ఆచార్యదేవోభవ-49

0
2

[box type=’note’ fontsize=’16’] ఈ శీర్షిక ద్వారా గత 20వ శతాబ్దిలో ఎందరో విశ్వవిద్యాలయ, కళాశాలల తెలుగు అధ్యాపకులను/ఆచార్యులను తీర్చిదిద్దిన గురువరేణ్యులను పరిచయం చేస్తున్నారు డా. అనంత పద్మనాభరావు. [/box]

భాషాప్రవీణులైన ఆచార్యులు:

[dropcap]పూ[/dropcap]ర్వం ఆంధ్రదేశంలో అనేక ప్రాచ్యకళాశాలలు ఆంధ్రప్రదేశ్ నలుమూలలా విస్తరించి వుండేవి. సి.హెచ్.పి.వి.మూర్తిరాజు స్వయంగా కొన్ని కళాశాలలు ఉదారంగా స్థాపించారు. ఆ కళాశాలల్లో విద్వాన్, భాషాప్రవీణ చదువుకున్న అభ్యర్థులు తెలుగు పండితులుగా, డొక్క శుద్ధిగల అధ్యాపకులుగా బోధనలో పేరు తెచ్చుకొన్నారు. మూడు వందల రూపాయల జీతంతో జీవనం కొనసాగించారు. వారిలో కొందరు ఆంధ్ర విశ్వవిద్యాలయేతర సంస్థలలో ఆంగ్ల విద్యా బోధన కనుగుణంగా ఎం.ఏ.లు ప్యాసయి, పి.హెచ్.డిలు చేసి విశ్వవిద్యాలయ ప్రకటనలు వచ్చినప్పుడు ఆయా సంస్థలలో ప్రవేశించి ప్రాచ్య పాశ్చాత్యభాషా సంస్కృతులు వొంట పట్టించుకొని బోధనలోను, పరిశోధనలోను ముందంజ వేసి ప్రతిభా సంపన్నులై వందలాది ఉత్తమ అధ్యాపకులను తీర్చిదిద్దారు. నా ఎరుకలో కొందరు ప్రముఖులను ప్రస్తావిస్తాను.

సర్వశ్రీ

  • అమరేశం రాజేశ్వర శర్మ, ఉస్మానియా విశ్వవిద్యాలయం
  • వెల్దండ నిత్యానందరావు, ఉస్మానియా విశ్వవిద్యాలయం
  • కె.కె.రంగనాథాచార్యులు, కేంద్రీయ విశ్వవిద్యాలయం
  • బేతవోలు రామబ్రహ్మం, కేంద్రీయ విశ్వవిద్యాలయం
  • జాస్తి సూర్యనారాయణ, శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం
  • కె.సర్వోత్తమరావు, శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం
  • జీరెడ్డి చెన్నారెడ్డి, శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం
  • శలాక రఘునాథ శర్మ, శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం
  • హెచ్.యస్.బ్రహ్మానంద, శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం
  • కె.యాదగిరి, కాకతీయ విశ్వవిద్యాలయం
  • ఆకురాతి పున్నారావు, నాగార్జున విశ్వవిద్యాలయం
  • దావులూరి కృష్ణకుమారి, పద్మావతీ విశ్వవిద్యాలయం
  • బి.వి.సూర్యనారాయణ, బెనారస్ హిందూవిశ్వవిద్యాలయం
  • బి.విశ్వనాధ్, బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం
  • తిమ్మవజ్ఝల కోదండరామయ్య, మధురై కామరాజు విశ్వవిద్యాలయం
ఆచార్య జీరెడ్డి చెన్నారెడ్డి

ఇలా మరెందరో భాషాప్రవీణులు ఆచార్య పీఠాన్ని అలంకరించడం ఆనందదాయకం. తెలుగు పండితులు ఛాందసులు (ఛందస్సు నెరిగిన వారు) అనే అవరోధాన్ని తొలగించారు.

