – ఆత్మహత్య విరమించుకొన్నాడు. ప్రస్తుతం ఆయన జమ్మలమడుగు కళాశాల జూనియర్ లెక్చరర్” – అని శ్రీనివాస రెడ్డి పరవశంతో చెప్పారు నాతో.

శ్రీనివాస రెడ్డి అనంతపురం పి.జి. సెంటర్‌లో 1970-72 మధ్య తెలుగు ఎం.ఏ. చేశారు. 1978 మార్చిలో శ్రీనాథుని భాషాపరిశీలనపై సిద్ధాంత వ్యాసానికి పి.హెచ్.డి. లభించింది.

ఉద్యోగ ప్రస్థానం:

రెడ్డి 1977 ఆగస్టులో అనంతపురం పి.జి. సెంటర్‌లో లెక్చరర్‌గా చేరి విశ్వవిద్యాలయ రీడరు (1985-93), ప్రొఫెసరు (1993-2009)గా వ్యవహరించారు.  శాఖాధిపతిగా 1991,92 రెండేళ్ళు, రిజిస్ట్రార్‌గా రెండేళ్ళు (1994-96) పని చేశారు. దాదాపు 20 మంది పి.హెచ్.డిలు, 20 మంది యం.ఫిల్‌ వీరి వద్ద పొందారు.

గ్రంథ రచన:

20 పుస్తకాలు ప్రచురించారు. జానపద సాహిత్యము, ప్రాచీన, ఆధునిక కవిత్వంపై అభిరుచి మెండు. వీరి రచనలు ఇతర భాషలలోకి అనువదింపబడ్డాయి. స్వేదాశ్రువులు, తొలకరి, గోరంతదీపం ఇటీవలి రచనలు. నిత్య విద్యార్థి ఆయన.

కడపలో శ్రీ తుమ్మపూడి కోటేశ్వరరావు, శ్రీ బెజవాడ గోపాలరెడ్డి గార్లతో రచయిత

దేవకీ మేడమ్:

దేవకీ మేడమ్‍గా విశ్వవిద్యాలయాలలో సుపరిచితురాలు యం.కె. దేవకి. ఆచార్య జి.యన్.రెడ్డి అన్న కుమార్తె. రెడ్డి గారే స్వయంగా కాళ్ళు కడిగి శ్రీనివాసరెడ్డికి కన్యాదానం చేశారు (24 ఆగస్టు 1984). వీరి కుమారుడికి  నారాయణ స్వామి రెడ్డి అని నామకరణం చేశారు గురుత్వంతో. అతడు విదేశాలలో (జపాన్) ఉన్నతోద్యోగి.

జీవన ప్రస్థానం:

దేవకి 1951 జూలైలో చిత్తూరు జిల్లా వరిగపల్లెలో జన్మించారు. తల్లి చిన్నతనంలోనే మరణించడంతో వీరి వివాహాన్ని జి.యస్. రెడ్డి, సునీత దంపతులు పీటల మీద కూచుని జరిపించారు. తిరుపతిలో ఎం.ఏ. చేసి, 1979లో తిరుపతిలో జి. నాగయ్య పర్యవేక్షణలో తెలుగు బాల గేయ సాహిత్యంపై పి.హెచ్.డి. పొందారు.

1979 నవంబరు నుండి శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో అధ్యాపకులై, 1987-98 మధ్య రీడరు, 1998-2011 మధ్య ప్రొఫెసరు పదవు లధిష్ఠించారు. 2001 నుంచి మూడేళ్ళు శాఖాధ్యక్షురాలు. దూరవిద్యా కేంద్ర డైరక్టరుగా 2006 నుంఛి రెండేళ్ళు వ్యవహరించారు.

బాల సాహిత్య నిపుణురాలు:

చిన్ననాటి పల్లెల్లో ఆటపాటలే బాల సాహిత్యం వైపు మొగ్గు చూపాయి. పిహెచ్.డి. పూర్తి చేసి కొంత కాలం ఉద్యోగాన్వేషణలో ఉండగా కథలకు నాంది పడింది. ఆంధ్ర ప్రదేశ్ జానపద విజ్ఞాన సమితి నుండి డా. బి. రామరాజు పురస్కారం వంటి పలు సన్మానాలు అందుకొన్నారు. ఇతర రచనలు : తారంగం – తారంగం, గోరుముద్దలు, బాల సాహిత్యం, జాతిరత్నాలు (ఉపవాచకం); తెలుగునాట జానపద వైద్య విధానాలు, జానపద సాహిత్యం, దాక్షిణాత్య సాహిత్యం, ముళ్ళదోవ, మంటల వొడిలో, కరేపాకు, ఇర్లచెంగి కథలు – ఆరు కథా సంపుటాలు వెలువడ్డాయి.

స్త్రీల పక్షాన నిలబడడమే గాక, మహిళలు చేసే తప్పుల పట్ల కూడా విరుచుకుపడే విలక్షణ వ్యక్తిత్వం గలది దేవకి. ఆమె జానపద సాహిత్య రచయిత్రి.

