Site icon Sanchika

ఆచార్యదేవోభవ-48

[box type=’note’ fontsize=’16’] ఈ శీర్షిక ద్వారా గత 20వ శతాబ్దిలో ఎందరో విశ్వవిద్యాలయ, కళాశాలల తెలుగు అధ్యాపకులను/ఆచార్యులను తీర్చిదిద్దిన గురువరేణ్యులను పరిచయం చేస్తున్నారు డా. అనంత పద్మనాభరావు. [/box]

తెలుగు విశ్వవిద్యాలయం:

[dropcap]అ[/dropcap]ప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు సంకల్ప బలంతో 1985 డిసెంబరు 2న తెలుగు విశ్వవిద్యాలయ శుభారంభం జరిగింది. సంగీత నృత్య కళలతో బాటు సాహిత్యము, చరిత్ర, భాష, జర్నలిజం,  లలితకళలకు ప్రోత్సాహం కలిగించడానికి అమరజీవి పొట్టి శ్రీరాములు పేర విశ్వవిద్యాలయము ఆరంభించారు. హైదరాబాదు నాంపల్లిలో ప్రధాన కార్యాలయం నెలకొల్పారు. మరో నాలుగు కేంద్రాలు – జాన పదకళల విభాగం, వరంగల్‌లో, నన్నయ సాహిత్యపీఠం రాజమండ్రిలో, సిద్ధేంద్రయోగి కళాపీఠం కూచిపూడిలో, చరిత్ర, సంస్కృతి, ఆర్కియాలజీ విభాగం శ్రీశైలంలో నెలకొల్పారు.

ఈ విశ్వవిద్యాలయంలో డిప్లామా, ఎం.ఏ, పి.హెచ్.డి కోర్సులు నడుపుతున్నారు. వంద ఎకరాల విస్తీర్ణంలో హైదరాబాదు బాచుపల్లిలో విశాల ప్రాంగణంలో విద్యార్థుల వసతి గృహాలు నిర్మించారు. విశ్వవిద్యాలయంలో భాగంగా సాహిత్య, సంగీత, నాటక, నృత్య, లలితకళా అకాడమీలను, అంతర్జాతీయ తెలుగు కేంద్రం, తెలుగు భాషా సమితులను విలీనం చేశారు. భాషా సాహిత్య సంస్కృతి పరిరక్షణలో భాగంగా ప్రసిద్ధ వ్యక్తులకు అవార్డులు ఏటా ప్రదానం చేస్తారు. అకాడమీలు పూర్వం నిర్వహించే కార్యక్రమాలను ఈ సంస్థ చేపట్టింది. ప్రముఖ వ్యక్తుల జీవిత విశేషాల డాక్యుమెంటరీలు తయారు చేయడానికి ఆడియో విజువల్ స్టూడియో నిర్మించారు. ప్రచురణల విభాగం ద్వారా గ్రంథాలు వెలువరిస్తున్నారు. వరంగల్ కేంద్రంలో జానపద కళా విభాగము, గిరిజన కళావిభాగము రెండు పని చేస్తున్నాయి. డా. యన్. భక్తవత్సలరెడ్డి ఇక్కడ తొలి రోజుల్లో పరిశోధనలకు అవకాశం కల్పించి పి.హెచ్.డిలకు వసతి కల్పించారు. బోధన, పరిశోధన, ప్రచురణ, విస్తరణ విభాగాలు నాలుగింటి ద్వారా ఈ విశ్వవిద్యాలయం గత 36 సంవత్సరాలుగా ముందుకు సాగుతోంది.

విశ్వవిద్యాలయానికి ద్రోణాచార్యులు:

తెలుగు విశ్వవిద్యాలయ స్థాపన సమయంలో పరిశోధనాదక్షులైన ఆచార్య తూమాటి దొణప్ప నేతృత్వం వహించి దిశానిర్దేశం చేశారు. ఇప్పటి వరకు (1985-2021) పది మంది ఉపాధ్యక్షులు ఈ సంస్థ పురోగతికి దోహదం చేశారు.

ఉపాధ్యక్షులు మాతృసంస్థ
1. ఆచార్య తూమాటి దొణప్ప(1986-89) ఆంధ్ర విశ్వవిద్యాలయం
2. ఆచార్య సి.నారాయణరెడ్డి (1989-92) ఉస్మానియా విశ్వవిద్యాలయం
3. ఆచార్య పేర్వారం జగన్నాథం (1993-96) కాకతీయ విశ్వవిద్యాలయం
4. ఆచార్య నాయని కృష్ణకుమారి (1996-99) ఉస్మానియా విశ్వవిద్యాలయం
5. ఆచార్య యన్. గోపి (1999-2002) ఉస్మానియా విశ్వవిద్యాలయం
6. ఆచార్య జి.వి.సుబ్రమణ్యం (2002-05) కేంద్రీయ విశ్వవిద్యాలయం
7. డా. ఆవుల మంజులత (2005-08) తెలుగు అకాడమీ
8. ఆచార్య అనుమాండ్ల భూమయ్య (2008-11) కాకతీయ విశ్వవిద్యాలయం
9. ఆచార్య ఎల్లూరి శివారెడ్డి (2012-16) ఉస్మానియా విశ్వవిద్యాలయం
10. ఆచార్య యస్.వి.సత్యనారాయణ (2017-20) ఉస్మానియా విశ్వవిద్యాలయం
11. ఆచార్య తంగిడ కిషన్ రావు(2021-) ఉస్మానియా విశ్వవిద్యాలయం

