Site icon Sanchika

ఆచార్యదేవోభవ-52

[box type=’note’ fontsize=’16’] ఈ శీర్షిక ద్వారా గత 20వ శతాబ్దిలో ఎందరో విశ్వవిద్యాలయ, కళాశాలల తెలుగు అధ్యాపకులను/ఆచార్యులను తీర్చిదిద్దిన గురువరేణ్యులను పరిచయం చేస్తున్నారు డా. అనంత పద్మనాభరావు. [/box]

[dropcap]ఆం[/dropcap]ధ్ర ప్రదేశ్ సార్వత్రిక విశ్వవిద్యాలయ తెలుగు విభాగంలో ముగ్గురు పని చేశారు. ప్రస్తుతం శ్రీమతి రజని ఆచార్యులు. దూరవిద్య ద్వారా ఎందరినో తీర్చిదిద్దిన సంస్థ ఇది. 1982లో అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి భవనం వెంకట్రామ్ ఆధ్వర్యంలో రాష్ట్రపతి జైల్‌సింగ్ ఆగస్టులో ఈ సంస్థను ప్రారంభించారు. ఇది తొలి దూరవిద్యా విశ్వవిద్యాలయం.

కథాకేతనం కేతు:

కథకుడిగా సుప్రతిష్ఠుడైన కేతు విశ్వనాథరెడ్డి విద్యావేత్త. ‘కేతు విశ్వనాథరెడ్డి కథలు’ అనే గ్రంథానికి కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి వచ్చింది. రాయలసీమ బ్రతుకు బాధలు తెలిసిన ఈయన కడప జిల్లా కమలాపురం తాలుకా  రంగశాయిపురంలో జులై 10, 1937న రైతు కుటుంబంలో జన్మించారు. శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఎం.ఏ. తెలుగు చేశారు (1959-61). అదే విశ్వవిద్యాలయం నుండి కడప జిల్లా గ్రామనామాలపై పరిశోధనకు పి.హెచ్.డి లభించింది. ప్రభుత్వ కళాశాలల్లో తెలుగు ఉపన్యాసకులుగా 1962-76 మధ్య కడప, కందుకూరు, కాళహస్తిలలో పని చేశారు. శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయ తెలుగు రీడర్‌గా 1983లో చేరారు. కందుకూరులో ఈ రచయిత అయనకు సహాధ్యాపకులు.

హైదరాబాదు సార్వత్రిక విశ్వవిద్యాలయంలో ఆచార్యులుగా (1985-1997) చేసి పదవీ విరమణ చేసి ప్రస్తుతం కడపలో స్థిరపడ్డారు. 1963 నుండి నేటి వరకు కథలు ప్రచురిస్తూనే ఉన్నారు. విశాలాంధ్ర వారు ప్రచురించిన కొడవటిగంటి కుటుంబరావు సాహిత్య సంకలనాలకు సంపాదకులు. కేతు విశ్వవిద్యానాథ రెడ్డి కథలు ఇతర భాషలలోకి అనువదించబడ్డాయి. ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఆంధ్రభూమి పత్రికా సిబ్బందికి ఈయన శిక్షకులు. భారతీయ భాషా పరిషత్, తెలుగు విశ్వవిద్యాలయ పురస్కారాలు లభించాయి. “ఈ రచయిత కట్టుకథలు కాకుండా పుట్టు కథలు రాసేవారనిపించింది” అని కాళీపట్నం రామరావు కితాబు నిచ్చారు. రావిశాస్త్రి అవార్డు లభించింది. బ్రిటన్, చైనా, థాయిలాండ్, సింగపూరు, అమెరికా దేశాలు పర్యటించారు.

ఆచార్య కేతు విశ్వనాథ రెడ్డి గారు

ఆంధ్రరత్న దిన పత్రికలో సబ్-ఎడిటర్ ట్రైయినీగా ప్రారంభమైన జీవితం దినపత్రికా సిబ్బందికి శిక్షకులుగా పరిణమించడం ఒక యోగం. 35 సంవత్సరాల అధ్యాపక జీవితంలో రచనా వ్యాసంగమూ కొనసాగింది. వీరి పర్యవేక్షణలో 5 పి.హెచ్.డిలు, 10 ఎం.ఫిల్‌లు రూపొందాయి. దూరవిద్యా తెలుగు బోధనలో ఆయన ద్రోణాచార్యుడు. స్టూడెంట్ సర్వీసుల డైరక్టర్‌గా అగ్రగణ్యులు. కడప ఊర్ల పేర్లు ప్రసిద్ధ గ్రంథ రచయిత. దీపధారులు వ్యాససంపుటి. బహుముఖ ప్రజ్ఞాశాలి విశ్వనాథ రెడ్డి.

