Site icon Sanchika

ఆచార్యదేవోభవ-37

[box type=’note’ fontsize=’16’] ఈ శీర్షిక ద్వారా గత 20వ శతాబ్దిలో ఎందరో విశ్వవిద్యాలయ, కళాశాలల తెలుగు అధ్యాపకులను/ఆచార్యులను తీర్చిదిద్దిన గురువరేణ్యులను పరిచయం చేస్తున్నారు డా. అనంత పద్మనాభరావు. [/box]

కేంద్రీయ విశ్వవిద్యాలయం – హైదరాబాదు:

[dropcap]1[/dropcap]974లో హైదరాబాదులో యూనివర్శిటీ ఆఫ్ హైదరాబాద్ పేర కేంద్రీయ విశ్వవిద్యాలయం ప్రారంభించారు. ఇప్పుడు దాదాపు 400 మంది అధ్యాపకులు 5000 మంది విద్యార్థులు ఉన్నారు. జస్టిస్ యల్. నరసింహారెడ్ది దీని ఛాన్స్‌లర్. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ ఎక్స్ అఫిషియో చీఫ్ రెక్టర్. రాష్ట్రపతి ‘విజిటర్’. 1973లో ఆరు సూత్రాల ప్రణాళిక కింద ఈ విశ్వవిద్యాలయం ప్రారంభించారు. 1974-79 మధ్య కాలంలో ఆర్గానిక్ కెమిస్ట్ అయిన ఆచార్య గురుబక్ష్ సింగ్ తొలి వైస్-ఛాన్స్‌లర్. బి.డి. జట్టి తొలి ఛాన్స్‌లర్.

ఈ విశ్వవిద్యాలయ వైస్-ఛాన్స్‌లర్‌గా పని చేసినవారిలో తెలుగు శాఖకు చెందిన ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తి (1986-1993) ప్రముఖులు. 2015-21 మధ్య ఆచార్య పొదిలె అప్పారావు వైస్-ఛాన్స్‌లర్.

ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తిగారికి సత్కారం
ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తిగారికి సత్కారం

తెలుగు శాఖాధ్యక్షుల వివరాలివి:

క్రమ సంఖ్య అధ్యక్షులు పదవీకాలం
1 ఆచార్య కొత్తపల్లి వీరభద్రరావు 1978-1985 సెప్టెంబర్
2 ఆచార్య జి.వి. సుబ్రమణ్యం 1985-1988 సెప్టెంబర్
3 ఆచార్య కె. కె. రంగనాథాచార్యులు 1988-1991,1998-99
4 ఆచార్య రవ్వా శ్రీహరి 1991-98,1999-2001 అక్టోబరు
5 ఆచార్య ఎం. వీరభద్రయ్య 2001-2004 జూన్
6 ఆచార్య పి. రామనరసింహం 2004-2007 జూన్
7 ఆచార్య బేతవోలు రామబ్రహ్మం 2007-2010 ఆగస్టు
8 ఆచార్య యన్. యస్. రాజు 2010 – 2012 మే
9 ఆచార్య యస్. శరత్ జ్యోత్స్నారాణి 2012 – 2015 మే
10 ఆచార్య తుమ్మల రామకృష్ణ 2015 – 2018 మే
11 ఆచార్య జి. అరుణ కుమారి 2018-2021 మే
12 ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు 2021 జూన్ నుండి

ఐదు దశాబ్దుల ఆచార్యుడు:

కొత్తపల్లి వీరభద్రరావు వివిధ విశ్వవిద్యాలయాల్లో ఐదు దశాబ్దులు ఆచార్యులుగా పని చేసిన ఘనత వహించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి 1942లో తెలుగు ఎం.ఏ. ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు. తెలుగు సాహిత్యంపై ఆంగ్ల ప్రభావం అనే అంశంపై అదే విశ్వవిద్యాలయంలో 1956లో పి.హెచ్.డి. పొందారు. గంటి సోమయాజులు పర్యవేక్షకులు. 17వ శతాబ్ది నుంచి 20వ శతాబ్ది వరకు ఆంధ్ర భాషా వాఙ్మయముల మీద ఆంగ్ల భాషా ప్రభవాన్ని వివరించారు. ఈ గ్రంథము ముద్రితము. వీరు రాజమండ్రిలో జన్మించారు. రాయప్రోలు సుబ్బారావు వీరి మామగారు. బహుభాషావేత్త.

