ఆచార్యదేవోభవ-6

0
2

[box type=’note’ fontsize=’16’] ఈ శీర్షిక ద్వారా గత 20వ శతాబ్దిలో ఎందరో విశ్వవిద్యాలయ, కళాశాలల తెలుగు అధ్యాపకులను/ఆచార్యులను తీర్చిదిద్దిన ప్రాతఃస్మరణీయ యశఃకాయులను పరిచయం చేస్తున్నారు డా. అనంత పద్మనాభరావు. [/box]

[dropcap]ఉ[/dropcap]స్మానియా విశ్వవిద్యాలయ తెలుగు శాఖలో గత శతాబ్ది కాలంగా 570 సిద్ధాంత గ్రంథాలు వెలువడ్డాయి. ఆచార్య వెల్దండ నిత్యానందరావు వివిధ విశ్వవిద్యాలయాలలో తెలుగులో జరిగిన యం.ఫిల్/పిహెచ్‌డి సిద్ధాంత గ్రంథాల వివరణలు ఒక బృహత్ గ్రంథంలో ప్రచురించారు. ఉస్మానియా తొలి పి.హెచ్.డి పొందిన గౌరవం బిరుదరాజు రామరాజుకు 1956లో లభించింది. ఆ తర్వాత 1957లో దివాకర్ల వెంకటావధాని పొందారు. సిద్ధాంత గ్రంథ సమర్పణకు వీరిద్దరూ పోటీ పడ్దారు. ఆ తర్వాత మూడో వ్యక్తి పల్లా దుర్గయ్య (1960). ఈయన ఉస్మానియా తెలుగు ఎం.ఏ.లో ఏకైక వ్యక్తి కూడా.

సాహితీ చెలమ:

చెలమచర్ల రంగాచార్యులు (1912-72) ఉస్మానియా విశ్వవిద్యాలయ గ్రంథాలయంలో తాళపత్ర విభాగంలో పండితులుగా పని చేశారు. 1957లో ఉస్మానియా ఆర్ట్స్ కళాశాలలో ఉపన్యాసకులుగా చేరారు. అక్కడే పదవీ విరమణ చేశారు. 1912 జనవరి 8న కృష్ణాజిల్లా మోటూరులో జన్మించారు. తిరుపతిలో విద్వాన్, శిరోమణి పరీక్షలు వ్రాసి ఉత్తీర్ణులయ్యారు. కొంత కాలం సికిందరాబాదు మహబూబియా కళాశాలలోనూ, నారాయణగూడ బాలికోన్నత పాఠశాలలోను పని చేశారు.

1944లో సంస్కృతంలోని విశ్వనాథుని ప్రతాపరుద్రయశోభూషణమనే అలంకార శాస్త్ర గ్రంథాన్ని తెలుగులోకి అనువదించారు. ఈ గ్రంథం ఇప్పటికీ విశ్వవిద్యాలయాల పరీక్షల పాఠ్యగ్రంథం. అలంకార వసంతం అనే మరో గ్రంథం కూడా వ్రాశారు. హాలికుడు అనే నాటకం, సోమాద్రి విజయం అనే పద్యకావ్యం, కథావళి, కాళిదాస కావ్యోద్యానము వ్రాశారు. ఆంధ్ర శబ్ద రత్నాకరము అనే నిఘంటువు పరమ ప్రామాణికం,

కోవెల సుప్రసన్నాచార్యుల మాటల్లో –

“మాకు తెలుగు చెప్పటానికి (వరంగల్లులో) శ్రీమాన్ చెలమచర్ల రంగాచార్యులు వచ్చేవారు. ఆయన గ్రూప్ సబ్జెక్ట్‌లో తరగతులకు బోధించేవారు. ఆయన పద్యం చదివితే వయోలిన్ సంగీత ధ్వనిలా అన్పించేది. ఆయన బోధించిన విషయాలలో జాషువా గబ్బిలం ఒకటి. ఆయన బోధనల వల్ల నాకు ఆ పద్యాలు దాదాపు నోటికి వచ్చేవి.”

అంతటి ఉత్తమ అధ్యాపకులు రంగాచార్యులు.