సభారమణీయం:

కె.సభా కుమారుడైన కె.యన్.రమణ చిత్తూరు జిల్లా వారు. శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో చలం మ్యూజింగ్స్‌పై పరిశోధన చేసి పి.హెచ్.డి సంపాదించారు (1984). నిశి కవుల పేరుతో 45 మంది మిత్రులు ఒక కవితా సంకలనం ప్రచురించారు. కవి, కథకుడు, అధ్యాపకుడు, భావుకుడు. మాండలిక వృత్తి పదకోశంలో పని చేశారు. ఓపెన్ యూనివర్శిటీలో అధ్యాపకత్వంలో జీవితం మలుపు తిరిగింది. విశ్వనాథ రెడ్డి, వసునందన్‌ల తర్వాత ఆచార్యుడై కొంత కాలానికి హఠాన్మరణం చెందారు.

సాహితీ వసునందనుడు:

పుట్టిన బిడ్డను నిరాదరణతో చూచినా గడ్డకెక్కి ప్రాణాలు పోసుకొని 72 ఏళ్ల జీవన ప్రస్థానం కొనసాగిస్తున్న సాహితీ వసునందన్ రావికంటి వసునందన్. 1949 మేలో పెద్దపల్లి జిల్లా కమాన్‌పూర్‌లో పుట్టారు. ఉస్మానియాలో గుమస్తాగా చేరి ఎం.ఏ, ఎం.ఫిల్, పి.హెచ్.డిలు సాధించగలిగారు. సి.నా.రె తనకు ప్రత్యక్ష దైవమని భావిస్తారు.

ఆచార్య రావికంటి వసునందన్ గారు

శతాధిక గ్రంథకర్త:

1971 నుండి 2021 వరకు 50 సంవత్సరాలలో 112 పుస్తకాలు ప్రామాణికమైనవి వ్రాయగలగడం దేశభక్తికి నిదర్శనం. భూమిక –  ఒక సమగ్ర పరిశీలన ఎం.ఫిల్ సిద్ధాంత గ్రంథం(1985), అధునికాంధ్ర కవిత్వంలో మానవతా వాదం –  విశ్వంభర విలక్షణత, పి.హెచ్.డి సిద్ధాంత గ్రంథం (1990). తెలుగు సంప్రదాయ కవిత్వం –  సామాజిక నేపథ్యం అనేది యు.జి.సి మేజర్ ప్రాజెక్టు (2013). వివిధ గాథలతో సనాతన గాథాలహరి పేర 16 గ్రంథాలు వెలువరించారు. పోతన భాగవతం –  సమాజ దృక్పథం (యు.జి.సి. ఎమిరిటస్ ప్రాజెక్టు). కేంద్ర సాంస్కృతిక శాఖ వారి సీనియర్ ఫెలోఫిప్ క్రింద జ్ఞానపీఠ అవార్డు గ్రహీతలైన ముగ్గురు తెలుగువారి రచనల విశ్లేషణ చేశారు (2017). పలు సంస్థల పురస్కారాలు అందుకున్నారు. సనాతన చారిటబుల్ ట్రస్టు పురస్కారం 2014, గడియారం వెంకటశేషశాస్త్రి పురస్కారం (2012), తెలుగు విశ్వవిద్యాలయ విశేష పురస్కారం (2010), ధర్మ నిధి పురస్కారం (2004), ప్రభుత్వ ఉగాది పురస్కారం (2004), కవిశిరోమణి బిరుదు ప్రదానం ప్రధానాలు.

ఉద్యోగ జీవితం:

సార్వత్రిక విశ్వవిద్యాలయం, హైదరాబాదులో తెలుగు శాఖలో 1984లో అధ్యాపకులుగా చేరి 1988లో రీడర్, ప్రొఫెసర్ (1998) పదవులతో బాటు, ఆర్ట్స్ విభాగం డీన్‌గా 2009లో పదవీ విరమణ చేశారు. 2015-17 మధ్య యు.జి.సి ఎమిరిటస్ ప్రొఫెసర్‌గా ఉన్నారు. ఏటా రెండు పుస్తకాలు ప్రచురించడం ఆయన హాబీ. నిరంతర రచనా శీల రావికంట.