ఉద్యోగ పర్వం:

విజయనగరం మహారాజా కళాశాలలో ప్రాచ్యభాషా విభాగాధ్యక్షులు. తెలుగు అకాడెమీ, ఢిల్లీ విశ్వవిద్యాలయం, విస్కాన్సిన్ యూనివర్సిటీ (అమెరికా), హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయం, తెలుగు విశ్వవిద్యాలయాలలో జ్యోతిష విభాగం ఆచార్య పీఠం అలంకరించారు. కేంద్రీయ విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖ తొలి అధిపతిగా 1978లో చేరి అధ్యయన, అధ్యాపనాలు కొనసాగించి 1985 ఆగస్టులో రిటైరయ్యారు. అధికార భాషా సంఘం అధ్యక్షులుగా (1983-85) భాషాభివృద్ధికి తోడ్పడారు.

రచనా పర్వం:

  1. సి.పి.బ్రౌన్ జీవిత చరిత్ర
  2. వంగ సాహిత్య చరిత్ర
  3. మహతి (స్వాతంత్ర్య యుగోదయంలో తెలుగు తీరుతెన్నులు)
  4. తెలుగు సాహిత్యముపై ఇంగ్లీషు ప్రభావము
  5. అవతారతత్త్వ వివేచన
  6. సర్ ఆర్థర్ కాటన్
  7. నవ్యాంధ్ర సాహిత్య వికాసము
  8. గురు నానక్ చరిత్ర
  9. విశ్వసాహితి (విజ్ఞానసర్వస్వం – సంపాదకత్వం)

వీరికి 1999లో రాజాలక్ష్మీ ఫౌండేషన్ వారి పురస్కారం, 2002లో అధికార భాషాసంఘం వారి సత్కారము లభించాయి. వీరికి జ్యోతిషంలో చక్కని ప్రవేశం ఉంది. 1984లో వీరి సహకారంతో నేను రాయప్రోలు సుబ్బారావు గారి ఇంటర్వ్యూ ఆకాశవాణి కోసం రికార్డు చేశాను. 84 ఏళ్ళ కొత్తపల్లి వారు 2006, మే 9న హైదరాబాదులో కన్నుమూశారు. ఎందరో పరిశోధకులకు మార్గదర్శనం చేశారు. వీరి తర్వాత 1985లో హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయ తెలుగు శాఖాధ్యక్షులుగా డా. జి.వి. సుబ్రమణ్యం పదవి చేపట్టారు.

కరోనా కబళించిన కందాళై:

కోవెల్ కందాళై రంగనాథాచార్యులు (1941 జూన్ 14 – 14 మే 2021) హైదరాబాద్ ఆసుపత్రిలో కరోనాతో మృత్యువాత పడ్డారు. కె.కె.రంగనాథాచార్యులుగా సుపరిచితులు. ఆయన గొప్ప సాహిత్య చరిత్రకారుడు, ప్రసిద్ధ భాషావేత్త. సాహిత్యాభివృద్ధికి కృషి చేసిన మహామహోపాధ్యాయులు, మార్క్సిస్టు సాహిత్య విమర్శకులు. తూర్పు గోదావరి జిల్లా రావులపాలెంలో జన్మించి హైదరాబాద్ లోని సీతారాంబాగ్ దేవాలయ ప్రాంగణంలో చిన్నాన్న పెంపకంలో పెరిగారు. సీతారాంబాగ్ సంస్కృత కళాశాలలో బి.ఓ.యల్ పాసయ్యారు.

