ఆచార్యదేవోభవ-7

0
2

[box type=’note’ fontsize=’16’] ఈ శీర్షిక ద్వారా గత 20వ శతాబ్దిలో ఎందరో విశ్వవిద్యాలయ, కళాశాలల తెలుగు అధ్యాపకులను/ఆచార్యులను తీర్చిదిద్దిన ప్రాతఃస్మరణీయ యశఃకాయులను పరిచయం చేస్తున్నారు డా. అనంత పద్మనాభరావు. [/box]

భాషాశాస్త్రరాజు భద్రిరాజు:

[dropcap]ఉ[/dropcap]స్మానియా విశ్వవిద్యాలయంలో భాషాశాస్త్ర విభాగం తనదైన పరిశోధనా శైలిలో అంతర్జాతీయ ఖ్యాతి నార్జించింది. లింగ్విస్టిక్స్ విభాగం అనగానే గుర్తుకువచ్చే విరాణ్మూర్తి ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తి. 1955 నుండి ఆమరణాంతరం (2012) ఆయన గ్రంథాలు పరిశోధనాత్మకంగా ప్రచురించి విదేశీ ప్రముఖుల ప్రశంసలందుకోగలిగారు. 1928లో ఒంగోలులో జన్మించిన భద్రిరాజు ఎం.ఏ. పట్టభద్రులై 1949 – 62 మధ్య ఆంధ్ర,శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయాలలో అధ్యాపకులుగా పనిచేశారు. 1961లోనే కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం వారు వీరు రచించిన Telugu Verbal Bases అనే గ్రంథం ప్రచురించారు. యం.బి.ఎమెనో వీరి గురువు.

1962లో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో భాషాశాస్త్ర విభాగంలో తొలి ఆచార్యులుగా చేరారు. 1985 వరకు ఆ శాఖ రూపురేఖలను తీర్చిదిద్ది ఎందరో భాషాశాస్త్ర పండితులను తీర్చిదిద్దారు. వీరి శిష్యకోటిలో చేకూరి రామారావు, బూదరాజు రాధాకృష్ణ, తూమాటి దోణప్ప, నాయని కృష్ణకుమారి, గారపాటి ఉమామహేశ్వరరావు ప్రభృతులున్నారు. భద్రిరాజు పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయం నుండి పరిశోధన చేసి డాక్టరేట్ సంపాదించారు.

ఫోన్ చేసి ఆహ్వానించిన పి.వి.:

ఉస్మానియాలో పదవీ విరమణాంతరం విదేశాలలో విజిటింగ్ ప్రొఫెసర్‍గా భద్రిరాజు పనిచేస్తున్నారు. 1986లో పి.వి. నరసింహారావు స్వయంగా ఫోన్ చేసి హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్స్‌లర్‌గా నియామక విషయాన్ని తెలియజేశారు. ప్రతిష్ఠాత్మకమైన ఆ పదవిని ఆయన అలంకరించి 1993 వరకు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. వారు పదవీ బాధ్యతలు స్వీకరించిన కొద్ది రోజులలో ప్రకాశం అభివృద్ధి అధ్యయన సంస్ధ ప్రధాన కార్యదర్శి డా. టంగుటూరు సూర్యనారాయణ; హైదరాబాద్ ఆకాశవాణి కేంద్రంలో అసిస్టెంట్ డైరక్టర్‌గా పనిచేస్తున్న నేను – భద్రిరాజు అభినందన సభను బషీర్‍బాగ్ ప్రెస్ క్లబ్ ఆడిటోరియంలో ఘనంగా ఏర్పాటు చేశాం. అప్పటి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ముద్దు కృష్ణమనాయుడు ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రశంసలందించారు.

విదేశాలలో అమెరికా, ఆస్ట్రేలియాలలో భద్రిరాజు విజిటింగ్ ప్రొఫెసర్‍గా ఉపన్యాసాలిచ్చి ఎందరికో మార్గదర్శకులయ్యారు. 2003లో వీరి రచన Dravidian Languages ప్రచురింపబడింది. ద్రావిడ భాషా విజ్ఞాన పండితుడిగా ఆయనను పత్రికలు, పండితులు గౌరవిస్తారు. ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి.