భరతవాక్యం:

సంవత్సర కాలంగా ‘ఆచార్య దేవోభవ’ శీర్షికలో గురుఋణం తీర్చుకోనే ప్రయత్నంలో భాగంగా వివిధ విశ్వవిద్యాలయాలలో తెలుగు శాఖలలో అధ్యాపకుల జీవన రేఖలు సంగ్రహంగా స్పృశించాను. అందరూ మహానుభవులే! సమాచార సేకరణకు వ్యయప్రయాసలకు లోనయ్యాను. పలుమార్లు ఫోన్ చేశాను. సంచిక సంపాదక వర్గంలోని కస్తూరి మురళీ కృష్ణ, సోమశంకర్ లను శ్రమ పెట్టాను. అందిన మేరకు ఫోటోలు జతకూర్చాను. సింహావలోకనంగా వివరాలిస్తున్నాను. 52  సంచికలలో పేర్కొన్న మహానీయులు వీరే! 150 మందికి పైగా ప్రస్తావించాను.

  1. ఉస్మానియా విశ్వవిద్యాలయం (23)

సర్వశ్రీ – రాయప్రోలు సుబ్బారావు, ఖండవల్లి లక్ష్మీరంజనం, దివాకర్ల వెంకటావధాని, పల్లా దుర్గయ్య, బిరుదరాజు రామరాజు, సి.నారాయణ రెడ్డి, పాటిబండ మాధవశర్మ, కె.గోపాలకృష్ణారావు, కురుగంటి సీతారామయ్య, యం.కులశేఖరరావు, నాయని కృష్ణకుమారి, ఇరివెంటి కృష్ణమూర్తి, చెల్లంచర్ల, భద్రిరాజు కృష్ణమూర్తి, చేరా, పుల్లెల శ్రీరామచంద్రుడు, మొదలి నాగభూషణశర్మ, భీమసేన్ నిర్మల్, యం. రాధాకృష్ణ శర్మ, బషీరుద్దీన్, ఉపాధ్యాయులు రెడ్డి, జి.రామిరెడ్డి, వి.నిత్యానందరావు.

  1. మదరాసు విశ్వవిద్యాలయం (13)

సర్వశ్రీ – రఘుపతి వెంకటరత్నం నాయుడు, చిలుకూరి నారాయణరావు, కోరాడ రామకృష్ణయ్య, శ్రీపాద, నిడదవోలు, శిష్ట్లా, గంధం అప్పారావు, శమంతకమణి, వి.రామచంద్ర, యస్. అక్కిరెడ్డి, జి.యస్.ఆర్.కృష్ణమూర్తి, యం.సంపత్ కుమార్, వి.శంకరరావు.

  1. ఆంధ్రా విశ్వకళాపరిషత్ (21)

సర్వశ్రీ – సి.ఆర్.రెడ్డి, రాధాకృష్ణన్, వెంకయ్యనాయుడు, మామిడిపూడి వెంకటరంగయ్య, పింగళి లక్ష్మీకాంతం, గంటి జోగిసోమయాజి, మల్లంపల్లి సోమశేఖరశర్మ, దువ్వూరి వెంకటరమణశాస్త్రి, కె.వి.ఆర్ నరసింహం,  కొత్త సచ్చిదానంద మూర్తి, అబ్బూరి రామకృష్ణారావు, తూమాటి దొణప్ప, యస్వీ జోగారావు, కొర్లపాటి శ్రీరామమూర్తి, చిలుకూరు సుబ్రహ్మణ్యశాస్త్రి, యల్. చక్రధరరావు, మలయవాసిని, ఓరుగంటి, వేదుల సుబ్రహ్మణ్యశాస్త్రి, సూరి భగవంతం, భావరాజు సర్వేశ్వరరావు.

  1. శ్రీ వేంకటేశ్వరయూనివర్శిటీ (22)

సర్వశ్రీ – జి.యన్.రెడ్డి, జాస్తి సూర్యనారాయణ, జీరెడ్డి చెన్నారెడ్డి, తిమ్మవజ్ఝల కోదండరామయ్య, పంగనమల బాలకృష్ణమూర్తి, మద్దూరి సుబ్బారెడ్డి, జి.నాగయ్య, పి.సి.నరసింహారెడ్డి, జి.దామోదరనాయుడు, యస్.జి.డి.చంద్రశేఖర్, గల్లా చలపతి, కె.సర్వోత్తమరావు, పి.నరసింహారెడ్డి, కె. మునిరత్నం, కె. దామోదర నాయుడు, జె. ప్రతాపరెడ్డి, యస్. రాజేశ్వరరావు, వి. చంద్రశేఖర్ రెడ్ది, పేట శ్రీనివాసులు రెడ్డి, యన్. మునిరత్మమ్మ, మేడేపల్లి రవికుమార్, ఆర్.రాజేశ్వరమ్మ

  1. శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం (9)

సర్వశ్రీ యస్.శ్రీదేవి, కోరాడ మహదేవశాస్త్రి, బ్రహ్మనంద, తుమ్మపూడి కోటీశ్వరరావు, శలాక రఘునాధశర్మ, కొలకలూరి ఇనాక్, రాచపాళెం, శ్రీనివాసరెడ్డి, దేవకి, ప్రఫుల్ల.