తెలుగు శాఖలో వెలసిన బుద్ధుడు:

శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖలో ఆచార్యుడిగా పదవీ విరమణ (2015) చేసిన యం. బుద్ధన్న కర్నూలు జిల్లా వాసి. అనంతపురంలో స్థిరపడ్డారు. చక్కని పద్యకవి. వీరి పద్యకృతి ‘రాగకింకిణి’ని తమ గురుదేవులు శలాక రఘునాథ శర్మ కంకితం చేశారు. వీరి పర్యవేక్షణలో పలువురు ఎం.ఫిల్, పిహెచ్‌డిలు పొందారు.

తెలుగు శాఖలో కన్నడ లెక్చరర్‌గా శేషశాస్త్రి పని చేశారు. ప్రస్తుతం నరసింహన్ శాఖాధ్యక్షులు. బాలసుబ్రమణ్యం ప్రొఫెసర్. తెలుగు శాఖ గత చరిత్రకు వీరు ఇద్దరే వారసులు. విద్యార్థుల కొరత ఉంది.

సాహితీ ప్రఫుల్ల:

పుట్టపర్తిలోని శ్రీ సత్యసాయి ఉన్నత విద్యా సంస్థ (డీమ్డ్ యూనివర్శిటీ) 1981 నవంబరు 22న బాబా జన్మదిన సందర్భంగా ప్రారంభమైంది. ఆ ప్రారంభ సభ రికార్డింగు చేసే అదృష్టం నాకు లభించింది.

భవగాన్ సత్యసాయి బాబాతో రచయిత

అప్పట్లో యం. సంపత్ వైస్ ఛాన్స్‌లర్ (1990). ప్రస్తుతం కె. చక్రవరి (రిటైర్డ్ ఐఎఎస్) ఛాన్స్‌లర్. ఆచార్య సి.బి. సంజీవి ఉపకులపతి. సత్యసాయి ఉన్నత విద్యా సంస్థ (డీమ్డ్ యూనివర్శిటీ) లో తెలుగు భాషా సాహిత్య విభాగాలు డిపార్ట్‌మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ లిటరేచర్‌లో భాగం. అక్కడ ఇంగ్లీషులో డిగ్రీ చేసేవారికి తెలుగు ఆప్షనల్. 1996 నుండి తెలుగు శాఖాధిపతిగా డా. మాడ్గుల ప్రఫుల్ల బోధన చేస్తున్నారు. ఆమె అదే సంస్థలో డిగ్రీ, ఎం.ఎ (1988), పిహెచ్.డి (1993) తెలుగులో చేశారు. ఆమె శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం నుండి ఎం.ఏ. సంస్కృతం (1996) చేసి, తిరుపతిలోని రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం నుండి సంస్కృత పిహెచ్‌డి (2012) పొందారు. హైదరాబాదులో రచనా కాలేజి ఆఫ్ జర్నలిజం నుండి పిజి డిప్లొమా పొందారు. అక్కడ ప్రిన్సిపాల్‌గా ఇప్పుడు రేవూరు ఉమామహేశ్వరరావు బోధన, అధ్యయనం చేస్తూ, విద్యార్థులను తీర్చిదిద్దుతున్నారు. విద్యా విభాగ డీన్‍గా 2020 నుంచి వ్యవహరిస్తున్నారు.

ప్రఫుల్ల అనేక జాతీయ అంతర్జాతీయ సదస్సులో పత్ర సమర్పణ చేసి ప్రశంసలందుకొన్నారు. ఆమె ప్రస్తుతం ఎడ్యుకేషన్ విభాగం డీన్. సంప్రదాయ సాహిత్యం, అలంకార శాస్త్రము, వ్యాకరణము ఆమె అభీష్టాలు; నైపుణ్యాలు. దివాకర్ల వెంకటావధాని స్మారక పురస్కారం అందుకొన్నారు.

ఉద్యోగ ప్రస్థానం:

1990-93 మధ్య అనంతపురం సత్యసాయి మహిళా కళాశాలలో ఆచార్య హేమలత వద్ద రీసెర్చి అసిస్టెంట్‌గా ప్రారంభమయిన ఉద్యోగం 2020లో అదే మాతృసంస్థలో డీన్ స్థాయి కెదిగింది. 1993 నుండి 97 వరకు వివిధ అనంతపురం కళాశాలల్లో అధ్యాపకురాలు. 1997 నుండి ఈ విద్యా సంస్థలలొ వివిధ హోదాలు. 2007లో పుట్టపర్తి విద్యాసంస్థలో కుదురుకున్నారు. 2013 నుండి అసోసియేట్ ప్రొఫెసరు.

భగవాన్ సత్యసాయి బోధనల ఆధారంగా సంస్కృతంలో స్త్రీ ధర్మబోధిని గ్రంథం వెలువరించారు. కళాశాల సర్వీస్ కమీషన్ వారి ఎలిజిబిలిటీ పరీక్షలో 1997లో ఉత్తీర్ణులయ్యారు. ధార్మిక మనస్తత్వంతో అధ్యయన, అధ్యాపనలు కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం యమునా రాణి అక్కడ అధ్యాపకురాలు. ఆచార్య ముదిగొండ వీరభద్రయ్య కొంతకాలం విశ్రాంతాచార్యులుగా వ్యవహరించారు. ప్రస్తుతం తెలుగు ఎం.ఏ. బోధన నడవడం లేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here