ఆచార్యదేవోభవ-50

1
3

[box type=’note’ fontsize=’16’] ఈ శీర్షిక ద్వారా గత 20వ శతాబ్దిలో ఎందరో విశ్వవిద్యాలయ, కళాశాలల తెలుగు అధ్యాపకులను/ఆచార్యులను తీర్చిదిద్దిన గురువరేణ్యులను పరిచయం చేస్తున్నారు డా. అనంత పద్మనాభరావు. [/box]

శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖ 1959-60 సంవత్సరాలలో ఎం.ఏ. తెలుగు బోధన ప్రారంభించింది. 1962 నుంచి ప్రైవేటుగా తెలుగు ఎం.ఏ. చేసే అవకాశం కల్పించారు. భూపతి లక్ష్మీనారాయణరావు రీడరుగా తొలి అధ్యాపకులుగా చేరారు.

జీరెడ్డి చెన్నారెడ్డి, జి.యన్.రెడ్డి లెక్చరర్లుగా జులై 1959లో చేరారు. 1961లో ఆచార్య పింగళి లక్ష్మీకాంతం ప్రొఫెసరుగా చేరి 1965 వరకు కొనసాగారు. 1965 సెప్టెంబరులో జి.యన్.రెడ్డి శాఖాధ్యక్షులు, ప్రొఫెసరు అయ్యారు. లింగ్విస్టిక్సు అధ్యాపకుని, రీడరును యు.జి.సి వారు IV మరియు V పంచవర్షప్రణాళికలో శాంక్షన్ చేశారు. పరిశోధన ప్రారంభమైంది. 1956-59 మధ్య తెలుగు శాఖలో ఆచార్య రాయప్రోలు సుబ్బారావు అధ్యాపకులు.

యు.జి.సి వారి స్కీము ప్రకారం శ్రీశ్రీ (1978), గుంటూరు శేషేంద్రశర్మ (1979), డా. దాశరథి (1979), డా. పుట్టపర్తి నారాయణాచార్యులు (1979), ఆరుద్ర (1982), డా.సి.నా.రె (1982), డా. విద్వాన్ విశ్వం(1984) ఆయా సంవత్సరాలలో విజిటింగ్ ప్రొఫెసర్లుగా నియమితులయ్యారు. 1977-79 మధ్య పి.వి.నరసింహరావు తులనాత్మక సాహిత్యంలో గౌరవ ఆచార్యులు. 1984-86 మధ్య యస్వీ భుజంగరాయశర్మ గౌరవ ప్రొఫెసరు.

1978లో తెలుగు శాఖ పీఠాన్ని కట్టమంచి రామలింగారెడ్డి పీఠంగా నామకరణం చేశారు. పలవురు విదేశీ పరిశోధకులు తిరుపతిలో అధ్యయనం కొనసాగించారు. తొలి బ్యాచ్ ఎం.ఏ. విద్యార్థులైన జి.నాగయ్య, కేతు విశ్వనాథరెడ్డి అదే విశ్వవిద్యాలయ అధ్యాపకులు/ఆచార్యులు కావడం విశేషం. 1972-74 సంవత్సరంలో ఎం.ఏ. తెలుగులో అత్యధిక సంఖ్యలో 52 మంది విద్యార్థులు చేరారు. విశ్వవిద్యాలయంలో పని చేసిన ఘనాపాఠీల గూర్చి లోగడ ముచ్చటించాను. 1985లో రజతోత్సవాలు, 2009లో స్వర్ణోత్సవాలు ఘనంగా జరిపారు.

వెంకటేశ్వర చరణచారణ పండితులు:

సాహితీ సౌజన్య దామోదరుడు:

సప్తతి సంవత్సరంలోకి అడుగిడుతున్న గార్లపాటి దామోదరనాయుడు శ్రీ వేంకటేశ్వర విద్యాలయ తెలుగు శాఖకు జయకేతనం. పాత తరానికి కొత్త తరానికీ మధ్య వారధి. భాషాపై పట్టు, పరిశోధనలో జట్టు, మాటలో గుట్టు –  త్రివేణీసంగమంలా వీరి వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దాయి. స్నేహానికి మారు పేరుగా తిరుపతిలో వాసికెక్కారు.