విద్యానగరం:

ఉస్మానియా తెలుగు శాఖలో పనిచేసే అధ్యాపకులు పలువురు యూనివర్శిటీకి సమీపంలో నివసించేవారు. ఆ ప్రాంతం నిజానికి విద్యానగర సార్థకతను పొందిందని ముదిగొండ శివప్రసాద్ అభివర్ణించారు. 1950 – 60ల మధ్య దివాకర్ల వెంకటావధాని, బిరుదురాజు రామరాజు, చెలమచర్ల రంగాచార్యులు, యం. కులశేఖరరావు, భద్రిరాజు కృష్ణమూర్తి, ఖండవల్లి లక్ష్మీరంజనం, ఇరివెంటి కృష్ణమూర్తి ఆ ప్రాంతంలో నివసించేవారు.

అప్పట్లో ప్రొఫెసర్లు కార్లలో కళాశాలకు వచ్చే స్థితి లేదు. ఉస్మానియా యూనివర్శిటీ తెలుగు శాఖలో కోఠి మహిళా కళాశాల, సైఫాబాదు కళాశాల, నిజాం కళాశాల, సికిందరాబాదు సాయంకాలం కళాశాల, దిన కళాశాలలు అంతర్భాగం. యూనివర్శిటీ అధ్యాపకులకు ఎక్కడి నుండి ఎక్కడికైనా బదిలీలు జరుగుతూండేవి. 1947కు ముందు నిజాం రాష్ట్రంలో అరబ్బీ, పర్షియన్, మరాఠీ భాషలకున్న గౌరవం తెలుగుకు లేదు. తెలంగాణ విమోచనోద్యమం (1948) తర్వాత తెలుగు భాష మళ్ళీ బతికి బట్టగట్టింది. ఓరియంటల్ కళాశాలల్లో బి.ఓ.యల్, యం.ఓ.యల్ వుండేవి. వీరి సిలబస్‍లో సంస్కృతం అధిక భాగం. అదే సమయంలో ఆంధ్ర ప్రదేశ్‍లో శిరోమణి, భాషా ప్రవీణలు, మద్రాసులో విద్వాన్ డిగ్రీలుండేవి. అంతకు ముందు తెలుగులో బి.ఎ. ఆనర్స్ వుండేది. అది రద్దు కాబడి 1960 నుంఛి అన్ని విశ్వవిద్యాలయాలలో ఎం.ఎ. ప్రవేశపెట్టారు.  పి.చెచ్.డి.కి ఒత్తిడి పెరిగి ఎం.ఫిల్. ప్రవేశపెట్టారు. ఇదొక స్పీడ్ బ్రేకర్ (వారధి). ఇది 1970 తర్వాత వచ్చిన పరిణామం. వీరికి మెథడాలజీ ప్రత్యేక తరగతులుండేవి. ఆ తర్వాత దూరవిద్యలో ఎం.ఏ. తెలుగు ప్రవేశపెట్టారు. సికిందరాబాదు కళాశాలలో ఒక్కొక్కసారి ఆరుబయట పున్నాగ చెట్ల కింద తెలుగు పాఠాలు చెప్పేవారు.

శ్రీ కృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయంలో తరచూ సాహిత్య సమావేశాలు జరిగేవి. తెలుగు శాఖ విద్యార్థులు పలువురు ఆ ఉపన్యాసాలు విని ప్రభావితులయ్యారు. ఉస్మానియా విశ్వావిద్యాలయ ప్రాంగణంలోని అనుభవాలు, అనుశ్రుతులు, సంఘర్షణల దర్పణంగా నవీన్ – ‘అంపశయ్య’ నవలలో చిత్రించారు. తెలుగు శాఖలో అధ్యాపకులు సంఖ్య 2015 నాటికి 25 మందికి పెరిగింది.

తెలుగు శాఖ ఘనత:

తెలుగు శాఖలో పనిచేసిన అధ్యాపకులు యూనివర్శిటీల వైస్-ఛాన్స్‌లర్లు కావడం లోగడ ప్రస్తావించాను. ఇక్కడ ఎం.ఏ. చేసిన పేర్వారం జగన్నాధం, జి,వి. సుబ్రహ్మణ్యం, ఆవుల మంజులత, అనుమాండ్ల భూమయ్య, యన్. గోపి, యస్. వి. సత్యనారాయణలు తెలుగు యూనివర్శిటీ ఉపాధ్యక్షులయ్యారు. ఇక్కడ అధ్యాపకులైన రవ్వా శ్రీహరి కుప్పంలోని ద్రవిడ విశ్వవిద్యాలయ ఉపకులపతి అయ్యారు. రాయప్రోలు, సి.నా.రె,, గోపీలకు కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతు లందాయి. సి.నా.రె. జ్ఞానపీఠాధిష్ఠితులయ్యారు. సి.నా.రె., యశోదా రెడ్డి – అధికార భాషా సంఘాధ్యక్షులయ్యారు. వేటూరి ఆనందమూర్తి మారిషస్‍లో ప్రత్యేకాధికారిగా పనిచేశారు.