పద్యకవితా గిరి శిఖరం:

కరీంనగర్ జిల్లా పి.వి.కీ, సి.నా.రె.కీ పుట్టినిల్లు. ఆ జిల్లా మారుమూల గ్రామం వెదురుగట్టులో జన్మించి కవితా వేణువుగా ఎదిగిన వ్యక్తి అనుమాండ్ల భూమయ్య. హైదరాబాదు అర్ట్స్ కళాశాలలో 1973లో ఎం.ఏ.; వరంగల్ పి.జి.సెంటరులో గోపరాజు కవిత్వంపై ఎం.ఫిల్(1976); నాయని సుబ్బారావు కృతులపై కాకతీయ విశ్వవిద్యాలయ పి.హెచ్.డి (1980) అందుకొన్నారు.

ఉద్యోగ ప్రస్థానం:

వరంగల్ లాల్ బహదూర్ కళాశాలలో జూనియర్ లెక్చరర్‌గా 1973లో చేరి, 1983 నుండి 2008 ఆగస్టు వరకు కాకతీయ విశ్వవిద్యాలయంలో అంచెలంచెలుగా ఎదిగి ఆచార్య పీఠమే కాక తెలుగు విశ్వవిద్యాలయ వి.సి.గా 2008 ఆగస్టు నుండి 2011 ఆగస్టు వరకు వ్యవహరించారు. 40 గ్రంథాలు ప్రచురించారు. పద్యం, గేయం, విమర్శ ప్రక్రియలలో అందెవేసిన చేయి. పద్యంపై మక్కువ ఎక్కువ.

సాహిత్యానికి ఎల్ల ఎల్యూరి(1945):

మహోన్నత సాహితీ శిఖరం ఎల్లూరి శివారెడ్డి. ఆయన అధ్యాపకుడు, ఉత్తమ పాలనాదక్షుడు, పరిశోదకులు, వక్త. సంస్కృతాంధ్రంలో ఎం.ఏ. చేశారు. ఉస్మానియా తెలుగు విభాగం నుండి ఎం.ఏ.లో స్వర్ణపతక విజేత. ఆయన సిద్ధాంత వ్యాసం ‘మహాభారతంలో రసపోషణ’ ప్రామాణిక గ్రంథం. 1945 ఏప్రిల్ 7న మహబూబ్‌నగర్ జిల్లా కాలూరులో జన్మించారు. ఉస్మానియా తెలుగు శాఖలో 1992 నుండి ఆచార్యలుగా పని చేసి 2005లో రిటైరయ్యారు. 1996-98, 2000-2002 మధ్య రెండు మార్లు శాఖాధ్యక్షులు. తెలుగు విశ్వవిద్యాలయ వైస్ ఛాన్స్‌లర్‌గా 2012-2016 మధ్య నాలుగేళ్ళు పదవీ బాధ్యతలు నిర్వహించారు. 2021లో దాశరథి సాహితీ పురస్కారం అందుకున్నారు. వీరి పర్యవేక్షణలో 19 పి.హెచ్.డి.లు, 14 ఎం.ఫిల్ తయారయ్యాయి. ‘పద్యనిత్యం – వస్తువైవిధ్యం’ అనే అంశంపై కె.వి.రమణాచారి వీరి వద్ద పి.హెచ్.డి సాధించారు. 34 ఏళ్లు అధ్యాపకానుభవం వీరిది. సౌజన్యతామూర్తి శివారెడ్డి. ‘సురవరం ప్రతాపరెడ్డి జీవితం – సాహిత్యం’ గ్రంథానికి ఆంధ్ర సాహిత్య అకాడమీ బహుమతి లభించింది. తెలంగాణా సారస్వత పరిషత్ అధ్యక్షులుగా కొనసాగుతున్న ధీశాలి శివారెడ్డి, అనేక పురస్కారాలు అందుకొన్నారు.