అధ్యయన అధ్యాపనాలు:

చిత్తూరు జిల్లాకు చెందిన నాయుడు 1976లో తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో తెలుగు ఎం.ఏ. చేశారు. 1977లో ఎం.ఫిల్ చేశారు. బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో ఆచార్య బయ్యా సూర్యనారాయణ అంతేవాసిగా పరిశోధన చేశారు. అంశం – చాటు, అవధాన కవితల తులనాత్మక పరిశీలన. 1980లో పి.హెచ్.డి లభించింది. వీరి పరిశోధనా గ్రంథానికి పరీక్షకులైన డా.సి.నారాయణ రెడ్డి ఇలా అన్నారు.

“ఉద్యానవనంలో పుష్పాలను చూచి ఆనందిచడం అందరికీ సాధ్యమే! కానీ గరికపూలను సైతం చూచి ఆనందించే హృదయస్పందన ఈ పరిశోధకులు –  దామోదరనాయుడు – కుంది”

అధ్యాపక ప్రస్థానం:

33 సంవత్సరాలు అధ్యయన అధ్యాపనాలు కొనసాగించి 2011 జులై 31న శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యలయ ఆచార్యులుగా పదవీ విరమణ చేశారు. పదవీవిరమణ సభకు తనకు గురువైన బయ్యా సూర్యనారాయణను ఆహ్వనించడం ఈయన గురుభక్తికి నిదర్శనం. గార్లపాటి 17 సంవత్సరాలు అధ్యాపకుడిగా, 8 సంవత్సరాలు రీడర్‌గా, 8 సంవత్సరాలు ప్రొఫసర్‌గా వ్యవహరించారు. శాఖాధ్యక్షత రెండేళ్లు. 16 గ్రంథాలు ప్రచురించారు.

పరిశోధనా పర్యవేక్షణ:

వీరి పర్యవేక్షణలో 32 పి.హెచ్.డిలు, 6 ఎం.ఫిల్ వచ్చాయి. వివిధ విశ్వవిద్యాలయాల సదస్సులలో పాల్గొన్నారు. రెండవ ప్రపంచ తెలుగు మహాసభలలో భువనవిజయంలో శ్రీకృష్ణదేవరాయల ప్రాత్రకు సన్మానం లభించింది. రంగస్థలంపై భారతంలో పాత్రలు పోషించారు. ఆరేళ్లు (2013-2019) తిరుమల తిరుపతి దేవస్థానం వారి సనాతన ధార్మిక విజ్ఞాన పరిషత్ ప్రత్యేకాధికారిగా ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారు. మా గురువుగారైన ఆచార్య జాస్తి సూర్యనారాయణగారి కుమార్తె (ఎం.ఏ. తెలుగు) నళినిని దామోదరనాయుడు వివాహమాడారు. వీరి పిల్లలిద్దరు అమెరికావాసులు. తెలుగు శాఖ స్వర్ణోత్సవాలను దామోదరనాయుడు సమర్థవంతంగా నిర్వహించారు.

పరిశోధనా చంద్రశేఖరుడు:

శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో తెలుగు ఆచార్య పీఠమెక్కిన యస్.జి.డి. చంద్రశేఖర్ కవి, రచయిత, పరిశోధకులు. 1952 జులై 25న జన్మించారు. తెలుగు ఎం.ఏ, ఎం.ఫిల్, పి.హెచ్.డి చేశారు. వీరి సిద్ధాంత వ్యాసం –  ఆధునికాంధ్ర కవిత్వంలో ఆత్మాశ్రయత్వం(1983). ఆచార్య మద్దురి సుబ్బారెడ్డి పర్యవేక్షకులు.