వీరి గ్రంథం Comparative Dravidian Languages – 2001లో ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం ప్రచురణగా వెలువడింది. 2003లో కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం వారు The Dravidian Languages ప్రచురించారు. వీరు రచించిన తెలుగు భాషా చరిత్ర – పరిశోధకులకు కరదీపికగా ఐదు దశాబ్దాలుగా చెలామణీ అవుతోంది. పరిశోధక విద్యార్థులను వివిధ జిల్లాలకు పంపి భద్రిరాజు – వ్యవసాయ, చేనేత వృత్తి పదకోశాలు తయారు చేసి ప్రచురించారు.

కేంద్ర సాహిత్య అకాడమీ తెలుగు విభాగ కన్వీనరుగా:

భద్రిరాజు కృష్ణమూర్తి కేంద్ర సాహిత్య అకాడమీ కార్యవర్గ సభ్యులుగా ఎన్నికై, తెలుగు విభాగ కన్వీనరుగా ఆరేళ్ళు వ్యవహరించారు. 2000 సంవత్సరం తెలుగులో ఉత్తమ అనువాద గ్రంథంగా నేను అనువదించిన Amitav Ghosh – రచన Shadow Lines- తెలుగు సేత – ఛాయారేఖలు ఎంపిక చేశారు. భద్రిరాజు రచించిన గ్రంథాన్ని కేంద్ర సాహిత్య అకాడమీ కార్యాలయంలో పి.వి. నరసింహారావు ఆవిష్కరించారు. భద్రిరాజు 2012లో పరమపదించారు. ఉస్మానియా భాషాశాస్త్ర విభాగాభివృద్ధికి, హైదారాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయ ప్రగతికి వారి సేవలు చిరస్మరణీయం.

రాష్ట్రపతి అబ్దుల్ కలాంగారితో రచయిత

‘చేరా’తల యోగి:

భాషాశాస్త్ర అధ్యయనంలో విశేష ప్రతిభ గనబరిచిన వ్యక్తులలో చేకూరి రామారావు అగ్రగణ్యులు. భద్రిరాజు శిష్యులలో ఒకరైన ‘చేరా’ విశిష్ట పరిశోధనలతో సాహితీ వ్యాసంగం కొనసాగించారు. 1934 అక్టోబరులో ఖమ్మం జిల్లా ఇల్లెందులపాడులో జన్మించిన చేరా ఆంధ్ర విశ్వవిద్యాలయంలో తెలుగు ఎం.ఏ. చేశారు. తర్వాత ఉస్మానియాలో భాషాశాస్త్రంలో ఎం.ఏ. చేశారు. భద్రిరాజు గారి ప్రోత్సాహంతో అమెరికాలోని కార్మెల్ యూనివర్సిటీలో – ‘Transformation Theory’ అనే అంశంపై పరిశోధన చేసి పి.హెచ్.డి. పొందారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో భాషాశాస్త్ర విభాగ అధిపతి అయ్యారు.

రచయితగా చేరా ఆంధ్రజ్యోతి దినపత్రికలో ధారావాహికంగా ప్రచురించిన ‘చేరాతలు’ ప్రసిద్ధం. ముత్యాల సరాల ముచ్చట్లు, తెలుగు వాక్యం (1975 ప్రపంచ తెలుగు సభల ప్రచురణ), తెలుగులో వెలుగులు (1982), స్మృతికిణాంకం వీరి రచనలు. 2002లో కేంద్ర సాహిత్య అకాడమీ వారు ‘స్మృతికిణాంకం’ గ్రంథానికి బహుమతి ప్రకటించారు. భాషాశాస్త్ర పరిశోధకులుగా చేరా ప్రసిద్ధులు. పదవీ విరమణానంతరం చివరి సంవత్సరాలలో ప్రతి రోజూ త్యాగరాయ గాన సభకు సాయంకాలకు తప్పనిసరిగా సాంస్కృతిక కార్యక్రమాలకు హాజరయ్యారు. 2014 జూలైలో హఠాన్మరణం చెందారు.

విదేశీ ప్రముఖులు:

భాషాశాస్త్ర విభాగంలో పని చేసిన ఇతర అధ్యాపకులు వీరు: హెచ్.యస్. అనంతనారాయణ్ (రీడరు), లక్ష్మీబాయి, వెన్నెలకంటి ప్రకాశం, జె.వి.శాస్త్రి, అదితి ముఖర్జీ, బి. రామకృష్ణారెడ్డి, నిర్మల, అంబానీ సిన్హా, అరుణ్ కుమార్ శర్మ, నాగమ్మ రెడ్డి, బి. ఆర్. బాపూజీ, స్వరాజ్యలక్ష్మి ప్రభృతులు అధ్యాపకులు. విదేశీ పండితులు ఇక్కడ విజిటింగ్ ప్రొఫెసర్లుగా పాఠాలు చెప్పారు. రష్యా నుంఛి పండితులు వచ్చి తెలుగు నేర్చుకున్నారు. విదేశీ ప్రముఖులలో LADE FOGED, FERGUSON, WILLIAM WONG లు పాఠాలు బోధించారు. 1973లో భాషాశాస్త్ర విభాగం ఆర్ట్స్ కళాశాల భవనం నుండి కొత్త ప్రదేశానికి మారింది. యుజిసి సెంటర్ ఫర్ అడ్వాన్స్‌డ్ స్టడీస్‍గా ఈ శాఖ 1975-76లో గుర్తింపు పొందింది.

కుర్తాళం పీఠాధిపతితో రచయిత

ఉస్మానియా సంస్కృత విభాగం (1919):

ఉస్మానియా విశ్వవిద్యాలయంలో సంస్కృత విభాగం ప్రాచీనం. ఆ శాఖలో ఎందరో పండితులు అధ్యయన అధ్యాపనాలు కొనసాగించారు. సంస్కృత విభాగం 1919లో ప్రారంభమై ద్వితీయ భాషగా, ఇంటర్మీడియట్, డిగ్రీ తరగతులలో బోధించేవారు. ఎం.ఏ. తరగతులు 1940లో ప్రారంభమయ్యాయి. 1946లో పి.హెచ్.డి. పరిశోధనలకు అవకాశం లభించింది. సంస్కృత శాఖలో వేదాధ్యయనానికి తోడు సాహిత్య, ధారణ, మీమాంస, యోగ, కోశ శాస్త్రాలలో పరిశోధనలు జరిగాయి. ఈ విభాగం అరుదైన గ్రంథాలు ప్రచురించింది. 1998 నుండి వార్షిక పరిశోధనా జర్నల్ ప్రచురింపబడుతోంది. దాదాపు 60 పి.హెచ్.డి.లు, 80 దాకా యం.ఫిల్ పట్టాలు ప్రదానం చేశారు.

అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతి గడించిన ప్రసిద్ధులు ఈ విభాగంలో పని చేయడం గర్వకారణం. వారిలో ఆచార్య ధరేశ్వర శాస్త్రి, ఆచార్య హరిహర శాస్త్రి, ఆచార్య ఆర్యేంద్ర శర్మ, ఆచార్య బి. ఆర్. శాస్త్రి, ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడు, ఆచార్య పి.జి. లేలే, ఆచార్య నళిని సాధలే, ఆచార్య యం. గోపాలరెడ్డి ఈ సంస్కృత విభాగాభివృద్ధికి దోహదం చేశారు. యం. గోపాలరెడ్డి ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్‍గా, పరీక్షల కంట్రోలర్‍గా, విద్యార్థి విభాగ డీన్‍గా వ్యవహరించారు. వీరి సతీమణి శ్రీమతి ముదిగంటి సుజాతారెడ్డి తెలుగు అధ్యాపకులుగా హైదరాబాదు నగరంలో పని చేశారు. ఆచార్య టి. కేశవనారాయణ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్‍గా వ్యవహరించారు. సంస్కృతంలో చేరిన విద్యార్థులకు ఉపకారవేతనాలు లభిస్తాయి. విశ్వవిద్యాలయం వారు ప్రాచీన సంస్కృత గ్రంథాలు సేకరించి పాఠ్యభాగ నిర్ణయం చేశారు. నిజాం ప్రభుత్వ కాలంలో ఈ రాష్ట్రం ఇప్పటి కర్నాటక, తెలంగాణ, మహారాష్ట్రలకు విస్తరించి వుండేది. సంస్కృతము, పర్షియన్ భాషలు, ఇండో యూరోపియన్ కుటుంబంలో, ఇండో ఇరానియన్ ఉపకుటుంబానికి చెందినవి.