  1. బెంగుళూరు విశ్వవిద్యాలయం (5)

సర్వశ్రీ తంగిరాల వెంకటసుబ్బారావు, చన్నాప్రగడ తిరుపతిరావు, జి.యస్.మోహన్, జయలక్ష్మి, ఆశాజ్యోతి.

  1. ఢిల్లీ విశ్వవిద్యాలయం (3)

పి.సి.వీరేశలింగం, టి.సుశీల, కొత్తపల్లి వీరభద్రరావు

  1. మధురై కామరాజ్ విశ్వవిద్యాలయం (1)

చల్లా రాధాకృష్ణశర్మ

  1. అలీఘడ్ ముస్లిం విశ్వవిద్యాలయం (3)

అయాచితుల, యస్.కె.మస్తాన్, పఠాన్.

  1. నాగార్జున విశ్వవిద్యాలయం (4)

బొడ్డుపల్లి పురుషోత్తం, టి.నిర్మల, యార్గగడ్డ, గంగప్ప

  1. హైదరాబాదు కేంద్ర విశ్వవిద్యాలయం (8)

కె.కె.రంగనాథాచార్యులు, సి.ఆనందరామం, బేతవోలు, శరత్ జ్యోత్స్న, ఎండ్లూరి సుధాకర్, దార్ల వెంకటేశ్వరరావు, పరిమి రామ నరసింహం, ముదికొండ వీరభద్రయ్య.

  1. తెలుగు విశ్వవిద్యాలయం (10)

జి.వి.సుబ్రమణ్యం, యన్. గోపి, అనుమాండ్ల భూమయ్య, ఆవుల మంజులత, ఎల్లూరి శివారెడ్డి, యస్వీ సత్యనారాయణ, తంగెడ కిషన్ రావు, సి.మృణాళిని, శిఖామణి, భక్తవత్సలరెడ్డి.

  1. కాకతీయ విశ్వవిద్యాలయం (9)

కేతవరపు రామకోటిశాస్త్రి, కాత్యాయని, కోవెల సంపత్కుమార, సుప్రసన్న, పేర్వారం జగన్నాధం, మాదిరాజు రంగారావు, హరిశివకుమార్, అమరేశం రాజేశ్వరశర్మ, బి.రుక్మిణి.

  1. బెనారస్ హిందూవిశ్వవిద్యాలయం (6)

బయ్యా సూర్యనారాయణ, బి.విశ్వనాధ్, రామచంద్రమూర్తి, బూదాటి వెంకటేశ్వర్లు, జోస్యుల సూర్యప్రకాశరావు, శాంతసుందరి.

  1. ద్రవిడ విశ్వవిద్యాలయం (5)

వి.అరుణాచలం, రవ్వా శ్రీహరి, కడప రమణయ్య, గంగిశెట్టి లక్ష్మీనారాయణ, తుమ్మల రామకృష్ణ.

  1. మైసూరు విశ్వవిద్యాలయం (2)

కె.సుబ్బారామప్ప, ఆర్.వి.యస్.సుందరం

  1. పద్మావతీ విశ్వవిద్యాలయం (3)

పి.కుసుమకుమారి, కృష్ణకుమారి, కె.మధుజ్యోతి.

  1. విదేశీ విశ్వవిద్యాలయాలు – వెల్చేరు నారాయణరావు
  2. సార్వత్రిక విశ్వవిద్యాలయం (3)

కేతు విశ్వనాధరెడ్డి, రావికంటి వసునందన్, కె.యస్.రమణ.

కొత్త విశ్వవిద్యాలయాలు

  1. విక్రమసింహపురి (5)

విశ్వేశ్వరరావు, జయప్రకాష్, ఆంగ్లాచార్యులు – కె.ఆర్.శ్రీనివాస అయ్యంగార్, ఎం. వి. రామశర్మ, గోకక్.

ఇవిగాక యోగి వేమన, నన్నయ, కృష్ణా, రామలసీమ, తెలంగాణా, మహాత్మగాంధీ, పాలమూరు విశ్వవిద్యాలయ అధ్యాపకుల వివరాలు అందించాను.

ఇంకా పలువురి వివరాలు అందక చేర్చలేనందుకు క్షంతవ్యుడను.

Exit mobile version