కళాశాల లెక్చరర్‌గా ఒక దశాబ్ది (1975-85), రీడర్‌గా 1985-1994, ప్రొఫెసర్‌గా 1994 నుండి 2012 వరకు బాధ్యతలు నిర్వహించారు. ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్‍గా, శాఖాధ్యక్షులుగా నాలుగు పర్యాయాలు పని చేశారు.

సృజనాత్మక రచనలు:

కవితా సంపుటాలు 6, పరిశోధనా గ్రంధాలు ఆరు రచించారు. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ వారు వీరి ‘కుందుర్తి కవిత్వం’ గ్రంథానికి 1982లో అవార్డు ప్రకటించారు. వీరి సిద్ధాంత గ్రంధం – ఆధునికాంధ్ర కవిత్వము ఆత్మాశ్రయత్వం. జర్నలిజం, మాధ్యమ గ్రంథాలు వ్రాశాలు. వందకు పైగా పరిశోధనా పత్రాలు వెలువరించారు. తిలక్ కవితా శిల్పం – వీరి ఎం.ఫిల్ సిద్ధాంత గ్రంథం. అధ్యయన అధ్యాయనాలలో జగజెట్టి చంద్రశేఖర్.

పరిశోధనకు ‘గల్లా’ పెట్టి:

శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయ తెలుగు శాఖలో మణిదీపం గల్లా చలపతి (15 జులై 1948 –  జులై 2021). కడప జిల్లాలో విద్యాభ్యాసం చేసి, నెల్లురులో డిగ్రీ, తిరుపతిలో తెలుగు ఎం.ఎ. చేశారు. అదే విశ్వవిద్యాలయంలో తెలుగు ఉపన్యాసకులుగా 28 సంవత్సరాలు, రీడరుగా, ప్రొఫసర్‌గా శాఖాధ్యక్షులుగా బాధ్యతలు నిర్వహించి విశ్రాంత జీవనం తిరుపతిలో ప్రశాంతంగా గడిపి 2021 జులైలో పరమపదించారు. సంస్కృతంలో, హిస్టరీలో ఎం.ఏ.లు చేశారు. శాసన పరిశోధనలో నిపుణులు.

15 గ్రంధాలు ప్రామాణికమైనవి ప్రచురించారు. వీరి సిద్ధాంత గ్రంథం (1984) ‘కవికర్ణ రసాయనం – విశిష్టాద్వైత సమన్వయం’ పండిత ప్రశంసలందుకొంది. ఇతరాలు – సారంగపాణి పదాలు (పరిష్కరణ-1994), ప్రేమ – తాత్విక పరిశీలన(1993), తరతరాల తెలుగు వారి మతాచార విశేషాలు (1999), భారతేతిహాస సినిమాలపై జానపద సాహిత్య ప్రభావం (1999),  అన్నమాచార్య చరిత్ర – వ్యాఖ్యానం (2012), దక్షిణ దేశీయ పద సాహిత్యం (2014) తిరుమలపై ఇప్పటి కవులు (2015) ప్రముఖులు.

ఈయన విమర్శస్వరూపం మూడు రకాలుగా రమాంజని – తెలుగు సాహిత్య విమర్శదర్శనంలో వింగడించారు. 1. ఆకృతి 2. ఆలోచన 3.అనుభవం. ఆంధ్రమహా భాగవతానికి తిరుమల తిరుపతి దేవస్థానం వారికి మేమిద్దరం (ఈ రచయిత సహ వ్యాఖ్యాతలం). సున్నిత స్వభావం గల వ్యక్తి చలపతి. కవికర్ణ రసాయన కావ్యానుశీలనపై మద్దూరి సుబ్బారెడ్డి పర్యవేక్షణలో పి.హెచ్.డి 1978లో పొందారు.

అతిరథ మహారథులు:

శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయ తెలుగు శాఖ ఆచార్యులు పలువురి గూర్చి సంక్షిప్తంగా వివరాలు పొందుపరుస్తున్నాను.