అరుదైన అంశాలు:

ఆచార్య తంగెడి కిషన్ రావు తెలుగు విశ్వవిద్యాలయ ఉపకులపతిగా 2021 మే లో పదవీ స్వీకారం చేశారు. మిత్రత్రయం – అనుమండ్ల భూమయ్య, యన్. గోపి, టి. కిషన్ రావులు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఒకసారి తెలుగు ఎం.ఏ చదివారు. ముగ్గురూ ఒకే విశ్వవిద్యాలయం వి.సి.లు కావడం అరుదైన విషయం.

మరో విశేషం – గతంలో వి.సి.లు అయిన పది మందిలో ఇద్దరు మహిళలు, ఇద్దరి తండ్రులు లబ్ధప్రతిష్ఠులు. నాయని కృష్ణకుమారి తండ్రి నాయని సుబ్బారావు. ఆధునిక కవులలో ‘సౌభద్రుని ప్రణయయాత్ర’ ద్వారా ప్రసిద్ధులు. ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో ప్రొడ్యూసరు. ఆవుల మంజులత తండ్రి జస్టిస్ ఆవుల సాంబశివరావు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి. సాహితీ ప్రియులు. ఆంధ్ర విశ్వవిద్యాలయ వి.సి. ఒకే కుటుంబం నుండి రెండు విశ్వవిద్యాలయాలకు ఇద్దరు వి.సి.లు కావడం విశేషం.

ఆధునిక పరిశోధనా వేమన:

ప్రజాకవి వేమన మీద సాధికారిక పరిశోధన చేసి, వేమన పరిశోధనా సంస్థను నెలకొల్పిన యన్. గోపి (26 జూన్ 1948) తెలంగాణా గడ్డపై పుట్టి పెరిగిన ఆణిముత్యం. అధ్యాపకుడిగా, పరిశోధకుడిగా, పాలనాదక్షుడిగా, సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీతగా ప్రసిద్ధులు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎం.ఏ తెలుగు చేసి, వేమనపై పరిశోధనకు పి.హెచ్.డి. సాధించి అదే విశ్వవిద్యాలయంలో 1974లో అధ్యాపకులై, ఆచార్యులై 2008లో పదవీవిరమణ చేశారు.

ఆచార్య ఎన్. గోపీతో రచయిత, తిరుపతిలో

ఉపకులపతి:

గోపి తెలుగు విశ్వవిద్యాలయ ఉపకులపతిగా అనేక సంస్కరణలు ప్రవేశపెట్టారు. నేను వ్రాసిన ‘ఢిల్లీ ఆంధ్రప్రముఖులు’ గ్రంథం వీరి హయాంలో 2000లలో తెలుగు విశ్వవిద్యాలయం ప్రచురించింది. 21 కవితా సంపుటులు, 7 వ్యాససంపుటులు, 3 పరిశోధనా గ్రంథాలు, 5 అనువాదాలు, 5 యాత్రా చరిత్రలు, 2 వ్యాఖ్యనాలు, 5 పాఠ్య గ్రంథాలు రచించారు. ఈయన రచనల్లో ‘కాలాన్ని నిద్ర పోనివ్వను’ (1998) నానీలు, ‘జలజీవనగీతం’ (దీర్ఘకవిత 2002) ప్రసిద్ధాలు. వీరి రచనలను ఇతర భాషలలోకి అనువదించారు. వీరి సతీమణి అరుణ రచయిత్రి.

బోనగిరి బాలుడు:

నల్గొండ జిల్లా బోనగిరిలో వ్యవసాయ కుటుంబంలో జన్మించిన గోపాల్ విద్యాభ్యాసం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పూర్తి చేశారు. బి.ఏ.లో, ఎం.ఏ.లో స్వర్ణపతకాలు సాధిచారు(1973). 1971లో ఉస్మానియా అనుబంధ కళాశాల (NB సైన్స్ కాలేజి) అధ్యాపకుడిగా జీవితం ప్రారంభించి 1981లో ఉస్మానియాలో అడుగుపెట్టారు. 1990లో ప్రొఫెసరు, 1994లో శాఖాధ్యక్షులు. వీరి వద్ద పది మంది పరిశోధన చేశారు.

చిన్న వయసులో వి.సి.:

ఐదు పదులు దాటగానే 1999లో తెలుగు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులై 2002 వరకు కొనసాగి, దేశంలోనే చరిత్ర సృష్టించారు. ద్రవిడ, కాకతీయ విశ్వవిద్యాయాలకు ఇన్‌చార్జి వి.సి.గా కొంత కాలం వ్యవహరించారు.

