ఆచార్యదేవోభవ-36

0
2

[box type=’note’ fontsize=’16’] ఈ శీర్షిక ద్వారా గత 20వ శతాబ్దిలో ఎందరో విశ్వవిద్యాలయ, కళాశాలల తెలుగు అధ్యాపకులను/ఆచార్యులను తీర్చిదిద్దిన గురువరేణ్యులను పరిచయం చేస్తున్నారు డా. అనంత పద్మనాభరావు. [/box]

ముస్లిం విశ్వవిద్యాలయ తెలుగు సాహిత్య సేవ:

[dropcap]భా[/dropcap]రత రాజ్యాంగంలోని 350వ అధికరణం ప్రకారం ఆధునిక భారతీయ భాషల అభివృద్ధికిగా సప్తస్వరాలలా, సప్తవర్ణ శోభిత ఇంద్రధనస్సులా, సప్తర్షులకు ప్రతినిధిగా ఏడు ఆధునిక భాషలలో 1959లో అధ్యయన అధ్యాపనాలు మొదలయ్యాయి. అవి తెలుగు, తమిళం, మలయాళం, బెంగాలి, మరాఠీ, పంజాబీ, కాశ్మీరీ భాషలు. భారతదేశంలోని వివిధ సంస్కృతీ వికాసాన్ని ప్రతిబింబించి భాషా సారస్వతాలకు అలీఘడ్ ముస్లిం విశ్వవిద్యాలయంలో పట్టం గట్టారు. తొలుత హిందీ విభాగంలో అవి అనుబంధాలు. తర్వాత తెలుగు, మలయాళం, తమిళం, బెంగాలీ భాషలలో సర్టిఫికెట్, డిప్లొమా కోర్సులు ఆరంభించారు.

బి.ఎ. (ఆనర్స్)/ఎం.ఎ.లలో సబ్సిడరీ సబ్జెక్టులుగా తెలుగు తదితర భాషలు ప్రవేశపెట్టారు. జాతీయ సమైక్యత భాషల ద్వారా సాధించడం దీని ముఖ్యోద్దేశం. భాషేతరులకు ప్రాంతీయ భాషలు బోధించడం, విద్యార్థులు ఇతర భాషలు నేర్చుకోవడం, పరిశోధన తులనాత్మకంగా జరగడం, కవుల జయంతులు నిర్వహించడం వీరి లక్ష్యం.  ప్రస్తుతం డా. పఠాన్ కాశిం ఖాన్ తెలుగు శాఖలో అసిస్టెంట్ ప్రొఫెసర్. ఈ విశ్వవిద్యాలయం 2020 డిసెంబర్ 22న శతజయంతి ఉత్సవాలు జరుపుకుంది. ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోడీ ముఖ్య అతిథి. 1920లో విశ్వవిద్యాలయంగా రూపుదిద్దుకుంది. ముస్లిం సంస్కర్త సర్ సయ్యద్ అహమ్మద్ ఖాన్ దీని సంస్థాపకులు. ఆయన సివిల్ సర్వెంట్‍గా వుంటూ ముస్లింల విద్యాభివృద్ధికి దీక్షబూనారు. తొలుత అలీఘడ్‌లో కళాశాల స్థాపించారు (1875).

ఈ విశ్వవిద్యాలయానికి రాష్ట్రపతి విజిటర్. ప్రస్తుత వైస్ ఛాన్స్‌లర్ ప్రొఫెసర్ తారీఖ్ మన్సూర్. తెలుగు శాఖను 1958-59లో ప్రారంభించారు. దాదాపు 15 సంవత్సరాలు తెలుగు అధ్యాపకులుగా అయాచితుల హనుమచ్చాస్త్రి పాఠాలు బోధించారు. ఉత్తరదేశంలో తెలుగు జెండా నాటిన ఖ్యాతి శాస్త్రి గారిది. బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో 1978లో ప్రారంభించారు. రాష్ట్రేతర ప్రాంతాలలో బెంగుళూరు, మైసూరు, మదురై విశ్వవిద్యాలయాలలో తెలుగు శాఖలు దక్షిణ దేశంలో మొదలయ్యాయి.

అయాచితుల వారు:

దేశ రాజధానిలో ఢిల్లీ విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖ విశిష్టమైనది. 1958 నుండి నేటి వరకు భాషా సాహిత్యాలలో పరిశోధనలు కొనసాగుతున్నాయి. అట్టి తరుణంలో 1958-59 విద్యా సంవత్సరంలో అలీఘడ్ ముస్లిం విశ్వవిద్యాలయంలో అయాచితుల హనుమచ్చాస్త్రి ప్రారంభదశలో సర్టిఫికెట్, డిప్లొమా కోర్సులు 23 సంవత్సరాలు బోధించారు. ఆయన సాహితీరత్న, సంస్కృతాంద్ర హిందీ భాషలలో స్నాతకోత్తర పట్టభద్రులు. హిందీలో – ‘తెలుగు ఔర్ ఉస్కీ సాహిత్య్’ అను గ్రంథము, తెలుగులో – హిందీ సాహిత్యము- అను గ్రంథము లిఖించారు. ఆ విధంగా దక్షిణోత్తర భారతీయ సాహిత్యానికి వారధి అయ్యారు. ప్రేమ్‌చంద్ కథలు ఆంధ్రీకరించారు. జ్ఞానేశ్వరిని తెనిగించారు. చిక్కవీర రాజేంద్ర అనే చారిత్రక నవల వీరి రచనలలో ప్రసిద్ధం. వీరి నిఘంటు నిర్మాణాలు ప్రముఖం. 1982లో వీరు పదవీ విరమణ చేశారు