సంస్కృతాంధ్ర తమిళ ఆంగ్ల భాషలలో పాండిత్యం సంపాదించారు. నాంపల్లి హైస్కూలు, మదర్సా ఏ ఆలియా పాఠశాలలో ఉపాధ్యాయులయ్యారు. ఉస్మానియాలో తెలుగు, సంస్కృత భాషా శాస్త్రలలో ఎం.ఏ. చేశారు. ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తి పర్యవేక్షణలో ప్రాచీన తెలుగు శాసన భాష మీద పరిశోధన చేసి పి.హెచ్.డి. పొందారు. 1967లో బొగ్గులకుంటలోని ఆంధ్ర సారస్వత పరిషత్ ఓరియంటల్ కళాశాల అధ్యాపకులుగా చేరి ప్రిన్సిపాల్‌గా 1987 వరకు ఉద్యోగించారు. తర్వాత హైదరాబాదులోని కేంద్రీయ విశ్వవిద్యాలయం తెలుగు శాఖ ఆచార్యులయ్యారు. శాఖాధిపతిగా, డీన్‍గా పని చేసి 2008లో పదవీ విరమణ చేశారు.

వామపక్ష భావజాలం:

కె.కె.ఆర్ విద్యార్థి దశ నుంచి విప్లవ రాజకీయాల పట్ల ఆకర్షితులయ్యారు. ప్రాచీన, ఆధునిక తెలుగు సాహిత్యాన్ని మార్క్సిస్టు ధోరణిలో అధ్యయనం చేశారు. ఆంధ్ర సారస్వత పరిషత్ వేదిక నుండి ఆధునిక సాహిత్య ప్రక్రియలపై ప్రముఖుల ప్రసంగాలు ఏర్పాటు చేశారు. దిగంబర విప్లవ సాహిత్య ఉద్యమానికి అండదండలందించారు. సాహిత్య పరిషత్ ప్రచురించిన అనేక గ్రంథాలకు సంపాదకత్వం వహించారు. తొలి దశలో సారస్వత పరిషత్‍లో రవ్వా శ్రీహరి, శలాక రఘునాథశర్మ, కె.కె. అధ్యాపకులుగా చేరారు. ముగ్గురు వివిధ విశ్వవిద్యాలయాలలో తెలుగు శాఖాధ్యక్షులయ్యారు. శ్రీహరి వైస్-ఛాన్స్‌లర్ అయ్యారు.

శిష్యకోటి:

కె.కె. శిష్యకోటిలో పలువురు ప్రఖ్యాతి వహించారు. వారిలో గోరటి వెంకన్న ప్రజాకవి, వాగ్గేయకారుడు, యం.యల్.సి. అయ్యారు. తన గురువుకు సంతాపం తెలుపుతూ వెంకన్న ఇలా అన్నారు:

“తలవంచని మార్క్సిస్టు సాహితీశిఖరం కె.కె.ఆర్… ఆయన నా గురువు. తెలుగు సాహిత్యంపై కె.కె.ఆర్ ప్రభావం చెరిగిపోనిది, చెరపలేనిది. ఆయన తాత్విక గాఢత, విలక్షణ దృష్టి అద్భుతం. సాహిత్యంలో ఆయన పునర్మూల్యాంకనం చేసిన అంశాలు కరదీపికలుగానే వెలుగుతూనే ఉంటాయి.”

కె.కె. శిష్యులలో ఆంధ్రజ్యోతి దినపత్రిక సంపాదకులు డా. కె. శ్రీనివాస్, ఎమెస్కో ప్రచురణల సంపాదకులు డి. చంద్రశేఖర రెడ్డి ప్రముఖులు. విప్లవ కవి వరవరరావు కె.కె. వద్ద పోస్ట్ డాక్టోరల్ పరిశోధన పూర్తి చేశారు.

కె.కె.ఆర్. రచించిన, సంపాదకత్వం వహించిన గ్రంథాలు:

  1. తెలుగు సాహిత్యం చారిత్రక భూమిక
  2. ఆధునిక కవిత్వం – భిన్నధోరణులు
  3. తెలుగు సాహిత్యం మరో చూపు
  4. తెలుగులో తొలి సమాజ కవులు
  5. నూరేళ్ల తెలుగునాడు
  6. తెలుగు సాహిత్యం వచన రచనా పరిచయం
  7. తెలుగు కథానికలు – పరిశీలన
  8. మొదటినుంచి 1930 వరకు బహుముఖం (వ్యాస సంకలనం)
  9. పరిచయాలు – ప్రస్తావనలు – పీఠికల సంకలనం
  10. సామాయిక వ్యాసాలు
  11. నేటి తెలుగు – స్వరూప సంగ్రహం
  12. రాచకొండ విశ్వనాథశాస్త్రి – మోనోగ్రాఫ్
  13. చందు మీనన్ (అనువాదం) – తదితరాలు