1952-53లో తొలిసారిగా తెలుగు శాఖలో పరిశోధనావకాశం లభించింది. 1953లో సెమినార్ పద్ధతి ప్రారంభమై విద్వాంసుల ఎదుట సాహిత్యపత్రాలు సమర్పించే ప్రక్రియ వచ్చింది. భాషాసాహిత్యాధ్యానం కేవలం బి.ఏ. విద్యార్థులకే పరిమితం చేయాలనీ, బి.యస్.సి విద్యార్థుల కవసరం లేదనీ, బి.ఏ. విద్యార్థులకు కూడా తెలుగు పరీక్షలు అవసరం లేదనీ ప్రతిపాదనలు 50వ దశకంలో వచ్చాయి. లక్ష్మీరంజనం శాఖాధిపతిగా దానిని ప్రతిఘటించి విశ్వవిద్యాలయాధికారుల చేత అంగీకరింప చేయగలగడం చరిత్ర. రెండవ భాష తెలుగు వారికి వారానికి నాలుగు పీరియడ్లు, ఐచ్ఛిక భాషగా తెలుగు తీసుకొన్న వారికి ఆరు పీరియడ్లు కేటాయించారు. దానితో ఆయా కళాశాలల్లో తెలుగు అధ్యాపకుల అవసరం పెరిగింది.

విశ్వవిద్యాలయ కళాశాలలోని తెలుగు విద్యార్థులు ఏటా ఆంధ్రాభ్యుదయోత్సవాలు వారం రోజులపాటు ఘనంగా నిర్వహిస్తూ ఆంధ్ర దేశం నలుమూలల నుండి విద్వాంసులను, కవులను పిలిపించి ఉపన్యాసాలు, కవితాగానాలు ఏర్పాటు చేశారు. ఆ విధంగా తెలుగు భాషా సాహిత్యాల గౌరవం పెరిగింది.

చాగంటి గారిచే రాఘవపాండవీయ ఆవిష్కరణ

సజీవ స్వరాలు:

ఉస్మానియా తెలుగు శాఖలో పదవీ విరమణ చేసిన ప్రముఖులెందరో లబ్ధప్రతిష్ఠులయ్యారు.

ముదిగొండ వీరభద్రశాస్త్రి, సరిపెల్ల విశ్వనాథ శాస్త్రి (1955-57), వెల్లటూరు వెంకట రాఘవశర్మ (1950-51) ప్రముఖులు.

బొడ్డపాటి కుటుంబరాయశర్మ:

వీరి పరిశోధనా గ్రంథం ‘తెలుగు నవలా పరిణామం’ విశ్వవిద్యాలయంలో రిఫరెన్సు గ్రంథం. అది 1967లో హైదరాబాదులోని గాయత్రి ప్రచురణల ద్వారా వెలువడింది. తిరుమల తిరుపతి దేవస్థానం వారి ప్రచురణలలో భాగం రామాయణేంద్రధనస్సు బాలకాండ వెలువడింది. తెలుగు నవల పుట్టుపూర్వోత్తరాలపై సాధికార గ్రంథం ప్రచురించారు.

అమరేశం రాజేశ్వరశర్మ:

సంస్కృతాంధ్ర భాషలలో నిష్ణాతులు. తెలుగు శాఖ గౌరవ ప్రతిష్ఠలు పెంచారు. ఆత్మకథను ప్రచురించారు. సాయి సచ్చరిత్రను ప్రవచన రూపంలో వీడియో రికార్డింగులు చేశారు.