తెలుగు కరదీపికలు:

తెలుగు విశ్వవిద్యాలయంలో తులనాత్మక పరిశీలనా విభాగంలో ఆచార్య పదవి నిర్వహించి 2016లో పదవీ విరమణ చేసిన చుండూరి మృణాళిని విద్వన్మణి. కాకినాడలో 1957 మే 17న జన్మించిన ఈమె ఉస్మానియా నుండి తెలుగులో ఎం.ఏ.(1979), ఎం.ఫిల్(1981), పి.హెచ్.డి(1986) చేశారు. ఇంగ్లీషు ఎం.ఏ. కూడా చదివారు. తెలుగు విశ్వవిద్యాలయంలో అధ్యాపకులుగా చేరి 1991లో ఆచార్య పదవి నందుకొన్నారు. రాళ్ళపల్లి అనంత కృష్ణశర్మ వీరి మాతామహులు. బాలగోపాల్ సోదరుడు. సుభాషిణి(మాసపత్రిక), ఉదయం దినపత్రిక, వరల్ట్ స్పేస్ రేడియోలో పని చేసిన జర్నలిజం అనుభవం వుంది. విదేశాలలో విస్తృతంగా పర్యటించారు. Narrative Technique in Telugu Novel అనే ఆంగ్ల విమర్శనా గ్రంథంతో బాటు నవలలు, విమర్శనా గ్రంథాలు ప్రచురించారు. తెలుగు విశ్వవిద్యాలయ సాహితీ పురస్కారం మల్లాది కథలకు 2013లో లభించింది. నిరంతర సృజనాశీల మృణాళిని. తెలుగు నవలల్లో కథాకథన శిల్పం వీరి సిద్ధాంత గ్రంథం(1988).

ఇతర సాహితీవేత్తలు:

తెలుగు విశ్వవిద్యాలయ కీర్తి పతాకను ఎగురవేసిన ఇతర ప్రముఖులలో శిఖామణిగా ప్రసిద్ది కెక్కిన కె.సంజీవరావు విశిష్టులు. యానాంలో 1957 అక్టోబరులో జన్మించి బి.ఏ. కాకినాడ పి.ఆర్ కాలేజిలో; ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఎం.ఏ. పూర్తి చేశారు. పఠాభి కవిత్వంపై పరిశోధనకు ఆంధ్ర విశ్వవిద్యాలయ డాక్టరేట్ పొందారు. 1991లో చేరి 2017లో ఆచార్యులుగా తెలుగు విశ్వవిద్యాలయంలో రిటైరయ్యారు. తనను పోషించిన శిఖామణికి కృతజ్ఞతగా శిఖామణి కలం పేరు వుంచుకొన్నారు. కవి సంధ్య పేర పత్రిక నడుపుతున్నారు. దళిత కవిత్వంపై హైదరాబాదు విశ్వవిద్యాలయం నుండి మరో డాక్టరేట్ తెచ్చుకొన్నారు (2008).

రిజిష్ట్రార్లు:

ఈ విశ్వవిద్యాలయ ప్రారంభం నుండి నేటి వరకు రిజిష్ట్రార్లుగా తెలుగు ఆచార్యులు యన్. శివరామమూర్తి, యన్.భక్తవత్సలరెడ్డి, టి.గౌరీశంకర్ ప్రభృతులు పని చేసి వి.సి.లకు అండదండలుగా నిలిచారు. దిశను మలచారు. రెడ్డి శ్యామల కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినర్‌గా దక్షతతో వ్యవహరిస్తున్నారు. జ్యోతిష విభాగంలో కొత్తపల్లి వీరభద్రరావు, చిర్రావూరి సుబ్రమణ్యం దిగ్ధంతులు.

గౌరీశంకరుడు:

అంతర్జాతీయ తెలుగు విజ్ఞాన కేంద్ర నిర్దేశకులుగా యన్.శివరామమూర్తి, టి.గౌరీశంకర్, డి.మునిరత్నం నాయుడు వ్యవహరించారు. గౌరీశంకర్ రిజిష్ట్రారుగా, ప్రొఫెసర్‌గా పదవీ విరమణ చేశారు. తిరుపతిలో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభల సమన్వయకర్తగా సదస్సులు నిర్వహించారు. స్వాతంత్రానంతర తెలుగు కవిత్వంలో సామాజిక స్పృహపై ఎంఫిల్ పొందారు (పర్యవేక్షకులు – డా.సినారె.1979). 1985లో తెలుగు సినిమా పాటలు- సాహితీ మూల్యాలు పి.హెచ్.డి సిద్ధాంత వ్యాసం. వీరి పర్యవేక్షణలో రేవూరు అనంతపద్మనాభ రావు సమగ్ర సాహిత్యంపై ధన్యంరాజు నాగమణి పి.హెచ్.డి పొందారు(2014). గౌరీశంకర్ సారధ్యంలో 18 సిద్ధాంత గ్రంథాలు వెలువడ్డాయి. స్వయంకృషితో పైమెట్టు సాధించిన సాహితీ పరుడు.