ఆచార్య కె. సర్వోత్తమరావు (1940):

వీరు 1959లో తిరుపతి ఓరియంటల్ కాలేజిలో విద్వాన్ చేసి క్రమంగా ఎం.ఏ. పూర్తి చేశారు. 1968లో అదే కళాశాలలో లెక్చరర్ అయ్యారు. 1974లో విశ్వవిద్యాలయ తెలుగు శాఖ అధ్యాపకులై, రీడరు, ప్రొఫసర్ (1988) అయ్యారు. రెండు మార్లు శాఖాధ్యక్షులు, 60 దాకా గ్రంథాలు ప్రచురించారు. వీరి పర్యవేక్షణలో 18 ఎం.ఫిల్, 18 పి.హెచ్.డిలు వచ్చాయి. 2000 జూన్‌లో రిటైరయ్యారు. తిరుపతి దేవస్థానం ఆళ్వారు దివ్య ప్రబంధ ప్రాజెక్టు ప్రత్యేకాధికారిగా (2003 – 06) పని చేశారు. దాక్షిణాత్య దేశిఛందో రీతులపై  పి.హెచ్.డి 1977.

ఆచార్య పి.నరసింహరెడ్డి (1947):

అదే విశ్వవిద్యాలయ విద్యార్థి. లెక్చరర్‌గా చేరి, 1985లో రీడరు, 1994లో ఆచార్యులయ్యారు. రెండు మార్లు శాఖాధ్యక్షులు (1986-88, 1993-96). ఆంధ్రప్రదేశ్ ఫెడరేషన్ ఆఫ్ యూనివర్శిటీ టీచర్స్ అధ్యక్షులయ్యారు. అన్నమయ్య మీద విశేష కృషి చేశారు. 25 రచనలు చేశారు. 25 పి.హెచ్.డిలు, 19 ఎం.ఫిల్ డిగ్రీలకు పర్యవేక్షకులు. వీరు 2007లో రిటైరయ్యారు. వీరి రచనలపై ఇక్కడ పరిశోధన జరిగింది. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డులు రెండు లభించాయి.

ఆచార్య కె. మునిరత్నం:

పద్యకవి. 1985లో లెక్చరర్, 1998లో రీడరు, 2000లో ప్రొఫెసరు. 2006-08 మధ్య శాఖాధ్యక్షులు. యూనివర్శిటీ కళాశాల ప్రిన్సిపాల్‌గా మంచి పేరు. మూడు గ్రంధాలు వచ్చాయి. 20 పి.హెచ్.డిలు, 9 ఎం.ఫిల్ డిగ్రీలకు పర్యవేక్షకులు. 2017లో పదవీ విరమణ. చిత్తూరు జిల్లా జానపద గేయాలపై హి.హెచ్.డి. పొందారు (1989).

ఆచార్య కె. దామోదరనాయుడు (1951):

ఇక్కడ ఇద్దర దామోదరనాయుడులు పని చేశారు. వీరు 1989లో లెక్చరర్‌గా చేరి 2010-12 మధ్య శాఖాధ్యక్షులు. 12 రచనలు వచ్చాయి. 16 పి.హెచ్.డిలు, 12 ఎం.ఫిల్ లకు సారథి. 2011లో పదవీవిరమణకు ముందు ప్రాచ్యలిఖిత భాండాగార డైరక్టరు. నూతలపాటి గంగాధరం కవిత్వంపై పరిశోధనకు పి.హెచ్.డి(1984).

ఆచార్య జె. ప్రతాపరెడ్డి(1952):

1979లో తెలుగు శాఖలో చేరి 1999 నాటికి ప్రొపెసర్ పదవిని పొందారు. 2004-06 మధ్య శాఖాధ్యక్షులు. విశ్వవిద్యాలయ రిజిష్ట్రారుగా సమర్థవంతంగా పని చేశారు. హైదరాబాదులోని తెలుగు అకాడమీ డైరక్టరయ్యారు. మూడు రచనలు వచ్చాయి. 10 పి.హెచ్.డిలు, 7 ఎం.ఫిల్ డిగ్రీలకు పర్యవేక్షకులు. మారిషస్, సింగపూర్ లలో ప్రపంచ తెలుగు మహా సభలకు ఆహ్వానితులు.