కె.కె.ఆర్‍కు నివాళి సమర్పిస్తూ సాక్షి దినపత్రిక 17-5-21న దిగంబర కవులలో ఒకరైన నిఖిలేశ్వర్ ఇలా అన్నారు : “కె.కె.ఆర్ స్నేహం, తాత్విక అనుబంధం మరిచిపోలేనివి. ఆ రోజుల్లో కొందరు పెద్దలు కె.కె.ఆర్‌ను దిగంబర కవులలో ఒకడనీ లేదా ఏడవ కవి అనీ భావించేవారు.”

తిరుపతిలో రచయిత దంపతులకు ప్రొ. సర్వోత్తమ రావు సత్కారం

నవలానందరామం:

చిలకమర్రి ఆనందారామం అసలు పేరు ఆనందలక్ష్మి. ఏలూరులో 1935 ఆగస్టు 20న సంప్రదాయ కుటుంబంలో జన్మించారు. విద్యాభ్యాసం ఈదర వెంకట్రామయ్య స్కూలులో పూర్తి చేసి, ప్రైవేటుగా బి.ఎ. పూర్తి చేశారు. వెంటనే ఏలూరు సి.ఆర్. రెడ్డి కాలేజీలో ట్యూటర్‌గా తెలుగు శాఖలో చేరారు. 1957లో చిలకమర్రి రామాచార్యులతో వివాహమైంది. తర్వాత మకాం హైదరాబాద్‌కు మారింది.

1958-60ల మధ్య ఉస్మానియాలో తెలుగు ఎం.ఏ. చేశారు. డా. సి. నారాయణ రెడ్డి పర్యవేక్షణలో పిహెచ్‌డి – తెలుగు నవలల్లో కుటుంబ చిత్రణపై (1976) చేశారు. హైదరాబాద్ లోని హోం సైన్స్ కాలేజీ, నవజీవన్ కాలేజీలలో తెలుగు శాఖలో పని చేశారు. 1982లో కేంద్రీయ విశ్వవిద్యాలయంలో అధ్యాపకులుగా చేరారు. ఆచార్యులుగా 2000లలో పదవీ విరమణ చేశారు. వీరి పర్యవేక్షణలో 30 మంది పిహెచ్‍డి పొందారు. అధ్యయన, అధ్యాపనాల ద్వారా శిష్యులపై వాత్స్యల్యాన్ని ప్రదర్శించారు.

నవలా శిరోమణి:

సృజనాత్మకత, విమర్శ, పాండిత్యం – మూడింటి త్రివేణి సంగమం ఆనందారామం. స్వీయ చరిత్ర వ్రాస్తే ‘వైరి సమాసం’ అని పేరు పెడతాన్నారొకసారి. కొంత కాలం ఫిల్మ్ సెన్సార్ బోర్డ్ సభ్యురాలు. 60 నవలలు, 100 కథలు వ్రాశారు. పలు విమర్శనా గ్రంథాలు ప్రచురించారు. వీరి నవలలు వెండితెర మీది కెక్కాయి.

నవల సినిమా
ఆత్మబలి సంసార బంధం, జీవనతరంగాలు – టీవీ సీరియల్‌
జాగృతి త్రిశూలం
మమతల కోవెల జ్యోతి

పురస్కార హేల:

ఆనందారామం పలు పురస్కారాలు అందుకొన్నారు.

గృహలక్ష్మి స్వర్ణకంకణము (1972), ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ అవార్డు (1979), మాదిరెడ్డి సులోచన బంగారు పతకం (1997), మాలతీ చందూర్ స్మారక అవార్డు (2013), సుశీలా నారాయణరెడ్డి పురస్కారం, గోపీచంద్ పురస్కారం, తెలుగు విశ్వవిద్యాలయం పురస్కారం, అమృతలత జీవన సాఫల్య పురస్కారం – తదితరాలు.

అవిశ్రాంతంగా రచనలు చేసిన ఆనందారామం 2021 ఫిబ్రవరి 11న హైదరాబాదులో కాలధర్మం చెందారు.

Exit mobile version