యశస్వీ! యస్వీ (1954):

ఎస్.వి. సత్యనారాయణ హైదరాబాదులోని బి.ఆర్.అంబేద్కర్ కళాశాలలో ఒక దశాబ్ది కాలం (1981-91) తెలుగు అధ్యాపకులు. హైదరాబాదు పాతనగరంలో 1954 ఆగస్టు 16న మధ్య తరగతి కుటుంబంలో జన్మించారు. విద్యాభ్యాసం హైదరాబాదులో కొనసాగింది. ప్రతికూల పరిస్థితులను అధిగమించి ఉన్నత విద్య పూర్తి చేశారు. చిన్నతనం నుండి కవిత లల్లసాగారు. 15వ ఏట ‘విద్యుల్లత’ మాస పత్రికలో తొలి కవిత అచ్చయింది.

కష్టపడి, ఇష్టపడి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎం.ఏ. తెలుగు, ఎం.ఏ ఇంగ్లీషు, ఎం.ఫిల్ దీక్షతో పూర్తి చేశారు. తొలినాళ్ల నుండి వివిధ రచయితల సంఘాలతో అనుబంధం పెంచుకున్నారు. 1970 దశకంలో ‘అరసం’ సభ్యుడిగా మొదలైన ప్రస్థానం రాష్ట్ర అధ్యక్షత వరకు పెరిగింది. భారత అధ్యక్ష వర్ సభ్యులుగా ఎంపికయ్యారు. వీరు అబ్బూరి రామకృష్ణరావు రచనలపై పి.హెచ్.డి చేశారు(1982).

ఉస్మానియా కోటలో:

సత్యనారాయణ ఉస్మానియా తెలుగు శాఖలో లెక్చరర్‌గా, రీడరుగా, ప్రొఫెసర్‌గా ఎదిగి శాఖాధ్యక్షత భుజాన వేసుకున్నారు. పాఠ్యగ్రంధ సంపాదకత్వం, వివిధ విశ్వవిద్యాలయాల పాఠ్యప్రణాళికా సభ్యుత్వము, కేంద్రసాహిత్య, అకాడమీ జనరల్ కౌన్సిల్ సభ్యత్వము, విశాలాంద్ర ప్రచురణాలయ సంపాదకత్వం, పీపుల్స్ పబ్లిషింగ్ హౌవుస్ సంపాదక వర్గ సభ్యత్వం ఆయన ప్రతిభకు నిదర్శనాలు. 2017లో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయ ఉపాధ్యక్షులై 2020 వరకు కొనసాగారు. సోవియెట్ యూనియన్, ఈజిప్టు, ఆస్ట్రేలియా, నేపాలు దేశాలు సందర్శించారు. 2014 ఆగస్టులో ఉస్మానియా నుండి రిటైరయ్యారు. 45 గ్రంథాలు ప్రచురించారు.

రచనా పథం:

సత్యనారాయణ బహుముఖీన ప్రజ్ఞాధురంధరుడు. అనేక పరిశోధనాత్మక రచనలు చేశారు. వీరి రచనలలో కొన్ని – దళిత సాహిత్యనేపథ్యం, తెలంగాణా సాయుధపోరాట సాహిత్యం, తెలంగాణా విమోచనోద్యమం – సాహిత్యం తెలుగులో అభ్యుదయ సాహిత్యం, తెలుగు సాహిత్యంపై మార్క్సిజం ప్రభావం వగైరా. వీరికి పలు పురస్కారాలు లభించాయి. యునైటెడ్ చిల్డ్రన్స్ మూవ్‌మెంట్ అవార్డు, అధికార భాషా సంఘ మాతృ భాషా పురస్కారం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తమ అధ్యాపక అవార్డు, గిడుగు స్మారక ప్రతిభా పురస్కారం మచ్చుకు కొన్ని, అభ్యుదయ భావజాల సాహితీ జయకేతనం యస్వీ యశస్వి.