రాయలసీమ అరె మరాఠీ మండలిక భాష – వర్ణనాత్మక వ్యాకరణంపై ఆచార్య జి.యన్. రెడ్డి పర్యవేక్షణలో పరిశోధించి 1988లో పి.హెచ్‌డి సంపాదించారు.

ఆచార్య శివుని రాజేశ్వరి:

ఈమె 1992లో తెలుగు శాఖలో చేరి ప్రొఫెసర్ దాకా బాధ్యతలు చేపట్టారు. 2016-17 మధ్య శాఖాధ్యక్షులు. ఓరియంటల్ విభాగం డీన్. సింగపూరులో జరిగిన 5వ ప్రపంచ తెలుగు సభలలోనూ, 2017లో అమెరికాలో జరిగిన సభలలో పత్ర సమర్పణ చేశారు. వీరి పర్యవేక్షణలో 16 పి.హెచ్.డిలు, 5 ఎం.ఫిల్ పట్టాలు వచ్చాయి. ఐదు గ్రంథాలు ప్రచురించారు. ‘ఆధునిక తెలుగు కవిత్వంలో అమ్మ’పై బెంగుళూరు విశ్వవిద్యాలయం నుండి పి.హెచ్.డి పొందారు.

ఆచార్య ఉగ్రాణం చంద్రశేఖర రెడ్డి:

1985లో శాఖలో ప్రవేశించి 2004-06 మధ్య శాఖాధ్యక్షులు. 2000లో ఆచార్యులు. తెలుగు అకాడమీ, తిరుపతి విభాగానికి పర్యవేక్షకులు. ఆరు రచనల గ్ర్రంథకర్త. 18 పి.హెచ్.డిలు, 15 ఎం.ఫిల్ పర్యవేక్షకులు.

ఆచార్య పేట శ్రీనివాసరెడ్డి:

1992లో ఉపన్యాసకులు. 2012-14 మధ్య శాఖాధ్యక్షలు. ఆంధ్రప్రదేశ్ విభజనానంతరం తెలుగు అకాడమీ డైరక్టర్‌గా పని చేశారు. మంచి కథా రచయిత. 20 పైగా రచనలు వచ్చాయి. 23 పి.హెచ్.డిలు, 16 ఎం.ఫిల్ పర్యవేక్షకులు. చైనా, భూటాన్, శ్రీలంకలలో అంతర్జాతీయ సదస్సులలో పాల్గొన్నారు. అనేక అవార్డులు లభించాయి. ‘చిత్తూరు జిల్లా జానపద గేయాలలో శృంగార దృష్టి’పై యస్.జి.డి. చంద్రశేఖర్ పర్యవేక్షణలో పి.హెచ్.డి(1987).

ఆచార్య యన్. మునిరత్నమ్మ:

1992లో ప్రవేశించి 2014-16 మధ్య శాఖాధ్యక్షులయ్యారు. నాలుగు రచనలు వెలువరించారు. 12 పి.హెచ్.డిలు, 9 ఎం,ఫిల్ డిగ్రీలు పర్యవేక్షించారు. ద్వివేదుల విశాలాక్షి నవలపై పరిశోధనకు పి.హెచ్.డి(1986).

ఆచార్య మేడేపల్లి రవికుమార్:

అభ్యుదయ భావజాలాలకు వేదిక వీరు. రచయితగా, అధ్యాపకుడిగా, పర్యవేక్షకుడిగా విద్యార్థుల మెప్పు పొందారు. 1992లో అధ్యాపకులుగా చేరి 2017-19 మధ్య శాఖాధ్యక్షులయ్యారు. దువ్వూరి కడపటి వీడ్కోలు పై మదరాసు విశ్వవిద్యాలయ పి.హెచ్.డి పొందారు. తిరిగి 2021లో శాఖాధ్యక్షులు అయ్యారు.

(పై వివరాలు రాజేశ్వరమ్మ సౌజన్యం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here