తెలుగులో వస్తాదు మస్తాన్:

అలీఘడ్ ముస్లిం విశ్వవిద్యాలయంలో తెలుగు ఆచార్యులుగా మూడు దశాబ్దులకు పైగా (33 సంవత్సరాలు) వ్యవహరించిన ఆచార్య షేక్ మస్తాన్ సాహిత్య దీక్ష అద్వితీయం. 1972లో పెదనందిపాడులో డిగ్రీ, 1974లో ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి తెలుగు ఎం.ఎ, 1984లో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో పిహెచ్.డి. చేశారు. 1952 జూలై 2 న జన్మించిన మస్తాన్ 20 సంవత్సరాలు సుదీర్ఘకాలం ప్రొఫెసర్‍గా పని చేయడం విశేషం. అలీఘడ్‍లో 1984లో అధ్యాపకులుగా చేరడానికి ముందు విజయవాడ సప్తగిరి కళాశాలలో (1979-84) పని చేశారు. 2017 జూలైలో రిటైరయ్యారు. 2019 నుండి అధికార భాషా సంఘం సభ్యులు.

ఆచార్య షేక్ మస్తాన్

అలీఘడ్ విశ్వవిద్యాలయంలో వివిధ హోదాలలో పని చేశారు. ఆర్ట్స్ విభాగం డీన్‍గా 2016-17 మధ్య సమన్వయం చేశారు. 1988లో అలీఘడ్ విశ్వవిద్యాలయం నుంచి లింగ్విస్టిక్స్ ఎం.ఎ. పొందారు. బి.ఎ., ఎం.ఏ. కోర్సుల పాఠ్య ప్రణాళికలు సిద్ధం చేశారు. ఉర్దూ భాషను విద్యార్థులు ఆప్షనల్‍గా స్వీకరించే విధానానికి మార్గం చూపారు. తెలుగు సాహిత్యము – ముస్లింల సేవ వీరి సిద్ధాంత గ్రంథము. విదేశీ పర్యటనలలో భాగంగా – నెదర్లాండ్స్, టర్కీ, యుకె, యుఎస్‌ఎ, కెనడాలు సందర్శించి, సెమినార్లలో పాల్గొన్నారు. జాతీయ అంతర్జాతీయ సదస్సుల్లో పాల్గొన్నారు. ఇతర గ్రంథాలు – తెలుగు సాహిత్య వ్యాసాలు, తెలుగుపై ఉర్దూ ప్రభావం, భారతీయ బాషలు – జాతీయ సమైక్యత తదితరాలు.

వివిధ సంస్థల ద్వారా పురస్కారాలు పొందారు. విశ్రాంత జీవనం గుంటూరులో గడుపుతూ, సాహిత్య వ్యాసంగం కొనసాగిస్తునే ఉన్నారు. వీరి వద్ద  ముగ్గురు పి.హెచ్.డిలు, ఇద్దరు ఎం.ఫిల్ చేశారు.

సాహిత్య పఠాన్:

అలీఘడ్ విశ్వవిద్యాలయంలో తెలుగు జెండా రెపరపలాడిస్తున్న డా. పఠాన్ ఖాశిం ఖాన్ సంస్కృత భాషలో ఎం.ఏ. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి పొందారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో తెలుగు ఎం.ఎ. పూర్తి చేశారు. యం.ఫిల్, పి.హెచ్.డి డిగ్రీలు అలీఘడ్ విశ్వవిద్యాలయం నుండి షేక్ మస్తాన్ పర్యవేక్షణలో పూర్తి చేశారు. రాణీ సంయుక్త – విశ్లేషణ (యంఫిల్), పాపా సాహెబ్ రచనలు – వీరి పరిశోధనాంశాలు.

గుంటూరు లోని ఆంధ్ర మహిళా కళాశాలలో 1991 ఆగస్టు నుండి 1994 మార్చి వరకు ఉపన్యాసకులుగాను, విజయవాడ త్రివేణీ మహిళా డిగ్రీ కళాశాలలో 2006 జూన్ నుండి 2019 వరకు అధ్యాపకులుగా వ్యవహరించారు. 2019 ఫిబ్రవరి నుండి నేటి వరకు అలీఘడ్ విశ్వవిద్యాలయ తెలుగు శాఖను నడుపుతున్నారు. దూర ప్రాంతంలో వున్న రాష్ట్రేతరులలో సమన్వయంగా వ్యవహిరిస్తూ భాషాభివృద్ధికి అహరహం కృషి చేతున్న పఠాన్ ఖాశిం ఖాన్, జాతీయ, అంతర్జాతీయ సదస్సులలో పత్ర సమర్పణ చేశారు. ఆధునిక భారతీయ భాషా విభాగంలో ఆర్ట్స్ శాఖను పరిపుష్ఠం చేస్తున్న పఠాన్ వీరు.