తెలుగు విశ్వవిద్యాలయ నందనోద్యాన ‘తంగెడ’:

ఒక కళాశాలలో ఒకే క్లాసులో చదువుకున్న ముగ్గురు మిత్రులు ఒకే విశ్వవిద్యాలయ ఉపాధ్యక్షులు కావడం చారిత్రక ఘట్టం. తెలుగు విశ్వవిద్యాలయ చరిత్రలో సువర్ణఘట్టం. తంగెడ కిషన్ రావుకు పూర్వం యన్.గోపి, అనుమండ్ల భూమయ్య ఈ పదవి నధిష్టించారు.

2021 మే నెలలో పదవీ బాధ్యతలు చేపట్టిన కిషన్ రావు ఉస్మానియాలో 1973లో తెలుగు ఎం.ఏ. చేశారు. ఆచార్య నాయని కృష్ణకుమారి పర్యవేక్షణలో “TELANGANA FOLKLORE IN TELUGU CLASSICAL LITERATURE” పై పరిశోధనకు 1991లో పి.హెచ్.డి లభించింది. వరంగల్ అర్బన్ జిల్లా జీలుగులలో 1950 నవంబరులో జన్మించిన వీరు ఉస్మానియా విశ్వవిద్యాలయ తెలుగు శాఖ ఆచార్యులుగా పుష్కరకాలం (1999-2011) వ్యవహరించారు.

అధ్యయన, అధ్యాపనాలలో 37 సంవత్సరాల (1974-2011) సుదీర్ఘ అనుభవం వారిది. విద్యార్ధుల మానసిక పురోగతికి, వ్యక్తిత్వవికాసానికీ ప్రాధాన్యమిచ్చిన వ్యక్తి. స్నేహపాత్రులు. ఆచార్య తంగిరాల వెంకట సుబ్బారావు వంటి సాహితీ వేత్తలు బహుధా ప్రశంసించిన విద్యన్మణి.

పాలనానుభవం:

బోధనతో బాటు పాలనారంగంలోను తనదైన విశిష్టతను కిషన్ రావు చాటి చెప్పారు. బోర్డ్ ఆఫ్ స్టడీస్ అధ్యక్షులు (2006-08); ఏడేళ్ళ పాటు అకడమిక్ ఆడిట్ సెల్ డిప్యూటీ డైరక్టర్ (1984-1991). గజిటెడ్ అధికారుల హవుస్ అలాట్‌మెంట్ కమిటీ చైర్మన్(2007-11). తెలుగు శాఖాధ్యక్షులుగా (2008-10) విశేషానుభవం వుంది.

‘తంగెడ’ తెలంగాణా రాష్ట్ర పుష్పం. ఈ ‘తంగెడ’ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో వికసించి, తెలుగు విశ్వవిద్యాలయ నందనోద్యానికి చేరిన పారిజాతం. విశ్వవిద్యాలయ వైభవ దీప్తులను అంతర్జాతీయ సదస్సులో తానా వారి సభ జూన్ 2021 – విరజిమ్మారు. వీరి పర్యవేక్షణలో 20 పి.హెచ్.డిలు, నాలుగు ఎం.ఫిల్.లు రూపుదిద్దుకున్నాయి. 30 ప్రామాణిక పరిశోధనాప్రత్రాలు పలు సదస్సులలో సమర్పించారు.

వివిధ విశ్వవిద్యాలయాలు, పబ్లిక్ సర్వీస్ కమీషన్, అధికార భాషా సంఘం, రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డుల సలహా సంప్రదింపులు వీరి ప్రత్యేకాభినివేశాలు. అమెరికాలో 2012, 2015 లలో సంవత్సరం పాటు పర్యటించి తెలంగాణా భాషా సంస్కృతులను తెలుగు సంఘాల ద్వారా చాటి చెప్పారు. విశ్వవిద్యాలయ పురోగతికి ఆయన ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. జయతు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here