రచనలు:

‘తంగేడుపూలు’ (1976) తో ప్రారంభించి 2020 వరకు అవిశ్రాంతంగా గ్రంథాలు వెలువరించారు. ‘కాలాన్ని నిద్ర పోనివ్వను’ కవితా సంపుటి కేంద్రసాహిత్య అకాడమీ అవార్డు 2000లో లభించింది. కేంద్ర సాహిత్య అకాడమీ తెలుగు భాషా సలహా సంఘ కన్వీనర్‌గా అనేక సదస్సులు నిర్వహించారు. నానీలకు నాన్నగా ప్రసిద్ధి. ఎందరినో నానీల కవులుగా మలచారు. వీరి వేమన వాదం, ప్రజాకవి వేమన, వేమన పద్యాలు, వేమన వెలుగులు –  వేమనపై వచ్చిన మౌలిక పరిశోధా గ్రంథాలు. ఆధునిక కవులలో గోపి అగ్రగణ్యులు.

సాహితీ వనంలో ‘మంజులత’:

ఆవుల మంజులత విద్వన్మణి. తండ్రి సాంబశివరావు సుప్రసిద్ధ న్యాయమూర్తి. సాహీతీ సుగంధాలు పరిమళించే ఆ యింటిలో మదరాసు నగరంలో మంజులత జన్మించారు. తండ్రి హైదరాబాదు తరలి రావడంతో పైదరాబాదులోని రెడ్డి మహిళా కళాశాలలో చదువుకొన్నారు. తెలుగు అకాడమీ ప్రారంభ దినాలలో రీసెర్చి అసిస్టెంట్‌గా చేరి, రీసెర్చి ఆఫీసరుగా ఎదిగి అదే సంస్థ డైరక్టర్‌గా 1999లో పదవీ బాధ్యతలు చేపట్టారు. అప్పట్లో ప్రముఖ భాషా శాస్త్రవేత్తలు బూదరాజు రాధాకృష్ణ, చేకూరి రామారావు, ముకురాల రామారెడ్డి, పోరంకి దక్షిణామూర్తి, అక్కిరాజు రమాపతిరావు తెలుగు అకాడమీకి పేరు ప్రతిష్ఠలు తెచ్చారు. వారితో కలిసి మంజులత అనేక గ్రంథ ప్రచురణలు చేపట్టారు.

2005లో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్‌గా నియమితులై మూడేళ్లు సాహితీ సాంస్కృతిక వికాసానికి దోహదం చేశారు. వీరి హయాంలో ఇజ్రాయిల్‌లో హిబ్రూ యూనివర్శిటీలో తెలుగు విభాగాన్ని ప్రారంభించడం చరిత్రలో ఒక మైలురాయి. ‘ఆధునిక సాహిత్యంలో ప్రక్రియలు – ధోరణులు’ అనే వీరి గ్రంథాన్ని తెలుగు అకాడమీ 2012లో ప్రచురించింది. విశ్వవిద్యాలయేతర సంస్థ నుండి వి.సి.గా ఎంపికైన తొలి వ్యక్తి ముంజులత.

డేవిడ్ షుల్మన్:

హిబ్రూ విశ్వవిద్యాలయంలో ఒప్పందం ద్వారా జెరుసలెం లోని హిబ్రూ విశ్వవిద్యాలయంలో ఐదేళ్ల పాటు ఒక తెలుగు పీఠం ఏర్పరచడం విశేషం. ఇక్కడ ఆచార్య డేవిడ్ షుల్మన్, ఆసియా అధ్యయన విభాగాధిపతి. 1949  జనవరిలో వాటర్‍లూలో జన్మించిన ఈయన కవి, ఇండాలజిస్టు. సంస్కృతాది భాషలతో బాటు ద్రావిడ భాషలైన తెలుగు, తమిళం, అభ్యసించి 20 దాకా పుస్తకాలకు సహరచయిత అయ్యారు. 2016లో ఈయనకు ఇజ్రాయిల్ బహుమతి 75 వేలు లభించగా దానిని ఒక స్వచ్ఛంద ఇజ్రాయిల్ సంస్థకు విరాళంగా ప్రకటించాడు. తమిళంలో ‘శైవ తలపురాణం’పై పరిశోధనకుడిగా తమిళ, సంస్కృతాలలో డాక్టరేట్ సంపాదించారు. ప్రముఖ సాహితీవేత్త డా. వెల్చేరు నారాయణరావుతో కలసి అనేక తెలుగు గ్రంథాలు ఆంగ్లంలోకి అనువదించారు. పింగళి సూరన కళాపూర్ణోదయం, వల్లభరాయని క్రీడాభిరామం, ప్రభావతీ ప్రద్యుమ్న అనువాదాలు ప్రముఖం. షుల్మన్ శాంతి ఉద్యమదూత. కర్రి రామచంద్రారెడ్డి హిబ్రూ విశ్వవిద్యాలయంలో 2020 నుండి యూరోపియన్ రీసెర్చి కౌన్సిల్ వారి నిధులతో – The New Ecology of Expressive Modes in Early-Modern South India –  అనే అంశం పై పరిశోధన కొనసాగిస్తున్నాడు.

Exit mobile version