వేటూరి ఆనందమూర్తి:

ప్రసిద్ధ పరిశోధకులు ప్రభాకరశాస్త్రి కుమారులు. అన్నమయ్య సాహిత్యంపై పరిశోధనా గ్రంథం ప్రచురించారు. 1989 – 1990 మధ్య వారు తెలుగు శాఖాధ్యక్షులు. మారిషస్‍లో ప్రత్యేకాధికారిగా 1966-69 మధ్య, తిరిగి 1976-80ల మధ్య తెలుగు భాషా బోధనకు కృషి చేశారు. 2015-17 మధ్య కేంద్ర సాంస్కృతిక శాఖ వారి ఠాగూరు ఫెలోగా ఎంపికయ్యారు. ఖండవల్లి లక్ష్మీరంజనం వీరి పరిశోధనా పర్యవేక్షకులు.

కసిరెడ్డి వెంకటరెడ్డి:

ఆధ్యాత్మిక భావజాలాన్ని ప్రచారం చేయడంలో ఘనులు. తిరుమల తిరుపతి దేవస్థానం వారి హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యదర్శిగా రెండేళ్ళు పనిచేశారు. 1985 మార్చిలో తెలుగు శాఖలో అధ్యాపకులుగా చేరి 2006 ఆగస్టులో పదవీ విరమణ చేశారు.

ముదిగొండ శివప్రసాద్:

చారిత్రక నవలా చక్రవర్తిగా ప్రసిద్ధులు. 1970లో యూనివర్శిటీ అధ్యాపకులయ్యారు. వేయి స్తంభాల గుడి చారిత్రక నేపథ్యంగా ‘ఆవాహన’ నవల వ్రాశారు. ఈయన రచనలపై ఎనిమిది సిద్ధాంత గ్రంథాలు వెలువడ్దాయి.

ఎల్లూరి శివారెడ్డి:

తెలుగు విశ్వవిద్యాలయ ఉపాధ్యక్షులుగా పని చేశారు. 1968-70ల మధ్య తెలుగు ఎం.ఏ. విద్యార్థి. 1973లో ఉస్మానియా అధ్యాపకులుగా చేరి ఆచార్య పదవి నధిష్ఠించారు.

రవ్వా శ్రీహరి:

కుప్పంలో ద్రవిడ విశ్వవిద్యాలయ ఉపాధ్యక్షులుగా వ్యవహరించారు.

యన్. గోపి:

తెలుగు శాఖ అధ్యాపకులుగా చేరి, తెలుగు విశ్వవిద్యాలయ ఉపాధ్యక్షులై 2008లో పదవీ విరమణ చేశారు. సాహిత్య అకాడమీ తెలుగు విభాగం కన్వీనర్‍గా వ్యవహరించారు. 20 మంది ఎం.ఫిల్/పిహెచ్‌డిలకు పర్యవేక్షకులుగా వ్యవహరించారు.

సుమతీ నరేంద్ర, మసన చెన్నప్ప, ననుమాసస్వామి, యస్.వి. సత్యనారాయణ (ఇద్దరూ తెలుగు విశ్వవిద్యాలయ ఉపాధ్యక్షులు), ముదిగొండ వీరభద్రశాస్త్రి, యస్.వి.రామారావు, కేశవులు, యం. భాగయ్య, అంజమ్మ, రుక్ముద్దీన్, యాదయ్య, వెంకటేశం తెలుగు శాఖలో పదవీ విరమణ చేసిన ప్రముఖులు.

భువనవిజయంలో శ్రీకృష్ణ దేవరాయలుగా రచయిత

పూర్వాధ్యక్షులు (1990-2020):

  • ఆచార్య యస్.వి. రామారావు 1990 – 1992
  • ఆచార్య ఎన్. గోపి 1994 – 1996
  • ఆచార్య ఎల్లూరి శివారెడ్డి 1996 – 1998
  • ఆచార్య ఎల్దండ రఘుమారెడ్డి 1998 – 2000
  • రెండో దఫా ఆచార్య ఎల్లూరి శివారెడ్డి 2000 – 2002
  • ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి 2002 – 2005
  • ఆచార్య పి.సుమతీ నరేంద్ర 2005 – 2007
  • ఆచార్య కె.కుసుమాబాయి 2007 – 2008
  • ఆచార్య తంగెడ కిషన్‌రావు 2008 – 2010
  • ఆచార్య ననుమాసస్వామి 2010 – 2012
  • ఆచార్య యస్వీ సత్యనారాయణ 2012 – 2014
  • ఆచార్య మసన చెన్నప్ప 2014 – 2015
  • ఆచార్య వెల్దండ నిత్యానందరావు 2015 – 2017
  • ఆచార్య సూర్య ధనంజయ 2017 – నేటి వరకు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here