సంస్కృత అకాడమీ:

అంతర్విశ్వవిద్యాలయ పరిశోధనా సంస్థగా దక్షిణ భారతదేశంలోని హైదరాబాదు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో సంస్కృత అకాడమీ 1954లో ఇండాలజీ శాఖలో భాగంగా ప్రారంభమైంది. భారత ప్రభుత్వ మానవ వనరుల శాఖకు చెందిన రాష్ట్రీయ సంస్కృత సంస్థాన్ వారు 2002లో ఈ సంస్థను స్వయం ప్రతిపత్తి గల కేంద్ర పరిశోధనా సంస్థగా గుర్తించారు. ఆదర్శ శోధ సంస్థగా సంస్కృత అకాడమీ పరిశోధనలను ప్రోత్సహిస్తోంది. సంస్కృత భాషను నేర్చుకొనేవారికి అకాడమీ కోర్సులు నిర్వహిస్తోంది. అలానే జ్యోతిష, వాస్తు, యోగ, భగవద్గీత సంబంధిత కోర్సులు నిర్వహిస్తోంది.

ఈ అకాడమీకి తెలంగాణ రాష్ట్ర గవర్నరు అధ్యక్షులు. ఉస్మానియా విశ్వవిద్యాలయ వైస్ ఛాన్స్‌లర్ ఉపాధ్యక్షులు. అకాడమీ డైరెక్టర్ కార్యదర్శి. ఈ అకాడమీ సంస్కృత భాషాభివృద్ధికి విశేష కృషి చేస్తూ, పరిశోధనలు ప్రోత్సహిస్తోంది.

రామాయణ వ్యాఖ్యానం వ్రాసిన రామచంద్రుడు:

ఉస్మానియా సంస్కృత శాఖలో ఆచార్యులు పని చేసిన పుల్లెల శ్రీరామచంద్రుడు వ్రాసిన వాల్మీకి రామాయణ వ్యాఖ్యానాలు ఆయనకు శాశ్వత కీర్తి చేకూర్చాయి. 1927 అక్టోబరులో తూర్పు గోదావరి జిల్లా ఇందుపల్లిలో జన్మించిన శ్రీరామచంద్రుడు తండ్రి వద్దనే పంచకావ్యాలు అధ్యయనం చేశారు. ఆయన జీవితం వైవిధ్య భరితం. 1950లో మల్కిపురం పాఠశాలలో హిందీ పండిట్‌గా ఉద్యోగ జీవితం ప్రారంభించి ఉస్మానియా విశ్వవిద్యాలయ సంస్కృత విభాగం ఆచార్యులుగా, శాఖాధిపతిగా పదవీ విరమణ చేయడం వెనుక ఎంతో స్వయంకృషి వుంది.

1957లో బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో అలంకార శాస్త్రంలో (సంస్కృతం) ఎం.ఏ. చేశారు. 1961లో ఇంగ్లీషు ఎం.ఏ, తర్వాత హిందీ ఎం.ఏ. పూర్తి చేశారు. 1951లో అమలాపురం కె.బి.ఆర్ కళాశాలలో సంస్కృతాధ్యాపకులుగా చేరారు. అక్కడే 1957లో సంస్కృత ఉపన్యాసకులయ్యారు. 1965లో ఉస్మానియా ఆర్ట్స్ కళాశాలలో అధ్యాపకులుగా చేరి రీడర్, ప్రొఫెసరు, శాఖాధిపతిగా వ్యవహరించారు.

సంస్కృత అకాడమీ డైరక్టరుగా 11 సంవత్సరాలు పని చేశారు. కొంత కాలం తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర ప్రాచ్య పరిశోధనా సంస్థ డైరక్టరు. రచయితగా ఆయన 200 గ్రంథాలు ప్రచురించారు. అందులో వాల్మీకి రామాయణం అనువాదం 10 సంపుటాల బృహత్గ్రంథం. రామాయణం మీద సాధికారిక వ్యక్తిగా దేశంలో గుర్తింపు పొందారు. జగన్నాథ పండితరాయల భాషా సేవపై పరిశోధన చేసి – ఉస్మానియా నుండి హి.హెచ్.డి. సంపాదించారు. గీతాంజలిని సంస్కృతంలోకి అనువదించారు.

పురస్కారాలు:

  • కేంద్రసాహిత్య అకాడెమీ అనువాద పురస్కారం – 1996
  • కేంధ్రసాహిత్య అకాడెమీ ఉత్తమ విమర్శ పురస్కారం -2002
  • ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ‘తెలుగు ఆత్మగౌరవ’ పురస్కారం – 2001
  • కేంద్ర ప్రభుత్వ పద్మశ్రీ పురస్కారం – 2011

ఇవి గాక కాళిదాస జ్ఞానరత్న, మహామహోపాధ్యాయ, తెలుగు విశ్వవిద్యాలయ డాక్టరేట్లు లభించాయి. 2015, జూన్ లో శ్రీరామునిలో ఐక్యమయ్యారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here