విశ్వవిద్యాలయ ఘనచరిత్ర:

ఈ విశ్వవిద్యాలయ ఛాన్స్‌లర్‌గా దావూదీ బోరా సామాజిక వర్గానికి చెందిన పీఠాధిపతులు గత 70 సంవత్సరాలుగా ఉన్నారు. ప్రస్తుత పీఠాధిపతిగా శ్రీశ్రీ డా. సైద్నా ముఫద్దల్ సైఫుద్దీన్ గతంలో 2015లోను, ప్రస్తుతం 2018 డిసెంబరు నుండి ఛాన్స్‌లర్. ఈ పీఠానికి ప్రపంచవ్యాప్తంగా ఒక మిలియన్ అనుయాయులున్నారు. 2014 నుండి వారు పీఠం అధిష్ఠించి ఉన్నారు. కరాచీ విశ్వవిద్యాలయం వారికి గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది.

రాష్ట్రేతర విశ్వవిద్యాలయాలు:

2021 జూన్ 27న తానా రథసారథి, సాహితీ కామధేనువు, కార్యదక్షులు అయిన డా. తోటకూర ప్రసాద్ ఒక అంతర్జాల అంతర్జాతీయ సదస్సు నిర్వహించారు. అందులో ప్రధాన చర్చనీయాంశం – ఉభయ తెలుగు రాష్ట్రేతర విశ్వవిద్యాలయాలలో తెలుగు భాషా సాహిత్య పరిశోధనా వికాసం. పలు విశ్వవిద్యాలయాల శాఖాధ్యక్షులు/అధ్యాపకులు పాల్గొని ఆయా విశ్వవిద్యాలయ బోధన, పరిశోధనలు వివరించారు.

  1. బెంగుళూరు విశ్వవిద్యాలయం తెలుగు శాఖాధ్యక్షులు – ఆచార్య కొలకలూరి ఆశాజ్యోతి
  2. కర్నాటక రాజ్య సార్వత్రిక విశ్వవిద్యాలయం, మైసూరు – ఆచార్య యం. రామనాధం నాయుడు
  3. ప్రాచీన తెలుగు అధ్యయన కేంద్రం, నెల్లూరు – ఆచార్య మునిరత్నం నాయుడు
  4. మదరాసు విశ్వవిద్యాలయం – ఆచార్య విస్తాలి శంకరరావు
  5. మదురై కామరాజ్ విశ్వవిద్యాలయం – ఆచార్య జొన్నలగడ్డ వెంకటరమణ
  6. అలీఘడ్ ముస్లిం విశ్వవిద్యాలయం – డా పఠాన్ ఖాశిం ఖాన్
  7. ఢిల్లీ విశ్వవిద్యాలయం – ఆచార్య గంప వెంకటరామయ్య
  8. బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం – ఆచర్య భమిడిపాటి విశ్వనాథ్

ఏవం విధ తెలుగుశాఖా బోధనలు దాదాపు ఐదు దశాబ్దులుగా కొనసాగుతున్నాయి. పరిశోధనలు కొనసాగాతున్నాయి.

మధిర కృష్ణమూర్తి శాస్త్రి గారితో రచయిత – ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో 1998లో

ప్రవాసాంధ్రుల భాషా సేవగా దీనిని భావించవచ్చు. కొన్ని విశ్వవిద్యాలయాలలో డి.లిట్ కూడా వుంది. అందులో బరంపురం డి.లిట్ తెలుగు రాష్ట్రాలలో పరిశోధకులు సంపాదించారు. డా. యస్. నారాయణరావు అక్కడ శాఖాధిపతి. డి.లిట్, యం.లిట్ ప్రతిష్ఠాత్మకంగా భావిస్తారు. మదరాసు, బెనారస్, విశ్వవిద్యాలయాల్లో ప్రస్తుతం ఈ వ్యవస్థ వుంది. పూర్వం ఆంధ్ర విశ్వవిద్యాలయంలో వుండేది.

విదేశాలలో కూడా తెలుగు బోధన జరుగుతోంది.

  1. యూనివర్శిటీ ఆఫ్ విస్కాన్సిన్, మాడిసన్ (అమెరికా) – సారథి – అఫ్సర్
  2. యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా, బర్కిలీ
  3. యూనివర్సిటీ ఆఫ్ పెన్‌సిల్వేనియా
  4. యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్, ఆస్టిన్
  5. సిలికాన్ ఆంధ్ర యూనివర్సిటీ.

జయోస్తు ఆంధ్రమాతా!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here